
10 నుంచి 23 మీటర్ల లోతుకు నీటిమట్టం..
రోజువారీ అవసరాలకు నీరు అందుబాటులో లేని పరిస్థితి
నగరవాసులకు నీటి ఎద్దడితో అవస్థ
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో భూగర్భ జలాలు రోజురోజుకూ పాతాళానికి చేరుకుంటున్నాయి. వేసవి నేపథ్యంలో పరిస్థితి మరింత ప్రమాదకరంగా మారుతోంది. నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. మహా హైదరాబాద్ (Hyderabad) శరవేగంగా విస్తరిస్తూ కాంక్రీట్ జంగిల్‌గా మారుతుండటమే ఈ దుస్థితికి ప్రధాన కారణమని పర్యావరణ వేత్తలు అంటున్నారు. మరోవైపు వర్షపునీరు, ఆయా అవసరాలకు వినియోగించిన నీరు భూమిలోకి ఇంకే పరిస్థితి లేదు.
ఎండలు ముదురుతుండటంతో భూగర్భజలాల మట్టం (Ground Water Level) రోజురోజుకూ లోతుకు పడిపోతోంది. కేవలం రెండు నెలల వ్యధిలోనే 10 నుంచి 23 మీటర్ల లోతుకు నీటిమట్టం పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. ముఖ్యంగా శేరిలింగంపల్లి, అమీర్‌పేట్, సరూర్‌నగర్, మారేడుపల్లి మండలాల్లో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోతున్నాయి. ఫలితంగా ఆ ప్రాంతాల్లో రోజువారీ అవసరాలకు నీరు అందుబాటులో లేని పరిస్థితి నెలకొంది. దీంతో నగరవాసులు నీటి ఎద్దడితో అవస్థ పడుతున్నారు.
శివారులో మరింత...
కోర్‌సిటీ (Core City) కంటే శివారు ప్రాంతాల్లోనే భూగర్భనీటి మట్టం మరింత కిందికి దిగజారుతోంది. ఒకప్పటి శివారు ప్రాంతాలన్నీ ఇప్పుడు నగరంలో అంతర్భాగమయ్యాయి. పంట భూములన్నీ రియల్ ఎస్టేట్ (Real Estate) వెంచర్లుగా మారగా, చెరువులు, కుంటలు దాదాపు కనుమరుగయ్యాయి. భారీ నిర్మాణాలు జరుగుతుండటంతో బోరు బావుల తవ్వకాలు బాగా పెరిగాయి. వర్షాకాలంలో సమృద్ధిగా వర్షాలు పడినప్పటికీ భూమిలోకి నీరు ఇంకకపోవడం, చెరువులు, కుంటలు మాయమవడంతో భూగర్భ జలాలు అడుగంటాయి.
మూడు నెలల నుంచే...
వర్షకాలంలో పడిన వర్షాలతో ఈ ఏడాది జనవరి వరకు ఆశాజనకంగా కన్పించిన భూగర్భ జలాలు ఆ తర్వాత దిగువకు పడిపోవడం గమనార్హం. హైదరాబాద్ పరిధిలో ఏప్రిల్ నాటికి సగటున 10.10 మీటర్ల నుంచి 20 మీటర్ల వరకు భూగర్భజలాల నీటిమట్టాలు దిగువకు పడిపోయాయి. గత రెండేళ్లలో భూగర్భజలాల నీటిమట్టం పరిస్ధితి పరిశీలిస్తే పాతబస్తీలో సగటున 7.91 మీటర్లు, సికింద్రాబాద్ డివిజన్‌లో 12.30 మీటర్లకు నీటిమట్టం పడిపోయింది. రంగారెడ్డి జిల్లా (Rangareddy District) పరిధిలో 15 నుంచి 18 మీటర్ల వరకు, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాల్లో 13.42 మీటర్లకు దిగువకు పడిపోయాయి.
