
ప్రయాణికుల ఆదరణ పొందే దిశగా ఆర్టీసీ ప్రణాళికలు
అందుబాటులో నెలవారీ పాస్‌లు సైతం..
తెలంగాణ ఆర్టీసీ పుష్పక్ బస్సుల్లో రూట్‌పాస్‌లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ (Hyderabad) నగరంలో ఎక్కడి నుంచైనా ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నెలవారీ పాస్‌లు ఉన్నాయి. అలాగే కొన్ని నిర్దిష్టమైన మార్గాల్లో మాత్రమే ప్రయాణం చేసేందుకు అనుగుణంగా రూట్‌పాస్‌లు దోహదం చేస్తాయి. ఎయిర్‌పోర్ట్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవచ్చు.
53 పుష్పక్ సర్వీసులు..
ప్రస్తుతం వివిధ ప్రాంతాల నుంచి ప్రతిరోజూ 53 పుష్పక్ ఏసీ బస్సులు (AC Buses) ఎయిర్‌పోర్టుకు నడుస్తున్నాయి. 24 గంటల పాటు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్‌పోర్టు ప్రయాణికుల కోసం వీటిని నడుపుతున్న సంగతి తెలిసిందే. కానీ ఎయిర్‌పోర్టు (Airport) నుంచి నగరంలోకి వచ్చే బస్సులకు లభించినట్లు నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు వెళ్లే సర్వీసులను ప్రయాణికులు ఆదరించడం లేదు. దీంతో పుష్పక్ ఆక్యుపెన్సీ 60 శాతానికే పరిమితమవుతోంది.
ప్రతిరోజూ సుమారు 55 వేల మంది డొమెస్టిక్ ప్రయాణికులు, మరో 15 వేల మంది అంతర్జాతీయ ప్రయాణికులు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తున్నారు. ఈ ప్రయాణికుల కోసం ఆర్టీసీ ఎంతో ప్రతిష్టాత్మకంగా పుష్పక్‌లను నడుపుతున్నప్పటికీ ఆదరణ తక్కువగానే ఉంది. దీంతో వివిధ మార్గాల్లో ఆదాయాన్ని పెంచుకొనేందుకు ఆర్టీసీ (RTC) ప్రణాళికలు రూపొందిస్తోంది.
నాలుగు రూట్లలో..
సుమారు 12 వేల మందికి పైగా ఉద్యోగులు ఎయిర్‌పోర్టులో పనిచేస్తున్నట్లు అంచనా. నగరంలోని పలు ప్రాంతాల్లో ఉంటున్న ఈ ఉద్యోగులంతా వివిధ మార్గాల్లో ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగిస్తున్నారు. వీరిని ఆకట్టుకొనేందుకు ఆర్టీసీ రూట్ పాస్‌లను అందుబాటులోకి తెచ్చింది. ప్రయాణికులు నెలవారీ పాస్‌లతో పాటు తమ అవసరాలకు అనుగుణంగా ఈ నాలుగు మార్గాల్లో రూట్‌పాస్‌లను తీసుకోవచ్చు.
చదవండి: హైదరాబాద్ పరిధిలో పాతాళానికి భూగర్భ జలాలు
రూట్‌పాస్‌లు ఇలా..
నగరంలో ఎక్కడి నుంచైనా ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేందుకు నెలవారీ పాస్ రూ.5,260
శంషాబాద్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు రూ.2,110
ఆరాంఘర్, బాలాపూర్ నుంచి ఎయిర్‌పోర్టుకు రూ.3,160
ఎల్బీనగర్, గచ్చిబౌలి నుంచి ఎయిర్‌పోర్టుకు రూ.4,210