ట్యాపింగ్ టీమ్ అక్రమ వ్యవహారాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి
పలు కంపెనీల అధినేతలు, రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్ల ఫోన్లపై నిఘా
ట్యాపింగ్ నేపథ్యంలో తెలుసుకున్న సమాచారం ఆధారంగా బెదిరింపులు
వారి వ్యక్తిగత జీవితం, బలహీనతలు ఆసరాగా వసూళ్లు
పలువురు ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్ అధికారుల పైనా నిఘా వేశారంటున్న సిట్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్‌ఐబీ) కేంద్రంగా అక్రమ ట్యాపింగ్‌కు పాల్పడిన మాజీ ఓఎస్డీ టి.ప్రభాకర్‌రావు అండ్ టీమ్ సాగించిన దందాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ప్రతిపక్ష నేతలు, కీలక వ్యక్తులు, వారి కుటుంబీకులపై నిఘా ఉంచడంతో పాటు, ట్యాపింగ్ సందర్భంగా తెలుసుకున్న సమాచారం ఆధారంగా పలు కంపెనీలు, పలువురు రియల్టర్లు, బిల్డర్లు, జ్యువెలర్స్‌ను బెదిరించి భారీ స్థాయిలో వసూళ్లకు పాల్పడినట్లు సిట్ అధికారులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన ప్రాథమిక ఆధారాలు సైతం లభించినట్లు సమాచారం.
అనుకోకుండా దొరికిన అవకాశంతో..
ప్రభాకర్‌రావుతో పాటు హైదరాబాద్ టాస్‌్కఫోర్స్ మాజీ ఓఎస్డీ పి.రాధాకిషన్‌రావు, అదనపు ఎస్పీలు నాయిని భుజంగరావు, మేకల తిరుపతన్న, డీఎస్పీ ప్రణీత్ రావు తదితరులు.. విదేశాల నుంచి అత్యాధునిక పరికరాలు దిగుమతి చేసుకున్న తర్వాత కొన్నాళ్ల వరకు వాటిని కేవలం విపక్షాలపై నిఘా కోసమే వాడారు. అయితే వారి ఫోన్లు రికార్డు చేస్తుండగా వెలుగులోకి వచ్చిన అంశాలను గమనించిన తర్వాత, వాటిని ఆర్థిక లబ్ధికి అనుకూలంగా మార్చుకోవాలని భావించారు. తమ వద్ద ఉన్న టెక్నాలజీని దీని కోసం వినియోగించారు. బెదిరింపుల దందా ప్రారంభించేందుకు ప్రభాకర్‌రావు తనవారైన మరింత మందిని ఎస్‌ఐబీలోకి తీసుకువచ్చారు.
ఎలక్టోరల్ బాండ్లూ కొనిపించారు..
ప్రభాకర్‌రావు బృందం టార్గెట్ చేసిన వారిలో పలువురు ఫార్మా కంపెనీల యజమానులు, బడా బిల్డర్లు, నగల దుకాణాల యజమానులు, రియల్టర్లతో పాటు ప్రముఖ వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరి గురించిన సమాచారం తెలిసిన తర్వాత వారి కార్యాలయాలు, నివాసాల సమీపంలోకి ట్యాపింగ్ ఉపకరణాలతో బృందాలను పంపేవారు. బృందాల్లో ఉన్నవారు బాధితుల ఫోన్లలో జరిగే ప్రతి సంభాషణను రికార్డు చేసుకుని వచ్చి ప్రణీత్‌రావుకు అప్పగించేవారు. వీటిని విశ్లేషించేందుకు పర్వతనగర్‌లోని వార్‌రూమ్‌లో ఓ ప్రత్యేక బృందం పని చేసేది.
ఇలా ఆయా వ్యాపారుల వ్యక్తిగత జీవితాలు, బలహీనతలు తదితరాలను గుర్తించే ప్రణీత్‌రావు.. విషయాన్ని ప్రభాకర్‌రావుతో పాటు రాధాకిషన్‌రావు దృష్టికి తీసుకువెళ్లేవారు. ఆపై రంగంలోకి దిగే వీరి సైన్యాలు వారిని బెదిరించి భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడేవారు. బెదిరింపులకు లొంగని కొందరు వ్యాపారుల వాట్సాప్‌లకు ట్యాపింగ్‌లో బయటపడిన సంభాషణల ఆడియోలను పంపి లొంగదీసుకున్నట్లు తెలిసింది. 2017–18 ఆర్థిక సంవత్సరం నుంచి ఎలక్టోరల్ బాండ్ల విధానం అమల్లోకి వచ్చిన నేపథ్యంలో.. వివిధ రంగాలకు చెందిన వ్యాపారులు, కాంట్రాక్టర్లను బెదిరించి ఎలక్టోరల్ బాండ్లు ఖరీదు చేసేలా చేసినట్లు సమాచారం.
ఆ నలుగురూ ఉమ్మడి నల్లగొండలో పనిచేసిన వారే..
సాక్షి, యాదాద్రి: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కొంటున్న నలుగురు పోలీస్ అధికారులు ఉమ్మడి నల్లగొండ జిల్లా పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేశారు. ప్రభాకర్‌రావు ఉమ్మడి నల్లగొండ ఎస్పీగా విధులు నిర్వర్తించారు. ప్రధాన నింతుడిగా ఉన్న మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు, ఏఎస్‌పీలు భుజంగరావు, తిరుపతన్నలు ఇదే జిల్లాలో వివిధ హోదాల్లో పనిచేశారు.
తిరుపతన్న యాదగిరిగుట్టలో ఎస్‌ఐగా, భువనగిరిలో సీఐగా విధులు నిర్వర్తించారు. భుజంగరావు భువనగిరి ఏసీపీగా పనిచేశారు. ప్రణీత్ రావు బీబీనగర్, పోచంపల్లి పోలీస్‌స్టేషన్‌లలో ఎస్‌ఐగా పనిచేశారు. వీరి దందా వెలుగు చూసిన నేపథ్యంలో వారితో ఆ సమయంలో అంటకాగిన పోలీస్ సిబ్బందిలో ఆందోళన వ్యక్తమవుతోంది.
టెక్నాలజీ వాడకంలో భుజంగరావు దిట్ట
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాజీపూర్ బాలికల వరుస హత్యల నిందితుడు శ్రీనివాస్‌రెడ్డిని గుర్తించడంలో అప్పుడు డీఎస్పీగా ఉన్న నాయిని భుజంగరావు ట్యాపింగ్ సహా టెక్నాలజీ వాడకంలో తన నైపుణ్యాన్ని వినియోగించారు. కీలక సాక్ష్యాధారాలను సేకరించారు. వాటి ఆధారంగా జిల్లా కోర్టు నింతునికి ఉరి శిక్ష విధించింది. 2021లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ మెడల్ ఫర్ ఎక్స్‌లెంట్ ఇన్వెస్టిగేషన్ (అద్భుత పరిశోధన)తో సత్కరించింది. ప్రస్తుతం ఆయన జయశంకర్ భూపాలపల్లి అదనపు ఎస్పీగా పనిచేస్తున్నారు.
డీజీపీ స్థాయి వారి ఫోన్లూ ట్యాప్
ఈ ట్యాపింగ్ టీమ్ పోలీసు విభాగంలోని వారిని కూడా వదిలిపెట్టలేదు. ప్రభాకర్‌రావు ఆదేశాల మేరకు ఆయనకంటే తక్కువ, ఎక్కువ హోదాల్లో ఉన్న వారి ఫోన్లనూ ట్యాప్ చేసినట్లు సమాచారం. పలువురు ఐపీఎస్‌లతో పాటు ఐఏఎస్ అధికారుల పైనా నిఘా ఉంచినట్లు తెలిసింది. నగర పోలీసు కమిషనర్‌గా పని చేసి డీజీపీగా వెళ్లిన ఓ అధికారి సైతం ప్రభాకర్‌రావు చర్యల్ని అడ్డుకోలేకపోయారు. దీంతో ఆయన ఓ దశలో సాధారణ ఫోన్, వాట్సాప్‌లు కాకుండా సిగ్నల్ యాప్ వాడాలని ఎస్పీలు, ఇతర అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేశారు.
ఆయనతో పాటు అప్పట్లో ఐజీలు, డీఐజీలుగా పని చేసిన వాళ్లు కూడా దీని ద్వారానే ఎస్పీలతో సంప్రదింపులు జరిపారంటే వారి అభద్రతా భావాన్ని అంచనా వేయవచ్చని ఓ అధికారి వ్యాఖ్యానించారు. కాగా శనివారం అరెస్టు అయిన అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నలను తదుపరి దర్యాప్తు నిమిత్తం 10 రోజుల కస్టడీకి ఇవ్వాలని కోరుతూ పంజగుట్ట పోలీసులు మంగళవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment