సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఏకకాలంలో పది చోట్లా.. అదీ మాజీ పోలీస్ అధికారుల ఇళ్లలో పంజాగుట్ట పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ప్రణీత్‌రావు వెల్లడించిన సమాచారం మేరకే ఈ సోదాలు జరుగుతున్నట్లు పోలీసులు చెబుతున్నారు.
మాజీ డిఎస్పీ ప్రణీత్ రావు కేసులో దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది. ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా పలువురు అనుమానితుల నివాసాల్లో సోదాలు చేస్తున్నారు పోలీసులు. ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు ఇంటితో పాటు పలువురు మాజీ అధికారుల ఇళ్లలో సోదాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ అధికారి ఇంటి నుంచి 2 లాప్ టాప్ లు, 4 ట్యాబ్ లు, 5 పెన్ డ్రైవ్‌లు, ఒక హార్డ్ డిస్క్ ను స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. మాజీ అధికారులతో పాటు మరో ఇద్దరు అడిషనల్ ఎస్పీలు, ఇద్దరు డీఎస్పీల పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఇదిలా ఉంటే.. ప్రణీత్‌రావు ఏడు రోజుల కస్టడీ నేటితో ముగియనుంది. విచారణ అనంతరం వైద్య పరీక్షలు నిర్వహించి ఆయన్ని కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. అలాగే.. ఇప్పటివరకు జరిగిన విచారణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తనకు సహకరించిన వారి అందరి పేర్లు ప్రణీత్ రావు వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ప్రణీత్‌రావు ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను ఇవాళ కోర్టుకు సమర్పించనుంది దర్యాప్తు చేస్తున్న స్పెషల్ టీం.
Comments
Please login to add a commentAdd a comment