సాక్షి, అమరావతి: సకాలంలో పుష్కలంగా వర్షాలు.. నిండుగా పారిన వాగులు, వంకలు.. పొంగిన నదులు.. భూమాతకు జలాభిషేకం చేశాయి. ఎండి బీళ్లువారిన పుడమి ఆ జలాలను పుక్కిటపట్టింది. జలవనరులు నిండుగా తొణికిసలాడుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. పలు ప్రాంతాల్లో భూగర్భంలోంచి జలాలు పైకి ఉబుకుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మోటర్లు వేయకుండానే బోర్ల నుంచి నీరు వస్తోంది. రాయలసీమ ప్రాంతంలో వెయ్యి నుంచి 1,400 అడుగుల లోతు బోర్లు వేస్తే గానీ నీటి జాడ కనిపించని పరిస్థితి నుంచి నాలుగైదు అడుగుల లోతులోనే నీరు కనిపిస్తోంది. కుండపోత వర్షాలు, వరదల వల్ల కొంత పంట నష్టం వాటిల్లినప్పటికీ వచ్చే రెండు మూడేళ్లు కరువు మాట ఉండదని అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
రానున్న వేసవిలో ఎక్కడా తాగు, సాగునీటి ఎద్దడి రాదని భరోసాతో ఉన్నారు. ఏటా జనవరి చివరి వారం నుంచి వేసవి సన్నద్ధత కోసం విపత్తు నిర్వహణ, వ్యవసాయం, పశుసంవర్ధక, గ్రామీణ మంచినీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల అధికారులు సమావేశమయ్యేవారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేవారు. పశుగ్రాసం కొరతను ఎలా అధిగమించాలి.. తాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఈ ఏడాది జలవనరుల్లోను, భూగర్భంలోను పుష్కలంగా నీరుండటంతో తాగునీటి ఎద్దడి మాటే ఉండదు. భూమి çపచ్చగా ఉన్నందున పశుగ్రాసానికి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఈ ఏడాది వేసవి సన్నద్ధత సమావేశాల అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు.
రాయలసీమలో అనూహ్యంగా పెరుగుదల
నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి.. గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 27 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో ఏకంగా 57 శాతం ఎక్కువగా వర్షం కురవడం గమనార్హం. కోస్తాంధ్రలో 17 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్‌లో 860 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం కాగా 1,087 మిల్లీమీటర్లు నమోదైంది. ఇదేకాలంలో కోస్తాంధ్రలో 954 మిల్లీమీటర్లకుగాను 1,111 మిల్లీమీటర్లు (17 శాతం ఎక్కువ), రాయలసీమలో 648 మిల్లీమీటర్లకుగాను 1,003 మిల్లీమీటర్లు ( 57 శాతం అధిక) వర్షపాతం రికార్డయింది. దీంతో రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలమట్టం అనూహ్యంగా పెరిగింది. 2020 జనవరితో పోలిస్తే జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 3.8 మీటర్ల ( 12.46 అడుగుల) మేరకు భూగర్భ జలమట్టం పెరిగింది. ఇదే సమయంలో రాయలసీమలో పెరుగుదల 8.1 మీటర్లు (26.57 అడుగులు) ఉండటం గమనార్హం. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పాతాళగంగ పైకి వస్తోంది. కొన్నిచోట్ల మోటర్లు వేయకుండానే బోరు పైపుల నుంచి నీరు కొద్దిగా బయటకు వస్తోంది. వాగులు, వంకల్లో సుదీర్ఘకాలం ఊట (జేడు) నీరు ప్రవహిస్తుండటంతో కొండ దిగువ ప్రాంతాల్లోని భూముల్లో నీరు ఊరుతోంది. గత ఏడాది జనవరితో పోలిస్తే 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పైకి వచ్చింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రం నామమాత్రంగా 0.7 మీటర్ల మేర తగ్గింది.
మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదు
పాపాఘ్ని నది నాలుగు నెలలుగా ప్రవహిస్తూనే ఉంది. గత మూడు దశాబ్దాల్లో ఈ నది వరుసగా మూడునెలలు ప్రవహించిన దాఖలాలు లేవు. భారీ వర్షాలవల్ల భూగర్భ జలం భూమిపైకి ఉబికి వస్తోంది. వరిగడ్డి వాములు కిందనుంచి రెండడుగులమేర తడిచిపోయాయి.
– రామలింగారెడ్డి, కమలాపురం, వైఎస్సార్ కడప జిల్లా.
మోటరు వేయకుండానే నీరు
మా ఊరు కొంత తగ్గులో ఉంది. పైన ఏట్లో నీరు ప్రవహిస్తున్నందున మా భూముల్లో ఊటెక్కింది. మోటర్లు వేయకుండానే లోతట్టు ప్రాంతాల్లోని బోరు పైపుల నుంచి నీరు ఉబికి వస్తోంది.
– వెంకటరామిరెడ్డి, వంగిమళ్ల, వీరబల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా
పుష్కలమైన వర్షాలే కారణం
రాష్ట్ర వ్యాప్తంగా 2020 కేలండర్ ఇయర్‌లో మంచి వర్షాలు కురిశాయి. దీనివల్లే భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. వచ్చే రెండు మూడేళ్లు భూగర్భ జలమట్టంపై ఈ వర్షాల ప్రభావం ఉంటుంది. సాధారణంగా జూన్ నుంచి మే నెల వరకు వాటర్ ఇయర్ అని అంటారు. రాష్ట్రంలో సంవత్సరం మొత్తంలో కురిసే వర్షంలో జూన్–అక్టోబరు మధ్య నైరుతి రుతుపవనాల సీజన్‌లోనే 65 శాతానికిపైగా కురుస్తుంది. మరో 25 శాతం ఈశాన్య రుతుపవనాల సీజన్లో పడుతుంది. మిగిలిన 10 శాతం వర్షం ఇతర నెలల్లో కురుస్తుంది. రాయలసీమ ప్రాంతంలో గత ఏడాది విపరీతమైన వర్షాలు కురిశాయి. అందువల్ల జలమట్టం బాగా పైకి వచ్చింది.
– ఎ.వరప్రసాదరావు, భూగర్భజలశాఖ రాష్ట్ర సంచాలకుడు
పుడమి పుక్కిట గంగ.. నీటికి లేదిక బెంగ
Published Thu, Jan 21 2021 5:22 AM | Last Updated on Thu, Jan 21 2021 5:22 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment