
సాక్షి, హైదరాబాద్: చినుకుల సీజన్‌లోనూ గ్రేటర్‌లో భూగర్భజలాలు అథఃపాతాళానికి చేరుతున్నాయి. వర్షాభావ పరిస్థితులు, నీటిని ఒడిసిపట్టే ఇంకుడు గుంతలు చాలినన్ని లేకపోవడం, విచక్షణారహితంగా బోరు బావుల తవ్వకం, నీటి వినియోగం అనూహ్యంగా పెరగడంతో పాతాళగంగ పైకి రావడంలేదు.
ఈ జూన్ భూగర్భ జలమట్టాలను గతేడాది జూన్‌తో పోలిస్తే పలు మండలాల్లో సరాసరిన 1 నుంచి 3 మీటర్ల మేర తగ్గడం ఆందోళన కలిగిస్తోంది. కాగా నగరం సరాసరి భూగర్భ జలమట్టాలను పరిశీలిస్తే.. గతేడాది 20.53 మీటర్ల లోతున భూగర్భజలాలు కనిపించగా, ప్రస్తుతం 22.53 మీటర్ల లోతుకు పడిపోవడం గమనార్హం. కాగా శివారు ప్రాంతాల్లో గేటెడ్ కమ్యూనిటీలు, స్వతంత్ర గృహాలు, బహుళ అంతస్తుల భవంతుల నిర్మాణం ఊపందుకోవడం, కాంక్రీట్ మహారణ్యాలు విస్తరిస్తున్న కారణంగా భూగర్భ జలాల వినియోగం రెట్టింపవుతోంది.