సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించిన వెంటనే.. ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందని ప్రకటించింది. దీంతో.. రాషష్ట్రవ్యాప్తంగా పోలీస్ శాఖ విస్తృత స్థాయిలో తనిఖీలు మొదలుపెట్టింది. డబ్బు, మద్యం తరలింపుపై పోలీసులు నిఘా పెట్టారు. రాజధాని హైదరాబాద్ సహా పలు జిల్లాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి.. వాహనాలను ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తోంది.
హైదరాబాద్‌లో పలు చోట్ల భారీగా నగదు.. బంగారం పట్టివేత..
►చాదర్‌ఘాట్‌లో రూ.10 లక్షల నగదు స్వాధీనం
►శంకర్‌పల్లిలో రూ.80 లక్షల నగదు స్వాధీనం
►చందానగర్‌లో ఆరు కేజీల బంగారం పట్టివేత
► ఫిల్మ్ నగర్‌లో రూ.30 లక్షల నగదు పట్టుకున్న పోలీసులు
► సౌత్ వెస్ట్, సౌత్ జోన్‌లలో.. రూ. 25 లక్షల దాకా హవాలా నగదు పట్టివేత
► బషీర్ బాగ్ తనిఖీల్లో భారీ ఎత్తున బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బంగారంతోపాటు 300 కేజీల వెండి సీజ్ చేశారు అబిడ్స్ పోలీసులు. బంగారం 16 కేజీల దాకా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ రెండింటి విలువ రూ.10 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. హైదరాబాద్ నుంచి ఇతర ప్రాంతాలకు తరలించే క్రమంలోనే దీనిని పట్టుకున్నారు.
► వనస్థలిపురంలో.. ఎన్నికల కోడ్ అమలు దృష్ట్యా జరిగిన వాహన తనిఖీల్లో రూ. 4 లక్షల రూపాయలు సీజ్ చేశారు పోలీసులు
► శేరిలింగంపల్లి పరిధిలోని గోపనపల్లిలో కాంగ్రెస్ నేత ఫొటోతో ఉన్న రైస్ కుక్కర్లను పంపిణీ చేస్తున్న కొందరిని గచ్చిబౌలి పోలీసులు అడ్డుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి.. 87 కుక్కర్లు స్వాధీనం చేసుకున్నారు.
ఎన్నికల కోడ్‌ను అనుసరించి ఈసీ నిబంధనల్ని కఠినంగా అమలు చేయాలని తెలంగాణ పోలీస్ శాఖ నిర్ణయించింది. పరిమితికి మించి డబ్బుతో వెళ్లడం, మద్యం రవాణా మీద దృష్టిసారించింది. ఈ క్రమంలో హైవేపై వెళ్తున్న కార్లు, బైకులను ముమ్మరంగా తనిఖీ చేస్తున్న పోలీసులు. రూ.50 వేలకు మించి నగదుతో వెళ్తే.. దానికి సంబంధించిన పత్రాలు, రసీదులు, డాక్యుమెంట్లు ఉండాలని పోలీస్ శాఖ సూచిస్తోంది. డబ్బు మాత్రమే కాదు.. ఆభరణాలకు ఇది వర్తించనుంది.
► ఖమ్మం జిల్లాలో 9 లక్షల 80 వేల నగదును పోలీసులు పట్టుకున్నారు. సత్తుపల్లి లో 5 లక్షలు,కల్లూరు లో 4 లక్షల 80 వేల నగదును పట్టుకుని సీజ్ చేశారు. కొణిజర్ల మండల కేంద్రంలో పోలీస్ చెక్ పోస్ట్ వద్ద వాహనాల తనిఖీలలో.. కల్లూరు వైపు వెళ్తున్న ఓ కారు నుంచి ఎలాంటి పత్రాలు లేకుండా తరలిస్తున్న రెండు లక్షల నలభై వేల నగదును పట్టుకున్నారు.
► కరీంనగర్ రూరల్ మండలం ముగ్ధుంపూర్ బస్ స్టాప్ దగ్గర పోలీసుల తనిఖీల్లో ఓ వాహనంలో తీసుకెళ్తున్న మూడు లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment