సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం.. చిన్న నీటివనరుల్లోనూ నీటి లభ్యత పెరగడంతో భూగర్భ జలం పెరిగింది. ఉపరితల నీటి వినియోగం పెరగడంతో భూగర్భంపై ఒత్తిడి తగ్గింది. దీంతో గత నాలుగైదేళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భ నీటిమట్టాలు పుంజుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సరాసరిన ఏటా డిసెంబర్‌లో 10 మీటర్లు దిగువకు ఉండే భూగర్భ జలాలు గతేడాది డిసెంబర్‌లో మాత్రం 8.12 మీటర్ల వద్దే లభ్యతగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే యాసంగి పంటల సాగు పెరుగుతు న్న నేపథ్యంలో మున్ముందు భూగర్భజలం తగ్గే అవకాశం ఉన్నా గతంలో ఉన్న వాటికన్నా ఈసారి భూగర్భ మట్టాలు మెరుగ్గానే ఉంటా యని భూగర్భ జల విభాగం అంచనా వేస్తోంది.
2.99 మీటర్ల ఎగువకు...
2019 డిసెంబర్ మాసాంతం వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 845 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 964 మిల్లీమీటర్ల మేర నమోదు కావడం భూగర్భ నీటిమట్టాల పెరుగుదులకు దోహదపడింది. 2018 డిసెంబర్‌లో రాష్ట్ర సరాసరి భూగర్భ మట్టం 11.11 మీటర్లలో ఉండగా అది గత ఏడాది డిసెంబర్‌లో 8.12 మీటర్లుగా నమోదైంది. అంటే 2.99 మీటర్ల మేర భూగర్భ మట్టం పెరిగింది. 2019లో వానాకాలం సీజన్ ప్రారంభం ముందు వరకు 14.56 మీటర్లు దిగువన నీటిమట్టాలు నమోదవగా డిసెంబర్ నాటికి ఏకంగా 6.44 మీటర్ల మేర పుంజుకోవడం విశేషం. భూగర్భ జల విభాగం శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. జనగాం, సిధ్దిపేట, మెదక్, నిజామాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి జిల్లాల్లోనూ 4 మీటర్లకుపైగా పాతాళగంగ పైకి వచ్చినట్లు నివేదికలో వెల్లడించింది.
రాష్ట్ర విస్తీర్ణంలో 28 శాతం భూభాగంలో 5 మీటర్లలోనూ భూగర్భ మట్టాలుండగా మరో 44 శాతం భూభాగంలో 5–10 మీటర్ల పరిధిలో భూగర్భ మట్టాలున్నాయని నివేదిక తెలిపింది. వనపర్తి జిల్లాలో 3.63 మీటర్లు, వరంగల్ అర్బన్‌లో 3.86 మీటర్ల ఎగువన నీటి లభ్యత ఉన్నట్లు పేర్కొంది. ఇక సంగారెడ్డి జిల్లాలో భూగర్భ మట్టాలు 17.72 మీటర్ల దిగువన ఉండగా సిధ్దిపేట జిల్లాలో 11.38, వికారాబాద్‌లో 12.86, మహబూబ్‌నగర్‌లో 11.62 మీటర్లు దిగువన నీటిమట్టాలున్నాయని నివేదిక తెలిపింది. ఈ జిల్లాల్లో సరైన వర్షాలు కురవకపోవడం, ఉపరితల నీటి వినియోగానికి ప్రాజెక్టులు లేకపోవడంతో భూగర్భ జలాల్లో పెరుగుదల కనిపించలేదు.
ప్రాజెక్టులు, చెరువులు ఊపిరి పోశాయ్...
రాష్ట్రంలో వర్షాకాలం ముగిసిన అనంతరం సైతం ప్రాజెక్టుల్లో ఈ ఏడాది నీటి లభ్యత పుష్కలంగా ఉంది. గోదావరి బేసిన్‌లో ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం 251.61 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 180 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది.
2018లో ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే ఏకంగా 100 టీఎంసీల మేర నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో పూర్తిస్థాయి నిల్వలున్నాయి. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల సామర్థ్యం 534 టీఎంసీలుకాగా ఈ ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఏకంగా 430 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత గతంకన్నా ఎక్కువగా ఉండటం వాటిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి తరలింపు జరుగుతుండటంతో భూగర్భ జలాల వినియోగం తగ్గింది. ఇక రెండు బేసిన్‌లలోని 40 వేల చెరువులకుగాను 15 వేల చెరువుల్లో పూర్తిస్థాయి నీటి లభ్యత ఉండగా మరో 7 వేల చెరువులు సగానికిపైగా నిండి ఉన్నాయి. ఇది కూడా భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment