water management
-
భూగర్భ జలం.. అథఃపాతాళం
సాక్షి, హైదరాబాద్ : పెరిగిపోతున్న బహుళ అంతస్తుల భవంతులు.. అమిత వేగంతో విస్తరిస్తున్న రహదారులు.. రోజురోజుకూ కుచించుకుపోతున్న పచ్చదనం.. పెరిగిపోతున్న కాంక్రీట్ మహారణ్యం.. వర్షం కురిసినా ఆ నీరు భూమిలోకి ఇంకే పరిస్థితులు లేకపోవడం.. బోరుబావులతో విచ్చలవిడిగా తోడటం.. వెరసి భూగర్భజలం.. అథఃపాతాళానికి పడిపోతోంది. భూగర్భ జలమట్టం అంతకంతకూ తగ్గిపోతోంది. హైదరాబాద్‌తో పాటు దేశంలోని మెట్రో నగరాల్లో ఏటేటా భూగర్భ జలాలు అడుగంటిపోతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని 21 మెట్రో నగరాల్లో 2020 నాటికి భూగర్భ జలాలు ప్రస్తుతం ఉన్న మట్టం కంటే అథఃపాతాళంలోకి చేరుకునే ప్రమాదం ఉందని.. తక్షణం మేలుకోకపోతే 2030 నాటికి పరిస్థితి మరింత విషమిస్తుందని నీతిఆయోగ్ తాజాగా విడుదల చేసిన ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’నివేదికలో హెచ్చరించింది. తక్షణమే స్పందించని పక్షంలో 2030 నాటికి దేశజనాభాలో 40 శాతం మందికి స్వచ్ఛమైన తాగునీరు అందడం కూడా కష్టంగా మారనుందని పేర్కొంది. ప్రధానంగా ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాల్లో భూగర్భజలాలను విచ్చలవిడిగా తోడటం.. వర్షపునీరు భూమిలోకి ఇంకించేందుకు రీచార్జింగ్ పిట్స్ అవసరమైన మేరకు అందుబాటులో లేకపోవడంతో ఏటా భూగర్భ జలమట్టాలు సుమారు 0.5 మీటర్ల చొప్పున అడుగంటుతున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. గ్రేటర్లో భూగర్భ జలవిల ఇలా.. సుమారు 625 చదరపు కిలోమీటర్ల పరిధిలో విస్తరించిన గ్రేటర్ హైదరాబాద్ జనాభా కోటికి చేరువైంది. మహానగరం పరిధిలో భవంతుల సంఖ్య సుమారు 25 లక్షలు కాగా.. బోరుబావులు 23 లక్షల మేర ఉన్నాయి. కానీ ఇంకుడు గుంతల సంఖ్య ఐదు లక్షలకు మించిలేవు. నగరం దక్కన్ పీఠభూమి కావడంతో రాతినేలలోకి వర్షపునీరు ఇంకడం చాలా ప్రాంతాల్లో కష్టమే. రోజువారీగా ఆయా బోరుబావుల నుంచి 650 కోట్ల లీటర్ల మేర భూగర్భ జలాలు తోడుతున్నట్లు అంచనా. నగరంలో ఏటా కురుస్తున్న వర్షపాతం భూగర్భంలోకి ఇంకేందుకు అవసరమైన ఇంకుడు గుంతలు, కుంటలు లేక 65 శాతం వృథాగా మూసీలో కలుస్తోంది. దీంతో నగరంలో భూగర్భ జలమట్టాలు పడిపోతున్నాయి. గ్రేటర్ శివార్లలో భూగర్భ జలాల వినియోగం ఎక్కువగా ఉంది. ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ఇష్టారాజ్యంగా బోరుబావులు తవ్వి ట్యాంకర్ నీళ్లను విక్రయించి రూ.కోట్లు సొమ్ము చేసుకుంటోంది. 80% వర్షపు నీటిని ఇలా ఒడిసిపట్టొచ్చు.. అమెరికాలోని ఫిలడెల్ఫియా, స్పెయిన్‌లోని బార్సిలోనా మహానగరాల్లో ఇంకుడు గుంతలను విస్తృతంగా తవ్వడంతో వర్షపునీటిలో 80 శాతం నీటిని ఒడిసిపడుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో కురుస్తున్న వర్షపునీటిలో 80 శాతాన్ని ఇలానే ఒడిసిపట్టే అవకాశం ఉంది. ఉదాహరణకు 200 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఇంటిలో బోరుబావికి ఆనుకుని రెండు మీటర్ల వెడెల్పు, రెండు మీటర్ల లోతున ఇంకుడు గుంత తవ్వాలి. గుంత పూడుకుపోకుండా చుట్టూ లోపలి వైపు నుంచి బండరాళ్లు లేదా ఇటుకలతో మధ్యలో సన్నటి ఖాళీలుంచి పేర్చాలి. గుంతపై ఆర్సీసీ సిమెంటుతో తయారు చేసిన జాలిని ఏర్పాటు చేయాలి. జాలికి ఉన్న పెద్ద రంధ్రాల గుండా వర్షపునీరు గుంతలోకి మళ్లేలా ఏర్పాటు చేయాలి. ఇంటి పైకప్పుపై చేరిన వర్షపునీరు నేరుగా ఈ గుంతలోకి చేరేలా ఏర్పాటు చేయాలి. ఇలా చేస్తే రోజుకు సుమారు 50 నుంచి 80 మిల్లీమీటర్ల వర్షపాతాన్ని బోరుబావికి సమీపంలో ఇంకించవచ్చు. సీజన్లో నిల్వ చేసిన ఈ నీరు ఐదుగురు సభ్యులున్న కుటుంబానికి మూడు నెలల అవసరాలకు సరిపోతాయి. లోతట్టు ప్రాంతాలు, పార్కులో పెద్ద విస్తీర్ణంలో ఇంకుడు గుంతల ఏర్పాటుతో వాటి సమీప ప్రాంతాల్లో బోరుబావులు రీచార్జ్ అవుతాయి. వర్షపునీ టిని ఎక్కడికక్కడే ఇంకింపజేస్తే రోడ్లను ముంచెత్తే వర్షపునీరు సైతం తగ్గుముఖం పడుతుంది. ఇంకుడు గుంత ద్వారా వర్షాల సీజన్లో సాధారణ వర్షపాతం(20 మిల్లీమీటర్లు) నమోదయ్యే రోజుల్లో.. రోజుకు 1,600 లీటర్ల నీటిని భూగర్భంలోకి ఇంకించవచ్చు. ఇంకుడు గుంతలు తవ్వడం ద్వారా బోరుబావి ఎప్పటికీ వట్టిపోదు. భావితరాలకు వాటర్ బ్యాంక్ ఏర్పాటు చేసిన వారవుతారు. సామాజిక బాధ్యతగా ఇంకుడు గుంత తవ్వడం ద్వారా ఇంట్లో పెంచుకునే మొక్కలకు సైతం జలం.. జీవం అందుతుంది. ఇంట్లో ఇంకుడు గుంత ఇలా ఉండాలి.. సాధారణ మధ్యతరగతి వినియోగదారులు తమ ఇళ్లలో బోరుబావికి సమీపంలో రెండు మీటర్ల లోతు(డెప్త్), 1.5 మీటర్ల పొడవు, 1.5 మీటర్ల వెడల్పుతో ఇంకుడు గుంతను తవ్వాలి. ఈ గుంతను 40 ఎంఎం పరిమాణంలో ఉండే కాంక్రీటు రాళ్లతో 50 శాతం నింపాలి. 20 ఎంఎం పరిమాణంలో ఉండే రాళ్లతో మరో 25 శాతం నింపాలి. మిగతా 25 శాతం ఖాళీ ప్రదేశాన్ని దొడ్డు ఇసుక(బఠాణా)తో నింపాలి. దీని చుట్టూ వ్యర్థాలు చేరకుండా ఒక అడుగు ఎత్తున చిన్న గోడ నిర్మించాలి. గుంతలోకి ఇంటి పైకప్పు నుంచి నేరుగా వర్షపు నీరు చేరేందుకు పెద్ద పైపును ఏర్పాటు చేయాలి. ఇంకుడు గుంతలపై థీమ్‌పార్క్ వర్షపునీటిని ఒడిసిపట్టేందుకు 26 రకాల శాస్త్రీయ నమూనాలపై అన్ని వర్గాల వారికీ విస్తృత అవగాహన కల్పించేందుకు జూబ్లీహిల్స్‌లో జలమండలి ఆధ్వర్యంలో నిర్మిస్తున్న రెయిన్వాటర్ హార్వెస్టింగ్ థీమ్‌పార్క్ త్వరలో అందుబాటులోకి రానుంది. వర్షపునీటిని భూగర్భంలోకి చేర్చేందుకు జలం.. జీవం కార్యక్రమాన్ని ప్రజలు, స్వచ్ఛంద సంస్థల భాగస్వామ్యం తో మహోద్యమంగా చేపడుతున్నాం. ఈ కార్యక్రమానికి జేఎన్టీయూ సాంకేతికంగా సహకరిస్తోంది. ఇంకుడు గుంతల ఏర్పాటుపై 155313 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. – ఎం.దానకిశోర్, జలమండలి మేనేజింగ్ డైరెక్టర్ -
భారత్‌లో తీవ్రమైన నీటి ఎద్దడి
న్యూఢిల్లీ: భారత చరిత్రలోనే తొలిసారిగా దేశం దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటోందని నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ పరిస్థితి మరింత ఆందోళనకరంగా మారుతోందని ‘కంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్’ పేరుతో గురువారం విడుదల చేసిన నివేదికలో స్పష్టం చేసింది. ‘ప్రస్తుతం దేశంలో 60కోట్ల మంది తీవ్రమైన నీటి కొరతతో ఉన్నారు. సరైన తాగునీరు లేనికారణంగా ఏటా 2లక్షల మంది చనిపోతున్నారు’ అని ఈ నివేదికలో నీతిఆయోగ్ పేర్కొంది. ఇప్పటినుంచే దేశంలో జలవనరులు, వాటి వినియోగంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరాన్ని గుర్తుచేసింది. ‘2030 కల్లా దేశంలో నీటి సరఫరాకు రెట్టింపుగా డిమాండ్ ఉండబోతుంది. దేశ ప్రజలందరికీ నీటి కొరత తప్పేట్లులేదు. దీని కారణంగా జీడీపీ 6 శాతానికి పడిపోతుంది’ అని ఈ నివేదిక విడుదల సందర్భంగా కేంద్ర జలవనరుల మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు. 122 దేశాల్లోని పరిస్థితుల ఆధారంగా వివిధ అంతర్జాతీయ సంస్థలు సిద్ధం చేసిన నీటి నాణ్యత సూచీలో భారత్ 120వ స్థానంలో ఉండటం.. దేశంలోని 70% నీరు కలుషితమవడాన్నీ ఈ నివేదిక పేర్కొంది. 2030 కల్లా ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్ సహా 21 నగరాల్లో భూగర్భజలాలు అడుగంటిపోతాయని.. దీంతో 10కోట్ల మందిపై ప్రభావం ఉంటుందంది. -
చివరి ఆయకట్టుకూ నీరందాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత రబీలో సాగు నీటి ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణను పకడ్బందీగా చేయాలని నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అధికారులను ఆదేశించారు. శ్రీరాంసాగర్, నాగార్జునసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల కింద చివరి ఆయకట్టుకు సైతం నీరందేలా చర్యలు తీసుకోవాలన్నారు. అలాగే మిషన్ భగీరథ పథకానికి కేటాయించిన నీటిని జలాశయాల్లో కాపాడుకోవాలని సూచించారు. బుధవారం భారీ ప్రాజెక్టుల కింద నీటి నిర్వహణ, సాధించిన ఆయకట్టు, మిషన్ భగీరథ అవసరాలపై సంబంధిత చీఫ్ ఇంజనీర్లు, సూపరింటెండింగ్ ఇంజనీర్లతో మంత్రి జలసౌధలో సమీక్షించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు కింద రబీలో ఎల్ఎండీ ఎగువన 4 లక్షల ఎకరాలకు, ఎల్ఎండీ దిగువన 1.15 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఈ లక్ష్యాలను సాధిస్తూనే మిషన్ భగీరథ అవసరాలకు జలాశయాల్లో నీటిని కాపాడుకోవాలని సూచించారు. ప్రాజెక్టు పరిధిలో కాల్వలపై రాత్రి వేళల్లో కూడా గస్తీ నిర్వహించాలన్నారు. అక్రమంగా తూములు, కాల్వలు పగులగొట్టకుండా, గేట్లను ఎత్తివేయకుండా చూడాలని చెప్పారు. అవసరమైతే పోలీసు, రెవెన్యూ అధికారుల సహాయం తీసుకోవాలని సూచించారు. 19 లక్షల ఎకరాలకు నీరు.. ప్రస్తుతం శ్రీరాంసాగర్‌లో 10 టీఎంసీల నీరు ఉందని చీఫ్ ఇంజనీర్ మంత్రికి తెలిపారు. మరో నాలుగు తడులకు 4 టీఎంసీల నీరు అవసరమని.. మిగతా 6 టీఎంసీల నీటిని మిషన్ భగీరథ అవసరాలను వినియోగిద్దామని చీఫ్ ఇంజనీర్ అన్నారు. ఏప్రిల్ 16న ఎస్సారెస్పీ కాల్వ మూసివేయాలని, మార్చి 20న ఎల్ఎండీ కాలువ మూసివేయాలని హరీశ్ ఆదేశించారు. ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో 32 టీఎంసీలు, సాగర్‌లో 30 టీఎంసీలు మొత్తం కలిపి 62 టీఎంసీల నీటి లభ్యత ఉందని ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ సునీల్ తెలిపారు. ఇప్పటికే 7 తడులకు నీటిని విడుదల చేశామని, మరో నాలుగు తడులకు నీరివ్వాల్సిన అవసముందన్నారు. ఏప్రిల్ 5న సాగర్ ఎడమ కాలువ తూము మూసివేయాలని హరీశ్ సూచించారు. ఈ రబీలో శ్రీరాంసాగర్ కింద 6 లక్షల ఎకరాలు, నాగార్జునసాగర్ కింద 5 లక్షల ఎకరాలు, నిజాంసాగర్ కింద 2 లక్షల ఎకరాలు, మీడియం ప్రాజెక్టుల కింద 6 లక్షల ఎకరాలకు కలిపి మొత్తంగా 19 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామని మంత్రి తెలిపారు. సీతారామ ప్రాజెక్టుపై సమీక్ష సీతారామ ఎత్తిపోతలపైనా మంత్రి హరీశ్ సమీక్షించారు. ఈ సమీక్షకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా హాజరయ్యారు. సీతారామ లిఫ్ట్ పథకం ఫేజ్ –1లో 3 పంప్‌హౌస్‌ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని హరీశ్, తుమ్మల అధికారులను ఆదేశించారు. భూసేకరణ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలని సూచించారు. సీఎస్ జోషికి సన్మానం.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారి జలసౌధకు వచ్చిన ఎస్కే జోషిని మంత్రి హరీశ్ ఘనంగా సన్మానించారు. తెలంగాణ పునర్నిర్మాణంలో స్పెషల్ చీఫ్ సెక్రెటరీగా, ఇరిగేషన్ వ్యవహారాలను పర్యవేక్షించిన జోషి అత్యంత బాధ్యతాయుతంగా పనిచేశారని కొనియాడారు. తన 34 ఏళ్ల సర్వీస్‌లో ఎందరో మంత్రులను చూశానని, కానీ హరీశ్ వంటి మంత్రిని చూడలేదని జోషి అన్నారు. ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయడానికి మంత్రి పడుతున్న శ్రమను ఆయన కొనియాడారు. -
ప్రజారోగ్యంతో చెలగాటం
తాగునీటిలో బల్లులు, పురుగులు శుద్ధి చేయకుండానే ప్రజలకు సరఫరా డయేరియా, చర్మవ్యాధులతో జనం సతమతం అస్తవ్యస్తంగా తాగునీటి పథకం ప్లాంట్ నిర్వహణ మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి ధర్మవరం: కలుషితమైన తాగునీటిని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ధర్మవరం పట్టణ ప్రజల దాహార్తి తీర్చాలన్న ఉద్దేశ్యంతో కోట్లరూపాయలు వెచ్చించి తన హయాంలో వాటర్‌ప్లాంటు నిర్మించి ఇస్తే.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం నిర్వహణ కూడా సక్రమంగా చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని తిక్కస్వామినగర్లో ఉన్న ‘కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తాగునీటి పథకం’ నిర్వహణ తీరును పరిశీలించారు. వాటర్‌ప్లాంట్‌లో నీటి శుద్ధి ఎలా జరుగుతోందో స్వయంగా చూసి తెలుసుకున్నారు. నీటి తొట్టెల్లో బల్లుల కళేబరాలు, క్రిమికీటకాలు తేలుతుండటం గమనించారు. తాగునీరు ప్రవహించే కాలువలను శుభ్రం చేయకపోవడంతో పాచిపట్టి ఉండటాన్ని, నీటిని శుద్ధి చేసేందుకు రసాయనాలను, ఆలంను వినియోగించకుండా క్లోరిన్ మాత్రమే కలిపి నీటిని సరఫరా చేస్తున్నానట్లు గుర్తించారు. నీటి తొట్టెలను ఎన్నిరోజులకొకసారి శుభ్రం చేస్తారని అక్కడున్న వాటర్సప్లై సిబ్బందిని ప్రశ్నించగా.. ప్రతి రోజూ శుభ్రం చేస్తున్నామని చెప్పడంతో మరి బల్లులు, పురుగులు ఎలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తాగేనీరు ఇంత అధ్వానంగా ఉంటే ఎలా. ఈ నీటిని మీరు తాగుతారా.? అన్ని ప్రశ్నించారు. ప్లాంటులో నీటిని శుభ్రం చేయకుండా చిత్రావతి నది నుంచి వచ్చిన నీటిని అలాగే వాటర్బెడ్లలోకి పంపి నేరుగా ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నీటిని ప్రజలు ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచితే పురుగులు పడుతున్నాయన్నారు. తాగునీరు మురుగునీటి కన్నా అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిని తాగడంతో చాలామంది డయేరియా, చర్మవ్యాధుల బారినపడ్డారన్నారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, నాయకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. కమీషన్ల కోసం కరెంట్ బిల్లుల పెండింగ్ ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో రూ. 9.74 కోట్లు కరెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఏం చేస్తున్నారని కేతిరెడ్డి ప్రశ్నించారు. 2015–16 సంవత్సరానికి గాను ధర్మవరం మున్సిపాలిటీకి వివిధ పన్నుల రూపంలో రూ.20.53 కోట్లు వస్తే ఆ నిధులన్నింటినీ కమీషన్ల కోసం, వివిధ పనులకు ఖర్చుచేశారన్నారు. ప్రతి పనికీ 5 శాతం అధికంగా టెండర్లను పిలిచి ప్రజాధనాన్ని అధికారపార్టీ నాయకులు దోచుకుంటునారని విమర్శించారు. వాస్తవానికి 2009 సంవత్సరంలో మున్సిపాలిటీ పరిధిలో వసూలయ్యే పన్నుల మొత్తాన్ని కరెంట్బిల్లులు, కార్మికుల వేతనాలకు మాత్రమే ఖర్చుచేయాలని జీఓ జారీ చేసిందన్నారు. అయితే కరెంట్ బిల్లులు చెల్లిస్తే తమకు కమీషన్లు రావన్న ఉద్దేశంతో అధికారపార్టీనాయకులు, ఇక్కడి అధికారులతో కుమ్మక్కై ఆ మొత్తాన్ని జనరల్ ఫండ్కింద ఖర్చుచేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.9.74 కోట్ల కరెంట్ బిల్లులు బకాయిల్లో రూ.4.84 కోట్లు అపరాధరుసుమే ఉందంటే వీరు ప్రజాధనాన్ని ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుందన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గానికి కానీ, ఇక్కడి ప్రజాప్రతిధులకు కానీ ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ఇంత మంది రోగాల బారిన పడతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. -
భవిష్యత్ ఎన్నికలను నిర్ధేశించేవి ఇవే...
న్యూఢిల్లీః భవిష్యత్తులో జరిగే ఎన్నికలను నిర్ణయించేది నీరేనని నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ పేర్కొన్నారు. సమర్థ నీటి నిర్వహణ కీలక అంశంగా ముందుకొస్తుందని నొక్కిచెప్పారు.ప్రజలకు నీటి అవసరాలు ప్రాధాన్య అంశం కావడంతో జల వనరులను సమర్థంగా నిర్వహించిన ప్రభుత్వాలనే ప్రజలు ఎన్నుకుంటారని అన్నారు.పరిశ్రమ సంస్థ సీఐఐ మంగళవారం నిర్వహించిన జల సదస్సులో అమితాబ్ కాంత్ ఈ వ్యాఖ్యలు చేశారు. సమర్థ నీటి నిర్వహణ చేపట్టని ప్రభుత్వాలు కనుమరుగవక తప్పదని హెచ్చరించారు. పంజాబ్, హర్యానా, ఢిల్లీ సహా ఉత్తరాదిలో సరైన నియంత్రణలు లేకపోవడంతో గత దశాబ్ధంలో విపరీతంగా భూగర్భ జలాలను తోడేశారని అన్నారు.పంజాబ్, ఢిల్లీలు క్రమంగా ఎడారిగా మారతాయని ఆందోళన వ్యక్తం చేశారు. భారత్ నీటి కొరత కలిగిన దేశంగా మారుతున్న క్రమంలో సమర్ధ జలవనరుల నిర్వహణ చేపట్టాల్సిన అవసరం ఉందన్నారు. మనం మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించాలన్నా, మన ప్రజల ఆర్థిఖ ప్రమాణాలు మెరుగుపరచాలన్నా నీటి వనరులే కీలకమని అమితాబ్ కాంత్ వ్యాఖ్యానించారు. -
అభివృద్ధికి ‘ప్రత్యేక’ బ్రేక్
సాక్షి, రాజమండ్రి / న్యూస్‌లైన్, మండపేట :ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 74 రోజుల పాటు అమలైన ఎన్నికల కోడ్‌కు తెరపడింది. ప్రజాపాలన వచ్చినా.. ప్రమాణ స్వీకారాలు పూర్తవ్వకపోవడంతో స్థానిక సంస్థల్లో ఇంకా ప్రత్యేక పాలనే కొనసాగుతోంది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరేందుకు మరో రెండున్నర వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా పరి పాలన సాగించాల్సిన ప్రత్యేకాధికారుల్లో చాలా మంది సంతకాలకు ‘నో’ చెబుతుండడం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి విఘాతం కలుగుతోంది. మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో మా ర్చి మూడో తేదీ నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అవి పూర్తయ్యే నాటికి పరిషత్ ఎన్నికల రాక తో కోడ్ కొనసాగింది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జిల్లాలో ఎన్నికలు జరిగాయి. అవి పూర్తయిన వెంటనే ఏప్రిల్ 12 నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల ఏడున సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగా, 16న ఓట్ల లెక్కింపుతో కోడ్ ముగిసినట్టేనని అధికారులు చెబుతున్నారు. దాదాపు 74 రోజుల పాటు సా గిన ఎన్నికల కోడ్‌కు తెరపడడంతో అభివృద్ధి కార్యక్రమా లు ఇక జోరందుకుంటాయనుకుంటున్న తరుణంలో ‘ప్రత్యేక’ రూపంలో వాటికి బ్రేక్ పడుతోంది. విభజనాం తరం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందు కు మరో రెండున్నర వారాల సమయం పట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాతే మున్సిపల్, మండల, జెడ్పీ పాలక వర్గాలు ప్రమాణ స్వీ కారం చేయాల్సి ఉంది. నాటి వరకు ప్రత్యేక పాలనలోనే ఆయా సంస్థలు కొనసాగనున్నాయి. ప్రజాప్రతినిధుల ఎన్నిక పూర్తవ్వడంతో, ఈ గొడవ తమకెందుకన్న ఆలోచనలో ప్రత్యేకాధికారులున్నట్టు సమాచారం. కొత్త తీర్మానాలపై సంతకాలు చేసేందుకూ వెనుకాడుతుండడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది. ఆగిపోయిన వర్క్ ఆర్డర్లు జిల్లాలోని నగరపాలక సంస్థలు, కొన్ని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, మండల పరిషతుల్లో అనేక అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే టెండర్లు పిలిచినా ఎన్నికల కోడ్ రాకతో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేకపోయారు. కోడ్ పూర్తవ్వడం, త్వరలో కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా పనులపై వర్క్ ఆర్డర్లు ఇచ్చేందుకు అనేక మంది ప్రత్యేకాధికారులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. పనులు పూర్తి చేయాలని కొత్త ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండగా, ప్రత్యేకాధికారుల సంతకాలు చేయకపోవడంతో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేక చాలామంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని అనేక మున్సిపాలిటీలు, మండల పరిషతుల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రత్యేక అధికారులు సెలవులపై వెళ్లిపోవడంతో పనులు ఎలా పూర్తిచేయాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం స్పందించి కొత్త పాలక వర్గాలు కొలువుదీరేంత వరకు పరిస్థితి చక్కబడేలా పరిస్థితిని సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త పాలక మండళ్లు కొలువు తీరాకే.. ఎన్నికల ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకూ ఎన్నికల నిర్వహణ ఖర్చులు, పారిశుధ్యం, నీటి నిర్వహణ, సిబ్బంది జీతాలు ఇతర కార్యాలయ సంబంధ ఫైళ్లు మినహా మిగిలిన వాటికి చలనం లేదు. పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులపై మాత్రం కొత్త కౌన్సిళ్లు కొలువు తీరేలోగా ఆమోదం తెలిపేందుకు ఒకరిద్దరు కమిషనర్లు దృష్టి పెట్టినట్టు తెలిసింది.