ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: ప్రభాకర్‌రావు అరెస్ట్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ | Sakshi
Sakshi News home page

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు: ప్రభాకర్‌రావు అరెస్ట్‌కు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌

Published Fri, May 10 2024 5:04 PM

Warrant Issued For Arrest Of Prabhakar Rao In Phone Tapping Case

సాక్షి, హైదరాబాద్‌: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావును అరెస్టు చేసేందుకు నాంపల్లి కోర్టు నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌ జారీ చేసింది. అరెస్టు వారెంట్ జారీ చేయాలని పోలీసులు పిటిషన్‌ దాఖలు చేయగా, దీనిపై విచారణ చేపట్టిన కోర్టు అందుకు అనుమతిస్తూ ఆదేశాలు జారీ చేసింది.

కాగా, ఈ కేసులో ప్రధాన సూత్రధారిగా ప్రభాకర్‌రావును దర్యాప్తు బృందం గుర్తించిన సంగతి తెలిసిందే. ప్రభాకర్‌రావుకు రెడ్‌ కార్నర్‌ నోటిసు జారీపై కోర్టులో వాదనలు జరగ్గా తన వాదనలను అఫిడవిట్‌ ద్వారా ప్రభాకర్‌రావు వివరించారు. తాను అప్పటి డీజీపీలు, ఇంటెలిజెన్స్‌ చీఫ్‌ల పర్యవేక్షణలో పనిచేశానన్నారు.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రభాకర్‌ రావుతో పాటుగా మరో ప్రైవేటు వ్యక్తిని కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. ఇక, ప్రభాకర్‌ రావుతో పాటుగా సదరు ప్రైవేటు వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడని పోలీసులు తెలిపారు. ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారమంతా ప్రభాకర్‌ రావు కనుసన్నల్లోనే జరిగిందని పోలీసులు తేల్చారు.

మరోవైపు.. ఎస్‌ఐబీలో హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేయడంలో ‍కూడా ప్రభాకర్‌ రావే ప్రధాని సూత్రధారి అని పోలీసులు వెల్లడించారు. ప్రభాకర్‌ రావు ఆదేశాల మేరకే ప్రణీత్‌ రావు హార్డ్‌ డిస్క్‌లను ధ్వంసం చేసినట్టు పోలీసులు నిర్ధారించారు. అలాగే, ప్రభాకర్‌ రావు చెప్పిన నంబర్లను ప్రణీత్‌ రావు ట్యాపింగ్‌ చేసినట్టు చెప్పారు. ఇక, ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభాకర్‌ రావు అమెరికాకు వెళ్లిపోయారని  అన్నారు. ఇదిలా ఉండగా.. ఈ కేసులో ఇప్పటికే ప్రభాకర్‌ రావుకు పోలీసులు లుక్‌ అవుట్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 

 

 

 

Advertisement
 
Advertisement
 
Advertisement