మాట్లాడుతున్న ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, చిత్రంలో స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్, డీఎస్పీ సత్యానందం
కైకలూరు : ఇకపై ప్రధాన నగదు లావాదేవీలపై నిరంతర నిఘా కొనసాగిస్తామని కృష్ణా జిల్లా ఎస్పీ సిద్ధార్థ్ కౌశల్ చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మండవల్లి సబ్ రిజిస్ట్రార్ నకిలీ చలానా కేసులో ప్రధాన నిందితుడు రామ్‌థీరజ్‌ను అరెస్ట్ చేసి కోర్టుకు తరలించినట్టు తెలిపారు. కైకలూరు సర్కిల్ కార్యాలయం వద్ద స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ డీఐజీ రవీంద్రనాథ్, గుడివాడ డీఎస్పీ సత్యానందంతో కలసి గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ముందుగా మోసపోయిన బాధితులు ప్రసాద్, వీరసత్యబాబులు తాము ఏ విధంగా నష్టపోయారో వివరించారు. ఎస్పీ మాట్లాడుతూ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, డీజీపీ గౌతమ్ సవాంగ్‌లు.. నకిలీ చలానా కేసుపై సమీక్ష చేసి చర్యలు తీసుకోవాలని ఆదేశాలిచ్చారని, దీంతో గుడివాడ డీఎస్పీ సత్యానందంను ప్రత్యేకాధికారిగా నియమించి విచారణ జరిపించినట్టు తెలిపారు.
తండ్రీకొడుకులది ప్రధాన పాత్ర..
మండవల్లికి చెందిన స్టాంప్ వెండర్ మేడేపల్లి రామ్‌థీరజ్, అతని తండ్రి డాక్యుమెంట్ రైటర్ బాలాజీ కలిసి.. 568 రిజిస్ట్రేషన్ల నిమిత్తం 640 చలానాలలో రూ.2,68,04,943 ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉండగా, చలానాలను మార్ఫింగ్ చేసి కేవలం రూ.15,92,158 మాత్రమే చెల్లించినట్టు తెలిపారు. అదే విధంగా నాన్–జ్యుడిషియల్ స్టాంపుల కొనుగోలు నిమిత్తం ఏడు చలానాల ద్వారా రూ.1,55,800 చెల్లించాల్సి ఉండగా.. కేవలం రూ.1,981 మాత్రమే చెల్లించి, ప్రభుత్వానికి రూ.1,53,819 జమ చేయలేదన్నారు.
ఈ నెల 19న సబ్ రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదుతో మండవల్లిలో కేసు నమోదు చేసి, బాధితులతో 21న డీఎస్పీ సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. కేసును ఛేదించిన గుడివాడ డీఎస్పీ, కైకలూరు సీఐ వైవీవీఎల్ నాయుడు, మండవల్లి ఎస్‌ఐ రామకృష్ణను అభినందించారు. అలాగే మండవల్లి నకిలీ చలానా కేసులో పోలీసుల పనితీరు అభినందనీయమని స్టాంపులు, రిజిస్ట్రేషన్లశాఖ డీఐజీ రవీంద్రనాథ్ ప్రశంసించారు.
Comments
Please login to add a commentAdd a comment