అభివృద్ధికి ‘ప్రత్యేక’ బ్రేక్
సాక్షి, రాజమండ్రి / న్యూస్‌లైన్, మండపేట :ఎన్నికల ప్రక్రియ ముగిసింది. 74 రోజుల పాటు అమలైన ఎన్నికల కోడ్‌కు తెరపడింది. ప్రజాపాలన వచ్చినా.. ప్రమాణ స్వీకారాలు పూర్తవ్వకపోవడంతో స్థానిక సంస్థల్లో ఇంకా ప్రత్యేక పాలనే కొనసాగుతోంది. కొత్త పాలక వర్గాలు కొలువుదీరేందుకు మరో రెండున్నర వారాల సమయం పట్టే అవకాశం ఉంది. ఈలోగా పరి పాలన సాగించాల్సిన ప్రత్యేకాధికారుల్లో చాలా మంది సంతకాలకు ‘నో’ చెబుతుండడం ఆయా ప్రాంతాల్లో అభివృద్ధికి విఘాతం కలుగుతోంది.
మున్సిపల్, కార్పొరేషన్ల ఎన్నికల నేపథ్యంలో మా ర్చి మూడో తేదీ నుంచి జిల్లాలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. అవి పూర్తయ్యే నాటికి పరిషత్ ఎన్నికల రాక తో కోడ్ కొనసాగింది. ఏప్రిల్ 6, 11 తేదీల్లో రెండు విడతలుగా జిల్లాలో ఎన్నికలు జరిగాయి. అవి పూర్తయిన వెంటనే ఏప్రిల్ 12 నుంచి సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఈ నెల ఏడున సార్వత్రిక ఎన్నికలు పూర్తికాగా, 16న ఓట్ల లెక్కింపుతో కోడ్ ముగిసినట్టేనని అధికారులు చెబుతున్నారు. దాదాపు 74 రోజుల పాటు సా గిన ఎన్నికల కోడ్‌కు తెరపడడంతో అభివృద్ధి కార్యక్రమా లు ఇక జోరందుకుంటాయనుకుంటున్న తరుణంలో ‘ప్రత్యేక’ రూపంలో వాటికి బ్రేక్ పడుతోంది.
విభజనాం తరం ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరేందు కు మరో రెండున్నర వారాల సమయం పట్టే అవకాశం ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆ తర్వాతే మున్సిపల్, మండల, జెడ్పీ పాలక వర్గాలు ప్రమాణ స్వీ కారం చేయాల్సి ఉంది. నాటి వరకు ప్రత్యేక పాలనలోనే ఆయా సంస్థలు కొనసాగనున్నాయి. ప్రజాప్రతినిధుల ఎన్నిక పూర్తవ్వడంతో, ఈ గొడవ తమకెందుకన్న ఆలోచనలో ప్రత్యేకాధికారులున్నట్టు సమాచారం. కొత్త తీర్మానాలపై సంతకాలు చేసేందుకూ వెనుకాడుతుండడంతో అభివృద్ధి పనులు ముందుకు సాగని పరిస్థితి నెలకొంది.
ఆగిపోయిన వర్క్ ఆర్డర్లు
జిల్లాలోని నగరపాలక సంస్థలు, కొన్ని పురపాలక సంఘాలు, నగర పంచాయతీలు, మండల పరిషతుల్లో అనేక అభివృద్ధి పనులకు సంబంధించి గతంలోనే టెండర్లు పిలిచినా ఎన్నికల కోడ్ రాకతో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేకపోయారు. కోడ్ పూర్తవ్వడం, త్వరలో కొత్త పాలక వర్గాలు ఏర్పడనున్న నేపథ్యంలో ఆయా పనులపై వర్క్ ఆర్డర్లు ఇచ్చేందుకు అనేక మంది ప్రత్యేకాధికారులు పునరాలోచనలో పడ్డట్టు తెలుస్తోంది.
పనులు పూర్తి చేయాలని కొత్త ప్రజాప్రతినిధులు ఒత్తిడి తెస్తుండగా, ప్రత్యేకాధికారుల సంతకాలు చేయకపోవడంతో వర్క్ ఆర్డర్లు ఇవ్వలేక చాలామంది అధికారులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలోని అనేక మున్సిపాలిటీలు, మండల పరిషతుల్లో దాదాపు ఇదే పరిస్థితి ఉన్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ల ప్రత్యేక అధికారులు సెలవులపై వెళ్లిపోవడంతో పనులు ఎలా పూర్తిచేయాలో తెలియక అధికారులు అయోమయానికి గురవుతున్నారు. ఉన్నత స్థాయి యంత్రాంగం స్పందించి కొత్త పాలక వర్గాలు కొలువుదీరేంత వరకు పరిస్థితి చక్కబడేలా పరిస్థితిని సమీక్షించాలని ప్రజలు కోరుతున్నారు.
కొత్త పాలక మండళ్లు కొలువు తీరాకే..
ఎన్నికల ప్రక్రియ పూర్తయినా ఇప్పటివరకూ ఎన్నికల నిర్వహణ ఖర్చులు, పారిశుధ్యం, నీటి నిర్వహణ, సిబ్బంది జీతాలు ఇతర కార్యాలయ సంబంధ ఫైళ్లు మినహా మిగిలిన వాటికి చలనం లేదు. పెండింగ్‌లో ఉన్న కాంట్రాక్టర్ల బిల్లులపై మాత్రం కొత్త కౌన్సిళ్లు కొలువు తీరేలోగా ఆమోదం తెలిపేందుకు ఒకరిద్దరు కమిషనర్లు దృష్టి పెట్టినట్టు తెలిసింది.