సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం నుంచి నగదు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఇంటిపన్ను సహా ఏ అవసరానికి పంచాయతీకి డబ్బు చెల్లించాలన్నా.. కేవలం నగదు రహిత విధానంలోనే చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి నగదు రహిత లావాదేవీల నిర్వహణను తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది.
ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోను ఈ విధానం అమలుకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ప్రత్యేక విధివిధానాలను ఖరారు చేసింది. సాధారణంగా ఆన్‌లైన్ విధానంలో నగదు చెల్లింపులు.. నెట్ బ్యాంకింగ్ విధానంలోగానీ, పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే పీవోఎస్ మిషన్లలో డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారాగానీ, ఫోన్‌పే, పేటీఎం వంటి విధానాల్లో మొబైల్ ఫోన్లతో క్యూఆర్ కోడ్‌లను స్కాన్‌చేయడం ద్వారాగానీ చేయాల్సి ఉంటుంది.
అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డులను ఎక్కువమంది వినియోగించకపోవచ్చన్న అంచనాతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పంచాయతీల్లో రెండురకాల విధానాల్లో నగదు రహిత ఆన్‌లైన్ చెల్లింపుల విధానం అమలుకు ఏర్పాట్లు చేసింది. మూడువేలకు తక్కువగా జనాభా ఉండే చిన్న గ్రామాల్లో కేవలం మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానం, మూడువేలకు పైగా జనాభా ఉండే గ్రామాలకు వివిధ రకాల కార్డుల ద్వారా చెల్లింపులకు వీలుగా పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.
నాలుగు బ్యాంకుల్లో పంచాయతీల పేరిట ప్రత్యేక ఖాతాలు
ఆగస్టు 15 నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపుల నిర్వహణకు వీలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇందుకు నాలుగు ప్రముఖ బ్యాంకులతో పంచాయతీరాజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. 11 జిల్లాల్లో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (యూబీఐ)లో, తొమ్మిది జిల్లాల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో, ఐదు జిల్లాల్లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో, ఒక జిల్లాలో ఐడీఎఫ్‌సీ బ్యాంకులో పంచాయతీల వారీగా ఖాతాలు తెరిచారు.
♦ రాష్ట్రంలో మొత్తం 13,325 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో మూడువేలకన్నా తక్కువ జనాభా ఉన్నవి 10,003. ఈ పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు మొబైల్ ఫోన్ల చెల్లింపులకు వీలుగా ప్రత్యేక క్యూఆర్ కోడ్‌లను ఇప్పటికే కేటాయించాయి.
♦ మూడువేలకు పైగా జనాభా ఉన్న 3,322 పంచాయతీల్లో కార్డుల ద్వారా నగదు చెల్లించేందుకు పీవోఎస్ మిషన్లను ఆయా పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు ఉచితంగా ఇస్తున్నాయి. ఒక్కో పంచాయతీకి ఒకటి చొప్పున, ఏదైనా పెద్ద పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలున్న చోట, అదనంగా ప్రతి గ్రామ సచివాలయానికి ఒకటి చొప్పున మొత్తం 5,032 పీవోఎస్ మిషన్లను అందజేస్తున్నాయి.
♦ గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఎల్‌జీడీ కోడ్ నంబరు ఆధారంగా బ్యాంకులు ఆయా పంచాయతీలకు ఆన్‌లైన్ చెల్లింపుల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (యూపీఐ) కోడ్‌లను కేటాయిస్తున్నాయి.
♦ బ్యాంకులో పంచాయతీ ఖాతాకు జమ అయిన సొమ్మును ఆ పంచాయతీ కార్యదర్శి ట్రెజరీ అకౌంట్‌లో జమచేస్తారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ.. పంచాయతీ కార్యదర్శులకు విధివిధానాలతో ఆదేశాలు జారీచేసింది.
Comments
Please login to add a commentAdd a comment