సాక్షి, హైదరాబాద్: ఎన్నికల కోడ్ ఎఫెక్ట్ స్థిరాస్తి రంగంపై పడింది. సాధారణంగా రియల్టీ మార్కెట్‌లో నగదు ప్రవాహమే ఎక్కువగా ఉంటుంది. ఇందులోనూ అనధికారిక లావాదేవీలే అధికం. రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసు లు, ఎన్నికల సంఘం అధికారులు నగదు ప్రవాహంతోపాటు ఆన్‌లైన్ లావాదేవీలపై కూడా గట్టి నిఘా పెట్టారు.
ఇలాంటి పరిస్థితుల్లో నగదు లావాదేవీలు జరపడం శ్రేయస్కరం కాదని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. ఎన్నికల నేపథ్యంలో నగదు తీసుకెళ్తే.. పోలీసుల తనిఖీల్లో చిక్కితే అసలుకే ఎసరొస్తుందని ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేస్తున్నారు. దీంతో ఓపెన్ ప్లాట్లు, అపార్ట్‌మెంట్లపై తీవ్ర ప్రభావం పడనుంది.
అప్పటి వరకూ ఎదురుచూపులే..
సామాన్య, మధ్యతరగతి ప్రజలు పొదుపు చేసిన డబ్బుతో ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు కొనుగోలు చేస్తుంటారు. చాలా తక్కువ మొత్తానికి గృహ రుణం కోసం బ్యాంకులకు వెళ్తుంటారు. మరోవైపు ఆన్‌లైన్ ఖాతా ద్వారా నగదు లావాదేవీలు జరుపుదామంటే.. వాటిపై కూడా నిఘా పెట్టా లని ఎన్నికల సంఘం ఆదేశాల నేపథ్యంలో బ్యాంకర్లు దృష్టి పెట్టారు. దీంతో ఎన్నికలు పూర్తయ్యే వరకు గృహ ప్రవేశాలకు గడ్డుకాలమేనని చెప్పాలి.
ఎన్నికలు డెవలపర్ల మీద కంటే కొనుగోలుదారులపై ఎక్కువ ప్రభావాన్ని చూపిస్తాయి. ఎన్నికలకు 1–2 నెలల ముందు నుంచి, ఎన్నికలయ్యాక 2 నెలల వరకు కస్టమర్లు వేచిచూసే ధోరణిలో ఉంటారు. ఎందుకంటే కొత్త ప్రభుత్వం వస్తే కొత్త పథకాలు, రాయితీలు, పాలసీలు తమ పెట్టుబడుల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తాయోనని కొనుగోలుదారులు వేచి చూస్తుంటారు.
ముందస్తు బుకింగ్‌లు..
స్థిరాస్తి సంస్థలకు నిరంతర క్రయవిక్రయాలు జరపకపోతే సంస్థ కార్యకలాపాలు, ఉద్యోగుల జీవభత్యాలు ఇతరత్రా వ్యయాల నిర్వహణ భారంగా మారుతుంది. దీంతో పలు నిర్మాణ సంస్థలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, ప్రవాసులు, విశ్వసనీయమైన కస్టమర్లతో ముందస్తు బుకింగ్‌లు చేసుకుంటున్నారు. ఎన్నికల తర్వాత చెల్లింపులు జరిపేలా ఒప్పందాలు చేసుకుంటున్నారు.
మరోవైపు ఎన్నికల సమయంలో రియల్టర్లు రాజకీయ పార్టీలకు, నాయకులకు నిధులు సమకూర్చడం సాధారణమే కానీ, ఈసారి తెలంగాణలో నెలల వ్యవధిలో అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు వేర్వేరుగా జరుగుతాయి. దీంతో బిల్డర్లు ఫండ్‌ను కూడా వేర్వేరుగా ఏర్పాటు చేయాల్సి వస్తుందని, ఇది డెవలపర్లకు కొంత భారమేనని ఓ డెవలపర్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment