groundwater levels
-
వరి వేయకుంటే రూ.7 వేలు
చండీగఢ్ నుంచి ‘సాక్షి’ప్రత్యేక ప్రతినిధి: హరియాణ రాష్ట్రంలో వరి పంట వేయకపోతే ఎకరాకు (ఇన్ని ఎకరాలు అనే పరిమితి లేకుండా) రూ.7 వేల చొప్పున ప్రోత్సాహకం అందజేయడం ద్వారా 1.74 లక్షల ఎకరాల్లో వరికి బదులు ఇతర పంటలకు మళ్లించగలిగామని ఆ రాష్ట్ర సీఎం మనోహర్‌లాల్ ఖట్టర్ తెలిపారు. వరితో పాటు నీరు అధికంగా అవసరమయ్యే ఇతర ధాన్యం పంటలు వేయకుండా ఏ పంట వేసినా లేదా పడావుగా (ఏమీ వేయకుండా) వదిలేసినా ఈ ప్రోత్సాహకం వర్తిస్తుందన్నారు. 2020లో చేపట్టిన ‘మేరా పానీ మేరా విరాసత్’పథకంలో భాగంగా భావితరాలకు నీటిని అందించాలనే ఉద్దేశంతో దీనిని అమలు చేస్తున్నట్టు తెలియజేశారు. హరియాణలో గుడ్‌గవర్నెన్స్ అమలు చేస్తున్న విషయం వివరించేందుకు మీడియా ప్రతినిధులను అక్కడి ప్రభుత్వం ఆహ్వానించిన నేపథ్యంలో ఆయన ‘సాక్షి’తో మాట్లాడారు. హరియాణ పాటు చుట్టుపక్కల రాష్ట్రాలన్నింటికీ యమున నదే ఆధారం కావడంతో వరి పంటకు నీరు భారీగా అవసరమై భూగర్భనీటి మట్టాలు పడిపోతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ప్రజలకు వివిధ పథకాల కింద కల్పించే ఉచితాలను, ఇది ఫ్రీ, అది ఫ్రీ అంటూ ఎన్నికల్లో ఇచ్చే హామీలను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తామని, స్వాభిమాన వ్యక్తులెవరూ వీటిని కోరుకోరని చెప్పారు. 2014 నుంచి హరియాణ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న మనోహర్‌లాల్‌తో సాక్షితో ప్రత్యేకంగా మాట్లాడారు. సాక్షి: ‘గుజరాత్ మోడల్’అంటూ కొందరు బీజేపీ నే తలు ప్రచారం చేశారు కదా ? తెలంగాణలో ‘హరి యాణ మోడల్’అమలు చేయమని చెబుతారా? సీఎం: ఈ మోడల్ ఆ మోడల్ అనే ప్రచారం ఎక్కువగా మీడియా సృష్టే అని చెప్పాలి. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే అక్కడి అత్యంత ప్రాముఖ్యత కలిగిన అంశాలపై ప్రజలకు ఏమి చేస్తారో ఎన్నికల హామీ ఇవ్వడంతో పాటు ‘హరియాణ మోడల్’అమలు అంశానికి కూడా ప్రాధాన్యత ఇవ్వొచ్చు. ఒక రాష్ట్రంలో మంచి పథకాలు, మెరుగైన విధానాలుంటే వాటిని మరోచోట అమలు చేయొచ్చని ప్రధాని మోదీ కూడా సూచించారు. సాక్షి: మీ ప్రభుత్వం అమలు చేస్తున్న వినూత్న పథకాలు ఏవీ? సీఎం: హరియాణ ఒక్క రా్రష్ఠంలోనే ‘మేరి ఫసల్ మేరీ బ్యోరా’(ఎమ్మెస్‌ఎంబీ)కింద రైతులు రిజిష్టర్ చేసుకుంటే ఎంఎస్పీ ధర చెల్లింపుతో పాటు ఇతర రూపాల్లో ప్రయోజనాలు అందిస్తున్నాం. దీనిని ఈ–ఖరీద్ పోర్టల్‌కు లింక్ చేసి ఎంఎస్పీ ధరను డైరెక్ట్‌గా రైతు అకౌంట్లో వేస్తున్నాం. ఇప్పటిదాకా రూ.45వేల కోట్లు వారికి బదలీచేశాం. ముఖ్యమంత్రి అంత్యోదయ పరివార్ ఉత్థాన్ యోజనలో భాగంగా పేదవర్గాలను గుర్తించి వారికి బీపీఎల్‌కార్డులు, రేషన్ అందజేయడంతో పాటు ఇతర ప్రయోజనాలు కల్పిస్తున్నాం. -
వేసవిలోనూ తాగునీరు పుష్కలం!
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య పెద్దగా ఉండకపోవచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అంచనా వేస్తోంది. భూగర్భ జలాలతోపాటు చెరువుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో ఈ వేసవిలో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వేసవి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికను ఆర్డబ్ల్యూఎస్ సిద్ధం చేస్తుంటుంది. ఈ ఏడాది జనవరి నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో ఏటా నీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లోని చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నట్టు జిల్లాల నుంచి నివేదికలు అందాయి. సాధారణంగా చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఏటా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన గ్రామాల్లో మూడొంతులు చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని గ్రామాలే ఉంటాయి. అయితే, ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం అత్యధికంగా వర్షాలు కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో జనవరి నెలలో సాధారణం కంటే 39.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో ఏటా నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో సాధారణం కంటే 55.9 శాతం అధిక వర్షాలు నమోదైనట్లు చెబుతున్నారు. మరోవైపు బోరు బావులు ఎండిపోయినట్టు ఏ ప్రాంతం నుంచి సమాచారం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాల్లో.. కాగా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్ పరిధిలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి వంటి ప్రాంతాల్లోని గ్రామాల్లో నడివేసవిలో మంచినీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జనవరిలో రాష్ట్రమంతటా అధిక వర్షాలు నమోదైనా.. ప్రకాశం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 4 శాతం తక్కువగా వర్షాలు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లోని పరిస్థితులపై అర్డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు రప్పించుకుంటున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్చి మధ్యలో మరోసారి అంచనా ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అన్ని గ్రామాల్లో ఇప్పుడు పుష్కలంగా నీరు అందుబాటులో ఉందని సమాచారం అందడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జనవరి–ఫిబ్రవరిల్లో సిద్ధం చేయాల్సిన మంచినీటి సరఫరా కార్యాచరణ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మార్చి మొదటి వారం తర్వాత జిల్లాల నుంచి మరోసారి సమాచారం రప్పించుకుని యాక్షన్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు. -
సుజల తెలంగాణ
సాక్షి, హైదరాబాద్: ఐదేళ్లలో రాష్ట్రంలో సగటు భూగర్భ జల మట్టం 4 మీటర్లకు పైగా పెరిగిందని రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌కుమార్ పేర్కొన్నారు. మంగళవారం జలసౌధలో జరిగిన రాష్ట్ర భూగర్భ జలాల సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన ‘భూగర్భ వనరులు–2020’నివేదికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ భూగర్భజల మట్టం మీటర్ పెరుగుదల 100 టీఎంసీల నీటితో సమానమన్నా రు. ఐదేళ్లలో 400 టీఎంసీల మేరకు భూగర్భ జలాలు పెరిగాయని చెప్పారు. 93% మండలాల్లో భూగర్భ జలాలు వృద్ధి చెందాయన్నారు. 50 శాతానికి తగ్గిన భూగర్భ జల వినియోగం 2016–17లో రాష్ట్రంలో 65 శాతం భూగర్భ జలాల వినియోగం ఉండగా, 2019–20 నాటికి 50 శాతానికి తగ్గిందని రజత్‌కుమార్ వెల్లడించారు. కాళేశ్వరం ఎత్తిపోతల, మిషన్ కాకతీయ వంటి కార్యక్రమాల ద్వారా భూగర్భ జలాల లభ్యత పెరగడమే ఇందుకు కారణమన్నారు. పెరిగిన భూగర్భ జలాలను సద్వినియోగం చేసుకునే అంశంపై ప్రభుత్వానికి తగిన సూచనలు చేయాలని అధికారులను కోరారు. కాళేశ్వరం కార్పొరేషన్‌కు ‘ఏ కేటగిరీ’, తెలంగాణ రాష్ట్ర జలవనరుల మౌలిక సదుపాయా ల అభివృద్ధి సంస్థకు ‘ఏ కేటగిరీ’గ్రేడింగ్‌ను ఆర్ఈసీ కేటాయించిన నేపథ్యంలో.. ఈ సంస్థలు తీసుకున్న రుణాలకు వడ్డీ రాయితీ లభించనుందన్నారు. కార్యక్రమంలో నీటిపారుదల శాఖ ఈఎన్సీ సి.మురళీధర్, భూగర్భ జల శాఖ డైరెక్టర్ ఎం.పండిత్ పాల్గొన్నారు. -
పైపైకి పాతాళగంగ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాతాళ గంగమ్మ పైపైకి వస్తోంది. మూడేళ్లుగా వర్షాలు సమృద్ధిగా కురవడం, ఆ వర్షపు నీరు వృథా కాకుండా రాష్ట్ర ప్రభుత్వం జల సంరక్షణ చర్యలు చేపట్టడంతో భూగర్భ జలమట్టం గణనీయంగా పెరిగింది. ఎండిపోయిన బోర్లు, బావుల్లో కూడా నీటి లభ్యత పెరిగింది. దాంతో రైతుల్లో ఆనందోత్సాహాలు వెల్లివిరుస్తున్నాయి. రబీలో సుమారు 24 లక్షల ఎకరాల్లో బోర్లు, బావుల కింద పంటలు సాగయ్యే అవకాశం ఉందని అధికారవర్గాలు చెబుతున్నాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందు భూగర్భ జలమట్టం రాష్ట్రంలో సగటున 9.29 మీటర్లు ఉంటే.. వర్షాకాలం ముగిసే సరికి అది 5.78 మీటర్లకు చేరింది. అంటే.. ఏకంగా 3.51 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. 2018 సంవత్సరంలో వర్షాకాలం ముగిసిన తర్వాత భూగర్భ జలమట్టం 12.85 మీటర్ల లోతులో ఉండేది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జల సంరక్షణ చర్యలు ముమ్మరం చేసింది. దీంతో గత మూడేళ్లలో భూగర్భ జలాలు క్రమంగా పెరుగుతూ ప్రస్తుతం 5.78 మీటర్లలో అందుబాటులోకి వచ్చాయి. ఈ స్థాయిలో అందుబాటులోకి రావడం మూడు దశాబ్దాల తర్వాత ఇదే ప్రథమమని అధికారవర్గాలు చెబుతున్నాయి. జల సంరక్షణపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ రాష్ట్రంలో ఈ ఏడాది సగటున 850.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా 876.85 మిల్లీమీటర్లు కురిసింది. అంటే.. సాధారణం కంటే 3.15 శాతం అధికంగా కురిసింది. వాగులు, వంకలు, నదులు ఉరకలెత్తాయి. ప్రభుత్వం చేపట్టిన జల సంరక్షణ చర్యలతో కుంటలు, చెక్ డ్యామ్‌లు, చెరువులు, ప్రాజెక్టులు నిండాయి. దాంతో భూగర్భ జలాలు పుష్కలంగా పెరిగాయి. రెయిన్ గేజ్‌ల ద్వారా వర్షపాతాన్ని, 1,868 ఫీజియో మీటర్ల ద్వారా భూగర్భ జలమట్టాన్ని నిత్యం లెక్క వేస్తున్న సర్కారు.. భూగర్భ జల మట్టాలను ఎప్పటికప్పుడు విశ్లేషించింది. వర్షపాతానికి అనుగుణంగా భూగర్భ జలాలు పెరగని ప్రాంతాల్లో ఇంకుడు గుంతలు, చెక్ డ్యామ్‌లు నిర్మించింది. ఫలితంగా ఎన్నడూ లేని రీతిలో భూగర్భ జలమట్టం పెరిగింది. ఎండిపోయిన బోర్లు, బావుల్లో కూడా నీరు వచ్చింది. సాగు, తాగు నీరు పుష్కలంగా అందుబాటులోకి వచ్చింది. భూగర్భ జలాలు పెరగడం వల్ల బోర్లు, బావుల్లో నీటి కాలుష్య తీవ్రత కూడా గణనీయంగా తగ్గిందని అధికారులు చెబుతున్నారు. వైఎస్సార్ కడపలో అత్యధికం.. పశ్చిమగోదావరిలో అత్యల్పం రాష్ట్రంలో వైఎస్సార్ కడప జిల్లాలో 2.69 మీటర్లలోనే భూగర్భ జలాలు లభ్యమవుతుండగా.. పశ్చిమగోదావరి జిల్లాలో 14.82 మీటర్లలో అందుబాటులో ఉన్నాయి. దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో కేవలం 8.11 మీటర్లలోనే లభ్యమవుతున్నాయి. ఉభయగోదావరి జిల్లాల కంటే అనంతపురం జిల్లాలో భూగర్భజలాలు పుష్కలంగా అందుబాటులో ఉండటం గమనార్హం. -
వాల్టా చట్టంలో మార్పులు
సాక్షి, అమరావతి: జాతీయ స్థాయిలో భూగర్భ జలాల వినియోగంపై కేంద్రం రూపొందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా ఏపీ వాల్టా చట్టంలోనూ మార్పులు తీసుకురావాలని పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం అధికారులతో మంత్రి సమీక్షించారు. కేంద్ర ప్రభుత్వ ప్రతిపాదనల్లో భాగంగా పారిశ్రామిక అవసరాలకు వినియోగిస్తున్న భూగర్భ జలాలపై నిర్ణీత చార్జీలు వసూలు చేసే అంశాన్ని పరిశీలించాలని మంత్రి సూచించారు. తాగునీటి అవసరాలు, వ్యవసాయం కోసం వినియోగించే భూగర్భ జలాలకు ఎలాంటి చార్జీలను విధించకూడదని స్పష్టం చేశారు. కేంద్ర నిబంధనలకు అనుగుణంగా ఈ చార్జీల ఖరారులో పరిశ్రమలపై ఎక్కువ భారం పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయంలో చిన్న పరిశ్రమల పట్ల ఉదారంగా వ్యవహరించాలన్నారు. ఇష్టారాజ్యంగా భూగర్భజలాలను వినియోగించే పరిశ్రమలపై దృష్టి సారించాలని సూచించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది, కమిషనర్ కోన శశిధర్, జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్యామలరావు, వాటర్‌షెడ్ డైరెక్టర్ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆంధ్రప్రదేశ్: పాతాళ గంగ.. కరువు తీరంగ
సాక్షి, అమరావతి: పాతాళ గంగ పైపైకి వస్తోంది. దుర్భిక్ష ప్రాంతాల్లోనూ కరువు తీర్చే కల్పవల్లిగా అవతరిస్తోంది. ఈ ఏడాది రాష్ట్రంలో భూగర్భ జలమట్టాలు గణనీయంగా పెరిగాయి. మే 31 నాటికి రాష్ట్రంలో సగటున 9.88 మీటర్ల లోతున భూగర్భ జలాలు లభ్యమయ్యేవి. ఇప్పుడు సగటున 8.24 మీటర్లలో లోతులోనే భూగర్భ జలాలు లభ్యమవుతున్నాయి. రుతు పవనాల ప్రభావం వల్ల జూన్ నుంచి ఈ నెల 6 వరకూ రాష్ట్రంలో సగటున 433.59 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాలి. కానీ.. 382.55 మిల్లీమీటర్ల వర్షపాతమే కురిసింది. సాధారణం కంటే 11.77 శాతం తక్కువ వర్షపాతం నమోదైనా భూగర్భ జలమట్టం భారీగా పెరగడం గమనార్హం. దుర్భిక్ష ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఏకంగా 4.84 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. 163.55 టీఎంసీల భూగర్భ జలాలు రాష్ట్ర భౌగోళిక విస్తీర్ణం 1,63,099 చదరపు కిలోమీటర్లు. రాష్ట్రంలో జూన్ 1 నుంచి ఇప్పటివరకూ కురిసిన వర్షపాతం పరిమాణం 2,233.47 టీఎంసీలు. ఇందులో 163.55 టీఎంసీలు భూగర్భ జలాల రూపంలోకి మారాయి. దాంతో భూగర్భ జలమట్టం 8.24 మీటర్లకు చేరుకుంది. గతేడాది సెప్టెంబర్ 6వ తేదీ నాటికి సగటున 13.27 మీటర్లలో భూగర్భ జలాలు లభ్యయ్యేవి. అంటే.. గతేడాది సెప్టెంబరు 6తో పోల్చితే ప్రస్తుతం రాష్ట్రంలో భూగర్భ జలమట్టం సగటున 5.03 మీటర్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. అనంతపురం జిల్లాలో మే 31 నాటికి 15.54 మీటర్లలో భూగర్భ జలమట్టం ఉండేది. ఇటీవల కురిసిన భారీ వర్షాల ప్రభావం వల్ల ఆ జిల్లాలో భూగర్భ జలమట్టం 10.70 మీటర్లకు చేరుకుంది. అంటే ఏకంగా 4.84 మీటర్ల మేర జలమట్టం పెరిగింది. రాష్ట్రంలో అత్యధికంగా భూగర్భ జలాలు పెరిగిన జిల్లా అనంతపురమే కావడం గమనార్హం. నెల్లూరు జిల్లాలో ఈశాన్య రుతుపవనాల ప్రభావం వల్ల అధికంగా వర్షాలు కురుస్తాయి. నైరుతి రుతుపవనాల ప్రభావం ఆ జిల్లాపై తక్కువగా ఉంటుంది. దీని వల్ల ఆ జిల్లాలో భూగర్భజలమట్టం తగ్గింది. అక్కడ భూగర్భ జలమట్టం మే 31 నాటితో పోల్చితే సోమవారం నాటికి 0.71 మీటర్లు తగ్గింది. ఇబ్బందులు తప్పినట్టే.. రాష్ట్రంలో సుమారు 13 లక్షల బోరు బావుల కింద దాదాపు 24 లక్షల ఎకరాల్లో పంటలు సాగవుతున్నాయి. తాగు, గృహ అవసరాల నీటి కోసం 2.33 లక్షల బోరు బావులపై ప్రజలు ఆధారపడతారు. భూగర్భ జలమట్టం భారీగా పెరిగిన నేపథ్యంలో ఈ ఏడాది సాగు, తాగునీటి ఇబ్బందులు తప్పినట్టేనని అధికారులు విశ్లేషిస్తున్నారు. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ నెలతో పాటు అక్టోబర్‌లోనూ విస్తారంగా వర్షాలు కురుస్తాయి. ఈశాన్య రుతుపవనాలతో నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో తూర్పు ప్రాంతం, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతంపై అధికంగా వర్షాలు కురుస్తాయి. వీటిని పరిగణనలోకి తీసుకుంటే జలమట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. -
పాతాళ గంగ.. వెల్లువెత్తంగ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పాతాళ గంగ పైపైకి వస్తోంది. భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగాయి. గతేడాది ఇదే రోజున భూగర్భ జలమట్టం సగటున 13.34 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 7.79 మీటర్లకు పెరిగింది. సగటున 5.55 మీటర్లు పెరిగినట్టు స్పష్టమవుతోంది. ఈ నీటి సంవత్సరం (గత ఏడాది జూన్ 1నుంచి ఈ ఏడాది మే 31వరకు)లో 688.95 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరిగాయి. రాష్ట్ర చరిత్రలో ఒక నీటి సంవత్సరంలో ఇంత భారీగా భూగర్భ జలాలు పెరగడం ఇదే ప్రథమం. సమృద్ధిగా వర్షాలు కురవడం, నదులు, వాగులు, వంకలు ఉరకలెత్తడం, ప్రభుత్వం వరద జలాలను ఒడిసిపట్టి ప్రాజెక్టులు, చెరువులు, కుంటలు వంటి చిన్న నీటి వనరులను నింపడం వల్లే ఇది సాధ్యమైందని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. నైరుతి, ఈశాన్య రుతు పవనాల ప్రభావం వల్ల రాష్ట్రంలో ఏడాదికి సగటున 965.97 మి.మీ. వర్షపాతం కురుస్తుంది. ఈ ఏడాది 1,100.23 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఉత్తరాంధ్ర మినహా.. రాష్ట్రంలోని పది జిల్లాల్లోనూ సాధారణం కంటే అధికంగా వర్షం కురిసింది. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 1,485.02 మి.మీ. వర్షం కురవగా.. అనంతపురం జిల్లాలో అత్యల్పంగా 776.17 మి.మీ. వర్షం కురిసింది. వర్షాభావ ప్రాంతం (రెయిన్ షాడో ఏరియా)లోని అనంతపురం జిల్లాలో సాధారణ సగటు వర్షపాతం 554 మి.మీ.గా నమోదైంది. ఈ జిల్లాలోనూ సాధారణ వర్షపాతం కంటే అధికంగా వర్షం నమోదైనట్టు స్పష్టమవుతోంది. మొదటి స్థానంలో చిత్తూరు చిత్తూరు జిల్లాలో ఏకంగా 13.65 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. 169.66 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరగడంతో చిత్తూరు జిల్లా తొలి స్థానంలో నిలిచింది. వైఎస్సార్ జిల్లాలో 157.21 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరగడంతో ఆ జిల్లా రెండో స్థానంలో నిలిచింది. వర్షాభావ ప్రాంతమైన అనంతపురం జిల్లాలో ఏకంగా 131.60 టీఎంసీల మేర భూగర్భ జలాలు పెరగడం గమనార్హం. సాధారణం కంటే తక్కువగా వర్షం కురవడం వల్ల శ్రీకాకుళం జిల్లాలో భూగర్భ జలాలు 1.57 టీఎంసీలు, విజయనగరం జిల్లాలో 1.22 టీఎంసీల మేర తగ్గాయి. భూగర్భ జలమట్టం సగటు కోస్తాంధ్రలో 7.76 మీటర్లు ఉండగా.. రాయలసీమలో 7.77 మీటర్ల మేర ఉంది. ఈ ఏడాది భూగర్భ జలమట్టం రికార్డు స్థాయిలో పెరగడంతో ఎండిపోయిన లక్షలాది బోరు బావులకు మళ్లీ జలకళ వచ్చింది. బోరు బావుల్లో పుష్కలంగా నీళ్లు వస్తుండటం వల్ల రైతులు ఆనందోత్సాహల మధ్య భారీ ఎత్తున రబీ పంటలు సాగు చేశారు. మంచి దిగుబడులు వస్తుండటంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
పుడమి పుక్కిట గంగ.. నీటికి లేదిక బెంగ
సాక్షి, అమరావతి: సకాలంలో పుష్కలంగా వర్షాలు.. నిండుగా పారిన వాగులు, వంకలు.. పొంగిన నదులు.. భూమాతకు జలాభిషేకం చేశాయి. ఎండి బీళ్లువారిన పుడమి ఆ జలాలను పుక్కిటపట్టింది. జలవనరులు నిండుగా తొణికిసలాడుతున్నాయి. రాష్ట్రంలో 13 జిల్లాలకు గాను 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. పలు ప్రాంతాల్లో భూగర్భంలోంచి జలాలు పైకి ఉబుకుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో మోటర్లు వేయకుండానే బోర్ల నుంచి నీరు వస్తోంది. రాయలసీమ ప్రాంతంలో వెయ్యి నుంచి 1,400 అడుగుల లోతు బోర్లు వేస్తే గానీ నీటి జాడ కనిపించని పరిస్థితి నుంచి నాలుగైదు అడుగుల లోతులోనే నీరు కనిపిస్తోంది. కుండపోత వర్షాలు, వరదల వల్ల కొంత పంట నష్టం వాటిల్లినప్పటికీ వచ్చే రెండు మూడేళ్లు కరువు మాట ఉండదని అన్ని వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న వేసవిలో ఎక్కడా తాగు, సాగునీటి ఎద్దడి రాదని భరోసాతో ఉన్నారు. ఏటా జనవరి చివరి వారం నుంచి వేసవి సన్నద్ధత కోసం విపత్తు నిర్వహణ, వ్యవసాయం, పశుసంవర్ధక, గ్రామీణ మంచినీటి సరఫరా, పురపాలక, పట్టణాభివృద్ధి తదితర శాఖల అధికారులు సమావేశమయ్యేవారు. వేసవిలో నీటి ఎద్దడి లేకుండా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేవారు. పశుగ్రాసం కొరతను ఎలా అధిగమించాలి.. తాగునీటి సరఫరాకు తీసుకోవాల్సిన చర్యలు.. వంటి అంశాలపై కార్యాచరణ ప్రణాళికలు రూపొందించి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అధ్యక్షతన చర్చించి నిర్ణయాలు తీసుకునేవారు. ఈ ఏడాది జలవనరుల్లోను, భూగర్భంలోను పుష్కలంగా నీరుండటంతో తాగునీటి ఎద్దడి మాటే ఉండదు. భూమి çపచ్చగా ఉన్నందున పశుగ్రాసానికి ఇబ్బంది ఉండదు. అందువల్ల ఈ ఏడాది వేసవి సన్నద్ధత సమావేశాల అవసరం ఉండదని అధికారులు చెబుతున్నారు. రాయలసీమలో అనూహ్యంగా పెరుగుదల నైరుతి రుతుపవనాల ఆరంభం నుంచి.. గత ఏడాది జూన్ ఒకటో తేదీ నుంచి ఈనెల 20వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా సాధారణం కంటే 27 శాతం అధిక వర్షపాతం నమోదైంది. రాయలసీమలో ఏకంగా 57 శాతం ఎక్కువగా వర్షం కురవడం గమనార్హం. కోస్తాంధ్రలో 17 శాతం అధిక వర్షపాతం రికార్డయింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ సీజన్లో 860 మిల్లీమీటర్ల సగటు సాధారణ వర్షపాతం కాగా 1,087 మిల్లీమీటర్లు నమోదైంది. ఇదేకాలంలో కోస్తాంధ్రలో 954 మిల్లీమీటర్లకుగాను 1,111 మిల్లీమీటర్లు (17 శాతం ఎక్కువ), రాయలసీమలో 648 మిల్లీమీటర్లకుగాను 1,003 మిల్లీమీటర్లు ( 57 శాతం అధిక) వర్షపాతం రికార్డయింది. దీంతో రాయలసీమ ప్రాంతంలో భూగర్భ జలమట్టం అనూహ్యంగా పెరిగింది. 2020 జనవరితో పోలిస్తే జనవరిలో రాష్ట్ర వ్యాప్తంగా సగటున 3.8 మీటర్ల ( 12.46 అడుగుల) మేరకు భూగర్భ జలమట్టం పెరిగింది. ఇదే సమయంలో రాయలసీమలో పెరుగుదల 8.1 మీటర్లు (26.57 అడుగులు) ఉండటం గమనార్హం. వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాల్లో పాతాళగంగ పైకి వస్తోంది. కొన్నిచోట్ల మోటర్లు వేయకుండానే బోరు పైపుల నుంచి నీరు కొద్దిగా బయటకు వస్తోంది. వాగులు, వంకల్లో సుదీర్ఘకాలం ఊట (జేడు) నీరు ప్రవహిస్తుండటంతో కొండ దిగువ ప్రాంతాల్లోని భూముల్లో నీరు ఊరుతోంది. గత ఏడాది జనవరితో పోలిస్తే 12 జిల్లాల్లో భూగర్భ జలమట్టం పైకి వచ్చింది. ఒక్క శ్రీకాకుళం జిల్లాలో మాత్రం నామమాత్రంగా 0.7 మీటర్ల మేర తగ్గింది. మూడు దశాబ్దాల్లో ఎన్నడూ చూడలేదు పాపాఘ్ని నది నాలుగు నెలలుగా ప్రవహిస్తూనే ఉంది. గత మూడు దశాబ్దాల్లో ఈ నది వరుసగా మూడునెలలు ప్రవహించిన దాఖలాలు లేవు. భారీ వర్షాలవల్ల భూగర్భ జలం భూమిపైకి ఉబికి వస్తోంది. వరిగడ్డి వాములు కిందనుంచి రెండడుగులమేర తడిచిపోయాయి. – రామలింగారెడ్డి, కమలాపురం, వైఎస్సార్ కడప జిల్లా. మోటరు వేయకుండానే నీరు మా ఊరు కొంత తగ్గులో ఉంది. పైన ఏట్లో నీరు ప్రవహిస్తున్నందున మా భూముల్లో ఊటెక్కింది. మోటర్లు వేయకుండానే లోతట్టు ప్రాంతాల్లోని బోరు పైపుల నుంచి నీరు ఉబికి వస్తోంది. – వెంకటరామిరెడ్డి, వంగిమళ్ల, వీరబల్లి మండలం, వైఎస్సార్ కడప జిల్లా పుష్కలమైన వర్షాలే కారణం రాష్ట్ర వ్యాప్తంగా 2020 కేలండర్ ఇయర్లో మంచి వర్షాలు కురిశాయి. దీనివల్లే భూగర్భ జలమట్టం బాగా పెరిగింది. వచ్చే రెండు మూడేళ్లు భూగర్భ జలమట్టంపై ఈ వర్షాల ప్రభావం ఉంటుంది. సాధారణంగా జూన్ నుంచి మే నెల వరకు వాటర్ ఇయర్ అని అంటారు. రాష్ట్రంలో సంవత్సరం మొత్తంలో కురిసే వర్షంలో జూన్–అక్టోబరు మధ్య నైరుతి రుతుపవనాల సీజన్లోనే 65 శాతానికిపైగా కురుస్తుంది. మరో 25 శాతం ఈశాన్య రుతుపవనాల సీజన్లో పడుతుంది. మిగిలిన 10 శాతం వర్షం ఇతర నెలల్లో కురుస్తుంది. రాయలసీమ ప్రాంతంలో గత ఏడాది విపరీతమైన వర్షాలు కురిశాయి. అందువల్ల జలమట్టం బాగా పైకి వచ్చింది. – ఎ.వరప్రసాదరావు, భూగర్భజలశాఖ రాష్ట్ర సంచాలకుడు -
భూగర్భ జలాలు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం.. చిన్న నీటివనరుల్లోనూ నీటి లభ్యత పెరగడంతో భూగర్భ జలం పెరిగింది. ఉపరితల నీటి వినియోగం పెరగడంతో భూగర్భంపై ఒత్తిడి తగ్గింది. దీంతో గత నాలుగైదేళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భ నీటిమట్టాలు పుంజుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సరాసరిన ఏటా డిసెంబర్లో 10 మీటర్లు దిగువకు ఉండే భూగర్భ జలాలు గతేడాది డిసెంబర్లో మాత్రం 8.12 మీటర్ల వద్దే లభ్యతగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే యాసంగి పంటల సాగు పెరుగుతు న్న నేపథ్యంలో మున్ముందు భూగర్భజలం తగ్గే అవకాశం ఉన్నా గతంలో ఉన్న వాటికన్నా ఈసారి భూగర్భ మట్టాలు మెరుగ్గానే ఉంటా యని భూగర్భ జల విభాగం అంచనా వేస్తోంది. 2.99 మీటర్ల ఎగువకు... 2019 డిసెంబర్ మాసాంతం వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 845 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 964 మిల్లీమీటర్ల మేర నమోదు కావడం భూగర్భ నీటిమట్టాల పెరుగుదులకు దోహదపడింది. 2018 డిసెంబర్లో రాష్ట్ర సరాసరి భూగర్భ మట్టం 11.11 మీటర్లలో ఉండగా అది గత ఏడాది డిసెంబర్లో 8.12 మీటర్లుగా నమోదైంది. అంటే 2.99 మీటర్ల మేర భూగర్భ మట్టం పెరిగింది. 2019లో వానాకాలం సీజన్ ప్రారంభం ముందు వరకు 14.56 మీటర్లు దిగువన నీటిమట్టాలు నమోదవగా డిసెంబర్ నాటికి ఏకంగా 6.44 మీటర్ల మేర పుంజుకోవడం విశేషం. భూగర్భ జల విభాగం శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. జనగాం, సిధ్దిపేట, మెదక్, నిజామాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి జిల్లాల్లోనూ 4 మీటర్లకుపైగా పాతాళగంగ పైకి వచ్చినట్లు నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర విస్తీర్ణంలో 28 శాతం భూభాగంలో 5 మీటర్లలోనూ భూగర్భ మట్టాలుండగా మరో 44 శాతం భూభాగంలో 5–10 మీటర్ల పరిధిలో భూగర్భ మట్టాలున్నాయని నివేదిక తెలిపింది. వనపర్తి జిల్లాలో 3.63 మీటర్లు, వరంగల్ అర్బన్‌లో 3.86 మీటర్ల ఎగువన నీటి లభ్యత ఉన్నట్లు పేర్కొంది. ఇక సంగారెడ్డి జిల్లాలో భూగర్భ మట్టాలు 17.72 మీటర్ల దిగువన ఉండగా సిధ్దిపేట జిల్లాలో 11.38, వికారాబాద్‌లో 12.86, మహబూబ్‌నగర్‌లో 11.62 మీటర్లు దిగువన నీటిమట్టాలున్నాయని నివేదిక తెలిపింది. ఈ జిల్లాల్లో సరైన వర్షాలు కురవకపోవడం, ఉపరితల నీటి వినియోగానికి ప్రాజెక్టులు లేకపోవడంతో భూగర్భ జలాల్లో పెరుగుదల కనిపించలేదు. ప్రాజెక్టులు, చెరువులు ఊపిరి పోశాయ్... రాష్ట్రంలో వర్షాకాలం ముగిసిన అనంతరం సైతం ప్రాజెక్టుల్లో ఈ ఏడాది నీటి లభ్యత పుష్కలంగా ఉంది. గోదావరి బేసిన్లో ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం 251.61 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 180 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. 2018లో ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే ఏకంగా 100 టీఎంసీల మేర నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో పూర్తిస్థాయి నిల్వలున్నాయి. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల సామర్థ్యం 534 టీఎంసీలుకాగా ఈ ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఏకంగా 430 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత గతంకన్నా ఎక్కువగా ఉండటం వాటిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి తరలింపు జరుగుతుండటంతో భూగర్భ జలాల వినియోగం తగ్గింది. ఇక రెండు బేసిన్లలోని 40 వేల చెరువులకుగాను 15 వేల చెరువుల్లో పూర్తిస్థాయి నీటి లభ్యత ఉండగా మరో 7 వేల చెరువులు సగానికిపైగా నిండి ఉన్నాయి. ఇది కూడా భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం చేసింది. -
పొంగింది పాతాళగంగ
సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో భారీ వర్షాలు కురవడం, సాగునీటి ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతుండటం, వీటి ద్వారా చెరువులు, కాల్వలకు సరిపడినంత నీటిని విడుదల చేయడంతో మునుపెన్నడూ లేనంతగా పాతాళ జలం పైకొచ్చింది. రాష్ట్రంలో అక్టోబర్‌లో కురవాల్సిన సగటు వర్షపాతం కన్నా 17శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలం పైకి ఉప్పొంగుతోంది. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ భూగర్భ మట్టం ఏకంగా 2.43మీటర్లు పైకి వచ్చింది. ఈ ఏడాది వర్షాలకు ముందు జూన్ నెల వరకు రాష్ట్ర సగటు భూగర్భ మట్టం 14.56మీటర్ల లోతున ఉంటే ప్రస్తుతం అది 6.64మీటర్లు పైకి ఎగబాకి 7.92 మీటర్లకు చేరింది. గణనీయంగా సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే 11.42 మీటర్లు భూగర్భ మట్టం మెరుగవడం విశేషం. సాగునీరు మెరుగైన చోటల్లా.. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం అక్టోబర్ నెలలో 816 మిల్లీమీటర్లకు గానూ 953.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఏకంగా 17శాతం వర్షపాతం అధికంగా కురి సింది. హైదరాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కామారెడ్డి, ములుగు, పెద్దపల్లి, వనపర్తి, సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాలో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జల మట్టాలు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర సగటు భూగర్భమట్టం 10.35 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 2.43 మీటర్ల మేర మెరుగై 7.92 మీటర్లకు చేరింది. ఈ ఏడాది జూన్‌లో వర్షాలకు ముందు వరకు రాష్ట్ర సగటు మట్టం 14.56 మీటర్లు ఉండగా, దాంతో పోలిస్తే ప్రస్తుతం ఏకంగా 6.64 మీటర్లు పెరిగింది. ఇక గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులనుంచి నీటి విడుదల జరిగిన కరీంనగర్, జనగాం, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా ప్రాంతాల్లో మట్టాలు ఆశించినదానికన్నా మెరుగయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జూన్‌లో నీటి మట్టం 17.98 మీటర్లు ఉండగా, అది ప్రస్తుతం 4.59 మీటర్లు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల జరిగిన నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఇక్కడ జూన్‌లో 12.21 మీటర్లలో ఉన్న మట్టం ప్రస్తుతం 9.22 మీటర్లకు చేరింది. మొత్తంగా రాష్ట్ర భూభాగంలో 38 శాతం భూభాగంలో భూగర్భమట్టాలు 5 మీటర్లకు పైనే ఉండగా, 5 నుంచి 10 మీటర్ల పరిధిలో మరో 32 శాతం భూభాగం ఉందని భూగర్భ శాఖ నివేదికలు చెబుతున్నాయి. మరో 17శాతం భూభాగంలో మట్టాలు 10 నుంచి 15మీటర్ల మధ్య ఉన్నాయి. రాష్ట్రంలో రెండు నదీ బేసిన్ల పరిధిలో ఉన్న 43,759 చెరువుల్లో ప్రస్తుతం 3,692 చెరువులు అలుగు పారుతుండగా, మరో 13,705 చెరువులు వంద శాతం జలకళను సంతరించుకున్నాయి. మరో 4,700 చెరువులు 75శాతం నీటితో కళకళలాడుతున్నాయి. చెరువులన్నీ నిండటం, ప్రాజెక్టు కాల్వల నుంచి నీటి పారకంతో బోర్ల వినియోగం తగ్గడం వంటి కారణాలతో మట్టాలు మెరుగయ్యాయని భూగర్భ జల విభాగం డైరెక్టర్ డాక్టర్ పండిత్ మధునురే పేర్కొన్నారు. -
నీళ్లు నిండాయి!
సాక్షి, హైదరాబాద్: గడిచిన రెండు నెలలుగా రాష్ట్రవ్యాప్తంగా విస్తారంగా కురుస్తున్న వర్షాలతో భూగర్భ నీటిమట్టాలు పెరిగాయి. ఈ ఏడాది వర్షాకాలం ప్రారంభానికి ముందున్న పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుతం భూగర్భ నీటిమట్టాలు గణనీయంగా మెరుగయ్యాయి. ప్రాజెక్టులన్నీ నిండుకుండలుగా మారడం, చిన్ననీటి వనరుల్లో సమృధ్ధిగా నీటి లభ్యత ఉండటం పాతాళగంగ పైకి వచ్చేందుకు దోహదపడింది. జూన్ మొదటి వారంలో 15 మీటర్ల దిగువకు పడిపోయిన నీటిమట్టం... ప్రస్తుతం 9.75 మీటర్లకు చేరింది. ఇక రాష్ట్రంలోనూ ప్రస్తుతం పంటలన్నీ పొట్ట దశలో ఉండటం, వాటికి భూగర్భ వినియోగం అవసరం లేకపోవడం, ఇంకా విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో భూగర్భ నీటిమట్టాలు మరింత మెరుగయ్యే అవకాశం ఉంది. గణనీయ వృధ్ధి.. గత నెలలో రాష్ట్ర సగటు వర్షపాతం 726 మిల్లీమీటర్లకుగాను 795 మి.మీ. వర్షపాతం నమోదైంది. ఏకంగా 9 జిల్లాల్లో (హైదరాబాద్, ఆసిఫాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్, నారాయణపేట, సిరిసిల్ల, సిధ్దిపేట, నిజామాబాద్, వరంగల్ అర్బన్) ఏకంగా 21 శాతం నుంచి 36 శాతం అధిక వర్షపాతం నమోదైంది. దీంతో ఈ ఏడాది జూన్‌లో రాష్ట్ర సగటు నీటిమట్టం 15 మీటర్లు ఉండగా ఆగస్టులో అది 11.15 మీటర్లుకు చేరింది. సెప్టెంబర్‌లో కురిసిన వర్షాలతో అది 9.85 మీటర్లకు చేరింది. అంటే జూన్‌తో పోలిస్తే 5.15 మీటర్లు, ఆగస్టుతో పోలిస్తే 1.30 మీటర్ల మేర భూగర్భమట్టం మెరుగైంది. రాష్ట్ర భూభాగంలో 30 శాతం 5 మీటర్లకన్నా తక్కువ మట్టంలోనే భూగర్భ నీటిలభ్యత ఉండగా 28.7 శాతం భూగర్భ విస్తీర్ణంలో 5 నుంచి 10 మీటర్ల మధ్యన నీటిమట్టాలు రికార్డయ్యాయి. దీనికితోడు గడిచిన నెలంతా కురిసిన వర్షాలతో చెరువులు జలకళను సంతరించుకుంటున్నాయి. రాష్ట్రంలో ఉన్న 40 వేలకుపైగా చెరువులకుగాను ఏకంగా 14 వేల మేర చెరువులు నిండుకుండలుగా కనబడుతున్నాయి. ఒక్క గోదావరి బేసిన్లోనే 10,500 చెరువులు పూర్తిస్థాయిలో నిండగా కృష్ణా బేసిన్లో 3,300 చెరువులు జలకళతో కలకళ్లాడుతున్నాయి. గతేడాదితో పోలిస్తే 10 వేల చెరువులు నిండుగా ఉండటం, మరో 10 వేల చెరువుల్లోనూ సగానికిపైగా నీరు చేరడం భూగర్భ నీటిమట్టాల్లో పెరుగుదలకు దోహదపడింది. రాష్ట్రంలో ఒక్క మెదక్ జిల్లాలో మినహా అన్ని జిల్లాల్లోనూ 20 మీటర్ల పరిధిలో భూగర్భ నీటిమట్టాలు లభ్యతగా ఉన్నాయి. గతేడాది మెదక్ సహా సిధ్దిపేట, వికారాబాద్, రంగారెడ్డి జిల్లల్లోనూ 20 మీటర్లకు దిగువనే భూగర్భ మట్టాలున్నట్లు రికార్డులు చెబుతున్నాయి. -
చినుకు జాడేది?
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో చినుకు జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. గత ఐదేళ్లలో రాష్ట్రంలో కరవు ఛాయలు అలుముకున్నాయి. ఇప్పుడైనా అంతా సవ్యంగా ఉంటుందనుకుంటే సరైన వర్షాలు లేకపోవడంతో రైతులు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ నెల ఒకటిన ఆరంభమైన ఖరీఫ్ సీజన్లో 26వ తేదీ వరకు పరిశీలిస్తే నాలుగు జిల్లాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితి నెలకొంది. శ్రీకాకుళం, పశ్చిమ గోదావరి, కృష్ణా, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో కురవాల్సిన దాని (సాధారణం) కంటే 59 శాతంపైగా లోటు వర్షపాతం నమోదైంది. దీన్ని వాతావరణ పరిభాషలో స్కాంటీ (తీవ్ర దుర్భిక్షం) అని అంటారు. మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కూడా సాధారణం కంటే 20 నుంచి 58 శాతం వరకు తక్కువ వర్షం కురిసింది. నెల్లూరు జిల్లాలో పరిస్థితి మరీ దారుణంగా ఉంది. ఈ జిల్లాలో సాధారణం కంటే 79.1 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. పశ్చిమ గోదావరి జిల్లాలో 63.1 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 62 శాతం, కృష్ణా జిల్లాలో 60.6 శాతం లోటు వర్షం కురిసింది. ఇదే కాలంలో రాష్ట్రవ్యాప్తంగా కురవాల్సిన సగటు సాధారణ వర్షం కంటే 42.9 శాతం తక్కువ కురిసింది. మూడొంతుల ప్రాంతంలో వర్షాభావమే.. రాష్ట్రంలో మూడొంతుల ప్రాంతంలో వర్షాభావ పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో మొత్తం 670 మండలాలు ఉండగా 276 మండలాల్లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితి (59 శాతం పైగా లోటు వర్షపాతం) ఉంది. మరో 228 మండలాల్లో కురవాల్సిన దాని (సాధారణం) కంటే 20 నుంచి 59 శాతం తక్కువ వర్షం కురిసింది. గత ఐదేళ్లలో వరుసగా దుర్భిక్ష పరిస్థితులు నెలకొనడం, ఈ ఏడాది కూడా ఇప్పటివరకు వరుణుడు కరుణించకపోవడంతో జిల్లాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. భూగర్భ జలమట్టం పూర్తిగా పడిపోయింది. జలాశయాలు, ప్రాజెక్టులు నీరు లేక అడుగంటాయి. భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటడంతో బోర్లు కూడా పనిచేయడం లేదు. జూన్ చివరి వారం వచ్చినా వర్షం జాడ లేకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. త్వరగా వర్షం కురిస్తే వేరుశనగ, ఇతర పంటలు సాగు చేయాలని రాయలసీమ రైతులు ఎదురుచూస్తున్నారు. కోస్తా, ఉత్తరాంధ్ర జిల్లాల రైతులు వర్షాలు కురిసి జలాశయాల్లో నీరు చేరితే వరి సాగు చేయాలని యోచిస్తున్నారు. ఖరీఫ్ సాగుపై ప్రభావం ఈ ఏడాది కూడా వర్షాభావం ప్రభావం ఖరీఫ్ సాగుపై తప్పేలా లేదని అధికారులు అంటున్నారు. కర్నూలు, అనంతపురం, వైఎస్సార్, చిత్తూరు, ప్రకాశం జిల్లాల్లో రైతులు వేరుశనగ, ఇతర మెట్ట పంటలు సాగు చేస్తుంటారు. రాష్ట్రంలో 9.15 లక్షల హెక్టార్లు (సుమారు 23 లక్షల ఎకరాల్లో) వేరుశనగ సాగు చేయాలనేది ప్రభుత్వ లక్ష్యం కాగా ఇప్పటివరకు 1.9 శాతం విస్తీర్ణంలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. 16.25 లక్షల హెక్టార్లలో వరి సాగు కావాల్సి ఉండగా ఇప్పటివరకు 1.6 శాతం మాత్రమే సాగైంది. ఇంకా సాగుకు సమయం ఉన్నప్పటికీ వర్షాభావం వల్ల సాగు తగ్గిపోయే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. -
చినుకమ్మా! ఎటుబోతివే..!!
సాక్షి, అమరావతి: నైరుతి రుతు పవనాలు పక్షంరోజులుగా మొహం చాటేశాయి. కరువు ఛాయలు ప్రస్ఫుటం అవుతున్నాయి. రైతులు అష్ట కష్టాలు పడి కన్న బిడ్డల్లా పెంచుకున్న మామిడి, బొప్పాయి, అరటి, బత్తాయి లాంటి పండ్ల తోటలు నీరందక ఎండిపోతున్నాయి. జూన్ నెల వచ్చి 20 రోజులవుతున్నా రాష్ట్రంలో చినుకు జాడలేదు. జోరుగా వ్యవసాయ పనులు సాగాల్సిన కాలంలో పంట భూములు ఎడారిని తలపిస్తున్నాయి. రిజర్వాయర్లన్నీ నిండుకున్నాయి. భూగర్భ జలమట్టం దారుణంగా పాతాళానికి పడిపోయిది. ఉన్న బోర్లు ఎండిపోతుండగా... కొత్తగా బోర్లు వేసినా నీటి జాడలేని పరిస్థితి. అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో వేల ఎకరాల్లో పండ్ల తోటలు నిలువునా మాడిపోతున్నాయి. మిరప, టమోట, వంగ, బెండ తదితర కూరగాయల తోటలు కూడా ఎండిపోయాయి. మార్కెట్లో కిలో టమోటా రూ.45 చేరడానికి ఇది కారణమని వ్యాపారులు అంటున్నారు. అనంతపురం జిల్లాలో కంది పోకుండా పండ్ల తోటల్లో కాయలను ఎండ నుంచి కాపాడుకోవడం కోసం పాత చీరలను దానిమ్మ చెట్లకు కప్పుతున్నారు. కొందరు రైతులు ఇలా టమోటా, దానిమ్మ పంటలను ఎండ నుంచి కాపాడుకునేందుకు మార్కెట్లో వేలాది రూపాయలు వెచ్చించి పాత చీరలను కొనుగోలు చేశారు. అయిదేళ్లు కరువును ఎదుర్కొన్న రైతులు ఈ ఏడాదైనా సకాలంలో వర్షాలు కురుస్తాయని, పంటలు వేసుకుని తిండి గింజలతోపాటు నాలుగు రూపాయలు సంపాదించుకుందామని ఆశించిన రైతులకు ప్రకృతి తీవ్ర నిరాశ కలిగిస్తోంది. రుతుపవనాలు ఒకటి రెండు రోజుల్లో వస్తే నెలాఖరులోపు మంచి వర్షాలు కురుస్తాయని రైతులు ఆశలు పెట్టుకున్నారు. ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం నైరుతీ రుతు పవనాలు సకాలంలో రానందున ఖరీఫ్ సాగుపై దుష్ప్రభావం తప్పకపోవచ్చని వ్యవసాయ, విపత్తు నిర్వహణ శాఖల నిపుణులు అంటున్నారు. సాధారణంగా జూన్ అయిదో తేదీలోగా నైరుతీ రుతు పవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాలి. రుతు పవనాల రాకకు ముందస్తు సూచికగా జూన్ ఆరంభం నుంచి వర్షాలు కురవాలి. అయితే ఈ ఏడాది దీనికి పూర్తి విరుద్ధమైన పరిస్థితి నెలకొంది. జూన్ 20వ తేదీ వచ్చినా రుతు పవనాల జాడలేదు. ముందస్తు వర్షాలూ లేవు. వీటన్నింటికీ మించి ఎండలు భగ్గుమంటున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 43 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతుండటవల్ల భూమి సెగలు కక్కుతోంది. తాగునీటికీ కటకట సాగు నీరే కాదు తాగు నీటి సమస్య కూడా వేధిస్తోంది. భూగర్భ జలమట్టం రోజురోజుకూ కిందకు పడిపోతోంది. అయిదేళ్లుగా వరుసగా వర్షాభావం ఉండటమే ఇందుకు కారణం. రాష్ట్రంలోని 4800 పైగా గ్రామాల్లో తీవ్ర సాగునీటి ఎద్దడి నెలకొంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం కొంత వరకూ ట్యాంకర్లు, ఇతర మార్గాల ద్వారా తాగునీరు సరఫరా చేస్తున్నా వేలాది గ్రామాల వారికి సమస్య తప్పడంలేదు. మైళ్ల దూరం నుంచి చాలా గ్రామాల మహిళలు బిందెలతో నీరు మోసుకెళుతున్న దృశ్యాలు రాష్ట్రంలో తాగునీటి సమస్యకు అద్దం పడుతున్నాయి. పశువులు ఆకలితో అలమటిస్తుంటే తట్టుకోలేక మనసు చంపుకుని అన్నదాతలు వీటిని కటికోళ్లకు ఇస్తున్నారు. ఇప్పటికే 67 శాతం లోటు వర్షపాతం జూన్ ఒకటో తేదీతో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ అధికారిక గణాంకాల ప్రకారమే రాష్ట్రంలో సగటు వర్షపాత లోటు 67 శాతానికి చేరింది. ఈనెల ఒకటో తేదీ నుంచి ఇప్పటి వరకూ కురవాల్సిన వర్షం (సాధారణం) కంటే నెల్లూరు జిల్లాలో 94 శాతం, కృష్ణా 91, శ్రీకాకుళం 81.70, ప్రకాశం 78.30, పశ్చిమ గోదావరి 78.10 శాతం, విజయనగరం 76.40, విశాఖపట్నం 64.80, వైఎస్సార్ 63.20, గుంటూరు 59.80, కర్నూలు జిల్లాలో 58.60 శాతం వర్షపాతం లోటు నమోదైంది. -
అప్రమత్తంగానే ఉన్నాం: సీఎస్
సాక్షి, హైదరాబాద్: ఈ వేసవిలో రాష్ట్రంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అప్రమత్తంగా వ్యవహరిస్తున్నామని కేంద్ర కేబినెట్ సెక్రటరీ ప్రదీప్ కుమార్ సిన్హాకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషి తెలిపారు. సచివాలయంలో ప్రదీప్ కుమార్ సిన్హా వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో కరువు కార్యాచరణ ప్రణాళిక అమలు, భూగర్భజలాలు, విద్యుత్ సరఫరా, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, మంచినీటి సరఫరా, రుతుపవనాల రాక, నీటి నిర్వహణ, డేటాసేకరణ, విశ్లేషణ తదితర అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక నీటిపారుదల రంగంపై ప్రత్యేక దృష్టి సారించామని, బడ్జెట్లో అధిక నిధులు ఇరిగేషన్ రంగానికి కేటాయిస్తున్నామని వివరించారు. మిషన్ కాకతీయ ద్వారా 46,531 చెరువులను పునరుద్ధరించామని, రెండేళ్ల క్రితం ప్రధాని మోదీ ప్రారంభించిన మిషన్ భగీరథతో ఇంటింటికీ నల్లా ద్వారా మంచినీటిని అందిస్తున్నామని తెలిపారు. జూలై నెలలో కాళేశ్వరం మొదటి దశ పూర్తవుతుందని, ప్రధాన రిజర్వాయర్లలో గతేడాది కంటే తక్కువ నిల్వలు ఉన్నాయని తెలిపారు. వచ్చే రుతుపవనాల ద్వారా మంచి వర్షాలు కురుస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. వేసవిలో తాగునీటి సమస్య తలెత్తకుండా చూస్తున్నామని, వడగాడ్పులపై జిల్లా కలెక్టర్లతో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నామన్నారు. కర్ణాటక రెండు టీఎంసీల నీటిని విడుదల చేసినందుకు సీఎస్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ తివారీ తదితరులు పాల్గొన్నారు. -
గంగ.. బెంగ
రోజురోజుకు అడుగంటుతున్న భూగర్భ జలమట్టాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. రెండేళ్లుగా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో బోర్లు, బావులు వట్టిపోతున్నాయి. వేసవి ప్రారంభం కాకముందే గ్రామాల్లో తాగునీటి కష్టాలు ఆరంభమయ్యాయి. సాగునీటి సంగతి దేవుడెరుగు గాని కనీసం గుక్కెడు తాగునీరు దొరికే పరిస్థితి కనిపించడం లేదు. సాక్షి, వికారాబాద్:వరుసగా రెండేళ్లుగా వరుణుడు ముఖం చాటేయడంతో చెరువులు, కుంటల్లో నీరు రాలేని దుస్థితి నెలకొంది. ఈనేపథ్యంలో సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. కరువు భయం జనాన్ని పట్టిపీడిస్తోంది. అదేవిధంగా జిల్లాలో భూగర్భ జలమట్టాలు కనిష్టస్థాయికి చేరుకున్నాయి. ఈ సాధారణ వర్షపాతం 750 మిల్లీమీటర్లు కాగా ఇప్పటివరకు కేవలం 475 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. సుమారుగా 40 శాతం తక్కువ వర్షం కురిసింది. గత సంవత్సరం కంటే ఈ సీజన్లో సుమారుగా 6 మీటర్ల లోతుకు (18 అడుగులు) పైగా భూగర్భజలాలు పాతాళానికి వెళ్లాయంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో ఊహించుకోవచ్చు. రాష్ట్ర ప్రభుత్వం 2018 జనవరి 1నుంచి వ్యవసాయానికి నిరంతర విద్యుత్‌ను సరఫరా చేస్తోంది. దీంతో రైతులు అవగాహన లేకుండా ఇష్టానుసారంగా విద్యుత్ పంపుసెట్లను వినియోగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లాలో భౌగోళిక పరిస్థితుల ప్రకారం వర్షాకాలంలో సగటున 6 మీటర్లు, వేసవిలో 12 మీటర్లలోపు భూగర్భ నీటి మట్టాలు ఉండాలి. అయితే, ప్రస్తుతం సగటున 40 మీటర్లకుపైగా పడిపోయా యి. ఇక ఎండల తీవ్రత పెరిగితే ఏప్రిల్, మే నెలలో గంగమ్మ మరింత లోపలికి వెళ్లిపోతుందేమోనని రైతులు ఆందోళనచెందుతున్నారు. నెలనెలా లోలోపలికి.. జిల్లాలోని భూగర్భ జలశాఖ ప్రతినెలా నీటి మట్టాలను నమోదు చేస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే నీటి మట్టాలు ప్రతినెలా పడిపోతున్నాయి తప్పా ఎక్కడా పెరిగిన దాఖలాలు లేవు. జిల్లాలోని 18 మండలాల్లో ఇదే పరిస్థితి నెలకొంది. 4 మండలాల్లో 40 మీటర్ల లోతులో, మరో 7 మండలాల్లో 20 మీటర్ల కంటే లోతులో భూగర్భ జలాల లభ్యత ఉందని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని మరో 6 మండలాల్లో నీటి లభ్యత 18 మీటర్ల లోతుల్లో ఉంది. ఈ లెక్కల ప్రకారం రానున్న సమీప రోజుల్లో నీటికి కటకట తప్పదేమోననే భావన కలుగుతోంది. గతేడాది జనవరిలో జిల్లాలో సాధారణంగా నీటి లభ్యత 11 మీటర్లలోతులో ఉండగా, ప్రస్తుతం అది 40 మీటర్లకు పైగానే చేరుకుంది. అంటే సుమారుగా 29 మీటర్లకు పైగా నీటి మట్టం తగ్గింది. వికారాబాద్, బంట్వారం, కొడంగల్, దోమ మండలాల్లో ఈ సీజన్లో భూగర్భజల నీటిమట్టం సుమారుగా 25 మీటర్లకు పైగా లోతులో ఉంది. అదేవిధంగా మోమిన్‌పేట ధారూరు, యాలాల, తాండూరు మండలాల్లో 22 మీటర్ల లోతులో ఉంది. రోజురోజుకూ గంగమ్మ పాతాళంలోకి వెళ్తున్న నేపథ్యంలో నీటిని పొదుపుగా వినియోగించుకోవడం ఒక్కటే మార్గమని నిపుణులు హెచ్చరిస్తున్నారు. బోరుబండ్లకు భలే గిరాకీ.. జిల్లాలోని ఆయా గ్రామాల్లో మొత్తం 55,436 వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో సుమారుగా 3 వేలకు పైగా బోరుబావులు ఇప్పటికే ఎండుముఖం పట్టాయి. మరో 8వేల పైచిలుకు బోర్లలో నీళ్లు తక్కువగా వస్తున్నాయి. ఇక పట్టణాల్లో గృహావసరాలకు సుమారుగా ప్రతి ఇంటికీ ఒక బోరు ఉంది. ఇకపోతే తాగునీటి అవసరాలకు గ్రామీణ ప్రాంతాల్లో సుమారుగా 5వేల చేతిపంపులు, 775 రక్షిత మంచినీటి పథకాలు, 162 సీపీడబ్ల్యూ, ఎంపీడబ్ల్యూ నీటి సరఫరా పథకాలు కొనసాగుతున్నాయి. వీటితో జిల్లాలోని 9.4 లక్షల జనాభాకు నిత్యం తాగునీటిని సరఫరా చేస్తున్నారు. మిషన్ భగీరథ నీరు ఇప్పటికే సుమారుగా జిల్లాలోని 70 శాతం ఆవాసాలకు సరఫరా అవుతున్నాయి. వేసవిలో నీటిమట్టం గణనీయంగా తగ్గిపోవడం, వ్యవసాయ బోర్లు, బావు లు వట్టిపోతున్న నేపథ్యంలో బోరు డ్రిల్లింగ్ వాహనాలకు భళే గిరాకీ ఏర్పడింది. ప్రస్తుతం 1000 అడుగుల మేర తవ్వించినా నీరు రాలేదని పరిస్థితి నెలకొంది. ప్రతి ఫీట్ డ్రిల్లింగ్కు వంద ఫీట్ల వరకు రూ.60 ధర కాగా, ఆ తర్వాత ప్రతి అడుగుకు రూ.70 వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. ఈనేపథ్యంలో సుమారుగా రెండు లక్షలకు పైగా ఖర్చవుతోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఉచిత బోరు.. రైతు కష్టాలు తీరు
‘బక్కిరెడ్డి బావి ఎండిపోయింది. మళ్లీ రెండు మూడు మట్లు తవ్వితేగాని నీళ్లు పడవు. బ్యాంకు నుంచి అప్పు తెచ్చి రెండు మట్లు తవ్వడానికి 24 వేల రూపాయలకు పైగా ఖర్చు పెట్టాడు. కానీ నీటి జాడ కనబడలేదు. దీంతో బక్కిరెడ్డి మానసికంగా బాగా కుంగిపోయాడు. బాకీ తీర్చే మార్గం కనిపించడం లేదు. ఓ రోజు పొద్దున్నే బ్యాంకుల వాళ్లు వచ్చి ఊరోళ్ల సమక్షంలో బక్కిరెడ్డి పొలాన్ని వేలం వేశారు. తరతరాలుగా వచ్చిన పొలాలు పోయాయని, పొలం పోయిన రైతుకు ఊళ్లో ఇక ఏమాత్రం గౌరవం ఉండదని భావించిన బక్కిరెడ్డి ఆత్మహత్య చేసుకుంటాడు’... ఇదీ ప్రముఖ నవలా రచయిత డాక్టర్ కేశవరెడ్డి రాసిన మూగవాని పిల్లన గ్రోవి నవల్లోని ఓ హృదయ విదారక దృశ్యం. ఆంధ్రప్రదేశ్‌లోని ఓ సగటు రైతు బతుక్కి అద్దంపట్టే వర్ణన అది. ఇలా ఎందరో నిత్యం రాష్ట్రంలో కన్నుమూస్తున్నారు. ఒకప్పుడు వంద, రెండు వందల అడుగులు తవ్వితే పడే నీళ్లు ఈవేళ ఏడెనిమిది వందల అడుగులు దాటినా కనిపించడం లేదు. రాయలసీమలోనైతే ప్రత్యేకించి అనంతపురం, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలలో 12 వందలు, 14 వందల అడుగులు వేసినా నీరు పడక, పదేపదే బోర్లు వేసి చేతులు కాల్చుకుంటున్నారు రైతులు. చేసిన బాకీలు తీర్చక ఆత్మహత్యలకు పాల్పడుతున్న సంఘటనలు నిత్యకృత్యం. ఈ దుస్థితిని తన ప్రజా సంకల్పయాత్రలో కళ్లారా చూసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్షనాయకుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఓ భరోసా ఇచ్చారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచితంగా బోర్లు వేయిస్తామని హామీ ఇచ్చారు. దీంతో లక్షలాది మంది రైతులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. భూగర్భ జలాలే కీలకం... ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 45 శాతం సాగు భూమి భూగర్భ జలాలతోనే సాగవుతోంది. 1998 నుంచి 2003 మధ్య కాలంలో సగటున భూగర్భజల మట్టం 2.5 మీటర్లు తగ్గింది. మోటబావులు, దిగుడు బావులు ఎండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం బోరు బావులు వేసుకునే రైతుల కోసం ఓ వినూత్న పథకాన్ని తీసుకువచ్చింది. ఒక వేళ బోరు విఫలమైతే బీమా పొందేలా ఆ పథకానికి శ్రీకారం చుట్టింది. ప్రభుత్వ అనుమతితోపాటు రూ.12వందల ప్రీమియం, జియలాజికల్ సర్వే కోసం మరో రూ.1000 (చిన్న సన్నకారు రైతులైతే రూ.500) చెల్లించి బోర్ వేసుకోవాలి, నీరు పడకపోతే ప్రభుత్వం నుంచి రూ.10 వేల రూపాయల బీమా లేదా బోరు వేయడానికి అయిన వాస్తవ ఖర్చును పొందవచ్చు. వైఎస్సార్ ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి 2006 జనవరి నాటికి 5,389 కొత్త బోరు బావులకు అనుమతి ఇచ్చారు. పోటీ పడి పక్కపక్కనే బోర్లు వేసుకోకుండా రైతు భాగస్వామ్య వ్యవస్థను తీసుకువచ్చారు. సంబంధిత బోరు బావి కింద ఎంత భూమి ఉండాలో నిర్ణయించి ఆ ప్రకారంగా రైతులందరూ నీళ్లను వినియోగించుకునే పద్ధతిని– ఉమ్మడి నీటి యాజమాన్య సంఘం– ప్రవేశపెట్టారు. భూ గర్భ జలాలను పెంపొందించే విధానాలను రైతులు ఆచరించేలా చేశారు. వేరుశనగ వంటి పంటల్లో సైతం తుంపర సేద్య పద్ధతిని ప్రవేశపెట్టి చిన్నసన్నకారురైతులకు ప్రాధాన్యత ఇచ్చారు. కాలదోషం పట్టిన ప్రభుత్వ అంచనాల ప్రకారం బోరు వేయడానికి వ్యయం రూ.18,500ఖర్చు, వాస్తవానికి లక్ష నుంచి లక్షన్నర రూపాయలవుతుంది. బోరు వేసే లోతును బట్టి ఈ ఖర్చు పెరుగుతుంది. బోరు విఫలమైతే రైతు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుంది. నాబార్డ్ లాంటి సంస్థలు వీటిని రీచార్జ్ చేసేందుకు సాయం అందిస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. ఈ పరిస్థితుల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతులకు ఉచిత బోర్ల పథకాన్ని ప్రకటించారు. డీజిల్ ధర పెరగడంతో అడుగు లోతుకి రూ.300 నుంచి రూ.400 చార్జ్ చేస్తున్నారు. ఈ లెక్కన కనీసం 300 అడుగుల లోతున బోరు వేయాలంటే సుమారు లక్షన్నర ఖర్చు వస్తుంది. భార్య పుస్తెలమ్మి బోరు వేస్తే... ఆ బోరులో నీళ్లు పడతాయో లేదో తెలియదు. పంట చేను తడుస్తుందనే భరోసా ఉండదు కానీ ఆ రైతు నట్టిల్లు మాత్రం కన్నీళ్లతో నానిపోతుంది. ఈ దుస్థితి నుంచి రైతుల్ని కాపాడేందుకు వైఎస్ జగన్ ప్రకటించిన ఉచిత బోర్ల పథకం ఉపయోగపడుతుంది. ఉచిత బోరు.. బడుగు రైతుకు భరోసా (ప్రతీకాత్మక చిత్రం) – ఎ. అమరయ్య, చీఫ్ రిపోర్టర్, సాక్షి -
పడిపోతున్న భూగర్భ నీటిమట్టాలు
-
తెలంగాణలో జల ఘంటికలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి నీటి ముప్పు ముంచుకోస్తోంది. వేసవి రాక ముందే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. గతేడాది వర్షపాతం లోటుతోపాటు ‘రబీ’ సాగుకు బోరుబావులపై ఆధారపడటంతో భూగర్భ జలాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర సగటు నీటి మట్టం 11.91 మీటర్లు. గతేడాదితో పోలిస్తే ఇది 1.83 మీటర్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. అవసరానికి మించి బోర్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో నీటి వృథా జరుగుతోందని భూగర్భ జలశాఖ అంచనా వేస్తోంది. భయపెడుతున్న నీటి మట్టాలు... ఈ ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో 852 మిల్లిమీటర్ల వర్షపాతానికిగాను 721 మిల్లిమీటర్లే నమోదైంది. గతేడాదితో పోలిస్తే 15% తక్కువగా రికార్డయింది. 31 జిల్లాలకుగాను 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొంది. 284 మండలాల్లో 20% నుంచి 59% వర్షపాతం తక్కువగా నమోదైంది. గతేడాది జనవరిలో 10.08 మీటర్ల రాష్ట్ర సరాసరి నీటిమట్టాలుండగా ఈ ఏడాది జనవరి చివరి నాటికి అది 11.91 మీటర్లకు చేరింది. భూగర్భ జలమట్టాల్లో 1.83 మీటర్ల తగ్గుదల నమోదైంది. ఇవే మట్టాలను 2017తో పోలిస్తే 2.55 మీటర్ల మేర పడిపోయాయి. కేవలం 11 జిల్లాల్లోనే 0.11 మీటర్ల నుంచి 1.56 మీటర్ల మేర పెరుగుదల కనిపించగా 20 జిల్లాల్లో 7.49 మీటర్ల నుంచి 0.17 మీటర్ల వరకు తగ్గాయి. ముఖ్యంగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. సంగారెడ్డిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 7.49 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. అతిఎక్కువగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో ఏకంగా 44.68 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం గమనార్హం. ఏకంగా 117 మండలాల్లో 20 మీటర్ల దిగువకు వెళ్తేగానే నీరు లభించట్లేదు. ప్రాజెక్టుల్లోనూ క్షీణత.. రక్షణ చర్యలే కీలకం ఇప్పటికే నీళ్లు లేక బోరుబావులు వట్టిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీళ్లను ఉపయోగించి రైతులు పంటల సాగు చేస్తున్నారు. దీనికితోడు మంజీరా, సింగూరు, నిజాంసాగర్‌లలో ఇప్పటికే చుక్క నీటి లభ్యత లేకపోగా ఎస్సారెస్పీ, కడెం, లోయర్ మానేరులో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఇక హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఆధారపడ్డ శ్రీశైలంలో నిల్వలు కనీస నీటిమట్టాలకు దిగువకు చేరాయి. 885 అడుగుల మట్టానికిగాను కనీస నీటిమట్టం 834 అడుగులకన్నా తక్కువగా 831.40 అడుగులకు తగ్గిపోయింది. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గడంతో భూగర్భ జలాలు మున్ముందు మరింత క్షీణించే అవకాశం ఉంది. వేసవికి ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే నిండు వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆందోళన రేపుతోంది. నీటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల రోజురోజుకూ భూగర్భజలాలు పడిపోతున్నాయి. నీటిని భూమిలోకి ఇంకించడానికి అవసరమైన ప్రాంతాల్లో కాంటూరు కందకాలు, చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. నీరున్న చోట వాటి నిర్మాణాలకు డ్వామా అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నా నీరు లేనిచోట నిర్మించడం లేదు. ఫలితంగా నీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలు అత్యంత మఖ్యమని భూగర్భ జలశాఖ హెచ్చరిస్తోంది. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని, ఐడీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచిస్తోంది. భూగర్భాలు అత్యంత దారుణంగా పడిపోయిన మండలాలు మండలం మట్టం (మీటర్లలో) దౌల్తాబాద్ (సిధ్దిపేట) 44.68 బట్వారం (వికారాబాద్) 41.77 కొల్చారం (మెదక్) 40.10 ఫరూఖ్‌నగర్ (రంగారెడ్డి) 37.70 మిడ్జిల్ (మహబూబ్‌నగర్) 36.55 -
పాతాళం నుంచి పైపైకి..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూగర్భజలాలు పెరిగాయి. పాతాళం నుంచి పైపైకి వచ్చాయి. ఆగస్టులో కురిసిన వర్షాలు భూగర్భజలానికి ఊపిరులూదాయి. గడచిన రెండేళ్లుగా తీవ్ర వర్షాభావంతో పాతాళానికి పడిపోయిన భూగర్భజలాలు.. భారీ వర్షాలు, ఎగువ ప్రాంతాల నుంచి పెరిగిన జల ప్రవాహాల కారణంగా పైపైకి వచ్చాయి. ఒక్క ఆగస్టులో కురిసిన వర్షాలతోనే రాష్ట్రవ్యాప్తంగా సగటున 0.39 మీటర్ల మేర భూగర్భ జలమట్టం పెరిగింది. మిషన్ కాకతీయలో భాగంగా చేపట్టిన చెరువుల్లో నీరు సమృద్ధిగా చేరడంతో వర్షపునీరు సంతృప్తికరంగా భూమిలోకి ఇంకిందని భూగర్భ జలవనరుల విభాగం పేర్కొంటోంది. రాష్ట్రంలో గడిచిన రెండేళ్ల కాలంలో అరకొర వానలే పడటంతో తెలంగాణవ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. అంతేకాకుండా భూగర్భజలాలు పూర్తిగా ఇంకిపోయి పాతాళానికి చేరుకున్నాయి. గత ఏడాది ఆగస్టులో నీటిమట్టం 10.13 మీటర్లకు పడిపోయింది. భూగర్భ నీటి వినియోగం పెరడగడంతో ఈ ఏడాది మే నాటికి అది ఏకంగా 12.78 మీటర్ల గరిష్టానికి చేరింది. మొత్తం 44,706 చెరువులకుగానూ 15,800 చెరువులు పూర్తిస్థాయిలో నిండాయి. కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 200లకు పైగా చెరువులను నింపారు. జూరాల, నాగార్జునసాగర్, ఎస్సారెస్పీ ప్రాజెక్టుల ద్వారా చెరువులకు నీటిని విడుదల చేశారు. దీని వల్ల భూగర్భ జలమట్టం పెరిగింది. గత ఏడాది ఆగస్టులో రాష్ట్ర సరాసరి నీటిమట్టం 10.13 మీటర్లు ఉండగా అది ప్రస్తుతం 9.74 మీటర్లకు చేరింది. 0.39 మీటర్ల మేర భూగర్భజలం పెరగ్గా, ఈ ఏడాది మే నెలతో పోలిస్తే ఏకంగా 3.04 మీటర్ల మేర భూగర్భ జలాల నీటి మట్టం పెరిగింది. మేడ్చల్ జిల్లాలో గత ఏడాది ఆగస్టులో నీటి మట్టం 16.48 మీటర్ల లోతున మట్టం ఉండగా అది ప్రస్తుతం 12.71 మీటర్లుగా నమోదైంది. ఏకంగా 3.77 మీటర్ల మేర భూగర్భజలాలు మెరుగయ్యాయి. ఆదిలాబాద్, నల్లగొండ, మహబూబాబాద్ జిల్లాల్లోనూ 3 మీటర్లకుపైగా భూగర్భమట్టం పెరిగింది. అయితే, మంచిర్యాల జిల్లాలో గత ఏడాది కంటే భిన్నంగా 3.80 మీటర్ల మేర నీటి మట్టం పడిపోగా, సిద్దిపేట, గద్వాల్, హైదరాబాద్, సంగారెడ్డి జిల్లాలోనూ భూగర్భమట్టాలు గత ఏడాది కంటే పడిపోయాయి. సరైన వర్షాలు లేని కారణంగా ఆయా జిల్లాల్లో భూగర్భ మట్టాల్లో పెరుగుదల లేదని భూగర్భ జల విభాగం వర్గాలు వెల్లడించాయి. -
భూగర్భశోకం
సాక్షి, మెదక్: వేసవి ప్రారంభంలోనే జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జలాశయాలు, చెరువుల్లో నీరు వేగంగా ఇంకిపోతుంది. దీనికి తోడు భూగర్భ జల మట్టాలు అడుగంటుతున్నాయి. పర్యవసానంగా గ్రామాలు, తండాల్లోని ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. నిజాంపేట మండలం చల్మెడలో తాగు నీటి కష్టాలు తీర్చాలంటూ మూడు రోజుల క్రితం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందో? మెదక్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, చిలప్‌చెడ్ తదితర మండలాల్లో ఇప్పటికే నీటి సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా గిరిజన తండాల్లో నీటి సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో గిరిజనులు కిలోమీటర్ల మేర నడుచకుంటూ వెళ్లి వ్యవసాయ భూముల వద్ద ఉన్న బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే నీటి కోసం ఇబ్బందులు పడాల్సివస్తే వేసవిలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళనకు గురువుతున్నా రు. మరోవైపు మిషన్‌భగీరథ పనులు నత్తనడక న సాగుతున్నాయి. ఏప్రిల్‌లోగా మొదటి దశలో గ్రామాలకు తాగునీరు సరఫరా చేయటం సాధ్యం కాకపోవచ్చని ప్రజలు ఆలోచిస్తున్నారు. వేగంగా పడిపోతున్నాయి.. జిల్లాలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం భూగర్భ జలాలు 16.07 మీటర్ల లోతులో ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో భూగర్భ జలాలు 13.07 మీటర్లు ఉండటం గమనార్హం. 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉండటంతో వ్యవసాయం కోసం రైతులు ఎడాపెడా బోరుబావుల్లో నుంచి నీటిని తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తూప్రాన్ మండలంలో అత్యధికంగా భూగర్భ జలాలు 32.26 మీటర్ల లోతుకు పడిపోగా, రేగోడ్‌లో 9.56 మీటర్ల లోతునే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ జలాలు మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు. గిరిజన తండాల్లో నీటి సమస్య అధికం జిల్లాలోని పలు గ్రామాలతోపాటు గిరిజన తండాల్లో నీటి సమస్య మొదలైంది. రామాయంపేట పట్టణంలోని టీచర్స్‌కాలనీ, రెడ్డికాలనీలో నీటి సమస్య ఉండటంతో కాలనీవాసుల ట్యాంకర్‌ద్వారా తాగునీటిని తెప్పించుకుంటున్నారు. మండలంలోని టి.నంబర్‌తండా, దంతేపల్లితండాల్లో నీటి సమస్య ప్రారంభమైంది. నిజాంపేట మండలంలోని చల్మెడ, నగరంతండా నీటి సమస్య ప్రారంభంకావటంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.చిల్పిచె మండలంలోని ఎర్రమట్టి తండా, పానాదితండా, ఎల్లుగుట్టతండా, చిట్కుల్ ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉంది.చిన్నశంకరంపేట మండలంలోని ఎస్.కొండాపూర్, పాటగడ్డ, రంగువాన్‌పల్లి, జప్తిశివనూరుతండా, శేరిపల్లి గ్రామంలో నీటి సమస్య ఉంది. పాపన్నపేట మండలం సోమ్లా, బ్యాక్యా, మెదక్ మండలం మక్తభూపతిపూర్, శివాయిపల్లి, హవేళిఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. చేగుంటపట్టణంలోని పలు కాలనీలతోపాటు వెల్థుర్తి మండలంలోని బస్వాపూర్, అచ్చంపేటలో నీటి సమస్య ప్రారంభమైంది. ఇదిలా ఉంటే గిరిజన తండాల్లో తాగునీటి కోసం ఉపయోగించే చేతిపంపుల మరమ్మతుకు వచ్చినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు స్పందించటంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు. -
'భూగర్భ' శోకమే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పటికే భూగర్భ జలాల వినియోగం చాలా ఎక్కువ. చాలా మంది రైతులు బోర్లు, బావులపై ఆధారపడే వ్యవసాయం చేస్తున్నారు. రోజుకు సుమారు 8 గంటలపాటు బోర్లు నడుస్తున్నాయని కేంద్ర అధ్యయనం కూడా నిర్ధారించింది. ఇలాంటి సమయంలో రాష్ట్ర ప్రభుత్వం సాగుకు 24 గంటల విద్యుత్ ఇవ్వనుండటంతో.. భూగర్భ జలాల పరిస్థితి ఏమిటన్న ఆందోళన వ్యక్తమవుతోంది. నిరంతర విద్యుత్ కారణంగా భూగర్భ జలాలు మరింత లోతుకు వెళ్లిపోతాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనిని దృష్టిలో పెట్టుకునే రైతులు ఆటోస్టార్టర్లను తొలగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం విన్నవిస్తోందని... ఇది క్షేత్రస్థాయిలో ఏ మేరకు ఫలితమిస్తోందన్న దానిపై భూగర్భ జలాల పరిస్థితి ఆధారపడి ఉంటుందని చెబుతున్నారు. ఎక్కువశాతం సాగు బోర్లు, బావులతోనే.. తక్కువ వర్షపాతం, కాల్వల వంటి ఉపరితల నీటి సరఫరా అవకాశం పెద్దగా లేకపోవడంతో రాష్ట్రంలో పంటల సాగు ఎక్కువగా భూగర్భ జలాలపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రంలో ప్రస్తుతం సుమారు 14.5 లక్షల బోర్లు, బావులుండగా... ఏకంగా 28 లక్షల నుంచి 30 లక్షల ఎకరాల ఆయకట్టు సాగవుతోంది. 2012–13 భూగర్భ జల వనరుల అంచనా ప్రకారం.. భూగర్భ జలాల లభ్యత 469 టీఎంసీల మేర ఉండగా, వినియోగం 271 టీఎంసీల వరకు ఉంటోంది. ఇది ఏటా ఆ ఏడాది కురిసే వర్షపాతానికి అనుగుణంగా మారుతూ ఉంటుంది. రాష్ట్రంలో ప్రస్తుత ఏడాది జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో 12 శాతం వరకు లోటు వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జల మట్టాలు మరింత లోతుకు వెళ్లిపోయాయి. గతేడాది నవంబర్‌లో భూగర్భ జలాలు సగటున 7.76 మీటర్ల దిగువన ఉండగా.. ఇప్పుడు 8.36 మీటర్ల లోతుకు పడిపోయాయి. అంటే సగటున 0.6 మీటర్లు దిగువకు వెళ్లిపోయాయి. అదే మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల తదితర జిల్లాల్లోనైతే ఏకంగా 5.10 మీటర్ల దాకా పడిపోయాయి. రబీలో మరింతగా.. సాధారణంగా ఏటా డిసెంబర్ నాటికి సగటున 10 మీటర్లలోతులో ఉండే భూగర్భ జలాలు.. ఏప్రిల్, మే నాటికి 16 నుంచి 22 మీటర్ల వరకు పడిపోతాయి. రబీలో వేసవి తీవ్రతకు ప్రాజెక్టులు, చెరువుల్లో నీటి లభ్యత తగ్గిపోయి రైతులు భూగర్భ జలాలపై ఆధారపడుతున్నారు. 4 నుంచి 8 గంటల పాటు బోర్లను నడుపుతున్నారు. దాంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతుంటాయి. అదే 24 గంటల విద్యుత్ సరఫరా చేస్తే.. భూగర్భ జలాలు మరింతగా క్షీణించే అవకాశముందని నీటి పారుదల రంగ నిపుణులు చెబుతున్నారు. ‘‘రాష్ట్రంలో ఒక మంచి బోరు గంటకు 5 వేల లీటర్లను లాగుతుంది. 8 గంటలు నిరంతరాయంగా నడిస్తే 40 వేల లీటర్లు లాగుతుంది. అదే 24 గంటల పాటు నడిస్తే.. మూడు రెట్ల అధిక భూగర్భ జలాలు తోడేస్తుంది. ఇది భూగర్భ జలాలపై తీవ్ర ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల భూగర్భ జల మట్టాలు 25 నుంచి 30 మీటర్లకు పడిపోయినా ఆశ్చర్యం లేదు..’’ అని పేర్కొంటున్నారు. భూమిని తోడేస్తున్నారు! కేంద్ర జల వనరుల శాఖ దేశవ్యాప్తంగా చిన్న నీటి వనరుల ద్వారా నీటి వినియోగంపై అధ్యయనం చేసింది. తెలంగాణలో భూగర్భ జలాల వినియోగం అధికంగా ఉందని.. పెద్ద సంఖ్యలో లోతైన బోర్లు వేస్తున్నారని అందులో తేల్చింది. రాష్ట్రంలో 2013–14 నాటికి ఉన్న సుమారు 2.70 లక్షల లోతైన బోరుబావులను పరిశీలించింది. దాదాపు 20,321 బోర్లు పనిచేయడం లేదని గుర్తించింది. మరో 2,50,313 బోర్ల పరిస్థితి, మోటార్ల పనితీరు, వినియోగిస్తున్న విద్యుత్, తోడేస్తున్న నీరు తదితర అంశాలను పరిశీలించింది. రాష్ట్రంలో బోర్లను 4 నుంచి 8 గంటల పాటు నడుపుతున్నట్లు తేల్చింది. – ఖరీఫ్ సీజన్లో సర్వే చేసిన 2.50 లక్షల బోర్లలో 2.30 లక్షల బోర్లను 4 నుంచి 8 గంటల పాటు నడిపారు. 17,685 బోర్లను మాత్రం నాలుగు గంటల కన్నా తక్కువ సమయం పాటు నడిపారు. – రబీ సీజన్లోనూ 2.19 లక్షల బోర్లను నాలుగు నుంచి 8 గంటల పాటు నడిపారు. – 2.23 లక్షల బోర్లకు ఒకటి నుంచి 6 హెచ్‌పీ (హార్స్ పవర్) సామర్థ్యమున్న మోటార్లను వినియోగించగా.. 25,909 బోర్లకు 6–12 హెచ్‌పీ మోటార్లను వాడారు. – 2.50 లక్షల బోర్లలో ఖరీఫ్ సీజన్లో 17,265 మోటార్లను వెయ్యి గంటలకుపైగా నడపగా.. 36 వేల మోటార్లను 800 నుంచి వెయ్యి గంటల పాటు, 89 వేల మోటార్లను 600 నుంచి 800 గంటల వరకు నడిపినట్లుగా గుర్తించారు. – దేశవ్యాప్తంగా చూస్తే అధిక సమయం మోటార్లను నడుపుతున్న రాష్ట్రాల్లో రాజస్థాన్ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది. ఆటోస్టార్టర్లు తొలగించకుంటే అంతే.. రాష్ట్రంలో చాలా ఏళ్లపాటు కరెంటు ఎప్పుడు పోతుందో, ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఉండేది. దాంతో రైతులంతా వ్యవసాయ బోర్లకు ఆటోస్టార్టర్లు పెట్టుకున్నారు. తెలంగాణ వచ్చాక కరెంటు పరిస్థితి మెరుగుపడినా.. భూగర్భ జలాలు తక్కువగా ఉండడం, నీరు సన్నగా వస్తుండడంతో విద్యుత్ సరఫరా ఉన్నంతసేపూ బోర్లు నడిచేందుకు ఆటోస్టార్టర్లు అలాగే ఉంచేశారు. ఇప్పుడు ప్రభుత్వం 24 గంటల విద్యుత్ ఇవ్వనున్న నేపథ్యంలో.. ఆటోస్టార్టర్లతో కొత్త సమస్య వచ్చి పడుతోంది. వాటివల్ల బోర్లు నిరంతరాయంగా నడుస్తూనే ఉంటాయి. దీంతో ఎక్కువ నీటిని తోడేస్తే.. భూగర్భ జలాలకు నష్టం వాటిల్లక తప్పని పరిస్థితి ఉండనుంది. ఇది చివరికి బోర్లలో నీరురాక పంటలు ఎండిపోయే దుస్థితికి దారి తీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఆటోస్టార్టర్లు తొలగించాల్సిందిగా రైతులకు ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తోంది. ఆటోస్టార్టర్లకు ప్రత్యామ్నాయం చూపాలి ‘‘24 గంటల విద్యుత్‌తో భూగర్భంపై, పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందన్నది సుస్పష్టం. దీనికి విరుగుడుగా ప్రభుత్వం ఆటోస్టార్టర్లను తొలగించాలని అంటోంది. మరి ఆటోస్టార్టర్లను తొలగించాక.. కరెంటు పోయి రావడం వంటి ఏదైనా సమస్య వస్తే బోరు ఆగిపోతుంది. తిరిగి మోటార్ ఆన్ చేయాలంటే ఎలా? రైతులు ప్రతిసారి కరెంటును, మోటార్‌ను కనిపెట్టుకుని కూర్చోవాలా? అన్న ప్రశ్న వస్తుంది. అందువల్ల ఆటోస్టార్టర్లకు ప్రత్యామ్నాయం చూపాలి. బోరు మోటార్లను రిమోట్ వ్యవస్థల ద్వారా ఆన్/ఆఫ్ చేసే ఏర్పాట్లు చేయాలి. దీనివల్ల రైతులకు ఉపశమనం ఉంటుంది. నీటి వృథా తగ్గి, భూగర్భానికి నష్టం ఉండదు..’’ – శ్యాంప్రసాద్‌రెడ్డి, రిటైర్డ్ ఇంజనీర్ల ఫోరం జలాలను విపరీతంగా తోడేసిన నోటిఫైడ్ గ్రామాలు సంవత్సరం గ్రామాల సంఖ్య 2002–03 572 2010–11 1,055 2017–18 1,358 – అధికంగా సిద్ధిపేట జిల్లాలో 175 గ్రామాలు ఈ జాబితాలో ఉండగా.. రంగారెడ్డి 120, జగిత్యాల 116, నాగర్ కర్నూల్ 97 గ్రామాలతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. – ఈ గ్రామాల్లో భూగర్భ జలాలు దారుణంగా పడిపోయాయి. వ్యవసాయం కోసం లోతైన బోర్లు వేసి నీటిని తోడేయడమే దీనికి కారణం. -
వీడని వెతలు
వర్షాకాలంలోనూ నీటి తిప్పలు 505 గ్రామాల్లో నీటి ఎద్దడి మంజీరలో పెరగని నీటి మట్టం పనిచేయని మంచినీటి పథకాలు తాగునీటి కోసం రోడ్డెక్కుతున్న జనం నీటివనరులు నిండి.. భూగర్భ జలాలు పెరిగితేనే మేలు జిల్లాను నీటి ఎద్దడి పట్టిపీడిస్తోంది. కాలం మారినా తీరని సమస్యగానే మిగిలింది. వర్షాకాలంలోనూ జనం నీటి కోసం ఖాళీ బిందెలతో రోడ్డెక్కుతున్నారు. దాదాపు 20 రోజులుగా వర్షాలు ముఖం చాటేయడంతో భూగర్భ జలాలు సైతం తగ్గుముఖం పట్టారుు. జిల్లాలోని దాదాపు 505 గ్రామాల్లో తీవ్ర సమస్య నెలకొంది. ట్యాంకర్లు, అద్దె బోర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నా ఫలితం లేకుండా పోతోంది. సాక్షి, సంగారెడ్డి: జిల్లాలోని 505 గ్రామాల్లో తాగునీటి సమస్య నెలకొంది. సమస్య తీవ్రంగా ఉన్న 219 గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా, మరో 286 గ్రామాల్లో అద్దె బోర్ల ద్వారా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటిని సరఫరా చేస్తున్నారు. అందోలు మండలంలో 47, నారాయణఖేడ్‌లో 7, నర్సాపూర్‌లో 121, పటాన్చెరులో 25, సంగారెడ్డిలో 20, జహీరాబాద్‌లో 20, సిద్దిపేటలో 3, గజ్వేల్‌లో రెండు, దుబ్బాకలో 15, మెదక్‌లో అత్యధికంగా 222 గ్రామాల్లో నీటి సమస్య ఉంది. సంగారెడ్డి, జహీరాబాద్ మున్సిపాలిటీలతోపాటు జోగిపేట నగర పంచాయతీలో తాగునీటి సమస్య నెలకొంది. సంగారెడ్డి మున్సిపాలిటీలో నిత్యం 90 ఎంఎల్డీ నీటిని సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం 30 ఎంఎల్డీ సరఫరా చేస్తున్నారు. పనిచేయని మంచినీటి పథకాలు.. ఆశించిన స్థాయలో వర్షాలు పడకపోవడంతో మంజీరలోకి నీరు రాలేదు. సింగూరు ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 30 టీఎంసీల కాగా ప్రసుత్తం 6 టీఎంసీలు మాత్రమే ఉంది. మంజీర బ్యారేజీలో 3 టీఎంసీల నిల్వ సామర్థ్యం ఉండగా.. ప్రస్తుతం 1.05 టీఎంసీలు అందుబాటులో ఉన్నారుు. మంజీరలో నీటి లభ్యత లేకపోవటంతో దాని ఆధారంగా ఉన్న మంచినీటి పథకాలు పూర్తిస్థాయిలో పనిచేయడం లేదు. హత్నూర, జహీరాబాద్, పటాన్చెరు, సంగారెడ్డి, సదాశివపేట, పెద్దశంకంరపేట, ఖాదిరాబాద్ సీపీడబ్ల్యూఎస్ స్కీమ్ పూర్తిగా అటకెక్కాయి. నారాయణఖేడ్ నియోజకవర్గంలోని బోరంచ మంచినీటి పథకం నుంచి 35 గ్రామాలకు తాగునీరు సరఫరా కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 8 గ్రామాలకు మాత్రమే సరఫరా అవుతోంది. కరస్‌గుత్తి మంచినీటి పథకం నుంచి 29 గ్రామాలకు నీటిని సరఫరా కావాల్సి ఉండగా.. ప్రస్తుతం 12 గ్రామాలకు అందుతోంది. అందోలు నియోజకవర్గంలోనూ సమస్యే.. అందోలు, పుల్కల్, అల్లాదుర్గం, రేగోడ్, మునిపల్లి, టేక్మాల్, రాయికోడ్ మండలాలకు చెందిన మెజార్టీ గ్రామాల్లో తీవ్ర మంచినీటి ఎద్దడి ఉంది. బోర్లలో నీటిమట్టం తగ్గిపోతోంది. సుమారుగా వందకుపైగా గ్రామాల్లో సమస్య ఉంది. జోగిపేట నగర పంచాయతీకి పోచారం, చక్రియాల మంచినీటి పథకాల ద్వారా నీరు సరఫరా అవుతుంది. సింగూరు ప్రాజెక్టులో నీరు లేకపోవడంతో పంపింగ్ జరగడం లేదు. రారుుకోడ్ మండలంలో ఎన్ఏపీ స్కీం బంద్ కావడంతో సుమారు 15 గ్రామాలకు సమస్య ఏర్పడింది. రేగోడ్ మండలంలోనూ 20 గ్రామాల వరకు నీటి ఎద్దడి ఉంది. అల్లాదుర్గం మండల కేంద్రంలో ఇదే పరిస్థితి. మెదక్ నియోజకవర్గంలో... మెదక్ మండలంలో సరైన వర్షాలు లేక 31 గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. 19 గ్రామాల్లో 34 బోర్లను లీజుకు తీసుకున్నారు. వాడి, అవుసులపల్లి, హవేళిఘణాపూర్, బూర్గుపల్లి, సర్ధన, వెంకటాపూర్, గుట్టకిందిపల్లి, మక్తభూపతిపూర్, పాతూర్, బొగుడ భూపతిపూర్, కూచన్‌పల్లి తదితర గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. పాపన్నపేట మండలంలోని ఢాక్యాతండా, రాజ్యతండా, సోమ్లా, చీకోడ్ లింగాయపల్లి, నార్సింగి, పోమ్లాతండా, యూసుఫ్‌పేట, అన్నారం, కొడుపాక తదితర గ్రామాల్లో నీటి సమస్య ఉంది. రామాయంపేట మండలంలోని నస్కల్, నందగోకుల్తోపాటు రామాయంపేట పట్టణంలోనూ ఇదే పరిస్థితి. చిన్నశంకరంపేట మండలం శేరిపల్లి, జప్తిశివనూర్, దర్పల్లి, మడూర్, ఖాజాపూర్, సంకాపూర్ గ్రామాల్లోనూ సమస్య తీవ్రంగా ఉంది. నర్సాపూర్‌లో... వెల్దుర్తి మండలంలోని అనేక గ్రామాల్లో ప్రజలు వ్యవసాయ బోర్ల నుంచి తాగు నీటిని తెచ్చుకుంటున్నారు. నర్సాపూర్‌తోపాటు మండలంలోని పలు గ్రామాల్లో సమస్య తీవ్రంగా ఉంది. కౌడిపల్లి, మహ్మద్‌నగర్, హత్నూర, సిరిపుర, దౌల్తాబాద్, గుండ్లమాచనూర్, శివ్వంపేటతోపాటు పలు తండాల్లో తాగునీటి సమస్య ఉంది. పటాన్చెరు పారిశ్రామికవాడలో.. పారిశ్రామికవాడల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది. మంజీర నుంచి నీరు విడుదల కాకపోవడమే కాకుండా గోదావరి జలాలు సరఫరా అవడం లేదు. 2001 జనాభా లెక్కల ప్రకారమే చాలా ప్రాంతాలకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఇస్నాపూర్ చౌరస్తాలోని అనేక కాలనీల్లో సమస్య ఉంది. అమీన్పూర్, బండ్లగూడ, బొల్లారం ప్రాంతాల్లో ప్రజలు తాగునీటిని కొనుగోలు చేస్తున్నారు. జిన్నారంలోని గడ్డపోతారం, జిన్నారం, బొల్లారం, గుమ్మడిదల గ్రామాల్లో పరిస్థితి తీవ్రంగా ఉంది. జహీరాబాద్ నియోజకవర్గంలో... జహీరాబాద్ మున్సిపాలిటీ 12వ వార్డు పరిధిలోని హౌసింగ్ బోర్డు, హమాలీ కాలనీ, 9వ వార్డులోని ఐడీఎస్ఎంటీ కాలనీలో మంచినీటి సమస్య ఉంది. వారం రోజుల క్రితం జహీరాబాద్ పట్టణానికి మంజీర నీటి సరఫరాను ప్రారంభించారు. పట్టణానికి 5.4 ఎంఎల్డీ మేర నీటి అసవరం ఉంది. 140 సింగిల్ ఫేజ్, త్రీ ఫేజ్ మోటార్ల ద్వారా సరఫరా చేస్తున్నారు. జహీరాబాద్ మండలంలోని సత్వార్, మాడ్గి, జాడీ మల్కాపూర్, అసద్‌గంజ్, అల్లీపూర్, రంజోల్, చిరాగ్పల్లి గ్రామాల్లో సమస్య ఉంది. ఆయా గ్రామాల్లో ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. కోహీర్ పట్టణం, ఝరాసంగం మండలంలోని కుప్పానగర్, న్యాల్కల్ మండలం ముర్తుజాపూర్ గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు.