సాక్షి, హైదరాబాద్: స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) ప్రణీత్ రావు అరెస్టులో కీలక విషయాలు వెలుగు చూశాయి. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ఫోన్ ట్యాపింగ్‌లు చేశానని, ఆ సమాచారాన్ని ధ్వంసం కూడా చేశానని ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ని మరోసారి కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించాలని స్పెషల్ టీం భావిస్తోంది.
‘‘అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రజాప్రతినిధులు, అధికారులు, మీడియా, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశా. పూర్తి సమాచారాన్ని అప్పటి ఎస్పీ స్థాయి అధికారుల నుంచి ఎస్‌ఐబీ చీఫ్ దాకా ఆ సమాచారం అందజేశాను. కొంతమంది ప్రజాప్రతినిధులు, అధికారుల కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశా. చాలామంది అధికారులు, ప్రజాప్రతినిధుల వాట్సాప్ ఛాటింగ్‌లపై నిఘా పెట్టాను..
.. ఫోన్ ట్యాపింగ్ సమాచారాన్ని అధికారులకు ఇచ్చాను. అప్పటి ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ఆదేశాల మేరకు ఆ సమాచారం మొత్తం ధ్వంసం చేశా. సెల్‌ఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు వేల సంఖ్యలో పత్రాలు ధ్వంసం చేశాను’’ అని ప్రణీత్‌రావు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.
దీంతో ప్రస్తుతం 14 రోజుల రిమాండ్ మీద చంచల్‌గూడ జైల్లో ఉన్న ప్రణీత్‌రావును మరోసారి విచారించేందుకు ప్రత్యేక టీం నాంపల్లి కోర్టులో పిటిషన్ వేసింది. ఆయన్ని వారం రోజుల కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరినట్లు తెలుస్తోంది. ఇక ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతో.. ఎస్ఐబీ మాజీ చీఫ్ తో పాటు పలువురు ఎస్పీ, డీఎస్పీలను విచారించేందుకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment