ప్రజారోగ్యంతో చెలగాటం
తాగునీటిలో బల్లులు, పురుగులు
శుద్ధి చేయకుండానే ప్రజలకు సరఫరా
డయేరియా, చర్మవ్యాధులతో జనం సతమతం
అస్తవ్యస్తంగా తాగునీటి పథకం ప్లాంట్ నిర్వహణ
మండిపడ్డ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి
ధర్మవరం: కలుషితమైన తాగునీటిని సరఫరా చేసి ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారని మునిసిపల్ అధికారులు, ప్రజాప్రతినిధులపై మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. ధర్మవరం పట్టణ ప్రజల దాహార్తి తీర్చాలన్న ఉద్దేశ్యంతో కోట్లరూపాయలు వెచ్చించి తన హయాంలో వాటర్‌ప్లాంటు నిర్మించి ఇస్తే.. ప్రస్తుత తెలుగుదేశం పార్టీ ప్రజాప్రతినిధులు కనీసం నిర్వహణ కూడా సక్రమంగా చేయలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం ఆయన పట్టణంలోని తిక్కస్వామినగర్‌లో ఉన్న ‘కేతిరెడ్డి సూర్యప్రతాపరెడ్డి తాగునీటి పథకం’ నిర్వహణ తీరును పరిశీలించారు. వాటర్‌ప్లాంట్‌లో నీటి శుద్ధి ఎలా జరుగుతోందో స్వయంగా చూసి తెలుసుకున్నారు. నీటి తొట్టెల్లో బల్లుల కళేబరాలు, క్రిమికీటకాలు తేలుతుండటం గమనించారు.
తాగునీరు ప్రవహించే కాలువలను శుభ్రం చేయకపోవడంతో పాచిపట్టి ఉండటాన్ని, నీటిని శుద్ధి చేసేందుకు రసాయనాలను, ఆలంను వినియోగించకుండా క్లోరిన్ మాత్రమే కలిపి నీటిని సరఫరా చేస్తున్నానట్లు గుర్తించారు. నీటి తొట్టెలను ఎన్నిరోజులకొకసారి శుభ్రం చేస్తారని అక్కడున్న వాటర్‌సప్లై సిబ్బందిని ప్రశ్నించగా.. ప్రతి రోజూ శుభ్రం చేస్తున్నామని చెప్పడంతో మరి బల్లులు, పురుగులు ఎలా ఉన్నాయంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు తాగేనీరు ఇంత అధ్వానంగా ఉంటే ఎలా. ఈ నీటిని మీరు తాగుతారా.? అన్ని ప్రశ్నించారు. ప్లాంటులో నీటిని శుభ్రం చేయకుండా చిత్రావతి నది నుంచి వచ్చిన నీటిని అలాగే వాటర్‌బెడ్లలోకి పంపి నేరుగా ప్రజలకు సరఫరా చేస్తున్నట్లు గుర్తించారు. ఈ నీటిని ప్రజలు ఒకటి రెండు రోజులు నిల్వ ఉంచితే పురుగులు పడుతున్నాయన్నారు. తాగునీరు మురుగునీటి కన్నా అధ్వానంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. కలుషిత నీటిని తాగడంతో చాలామంది డయేరియా, చర్మవ్యాధుల బారినపడ్డారన్నారు. ప్రజారోగ్యంపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు, నాయకులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.
కమీషన్ల కోసం కరెంట్ బిల్లుల పెండింగ్
ధర్మవరం మున్సిపాలిటీ పరిధిలో రూ. 9.74 కోట్లు కరెంట్ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రజల నుంచి వసూలు చేస్తున్న పన్నులు ఏం చేస్తున్నారని కేతిరెడ్డి ప్రశ్నించారు. 2015–16 సంవత్సరానికి గాను ధర్మవరం మున్సిపాలిటీకి వివిధ పన్నుల రూపంలో రూ.20.53 కోట్లు వస్తే ఆ నిధులన్నింటినీ కమీషన్ల కోసం, వివిధ పనులకు ఖర్చుచేశారన్నారు. ప్రతి పనికీ 5 శాతం అధికంగా టెండర్లను పిలిచి ప్రజాధనాన్ని అధికారపార్టీ నాయకులు దోచుకుంటునారని విమర్శించారు. వాస్తవానికి 2009 సంవత్సరంలో మున్సిపాలిటీ పరిధిలో వసూలయ్యే పన్నుల మొత్తాన్ని కరెంట్‌బిల్లులు, కార్మికుల వేతనాలకు మాత్రమే ఖర్చుచేయాలని జీఓ జారీ చేసిందన్నారు.
అయితే కరెంట్ బిల్లులు చెల్లిస్తే తమకు కమీషన్లు రావన్న ఉద్దేశంతో అధికారపార్టీనాయకులు, ఇక్కడి అధికారులతో కుమ్మక్కై ఆ మొత్తాన్ని జనరల్ ఫండ్‌కింద ఖర్చుచేస్తున్నారని దుయ్యబట్టారు. రూ.9.74 కోట్ల కరెంట్ బిల్లులు బకాయిల్లో రూ.4.84 కోట్లు అపరాధరుసుమే ఉందంటే వీరు ప్రజాధనాన్ని ఏవిధంగా దుర్వినియోగం చేస్తున్నారో ఇట్టే అర్థమవుతుందన్నారు. మున్సిపాలిటీ పాలకవర్గానికి కానీ, ఇక్కడి ప్రజాప్రతిధులకు కానీ ప్రజల ఆరోగ్యంపై ఏమాత్రం చిత్తశుద్ధిలేదని, ఇంత మంది రోగాల బారిన పడతుంటే నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.