Phone Tapping Case: నిఘా ముసుగులో చట్ట వ్యతిరేక పనులు | Praneeth Rao phone tapping case: Sensational Details Out | Sakshi
Sakshi News home page

స్పై పోలీసుల ముఠా.. నిఘా ముసుగులో చట్ట వ్యతిరేక పనులు

Published Sat, Mar 23 2024 12:47 PM | Last Updated on Sat, Mar 23 2024 5:15 PM

Praneeth Rao phone tapping case: Sensational Details Out - Sakshi

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సంచలనాలు వెలుగులోకి

ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు నేతృత్వంలో స్పై దందా

ప్రతిపక్షనేతలతో పాటు వ్యాపారవేత్తల ఫోన్ల అక్రమ ట్యాపింగ్‌

బ్లాక్‌మెయిల్‌కు దిగి వందల కోట్ల వసూళ్లు!!

ట్యాపింగ్‌ టెక్నాలజీ కోసం రష్యా, ఇజ్రాయెల్‌లో పర్యటన

ప్రణీత్‌రావుపై వేటుతో పరారీలో ప్రభాకర్‌రావు?

సాక్షి, హైదరాబాద్‌: ప్రణీత్‌రావు విచారణతో ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో సంచలనాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారాలకు కర్త, కర్మ, క్రియ.. స్పెషల్‌ ఇంటెలిజెన్స్‌ బ్రాంచ్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావే అని దాదాపుగా నిర్ధారణ అయ్యింది. నిఘా ముసుగులో ప్రభాకర్‌&టీం చట్ట వ్యతిరేక పనులకు పాల్పడినట్లు తేలింది. ఇష్టానుసారం ప్రముఖుల ఫోన్‌ ట్యాపింగ్‌లు చేయడమే కాకుండా.. పెద్ద ఎత్తున్న బ్లాక్‌ మెయిలింగ్‌ దందా నడిపి భారీగా సొమ్ములు వసూలు చేసినట్లు తెలుస్తోంది.   

గత అధికార పార్టీతో అంటకాగిన ఇంటెలిజెన్స్‌ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావు.. 2018 నుంచి ప్రతిపక్ష నేతల ఫోన్లను అక్రమంగా ట్యాపింగ్‌ చేపిస్తూ వచ్చారు. నల్లగొండ ఎస్పీగా  ఉన్న టైంలో తనకు నమ్మకంగా ఉన్న కొందరు అధికారులతో ప్రైవేట్‌ సైన్యం ఏర్పాటు చేసుకున్నారాయన. ప్రధానంగా స్పై పోలీసుల ముఠాలో.. టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావు, భుజంగరావు, తిరుపతన్నలను కీలక సభ్యులుగా చేర్చారు. మరికొందరు పోలీసుల హస్తం కూడా ఉన్నట్లు తేలింది.

ఇక.. ట్యాపింగ్‌, ఇతర నిఘా పరికరాలపై అధ్యయనం కోసం ఇజ్రాయెల్‌, రష్యాలో సైతం పర్యటించినట్లు తెలుస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ప్రభాకర్‌ టీంకు రవి పాల్‌ సాంకేతిక సహకారం అందించారు. రవిపాల్‌ సూచన మేరకే సూట్‌కేసులో పట్టే పరికరంతో ఆనాటి ప్రతిపక్ష నేత ఇళ్ల వద్ద ఎస్‌ఐబీ టీం మాటు వేసేది. ట్యాపింగ్‌ ఎంత పక్కాగా జరిగేదంటే.. కేంద్రానికి సమాచారం ఇవ్వకుండా ఉండేందుకు నిబంధనల కన్నా తక్కువ సమయంతో ట్యాపింగ్‌  వ్యవహారాన్ని నడిపించిందా బృందం.

మరోవైపు నాటి విపక్ష నేతలే కాకుండా.. వ్యాపారస్తులను సైతం ప్రభాకర్‌ బృందం టార్గెట్‌ చేసింది. సుమారు 30 మందికిపైగా వ్యాపారుల ఫోన్లపై నిఘా వేసి.. అక్రమంగా ఫోన్ల ట్యాప్‌ చేసి బ్లాక్‌మెయిల్‌కి సైతం చేసినట్లు తెలుస్తోంది. అలా.. రూ. 500-600 కోట్ల దాకా వసూలు చేసినట్లు వెల్లడైంది. అందుకే ఆయా మాజీ అధికారుల ఆస్తులకు సంబంధించిన వివరాలను సైతం సేకరించే దిశగా తాజా సోదాలు జరిగినట్లు సమాచారం. 

సంబంధిత వార్త: ప్రణీత్‌రావు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక మలుపు

ప్రణీత్‌పై వేటుతో అప్రమత్తమై.. 
ప్రభాకర్‌రావు తెలంగాణ ఏర్పడ్డాక సీసీఎస్‌ డీసీపీగా పని చేశారు. 2020లో ఇంటెలిజెన్స్‌ ఐజీగా పదవీ విరమణ పొందారు. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వం ఓఎస్డీలో బాధ్యతలు అప్పగించింది. గతేడాది ప్రభుత్వం మారాక ఓడీఎస్‌ పోస్టుకు ప్రభాకర్‌ రాజీనామా చేశారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంలో ఎస్‌ఐబీలో డీఎస్పీగా పని చేసిన ప్రణీత్‌రావుపై వేటు పడింది. ప్రణీత్‌రావు ప్రభాకర్‌రావుకు బంధువు కూడా. వెంటనే ప్రభాకర్‌రావు అప్రమత్తం అయ్యారు. కుటుంబంతో విహరయాత్ర పేరుతో హైదరాబాద్‌ దాటారు. అటు నుంచి అటే ఆయన అమెరికా పరారైనట్లు తెలుస్తోంది. ప్రణీత్‌ రావు  నుంచి రాబట్టిన వివరాల ఆధారంగా..  ప్రభాకర్‌రావు విషయంలోనూ దర్యాప్తు సంస్థ ఓ నిర్ణయం తీసుకునేలా కనిపిస్తోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement