సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల కోడ్ కూయడంతో రాష్ట్రంలోని నిరుద్యోగ అభ్యర్థుల ఆశలకు గండిపడింది. దాదాపు ఏడాదిన్నరగా ఉద్యోగాల కోసం చేసిన శ్రమకు ‘కోడ్’బ్రేకులు వేస్తుందేమోనని వారిలో నిరాశ నెలకొంది. ఈ నెల 9న కేంద్ర ఎన్నికల సంఘం అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపథ్యంలో నవంబర్ 3న ఎన్నికలకు గెజిట్ నోటిఫికేషన్ వెలువడనుంది.
ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసు, రెవెన్యూ యంత్రాంగం ఎన్నికల విధుల్లో బిజీ అయింది. దీంతో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం జారీ చేసిన ప్రకటనల తాలూకు పరీక్షల నిర్వహణ, ఇప్పటికే నిర్వహించిన పరీక్షలకు సంబంధించిన ఫలితాల ప్రకటనపై సందిగ్ధత నెలకొంది. ఎన్నికల కోడ్ కారణంగా ఉద్యోగ అర్హత పరీక్షలను నిర్వహించడంతో పాటు ఫలితాల ప్రకటనకు ఎన్నికల సంఘం అనుమతి తప్పనిసరి.
దీంతో ఎన్నికల కమిషన్ అనుమతి ఇస్తుందా? లేదా? అనే అనుమానాలు నిరుద్యోగ అభ్యర్థులను కలవరపెడుతున్నాయి. నియామక సంస్థలు అనుమతి కోరిన వెంటనే ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చినప్పటికీ భద్రతా కారణాలు, సిబ్బంది సమస్యలతో అర్హత పరీక్షలను నిర్వహిస్తారా? లేదా? అనే ఆందోళన అభ్యర్థులను వెంటాడుతోంది.
పరీక్షలు సరే... ఫలితాల మాటేంటి?
రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లోని వివిధ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి గతేడాది ఏప్రిల్ నుంచి వరుసగా ఉద్యోగ ప్రకటనలు వెలువడ్డాయి. 80 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో నియామక సంస్థలు సైతం ఎంతో ఉత్సాహంతో భర్తీ ప్రక్రియను మొదలుపెట్టాయి. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇప్పటికే 38 వేలకు పైగా ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది.
తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) దాదాపు 11 వేల ఉద్యోగాలకు, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మరో 17 వేల ఉద్యోగాలకు, తెలంగాణ మెడికల్ సర్విసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డు (టీఎంఎస్‌ఆర్‌బీ) 10 వేల ఉద్యోగాలకు ప్రకటనలు జారీ చేసింది. వీటితో పాటు ఇటీవల డీఎస్సీ ద్వారా 6 వేల టీచర్ ఉద్యోగాలకు సైతం ప్రకటనలు వెలువడ్డాయి. డీఎస్సీ, గ్రూప్–1 మెయిన్స్, గ్రూప్–2, గ్రూప్–3 అర్హత పరీక్షలు మినహా మిగతా కేటగిరీలకు సంబంధించి పరీక్షలు పూర్తయ్యాయి.
పోలీసు నియామక ఫలితాల విడుదల దాదాపు పూర్తి కాగా... మెడికల్ ఆఫీసర్ నియామకాల ప్రక్రియ కూడా పూర్తయింది. టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన పలు అర్హత పరీక్షల ఫలితాలు వెలువడలేదు. గురుకుల బోర్డు కూడా ఫలితాలను ప్రకటించలేదు. దీంతో అభ్యర్థుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా నియామక సంస్థలు ఎలాంటి చర్యలు తీసుకుంటాయోనని వారు ఎదురు చూస్తున్నారు. చిన్నాచితకా ఉద్యోగాలను వదులుకుని ప్రభుత్వ కొలువులకు సన్నద్దమైన అభ్యర్థులకు ఫలితాల కోసం నిరీక్షణ తప్పేలా లేదు.
Comments
Please login to add a commentAdd a comment