సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పలు సంచలనాలతో రాజకీయ ప్రకంపనలకు సిద్ధం కాబోతోంది ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం. అయితే.. ఈ మొత్తానికి ప్రధాన సూత్రధారి అయిన ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారికి ‘టచ్’లోకి వచ్చినట్లు తెలుస్తోంది.
ప్రణీత్‌రావుపై వేటు.. అరెస్ట్ తర్వాత పత్తా లేకుండా పోయిన ప్రభాకర్‌రావు ఓ ఉన్నతాధికారితో సంభాషణ జరిపినట్లు తాజా సమాచారం. మా ఇళ్లలో ఎందుకు సోదాలు నిర్వహిస్తున్నారు? అని ఆ సందర్భంలో ఆయన సదరు ఉన్నతాధికారిని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ‘‘ఎంతైనా మనం మనం పోలీసులం ఒకటి. ఇప్పుడు ప్రభుత్వం చెబితే మీరు ఎలా చేస్తున్నారో.. గత ప్రభుత్వంలో మేం కూడా అలాగే చేశాం’’ అని ప్రభాకర్‌రావు వ్యాఖ్యానించినట్లు తెలుస్తోంది. అంతేకాదు తాను కేన్సర్ చికిత్స కోసం అమెరికా వచ్చానని.. జూన్ లేదంటే జులైలో తిరిగి హైదరాబాద్‌కు వస్తానని చెప్పినట్లు సమాచారం.
అయితే ప్రభాకర్‌రావు అడిగిన కొన్ని ప్రశ్నలకు సదరు ఉన్నతాధికారి స్పందించకుండా.. మీరు ఏదైనా చెప్పదల్చుకుంటే అధికారిక మెయిల్‌కు సమాధానం రాసి పంపాలని సూచించారట. దీంతో.. ప్రభాకర్‌రావు సమాధానం చెప్పకుండా ఫోన్ పెట్టేసినట్లు తెలుస్తోంది.
దర్యాప్తు వివరాల ప్రకారం.. నాటి ప్రతిపక్ష నేత రేవంత్‌రెడ్డిపై నిఘా వేయాలని ప్రభాకర్‌రావు ఆదేశించడంతో ఎస్‌ఈబీ డీఎస్పీ ప్రణీత్‌రావు రంగంలోకి దిగారు. రేవంత్ ఇంటి సమీపంలోనే ప్రణీత్ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నారు. రేవంత్ కేంద్రంగా కాంగ్రెస్ పార్టీ పరిణామాలపై ఆరాలు తీశారు. ఈ మొత్తం వ్యవహారంలో తిరుపతన్న, భుజంగరావు(తాజాగా అరెస్టైన అదనపు ఎస్పీలు) కీలకంగా వ్యవహరించారు. తిరుపతన్న ఆ డేటాను ఎప్పటికప్పుడు ప్రభాకర్‌రావుకు పంపించారు. అయితే..
ప్రభుత్వం మారుతుందన్న సంకేతాలు రావడంతో మొత్తం హార్క్‌డిస్క్‌లు, సేకరించిన సమాచారాన్ని ధ్వంసం చేయాలని ప్రణీత్‌కు ప్రభాకరే సూచించారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటపడడం.. ప్రణీత్‌రావుపై సస్పెన్షన్ వేటు పడడంతో అప్రమత్తమైన ప్రభాకర్‌రావు ఫ్యామిలీ ట్రిప్ పేరిట చెన్నైకి చేరి.. అటు నుంచి అటే అమెరికాకు వెళ్లారు.
ఇక.. ప్రభాకర్‌రావు నేతృత్వంలోనే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం నడిచిందని ప్రణీత్‌రావు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ మాజీ పోలీస్ అధికారిపై లుక్‌అవుట్ నోటీసులు జారీ అయ్యాయి కూడా. ప్రభాకర్ రావు, టాస్క్‌ఫోర్స్ మాజీ డీసీపీ రాధా కిషన్ రావు పేర్లను ఎఫ్ఐఆర్లో పోలీసులు చేర్చారు. ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌లో ప్రభాకర్ రావు, రాధా కిషన్ రావులే కీలక సంస్థ దారులు... ఆ ఇద్దరూ చెప్తేనే ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ట్యాపింగ్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభాకర్ రావుకు ప్రణీత్ రావు అందించేవారు. రాజకీయ నాయకులు, వ్యాపారుల ఫోన్ నెంబర్లను ప్రణీత్ రావుకు ప్రభాకర్ రావు, రాధా కిషన్ ఇచ్చేవారని తేలింది.
ఇక.. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రణీత్‌రావు పేరును ఏ2గా చేర్చింది దర్యాప్తు బృందం. ఆయన ఇచ్చిన సమాచారం ప్రకారం.. ప్రభాకర్ రావు అండ్ టీం.. కేవలం విపక్ష నేతల ఫోన్లే కాదు.. వ్యాపారులు, ప్రముఖుల ఫోన్లను సైతం ట్యాపింగ్ చేసింది. ఈ జాబితాలో 36 మంది ప్రముఖ రియల్ ఎస్టేట్ బిల్డర్లు, ప్రముఖ జ్యువెల్లరీ వ్యాపారులతో పాటు హవాలా వ్యక్తులు సైతం ఉన్నారు. ప్రణీత్‌రావు, తిరుపతన్న, భుజంగరావులు వాళ్ల ఫోన్లను ట్యాప్ చేసి.. బ్లాక్‌మెయిల్ చేసి భారీగా డబ్బు గుంజినట్లు నిర్ధారణ అయ్యింది.
Comments
Please login to add a commentAdd a comment