ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, హైదరాబాద్ : పెరిగిపోతున్న బహుళ అంతస్తుల భవంతులు.. అమిత వేగంతో విస్తరిస్తున్న రహదారులు.. రోజురోజుకూ కుచించుకుపోతున్న పచ్చదనం.. పెరిగిపోతున్న కాంక్రీట్ మహారణ్యం.. వర్షం కురిసినా ఆ నీరు భూమిలోకి ఇంకే పరిస్థితులు లేకపోవడం.. బోరుబావులతో విచ్చలవిడిగా తోడటం.. వెరసి భూగర్భజలం.. అథఃపాతాళానికి పడిపోతోంది. భూగర్భ జలమట్టం అంతకంతకూ తగ్గిపోతోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో ఏటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.
దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి భూగర్భ జలాలు ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని.. తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్‌మెంట్ ఇండెక్స్’నివేదికలో హెచ్చరించింది. తక్షణమే స్పందించని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కూడా కష్టంగా మారనుందని పేర్కొంది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడటం.. వర్షపునీరు భూమిలోకి ఇంకించేందుకు రీచార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భ జలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది.
గ్రేటర్‌లో భూగర్భ జలవిల ఇలా..
సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా.. బోరుబావులు 23 లక్షల మేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతల సంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. నగరం దక్కన్ పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కష్టమే. రోజువారీగా ఆయా బోరుబావుల నుంచి 650 కోట్ల లీటర్ల మేర భూగర్భ జలాలు తోడుతున్నట్లు అంచనా. నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం భూగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు, కుంటలు లేక 65 శాతం వృథాగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలో భూగర్భ జలాల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్ నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకుంటోంది.
80% వర్షపు నీటిని ఇలా ఒడిసిపట్టొచ్చు..
- అమెరికాలోని ఫిలడెల్ఫియా, స్పెయిన్‌లోని బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో వర్షపునీటిలో 80 శాతం నీటిని ఒడిసిపడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న వర్షపునీటిలో 80 శాతాన్ని ఇలానే ఒడిసిపట్టే అవకాశం ఉంది.
- ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిలో బోరుబావికి ఆనుకుని రెండు మీటర్ల వెడెల్పు, రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండరాళ్లు లేదా ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్‌సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి.
- ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్‌లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి.
- లోతట్టు ప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతల ఏర్పాటుతో వాటి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీచార్జ్ అవుతాయి. వర్షపునీ టిని ఎక్కడికక్కడే ఇంకింపజేస్తే రోడ్లను ముంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది.
- ఇంకుడు గుంత ద్వారా వర్షాల సీజన్‌లో సాధారణ వర్షపాతం(20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో.. రోజుకు 1,600 లీటర్ల నీటిని భూగర్భంలోకి ఇంకించవచ్చు. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా బోరుబావి ఎప్పటికీ వట్టిపోదు. భావితరాలకు వాటర్ బ్యాంక్ ఏర్పాటు చేసిన వారవుతారు.
- సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం.. జీవం అందుతుంది.
ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి..
సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్), 1.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో 50 శాతం నింపాలి. 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లతో మరో 25 శాతం నింపాలి. మిగతా 25 శాతం ఖాళీ ప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపు నీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి.
ఇంకుడు గుంతలపై థీమ్‌పార్క్
వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు 26 రకాల శాస్త్రీయ నమూనాలపై అన్ని వర్గాల వారికీ విస్తృత అవగాహన కల్పించేందుకు జూబ్లీహిల్స్‌లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రెయిన్‌వాటర్ హార్వెస్టింగ్ థీమ్‌పార్క్ త్వరలో అందుబాటులోకి రానుంది. వర్షపునీటిని భూగర్భంలోకి చేర్చేందుకు జలం.. జీవం కార్యక్రమాన్ని ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తో మహోద్యమంగా చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి జేఎన్‌టీయూ సాంకేతికంగా సహకరిస్తోంది. ఇంకుడు గుంతల ఏర్పాటుపై 155313 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు.
– ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్
Comments
Please login to add a commentAdd a comment