Ground water level
-
170 మండలాల్లో కరువు ఛాయలు 'భూగర్భ శోకం'
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి పతనమయ్యాయి. గత దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంతగా 170 మండలాల్లో కరువు పరిస్థితులు గోచరిస్తున్నాయి. బోరుబావుల్లో నీళ్లు అడుగంటడంతో లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే దుర్భర పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పంటలను ఎలా కాపాడుకోవాలో తెలియక రైతన్నలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. గతేడాది ఫిబ్రవరిలో 7.34 మీటర్లు (24.08 అడుగులు) ఉన్న రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టాలు ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి 8.7 మీటర్ల (28.54 అడుగులు)కు పడిపోవడమే అందుకు కారణం. గతేడాది ఫిబ్రవరితో పోలిస్తే ఈ ఏడాది ఫిబ్రవరిలో ఏకంగా 1.36 మీటర్ల (4.46 అడుగుల) మేర భూగర్భ జలాలు పడిపోయాయి. ముఖ్యంగా గత జనవరిలో 7.72 మీటర్లు ఉన్న భూగర్భ జలాలు నెల వ్యవధిలోనే ఒక మీటర్ మేర క్షీణించి 8.7 మీటర్లకు చేరాయి. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో గత నెలలో ఉన్న భూగర్భ జలాల స్థితిగతులపై భూగర్భజల శాఖ రూపొందించిన నివేదికలో ఈ ఆందోళనకర అంశాలు వెలుగుచూశాయి. రాష్ట్రవ్యాప్తంగా ఏర్పాటు చేసిన 1,718 పీజోమీటర్ల ద్వారా భూగర్భ జలాల స్థితిగతులను ఆ శాఖ ప్రతి నెలా సమీక్షించి మరుసటి నెలలో నివేదికలను విడుదల చేస్తోంది. 11 జిల్లాల్లో 10 మీటర్ల కంటే ఎక్కువ... జిల్లా స్థాయిల్లో భూగర్భ జలమట్టాలను 0–5 మీటర్లు, 5–10 మీటర్లు, 10 మీటర్లకుపైన అనే కేటగిరీలుగా భూగర్భజలశాఖ వర్గీకరించింది. దీని ప్రకారం రాష్ట్రంలో అత్యంత ప్రమాదకర స్థాయిలో వికారాబాద్ జిల్లాలో 13.07 మీటర్ల (42.8 అడుగులు)కు భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. మొత్తం 33 జిల్లాలకుగాను కేవలం జగిత్యాల జిల్లా 4.93 మీటర్ల (16.17 అడుగులు) భూగర్భ జలమట్టంతో 0–5 మీటర్ల కేటగిరీలో నిలిచింది. అంటే ఈ ఒక్క జిల్లాలోనే భూగర్భ జలాలు సురక్షిత స్థాయిలో ఉన్నట్లు దీని ద్వారా అర్థం అవుతోంది. 21 జిల్లాల్లో 5–10 మీటర్ల మధ్యన, మరో 11 జిల్లాల్లో 10 మీటర్లకన్నా ఎక్కువగానే భూగర్భ జలమట్టాలు తగ్గిపోయాయి. భూగర్భ జలమట్టం 10 మీటర్లకు (32.8 అడుగులు)పైనే పడిపోతే పరిస్థితులు ఆందోళనకరంగా ఉన్నట్లు భావిస్తారు. 30 జిల్లాల్లో క్షీణత నమోదు.. గతేడాది ఫిబ్రవరితో పోల్చితే ఈ ఏడాది ఫిబ్రవరిలో 30 జిల్లాల్లోని భూగర్భ జలమట్టాల్లో క్షీణత నమోదైంది. నాటితో పోలిస్తే ప్రస్తుత భూగర్భ జలమట్టాల్లో 0.15 మీటర్ల నుంచి 3.91 మీటర్ల వరకు వ్యత్యాసం కనిపించింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 3.91 మీటర్ల వ్యత్యాసం కనిపించింది. గతేడాది ఫిబ్రవరిలో నల్లగొండ జిల్లాలో భూగర్భ జలమట్టం 6.15 మీటర్లు ఉండగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.06 మీటర్లకు పడిపోయింది. కృష్ణా బేసిన్‌లోని శ్రీశైలం, నాగార్జునసాగర్ జలాశయాల్లో నీటి నిల్వలు అడుగంటిపోవడంతో నల్లగొండ జిల్లాపై తీవ్ర దుష్ప్రభావం పడినట్టు ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ జిల్లాల్లో అత్యంత ప్రమాదకరం.. సిద్దిపేట, నల్లగొండ, నాగర్‌కర్నూల్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లోని దక్షిణాది ప్రాంతాలు, వికారాబాద్ జిల్లాలోని దక్షిణమధ్య, ఉత్తరాది ప్రాంతాలు, కామారెడ్డి, భూపాలపల్లి జిల్లాల్లోని మధ్య, ఉత్తరాది ప్రాంతాలు, భద్రాద్రి జిల్లాలోని ఆగ్నేయా ప్రాంతాల్లో అత్యంత ప్రమాదకర స్థాయిల్లోకి భూగర్భ జలమట్టాలు పడిపోయాయి. ఈ జిల్లాల్లో భూగర్భ జలమట్టాలు 15–20 మీటర్ల మోస్తారు లోతు (మోడరేట్లీ డీప్), 20 మీటర్లకుపైన తీవ్ర లోతు (వెరీ డీప్)ల్లో ఉన్నట్టు నిర్ధారించారు. రాష్ట్ర భూభాగంలో 8 శాతం ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితే నెలకొంది. 24 శాతం ప్రాంతం పరిధిలో 10–15 మీటర్లు, 53 శాతం ప్రాంతం పరిధిలో 5–10 మీటర్లు, 15 శాతం ప్రాంతం పరిధిలో 5 మీటర్ల కంటే తక్కువగా భూగర్భ జలమట్టాలు నమోదయ్యాయి. 170 మండలాల్లో దశాబ్ద కాల కరువు... రాష్ట్రంలోని మొత్తం 612 మండలాలను గత దశాబ్ద కాల (2014–2023) సగటు భూగర్భ జలమట్టాలతో పోల్చినప్పుడు ఫిబ్రవరిలో 170 (28%) మండలాల్లో భూగర్భ జలమట్టాలు 0.01 మీటర్ల నుంచి 17.08 మీటర్ల వరకు క్షీణించాయి. గత దశాబ్ద కాలంతో పోల్చినప్పుడు 442 (72%) మండలాల్లో మాత్రం నామమాత్ర స్థాయి నుంచి 15.52 మీటర్ల వరకు వృద్ధి చెందాయి. అంటే రాష్ట్రంలోని 170 మండలాల్లో గత దశాబ్దకాలంలో లేని కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. -
వరిసాగు పైపైకి.. పప్పు ధాన్యాలు కిందకి
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ఈ ఏడాది విస్తారంగా కురిసిన వర్షాలు, పెరిగిన భూగర్భ జలాల లభ్యత కారణంగా వరి సాగు విస్తీర్ణం పెరుగుతోంది. గత ఏడాది ఖరీఫ్‌లో వరిసాగు దేశ వ్యాప్తంగా 3.45 కోట్ల హెక్టార్లుగా ఉంటే ఈ ఏడాది అది 15 లక్షల హెక్టార్లు (4 శాతం) మేర పెరిగి 3.60 కోట్ల హెక్టార్లకు చేరిందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. అయితే ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు మాత్రం 6 శాతం మేర తగ్గింది. గత ఏడాది మొత్తంగా పప్పుధాన్యాల సాగు 1.26 కోట్ల హెక్టార్ల మేర ఉంటే అది ఈ ఏడాది 12 లక్షల హెక్టార్ల మేర తగ్గి 1.14 కోట్ల హెక్టార్లకు పరిమితం అయ్యిందని వివరించింది. ముఖ్యంగా కందుల సాగు బాగా తగ్గిందని వెల్లడించింది. -
విశాఖ జిల్లా వాసులకు శుభవార్త : పెరిగిన భూగర్భ జలాలు
సాక్షి, విశాఖపట్నం: ఎండలు మండుతున్న వేళ విశాఖ జిల్లాలోని భూగర్భ జలాలు ఊరటనిస్తున్నాయి. ఇవి అందుబాటులో ఉంటూ జనానికి ఉపశమనం కలిగిస్తున్నాయి. సాధారణంగా వేసవిలో భూగర్భ జలాలు అడుగంటుతుంటాయి. తాగునీటికి ఇబ్బందులు ఎదురవుతాయి. కానీ ప్రస్తుతం ఈ ఏడాది సమ్మర్లో ఆ పరిస్థితి లేదు. నీటి మట్టాలు ఆశాజనకంగానే ఉంటున్నాయి. భూగర్భ జల వనరులు, జలగణన శాఖ తరచూ నీటి మట్టాలను పరిశీలిస్తుంది. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పీజోమీటర్ల ద్వారా వాటి స్థాయిలను ఎప్పటికప్పుడు తెలుసుకుంటుంది. భూగర్భ శాఖ జిల్లాలో నమోదు చేసిన వివరాల ప్రకారం మార్చి ఆఖరి వరకు భీమిలి మండలం చుక్కవానిపాలెంలో భూగర్భ జలాలు అత్యంత పైన అంటే మూడు మీటర్లకంటే తక్కువ లోతులోనే లభ్యమవుతున్నాయి. ఎండాడ ప్రాంతంలో అత్యంత దిగువన అంటే 19.35 మీటర్ల లోతు వరకు లభ్యం కావడం లేదు. 0–3 మీటర్ల మధ్య చుక్కవానిపాలెంతో పాటు చిప్పాడ, పాలవలస, నరవ ప్రాంతాల్లో భూగర్భ జలాలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 3–10 మీటర్ల మధ్య నీటి లభ్యత పందలపాక, శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, నగరంపాలెం, అగనంపూడి, బీహెచ్‌పీవీ, గొల్లలపాలెం, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, పాండ్రంగి, టి.దేవాడ, స్టీల్‌ప్లాంట్, అప్పుఘర్, విశాలాక్షినగర్, పాండురంగాపురం, మధురవాడ, మారికవలస, తాటిచెట్లపాలెం ప్రాంతాలున్నాయి. కణితి కాలనీ, పెందుర్తి, ఆరిలోవ, పెద్ద రుషికొండ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్కు ప్రాంతాలు 10–20 మీటర్ల లోతులో నీటిమట్టాలున్నాయి. హెచ్చుతగ్గులు ఇలా.. మార్చి నెలలో విశాఖ జిల్లాలో సగటు నీటిమట్టం 7.48 మీటర్లుగా ఉంది. గత ఏడాది మార్చిలో 6.82 మీటర్లలో ఉండేది. గత మార్చితో పోల్చుకుంటే స్వల్పంగా 0.66 మీటర్ల దిగువకు వెళ్లినట్టయింది. గత సంవత్సరం మార్చితో భూగర్భ జలాల పరిస్థితిని పరిశీలిస్తే మొత్తం 31 పీజోమీటర్లకు గాను 14 చోట్ల పెరగ్గా, 17 చోట్ల దిగువకు వెళ్లాయి. వీటిలో శొంఠ్యాం, వెల్లంకి, భీమిలి, చుక్కవానిపాలెం, నగరంపాలెం, గొల్లలపాలెం, కణితి కాలనీ, పాండ్రంగి, పాలవలస, టి.దేవాడ, నరవ, పెందుర్తి, స్టీల్‌ప్లాంట్, మారికవలస ప్రాంతాల్లో నీటిమట్టాల స్థాయి పెరుగుదల కనిపించింది. అలాగే పందలపాక, చిప్పాడ, అగనంపూడి, బీహెచ్‌పీవీ, గోపాలపట్నం, అనంతవరం, ఐనాడ, ఏపీటీడీసీ, ఆరిలోవ, బీవీకే కాలేజీ, యోగా విలేజీ, పెద్ద రుషికొండ, ఎండాడ, మధురవాడ, ఏపీఎస్ఐడీసీ, శివాజీపాలెం, వైఎస్సార్ పార్క్ ప్రాంతాల్లో భూగర్భ జలాలు దిగువకు వెళ్లాయి. జిల్లా మొత్తమ్మీద 20 మీటర్లకంటే దిగువన నీటిమట్టాలున్న ప్రాంతాలు ఒక్కటీ లేకపోవడం విశేషం! భూగర్భ జలాల సంరక్షణ అవసరం భూగర్భ జలాలనూ అందరూ బాధ్యతగా సంరక్షించుకోవాలి. వర్షం నీరు వృథాగా పోకుండా ఇళ్ల వద్ద ఇంకుడు గుంతలు వంటి వాటిని ఏర్పాటు చేసుకోవాలి. దీనివల్ల వేసవిలో భూగర్భ జలాలు అందుబాటులో ఉంటూ నీటి ఎద్దడికి ఆస్కారం ఉండదు. ప్రస్తుతం జిల్లాలో భూగర్భ జలాల పరిస్థితి ఆశాజనకంగా ఉంది. – లక్ష్మణరావు, జిల్లా భూగర్భ జల శాఖాధికారి సగటు భూగర్భ జలాల లభ్యత మండలాల వివరాలు ఇలా.. 3 నుంచి 8 మీటర్ల లోపలే ఆనందపురం, భీమిలి, గాజువాక, ములగాడ, పద్మనాభం, పెందుర్తి, గోపాలపట్నం, పెదగంట్యాడ 8 నుంచి 20 మీటర్ల లోపు మహారాణిపేట, సీతమ్మధార విశాఖపట్నం రూరల్ -
అడుగంటిపోతున్న భూగర్భ జలాలు.. భవిష్యత్తులో పరిస్థితి అంతే!
సాక్షి, రంగారెడ్డి: భూగర్భజలాలు పాతాళానికి పడిపోయాయి. పగటి ఉష్ణోగ్రతలకు తోడు కాలువల నుంచి నీటి ప్రవాహం లేకపోవడం, సామర్థ్యానికి మించి బోరు తవ్వకాలు జరుపుతుండటం, ఎడాపెడా తోడేస్తుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. సాధారణంగా సెప్టెంబర్–అక్టోబర్ నెలల్లో జిల్లాలోని మెజార్టీ ప్రాంతాల్లో మూడు మీటర్ల లోతునే నీటి ఆనవాళ్లు ఉండగా.. ప్రస్తుతం పది మీటర్లు దాటినా కనిపించడం లేదు. భూ పొరల్లో నీరు లేకపోవడంతో వ్యవసాయ బోర్లు పని చేయడం లేదు. బావులు, చెరువుల కింద వరి, ఇతర పంటలు నీరు లేక ఎండిపోతున్నాయి. పట్టణ ప్రాంతాల్లో వేగంగా.. జిల్లాలో 68 ఫిజో మీటర్లు ఉన్నాయి. 2022 మార్చిలో జిల్లా వ్యాప్తంగా సగటు భూగర్భ నీటి మట్టం స్థాయి 8.60 మీటర్లు ఉండగా, 2023 మార్చి నాటికి 8.89 మీటర్ల లోతుకు పడిపోయింది. గత ఏడాదితో పోలిస్తే ఈసారి కొత్తగా తొమ్మిది మండలాల్లో నీటి లభ్యత మెరుగుపడగా, మరో 18 మండలాల్లో భూగర్భ జలమట్టం పాతాళానికి పడిపోయింది. మారుమూల గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే నగరానికి సమీపంలో ఉన్న పట్టణ ప్రాంతాల్లోనే భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. వీటికి సమీపంలో కొత్తగా అనేక కాలనీలు, గేటెడ్ కమ్యూనిటీలు, భారీ బహుళ అంతస్తుల నిర్మాణాలు వెలుస్తున్నాయి. నిర్మాణ సమయంలోనే కాదు ఆ తర్వాత కూడా అపార్ట్‌మెంట్‌వాసులు, వాణిజ్య సముదాయాలు భూగర్భజాలాలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. హయత్‌నగర్, అబ్దుల్లాపూర్‌మెట్, సరూర్‌నగర్, రాజేంద్రనగర్, శంషాబాద్, శేరిలింగంపల్లి మండలాల పరిధిలో ఈ సమస్య తీవ్రంగా ఉంది. చెరువులు, కుంటలు, లోతట్టు ప్రాంతాల్లో వంద ఫీట్లలోపే నీరు సమృద్ధిగా లభిస్తుండగా, మరికొన్ని కొన్ని ప్రాంతాల్లో వెయ్యి ఫీట్లకుపైగా లోతు బోర్లు తవ్వుతున్నారు. అయినా చుక్క నీరు కూడా లభించని పరిస్థితి నెలకొంది. వేగంగా పడిపోతున్నాయి గ్రామీణ ప్రాంతాలతో పోలిస్తే పట్టణాల్లోనే నీటి వాడకం అధికంగా ఉంది. చెరువులు, కుంటలు కూడా చాలా తక్కువ. దీంతో ఆయా ప్రాంతాల్లో వేగంగా నీటి మట్టాలు పడిపోతున్నాయి. వాల్టా చట్టం ప్రకారం 350 నుంచి 400 ఫీట్ల లోతు వరకు బోరు తవ్వుకునేందుకు అనుమతి ఉంది. కానీ చాలామంది అనుమతి పొందకుండా నిపుణుల సూచనలు పాటించకుండా 1000 నుంచి 1,200 ఫీట్లు తవ్వుతున్నారు. పట్టణ ప్రాంతాల్లో భూగర్భ నీటిమట్టం స్థాయి మరింత లోతుకు పడిపోతుండటానికి ఇదే ప్రధాన కారణం. నిర్మాణ సమయంలో ప్రతి ఒక్కరూ తమ ఇంటి ముందు ఇంకుడు గుంత ఏర్పాటు చేసుకోవడం, వ్యవసాయ బావుల వద్ద పొలాల్లో చెక్‌డ్యాంలు, వాన నీటి సంరక్షణ చర్యలు చేపట్టడం ద్వారా భూగర్భ జలాలను కాపాడుకోవచ్చు. లేదంటే భవిష్యత్తులో నష్టాలు చవి చూడక తప్పని పరిస్థితి. -
సమృద్ధిగా భూగర్భ జలాలు
ఆకివీడు: గోదావరి నది, కృష్ణా నదులకు శివారు ప్రాంతంగా ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో గత మూడేళ్లుగా భూగర్భ జలాలు సమృద్ధిగానే ఉన్నాయి. భూమికి రెండు మూడు అడుగుల నుంచి 100 అడుగుల వరకూ నీటి మట్టం ఉంది. 2020, 2021, 2022 సంవత్సరాల్లో వర్షాలు అధికంగా కురిశాయి. ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురువడంతో లక్షలాది క్యూసెక్కుల నీరు పొంగి ప్రవహించింది. భూగర్భ జలాల నీటి మట్టం పెరుగుతూ వచ్చింది. ఈ ఏడాది చివరి నాటికి వర్షాలు, వాయుగుడం ప్రభావం, తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిస్తే మే నెలలో కూడా నీటి మట్టం యథావిధిగా ఉండే అవకాశం ఉందని భూగర్భజలవనరుల శాఖ చెబుతోంది. గతేడాది ఉమ్మడి జిల్లాలో 17.12 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. ఈ ఏడాది ఏలూరు జిల్లా పరిధిలో 16.73 మీటర్ల సరాసరి నీటి మట్టం ఉంది. అధిక వర్షాలతో నీటి మట్టం నిలకడగా ఉంది. ఈ ఏడాది ఏలూరు జిల్లా పరిధిలో ఆగస్టు నెలలో సరాసరి నీటి మట్టం 20.53 మీటర్లు, సెప్టెంబర్‌లో 19.12, అక్టోబర్‌లో 16.73, నవంబర్‌లో 14.09 మీటర్లు నీటిమట్టం పెరుగుతూ వచ్చింది. పశ్చిమ గోదావరి జిల్లాలో నీటి మట్టాలు గత ఏడాది కన్నా పెరుగుతూనే ఉన్నాయి. జిల్లాలోని 19 మండలాల్లో భూగర్భ జలాల లోతును పరీక్షిస్తే కాళ్ల మండలంలో నీటి మట్టం భాగా అడుగుకు ఉంది. సముద్ర తీర ప్రాంతం, ఉప్పుటేరుకు చేర్చి మండలం ఉన్నప్పటికీ భూమి పొరలలో నీటి చేరిక అంతంత మాత్రంగానే ఉందని చెబుతున్నారు. గత మూడు నెలల పరీక్షా ఫలితాల్లో నీటి మట్టం సరాసరిన ఆగస్టులో 26.5, సెప్టెంబర్ నెలలో 26.19, అక్టోబర్ నెలలో 27.72 మీటర్లుంది. ఇవే నెలలో నీటి మట్టం బాగాపైకి ఉన్న మండలాల్లో ఆగస్టులో ఆకివీడు మండలం 0.25, సెప్టెంబర్‌లో ఆకివీడు మండలంలో 1.5 మీటర్లు, అక్టోబర్‌లో ఉండి మండలంలో 0.45 మీటర్ల నీటి మట్టం ఉంది. మార్చి నెల వరకు నీటి మట్టాలు సరాసరి ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉంది. నిండు కుండలా కొల్లేరు సరస్సు ప్రపంచ ప్రసిద్ది గాంచిన కొల్లేరు సరస్సు ఉనికిని కోల్పోయే విధంగా గత రెండు దశాబ్ధాలుగా బీడు పడి, నెరలు దీసి ఉంది. సుమారు 75 వేల ఎకరాల్లో ఉన్న కొల్లేరు సరస్సులో నీటి మట్టం తగ్గిపోవడంతో వేలాది పక్షులు వలసలు పోయాయి. కొన్ని చనిపోయాయి. గత మూడేళ్లుగా ఉమ్మడి జిల్లాలోనూ, ఎగువ జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, వరదలకు కొల్లేరు నీటి మట్టం క్రమేపీ పెరుగుతూ వచ్చింది. ప్రస్తుతం మూడు, నాలుగు కాంటూర్ల పరిధిలో నీటి మట్టం 1.6 మీటర్ల నిలబడి ఉంది. సహజంగా సరస్సు నీటి మట్ట 1.2 మీటర్లు మాత్రమే ఉండేది. జూలై, ఆగస్టు నెలల్లో భారీ వర్షాలకు నీటి మట్టం భారీగా పెరిగింది. పెరిగిన నీటి మట్టం పశ్చిమగోదావరి జిల్లాలో సరాసరి భూగర్భ జలాలు సమృద్ధిగా ఉన్నాయి. కొన్ని మండలాల్లో రెండు మూడు అడుగుల లోతులో, మరి కొన్ని మండలాల్లో 70 నుంచి 90 అడుగుల లోతులో నీటి మట్టం ఉంది. భారీ వర్షాలకు ఈ ఏడాది భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. – కె.గంగాధరరావు, జిల్లా భూగర్భజల వనరుల శాఖ అధికారి, పశ్చిమగోదావరి జిల్లా, భీమవరం సరాసరి నీటి మట్టం 16.73 ఉమ్మడి జిల్లాలో గత మూడేళ్లలో నీటి మట్టం సరాసరి 16.73 ఉంది. వాటర్ లెవెల్స్ బాగా పెరిగాయి. ఆగస్టులో 20.53, సెప్టెంబర్‌లో 19.12, అక్టోబర్‌లో 16.73, నవంబర్‌లో 14.09 మీటర్లతో భూమి లెవిల్‌కు నీటిమట్టం పెరిగింది. – పీఎస్ విజయ్‌కుమార్, డీడీ, భూగర్భ జలవనరుల శాఖ, ఏలూరు జిల్లా -
గ్రామాల్లో పాతాళ గంగ.. ఇక తీరింది బెంగ
సాక్షి, అమరావతి: సమృద్ధిగా వర్షాలు కురవటం, ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ చర్యల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామాల్లో భూగర్భ జలసిరులు భారీగా పెరిగాయి. చుక్క నీరు కూడా లేకుండా వట్టిపోయిన పరిస్థితుల్లో.. బోర్లు వేయడానికి అనుమతులు నిషేధించిన 706 గ్రామాల్లో సైతం ఇప్పుడు కొత్త బోర్లు వేసుకునేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడ్డాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో 1,093 గ్రామాల్లో భూగర్భ జలాలు వట్టిపోగా.. తాజాగా ప్రకటించిన జాబితా ప్రకారం ఆ గ్రామాల సంఖ్య 387కు తగ్గింది. ఈ మేరకు రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది నోటిఫికేషన్ జారీ చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 387 గ్రామాల్లో భూగర్భ జలాలను అధిక మొత్తంలో వినియోగిస్తున్నట్టు (ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్)గా ప్రభుత్వం ప్రకటించింది. 8 జిల్లాల పరిధిలోని ఆయా గ్రామాల్లో వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల వినియోగంపై ఆంక్షలు అమలు చేయడంతో పాటు కొత్తగా బోర్ల తవ్వకంపై నిషేధాన్ని కొనసాగించాలని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. తదుపరి ఆదేశాలు జారీ చేసే వరకు ఆయా గ్రామాల్లో నిషేధాజ్ఞలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రెండేళ్ల క్రితం 1,093 గ్రామాల్లో.. 2016–17 ఆర్థిక సంవత్సరంలో అప్పటి భూగర్భ జల మట్టాల పరిస్థితి, గ్రామాలు, ప్రాంతాల వారీగా వాటి వినియోగం ఆధారంగా భూగర్భ జల శాఖ రాష్ట్ర వ్యాప్తంగా 1,093 గ్రామాలను ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్‌గా అప్పట్లో ప్రకటించింది. ఆ గ్రామాల్లో ఇప్పటివరకు వాల్టా చట్టం ప్రకారం భూగర్భ జలాల వినియోగంపై నియంత్రణతో పాటు కొత్తగా బోర్ల తవ్వకంపై నిషేధం అమలు చేస్తున్నారు. తాజాగా 2019–20 ఆర్థిక సంవత్సరం నాటి భూగర్భ జలాల పరిస్థితి, వినియోగం అంచనాలతో 387 గ్రామాలను ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్ కేటగిరీగా గుర్తించినట్టు భూగర్భ జల శాఖ డైరక్టర్ ఎ.వరప్రసాద్ ‘సాక్షి’కి తెలిపారు. రెండేళ్లుగా సమృద్ధి వర్షాలు కురవడంతో రాయలసీమ ప్రాంతంలోని పలు జిల్లాల్లో అంతకు ముందు ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్ కేటగిరీలో ఉన్న గ్రామాల్లో భూగర్భ జలాలు మెరుగుపడటంతో ఈ కేటగిరీ గ్రామాల సంఖ్యలో తగ్గుదల కనిపిస్తోందని ఆయన చెప్పారు. ఇటీవల కాలంలో భూగర్భ జల మట్టాలను భారీగా పెంచేందుకు ఉపాధి హామీ పథకం, వాటర్ షెడ్ పథకాల కింద పెద్దఎత్తున పనులు చేపట్టడంతో అన్ని ప్రాంతాలలో భూగర్భ జలాల్లో పెరుగుదల కనిపిస్తోందని అధికార వర్గాలు తెలిపాయి. ఓవర్ ఎక్స్‌ప్లాయిటెడ్ విలేజెస్ అంటే.. వర్షపు నీటితో పాటు వాగు, వంకల ద్వారా భూగర్భంలోకి ఇంకే నీటి పరిమాణం కంటే అధిక మొత్తంలో నీటిని వినియోగిస్తున్న పరిస్థితి ఉన్నప్పుడు ఆయా గ్రామాలను ఈ కేటగిరీ కింద చేరుస్తారు. ఈ మదింపు జరిగే సమయంలో రాష్ట్ర భూగర్భ జల శాఖ 11 ఇతర ప్రభుత్వ శాఖల నుంచి సమాచారం సేకరించి ఆయా గ్రామాల్లో అందుబాటులో ఉండే భూగర్భ జల మట్టం, వాటి వినియోగం తీరును అంచనా వేసి, ఈ జాబితాను ప్రకటిస్తుంది. రాష్ట్ర భూగర్భ జల శాఖ తయారు చేసే ఈ నివేదికను కేంద్ర జల వనరుల శాఖ ఆమోదం తర్వాతే అధికారికంగా ప్రకటిస్తారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా భూగర్భ జల శాఖ ఎప్పటికప్పుడు తాజా నివేదికలను వెల్లడిస్తుంటుంది. చదవండి: విజయనగరం యువత సంచలనం: యమా క్రేజీ.. ఫిల్మీమోజీ! -
ఒక్క క్లిక్‌తో భూగర్భజలాల లెక్కింపు తెలుసుకోవచ్చు
సాక్షి, మహబూబ్‌నగర్: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో భూగర్భజలాల లెక్కింపు సులభతరం కానున్నది. గతంలో నెలకు ఒకసారి ఆయా ప్రాంతాలకు వెళ్లి భూగర్భజల శాఖ అధికారులు జలమట్టాన్ని లెక్కించేవారు. ఇకపై అలా కాకుండా కార్యాలయం నుంచే ఒక్క క్లిక్ ద్వారా భూగర్భ జలమట్టాన్ని తెలుసుకునే వెసులుబాటు కలిగింది. ప్రతి ఆరు గంటలకోసారి లెక్కించేందుకు ప్రభుత్వం నూతన విధానానికి శ్రీకారం చుట్టింది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి జిల్లాలోని ఆరు ప్రాంతాల్లో భూగర్భ జలాలను కొలిచేందుకు డిజిటల్ వాటర్ లెవల్ రికార్డు (డీడబ్ల్యూఎల్ ఆర్)ను ఉపయోగించనున్నారు. తొలిసారిగా ఆరు ప్రాంతాల్లో ఈ విధానంతో భూగర్భ జలాలను కొలుస్తున్నారు. గతంలో నెలకోసారి.. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 25 ఫిజోమీటర్ల ద్వారా నీటి మట్టాన్ని నెలకోసారి కొలిచేవారు. అయితే జలాన్ని కొ లిచేందుకు జిల్లాను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసి ఫిజోమీటర్ల నుంచి డీడబ్ల్యూఎల్‌ఆర్‌ను ఉపయోగించి నీటిని కొలత వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలిసారి ఆరు ప్రాంతాల్లో ఈ విధానాన్ని అమలు చేస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ప్రతి ఆరు గంటలకోసారి భూగర్భ జలాలను లెక్కించడంతో అది నెట్వర్క్ ద్వారా సర్వర్‌కు అప్లోడ్ అవుతుంది. భూగర్భ జలమట్టంతో పాటు భూగర్భ పీడనం ఉష్ణోగ్రత, బారోమెట్రిక్ పీడనంను కొలుస్తారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు ప్రపంచ బ్యాంక్ సహకారంతో ఈ పథకాన్ని అమలు చేస్తోంది. కార్యాలయం నుంచే పర్యవేక్షణ.. కొత్త విధానంతో భూగర్భ జలమట్టాన్ని కార్యాలయంలో ఉండి వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. కొత్తగా ఏర్పాటు చేసిన డీడబ్ల్యూఎల్‌ఆర్ ద్వారా ప్రతి ఆరు గంటలకోసారి భూగర్భ జలాన్ని లెక్కిస్తారు. అధికారులు ఫిజియోమీటర్ వద్దకు వెళ్లి మానవాధారంగా నీటిని లెక్కించినప్పుడు ఆ ప్రాంతాల్లో బోరు నడవకపోతే ఒకలా లెక్క చూపుతుంది. అధికారులు వెళ్లిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో బోర్లు నడిస్తే భూగర్భ జలాలు తగ్గిపోయే అవకాశం ఉంది. చదవండి: కరోనా: ఆ కళ్లు మమ్మల్ని నిలదీస్తున్నాయి తాజా సాంకేతిక పరిజ్ఞానంతో ప్రతి ఆరు గంటలకోసారి ఫిజియోమీటర్ వద్ద ఎంత భూగర్భ జలస్థాయి పడిపోయిందన్నది తెలుసుకోవచ్చు. ఫిజయోమీటర్ల వద్ద కొత్త సాంకేతిక పరిజ్ఞానం కలిగిన డీడబ్ల్యూఎల్‌ఆర్‌ను ఏర్పాటు చేశారు. ఈ సాంకేతిక సాఫ్ట్‌వేర్‌కు ఫిజియోమీటర్ అనుసంధానమై ఉండటంతో ఫిజియోమీటర్ కేంద్రానికి వెళ్లి భూగర్భజల మట్టాన్ని లెక్కించాల్సిన అవసరం లేదు. ప్రతి ఆరు గంటలకు ఒకసారి వెబ్సైట్ దానంతట అదే భూగర్భజల మట్టాన్ని నమోదు చేసుకుంటుంది. ఆరు గంటలకోసారి తెలుసుకోవచ్చు నూతన విధానం ద్వారా ప్రతి ఆరు గంటలకు ఒకసారి భూగర్భ జల నీటిమట్టం సులభంగా తెలుసుకునే అవకాశం ఉంది. గతంలో నెలకు ఒకసారి ఫిజియోమీటర్ వద్దకు వెళ్లి కొలతలు తీసుకునే వాళ్లం. డీడబ్ల్యూఎల్‌ఆర్ ద్వారా నీటిమట్టం ప్రతి ఆరు గంటలకోసారి నేరుగా వెబ్‌సైట్‌కు నమోదవుతుంది. నీటి మట్టాల్లో ఏమైనా తేడాలు ఉన్నట్లు తెలియగానే స్థానికులను అప్రమత్తం చేసేందుకు వీలుంటుంది. – రాజేందర్‌కుమార్, భూగర్భ జలశాఖ అధికారి, మహబూబ్‌నగర్ జిల్లా ఆరు ప్రాంతాలు ఇవే ► మహబూబ్‌నగర్ అర్బన్ మండలం ఏనుగొండ ► గండీడ్ మండలంలో సల్కర్‌పేట ► భూత్పూర్ మండలం భూత్పూర్ ► నవాబుపేట మండలం నవాబుపేట ► మహబూబ్‌నగర్ రూరల్ మండలం కోడూర్ ► దేవరకద్ర మండలం దేవరకద్ర -
ఇక గంట గంటకూ పాతాళగంగ లెక్క
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : ఒక ప్రాంతంలో భూగర్భ జలమట్టం లెక్కించాలంటే భూగర్భజల శాఖ అధికారులు స్వయంగా ఆయా ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన పైజోమీటర్ల వద్దకు వెళ్లాల్సి ఉంటుంది. ప్రస్తుతం ప్రతి నెల 15వ తేదీ తర్వాత పైజోమీటర్ల వద్దకు వెళ్లి ఆ నెలలో నీటి మట్టం ఎంత పెరిగింది, ఎంత తగ్గిందనే వివరాలు రికార్డు చేస్తున్నారు. అయితే.. ఇకపై ఈ తిప్పలు తప్పను న్నాయి. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కార్యాలయంలో కూర్చునే ఆయా ప్రాంతాల్లో భూగర్భజల మట్టం ఏ స్థాయిలో ఉందో తెలుసుకునే వెసులు బాటు అందుబాటులోకి వచ్చింది. ప్రభుత్వం పైజోమీటర్లకు డిజిటల్ వాటర్ లెవల్ రికార్డర్ల (డీడబ్ల్యూఎల్‌ఆర్)ను అందుబాటులోకి తెచ్చింది. దీంతో ప్రతి గంటకు ఏ స్థాయిలో నీటి మట్టం ఉందో కూడా తెలుసుకునే వీలు కలిగింది. వెబ్‌సైట్‌తో అనుసంధానం : పైజోమీటర్లకు బిగించే డబ్ల్యూఎల్ఆర్లను ప్రత్యేక వెబ్‌సైట్‌తో అనుసంధానిస్తున్నారు. దీంతో ఈ వెబ్సైట్ ద్వారా అవసరం ఉన్న ప్రాంతాల్లోని పైజోమీటర్కు సంబంధించిన భూగర్భ నీటి మట్టం వివరాలను ఎప్పటికప్పుడు పొందవచ్చు. వీటి పనితీరుపై ఆ శాఖలో క్షేత్ర స్థాయిలో పనిచేస్తున్న హైడ్రాల జిస్టులు, జియాలజిస్టులకు శిక్షణ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు భూగర్భజల వనరులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టును అమలు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైజోమీటర్లలో కట్టుదిట్టమైన రక్షణ ఉన్న వాటికి డీడబ్ల్యూఎల్ఆర్లను అమర్చుతోంది. తొలి విడతలో రాష్ట్ర వ్యాప్తంగా 240 పైజోమీటర్లకు ఈ రికార్డర్లను అమర్చారు. రెండో విడతలో పెద్ద సంఖ్యలో ఈ రికార్డర్లను మంజూరు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనికోసం ఇప్పటికే అన్ని జిల్లాల నుంచి ప్రతిపాదనలు సైతం తీసుకున్నారు. ఒక్కో మండలానికి కనీసం రెండు చొప్పున రికార్డర్లను అమర్చాలని ప్రతిపాదనలు వెళ్లాయి. బోర్ల ద్వారా నీటి వాడకం తెలిసిపోతుంది డిజిటల్ వాటర్ లెవల్ రికార్డర్ల ద్వారా ఏఏ ప్రాంతాల్లో బోర్లు నడుస్తున్నాయనే సమాచారం సైతం అధికారులకు తెలిసిపోతుంది. ఈ సమాచారం అటు విద్యుత్‌శాఖకు కూడా ఉపయోగపడుతుంది. వారు విద్యుత్ సరఫరాను పర్యవేక్షించుకునేందుకు ఈ సమాచారం ఉపయుక్తంగా ఉంటుంది. పథకం పేరు : నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పైజోమీటర్లు : 966 డీడబ్ల్యూఎల్ఆర్లు అమర్చిన ఫీజోమీటర్లు : 240 -
వాన నీరు లోపలికి.. పాతాళ గంగ పైపైకి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో విస్తారంగా కురుస్తున్న వర్షాలు భూగర్భ జలాలకు కొత్త ఊపిరి పోస్తున్నాయి. ఓ పక్క ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలు.. మరోపక్క నిండుతున్న చెరువులు, ప్రాజెక్టులతో భూగర్భ జల మట్టం రికార్డు స్థాయిలో పైకి ఉబికి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా సగటు వర్షపాతం ఎక్కువగా నమోదు కావడం కన్నా.. ఎక్కువ కాలం నమోదవుతుండటం భూగర్భ మట్టాల్లో గణనీయ పెరుగుదలకు కారణమవుతోంది. రాష్ట్ర పరీవాహక ప్రాంతం, పెరిగిన నీటి మట్టాల ఆధారంగా జూన్, జూలై రెండు నెలల వ్యవధిలోనే 208 టీఎంసీల నీరు భూమిలో ఇంకిందని అంచనా వేస్తుండగా, ఆగస్టులో కూడా 200 టీఎంసీలు పెరిగే అవకాశముందని అంటున్నారు. వాన నీరు లోపలికి.. పాతాళ గంగ పైపైకి.. రాష్ట్రంలో జూన్ చివరలో, జూలైలో విస్తారంగా వర్షాలు కురిశాయి. జూలై నెలాఖరుకు సగటున 373.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదవ్వాల్సి ఉండగా, 439.8 మిల్లీమీటర్ల అధిక వర్షపాతం రికార్డయింది. 33 జిల్లాలకు గానూ 16 జిల్లాల్లో సాధారణం కంటే అధికంగా, 15 జిల్లాలో సాధారణ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. గతేడాది జూలైలో రాష్ట్ర సగటు భూగర్భ నీటిమట్టం 14.12 మీటర్లు ఉండగా, ఈ ఏడాది అది 9.26 మీటర్లకు చేరింది. ఏకంగా 4.86 మీటర్ల మేర భూగర్భం పైకి ఎగిసింది. జూన్, జూలైలో 40 రోజులకు పైగా వర్షాలు స్థిరంగా కురవడంతో భూగర్భ జలాలకు కలిసొచ్చింది. కురిసిన వర్షపాతంలో సగటున 10 శాతం నుంచి 11 శాతం నీరు భూగర్భానికి చేరుతుంది. రాష్ట్ర భూ విస్తీర్ణం, ప్రస్తుతం పెరిగిన భూగర్భ మట్టాల ఆధారంగా రెండు నెలల వ్యవధిలో 208 టీఎంసీల నీరు భూమిలోకి చేరిందని భూగర్భ జల శాఖ అంచనా వేసింది. ఇందులో ఒక్క జూలైలోనే 158 టీఎంసీల నీరు భూమిలోకి ఇంకిందని తెలిపింది. ఆగస్టులో ఈ 19 రోజులుగా కురిసిన వర్షాలతో మరో 200 టీఎంసీల నీరు భూగర్భంలోకి చేరే అవకాశం ఉందని అంటున్నారు. కలిసొచ్చిన కాళేశ్వర జలాలు, చెరువులు.. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు నిండిన చెరువులు, ప్రాజెక్టులు, కాళేశ్వరం ఎత్తిపోతలు భూగర్భ మట్టాల పెరుగుదలకు కారణమయ్యాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా గోదావరి బేసిన్లో 13,859 చెరువులు, కృష్ణా బేసిన్లో 5,904 చెరువులు కలిపి 19,763 చెరువులు మత్తడులు దుంకడం, రెండు బేసిన్లలో మరో 6,400 చెరువులు 75 శాతానికి పైగా, 4,800 చెరువులు 50 శాతానికి పైగా నిండటంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. ఇక కాళేశ్వరం జలాలు భూగర్భ మట్టాల పెరుగుదలకు వరంగా మారిందని భూగర్భ జల శాఖ తన జూలై నివేదికలో వెల్లడించింది. గతేడాది కాళేశ్వరం పరీవాహకంలో 602 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం పరిధిలోనే భూగర్భ జలాలపై ప్రభావం ఉండగా, ఈ ఏడాది జూలైలో 2,419 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణానికి పెరిగిందని తెలిపింది. ఈ ప్రభావంతో రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, భువనగిరితో పాటు నిజామాబాద్‌లోని కొంత ప్రాంతం, కామారెడ్డిలోని తూర్పు ప్రాంతాల్లో భూగర్భ మట్టాలు మెరుగయ్యాయని వెల్లడించింది. రాష్ట్ర విస్తీర్ణంలో 24 శాతం భూగర్భ మట్టం 5 మీటర్ల లోపలే ఉండగా, ఇందులో ఎక్కువగా ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వనపర్తి, నాగర్‌కర్నూల్, భద్రాద్రి, జగిత్యాల, ఖమ్మం, నల్లగొండ జిల్లాలోని ఎక్కువ ప్రాంతాలు ఉన్నాయని నివేదిక తెలిపింది. -
లోటు.. లోతు
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో వర్షాకాలంలోనూ భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. ఓవైపు వర్షపాతం లోటు.. మరోవైపు భూగర్భ జలాల వినియోగం అనూహ్యంగా పెరగడంతో పలు మండలాల్లో అథఃపాతాళానికి చేరుకున్నాయి. హైదరాబాద్ జిల్లాలో 5 మినహా మిగతా 11 మండలాల్లో సరాసరిన ఒకటి నుంచి రెండు మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గుముఖం పట్టగా... రంగారెడ్డి జిల్లా పరిధిలో మొత్తం 27 మండలాల్లోనూ సరాసరిన రెండు నుంచి నాలుగు మీటర్ల మేర భూగర్భ జలాలు తగ్గడం గమనార్హం. ఇక వర్షపాతం విషయానికి వస్తే జూన్ ఒకటి నుంచి సెప్టెంబర్ 8 మధ్య హైదరాబాద్ జిల్లా పరిధిలో 486.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 389.1 మిల్లీమీటర్ల వర్షపాతమే నమోదైంది. అంటే సాధారణం కంటే 20శాతం లోటు వర్షపాతం. ఇక రంగారెడ్డి జిల్లా పరిధిలో సాధారణంగా 411.9 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా... 355.6 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలోనూ 14శాతం లోటు వర్షపాతం నమోదవడం గమనార్హం. కారణాలెన్నో... వర్షకాలంలోనూ గ్రేటర్లో భూగర్భ జలాలు ఆశించిన స్థాయిలో పెరగలేదు. ఖైరతాబాద్, బండ్లగూడ, సైదాబాద్, అంబర్పేట్, ముషీరాబాద్ మినహా... మిగతా 11 మండలాల్లో భూగర్భ జలమట్టాలు గతేడాదితో పోలిస్తే తగ్గుముఖం పట్టాయి. ఇక రంగారెడ్డి జిల్లాలో మొత్తం 27 మండలాల్లో భూగర్భ జలాలు అథఃపాతాళంలోనే ఉండడం గమనార్హం. అరకొర వర్షపాతం, నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు చాలినన్ని లేకపోవడం, విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ అడుగంటుతోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకు పైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. నిబంధనలకు ‘నీళ్లు’ భూగర్భజలశాఖ నుంచి సాధ్యాసాధ్యల నివేదిక (ఫీజిబిలిటీ) అందిన తర్వాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్ పరిధిలో కాగితాలకే పరిమితమవుతోంది. ప్రధాన నగరంతో పాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకు పైగా బోరుబావులు తవ్వుతున్నా.. రెవెన్యూ శాఖ ప్రేక్షక పాత్రకే పరిమితమవుతోంది. ప్రధానంగా కుత్బుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్ మాఫియా... ఈ నీటిని అపార్ట్మెంట్లు, గేటెట్ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్ వాటర్ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటోంది. జలవిల... నగర జనాభా కోటి మార్కును దాటింది. సిటీలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలు కాగా.. బోరు బావులు 23 లక్షల మేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతల సంఖ్య 5 లక్షలకు మించలేదు. మరోవైపు నగరం కాంక్రీట్ జంగిల్‌గా మారడంతో వర్షపు నీరు నేల గర్భంలోకి ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భ జలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం భూగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు, కుంటలు లేక సుమారు 65శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భ జలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. ఇంకుడు గుంత ఉండాలిలా... ఇళ్లల్లో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు, 1.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25శాతం జాగాను 20ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీ ప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపు నీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ఉపయోగాలివీ... ఈ ఇంకుడు గుంతలో సీజన్లో సాధారణ వర్షపాతం (20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో... రోజుకు 1600 లీటర్ల నీటిని భూగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు రోజుల అవసరాలకు సరిపోవడం విశేషం. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జలబ్యాంక్ ఏర్పాటు చేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా మీకే కాదు.. మీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం.. జీవం అందజేసిన వారవుతారు. -
నిధులు ‘నీళ్ల’ధార
ఒకవైపు నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా నదులు... మరోవైపు సముద్రం. కానీ భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. సాధారణంగా చుట్టూ నీటి వనరులు ఉండటం వలన రీచార్జ్ కావాలి. కానీ జిల్లాలో పరిస్థితి దయనీయంగా ఉంది. జల సంరక్షణ పేరుతో గత ప్రభుత్వం చేసిన ఆర్భాటం అంతా ఇంతా కాదు. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది. జల సంరక్షణైతే కన్పించలేదు గాని నిధుల స్వాహా మాత్రం పెద్ద ఎత్తున జరిగింది. టీడీపీ నేతల జేబులు నిండాయే తప్ప జిల్లాలో భూగర్భ జలాలు పెరగలేదు. ఖర్చు పెట్టిన కొద్దీ భూగర్భ జలాలు మరింత అడుగంటిపోయాయి. దోపిడీకి చూపించిన శ్రద్ధ తగ్గిపోయిన భూగర్భ జలాలపై చూపలేదు. దీంతో పరిస్థితి ప్రమాదకరంగా మారింది. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: అభివృద్ధికి మూలం జలం అని చెప్పుకుని నాటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జల సంరక్షణ కోసం జిల్లాలో ఐదేళ్ల కాలంలో రూ.1026.19 కోట్ల వరకు ఖర్చు పెట్టారు. అనేక రకాల పథకాలు, కార్యక్రమాల పేరుతో పెద్ద ఎత్తున హడావుడి చేశారు. పనులు చేసినట్టు రికార్డుల్లో కూడా చూపించారు. కానీ జిల్లాలో భూగర్భ జలాలు పెరగలేదు సరికదా మరింత తగ్గిపోయాయి. దీంతో ప్రభుత్వ నిధులు నిరుపయోగమయ్యాయి. జల సంరక్షణ పనులు చేశాక కూడా భూగర్భ జలాలు మరింత దిగజారిపోయాయి. 2011 మే నాటికి 5.32 మీటర్ల లోతులో నీరు ఉండగా, 2015 మే నాటికి 5.88 మీటర్ల లోతుకు వెళ్లిపోయాయి. 2016 మే నాటికి 5.89 మీటర్ల లోతుకు చేరాయి. 2017మే నాటికైతే 6.82 మీటర్ల మరింత లోతుకు భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. 2018 మే నాటికి 6.05 మీటర్ల లోతుకు చేరగా, 2019 మే నాటికి 5.82 మీటర్ల లోతుకు వెళ్లాయి. 2018, 2019లో వరుసగా వచ్చిన తుపాన్లు కాసింత ప్రభావం చూపడంతో భూగర్భ జలాలు మరింత అడుగంటకుండా కాపాడాయి. నేతల ఆస్తులు పెరిగాయి... భూగర్భంలో నీళ్లు తగ్గాయి: జల సంరక్షణ పేరుతో పనుల పందేరానికి తెరలేపారు. నామినేటెడ్ ముసుగులో నిధులు దోచి పెట్టారు. నేతలు సిండికేట్‌గా మారి పనులు చేపట్టారు. రికార్డుల్లో అంతా జరిగినట్టు చూపించారు. నిధులు ఎంచెక్కా డ్రా చేసేసుకున్నారు. కానీ భూగర్భ జలాలు మాత్రం పెరగలేదు. జిల్లాలో నీరు చెట్టు అక్రమాలు ఏ స్థాయిలో జరిగాయో అందరికీ తెలుసు. నేతల మేతకు బాగా పనిచేసింది. చెరువుల తవ్వకాలు, రిటైనింగ్ వాల్, చెక్‌డ్యామ్‌లు, స్లూయిజ్... ఇలా రకరకాల కాంక్రీట్ పనుల రూపంలో పెద్ద ఎత్తున నిధుల స్వాహా చేశారు. చెరువు పనుల్లో మట్టి అమ్మకాల ద్వారా కోట్లాది రూపాయలు ఆర్జించారు. ఇక, కాంక్రీటు పనుల విషయానికొస్తే కొన్ని పనులు నాసిరకంగా, మరికొన్ని అసంపూర్తిగా చేపట్టిన దాఖలాలు ఉన్నాయి. కొన్నిచోట్లయితే పనులు చేపట్టకుండానే నిధులు డ్రా చేసిన సందర్భాలు ఉన్నాయి. మరికొన్నిచోట్లయితే పాత పనులకే పైపై మెరుగులు దిద్ది బిల్లులు చేసేసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇంకుడు గుంతలు, పంట సంజీవిని, కాంటూరు ట్రెంచెస్, రాక్‌ఫీల్డ్ డ్యామ్‌లు... తదితర కార్యక్రమాల పేరుతో ఇరిగేషన్, డ్వామా, అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పనులు చేపట్టారు. వాటికి వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. వీటిలో కూడా దాదాపు అక్రమాలు చోటు చేసుకున్నాయి. విజిలెన్స్ వరకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. విజిలెన్స్ విచారణలో కూడా అక్రమాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా నీరు చెట్టు పూర్తిగా దోపిడీకి గురైందని తేలింది. చెప్పాలంటే జల సంరక్షణ పేరుతో నిధులు తినేశారు. దీంతో టీడీపీ నేతల ఆస్తులు గణనీయంగా పెరిగాయి. నేతల మేతకు పనికొచ్చాయే తప్ప నీటిమట్టాన్ని పెంచలేకపోయాయి. భవిష్యత్‌పై బెంగ.. వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారని అధికారుల రికార్డులు చెబుతున్నాయి. కానీ, భూగర్భ జలాలు మాత్రం ఎక్కడా పెరగలేదు సరికదా మరింత తగ్గిపోయాయి. 2014కు, ఇప్పటికీ చూస్తే మీటర్ లోతుకి భూగర్భ జలాలు అడుగంటి పోయాయి. వరుస తుపాన్లు వచ్చినా కూడా మునుపటి స్థాయికి భూగర్భ జలాలు చేరలేదు. దీంతో ఆందోళన నెలకొంది. జిల్లాలో వంశధార, నాగావళి, బాహుదా, మహేంద్రతనయ వంటి నదులున్నాయి. వీటి వలన రీచార్జ్ జరిగి భూగర్భ జలాలు మరింత పెరగాల్సి ఉంది. అలాగే, మరోవైపు సముద్రం కూడా ఉంది. దాని వలన రీచార్జ్ జరిగే అవకాశం ఉంది. కానీ, ఊహించని విధంగా భూగర్భ జలాలు తగ్గిపోయాయి. నిధుల మేతపై చూపిన శ్రద్ధ భూగర్భ జలాల పరిరక్షణ కోసం చూపి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జిల్లాలో గత ఐదేళ్లలో జల సంరక్షణకు చేసిన ఖర్చు.. -నీరు చెట్టు పనులకు : రూ.427 కోట్లు -మంచినీటి చెరువుల పూడిక తీతకు : రూ.113.91 కోట్లు -సాగునీటి చెరువుల పనులకు: రూ.344.91 కోట్లు -కొత్త పశువుల చెరువులు/చెరువుల డీసిల్టింగ్ పనులకు: రూ.83.28 కోట్లు -ఇంకుడు గుంతల తవ్వకానికి: రూ.22.88 కోట్లు -రజక చెరువుల పూడిక తీతకు : రూ.44.07 లక్షలు -వ్యవసాయ చెరువు (ఫారమ్ ఫాండ్)లకు : రూ.9.62 కోట్లు -మినీ పెర్కోలేషన్ పనులకు : రూ.44.35 లక్షలు -అస్థిర కందకం కోసం: రూ.1.02 కోట్లు -బావుల తవ్వకానికి: రూ.31.83 లక్షలు -రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ నిర్మాణాలకు: రూ.1.24 కోట్లు -సరిహద్దు కందకాల నిర్మాణం కోసం: రూ.2.31 కోట్లు -ఎస్ఎంసీ ట్రెంచెస్ నిర్మాణాలకు: రూ.2.72 కోట్లు -రాతి కట్టడాలకు: రూ.55.59 లక్షలు -ఇతర పనుల కోసం : రూ.15.54 కోట్లు -
వాన నీటిని ఒడిసి పట్టేందుకు..
సాక్షి, సిటీబ్యూరో: రహదారులపై వరద నీటి సమస్యను తొలగించేందుకు, భూగర్భ జలాల పెంపు కోసం జీహెచ్ఎంసీ ఇటీవల చేపట్టిన ఇంజెక్షన్ బోర్‌వెల్స్ మంచి ఫలితాలిస్తున్నాయి. దీంతో ఇప్పటికే 70 ప్రాంతాల్లో రూ.1.10 కోట్లతో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. మరోవైపు వాన నీటిని ఒడిసి పట్టేందుకు జీహెచ్ఎంసీ సర్కిల్, వార్డు, జోనల్ కార్యాలయాల్లోనూ ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారు. జోనల్, సర్కిల్, వార్డు కార్యాలయాలను పరిశీలించి అనువైన ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేయనున్నారు. దాదాపు 50 ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నామని ఉన్నతాధికారులు పేర్కొన్నారు. మరోవైపు ప్రధాన రహదారులపై వరద నీరు చేరకుండా నిర్మించేందుకు ప్రతిపాదించిన ప్రాంతాల్లో దాదాపు 70 ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌కు జేఎన్టీయూ నిపుణులు ఓకే చెప్పడంతో వాటికి ప్రతిపాదనలు రూపొందించారు. అందులో భాగంగా ఇప్పటికే ఆయా సర్కిళ్ల పరిధిలో 10కి పైగా ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటు చేశారు. మలక్‌పేట సర్కిల్ పరిధిలో రూ.7.85 లక్షల వ్యయంతో 10 ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌కు నిధులు మంజూరు చేయగా.. వాటిల్లో నాలుగింటి పనులు పూర్తయ్యాయి. అలాగే శేరిలింగంపల్లి పరిధిలో 10కి గాను రెండు పూర్తయ్యాయి. మిగతా 8 టెండర్ల ప్రక్రియలో ఉన్నాయి. చందానగర్ సర్కిల్ పరిధిలో 9 మంజూరు కాగా 2 పూర్తయ్యాయి. అంబర్‌పేట సర్కిల్లో మంజూరైన రెండు టెండర్ దశలో ఉన్నాయి. బేగంపేట సర్కిల్లో 3, ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో 4 టెండర్ల దశలో ఉన్నాయి. ఖైరతాబాద్ సర్కిల్ పరిధిలో లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్ ప్రాంతాల్లో ఎక్కువ నీరు నిల్వ ఉంటుండడంతో.. అక్కడ ఎక్కువ నీరు భూమిలోకి ఇంకేలా పెద్ద ఇంకుడుగుంతలతో కూడిన ఇంజెక్షన్ బోర్‌వెల్స్ ఏర్పాటు చేయనున్నారు. ఇందుకుగాను రూ.4 లక్షలు ఖర్చు కాగలదని అంచనా వేశారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున, వర్షాలు వెలిశాక ఇంజెక్షన్ బోర్‌వెల్స్ పనులు జరుగుతాయని చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. ఐటీ కారిడార్‌లో... జీహెచ్ఎంసీ కార్యాలయాలపై చేరే వాన నీటిని ఒడిసి పట్టేందుకు సిద్ధమైన జీహెచ్ఎంసీ.. గ్రేటర్‌లోని బహుళ అంతస్తుల భవనాల ప్రాంతాల్లో కూడా ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌తో కూడిన ఇంకుడు గుంతలు ఏర్పాటు అవసరమని భావిస్తోంది. ముఖ్యంగా ఐటీ కారిడార్‌లో బహుళ అంతస్తుల భవనాలున్న ప్రాంతాల్లో నీరు బయటకు వెళ్లే మార్గం లేక సమస్యలు ఎదురవుతున్నాయి. ఆయా భవనాలపై నుంచి వర్షపు నీరు రోడ్లపై వృథాగా పోకుండా ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌తో ఇంకుడు గుంతలు ఏర్పాటుచేసుకోవాల్సిందిగా సూచించనున్నామని అధికారులు పేర్కొన్నారు. -
జలయజ్ఞం
సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలో భూగర్భ జలాల పెంపునకు జీహెచ్ఎంసీ చర్యలు చేపట్టింది. జేఎన్టీయూ నిపుణుల సూచన మేరకు ప్రధాన రహదారుల్లో వరదముంపు తప్పించడంతో పాటు భూగర్భజలాలు పెంపొందించేందుకు పైలట్ ప్రాజెక్టుగా మాదాపూర్‌లోని కాకతీయహిల్స్ వద్ద నిర్మించిన ఇంకుడుగుంత, ఇంజెక్షన్ బోర్వెల్ ఏర్పాటు చేశారు. వీటితో మంచి ఫలితాలు రావడంతో నగర వ్యాప్తంగా 70 ప్రాంతాల్లో ఇలాంటివి ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. దశలవారీగా వీటిని ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏర్పాటు చేయనున్నారు. ఇటీవల కురిసిన వర్షాలతో తలెత్తిన సమస్యలతో వరద ముప్పు తప్పేందుకు ఇంజెక్షన్ బోర్లు పరిష్కారం చూపుతాయని భావించడంతో పాటు జీహెచ్ఎంసీ కమిషనర్ సూచన మేరకు జీహెచ్ఎంసీ ఇంజినీర్లు, జేఎన్టీయూ నిపుణులు ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్ జోన్లలో 24 ప్రాంతాలను ప్రాథమికంగా గుర్తించారు. తొలుత పైలట్ ప్రాజెక్టుగా కాకతీయ హిల్స్‌లో ఇది పూర్తయ్యాక వర్షం కురిసినప్పటికీ నీటి నిల్వలు కనిపించలేదని ఇంజినీర్లు.. మరికొన్ని చోట్ల ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించారు. ఏర్పాటు ఇలా.. నాలుగు అడుగుల పొడవు, నాలుగు అడుగుల వెడల్పు ఏడు అడుగుల లోతుతో ఇంకుడు గుంత కమ్ ఇంజెక్షన్ బోర్వెల్ నిర్మిస్తారు. రోడ్డుపై నీరు ఎక్కువ నిల్వ ఉండటంతో పాటు తగినంత స్థలం అందుబాటులో ఉంటే ఇంకుడు గుంతతో పాటు రెండు చాంబర్లు నిర్మిస్తారు. వర్షపునీరు తొలుత మొదటి చాంబర్లోకి చేరేలా ఏర్పాట్లు చేస్తారు. వరదనీటితో పాటు చెత్త, ప్లాస్టిక్ తదితరవ్యర్థాలు లోపల చేరకుండా జియో టెక్స్టైల్ మెంబ్రేన్ ఏర్పాటు చేస్తారు. అవి దానిపైనే నిలిచిపోతాయి. ఈ మొదటి చాంబర్లో చేరిన నీరు రెండో చాంబర్లోకి వెళ్లేందుకు వీలుగా పైప్ ఏర్పాటు చేస్తారు. రెండో చాంబర్లోకి చేరిన నీరు అందులోని ఇంజెక్షన్ బోర్వెల్లోకి చేరుతుంది. రెండు చాంబర్లు ఏర్పాటు చేసే చోట గ్రీజు, ఆయిల్ వంటివి మొదటి చాంబర్లోనే అడుగున పేరుకుపోతాయి. రెండో చాంబర్లోకి వెళ్లవు. రెండో చాంబర్లో ఇంజెక్షన్ బోరు వేస్తారు. ఇంకుడు గుంతల్లో దిగువన 40 ఎంఎం, దానిపైన 20 ఎంఎం కంకర, ఆపైన ఇసుక వేస్తారు. జియో టెక్స్టైల్ మెంబ్రేన్‌పై పేరుకుపోయే వ్యర్థాలను ఎప్పడికప్పుడు తొలగించాలి. ఇంకుడు గుంతలు తవ్వే ప్రాంతాల్లోని భూగర్భ జలమట్టంలో మూడో వంతు వరకు మాత్రమే బోర్వెల్ వేస్తారు. గరిష్టంగా మాత్రం 200 అడుగుల లోతు మించకుండా వేస్తారు. పరిసరాల్లోని భూగర్భ జలాలు కలుషితం కాకుండా చర్యలు తీసుకుంటారని చీఫ్ ఇంజినీర్ జియావుద్దీన్ తెలిపారు. వీటిని జియో ట్యాగింగ్ కూడా చేస్తారన్నారు. కాకతీయహిల్స్‌లో యుద్ధ ప్రాతిపదికన నిర్మించిన రెండు చాంబర్ల ఇంజెక్షన్ బోర్‌కు రూ.1.40 లక్షలు ఖర్చయినట్లు ఎగ్జిక్యూటి ఇంజినీర్ చిన్నారెడ్డి చెప్పారు. ఇకపై నిర్మించే వాటికి రెండు చాంబర్లతో నిర్మించే వాటికి రూ.1.25 లక్షలు, ఒకే చాంబర్‌తో నిర్మించేవాటికి రూ.80 వేలు ఖర్చవుతుందని అంచనా వేసినట్లు జియావుద్దీన్ తెలిపారు. ఇంజెక్షన్ బోర్‌వెల్స్‌కు ప్రతిపాదించిన ప్రాంతాలు.. ♦ కాప్రా సర్కిల్లో జీహెచ్ంఎసీ పార్కు దగ్గరిపోచమ్మగుడి ఎదుట ♦ హయత్‌నగర్ సర్కిల్ ఎగ్జిబిషన్ గ్రౌండ్ వెనుక జాన్సన్ గ్రామర్ స్కూల్ దగ్గర ♦ ఉప్పల్ సర్కిల్ టీవీ స్టుడియో దగ్గరినల్లపోచమ్మ గుడి వద్ద ♦ ఎల్బీనగర్ సర్కిల్ యాదగిరినగర్ ♦ రోడ్ నెంబర్ 12 సరూర్‌నగర్ సర్కిల్ ♦ అల్కాపురి రోడ్‌నెంబర్ 4 ♦ మలక్‌పేట పోలీస్‌స్టేషన్, చేనెంబర్ జంక్షన్ ♦ లేక్‌వ్యూ గెస్ట్‌హౌస్, విల్లామేరీ కాలేజ్ ♦ శేరిలింగంపల్లి సర్కిల్ ఐఐఐటీ జంక్షన్ ♦ చందానగర్ మాతృశ్రీనగర్, కర్బలామైదాన్ ♦ మూసాపేట బీఎస్ఎన్ఎల్ కార్యాలయం -
ఆపదలో ‘అన్నపూర్ణ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణ’గా భాసిల్లడానికి కారణమైన గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఆకలి దప్పులు తప్పడం లేదు. ఈ రెండు డెల్టాలతోపాటు పెన్నా డెల్టాలోనూ సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ముంచుకొస్తోంది. డెల్టాలు ఉప్పునీటి కయ్యలుగా, సాగుకు పనికి రాని భూములుగా మారుతున్నాయి. ఈ కఠోర వాస్తవాన్ని సాక్షాత్తు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదిక బట్టబయలు చేసింది. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో భూములు శరవేగంగా చౌడుబారుతుండటం.. సాగుకు పనికి రాకుండా పోతుండటం.. పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుండటానికి కారణాలను అన్వేషించి.. పరిస్థితిని చక్కదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2014 జూన్ 19న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీడబ్ల్యూసీని ఆదేశించారు. నాలుగేళ్లపాటు సమగ్ర అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశానికి తూర్పు, పశ్చిమ తీర రేఖలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లతో కలిపి 7,516.6 కిలోమీటర్ల పొడవునా తీరం విస్తరించి ఉంది. దీవుల తీర రేఖను మినహాయిస్తే.. దేశానికి తూర్పు, పశ్చిమాన 5,422.6 కిలోమీటర్ల పొడవున తీర రేఖ ఉంది. దేశం నుంచి ప్రవహిస్తున్న 102కు పైగా నదులు తూర్పు, పశ్చిమ తీర రేఖల మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రానికి 973.7 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఇది విస్తరించి ఉంది. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్యన ప్రవహిస్తున్న కృష్ణా నది, ఉభయ గోదావరి జిల్లాల నడుమ ప్రవహిస్తున్న గోదావరి, నెల్లూరు మీదుగా ప్రవహించే పెన్నా, స్వర్ణముఖి, కండలేరు, శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవహించే వంశధార నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎల్‌నినో, లానినో ప్రభావం వల్ల సముద్ర మట్టం ఎత్తు కనిష్టంగా 0.6 మీటర్ల నుంచి గరిష్టంగా రెండు మీటర్ల వరకు పెరిగింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 903.2 మిల్లీమీటర్లు కురవాలి. ప్రకాశం జిల్లాలో కనిష్టంగా 757 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరిలో గరిష్టంగా 1,139 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో ప్రవాహం ఏడాది పొడవునా ఉండటం లేదు. సముద్ర మట్టం ఎత్తు పెరగడం.. నదుల్లో ఏడాది పొడవున ప్రవాహం లేకపోవడం వల్ల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోకి నదులు, డ్రెయిన్ల ముఖద్వారాల మీదుగా సముద్రపు నీరు ఎగదన్నుతోందని.. ఇది భూమిని చౌడుబారేలా చేస్తుందని సీడబ్ల్యూసీ తేల్చింది. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు.. తీర ప్రాంతంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భూగర్భ జలాలు ఉప్పు బారిపోవడం ఖాయమని, అప్పుడు డెల్టాల్లో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీరు కూడా కష్టమవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. భూమి చౌడుబారడం వల్ల సాగుకు పనికి రాకుండా పోతుందని.. పంట దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని.. దీనివల్ల ఆకలికేకలు తప్పవని అభిప్రాయపడింది. నదులు, డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లను నిర్మించి.. ఉప్పునీళ్లు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మడ అడవులను భారీ ఎత్తున పెంచి, తీరంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని పేర్కొంది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలని.. భూగర్భం నుంచి తోడేసిన నీటిని.. వర్షకాలం అయినా రీఛార్జ్ చేయాలని.. దీనివల్ల ఉప్పు నీరు పైకి ఉబికి వచ్చే అవకాశం ఉండదని నివేదికలో పేర్కొంది. నదుల్లో ఏడాది పొడవునా ప్రవాహాలు కనిష్ట స్థాయిలోనైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చేపల చెరువుల సాగును తగ్గించాలని.. రసాయన, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని కనిష్ట స్థాయికి చేర్చాలని సూచించింది. రక్షణ చర్యలు తీసుకోకపోతే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కావడం ఖాయమని స్పష్టం చేసింది. భూగర్భ జలాలు తోడేయడంతో.. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో సాగునీటితోపాటు చేపల చెరువుల సాగుకు, తాగునీటి కోసం భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోతోంది. బోరుబావుల ద్వారా తోడిన మంచినీటి స్థానంలోకి ఉప్పునీరు చేరుతోందని సీడబ్ల్యూసీ గుర్తించింది. చేపల చెరువుల ప్రభావం వల్ల భూమి శరవేగంగా చౌడుబారుతోందని తేల్చింది. 2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. మడ అడవులను నరికేయడం.. సునామీ దెబ్బకు తీర ప్రాంతం బలహీనపడటం వల్ల సముద్రపు నీరు ఉపరితలానికి బాగా ఎగదన్నింది. వీటి ప్రభావం వల్ల తీర ప్రాంతంలో 38 మండలాలు పూర్తిగానూ.. 26 మండలాల్లో భూములు పాక్షికంగానూ చౌడుబారాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది, పశ్చిమగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 13, గుంటూరులో 12, ప్రకాశంలో 13, నెల్లూరు జిల్లాలో రెండు మండలాల్లో భూములు చౌడుబారినట్టు లెక్క తేల్చారు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో 75.92 లక్షల ఎకరాల భూమి చౌడుబారిపోతే.. రాష్ట్రంలో 9.61 లక్షల ఎకరాల భూమి చౌడుబారి సాగుకు పనికి రాకుండా పోయింది. మిగతా ప్రాంతాల్లోనూ నేల చౌడు (క్షార) స్వభావం శరవేగంగా పెరుగుతోంది. ఇది కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఏటా సగటున ఐదు శాతం చొప్పున దిగుబడి తగ్గుతోందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. తీర ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం 50 శాతం అధికంగా ఉందని, ఇది నేల స్వభావం శరవేగంగా మారడానికి దారితీస్తోందని తేల్చింది. -
తోడి పారేస్తున్నాం..!
నైరుతీ రుతుపవనాలు ఆశించిన వర్షాన్ని ఇవ్వకపోవడంతో దేశంలో నీటి సంక్షోభం నెలకొంది. ఇప్పటికే చెన్నై, బెంగళూరు నగరాలు నీటి కొరతతో అల్లాడుతున్నాయనీ, 2020 నాటికి హైదరాబాద్, విజయవాడ సహా 21 నగరాల్లో తీవ్ర నీటి కొరత ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. చెన్నైలో ప్రజలకు అందించే నీటిపై రేషన్ విధించగా, బెంగళూరులో నీటికొరత కారణంగా కొత్త భవన నిర్మాణాలను ఐదేళ్లు నిషేధించాలని ప్రభుత్వం యోచిస్తోంది. కేంద్రం ఇప్పటికే జలశక్తి మంత్రిత్వశాఖను ఏర్పాటుచేసింది. అవసరాల కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతున్నప్పటికీ నీటి కొరత ఎందుకొచ్చింది? నీటి కోసం భారీ క్యూలైన్లలో నిల్చోవాల్సిన పరిస్థితి ఎందుకు దాపురించింది. మితిమీరిన వాడకం.. అమెరికా, చైనాలతో పోల్చుకుంటే భారత్‌లో భూగర్భ జలాలను మితిమీరి వాడేస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం మన అవసరాల్లో సగానికిపైగా భూగర్భ జలాలే తీరుస్తున్నాయి. ఇందులో సాగుకు 89 శాతం, గృçహావసరాలకు 9 శాతం, పారిశ్రామిక అవసరాలకు 2 శాతం వాడేస్తున్నాం. అయితే జనాభా పెరుగుదల, పట్టణీకరణ కారణంగా భూగర్భ జలాలు అంతకంతకూ తగ్గిపోతున్నాయి. ప్రజలకు మంచినీటి సరఫరాలోనూ తీవ్రమైన వ్యత్యాసాలు నమోదవుతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఓ వ్యక్తికి రోజుకు 150 లీటర్ల నీరు కావాల్సి ఉండగా, దేశంలో 81 శాతం గృహాలకు రోజుకు 40 లీటర్ల నీటిని మాత్రమే ప్రభుత్వం సరఫరా చేయగలుగుతోంది. వరుణదేవుడు కరుణించినా.. దేశంలో నీటి కటకటకు ఇష్టారాజ్యంగా నీళ్లను వృథా చేయడం కూడా ఓ కారణమేనని సెంట్రల్ వాటర్ కమిషన్ చెబుతోంది. భారత్‌కు ఏటా 3,000 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు అవసరం. కానీ ఏటా 4 వేల బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం కురుస్తోంది. వాన నీటిని నిల్వ చేసుకోలేకపోవడంతో అదంతా వృథా అవుతోంది. వర్షపు నీటిలో 8 శాతాన్ని మాత్రమే సంరక్షిస్తున్నారు. నీటిని శుద్ధిచేసి పునర్వినియోగించే విషయంలోనూ భారత్ బాగా వెనుకబడింది. పైపుల ద్వారా సరఫరా అయ్యే నీటిలో 40 శాతం వృ«థా అవుతోంది. చుట్టంగా మారిన చట్టాలు.. భారత్‌లో ప్రస్తుతం భూగర్భ జలాల వినియోగ చట్టం–1882 ఇంకా అమలవుతోంది. దీనిప్రకారం భూయజమానికి తన ఇల్లు, పొలంలో భూగర్భ జలాలపై సర్వాధికారాలు ఉన్నాయి. దీంతో ప్రజలంతా ఇష్టానుసారం బోర్లు వేసి నీటిని తోడేస్తున్నారు. దీన్ని నియంత్రించేందుకు కేంద్రం 2011లో భూగర్భ జలాల నిర్వహణ బిల్లును రూపొందించింది. తమ భూముల్లోని నీటిని ఇష్టానుసారం వాడుకునే హక్కు ప్రజలకు ఉండదని నిబంధనలు చేర్చింది. అయితే నీటి అంశం రాష్ట్రాల జాబితాలో ఉండటంతో ఏకాభిప్రాయం సాధ్యం కాక ఇది మూలనపడింది. దీనికితోడు నదులు, సరస్సులు, చెరువుల ఆక్రమణలతో పరిస్థితి మరింత తీవ్రం అవుతోంది. పారిశ్రామికీకరణ కారణంగా గంగా తీరం లో 80 శాతం సరస్సులు తీవ్రంగా కలుషితమయ్యాయి. ‘2040 నాటికి మన దేశ జనాభాలో 40 శాతం మందికి తాగేందుకు నీళ్లు కూడా దొరకవు. 2021 నాటికి ఢిల్లీ సహా 21 నగరాల్లో భూగర్భ జలాలు కనుమరుగైపోతాయి’ అని నీటి నిర్వహణ నిపుణుడు రాజేంద్ర సింగ్ హెచ్చరించారు. దేశంపై ప్రభావం ► నీటి దుర్వినియోగం కొనసాగితే 2050 నాటికి భారత్ జీడీపీలో 6 శాతాన్ని కోల్పోతుంది. ► ఆరోగ్యం, వ్యవసాయం, స్థిర–చరాస్తి రంగాలపై నీటి కొరత తీవ్ర ప్రభావం చూపనుంది. ► స్మార్ట్ సిటీల జాబితాలో ఉన్న షోలాపూర్ (మహారాష్ట్ర)లో నీటిఎద్దడితో పలు ప్రాజెక్టులు నిలిచిపోయాయి. ► కలుషిత నీటితో 21% అంటు వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఊ డయేరియా కారణంగా దేశవ్యాప్తంగా రోజుకు 1600 మంది చనిపోతున్నారు. -
భయపెడుతున్న ఈ–కోలి భూతం
అమలాపురం: ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). అత్యంత ప్రమాదకరమైన ఈ బ్యాక్టీరియా ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వాసులను వణికిస్తోంది. ఇప్పటి వరకు గోదావరి నది..పంట కాలువల్లో మాత్రమే ఉన్న ఈ–కోలి బ్యాక్టీరియా ఉనికి ఇప్పుడు భూగర్భ జలాల్లోనూ కనిపిస్తోంది. ప్రజలకు రోగ కారకమైన దీని ఉధృతి వర్షాకాలంలో మరింత పెరిగే అవకాశముంది. రాజమహేంద్రవరం నగరంలోని మురుగునీరు, స్థానికంగా పేపరు మిల్లుల నుంచి వచ్చే వర్థ్య జలాలు, గోదావరి ఎగువ ప్రాంతాల్లో పలు కంపెనీల రసాయనాలు, పట్టణాలకు చెందిన మురుగునీరు కలవడం వల్ల దీని సాంద్రత రోజురోజుకు పెరుగుతోంది. గోదావరి పుష్కరాల సమయంలో నదిలో ఏకంగా ఐదు వేల కాలనీస్ (యూనిట్లు) వరకు ఈ–కోలి రికార్డు స్థాయిలో నమోదయిందంటే దీని తీవ్రత ఎంత ప్రమాదకర స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లాలోని పలు ప్రాంతాల్లో నదుల నుంచి వచ్చే నీటిలోనూ, భూగర్భ జలాల్లో ఇది ఎక్కువగా ఉందని కోనసీమ కాలుష్యంపై పరిశోధన చేస్తున్న ఎస్కేబీఆర్ పీజీ కాలేజీ ప్రిన్సిపాల్ పెచ్చెట్టి కృష్ణకిశోర్ అధ్యయన బృందం నిర్ధారించింది. ఈ నీటినే జిల్లాలో సుమారు 60 శాతం మంది ప్రజలు తాగునీరుగా వినియోగిస్తున్నారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలతోపాటు మండపేట, సామర్లకోట, పెద్దాపురం, పిఠాపురం, రామచంద్రపురం, అమలాపురం మున్సిపాలిటీలతోపాటు వందల గ్రామాలకు తాగునీటి అవసరాలను తీరుస్తోంది. ఇటీవల కాలంలో ఆక్వా సాగు విచ్చలవిడిగా పెరగడంతో వృథా అవుతున్న మేతలు, రసాయనాల వల్ల చెరువుల చుట్టుపక్కల సుమారు 2 కి.మీ. మేర నీరు ఉప్పుబారిన పడడంతో పాటు కాలుష్యం కారణంగా భూగర్భ జలాల్లో ఈ–కోలి వ్యాప్తి చెందుతోంది. గడచిన మూడేళ్లుగా ఈశాన్య రుతుపవనాలు మొఖం చాటేయడం కూడా ఈ–కోలి బ్యాక్టీరియా పెరుగుదలకు ఒక కారణమని నిపుణులు చెబుతున్నారు. బ్యాక్టీరియాలోనే ‘ఈ–కోలి’ అత్యంత ప్రమాదకరం - బ్యాక్టీరియాలో అత్యంత ప్రమాదకరమైంది ఇచ్చరిచియా కోలి (ఈ–కోలి). దీనివల్ల ఆయాసం, వాంతులు, కడుపునొప్పి, అతిసార, తీవ్ర జ్వరానికి దారితీస్తోంది. - వర్షాకాలం సీజన్లో పలువురు జ్వరాల బారిన పడడానికి ఇదే కారణం. ఇది వృద్ధి చెందకుండా చర్యలు తీసుకునే అధికార వ్యవస్థ లేదు. - కొత్త నీరు వస్తున్న సమయంలో.. అంటే వర్షాకాలంలో భూగర్భ జలాల్లో సైతం ఉభయ గోదావరి జిల్లాల్లో ఇది వ్యాప్తి చెందుతుంది. ప్రమాదస్థాయిని దాటుతోంది.. గోదావరి డెల్టా ప్రాంతంలో ఈ–కోలి స్థాయి 625 నుంచి 650 కాలనీస్(యానిట్లు) దాటి ఉంది. మెట్టలో సైతం ఇంచుమించు ఇదే పరిస్థితి. నీటిలో 500 కాలనీస్ దాటితే ప్రమాదం. సముద్రంలో పేరుకుపోయే జంతు ప్లవకాలు, వృక్ష ప్లవకాల మీద దట్టమైన ఇసుక పేరుకుపోతోంది. ఓఎన్జీసీ తవ్వకాలతో అవి నీటిపైకి వస్తాయి. జిల్లాలో నదీ ముఖ ద్వారాలైన బలుసుతిప్ప, అంతర్వేది. ఓడలరేవు ద్వారా ఇది నదిలోకి వచ్చి, అక్కడ నుంచి భూగర్భంలోకి చేరడం, ఆక్వా చెరువుల ద్వారా విస్తరిస్తోంది. ఇంత ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదన్న విమర్శలున్నాయి. -
సిటీలో భారీగా తగ్గిన భూగర్భ జలాలు..
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్లో భూగర్భ జలాలు అథఃపాతాళంలోకి చేరాయి. మండుటెండలకు జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీరు ఏమూలకు సరిపోకపోవడంతో బోరుబావుల్లోని నీటి వినియోగం అనూహ్యంగా పెరిగింది. దీంతో పలు బోరుబావులు చుక్క నీరులేక బావురుమంటున్నాయి. మరోవైపు సిటీలో రోజువారీ అవసరాలకు అవసరమైన నీటి కోసం విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకంతో పాతాళగంగ అడుగంటింది. గతేడాది మే నెలతో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భ జలమట్టం తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈనేపథ్యంలో పలు మండలాల్లో సుమారు వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను రెవెన్యూ శాఖ నిబంధనలకు విరుద్ధంగా తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. కాగా గ్రేటర్ పరిధిలో మే 2019 వరకు సాధారణ వర్షపాతం 905 మిల్లీమీటర్లకుగాను ప్రస్తుతానికి 748 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. అంటే సాధారణం కంటే 17 శాతం తక్కువ వర్షపాతం నమోదుకావడం కూడా భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోవడానికి కారణమని భూగర్భజలశాఖ ప్రకటించింది. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం... భూగర్భజలశాఖ నుంచి సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీజిబిలిటీ)అందిన తర్వాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతువరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది. ప్రధాననగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వెయ్యి అడుగులకుపైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది. ప్రధానంగా కుత్భుల్లాపూర్ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్ మాఫియా..ఈ నీటిని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌వాటర్ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాం తాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు, విచక్షణారహితంగా నీటిని తోడేస్తుండడంతో భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్.. బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశ జనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కనాకష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ,బెంగళూరు,చెన్నై,హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతుండడంతో పరిస్థితి విషమిస్తోందని స్పష్టంచేసింది. ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి... సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్),1.5 మీటర్ల పొడవు,1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగాను 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ఇంకుడు గుంతతో ఉపయోగాలివే.. ఈ ఇంకుడు గుంతలో సీజన్లో సాధారణ వర్షపాతం (20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో ..రోజుకు 1600 లీటర్ల నీటిని నేలగర్భంలోకి ఇంకించవచ్చు. ఈ నీరు నలుగురు సభ్యులున్న కుటుంబానికి మూడురోజుల అవసరాలకు సరిపోవడం విశేషం. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా మీ బోరు బావి ఎప్పటికీ వట్టిపోదు. అంతేకాదు భావితరాలకు మీరు జలబ్యాంక్ ఏర్పాటుచేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా మీకే కాదు..మీ ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం..జీవం అందజేసిన వారవుతారు. గ్రేటర్లో సమస్య ఇలా... సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25లక్షలుకాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కనాకష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు,కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు అథఃపాతాళంలోకి పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలో ప్రధానంగా భూగర్భజలాల వినియోగం అత్యధికంగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా రెవెన్యూ శాఖ నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్‌నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ముచేసుకుంటున్నారు. -
అప్పుడే దేశంలో కరవు తాండవం!
సాక్షి, న్యూఢిల్లీ : నేడు భారత్‌లోని 42 శాతం భూభాగంలో కరవు పరిస్థితులు నెలకొన్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, తమిళనాడు, తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన కరవు పరిస్థితులు తాండవిస్తున్నాయని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ (డీఈడబ్ల్యూఎస్)’ వెల్లడించింది. మొత్తం దేశ జనాభాలో 40 శాతం జనాభా అంటే, దాదాపు 50 కోట్ల మంది ప్రజలు ఈ రాష్ట్రాల్లోనే నివసిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఈ రాష్ట్రాల్లో, ఈ ప్రాంతాల్లో కరవు పరిస్థితులు నెలకొన్నాయని వెల్లడించకపోవడం శోచనీయం. అయితే ఆంధ్రప్రదేశ్, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా, రాజస్థాన్లలోని అనేక జిల్లాలను ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరవు ప్రాంతాలుగా ప్రకటించాయి. వర్షాలు పడాలంటే మరో రెండు, మూడు నెలలు పడుతుంది కనుక కరవు పరిస్థితులు మరింత తీవ్రమయ్యే అవకాశం ఉందని ‘డ్రాట్ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్’ డెవలపర్, గాంధీనగర్ ఐఐటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న విమల్ మిశ్రా తెలిపారు. నైరుతి, ఈశాన్య రుతుపవనాలు, రెండూ వైఫల్యం చెందడం వల్ల ఈ కరవు పరిస్థితులు ఏర్పడ్డాయని మిశ్రా తెలిపారు. దేశంలో ఏడాదిలో కురిసే వర్షపాతంలో నైరుతి రుతుపవాల వల్ల 80 శాతం, ఈశాన్య రుతు పవనాల వల్ల 20 శాతం వర్షాలు కురుస్తాయి. 2018, జూన్–సెప్టెంబర్ మధ్య నైరుతి రుతుపవనాల కురవాల్సిన వర్షపాతంలో 9.4 శాతం తగ్గినట్లు, అదే ఈశాన్య రుతుపవాల వల్ల అక్టోబర్–డిసెంబర్ మధ్య కురవాల్సిన సాధారణ వర్షపాతంలో 44 శాతం తగ్గినట్లు భారత వాతావరణ పరిశోధన కేంద్రం లెక్కలే తెలియజేస్తున్నాయని మిశ్రా వివరించారు. రుతుపవనాల కన్నా ముందు అంటే, మార్చి–మే నెలల మధ్య కురవాల్సిన వర్షపాతం కూడా ఈ సారి బాగా తగ్గుతున్నట్లు తెలుస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి 31వ తేదీ మధ్య కురిసే వర్షపాతంలో కూడా 36 శాతం తగ్గింది. ఫలితంగా దేశంలోని 91 ప్రధాన రిజర్వాయర్లలో నీటి మట్టం 32 శాతం పడిపోయింది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లోని 31 రిజర్వాయర్లలో నీటి మట్టం 36 శాతం పడిపోయింది. మున్ముందు కరవు పరిస్థితులు మరింత దారుణంగా ఉంటాయని, భూగర్భ జలాలు పడిపోవడం వల్ల వ్యవసాయ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, పర్యవసానంగా గ్రామాల నుంచి వలసలు పెరుగుతాయని మిశ్రా హెచ్చరించారు. ఎల్‌నైనో పరిస్థితుల కారణంగా 2015 నుంచి (2017 మినహా) వరుసగా దేశంలో వర్షపాతం తగ్గుతూ వస్తోంది. -
చెరువులన్నీ కళకళలాడాలి
సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయతో కాకతీయుల నాటి చెరువులకు పునర్వైభవం రావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు ఆకాంక్షించారు. ప్రాజెక్టుల నీళ్లు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ కూడా నేరుగా చెరువులకు చేరేలా ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. చెరువులన్నీ నిండి కళకళలాడినప్పుడే మిషన్ కాకతీయ లక్ష్యం నెరవేరినట్లన్నారు. చెరువుల అభివృద్ధికి సంబంధించి వారం రోజు ల్లోగా సమగ్ర నివేదికను ప్రభుత్వానికి అందించాలని సూచించారు. సీఎం కేసీఆర్ శుక్రవారం ప్రగతి భవన్లో మిషన్ కాకతీయ, చిన్ననీటి వనరులపై సమీక్ష నిర్వహించారు. ప్రభుత్వ సీఎస్ ఎస్.కె.జోషి, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణ రావు, నీటి పారుదల ఈఎన్సీ మురళీధర్ రావు, కాడా కమిషన్ మల్సూర్, సీఈ శ్యాంసుందర్, కాడా డీడీ స్నేహ, రిటైర్డ్ ఈఎన్సీ విజయ్ ప్రకాశ్, సీఎం ఓఎస్డీ శ్రీధర్ దేశ్‌పాండే ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఫీడర్ చానల్స్ సిద్ధం చేయాలి... ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఒకప్పుడు తెలంగాణలో చిన్ననీటి వనరుల వ్యవస్థ బ్రహ్మాండంగా ఉండేది. కాకతీయులు తవ్విన గొలుసుకట్టు చెరువుల కింద పంటలు పండేవి. ఒక చెరువు అలుగు పోస్తే గొలుసుకట్టులోని మిగతా చెరువులకు నీరందేది. చెరువులకు నీళ్లు పారేందుకు కాలువలు ఉండేవి. జాలువారు నీళ్లతో చెరువులు నిండేవి. 1974లో నే అప్పటి బచావత్ అవార్డు ప్రకారం.. తెలంగాణ చెరువులకు రెండు బేసిన్లలో కలిపి 265 టీఎంసీల నీళ్ల కేటాయింపు ఉంది. ఈ చెరువులు నాశనమయ్యాయి. తెలంగాణ బతుకు నాశనం అయింది. పంటలకు నీరివ్వడానికి రైతులు లక్షల కోట్లు ఖర్చు పెట్టి 25 లక్షల బోర్లు వేసుకు న్నారు. అయినా పంటలు కూడా పండలేదు. వ్యవసాయం దెబ్బతిన్నది’అని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘తెలంగాణలో చెరువులను పునరుద్ధరించడం కోసం మిషన్ కాకతీయ కార్యక్రమం తీసుకొచ్చాం. చెరువులను బాగు చేసుకున్నాం. ఆ చెరువులు నీటితో కళకళలాడితేనే ఈ పథకానికి సార్థకత. ప్రస్తుతం నిర్మి స్తున్న ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీళ్ల తో చెరువులు నింపాలి. దీనికోసం సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలి. రాష్ట్రంలో 12,150 గొలుసుకట్టుల్లో 27,800 చెరువులున్నాయి. గొలుసుకట్టులోని మొదటి చెరువుకు నీరు అందిస్తే, దాని ద్వారా మిగతా చెరువులకు నీరందేలా ఫీడర్ కెనాల్స్ సిద్ధం చేయాలి. ఒకప్పుడు జాలువారు ఉండేది. బోర్లు ఎక్కువ వేయడం, భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో ఇప్పుడు జాలువారు లేదు. చెరువులు నిండితే, మళ్లీ భూగర్భ జలాలు పెరుగుతాయి. మళ్లీ జాలువారును చూడవచ్చు. ఒక చెరువు నుంచి మరో చెరువుకు నీరు అందుతుంది’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఇంజనీ రింగ్ అధికారులతో వర్క్ షాపు నిర్వహించి, దీని కోసం సమగ్ర ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. చెరువులను పునరుద్ధరించడంతో పాటు రాష్ట్రంలో చెరువుల్లో, చెక్ డ్యాముల్లో నీటి నిల్వ సామర్థ్యాన్ని లెక్క తీయాలని అధికారులకు సూచించారు. -
జలవిల!
సాక్షి, సిటీబ్యూరో: మండు వేసవి రాకముందే గ్రేటర్లో భూగర్భజలాలు అథఃపాతాళంలోకి చేరుతున్నాయి. విచక్షణారహితంగా బోరుబావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో జలం అడుగంటుతోంది. ఫిబ్రవరి తొలివారంలోనే గతేడాదితో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 2 నుంచి 5 మీటర్ల మేర భూగర్భజలమట్టాలు తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీటు మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భజలాల వినియోగం రెట్టింపవుతోంది. ఈ నేపథ్యంలో పలు మండలాల్లో నిబంధనలకు విరుద్ధంగా వెయ్యి అడుగులకుపైగా బోరుబావులను తవ్వుతున్నప్పటికీ ఆయా విభాగాల అధికారులు చోద్యం చూస్తుండడం గమనార్హం. భూగర్భజల శాఖ నుంచి సాధ్యాసాధ్యాల నివేదిక(ఫీజిబిలిటీ)అందిన తరువాతే రెవెన్యూశాఖ నూతన బోరుబావుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. అదీ కేవలం 400 అడుగుల లోతు వరకు తవ్వేందుకు మాత్రమే అనుమతించాలి. అయితే ఈ నిబంధన గ్రేటర్ పరిధిలో కాగితాలకే పరిమితమౌతోంది. ప్రధాన నగరంతోపాటు శివారు ప్రాంతాల్లో వేసవి మొదలుకాకముందే వెయ్యి అడుగులకుపైగా బోరుబావులు తవ్వుతున్నా రెవెన్యూ శాఖ ప్రేక్షకపాత్రకే పరిమితమౌతోంది. ట్యాంకర్ మాఫియా... ప్రధానంగా కుత్భుల్లాపూర్, మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, మాదాపూర్, రాజేంద్రనగర్, శంషాబాద్, హయత్‌నగర్ తదితర ప్రాంతాల్లో చెరువులు, కుంటల్లో నిబంధనలకు విరుద్ధంగా బోరుబావులు తవ్వేస్తున్న ట్యాంకర్ మాఫియా..ఈ నీటిని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, హోటళ్లు, హాస్టళ్లు, ఫిల్టర్‌వాటర్ ప్లాంట్లకు సరఫరా చేస్తూ జేబులు నింపుకుంటున్నారు. అత్యంత లోతుగా బోరుబావులు తవ్వుతుండడంతో ఆయా ప్రాంతాల్లో ఇప్పటికే ఉన్న బోరుబావులు వట్టిపోవడంతోపాటు, విచక్షణారహితంగా నీటిని తోడేస్తుండడంతో భూగర్భజలమట్టాలు అనూహ్యంగా పడిపోతున్నట్లు భూగర్భజలశాఖ నిపుణులు స్పష్టంచేస్తున్నారు. గతంలోనే స్పష్టంచేసిన నీతి ఆయోగ్.. బహుళ అంతస్తుల భవంతులు..రహదారులతో కాంక్రీట్ మహారణ్యంలా మారిన మెట్రో నగరాల్లో భూగర్భజలాలు ఏటేటా అడుగంటుతూనే ఉన్నాయి. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి పాతాళగంగ ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని..తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ ఇటీవల విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ నివేదికలో హెచ్చరించింది. తక్షణం మేలుకోని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో సుమారు 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కష్టంగా మారనుందని ఆందోళన వ్యక్తంచేసింది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడడం, వర్షపునీటిని నేలగర్భంలోకి ఇంకించేందుకు అవసరమైన రీఛార్జింగ్ పిట్స్ అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భజలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతున్నాయని పేర్కొంది. గ్రేటర్లో ఇలా... సుమారు 625 చ.కి.మీ పరిధిలో విస్తరించిన గ్రేటర్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా..బోరుబావులు 23 లక్షలమేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతలసంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. మరోవైపు నగరం దక్కన్‌పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కష్టంగా మారింది. మరోవైపు రోజువారీగా ఆయా బోరు బావుల నుంచి సుమారు 650 కోట్ల లీటర్ల మేర భూగర్భజలాలు తోడుతున్నట్లు అంచనా. ఇక నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం నేలగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడుగుంతలు,కుంటలు లేక సుమారు 65 శాతం మేర వృథాగా రహదారులపై ప్రవహించి చివరగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో ఏటేటా భూగర్భజలమట్టాలు పాతాళంలోకి పడిపోతున్నాయి. ఇంట్లో ఇంకుడు గుంత ఇలా... సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్),1.5 మీటర్ల పొడవు,1.5 మీటర్ల వెడెల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 50 శాతం 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో నింపాలి. మరో 25 శాతం జాగాను 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లను నింపాలి. మిగతా 25 శాతం ఖాళీప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. ఈ గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపునీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ఈ ఇంకుడు గుంతలో సీజన్లో సాధారణ వర్షపాతం(20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో ..రోజుకు 1600 లీటర్ల నీటిని నేలగర్భంలోకి ఇంకించవచ్చు. -
పాతాళానికి గంగ
ఒంగోలు సబర్బన్: భూగర్భ జలం అడుగడుగుకు ఒక నిక్షేపం అంటారు. ఒక్కోసారి బోరు పక్కనే బోరు వేసినా నీరు పడని దృష్టాంతాలు ఎన్నో ఉన్నాయి. అలాంటిది వరుసగా ఐదేళ్లు సక్రమంగా వర్షాలు పడకపోతే భూగర్భ జలాల పరిస్థితి ఏవిధంగా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు జిల్లాలో అదే జరుగుతోంది. ప్రకాశం ప్రజలు తీవ్ర దుర్భిక్షాన్ని ఎదుర్కొంటున్నారు. మునుపెన్నడూ లేనివిధంగా భూగర్భ జలం అడుగంటి పోతోంది. గత 15 సంవత్సరాల్లో ఇలాంటి పరిస్థితి జిల్లాలో ఎదురుకాలేదంటే పరిస్థితి ఎంత దయనీయంగా మారిందో అర్ధమవుతోంది. పశ్చిమ ప్రాంతంలో భూగర్భ జలాల పరిస్థితి మరీ దారుణంగా మారింది. జిల్లాలోని 20 మండలాల్లో కనీసంతాగటానికి మంచినీరు దొరికే పరిస్థితి కూడా లేదు. గడచిన ఐదేళ్లుగా జిల్లాలో వర్ష ఛాయలే కనపడలేదు. సాధారణ వర్షపాతం కంటే సగం కూడా పడని పరిస్థితి నెలకొంది. కొన్ని మండలాల్లో 50 మీటర్ల నుంచి 65 మీటర్ల లోతున కానీ నీరు లభ్యమయ్యే పరిస్థితి లేదు. కొన్ని ప్రాంతాల్లో బావులు నిలువునా ఎండిపోయాయి. బోర్లు కూడా ఎండిపోయిన పరిస్థితులు పశ్చిమ ప్రాంతంలో నెలకొని ఉంది. ప్రమాదంగా కొమరోలు మండలం దద్దవాడ గ్రామంలో బోర్లలో 200 అడుగుల్లో ఉంది. పెదారవీడు మండలం కంభంపాడు గ్రామంలోనూ ఇదే పరిస్ధితి నెలకొంది. రాష్ట్ర ముఖ్యమంత్రి డాష్ బోర్డులోనూ జిల్లాలోని ఈ రెండు గ్రామాలు అత్యంత లోతులో నీరు అందే గ్రామాలుగా పేర్లు నమోదు అయి ఉన్నాయి. అదీ పాత బోర్లలోని కొన్ని బోర్లలో మాత్రమే 200 అడుగుల్లో నీరు లభ్యమవుతోంది. కొత్తగా బోరు వేయాలంటే దాదాపు 500 నుంచి 800 అడుగుల వరకు భూమి లోపలకు వెళ్లినా గంగమ్మ పైకి ఉబికే పరిస్థితి లేదు. ఒక్కో గ్రామంలో అయితే 1,000 అడుగులు దాటినా బోర్లలో నీరు పడటం లేదు. చివరకు జిల్లాలోని 56 మండలాల్లో 41 మండలాల పరిస్థితి మరీ దయనీయంగా మారింది. సముద్ర తీర ప్రాంత మండలాల్లో కొంతమేర భూగర్భ జలాలు ఒకమోస్తరులో ఉండగా పశ్చిమ ప్రాంతంలో పరిస్థితి మరీ దారుణంగా మారింది. తాగునీటికి కూడా గ్రామాలు అల్లాడిపోతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఎక్కువ శాతం గ్రామాల్లో ఉంది. చివరకు గ్రామాల్లో కూడా బబుల్ క్యాన్లపై ఆధార పడాల్సిన పరిస్థితి నెలకొంది. 15 మండలాల్లో 20 మీటర్ల నుంచి 65 మీటర్ల లోతులో.. జిల్లాలోని 15 మండలాల్లో 20 మీటర్ల నుంచి 65 మీటర్ల లోతులో నీరు అందే పరిస్థితి నెలకొంది. వాటిలో ప్రధానంగా కొమరోలు, పెదారవీడు గిద్దలూరు, తర్లుపాడు, మార్కాపురం, రాచర్ల, బేస్తవారిపేట, పుల్లల చెరువు, దోర్నాల, వెలిగండ్ల, ఎర్రగొండపాలెం, కొరిశపాడు, కొనకనమిట్ల, దొనకొండ, కంభం మండలాలు ఉన్నాయి. ఇకపోతే 8 నుంచి 20 మీటర్ల లోతులో నీరు అందే పరిస్థితిలో 26 మండలాలు ఉన్నాయి. అవి పొన్నలూరు, పామూరు, వీవీపాలెం, పీసీపల్లి, లింగసముద్రం, ముండ్లమూరు, చీమకుర్తి, సీఎస్ పురం, కొండపి, తాళ్ళూరు, హె చ్ఎం పాడు, కనిగిరి, గుడ్లూరు, సంతనూతలపాడు, పొదిలి, మర్రిపూడి,దర్శి, అర్ధవీడు, యద్దనపూడి, బల్లికురవ, అద్దంకి, ఒంగో లు, టంగుటూరు, జరుగుమల్లి, ఇంకొల్లు, జె.పంగులూరు మండలాలు ఉన్నాయి. జిల్లాలో మిగతా మండలాలు 3 నుంచి 8 మీటర్ల లోతులో నీరు అందుతోంది. -
పాతాళంలో భూగర్భ జలం
సాక్షి,మేడ్చల్‌జిల్లా: హైదరాబాద్ మహానగరంలో భాగమైన మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో భూగర్భ జలాలు గణనీయంగా పడి పోయాయి. గతేడాది డిసెంబర్లో జిల్లాలో సగటున భూగర్భ జలమట్టం 8.06 మీటర్లు కాగా, ఈ ఏడాది డిసెంబర్లో అది 12.51 మీటర్ల లోతుకు పడిపోయింది. నగరానికి తాగునీరు అందించే జలశయాల్లో నీటి మట్టాలు ఆశాజనకంగా లేకపోవడంతో ఈ ఏడాది వేసవిలో తాగు నీటి కష్టాలు తçప్పక పోవచ్చునని అధికారవర్గాలు అంచనే వస్తున్నాయి. అయితే, శివారు ప్రాంతాల్లో ఉండే ప్రైవేట్ నీటి సరఫరాదారులు, ఫ్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్లకు చెందిన కొందరు అక్రమదారులు భూగర్భ జలమట్టాలను విచక్షణారహితంగా తోడి జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తుండడంతో ఈ పరిస్థితి తలెత్తిందని, నీటి సమస్యకు పెద్ద ప్రమాదం ఏర్పడిందని ప్రజల్లో అందోళన వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో తాగునీటి నీటి సమస్య తీవ్రంగా ఉందని భావిస్తున్న ప్రాంతాలను గుర్తించిన అధికారులు వేసవిలో ట్యాంకర్ల ద్వారా సరఫరా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మేడ్చల్ నియోజకవర్గం పరిధిలో 104 గ్రామాలకు గోదావరి జలాలను అందించే మిషన్ భగీరథ పనులు పూర్తవడంతో ఆయా గ్రామాల్లోని ప్రజలకు తాగునాటికి కష్టాలు ఉండకపోవచ్చని జిల్లా అధికారులు చెబుతున్నారు. అయితే, జిల్లా పరిధిలో ఓఆర్ఆర్ లోపల ఉన్న బోడుప్పల్, ఫీర్జాదిగూడ మున్సిపాలిటీలతో పాటు పలు ప్రాంతాలకు తాగునీటితో పాటు ఇతర అవసరాలకు నీటి సమస్య తీవ్ర రూపం దాల్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో అధికారంత్రాంగం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తోంది. -
భూగర్భ జలం.. అథఃపాతాళం
సాక్షి, హైదరాబాద్ : పెరిగిపోతున్న బహుళ అంతస్తుల భవంతులు.. అమిత వేగంతో విస్తరిస్తున్న రహదారులు.. రోజురోజుకూ కుచించుకుపోతున్న పచ్చదనం.. పెరిగిపోతున్న కాంక్రీట్ మహారణ్యం.. వర్షం కురిసినా ఆ నీరు భూమిలోకి ఇంకే పరిస్థితులు లేకపోవడం.. బోరుబావులతో విచ్చలవిడిగా తోడటం.. వెరసి భూగర్భజలం.. అథఃపాతాళానికి పడిపోతోంది. భూగర్భ జలమట్టం అంతకంతకూ తగ్గిపోతోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో ఏటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి భూగర్భ జలాలు ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని.. తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’నివేదికలో హెచ్చరించింది. తక్షణమే స్పందించని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కూడా కష్టంగా మారనుందని పేర్కొంది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడటం.. వర్షపునీరు భూమిలోకి ఇంకించేందుకు రీచార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భ జలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గ్రేటర్లో భూగర్భ జలవిల ఇలా.. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా.. బోరుబావులు 23 లక్షల మేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతల సంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. నగరం దక్కన్ పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కష్టమే. రోజువారీగా ఆయా బోరుబావుల నుంచి 650 కోట్ల లీటర్ల మేర భూగర్భ జలాలు తోడుతున్నట్లు అంచనా. నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం భూగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు, కుంటలు లేక 65 శాతం వృథాగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలో భూగర్భ జలాల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్ నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకుంటోంది. 80% వర్షపు నీటిని ఇలా ఒడిసిపట్టొచ్చు.. అమెరికాలోని ఫిలడెల్ఫియా, స్పెయిన్‌లోని బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో వర్షపునీటిలో 80 శాతం నీటిని ఒడిసిపడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న వర్షపునీటిలో 80 శాతాన్ని ఇలానే ఒడిసిపట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిలో బోరుబావికి ఆనుకుని రెండు మీటర్ల వెడెల్పు, రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండరాళ్లు లేదా ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టు ప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతల ఏర్పాటుతో వాటి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీచార్జ్ అవుతాయి. వర్షపునీ టిని ఎక్కడికక్కడే ఇంకింపజేస్తే రోడ్లను ముంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది. ఇంకుడు గుంత ద్వారా వర్షాల సీజన్లో సాధారణ వర్షపాతం(20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో.. రోజుకు 1,600 లీటర్ల నీటిని భూగర్భంలోకి ఇంకించవచ్చు. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా బోరుబావి ఎప్పటికీ వట్టిపోదు. భావితరాలకు వాటర్ బ్యాంక్ ఏర్పాటు చేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం.. జీవం అందుతుంది. ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి.. సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్), 1.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో 50 శాతం నింపాలి. 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లతో మరో 25 శాతం నింపాలి. మిగతా 25 శాతం ఖాళీ ప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపు నీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ఇంకుడు గుంతలపై థీమ్‌పార్క్ వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు 26 రకాల శాస్త్రీయ నమూనాలపై అన్ని వర్గాల వారికీ విస్తృత అవగాహన కల్పించేందుకు జూబ్లీహిల్స్‌లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రెయిన్వాటర్ హార్వెస్టింగ్ థీమ్‌పార్క్ త్వరలో అందుబాటులోకి రానుంది. వర్షపునీటిని భూగర్భంలోకి చేర్చేందుకు జలం.. జీవం కార్యక్రమాన్ని ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తో మహోద్యమంగా చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ సాంకేతికంగా సహకరిస్తోంది. ఇంకుడు గుంతల ఏర్పాటుపై 155313 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
నీళ్ల గోస.. బండి కడితేనే.. గొంతు తడిచేది!
ఎడ్లబండ్లపై డ్రమ్ములతో తాగునీటిని తెచ్చుకుంటున్న వీరు నార్నూర్ మండలం సుంగాపూర్ గ్రామస్తులు. గ్రామంలో భూగర్భ జలాలు అడుగంటి చేతి పంపులు పనిచేయడం లేదు. నీటి ఎద్దడి నెలకొనడంతో ఇలా కిలోమీటర్ దూరం నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. గొంతు తడుపుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. వేసవి వచ్చిందంటే చాలు గ్రామంలో నిత్యం ఇదే పరిస్థితి. ఏటా తాగునీటి సమస్య తలెత్తుతున్నా పాలకులు మాత్రం స్పందించడం లేదు. ఒక్క సుంగాపూర్ మాత్రమే కాదు.. జిల్లాలో చాలా గ్రామాలు నీళ్ల గోసతో అవస్థలు పడుతున్నాయి. సాక్షి, ఆదిలాబాద్‌అర్బన్: జిల్లాలోని పలు గ్రామాలు వేసవి నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. పల్లెల్లో మంచినీటి పథకాలు, చేతిపంపులు పనిచేయకపోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో పరిస్థితి దారుణంగా మారింది. తాగునీటి కోసం అధికారులు ఎన్ని ప్రయత్నాలు చేసినా ప్రజల దాహార్తిని మాత్రం పూర్తిస్థాయిలో తీర్చలేకపోతున్నారు. గ్రామాల్లో ఓ వైపు జనం నీటి ఇబ్బందులు ఎదుర్కొంటుంటే అధికారులు మాత్రం మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయంటూ వేసవిని గడిపేస్తున్నారు. వేసవిలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్తున్నా నీటి సమస్య పరిష్కారం కాలేకపోతోంది. గత ఫిబ్రవరి, మార్చిలో పుష్కలంగా నీళ్లు వచ్చిన కొన్ని చేతిపంపులు మే నెలలో పూర్తిగా అడుగంటిపోవడంతో అవి ఇప్పుడు పని చేయడం లేదు. దీంతో మరిన్ని గ్రామాలు తాగునీటి ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లాలోని నీటి ఎద్దడి ఉన్న 17 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలో పరిస్థితి ఇదీ.. వేసవిలో గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నివారణకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏటా క్రాష్ ప్రోగ్రాం నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ద్వారా జిల్లాలో ఎన్ని హ్యాబిటేషన్లు, వాటి పరిధిలో పని చేస్తున్న చేతిపంపులు ఎన్ని? పని చేయనివి ఎన్ని? మంచినీటి పథకాలెన్ని? అందులో పనిచేస్తున్నవి ఎన్ని? ఎన్ని బోర్లు ఉన్నాయి.. వేటికి మరమ్మతు చేయించాలి.. దానికి అయ్యే అంచనా వ్యయం.. కొన్ని గ్రామాల్లో నీటి పథకాలు లేకపోవడంతో ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయడం, ఇలా అన్నింటీని క్రాష్ ప్రోగ్రాం ద్వారా అంచనా వేసి ఓ నివేదిక తయారు చేస్తారు. ఆ నివేదిక ప్రకారం జిల్లాలోని మొత్తం 243 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 502 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాల పరిధిలో 5,219 చేతిపంపులు ఉన్నాయి. ఇందులో 4,718 మాత్రమే పని చేస్తున్నాయి. పని చేయని చేతిపంపుల్లో సగానికిపైగా నీరు అందకపోవడం, ఈ రెండు నెలల్లో 110పైగా చేతిపంపులు మరమ్మతుకు గురికావడంతో తాగునీటి కోసం తండ్లాట ఎక్కువైంది. కొన్ని గ్రామాలకు రెండు, మూడు చేతిపంపులు ఉన్న చోట భూగర్భ జలాలు అడుగంటడంతో ఆ గ్రామాలు నీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. అయితే చెడిపోయిన చేతిపంపులకు అప్పటికప్పుడే మరమ్మతు చేయిస్తున్నామని చెబుతున్నా అధికారులు తాగునీటి ఇబ్బందులు ఎందుకు తలెత్తుతున్నాయో స్పష్టం చేయలేకపోతున్నారు. ప్రతి గ్రామ పంచాయతీలో మెకానిక్‌ను అందుబాటులో ఉంచి ఎప్పటికప్పుడు చేతిపంపులను పర్యవేక్షిస్తున్నామని మాత్రం పేర్కొంటున్నారు. జిల్లాలో మరో 585 బావులు ఉన్నాయి. ఇందులో 492 బావులు పని చేయగా, మిగతా 93 బావులు పని చేయడం లేదు. తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ఒక్కో గ్రామ పంచాయతీ ఖాతాలో రూ.3 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు నిధులు అందుబాటులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా అన్ని జీపీల నిధులు కలిపి సుమారు రూ.13 కోట్ల నిధులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా, మిషన్ భగీరథ పనుల్లో అధికారులు బీజీగా ఉన్నారు. ఏప్రిల్ చివరి నాటికే మిషన్ నీళ్లను అందిస్తామనుకున్నా ఇంకా చాలా గ్రామాలకు పైపులైన్ పనులు పూర్తి కాకపోవడంతో అది సాధ్యం కాలేకపోయింది. అడుగంటిన భూగర్భజలాలు జిల్లాలో గతేడాదితో పోల్చితే ఈ ఏడాది భూగర్భ జలాలు గణనీయంగా పడిపోవడంతో తాగునీటి ఎద్దడి తీవ్రమైంది. గతేడాది జనవరితో పరిగణలోకి తీసుకుంటే ఈ ఏడాది జనవరిలో మరింత లోతుకు పడిపోయాయి. జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఎండలు తక్కువగా ఉండడంతో చేతిపంపులకు అందిన నీరు ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రతల కారణంగా భూగర్భ జలాలు మరింత లోతుకు పడిపోవడంతో చేతిపంపులకు నీరందక వృథాగా మారుతున్నాయి. అయితే మరో నెల పాటు నీటి ఎద్దడి ఉంటుందని, వర్షాలు పడితేనే బోర్లకు, బావులకు నీళ్లు వచ్చే ఆస్కారం ఉంటుందని అధికారులు పేర్కొంటున్నారు. జిల్లాలోని అనుబంధ గ్రామాలు : 1,175 చేతిపంపులు : 5,219 పని చేయనివి : 501 పని చేస్తున్నవి : 4,718 బావులు : 585 పని చేయనివి : 93 పని చేస్తున్నవి : 492 అందుబాటులో ఉన్న నిధులు : రూ.13 కోట్లు పంచాయతీల్లో నిధులున్నాయి గ్రామాల్లో తాగునీటి ఎద్దడి సమస్యను అధిగమించేందుకు, చేతిపంపుల మరమ్మతు చేయించేందుకు సరిపడా నిధులు అందుబాటులో ఉన్నాయి. తాగునీటికి ఇబ్బంది రాకుండా ముందస్తుగానే చర్యలు తీసుకున్నాం. జిల్లాలోని జీపీలో సుమారు రూ.13 కోట్లు అందుబాటులో ఉన్నాయి. నిధుల కొరత లేదు.– జితేందర్‌రెడ్డి, ఇన్చార్జి డీపీవో -
'గుక్కెడు' గుబులు!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వేగంగా పడిపోతున్న భూగర్భ జలమట్టాలు, ప్రాజెక్టుల్లో తగ్గిపోతున్న నిల్వలు.. ప్రమాద ఘంటికలు మోగి స్తున్నాయి. వేసవి పెరుగుతున్న కొద్దీ నీటి కొరత తీవ్రమయ్యే సూచనలు ఆందోళన కలిగిస్తున్నాయి. గతేడాది డిసెంబర్‌తో పోలిస్తే రాష్ట్రంలో ప్రస్తుతం భూగర్భ జలమట్టాలు 2.72 మీటర్ల మేర లోతుకు పడిపోయాయి. శ్రీశైలం ప్రాజెక్టులోనిల్వలు ఇప్పటికే డెడ్ స్టోరేజీకి చేరగా.. నాగార్జునసాగర్‌లో మరికొద్ది రోజుల్లోనే నీటి నిల్వ కనీస మట్టానికి తగ్గిపోనుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో సాగునీటికే కాదు.. గుక్కెడు తాగునీటికీ కటకట ఏర్పడే పరిస్థితి ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పాతాళానికి భూగర్భ జలాలు రాష్ట్రంలో భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతోంది. యాసంగి పంటల సాగు, వేసవి ఉధృతి పెరగడంతో నీటి మట్టం వేగంగా తగ్గుతోంది. వ్యవసాయానికి నిరంతర విద్యుత్ సరఫరాకు ముందు (డిసెంబర్ నాటికి) రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం 9.18 మీటర్లుగా ఉండగా.. ఇప్పుడు అది 11.90 మీటర్ల లోతుకు పడిపోయింది. మూడు నెలల వ్యవధిలోనే ఏకంగా 2.72 మీటర్ల మేర తగ్గిపోవడం ఆందోళనకరం. ఇక గతేడాది మార్చి నెలలో నమోదైన రాష్ట్ర సగటు భూగర్భ జలమట్టం 10.96 మీటర్లతో పోల్చినా.. ఈసారి 0.94 మీటర్ల మేర తగ్గిపోవడం గమనార్హం. గతేడాదితో పోలిస్తే అత్యధికంగా మెదక్ జిల్లాలో.. 4.12 మీటర్లు, సిరిసిల్లలో 3.53, పెద్దపల్లి 3.43, నిజామాబాద్ 3.93 మీటర్ల మేర మట్టాలు పడిపోయాయి. మున్ముందు భూగర్భ జలాలు మరింతగా తగ్గిపోయే ప్రమాదం కనిపిస్తోంది. భూగర్భ జలాలు తగ్గి తాగు, సాగునీటికి ఇప్పటికే ఇక్కట్లు మొదలైన నేపథ్యంలో.. అటు ప్రధాన ప్రాజెక్టుల్లోనూ నీటిమట్టాలు వేగంగా తగ్గిపోవడం ప్రమాద ఘంటికలు మోగిస్తోంది. సాగర్‌లోనూ అదే దుస్థితి.. నాగార్జున సాగర్‌లోనూ నీటిమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం సాగర్‌లో 513.4 అడుగుల వద్ద 137.52 టీఎంసీల నీటి లభ్యత ఉంది. ఇందులో కనీస నీటిమట్టం 510 అడుగులకు పైన వినియోగార్హమైన నీరు కేవలం 5.8 టీఎంసీలే. ప్రస్తుతం రోజుకు 1,600 క్యూసెక్కుల మేర నీటిని ఇరు రాష్ట్రాలు తమ అవసరాలకు తీసుకుంటున్నాయి. కృష్ణా బోర్డు చెబుతున్న లెక్కల ప్రకారం.. సాగర్‌లో 500 అడుగుల వరకు నీటిని తీసుకునే వెసులుబాటు ఉంది. ఇలా చూసినా మొత్తంగా లభ్యత జలాలు 12.84 టీఎంసీలు మాత్రమే. ఈ నీటిలో తెలంగాణకు 7.84 టీఎంసీలు, ఏపీకి 5 టీఎంసీలు దక్కుతాయని అంచనా. వర్షాలు సమృద్ధిగా కురిసే వరకు ఈ నీటినే సాగు, తాగు అవసరాలకు వినియోగించుకోవాల్సి ఉండనుంది. కృష్ణా బేసిన్లో ఆగస్టు, సెప్టెంబర్ నాటికి కూడా ప్రవాహాలు వచ్చే పరిస్థితి ఉండదు. ఈ నేపథ్యంలో మే తర్వాత నీటి కష్టాలు తీవ్రమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెండు మూడు రోజుల్లో శ్రీశైలం ఖాళీ! శ్రీశైలం ప్రాజెక్టు రెండు మూడు రోజుల్లో ఖాళీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీశైలం కనీస నీటిమట్టం 834 అడుగులే అయినా.. 800 అడు గుల డెడ్ స్టోరేజీ వరకు ఉన్న నీటిని కూడా కృష్ణా బోర్డు తెలంగాణ, ఏపీలకు పంచేసిం ది. ప్రస్తుతం శ్రీశైలంలో నీటిమట్టం 803.2 అడుగులకు చేరింది. బుధవారం పవర్‌హౌజ్‌ల ద్వారా 2,797 క్యూసెక్కుల మేర నీటి వినియోగం జరిగింది. ఇలాగే కొనసాగితే రెండు మూడు రోజుల్లోనే నీటిమట్టం 800 అడుగులకు చేరనుంది. ఆ తర్వాత నీటిని తీసుకోవాలంటే కష్టమే. కృష్ణాబోర్డు అనుమతించినా.. మరో 2 నుంచి 3 టీఎంసీలకు మించి తీసుకునే అవకాశం లేదు. దాంతో నాగార్జునసాగర్‌లోని నీటిపైనే ఆధారపడాల్సి ఉండనుంది. టెలిమెట్రీ బాధ్యత సీడబ్ల్యూపీఆర్ఎస్కు.. నాగార్జున సాగర్, శ్రీశైలం, జూరాల, పులిచింతల తదితర ప్రాజెక్టుల పరిధిలో 42 చోట్ల టెలిమెట్రీ పరికరాల ఏర్పాటు బాధ్యతను సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్‌కు అప్పగిస్తూ కృష్ణా బోర్డు నిర్ణయం తీసుకుంది. ఇందులో మొదటి విడతలో ఇప్పటికే గుర్తించిన 18 ప్రాంతాల్లో మూడు చోట్ల మినహా.. మిగతా చోట్ల మళ్లీ కొత్త వాటిని అమర్చే బాధ్యతను కట్టబెట్టింది. దీంతోపాటు హంద్రీనీవా, పోతిరెడ్డిపాడు, బంకచర్ల తదితర చోట్ల కూడా కొత్త పరికరాలను ఏర్పాటు చేయాలని సూచించింది.