cash transactions
-
హోటళ్లు, ఆసుపత్రుల్లో భారీ లావాదేవీలపై ఐటీ నిఘా!
హోటళ్లు, లగ్జరీ బ్రాండ్ విక్రయాలు, ఆసుపత్రులు, ఐవీఎఫ్ క్లినిక్‌లు వంటి చోట్ల జరుగుతున్న భారీ నగదు లావాదేవీలపై నిఘా పెట్టాలని దేశంలోని ప్రత్యక్ష పన్నుల నిర్వహణకు సంబంధించిన అత్యున్నత సంస్థ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT) ఆదాయపు పన్ను శాఖను కోరింది.అదే విధంగా గత ఆర్థిక సంవత్సరం నుంచి భారీగా పెరుగుతున్న పన్ను బకాయిలను రికవరీ చేయడానికి సమష్టి ప్రయత్నాలు చేపట్టాలని ఐటీ శాఖను సీబీడీటీ కోరింది. ఈ మేరకు సీబీడీటీ ఇటీవల సెంట్రల్ యాక్షన్ ప్లాన్ (CAP) 2024-25 అనే వార్షిక కార్యాచరణ ప్రణాళిక పత్రాన్ని విడుదల చేసింది.రూ.2 లక్షలకు పైబడిన నగదు లావాదేవీలను ఆర్థిక లావాదేవీల స్టేట్మెంట్ రూపంలో ఆర్థిక సంస్థలు రిపోర్ట్ చేయాల్సి ఉన్నా అది జరగడం లేదని సీనియర్ అధికారులు వార్తా సంస్థ పీటీఐకి తెలిపారు. ఆ రిపోర్ట్‌లను పరిశీలిస్తున్నప్పుడు ఈ నిబంధనల అతిక్రమణ విస్తృతంగా ఉన్నట్లు గుర్తించామని సీబీడీటీ ఐటీ శాఖకు తెలిపింది.అలాగే సెక్షన్ 139A ప్రకారం నిర్దిష్ట లావాదేవీలలో పాన్ కార్డు నంబర్ అందించడం లేదా తీసుకోవడం తప్పనిసరి అయినప్పటికీ దీన్ని నిర్ధారించే వ్యవస్థ లేదని సీబీడీటీ పేర్కొంది. ఏదైనా అధిక మొత్తంలో వ్యయాన్ని పన్ను చెల్లింపుదారు సమాచారంతో ధ్రవీకరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది.హోటళ్లు, బాంక్వెట్ హాళ్లు, లగ్జరీ బ్రాండ్ రిటైలర్లు, ఐవీఎఫ్ క్లినిక్‌లు, ఆసుపత్రులు, డిజైనర్ బట్టల దుకాణాలు, ఎన్ఆర్ఐ కోటా మెడికల్ కాలేజీ సీట్ల వంటి చోట్ల నిబంధనలు పాటించకుండా పెద్ద మొత్తంలో నగదు లావాదేవీలు జరుగుతున్నాయని గుర్తించిన సీబీడీటీ.. అక్కడ ఎలాంటి అంతరాయం కలిగించకుండా నిఘా పెట్టాలని ఆదాయపు పన్ను శాఖకు సూచించింది. -
నగదు మాత్రమే ఇవ్వండి
జేబులో డబ్బులు పెట్టుకోవడం జనం మానేశారు. ఖర్మగాలి ఫోన్ పే పని చేయకపోతే తెల్లముఖాలు వేస్తున్నారు. నగదు లావాదేవీల వల్ల ఎంత ఖర్చవుతున్నదో ఎంత మిగిలి ఉన్నదో తెలిసేది. కాని ఆన్లైన్ పేమెంట్లకు హద్దు లేదు. ఈ నేపథ్యంలో చెన్నైలో ఆటో నడిపే ఒక పెద్దాయన తన ఆటోలో పెట్టిన నోటీస్ ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. నగదు అవసరాన్ని గుర్తు చేసే పోస్ట్ ఇది. ‘జీ పే చేయొద్దు. డబ్బు డ్రా చేయడానికి ఏటీఎం దగ్గర ఆపమని అడగొద్దు’ అని చెన్నైలో ఒక ఆటోబాబాయ్ పెట్టిన బోర్డు ఇంటర్నెట్లో వైరల్ అయ్యింది. గతంలో అందరి దగ్గర డబ్బులుండేవి. ఆటో ఎక్కినా దిగినా డబ్బు ఇచ్చి బేరం ముగించేవారు. ఇప్పుడు అందరూ జీపే, ఫోన్‌పే చేస్తున్నారు. అయితే కొన్ని దుకాణాల్లో ఇప్పటికీ ‘నగదు మాత్రమే’ అనే బోర్డులు ఉన్నాయి. దానికి కారణం డిజిటల్ లావాదేవీల్లో ఏదైనా మోసం జరుగుతుందేమోనని. ఈ ఆటోబాబాయ్కి కూడా అలాంటి అనుభవాలు ఎదురై ఉండొచ్చు. లేదా ఎక్కిన వారు జీపే పని చేయకపోతే ఏటీఎం దగ్గరకు వెళదామని టైమ్ వేస్ట్ చేస్తూ ఉండొచ్చు. అందుకనే స్పష్టంగా ‘ఏటీఎం దగ్గర ఆటో ఆపమని అడగొద్దు’ అంటూ బోర్డ్ పెట్టాడు. చెన్నైలో ఇతని ఆటో ఎక్కిన మహిళ ఈ బోర్డును ఫొటో తీసి ‘ఎక్స్’లో పెడితే ఇంటర్నెట్లో మంచి డిబేట్ నడిచింది. ‘ఇలాగైతే ఎలా’ అని కొందరంటే ‘బ్యాంకు ట్రాన్సాక్షన్స్ అన్నీ డిజిటల్ పేమెంట్ల వల్ల ప్రభుత్వానికి ఎందుకు తెలియాలి?’ అని కొందరు ప్రశ్నించారు. చివరకు ఆటో ఎక్కిన మహిళ తన అ΄ార్ట్‌మెంట్ దగ్గర దిగి, సెక్యూరిటీ దగ్గర అప్పు తీసుకుని ఆటో బాబాయ్‌కి చెల్లించి బతుకు జీవుడా అనుకుంది. -
ఎన్నికల తర్వాతే గృహప్రవేశం!
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ స్థిరాస్తి రంగంపై పడింది. సాధారణంగా రియల్టీ మార్కెట్లో నగదు ప్రవాహమే ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ అనధికారిక లావాదేవీలే అధికం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు లు, ఎన్నికల సంఘం అధికారులు నగదు ప్రవాహంతోపాటు ఆన్లైన్ లావాదేవీలపై కూడా గట్టి నిఘా పెట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో నగదు లావాదేవీలు జరపడం శ్రేయస్కరం కాదని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తీసుకెళ్తే.. పోలీసుల తనిఖీల్లో చిక్కితే అసలుకే ఎసరొస్తుందని ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది. అప్పటి వరకూ ఎదురుచూపులే.. సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసిన డబ్బుతో ప్లాట్లు, అపార్ట్మెంట్లు కొనుగోలు చేస్తుంటారు. చాలా తక్కువ మొత్తానికి గృహ రుణం కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. మరోవైపు ఆన్లైన్ ఖాతా ద్వారా నగదు లావాదేవీలు జరుపుదామంటే.. వాటిపై కూడా నిఘా పెట్టా లని ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో బ్యాంకర్లు దృష్టి పెట్టారు. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ ప్రవేశాలకు గడ్డుకాలమేనని చెప్పాలి. ఎన్నికలు డెవలపర్ల మీద కంటే కొనుగోలుదారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎన్నికలకు 1–2 నెలల ముందు నుంచి, ఎన్నికలయ్యాక 2 నెలల వరకు కస్టమర్లు వేచిచూసే ధోరణిలో ఉంటారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త పథకాలు, రాయితీలు, పాలసీలు తమ పెట్టుబడుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని కొనుగోలుదారులు వేచి చూస్తుంటారు. ముందస్తు బుకింగ్‌లు.. స్థిరాస్తి సంస్థలకు నిరంతర క్రయవిక్రయాలు జరపకపోతే సంస్థ కార్యకలాపాలు, ఉద్యోగుల జీవభత్యాలు ఇతరత్రా వ్యయాల నిర్వహణ భారంగా మారుతుంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవాసులు, విశ్వసనీయమైన కస్టమర్లతో ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత చెల్లింపులు జరిపేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు. మరోవైపు ఎన్నికల సమయంలో రియల్టర్లు రాజకీయ పార్టీలకు, నాయకులకు నిధులు సమకూర్చడం సాధారణమే కానీ, ఈసారి తెలంగాణలో నెలల వ్యవధిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయి. దీంతో బిల్డర్లు ఫండ్‌ను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వస్తుందని, ఇది డెవలపర్లకు కొంత భారమేనని ఓ డెవలపర్ అభిప్రాయపడ్డారు. -
రేపటి నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపులు
సాక్షి, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీల్లో మంగళవారం నుంచి నగదు లావాదేవీలు నిలిచిపోనున్నాయి. ఇంటిపన్ను సహా ఏ అవసరానికి పంచాయతీకి డబ్బు చెల్లించాలన్నా.. కేవలం నగదు రహిత విధానంలోనే చెల్లించాలి. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా అన్ని పంచాయతీల్లో ఆగస్టు 15 నుంచి నగదు రహిత లావాదేవీల నిర్వహణను తప్పనిసరి చేస్తూ రాష్ట్రాలకు ఆదేశాలు జారీచేసింది. ఈ నేపథ్యంలో మన రాష్ట్రంలోను ఈ విధానం అమలుకు పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే ప్రత్యేక విధివిధానాలను ఖరారు చేసింది. సాధారణంగా ఆన్లైన్ విధానంలో నగదు చెల్లింపులు.. నెట్ బ్యాంకింగ్ విధానంలోగానీ, పంచాయతీ కార్యాలయాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసే పీవోఎస్ మిషన్లలో డెబిట్ కార్డులను ఉపయోగించడం ద్వారాగానీ, ఫోన్‌పే, పేటీఎం వంటి విధానాల్లో మొబైల్ ఫోన్లతో క్యూఆర్ కోడ్లను స్కాన్‌చేయడం ద్వారాగానీ చేయాల్సి ఉంటుంది. అయితే.. గ్రామీణ ప్రాంతాల్లో నెట్‌బ్యాంకింగ్, డెబిట్ కార్డులను ఎక్కువమంది వినియోగించకపోవచ్చన్న అంచనాతో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ పంచాయతీల్లో రెండురకాల విధానాల్లో నగదు రహిత ఆన్లైన్ చెల్లింపుల విధానం అమలుకు ఏర్పాట్లు చేసింది. మూడువేలకు తక్కువగా జనాభా ఉండే చిన్న గ్రామాల్లో కేవలం మొబైల్ ఫోన్ల ద్వారా చెల్లింపులకు వీలుగా క్యూఆర్ కోడ్ విధానం, మూడువేలకు పైగా జనాభా ఉండే గ్రామాలకు వివిధ రకాల కార్డుల ద్వారా చెల్లింపులకు వీలుగా పీవోఎస్ మిషన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. నాలుగు బ్యాంకుల్లో పంచాయతీల పేరిట ప్రత్యేక ఖాతాలు ఆగస్టు 15 నుంచి పంచాయతీల్లో నగదు రహిత చెల్లింపుల నిర్వహణకు వీలుగా పంచాయతీరాజ్ శాఖ అధికారులు రాష్ట్రంలోని అన్ని పంచాయతీలకు ప్రత్యేక బ్యాంకు ఖాతాలు తెరిచారు. ఇందుకు నాలుగు ప్రముఖ బ్యాంకులతో పంచాయతీరాజ్ శాఖ ఒప్పందం చేసుకుంది. 11 జిల్లాల్లో యూనియన్ బ్యాంక్ అఫ్ ఇండియా (యూబీఐ)లో, తొమ్మిది జిల్లాల్లో స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో, ఐదు జిల్లాల్లో హెచ్డీఎఫ్సీ బ్యాంకులో, ఒక జిల్లాలో ఐడీఎఫ్సీ బ్యాంకులో పంచాయతీల వారీగా ఖాతాలు తెరిచారు. ♦ రాష్ట్రంలో మొత్తం 13,325 గ్రామ పంచాయతీలున్నాయి. వీటిలో మూడువేలకన్నా తక్కువ జనాభా ఉన్నవి 10,003. ఈ పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు మొబైల్ ఫోన్ల చెల్లింపులకు వీలుగా ప్రత్యేక క్యూఆర్ కోడ్లను ఇప్పటికే కేటాయించాయి. ♦ మూడువేలకు పైగా జనాభా ఉన్న 3,322 పంచాయతీల్లో కార్డుల ద్వారా నగదు చెల్లించేందుకు పీవోఎస్ మిషన్లను ఆయా పంచాయతీలకు సంబంధిత బ్యాంకులు ఉచితంగా ఇస్తున్నాయి. ఒక్కో పంచాయతీకి ఒకటి చొప్పున, ఏదైనా పెద్ద పంచాయతీలో ఒకటి కంటే ఎక్కువ గ్రామ సచివాలయాలున్న చోట, అదనంగా ప్రతి గ్రామ సచివాలయానికి ఒకటి చొప్పున మొత్తం 5,032 పీవోఎస్ మిషన్లను అందజేస్తున్నాయి. ♦ గ్రామ పంచాయతీలకు కేటాయించిన ఎల్జీడీ కోడ్ నంబరు ఆధారంగా బ్యాంకులు ఆయా పంచాయతీలకు ఆన్లైన్ చెల్లింపుల యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) కోడ్లను కేటాయిస్తున్నాయి. ♦ బ్యాంకులో పంచాయతీ ఖాతాకు జమ అయిన సొమ్మును ఆ పంచాయతీ కార్యదర్శి ట్రెజరీ అకౌంట్లో జమచేస్తారు. దీనికి సంబంధించి పంచాయతీరాజ్ శాఖ.. పంచాయతీ కార్యదర్శులకు విధివిధానాలతో ఆదేశాలు జారీచేసింది. -
భారీ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నారా? కొత్త రూల్స్ ఈ రోజు నుంచే
సాక్షి, న్యూడిల్లీ: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ (సీబీడీటీ) ఇటీవల జారీ చేసిన కొత్త నిబంధనలు నేటి (మే 26) నుంచి అమల్లోకి వచ్చాయి. దీని ప్రకారం 20 లక్షలు రూపాయలు అంతకంటే ఎక్కువ నగదు లావాదేవీలకు పాన్ లేదా ఆధార్ తప్పనిసరిగా ఉండాలి. మే 10 నాటి నోటిఫికేషన్లో ప్రకటించిన కొత్త నిబంధన ప్రకారం ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేసినా, డిపాజిట్ చేసినా తన పాన్ నెంబర్ పాన్ కార్డ్ లేదా ఆధార్ కార్డ్ నంబర్‌ను వెల్లడించాలి. ఇంతకుముందు, ఒకే రోజులో రూ 50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేసేటప్పుడు మాత్రమే పాన్ నంబర్ అవసరం. కానీ నగదు డిపాజిట్ లేదా ఉపసంహరణకు వార్షిక పరిమితి లేదు. కొత్త నిబంధనలు ఖాతాదారులు ప్రభుత్వ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులతోపాటు, కోఆపరేటీవ్ బ్యాంకుల్లో రూ.20 లక్షల కన్నా ఎక్కువ డిపాజిట్లు, విత్‌డ్రాయల్స్ చేసినా కూడా ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంకులేదా పోస్ట్ ఆఫీసులో కరెంట్ ఖాతా క్యాష్ క్రెడిట్ అకౌంట్ ఓపెన్ చేసినా పాన్ నెంబర్ లేదా ఆధార్ నెంబర్ వివరాలు ఇవ్వడం తప్పనిసరి. అంతేకాదు ఒకేసారి రూ.20 లక్షల ట్రాన్సాక్షన్ చేసినా, వేర్వేరు సందర్భాల్లో మొత్తం కలిపి రూ.20 లక్షల లావాదేవీలు జరిపినా పాన్ నెంబరును నమోదు చేయాలి. అయితే ఈ లావాదేవీలు జరిపే సందర్భంలో పాన్ నెంబర్, ఆధార్ నంబర్లను తీసుకునే వ్యక్తులు అవి సరైన వివరాలేనా కాదా అని నిర్థారించుకోవాలని సీబీడీటీ వెల్లడించింది. ఏయే వ్యక్తులు పాన్ కార్డ్ కోసం అప్లై చేయాలో, ఎవరు పాన్ కార్డ్ వివరాలను వెల్లడించాలో సెక్షన్ 139ఏ తెలుపుతుంది. అందుకే సీబీడీటీ రూ.20 లక్షల కన్నా ఎక్కువ లావాదేవీలకు పాన్ కార్డ్ లేదా ఆధార్ నెంబర్ తప్పనిసరి. ఒకవేళ భారీ ఆర్థిక లావాదేవీలు జరిపే వారి దగ్గర పాన్ కార్డ్ లేకపోతే లావాదేవీ చేసే తేదీకి కనీసం 7 రోజుల ముందు పాన్ కార్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సీబీడీటీ తన నోటిఫికేషన్లో స్పష్టం చేసింది. లేదంటే సంబంధిత లావాదేవీలకు ఆస్కారం ఉండదు. -
నగదు లావాదేవీలపై నిరంతర నిఘా
కైకలూరు : ఇకపై ప్రధాన నగదు లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండవల్లి సబ్ రిజిస్ట్రార్ నకిలీ చలానా కేసులో ప్రధాన నిందితుడు రామ్థీరజ్ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కైకలూరు సర్కిల్ కార్యాలయం వద్ద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్, గుడివాడ డీఎస్పీ సత్యానందంతో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా మోసపోయిన బాధితులు ప్రసాద్, వీరసత్యబాబులు తాము ఏ విధంగా నష్టపోయారో వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు.. నకిలీ చలానా కేసుపై సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని, దీంతో గుడివాడ డీఎస్పీ సత్యానందంను ప్రత్యేకాధికారిగా నియమించి విచారణ జరిపించినట్టు తెలిపారు. తండ్రీకొడుకులది ప్రధాన పాత్ర.. మండవల్లికి చెందిన స్టాంప్ వెండర్ మేడేపల్లి రామ్థీరజ్, అతని తండ్రి డాక్యుమెంట్ రైటర్ బాలాజీ కలిసి.. 568 రిజిస్ట్రేషన్ల నిమిత్తం 640 చలానాలలో రూ.2,68,04,943 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, చలానాలను మార్ఫింగ్ చేసి కేవలం రూ.15,92,158 మాత్రమే చెల్లించినట్టు తెలిపారు. అదే విధంగా నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కొనుగోలు నిమిత్తం ఏడు చలానాల ద్వారా రూ.1,55,800 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.1,981 మాత్రమే చెల్లించి, ప్రభుత్వానికి రూ.1,53,819 జమ చేయలేదన్నారు. ఈ నెల 19న సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో మండవల్లిలో కేసు నమోదు చేసి, బాధితులతో 21న డీఎస్పీ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. కేసును ఛేదించిన గుడివాడ డీఎస్పీ, కైకలూరు సీఐ వైవీవీఎల్ నాయుడు, మండవల్లి ఎస్ఐ రామకృష్ణను అభినందించారు. అలాగే మండవల్లి నకిలీ చలానా కేసులో పోలీసుల పనితీరు అభినందనీయమని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ రవీంద్రనాథ్ ప్రశంసించారు. -
కరోనా నేపథ్యం... కార్డులు తెగ వాడేస్తున్నారు
సాక్షి, అమరావతి: కరోనా దెబ్బతో నగదు లావాదేవీలు కంటే కార్డు లావాదేవీలకే ప్రజలు మొగ్గు చూపుతున్నారు. కొత్తగా బ్యాంకులు జారీ చేస్తున్న కార్డుల సంఖ్య, పెరుగుతున్న లావాదేవీలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. లాక్డౌన్ సమయంలోనే అనగా ఏప్రిల్–జూన్ మూడు నెలల కాలంలో రికార్డు స్థాయిలో బ్యాంకులు 1.6 కోట్ల డెబిట్ కార్డులను జారీ చేశాయి. మార్చి నెలాఖరునాటికి 82.85 కోట్లుగా ఉన్న డెబిట్ కార్డుల సంఖ్య జూన్ నెలాఖరు నాటికి 84.54 కోట్లకు చేరినట్లు ఆర్బీఐ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. కొత్త కార్డులు జారీ చేయడంలో ప్రైవేటు బ్యాంకులు కంటే ప్రభుత్వ రంగ బ్యాంకులే ముందంజంలో ఉన్నాయి. ప్రభుత్వరంగ బ్యాంకులు డెబిట్ కార్డుల సంఖ్య 58.56 కోట్ల నుంచి 59.71 కోట్లకు పెరిగితే, ప్రైవేటు బ్యాంకులు కొత్తగా 40 లక్షల కార్డులు జారీ చేయడం ద్వారా మొత్తం కార్డుల సంఖ్య 16.86 కోట్లకు చేరింది. కేంద్ర ప్రభుత్వం డిజిటిల్ లావాదేవీలు పెంచడాన్ని ప్రోత్సహించడంతో పాటు ప్రస్తుతమున్న మాగ్నటిక్ కార్డులు స్థానంలో చిప్ ఆధారిత కాంటాక్ట్ లెస్ కార్డులు జారీ చేయడం కార్డు వినియోగం పెరగడానికి ప్రధాన కారణంగా బ్యాంకర్లు పేర్కొంటున్నారు. దీనికి తోడు కేంద్ర ఫ్రభుత్వం మహిళలకు చెందిన జన్‌థన్ ఖాతాల్లో నగదు వేయడం కూడా కార్డుల వినియోగం పెరగడానికి మరో కారణంగా చెపుతున్నారు. ఒక త్రైమాసికంలో ఈ స్థాయిలో కార్డుల వినియోగం పెరగడం ఇదే తొలిసారి అని బ్యాంకర్లు వ్యాఖ్యానిస్తున్నారు. పెద్ద నోట్ల రద్దు సమయంలో కూడా ఈ స్థాయిలో కార్డుల వినియోగం పెరగలేదు. డిజిటిల్ చెల్లింపులపై బ్యాంకులు దృష్టి డిజిటల్ లావాదేవీలు ప్రోత్సహించడంపై బ్యాంకులు ప్రత్యేక దృష్టిని సారించాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో మొత్తం లావాదేవీల్లో డిజిటల్ లావాదేవీల సంఖ్య 90 నుంచి 93 శాతానికి పెరిగింది. అదే విధంగా ఐసీఐసీఐ బ్యాంక్‌లో డిజిటల్ లావాదేవీలు 87 శాతం నుంచి 90 శాతానికి చేరాయి. డిపాజిట్లు, రుణాల మంజూరు వంటివి కూడా పూర్తిగా ఆన్లైన్ ద్వారానే పూర్తి చేసే విధంగా బ్యాంకులు చర్యలు తీసుకుంటున్నాయి. -
నగదు పరిమితుల నుంచి క్రెడిట్ కార్డు చెల్లింపులకు మినహాయింపు
న్యూఢిల్లీ: నగదు లావాదేవీలు రూ. 2 లక్షలకు మించకూడదన్న పరిమితులపై కేంద్రం స్పష్టతనిచ్చింది. క్రెడిట్ కార్డు బిల్లుల చెల్లింపులు, బ్యాంకులు నియమించిన బిజినెస్ కరస్పాండెంట్ల లావాదేవీలు, ప్రీపెయిడ్ సాధనాలు జారీ చేసే సంస్థలకు దీన్నుంచి మినహాయింపునిస్తున్నట్లు తెలిపింది. ఆదాయ పన్ను విభాగం విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం నగదు లావాదేవీల పరిమితి నుంచి అయిదు రకాల సంస్థలకు మినహాయింపు లభిస్తుంది. సహకార బ్యాంకు లేదా బ్యాంకు తరఫున నియమితులైన బిజినెస్ కరస్పాండెంట్ రూ. 2 లక్షలకు మించి నగదు జమ లావాదేవీలు నిర్వహించవచ్చు. అలాగే, ఒకటి లేదా అంతకు మించిన క్రెడిట్ కార్డులకు సంబంధించి రూ.2 లక్షలకు మించి క్రెడిట్ కార్డు కంపెనీలకు నగదు రూపంలో చెల్లించవచ్చు. రూ.2 లక్షల పరిమితి అమల్లోకి వచ్చిన ఏప్రిల్ 1 నాటి నుంచే తాజా నిబంధన కూడా అమల్లోకి వచ్చినట్లు పరిగణించాలని జూలై 3 తేదీ నాటి నోటిఫికేషన్లో రెవెన్యూ విభాగం పేర్కొంది. నికార్సయిన లావాదేవీలు నిర్వహించే వారికి ఊరటనిచ్చే ఉద్దేశంతో ఈ మినహాయింపులు కల్పిస్తున్నట్లు తెలిపింది. సెక్షన్ 269ఎస్టీ ప్రకారం ఒక్క రోజులో ఒకటి లేదా అంతకు మించిన లావాదేవీలకు సంబంధించి ఏ వ్యక్తీ రూ. 2 లక్షలకు మించిన నగదు లావాదేవీలు జరపరాదు. దీన్ని ఉల్లంఘిస్తే నగదు అందుకున్న వారు 100 శాతం పెనాల్టీ కట్టాల్సి ఉంటుంది. -
రూ.2 లక్షల నగదు లావాదేవీయా.. జాగ్రత్త!
♦ అంతే మొత్తం పెనాల్టీ కట్టాలి ♦ ఆదాయపన్ను శాఖ హెచ్చరిక న్యూఢిల్లీ: భారీ నగదు లావాదేవీలు జరిపేవారిని ఆదాయపన్ను శాఖ హెచ్చరించింది. రూ.2 లక్షలు అంతకుమించి నగదు స్వీకరించే వారి నుంచి అంతే మొత్తం జరిమానాగా వసూలు చేస్తామని స్పష్టం చేసింది. అంతేకాదు, ఈ విధమైన భారీ నగదు లావాదేవీల సమాచారం తెలిస్తే blackmoneyinfo@ incometax. gov. in తమకు తెలియజేయాలని ప్రజలను కోరింది. 2017–18 కేంద్ర బడ్జెట్లో రూ.3 లక్షలు అంతకుమించి నగదు లావాదేవీల నిర్వహణను నిషేధించే ప్రతిపాదనను ప్రవేశపెట్టగా, ఆ తర్వాత దాన్ని రూ.2 లక్షలు అంతకుమించిన లావాదేవీలకు తగ్గించి ఆర్థిక బిల్లులో సవరణ చేర్చారు. దీనికి లోక్‌సభ ఆమోదం తెలియజేసింది. ఇందుకు అనుగుణంగా ఆదాయపన్ను చట్టంలో సెక్షన్ 269ఎస్‌టిని చేర్చారు. దీని కింద ఒకే రోజులో రూ.2 లక్షలు లేదా అంతకుమించిన నగదు లావాదేవీలు నిషేధం. ఒక అంశానికి సంబంధించి ఒక్క లావాదేవీ లేదా ఒకటికి మించిన లావాదేవీల మొత్తం రూ.2 లక్షలు నగదు రూపంలో చెల్లించడం, తీసుకోవడం చట్ట విరుద్ధం. బ్యాంకులు, పోస్టాఫీసులు, కోపరేటివ్ బ్యాంకులు, ఆదాయపన్ను శాఖలు స్వీకరించే మొత్తాలకు ఈ నిబంధన నుంచి మినహాయింపు ఉంది. -
ఖాతాదారులపై మరో పిడుగు
న్యూఢిల్లీ: డిజిటల్ లావాదేవీలు, నల్లధనాన్ని నిరోధించేందుకంటూ కేంద్రప్రభుత్వం ఖాతాదారుల నెత్తిన మరో పిడుగువేయనుంది. నగదు లావాదేవీలపై సరికొత్త ఆంక్షలు విధించనుంది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలను తెరపైకి తెచ్చింది. గతంలో పేర్కొన్నట్టుగా రూ.3లక్షల పరిమితికాకుండా కొత్త ప్రతిపాదనతో ముందుకు వచ్చింది. దీనిప్రకారం రూ.2లక్షలకు మించి నగదు లావాదేవీలు జరిపితే ఇకపై భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. అంతే మొత్తం(100శాతం) జరిమానా రూపంలో సమర్పించు కోవాల్సి వస్తుంది. రెండు కంటే ఎక్కువ లక్షల నగదు లావాదేవీలు చేయడాన్ని ఇక మీదట అక్రమంగా పరిగణించి, జరిమానా విధించనున్నామని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ నిబంధన వచ్చే నెలనుంచి అమల్లోకి రానుంది. ఈ నిబంధనను అతిక్రమిస్తే.. లావాదేవీ మొత్తంపై 100 శాతం జరిమానా విధించేందుకు ప్రతిపాదించింది. అయితే ఈ నగదు నిబంధనలు ప్రభుత్వానికి, బ్యాంకింగ్ కంపెనీలకు,పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతాలకు, కో -ఆపరేటివ్ బ్యాంక్ ఖాతాలకు ఈ నిబంధనలు వర్తించవని స్పష్టం చేసింది. అయితే ఫిబ్రవరిలో సమర్పించిన ప్రభుత్వ వార్షిక బడ్జెట్లో ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నగదు లావాదేవీలపై మూడు లక్షలు పరిమితిగా నిర్ణయించనున్నట్టు చెప్పారు. ఈ మేరకు ఆదాయపు పన్ను చట్ట సవరణ అనంతరం దీన్ని అమలు చేయనున్నట్టు చెప్పారు. అయితే తాజాగా ఈ పరిమితిని రెండు లక్షలు కుదించడం గమనార్హం. కాగా నల్లధనానికి చెక్‌పెట్టేందుకు రూ.3 లక్షలు, అంతకు మించి నగదు లావాదేవీలను నిషేధించే సెక్షన్‌ను ఐటీ చట్టంలో ప్రతిపాదిస్తూ 2017–18 కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నిబంధన భారీ నగదు లావేదేవీల విషయంలో వెనక్కి తగ్గేలా చేస్తుందన్నారు. అలాగేబడ్జెట్ అనంతరం భారీ నగదు లావాదేవీలన్నింటినీ ప్రభుత్వం పట్టుకుంటుందని, అలాగే నగదు ఆధారిత వినియోగానికి ఉన్న అవకాశాలను కూడా మూసివేస్తుందని రెవెన్యూ వ్యవహారాల విభాగం కార్యదర్శి హస్ముఖ్ అధియా ప్రకటించారు. లెక్కల్లో చూపని ఆదాయానికి కొత్త నిబంధనల కింద ఇటువంటి మార్గాలకు చెక్ పెట్టనున్నట్టు పేర్కొన్నారు. ఈ నిబంధన వచ్చే ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానున్నట్టు చెప్పారు. అలాగే రూ.2 లక్షలకు పైబడి నగదు లావాదేవీకిగాను గ్రహీత, లేదా చెల్లిస్తున్న వ్యక్తి యొక్క పాన్ నంబర్ కానీ ఐటీ ఐడెంటిఫికేషన్ వివరాలుగానీ నమోదు చేయా లన్న పాత నిబంధన ఇకపైనా కొనసాగనుంది. -
ఏ బ్యాంకు.. ఎన్ని ఛార్జీలు
న్యూఢిల్లీ : బ్యాంకు దిగ్గజాలుగా పేరున్న ఎస్బీఐ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ, యాక్సిస్ బ్యాంకులు కస్టమర్లపై ఛార్జీలు బాదుడుకు సిద్ధమయ్యాయి. నిర్దేశించిన మొత్తం కంటే నగదు లావాదేవీలు జరిపితే, ఇక యూజర్లు తప్పసరిగా ఛార్జీలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చాయి. నగదు లావాదేవీల తగ్గింపుకు కస్టమర్లకు ఈ వడ్డింపు వేస్తున్నట్టు బ్యాంకులు పేర్కొంటున్నాయి. బ్యాంకులు భారీగా విధించే సమీక్షించిన ఛార్జీల వివరాలెంటో మీరే ఓ సారి చూడండి.... స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా: 1. ఏప్రిల్ 1 నుంచి సేవింగ్స్ బ్యాంకు ఖాతాదారులు నెలకు మూడు సార్లు మాత్రమే ఉచిత ఛార్జీతో నగదు డిపాజిట్ చేయొచ్చు. అంతకుమించితే, ప్రతి లావాదేవీకి రూ.50కు మించి సర్వీసు ట్యాక్స్ చెల్లించాలి. 2. రూ.10,000 నెలవారీ సగటు నిల్వ (ఎంఏబీ) ఉండే సాధారణ కరెంటు ఖాతాదారులు బ్యాంకులో రోజుకు రూ.25,000 వరకు నగదును ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు. అంతకు మించి నగదు డిపాజిట్ చేయాలనుకుంటే ప్రతీ రూ.1,000పై 75పైసల చార్జీ+సర్వీసు ట్యాక్స్ విధింపు ఉంటుంది. 3. ఏప్రిల్ 1 నుంచి కనీస బ్యాలన్స్ లేని ఖాతాలపై జరిమానా విధింపు. నెలవారీ కనీస నగదు నిల్వ నిర్వహణలో విఫలమైతే సేవింగ్స్ ఖాతాదారులకు గరిష్టంగా రూ.100 పెనాల్టీ తోపాటు సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. కనిష్టంగా రూ.20+సర్వీసు ట్యాక్స్ ను బ్యాంకు నిర్ణయించింది. 4. మెట్రోపాలిటన్ ప్రాంతాల్లో కనీస నగదు నిల్వ రూ.5000కు 75 శాతానికి పైగా తగ్గితే రూ.100 ప్లస్ సర్వీసు ట్యాక్స్ ఉంటుంది. ఒకవేళ 50 శాతం తగ్గితే, రూ.50 ప్లస్ సర్వీసు ట్యాక్స్ విధిస్తారు. 5. ఇతర బ్యాంకు ఏటీఎంలలో విత్ డ్రా లిమిట్ మూడు సార్లు కంటే ఎక్కువ సార్లు చేస్తే రూ.20 ఛార్జీ వేస్తుంది. ఎస్బీఐ ఏటీఎంలలోనే ఐదు సార్లు కంటే ఎక్కువ సార్లు డ్రా చేస్తే రూ.10 ఛార్జీని బ్యాంకు విధించనుంది. 6. రూ.25వేల కంటే ఎక్కువ బ్యాలెన్స్ ఉండే సొంత ఏటీఎంలలో అయితే ఎలాంటి విత్ డ్రా ఛార్జీలుండవు. ఇతర బ్యాంకు ఏటీఎంలలో డ్రా చేసుకునేందుకు ఛార్జీల మోత నుంచి తప్పించుకోవాలంటే బ్యాంకు బ్యాలెన్స్ రూ.లక్షకు మించి ఉండాలి. 7.ఓ త్రైమాసిక కాలంలో కనీస నగదు నిల్వలు రూ.25 వేలలోపు నిర్వహించే ఖాతాదారులకు వారి డెబిట్ కార్డు లావాదేవీలపై ఎస్ఎంఎస్ అలర్ట్స్‌కు గాను బ్యాంకు రూ.15 చార్జీలు వసూలు చేస్తుంది. పీఐ/యూఎస్ఎస్డీ లావాదేవీల విలువ రూ.1,000 వరకు ఉంటే ఆ సేవలు ఉచితం. యాక్సిస్ బ్యాంకు : 1. యాక్సిస్ బ్యాంకు ఖాతాదారులు ప్రతి నెల ఉచితంగా ఐదు లావాదేవీలు జరుపుకోవచ్చు. ఆ ఐదు లావాదేవీల్లోనే డిపాజిట్లు, విత్ డ్రాలు ఉంటాయి. అంతకుమించితే ప్రతి లావాదేవీకి రూ.95 కనీస ఛార్జీ ఉంటుంది. 2. గరిష్టంగా రూ.50వేలు డిపాజిట్ చేసే కస్టమర్లకు ఐదు నాన్-హోమ్ బ్రాంచు లావాదేవీలు ఉచితం. అదే ఎక్కువ మొత్తంలో డిపాజిట్లకు లేదా ఆరో లావాదేవీకు ప్రతి రూ.1000కు రూ.2.50 ఛార్జీ లేదా ప్రతి లావాదేవీకి రూ.95 ఛార్జీ ఏది ఎక్కువైతే అది విధిస్తారు. హెచ్డీఎఫ్సీ : 1. ప్రతినెలా నాలుగు ఉచిత లావాదేవీలు(డిపాజిట్లు, విత్ డ్రాలు కలిపి) చేసుకున్న అనంతరం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ప్రతి లావాదేవీకి రూ.150 లెవీ వేస్తుంది. 2. ఈ కొత్త ఛార్జీలు సేవింగ్స్, శాలరీ అకౌంట్లకు వర్తిస్తాయి. 3. హోమ్-బ్రాంచు లావాదేవీలకు, ఒక్కరోజు ఒకేసారి రూ.2 లక్షల వరకు ఉచితంగా డిపాజిట్ లేదా విత్ డ్రా చేసుకునే అవకాశముంటుంది. అంతకు మించితే ఇక ప్రతి రూ.1000కు రూ.5 లేదా రూ.150 చెల్లించాలి. 4. నాన్-హోమ్ బ్రాంచులో ఒక్కరోజులో రూ.25వేలకు మించి లావాదేవీ జరిపితే, ప్రతి రూ.1000కి రూ.5 లేదా రూ.150 ఛార్జీ విధిస్తారు. ఐసీఐసీఐ బ్యాంకు : 1. హోమ్ సిటీలోని శాఖల వద్ద నెలకు నాలుగు లావాదేవీలకు బ్యాంకు ఎలాంటి ఛార్జీలు విధించదు. ఆ పరిమితికి మించితే విత్ డ్రా లేదా డిపాజిట్ల ఒక్కో లావాదేవీపై కనీస ఛార్జీగా రూ.150 వసూలు చేస్తుంది. 2. థర్డ్ పార్టీ లిమిట్ రోజుకు రూ.50వేలే. 3. నాన్-హోమ్ బ్రాంచుల్లో ఐసీఐసీఐ బ్యాంకు తొలి క్యాష్ విత్ డ్రాకు క్యాలెండర్ నెలలో ఎలాంటి ఛార్జీ వేయదు. అంతకుమించితే కనీస ఛార్జీ రూ.150. 4. ఎక్కడైనా నగదు డిపాజిట్లకు ఐసీఐసీఐ బ్యాంకు ప్రతి రూ.1000కు రూ.5 ఛార్జీ వేస్తోంది. అంటే కనీసం రూ.150 వరకు ఉంటుంది. క్యాలెండర్ నెలలో తొలి క్యాష్ డిపాజిట్ ఉచితం. తర్వాత దానికి రూ.1000కు రూ.5 ఛార్జీ ఉంటుంది. -
నగదు లావాదేవీలపై పన్ను విధింపు
-
నగదు లావాదేవీలపై పన్ను విధింపు
రూ.50 వేలకు మించి విత్ డ్రా చేసినా, లావాదేవీ జరిపినా పన్ను చంద్రబాబు కమిటీ సిఫారసు.. నగదు విత్‌డ్రాపై గరిష్ట పరిమితి ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలపై చార్జీలు వద్దు సాక్షి, న్యూఢిల్లీ: నగదు లావాదేవీలు 50 వేల రూపాయలకు పైబడితే పన్ను విధించాలని ఏపీ సీఎం చంద్రబాబు నేతృత్వంలోని నగదు రహిత లావాదేవీల అమలు కమిటీ సిఫారసు చేసింది. రూ.50 వేలు, ఆ పైబడి నగదు ఉపసంహరించుకున్నా, లేక అంతమొత్తంలో లావాదేవీ జరిపినా పన్ను (బీసీటీటీ) విధిం చాలని సిఫారసు చేసింది. నగదును ఉప సంహరించుకునేందుకు గరిష్ట పరిమితి విధిం చాలని సూచించింది. ఈ కమిటీ మంగళ వారం ఇక్కడ నీతిఆయోగ్‌లో సమావేశమై మధ్యంతర నివేదికను రూపొందించింది. కమిటీ కన్వీనర్ చంద్రబాబు, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్, సిక్కిం సీఎం చామ్లింగ్, నీతిఆయోగ్ ప్రతినిధులతో కూడిన బృందం ఈ నివేదికను ప్రధాని మోదీకి సమర్పించింది. ఆధార్ ఆధారిత నగదు రహిత లావాదేవీలన్నింటిపై చార్జీలను పూర్తిగా సున్నా స్థాయికి తీసుకురావాలని, నగదును భారీగా వినియోగించకుండా ఉండేందుకు గాను నగదు లావాదేవీలపై పన్ను విధించాలని కమిటీ సిఫారసు చేసింది. నగదు రహిత లావాదేవీలకు రాయితీలు ఇవ్వాలని సూచించింది. ఆయా వివరాలను నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ అరవింద్ పనగరియా, సీఈవో అమితాబ్ కాంత్‌తో కలసి చంద్రబాబు నీతిఆయోగ్‌లో విలేకరు లకు వెల్లడించారు. ఆధార్ ఆధారిత చెల్లింపు విధానాన్ని (ఏఈపీఎస్) విస్తృతంగా ప్రోత్సహించాలని సిఫారసు చేశామన్నారు. కీలక సిఫారసులు ఇవీ.. ♦ వర్తకులు నగదు రహిత లావాదేవీలు అమలు చేసేందుకు వీలుగా వారిపై చార్జీలు, పన్నులు లేకుండా చూడాలి. ♦ మైక్రో ఏటీఎంలు, బయోమెట్రిక్ సెన్సర్లకు పన్ను రాయితీ వర్తింపజేయాలి. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించాలి. ♦ నగదు రహిత లావాదేవీలను అమలు చేసేవారికి పన్నును తిరిగి చెల్లించాలి. ♦ ఆధార్ చెల్లింపులకు వీలుగా బయోమెట్రిక్ సెన్సర్లను 50 శాతం సబ్సిడీపై ఇవ్వాలి. ♦ ఆధార్ ఆధారిత చెల్లింపులపై ఎండీఆర్ విధించరాదు. ప్రోత్సాహకాలు ఇవ్వాలి. ♦ ఆదాయ పన్ను పరిధిలోకి రాని పౌరులు, చిరు వర్తకులకు స్మార్ట్ ఫోన్ల కొనుగోలుకు గాను రూ. 1000 రాయితీ ఇవ్వాలి. ♦ 1,54,000 పోస్టాఫీసుల్లో ఆధార్ ఆధారిత మైక్రో ఏటీఎంలు సమకూర్చాలి. ♦ నగదు రహిత లావాదేవీల ద్వారా సమకూరే మొత్తాలతో లావాదేవీలకు అవసరమైన మౌలిక వసతులను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నెలకొల్పాలి. ♦ బస్సుల్లో, సబర్బన్ రైళ్లలో ప్రయాణికులు కాంటాక్ట్ లెస్ చెల్లింపులు చేసేందుకు మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి. ♦ ఆధార్ నంబర్‌ను ఉపయోగించి సాధారణ ఫోన్ ద్వారా యూఎస్ఎస్డీ పరిజ్ఞానంతో లావాదేవీలు జరిపే సౌలభ్యాన్ని ఈ నెలలోగా కల్పించాలి. ♦ రూ. 50 వేలు, ఆ పైబడిన నగదు లావాదేవీలపై బ్యాంకింగ్ క్యాష్ ట్రాన్సా క్షన్ టాక్స్‌ను అమలు చేయాలి. ♦ బీమా, విద్యాసంస్థలు, ఎరువులు, పీడీఎస్, పెట్రోలియం వంటి ప్రభుత్వ రంగ సంస్థల పరిధిలోని లావాదేవీ లన్నిటినీ నగదు రహితంగా మార్చాలి. ♦ ప్రభుత్వ సంస్థలకు చెల్లించే నగదు రహిత లావాదేవీలపై తక్కువగా గానీ, లేదా సున్నా స్థాయిలో గానీ ఎండీఆర్ చార్జీలు ఉండాలి. ♦ కేవైసీ సమర్పణకు ఆధార్‌ను ప్రాథమిక గుర్తింపుగా చేయాలి. ఆధార్ చట్టంలోని సెక్షన్ 57ను వర్తింపజేయాలి. -
నగదు వాడకంపై ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు?
న్యూఢిల్లీ : పెద్ద నోట్ల రద్దు, నగదు విత్డ్రాయల్స్పై ఆంక్షల అనంతరం నగదు లావాదేవీలపై మరిన్ని చెక్పాయింట్లు పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. వచ్చే బడ్జెట్లో నగదు వాడకంపై మరిన్ని ఆంక్షలను ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. పాన్ కార్డు అవసరమయ్యే నగదు లావాదేవీల మొత్తాన్ని ప్రభుత్వం మరింత తగ్గించేందుకు ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఇన్నిరోజులు రూ.50వేల నగదు కొనుగోళ్లపై వినియోగదారులు పాన్ కార్డు వివరాలను సమర్పించాల్సి ఉండేది. కానీ ప్రస్తుతం ఆ మొత్తాన్ని రూ.30వేలకు తగ్గించాలని ప్రభుత్వం చూస్తోంది. దీంతో రూ.30 వేలకు సరిపడ ఏమైనా కొనుగోళ్లు చేపడితే వినియోగదారులు తప్పనిసరిగా పాన్ కార్డు చూపించాల్సి ఉంటుంది. ఇటు పాన్ కార్డు వివరాలు అవసరమయ్యే వ్యాపారి లావాదేవీలను ప్రభుత్వం తగ్గించేస్తుందట. వీటితో పాటు నిర్దేశించిన పరిమితికి మించి నగదు చెల్లింపులు జరిగితే, వాటికీ చార్జీలు వేసేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. లక్షకంటే ఎక్కువ నగదు లావాదేవీలు జరిపితే ఈ చార్జీలను వేయనుందని టాక్. ఈ చర్యలతో తక్కువ నగదు వాడకాన్ని ప్రభుత్వం ప్రోత్సహించాలని ప్లాన్ చేస్తోంది. అంతేకాక బ్యాంకులు, ఏటీఎంల వద్ద నగదు విత్‌డ్రాయల్స్‌ను ప్రభుత్వం తగ్గించనుంది. నగదు రహిత ఎకానమీకి ఈ చర్యలు ఎంతో సహకరించనున్నాయని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.. -
బిల్లు రూ.50 వేలు దాటితే ‘పాన్’ తప్పనిసరి
హోటల్ బిల్లు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటికి వర్తింపు * జనవరి 1 నుంచి అమల్లోకి * దేశీయంగా నల్లధనం కట్టడికి కేంద్రం చర్యలు న్యూఢిల్లీ: నల్లధనం చలామణిని కట్టడి చేసే దిశగా కేంద్రం నిబంధనలు కఠినతరం చేసింది. హోటల్ బిల్లులు, విదేశీ ప్రయాణ టికెట్లు మొదలైన వాటి కి రూ. 50,000కు మించి నగదు రూపంలో జరిపే చెల్లింపులకు పాన్ (పర్మనెంటు అకౌంటు నంబరు) తప్పనిసరి చేసింది. లగ్జరీయేతర అంశాలకు సంబంధించి నగదు లావాదేవీల విషయంలో రూ. 2 లక్షలు దాటితేనే పాన్ నంబరు తప్పక ప్రస్తావించాల్సి ఉంటుంది. ఇక చిన్న ఇన్వెస్టర్లకు ఊరటనిచ్చేలా రూ. 50,000 పైచిలుకు పోస్టాఫీస్ డిపాజిట్లకు పాన్ తప్పనిసరి నిబంధనను కేంద్రం తొలగించింది. మరోవైపు పాన్ తప్పనిసరిగా పేర్కొనాల్సిన స్థిరాస్తి క్రయ, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 10 లక్షలకు పెంచింది. ఇది అందుబాటు ధరలోని గృహాలు కొనుగోలు చేసే వారికి ఊరటనివ్వనుంది. గతంలో రూ. 5 లక్షల విలువ చేసే స్థిరాస్తుల క్రయ,విక్రయాలకు కూడా పాన్ తప్పనిసరి చేయాలని కేంద్రం భావించింది. తాజా నిబంధనలు జనవరి 1 నుంచి అమల్లోకి వస్తాయని కేంద్ర రెవెన్యూ శాఖ కార్యదర్శి హస్ముఖ్ అధియా తెలిపారు. బ్లాక్‌మనీ చలామణి ఎక్కువగా జరిగే ఆభరణాలు.. బులియన్ కొనుగోళ్ల లావాదేవీ విలువ రూ. 2 లక్షలు మించితే పాన్ పేర్కొనక తప్పదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పరిమితి రూ. 5 లక్షలకు మించి ఉంది. మరోవైపు, రూ. 2 లక్షలకు మించిన అన్ని నగదు లావాదేవీలకు పాన్ నంబరును పేర్కొన డం తప్పనిసరిగా చేస్తూ త్వరలో నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్‌సభలో తెలిపారు. 2015-16 బడ్జెట్ ప్రసంగంలో రూ. 1 లక్ష పైగా విలువ చేసే క్రయ, విక్రయ లావాదేవీలన్నింటికీ పాన్ తప్పనిసరి చేయనున్నట్లు ప్రకటించినా జైట్లీ తాజాగా ఆ పరిమితిని పెంచారు. బ్యాంకు ఖాతా నుంచి చెల్లింపుల దాకా .. క్యాష్ కార్డులు లేదా ప్రీపెయిడ్ సాధనాల కొనుగోలుకు రూ. 50,000కు మించి నగదు చెల్లింపులు జరిపినా లేదా అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల కొనుగోలుకు రూ. 1లక్షకు పైగా చెల్లించినా పాన్ తప్పనిసరి కానుంది. ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాలు మినహా ఇతరత్రా బ్యాంకు ఖాతాలేవీ తెరవాలన్నా పాన్ తప్పదని అధియా వివరించారు. విలాసవంతమైన ఖర్చులు అయినందున.. హోటల్, విదేశీ పర్యటన బిల్లులను ప్రత్యేకంగా ప్రస్తావించినట్లు అధియా పేర్కొన్నారు. రూ. 2 లక్షలు మించిన మిగతా అన్ని నగదు లావాదేవీలకూ పాన్ నంబరు తప్పనిసరన్నారు. ఇది తాత్కాలికమేనని, అంతిమంగా ఈ పరిమితిని రూ. 1 లక్షకు తగ్గించడమే తమ ఉద్దేశమని ఆయన వివరించారు. కొన్నింట ఊరట.. సిసలైన లావాదేవీలకు నిబంధనల చిక్కులు తొలగించేందుకు, అదే సమయంలో భారీ లావాదేవీల వివరాలను సరిగ్గా రాబట్టేందుకు మరికొన్ని చర్యలు తీసుకున్నట్లు అధియా చెప్పారు. ఇందులో భాగంగానే స్థిరాస్తి కొనుగోలు, విక్రయాల లావాదేవీ విలువ పరిమితిని రూ. 5 లక్షల నుంచి రూ. 10 లక్షలకు పెంచినట్లు వివరించారు. హోటల్, రెస్టారెంటు బిల్లుల పరిమితిని రూ. 25,000 నుంచి రూ. 50,000కు పెంచినట్లు పేర్కొన్నారు. ఇక, అన్‌లిస్టెడ్ కంపెనీల్లో షేర్ల క్రయ,విక్రయాల విలువనూ రూ. 50,000 నుంచి రూ. 1 లక్షకు పెంచినట్లు వివరించారు. బేసిక్ ల్యాండ్‌లైన్ లేదా సెల్‌ఫోన్ కనెక్షన్ తీసుకునే విషయంలో పాన్ నిబంధనను సడలించినట్లు అధియా తెలిపారు. రూ. 50,000కు మించిన నగదు డిపాజిట్లు లేదా ఒకే రోజున అంత మొత్తం విలువ చేసే బ్యాంక్ డ్రాఫ్ట్/పే ఆర్డర్లు/ బ్యాంకర్స్ చెక్ మొదలైనవి తీసుకున్నా, రూ. 50,000 జీవిత బీమా ప్రీమియం చెల్లింపులకు పాన్ తప్పనిసరి నిబంధన యథాప్రకారంగా కొనసాగుతుందని ఆయన వివరించారు. బ్లాక్‌మనీపై సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) .. రూ. 1 లక్ష పైగా విలువ చేసే అన్ని రకాల వస్తువులు, సర్వీసుల క్రయ,విక్రయాలకు పాన్ నంబరు తప్పనిసరి చేయాలంటూ సూచించిన నేపథ్యంలో కేంద్రం తాజా చర్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.