హైదరాబాద్, సాక్షి: ఫోన్ ట్యాపింగ్ కేసు ప్రధాన నిందితుడు తెలంగాణ ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఇండియాకు వచ్చేది ఎప్పుడు?. దీనిపై దర్యాప్తు అధికారులు స్పందించారు. నేటితో ఆయన వీసా ముగియనుందట. ఈ నేపథ్యంలో ఈ నెలాఖారున ఆయన వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు స్పష్టత ఇచ్చారు. అయితే..
అనారోగ్యాన్ని కారణంగా చూపిస్తూ తన వీసా గడువును పెంచుకునేందుకు ఆయన ప్రయత్నాలు చేసే అవకాశం లేకపోలేదని సమాచారం. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో పెద్దల ఆదేశాలపై ప్రతిపక్ష నేతలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లు ట్యాప్ చేయించారనే అభియోగాలు ప్రభాకర్‌రావుపై నమోదు అయ్యాయి. ఈ కేసులో తొలి అరెస్ట్ ప్రణీత్‌రావును చేయగా.. అంతకు ముందే అలర్ట్ అయిన ప్రభాకర్‌రావు దేశం విడిచి వెళ్లిపోయారు.
ప్రభాకర్‌రావును ప్రశ్నిస్తేనే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని సిట్ అంటోంది. ఈ లెక్కన.. ఆయన దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్ట్ అయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభాకర్‌రావుపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయ్యింది.
నిందితులపై బెయిల్‌పై..
ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులు. తిరుపతన్న, భుజంగ రావ్ బెయిల్ పిటిషన్ లపై ఇవాళ నాంపల్లి కోర్టులో విచారణ జరగనుంది. నిర్ణీత గడువు 90 రోజుల్లోగా ఛార్జ్‌షీట్ వేయలేదు కాబట్టి మాండేటరీ బెయిల్ కోసం ఈ ఇద్దరు కోర్టును అభ్యర్థించారు. ఇక.. ఇప్పటికే ఈ కేసులో రెండుసార్లు పోలీసులు దాఖలు చేసిన ఛార్జ్‌షీట్‌ను కోర్టు వెనక్కి తతిప్పి పంపింది. అయితే.. ఎవిడెన్స్ మెటీరియల్‌గా స్వాధీనం చేసుకున్న హార్డ్ డిస్కులు, సీడీలు, పెన్‌డ్రైవ్‌లను పోలీసులు కోర్టుకు సమర్పించారు. వీటితో మూడోసారి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. ఈ ఆధారలను నిందితులకు తెలియకుండా రహస్యంగా ఉంచాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్, కోర్టును కోరారు.
Comments
Please login to add a commentAdd a comment