పాతాళంలో నీరు | dificults drinking water in the future | Sakshi
Sakshi News home page

పాతాళంలో నీరు

Published Tue, Mar 10 2015 3:14 AM | Last Updated on Sat, Sep 2 2017 10:33 PM

పాతాళంలో నీరు

పాతాళంలో నీరు

- పడిపోతున్న భూగర్భ జల మట్టం
- భవిష్యత్తులో తాగు నీటికి కటకటే
- వర్షపాతం పడిపోవడమే కారణం
- పొదుపుగా వాడుకోకపోతే తిప్పలే

మోర్తాడ్ :  పోయిన వానాకాలంలో సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ఇప్పుడు భూగర్భ జల మట్టం పడిపోతోంది.ఈ పరిస్థితులలో నీటిని పొదుపుగా వాడుకోవడం తప్ప మరో మార్గం లేదని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.

లేకపోతే వేసవిలో తాగునీటికి ప్రమాద ఘంటికలు తప్పవని హెచ్చరిస్తున్నారు. భూగర్భ జలాల పరిరక్షణకు సరైన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణమని అంటున్నారు. గత ఫిబ్రవరిలో జిల్లాలోని వివిధ ప్రాంతాలలో ఉన్న 45 ఫీజో మీటర్ల నుంచి భూగర్భ జలమట్టం వివరాలను శాస్త్రవేత్తలు సేకరించారు. జనవరి నెల కంటే ఫిబ్రవరిలో భూగర్భ జలమట్టం చాలా వరకు పడిపోయినట్లు తేలింది. గత సంవత్సరం వివరాలను,ఇప్పటి వివరాలను పరిశీలిస్తే చాలా తేడా కనిపిస్తుంది. 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో నీటి మట్టం ఉంటే ఇబ్బందికర పరిస్థితులు ఉన్నట్లే అని శాస్త్ర వేత్త లు చెబుతున్నారు. అనేక ప్రాంతాలలో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్భ జల మట్టం ఉంది. నాన్ కమాండ్ ఏరియాలో నీరు లోతులో ఉండటం సాధారణ విషయం. కమాండ్ ఏరియాలోనూ ఇదే పరిస్థితి నెలకొనడంతో నీటికి తిప్పలు తప్పేలా లేవు.
 
ఇదీ పరిస్థితి
17 ఫీజో మీటర్లలో 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో భూగర్బ జలాలు నమోదై ఉన్నాయి. ప్రధానంగా కామారెడ్డి రెవెన్యూ డివిజన్‌లోనే ఇబ్బందికర పరిస్థితులు ఎ క్కువగా కనిపిస్తున్నాయి. భిక్కనూర్ వద్ద జనవరిలో 20.83 మీటర్ల లోతులో ఉన్న జలం ఇప్పుడు 21.68 మీటర్ల లోతుకు చేరింది. గత సంవత్సరం ఫిబ్రవరిలో 9.63 మీటర్ల లోతులో ఉంది. దోమకొండ ప్రాంతంలో 23.57 మీటర్ల లోతులో ఉంది. గాంధారి మండలంలో సర్వాపూర్‌లో 19.11 మీటర్ల లోతులో నీటి మట్టం ఉండగా గడ చిన జనవరిలో 15.98 మీటర్లుగా నమోదైంది. నెల రోజుల వ్యవధిలోనే మూడున్నర మీటర్ల లోతుకు మట్టం పడిపోయింది.

భిక్కనూర్ మండలంలోని మల్లారెడ్డి ప్రాం తంలో అత్యధికంగా 30.11 మీటర్ల లోతులో ఉంది. జనవరిలో కూడా ఇదే స్థాయిలో నీటి మట్టం ఉంది. గత సంవత్సరం మాత్రం 20.11 మీటర్ల లోతులో నీటి మట్టం నిక్షిప్తమై ఉంది. ఈ ప్రాంతంలో వర్షపు నీటిని పరిరక్షించడానికి పకడ్బందీ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని భావిస్తున్నారు. బీబీపేట్, సదాశివ్‌నగర్, కామారెడ్డి ప్రాంతాలలో కూడా జల మట్టం ఎక్కువ లోతులో ఉంది. ఈ డివిజన్‌లో ఎర్రాపహాడ్, రెడ్డిపేట్, తాడ్వాయి, లింగంపేట్, మాచారెడ్డి ప్రాంతాలలో మాత్రం కొంత పర్వా లేదనిపించే పరిస్థితి కనిపిస్తోంది. నిజామాబాద్ రెవెన్యూ డివిజన్‌లోని జక్రాన్‌పల్లి, వేల్పూర్, మోర్తాడ్, భీమ్‌గల్, బాల్కొండ మండలం ముప్కాల్ ప్రాంతాల్లో నీటి మ ట్టం 15 మీటర్ల కంటే ఎక్కువ లోతులో ఉన్నాయి. వేల్పూర్ మండలంలోనైతే, ఏకంగా 22 మీటర్ల లోతుకు నీటి మట్టం పడిపోయింది.

బోధన్ డివిజన్‌లో కోటగిరి, మ ద్నూర్, రెంజల్ మండలాలలో ఎక్కువ లోతులో నీటి మట్టం ఉంది. జిల్లా సాధారణ నీటి మట్టం 13.26 మీటర్లుగా ఉంది. జనవరిలో 12.19 మీటర్ల నీటి మట్టం ఉంటే ఒక నెల వ్యవధిలోనే ఒక మీటరు లోతుకు నీటి మట్టం పడిపోయింది. గత సంవత్సరం అయితే 8.72 మీటర్ల లోతులోనే నీటి మట్టం ఉండటంతో ఎలాంటి ఇబ్బంది క లుగలేదు. జిల్లా సాధారణ వర్షపాతం 1,007 మిల్లిమీటర్లు అయితే నమోదైన వర్షపాతం 509 మి.మీ. 49.5 శాతం లోటు భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపింది. గత సంవత్సరం అయితే 1,145 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. గడచిన సీజనులోనే తక్కువ వర్షపాతం నమోదు కావడంతో ఇప్పుడు ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు.
 
నీటిని పొదుపుగా వినియోగించుకోవాలి

భూగర్భ జలాలు తక్కువగా ఉండటంతో నీటిని పొదుపుగా వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాక, వచ్చే వర్షాకాల సీజనులో కురిసే వర్షాలతో చేరే నీ టిని పరిరక్షించడానికి చర్యలు తీసుకోవాలి. భూగర్భ జలాలను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో నీటి కష్టాలు తీవ్రమవుతాయి. అందరూ నీటిని పొదుపుగా వినియో గించాలి. ఈ విషయంపై అవగాహన పెంపొందించుకోవాలి.
- పి. శ్రీనివాస్‌బాబు, భూగర్భ జల శాస్త్రవేత్త, నిజామాబాద్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement