irregation department
-
కళా వెంకటరావు చీప్ పాలిట్రిక్స్ ..
డ్రామా పేరు ధర్నా. కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం కళా వెంకటరావు. విడుదల ఈ నెల 28. ఉనికి చాటుకునే ప్రయత్నంలో కళా వెంకటరావు నానాటికీ దిగజారిపోతున్నారు. 30వ తేదీకి తోటపల్లి నీరు శివారుకు అందుతుందని అధికారులు చెబుతుంటే.. 28వ తేదీకే నీటి కోసం ధర్నాకు దిగుతున్నారు! ఈ డ్రామా కోసం మళ్లీ జనాలకు పిలుపు కూడా ఇచ్చారు. కేవలం తన రాజకీయ స్వార్థం కోసం కళా ఇచ్చిన పిలుపుపై జనం నవ్వుతున్నారు. సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: కళా వెంకటరావు టీడీపీ లో తానొకడిని ఉన్నానని చెప్పుకునేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. అందులో భాగంగా తోటపల్లి నీటి విషయమై కొత్త ఎత్తుగడ వేశారు. అంతరార్థం జనాలకు తెలిసిపోవడంతో ఆయన ప్రయత్నాలు చూసి తోటి టీడీపీ శ్రేణులే జాలి పడుతున్నాయి కళా రాజకీయమిది.. అధికారులు తీసుకున్న చర్యలు, చెప్పిన విష యాన్ని పక్కన పెట్టి కిమిడి కళా వెంకటరావు జల రాజకీయం చేసేందుకు పూనుకున్నారు. మిగిలిన(జాతీయ రహదారి దాటాక ఉన్న) కాలువలకు ఈనెల 30న నీరు విడుదల చేస్తా మని ఇరిగేషన్ అధికారులు స్వయంగా చెప్పినప్పటికీ 28న రణస్థలంలో ధర్నాకు పిలుపునిచ్చారు. అయిపోయిన పెళ్లికి బాజాలు వాయించినట్టు ఇప్పటికే నీరు విడుదల చేసి, 30వ తేదీన శివారు భూములకు నీరిచ్చేందుకు షెడ్యూల్ ప్రకటించాక కళా వెంకటరావు ఆందోళన దిగుతుండడం హాస్యాస్పదంగా మారింది. వాస్తవమిది.. తోటపల్లి ప్రాజెక్టు నుంచి ఈ నెల 21న శ్రీకాకుళం బ్రాంచి కాలువకు 35 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. 20 కిలోమీటర్ల పొడవు గల కాలువలో 17వ కిలోమీటర్ కమ్మ సిగడాం వద్దకి ప్రస్తుతం నీరు చేరింది. జాతీయ రహదారి దాటాక ఉన్న మిగతా 3 కిలోమీటర్ల కాలువలో కమాండ్ డెవలప్మెంట్ ఏరియా కింద వచ్చిన నిధులతో అభివృద్ధి పనులు చేపడుతుండటంతో నీరు విడిచి పెట్టలేదు. 32ఎల్ (ఎడమ కాలువ) వెళ్లే కోష్ట, పైడిభీమవరం వైపు, 33ఆర్(కుడికాలువ)వెళ్లే రావాడ, రణస్థలం వైపు నీరు ప్రస్తుతం వెళ్లడం లేదు. పనులు చేపట్టిన చోట నీరు విడుదల చేస్తే వృధా తప్ప ప్రయోజనం ఉండదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నెలాఖరు(30వ తేదీకి)కు నీరు విడిచి పెట్టాలని అధికారులు నిర్ణయించారు.ఈ లోగా పనులు పూర్తి చేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. ఇప్పటికే పనులు చివరి దశకు వచ్చాయి. ఇదే విషయాన్ని సాగునీటి కోసం నాలుగు రోజుల కిందట వారికి ఫోన్ చేసిన టీడీపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ మంత్రి కిమిడి కళా వెంకటరావు, టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడుకు ఇరిగేషన్ అధికారులు స్పష్టం చేశారు. కలిశెట్టి ఆనందమిది.. రణస్థలం మండలంలోకి తోటపల్లి ప్రాజెక్టు నీరు విడుదల చేయడంపై టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు రైతులతో కలిసి దేవరాపల్లి గ్రామ సరిహద్దులో ఉన్న తోటపల్లి కాలువను సందర్శించి ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇచ్చిన మాట ప్రకా రం అధికారులు తోటపల్లి నీరు విడుదల చేశారని హర్షం వ్యక్తం చేశారు. అయినా కళా వెంకటరావు మాత్రం తన ఉనికి చాటుకునేందుకు అర్థం లేని ఆందోళనలకు దిగుతున్నారు. నీటి విడుదల షెడ్యూల్ జనాలకు తెలిశాక కూడా ఆందోళనకు దిగుతున్నారు. తన ఖాతాలో వేసుకునేందుకు.. ఎలాగూ రెండు రోజుల్లో నీరు విడుదలవుతుంది. అదంతా తన గొప్పతనమే అని చెప్పుకునేందుకు ఆయన పడుతున్న తాపత్రయాన్ని చూసి ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారు. రణస్థలం మండలానికి ఇప్పటికే నీరు విడుదల చేయడంపై సంతృప్తి వ్యక్తం చేస్తూ తోటి టీడీపీ నేత కలిశెట్టి అప్పలనాయుడు కాలువ వద్దకు వెళ్లి హర్షం వ్యక్తం చేస్తుంటే కళా వెంకటరావు ఇప్పుడు సాగునీటి కోసమని ధర్నా చేయడమేంటని ఆ పార్టీ శ్రేణులు పెదవి విరుస్తున్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం కళా పరిస్థితి కళావిహీనంగా మారింది. తన కొడుకును ఎంత ప్రమోట్ చేసినా లాభం లేకపోయింది. కార్యకర్తలు ఆశించిన స్థాయిలో దగ్గరకు చేరడం లేదు. దీంతో ఈ కొత్త ఎత్తుగడకు తెరతీశారు. -
భూగర్భ జలాలు పైపైకి..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులన్నీ జలకళను సంతరించుకోవడం.. చిన్న నీటివనరుల్లోనూ నీటి లభ్యత పెరగడంతో భూగర్భ జలం పెరిగింది. ఉపరితల నీటి వినియోగం పెరగడంతో భూగర్భంపై ఒత్తిడి తగ్గింది. దీంతో గత నాలుగైదేళ్లలో ఎన్నడూ లేనంతగా భూగర్భ నీటిమట్టాలు పుంజుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సరాసరిన ఏటా డిసెంబర్లో 10 మీటర్లు దిగువకు ఉండే భూగర్భ జలాలు గతేడాది డిసెంబర్లో మాత్రం 8.12 మీటర్ల వద్దే లభ్యతగా ఉన్నాయి. ఇప్పుడిప్పుడే యాసంగి పంటల సాగు పెరుగుతు న్న నేపథ్యంలో మున్ముందు భూగర్భజలం తగ్గే అవకాశం ఉన్నా గతంలో ఉన్న వాటికన్నా ఈసారి భూగర్భ మట్టాలు మెరుగ్గానే ఉంటా యని భూగర్భ జల విభాగం అంచనా వేస్తోంది. 2.99 మీటర్ల ఎగువకు... 2019 డిసెంబర్ మాసాంతం వరకు రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 845 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 964 మిల్లీమీటర్ల మేర నమోదు కావడం భూగర్భ నీటిమట్టాల పెరుగుదులకు దోహదపడింది. 2018 డిసెంబర్లో రాష్ట్ర సరాసరి భూగర్భ మట్టం 11.11 మీటర్లలో ఉండగా అది గత ఏడాది డిసెంబర్లో 8.12 మీటర్లుగా నమోదైంది. అంటే 2.99 మీటర్ల మేర భూగర్భ మట్టం పెరిగింది. 2019లో వానాకాలం సీజన్ ప్రారంభం ముందు వరకు 14.56 మీటర్లు దిగువన నీటిమట్టాలు నమోదవగా డిసెంబర్ నాటికి ఏకంగా 6.44 మీటర్ల మేర పుంజుకోవడం విశేషం. భూగర్భ జల విభాగం శుక్రవారం విడుదల చేసిన నివేదికలో ఈ అంశాలను వెల్లడించింది. జనగాం, సిధ్దిపేట, మెదక్, నిజామాబాద్, వరంగల్ రూరల్, కామారెడ్డి జిల్లాల్లోనూ 4 మీటర్లకుపైగా పాతాళగంగ పైకి వచ్చినట్లు నివేదికలో వెల్లడించింది. రాష్ట్ర విస్తీర్ణంలో 28 శాతం భూభాగంలో 5 మీటర్లలోనూ భూగర్భ మట్టాలుండగా మరో 44 శాతం భూభాగంలో 5–10 మీటర్ల పరిధిలో భూగర్భ మట్టాలున్నాయని నివేదిక తెలిపింది. వనపర్తి జిల్లాలో 3.63 మీటర్లు, వరంగల్ అర్బన్‌లో 3.86 మీటర్ల ఎగువన నీటి లభ్యత ఉన్నట్లు పేర్కొంది. ఇక సంగారెడ్డి జిల్లాలో భూగర్భ మట్టాలు 17.72 మీటర్ల దిగువన ఉండగా సిధ్దిపేట జిల్లాలో 11.38, వికారాబాద్‌లో 12.86, మహబూబ్‌నగర్‌లో 11.62 మీటర్లు దిగువన నీటిమట్టాలున్నాయని నివేదిక తెలిపింది. ఈ జిల్లాల్లో సరైన వర్షాలు కురవకపోవడం, ఉపరితల నీటి వినియోగానికి ప్రాజెక్టులు లేకపోవడంతో భూగర్భ జలాల్లో పెరుగుదల కనిపించలేదు. ప్రాజెక్టులు, చెరువులు ఊపిరి పోశాయ్... రాష్ట్రంలో వర్షాకాలం ముగిసిన అనంతరం సైతం ప్రాజెక్టుల్లో ఈ ఏడాది నీటి లభ్యత పుష్కలంగా ఉంది. గోదావరి బేసిన్లో ప్రాజెక్టులు, బ్యారేజీలు, రిజర్వాయర్ల పూర్తి నిల్వ సామర్థ్యం 251.61 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 180 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. 2018లో ఇదే సమయానికి ఉన్న నిల్వలతో పోలిస్తే ఏకంగా 100 టీఎంసీల మేర నిల్వలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, మిడ్‌మానేరు, లోయర్ మానేరులో పూర్తిస్థాయి నిల్వలున్నాయి. కృష్ణా బేసిన్‌లోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టుల సామర్థ్యం 534 టీఎంసీలుకాగా ఈ ప్రాజెక్టుల్లో ఇప్పుడు ఏకంగా 430 టీఎంసీల మేర నీటి లభ్యత ఉంది. ప్రాజెక్టుల్లో నీటి లభ్యత గతంకన్నా ఎక్కువగా ఉండటం వాటిపై ఆధారపడ్డ ఎత్తిపోతల పథకాల ద్వారా నీటి తరలింపు జరుగుతుండటంతో భూగర్భ జలాల వినియోగం తగ్గింది. ఇక రెండు బేసిన్లలోని 40 వేల చెరువులకుగాను 15 వేల చెరువుల్లో పూర్తిస్థాయి నీటి లభ్యత ఉండగా మరో 7 వేల చెరువులు సగానికిపైగా నిండి ఉన్నాయి. ఇది కూడా భూగర్భ జలాల పెరుగుదలకు దోహదం చేసింది. -
‘భగీరథ’ ఎందాకా..?!
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులపై ఒత్తిడి పెరిగింది. ఇంటింటికి నల్లానీరు ఇవ్వకుండా ఓట్లడగమని చెప్పినా.. ముందస్తు ఎన్నికలతో ఆ గడువు కాస్తా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి నాటికి అన్ని అవాసాల్లోని ఇంటింటికి నల్లాల ద్వారా నీరివ్వాలనేది తాజా లక్ష్యం. అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం వచ్చే జనవరి 5 వరకే ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ పథకం ప్రగతిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె తక్షణమే పనులు పూర్తి చేయాలని ఆదేశించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లోని 494 హాబిటేషన్లకు చెందిన సుమారు 8.50లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పనులను చేపట్టారు. 2017 డిసెంబర్ నాటికి జిల్లా వాసులకు ఇంటింటికి నల్లానీరు అందివ్వాలన్న లక్ష్యంతో అప్పటి మంత్రి కె.తారకరామారావు మిషన్ భగీరథ పనులకు జిల్లాలో అంకురార్పణ చేశారు. లోయర్ మానేరు డ్యాం (ఎల్ఎండీ) నుంచి మిషన్ భగీరథలో తాగునీటికి వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటికి మొత్తంగా చూసుకుంటే 84 శాతం పనులు పూర్తయినట్లు అధికారుల నివేదికలు చెప్తున్నాయి. మిషన్ భగీరథ పనులు గతేడాది డిసెంబర్ వరకు పూర్తి కావాల్సి ఉన్నా.. పెంచిన గడువు ప్రకారం గడిచిన మార్చిలో ఇంటింటికి నల్లానీరు ఇవ్వాల్సి ఉంది. అది కూడా సాధ్యం కాకపోవడంతో ఇటీవలే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం పనులు వచ్చే జనవరి నాటికి పూర్తయి ఫలితాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అధికారులు వేగిరపడుతున్నా.. ఆ స్థాయిలో పనులు వేగంగా జరగడం లేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని 494 హాబిటేషన్లకు బల్క్ వాటర్ సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసినా... 385 హాబిటేషన్లకే ప్రస్తుతం సరఫరా అవుతోంది. ఇంటింటికి నల్లా కనెక్షన్లు 74.49 శాతంగా పేర్కొన్న అధికారులు 95.24 శాతం పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. మొత్తం 1750.22 కిలోమీటర్లకు గాను 1666.93 కిలోమీటర్లు వేశారు. 1,74,657 ఇండ్లకు నల్లా కనెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా, పూర్తి స్థాయిలో 1,73,752 గృహాలకు ఇచ్చినట్లు నివేదికల్లో పేర్కొన్నారు. అయితే ఓవర్‌హెడ్ వాటర్ స్టోరేజీ రిజర్వాయర్ (ఓహెచ్ఎస్ఆర్)ల నిర్మాణమే అసలు సమస్యగా కనిపిస్తోంది. మొత్తం 380 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు 257 మాత్రమే పూర్తయ్యాయి. వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్లు (డబ్ల్యూటీపీ), రా వాటర్ పైపులైన్లు, జీఎల్‌బీఆర్, సంపులు, కెమికల్ హౌజ్, ఫిల్టర్ హౌజ్, క్లోరినేషన్ హౌజ్, రా వాటర్ ఛానల్లు పూర్తిస్థాయిలో వాడకంలోకి తేవాల్సి ఉంది. వీటన్నింటిని చేసేందుకు అధికారులు కాంట్రాక్టు సంస్థలను తొందరపెడుతున్నా... ఆశించిన మేరకు వేగం అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జనవరి 5 నాటికి అన్ని ఇండ్లకు నల్లానీరు సాధ్యమవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వేగవంతంగా పూర్తి చేయాలి – స్మితా సభర్వాల్ మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లంపల్లి, వరదకాలువ పనుల భూసేకరణ, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమీక్షించారు. మిషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 2019 జనవరి 5వ తేదీ నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాల్లో మిషన్ భగీరథ పనులపై కలెక్టర్లు దృష్టి సారించాలని అన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని సూచించారు. ఇరిగేషన్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్ పనులు నిలిచిపోవడం వల్ల మున్సిపల్‌కు నీరందంచిలేక పోతున్నారని, ఫిల్టర్ బెడ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో ఇరిగేషన్, వరద కాలువ పనులపై దృష్టిసారించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షనాయక్, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్ఈ శ్రీకాంత్‌రావు, మిషన్ భగీరథ ఎస్ఈ అమరేందర్, వరదకాలువ సీఈ అనిల్‌కుమార్, ఇరిగేషన్ శాఖల ఇంజనీర్లు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు పాల్గొన్నారు. -
మినీ బండ్లు కలేనా..!
సాక్షి, వరంగల్ రూరల్: చెరువులకు వన్నె తెచ్చేవి మినీ ట్యాంక్ బండ్లు.. ఆనందానికి, ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును ఎంపిక చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు, పరకాల నియోజకవర్గంలో పరకాల మండలంలోని దామెర చెరువులను మినీ బండ్లుగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. 2015–2016 సంవత్సరంలో వీటికి టెండర్లు పిలిచి నిధులు మంజూరు చేశారు. అదే ఏడు పనులను ప్రారంభించారు. దామెర చెరువు.. పరకాల పట్టణానికి సుమారు 100 మీటర్ల దూరంలో దామెర చెరువు ఉంది. 2015–2016 సంవత్సరంలో ఈ చెరువును మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. చెరువును అభివృద్ధి చేసేందుకు 1.92 కోట్లకు టెండర్ పిలువగా మూడు శాతం ఎక్కువకు ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం 2.8 కిలోమీటర్ల బండ్, రెండు తూములు, 900 మీటర్ల మెయిన్ బండ్, మెట్లు, కట్ట చుట్టూ రాతి కట్టడం, మత్తి పనులు పూర్తి చేయాలి. తొలుత వేసిన ఎస్టిమేషన్ సరిగ్గా లేకపోవడంతో రీ ఎస్టిమేషన్ కోసం అధికారులు ప్రతిపాదించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న దామెర చెరువుకు రూ 3.08 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం బండ్ పనులకు రూ 5.59 కోట్లు మంజూరైనట్లు. నిధులు ఫుల్‌గానే మంజూరైనా పనులు మాత్రం అంతంతమాత్రంగానే జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కట్టకు ఆనుకుని రాతి కట్టడం 800 మీటర్లు కట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 450 మీటర్ల వరకే కట్టారు. అగ్రిమెంట్ అయిన తొమ్మిది నెలలకే పనులు పూర్తి చేయాలి కానీ సదరు కంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మాదన్నపేట చెరువుమాదన్నపేట చెరువును 200 సంవత్సరాల క్రితం అక్కన్న– మాదన్నలు నిర్మించారు. చెరువు సామర్థ్యం మొత్తం 17 ఫీట్లు. ఆయకట్టు అధికారికంగా మూడువేల ఎకరాలు కాగా అనధికారంగా మరో 1500 ఎకరాలు సాగవుతోంది. ఈ చెరువు చెరువు పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, ఆహ్లాదకరంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటుంది. నర్సంపేట నియోజకవర్గంలో మాధన్నపేట చెరువుకు 2015–2016 సంవత్సరంలో మిషన్ కాకతీయలో భాగంగా మినీ ట్యాంక్ బండ్‌ను మంజూరు చేశారు. రూ 7.51 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీనిని ఓ కన్‌స్ట్రక్షన్‌వారు దక్కించుకున్నారు. చెరువు బండ్ పనులకు నిధులు మంజూరై ఏడాదిన్నర గడిచినా ఇంతవరకూ పనులు పూర్తి కాలేదు. అగ్రిమెంట్ ప్రకారం 2017 మే వరకు పూర్తి చేయాల్సి ఉంది. కాని అధికారులు పనుల పురోగతిపై పట్టించుకోకపోవడంతో సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయడం లేదనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. త్వరలో పూర్తి చేస్తాం.. మినీ ట్యాంక్ బండ్ల పనులు త్వరలో పూర్తవుతాయి. జిల్లాలో పరకాల మండలం దామెర చెరువు, నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులను మినీ ట్యాంక్ బండ్ ఎంపిక చేశారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆలస్యం కాకుండా పూర్తి చేస్తాం. –శ్రవణ్, ఇరిగేషన్ ఈఈ, రూరల్ జిల్లా -
టీడీపీ నేతల బరి తెగింపు!
సాక్షి, అనంతపురం: రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్ల అరాచకాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ నేతులు రెచ్చిపోతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా మైనర్ ఇరిగేషన్ ఈఈ తిప్పేస్వామి పై శింగనమల టీడీపీ నేతలు ముంటి మడుగు కేశవరెడ్డి, రంగారెడ్డి దాడి చేశారు. తుంగభద్ర నీటి విషయంలో మేము చెప్పినా వినవా అంటూ ఇంజనీర్ తిప్పేస్వామిపై దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు. టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ల సమక్షంలో రెచ్చిపోయిన తెలుగు తమ్ముళ్లు. టీడీపీ నేతల దౌర్జన్యానికి నిరసనగా విధులను బహిష్కరించిన ఇరిగేషన్ ఉద్యోగులు. జిల్లా చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఎదుట ఉద్యోగులు ధర్నా చేపట్టారు. ఇంజనీర్ తిప్పేస్వామిపై దాడికి పాల్పడిన టీడీపీ నేతలను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు. -
ఏసీబీ వలలో ఇరిగేషన్ ఇంజినీర్లు
వరంగల్ క్రైం: రూ. 1.5లక్షలు లంచం తీసుకుంటూ ఇరిగేషన్ ఇంజినీర్ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన నగరంలో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే...మిషన్ కాకతీయ పనుల్లో వర్ధన్నపేట మండలం కొనారెడ్డి చెరువు మరమ్మతు పనులను టెండర్ ద్వారా సాధించుకున్న కాంట్రాక్టర్ గంకిడి శ్రీనివాస్‌రెడ్డి నుంచి ఎస్టిమేట్ కోసం వరంగల్ ఇరిగేషన్ ఎస్ఈ కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ డీఈ వాంసని రఘుపతి, ఏఈ గాడిపెల్లి గౌరిలక్ష్మీలు డబ్బులు డిమాండ్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఈ సందర్భంగా వరంగల్ రేంజ్ డీఎస్పీ కె.భద్రయ్య అధికారులు పట్టుబడిన వివరాలను వెల్లడించారు. వర్ధన్నపేట మండలంలోని కోనారెడ్డి చెరువు పనులకు అవసరమైన డిటేల్ ఎస్టిమేట్ కోసం ఎస్ఈ కార్యాలయంలో పనిచేసే టెక్నికల్ డీఈ–1 వాంసని రఘుపతి డబ్బులు డిమాండ్ చేసినట్లు తెలిపారు. రూ.2.25 కోట్ల చెరువు పనిని టెండర్ ప్రక్రియ ద్వారా దక్కించుకుంటే ఆ డబ్బులలో నుంచి 1 శాతం(రూ.2.25లక్షలు) డబ్బులు ఇస్తానే...ఎస్టిమేట్ ఇస్తామని డిమాండ్ చేసినట్లు తెలిపారు. కాంట్రాక్టర్ గంకిడి శ్రీనివాస్‌రెడ్డి పలు మార్లు కార్యాలయం చుట్టూ తిరిగినా ఎస్టిమేట్ ఇవ్వలేదని దీంతో ఆయన ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. టెక్నికల్ డీఈ రఘుపతితో కాం ట్రాక్టర్ మాట్లాడి రూ.1.5 లక్షలకు బేరం కుదుర్చుకున్నారు. దీంతో సదరు కాంట్రాక్టర్ మంగళవారం మధ్యాహ్నం ఫోన్లో డీఈ రఘుపతితో మాట్లాడగా ఏఈ గాడపెల్లి గౌరిలక్ష్మీకి డబ్బులు ఇవ్వాలని చెప్పినట్లు ఆయన పేర్కొన్నారు. కాం ట్రాక్టర్ శ్రీనివాస్‌రెడ్డి కార్యాలయంకు వెళ్లి నేరుగా ఏఈ గౌరిలక్ష్మీ డబ్బులు తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నట్లు డీఎస్పీ భద్రయ్య తెలిపారు. కోర్టులో హాజరుపరుస్తాం... ఏసీబీకి చిక్కిన డీఈ రఘుపతి, ఏఈ గౌరిలక్ష్మీలను అరెస్టు చేసి వారి నుంచి రూ.1.5 లక్షలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిని హైదరబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య తెలిపారు. దీంతో పాటు డీఈ రఘపతికి సంబంధించిన దేశాయిపేట, గిర్మాజీపేటలో ఉన్న ఇండ్లలో కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆదా యంకు మంచి ఆస్తులు ఉన్నట్లు వెలువడితే మరో కేసు కూడా నమోదు అవుతుందని తెలిపారు. ఈ దాడులలో ఇన్స్పెక్టర్లు వాసల సతీష్, వెంకట్, సిబ్బంది పాల్గొన్నారు. ఇంజినీరింగ్ శాఖలపై నిఘా వరంగల్ ఏసీబీ అధికారులకు వచ్చిన ఫిర్యాదుతో స్పందించిన అధికారులు రంగంలోకి దిగి ఇంజినీరింగ్ శాఖలపై పెద్ద ఎత్తున నిఘా ఉంచారు. అవినీతికి ఆస్కారం ఉన్న ఇంజనీరింగ్ శాఖలో ఇటీవల ఇద్దరు అధికారులు ఏసీబీకి చిక్కిన విషయం తెలిసిందే. ఆర్ అండ్ బీ ఏఈ కోటేశ్వర్‌రావును పట్టుకున్న మూడు నెలల్లోనే మరో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు పట్టుబడటం ఇంజినీరింగ్ శాఖల్లో కలకలం రేపుతోంది. కాంట్రాక్టు పనులకు బిల్లులు చేయటానికి అధికారులు పెద్ద మొత్తంలో పర్సంటేజీలు డిమాండ్ చేయడం, సకాలంలో బిల్లులు రాకపోవడం, కాళ్లకు ఉన్న చెప్పులు అరిగేలా తిరుగుతున్న అధికారులు కనికరం చూపకపోవడంతో కాంట్రాక్టర్లు ఏసీబీ అధికారులను అశ్రయిస్తున్నారు. మిషన్ కాకతీయ పనులతో పాటు మిషన్ భగీరథ« పనులు చేస్తున్న ఇంజినీరింగ్ అధికారులపై ఏసీబీ దృష్టి సారించినట్లు సమాచారం. దీంతో పాటు పంచాయతీరాజ్ కార్యాలయంలో కొంత మంది అధికారులు బహిరంగంగా డబ్బులు డిమాండ్ చేసిన విషయం ఏసీబీ అధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలిసింది. -
చెరువులు ‘ఇరిగేషన్’కు అప్పగించొద్దు
టీఆర్ఎస్ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ సాక్షి, హైదరాబాద్: మిషన్ కాకతీయ పథకం పూర్తయ్యాక చెరువుల నిర్వహణ బాధ్యతను నీటిపారుదల శాఖకు అప్పగిస్తే అవి మళ్లీ నాశనమయ్యే ప్రమాదం ఉంటుందని టీఆర్ఎస్ సభ్యుడు చెన్నమనేని రమేశ్ అన్నారు. గురువారం పద్దులపై చర్చలో భాగంగా మిషన్ కాకతీయపై ఆయన శాసనసభలో ప్రసంగించారు. చెరువులపై ఆధారపడే కులవృత్తులవారి సం ఘాలు, గ్రామపంచాయతీల ఆధ్వర్యంలో వాటి నిర్వహణ ఉండాలని, ఇతర ప్రభుత్వ విభాగాల ప్రతినిధులతో కూడిన కమిటీలతో సమష్టి నిర్వహణలోనే అవి వర్ధిల్లుతాయని పేర్కొన్నారు.