వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్, అధికారులు
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ భగీరథ పథకం పనులపై ఒత్తిడి పెరిగింది. ఇంటింటికి నల్లానీరు ఇవ్వకుండా ఓట్లడగమని చెప్పినా.. ముందస్తు ఎన్నికలతో ఆ గడువు కాస్తా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే మార్చి నాటికి అన్ని అవాసాల్లోని ఇంటింటికి నల్లాల ద్వారా నీరివ్వాలనేది తాజా లక్ష్యం. అయితే కరీంనగర్ జిల్లాలో మాత్రం వచ్చే జనవరి 5 వరకే ఇచ్చేలా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. మిషన్ భగీరథ పథకం ప్రగతిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, నీటిపారుదలశాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన ఆమె తక్షణమే పనులు పూర్తి చేయాలని ఆదేశించడం అధికారవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
సాక్షిప్రతినిధి, కరీంనగర్: జిల్లాలోని 313 గ్రామపంచాయతీల్లోని 494 హాబిటేషన్లకు చెందిన సుమారు 8.50లక్షల మందికి తాగునీరు అందించే లక్ష్యంతో మిషన్ భగీరథ పనులను చేపట్టారు. 2017 డిసెంబర్ నాటికి జిల్లా వాసులకు ఇంటింటికి నల్లానీరు అందివ్వాలన్న లక్ష్యంతో అప్పటి మంత్రి కె.తారకరామారావు మిషన్ భగీరథ పనులకు జిల్లాలో అంకురార్పణ చేశారు. లోయర్ మానేరు డ్యాం (ఎల్‌ఎండీ) నుంచి మిషన్ భగీరథలో తాగునీటికి వినియోగించాలని నిర్ణయించారు. ఇప్పటికి మొత్తంగా చూసుకుంటే 84 శాతం పనులు పూర్తయినట్లు అధికారుల నివేదికలు చెప్తున్నాయి. మిషన్ భగీరథ పనులు గతేడాది డిసెంబర్ వరకు పూర్తి కావాల్సి ఉన్నా.. పెంచిన గడువు ప్రకారం గడిచిన మార్చిలో ఇంటింటికి నల్లానీరు ఇవ్వాల్సి ఉంది.
అది కూడా సాధ్యం కాకపోవడంతో ఇటీవలే సీఎం కేసీఆర్ మిషన్ భగీరథ పథకం పనులు వచ్చే జనవరి నాటికి పూర్తయి ఫలితాలు ఇవ్వాలని ఆదేశించారు. దీంతో అధికారులు వేగిరపడుతున్నా.. ఆ స్థాయిలో పనులు వేగంగా జరగడం లేదు. ఇదిలా ఉంటే జిల్లాలోని 494 హాబిటేషన్లకు బల్క్ వాటర్ సరఫరా చేసే విధంగా ఏర్పాట్లు చేసినా... 385 హాబిటేషన్లకే ప్రస్తుతం సరఫరా అవుతోంది. ఇంటింటికి నల్లా కనెక్షన్లు 74.49 శాతంగా పేర్కొన్న అధికారులు 95.24 శాతం పైపులైన్ నిర్మాణ పనులు పూర్తి చేశారు. మొత్తం 1750.22 కిలోమీటర్లకు గాను 1666.93 కిలోమీటర్లు వేశారు. 1,74,657 ఇండ్లకు నల్లా కనెన్షన్లు ఇవ్వాల్సి ఉండగా, పూర్తి స్థాయిలో 1,73,752 గృహాలకు ఇచ్చినట్లు నివేదికల్లో పేర్కొన్నారు.
అయితే ఓవర్‌హెడ్ వాటర్ స్టోరేజీ రిజర్వాయర్ (ఓహెచ్‌ఎస్‌ఆర్)ల నిర్మాణమే అసలు సమస్యగా కనిపిస్తోంది. మొత్తం 380 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు 257 మాత్రమే పూర్తయ్యాయి. వాటర్ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు (డబ్ల్యూటీపీ), రా వాటర్ పైపులైన్లు, జీఎల్‌బీఆర్, సంపులు, కెమికల్ హౌజ్, ఫిల్టర్ హౌజ్, క్లోరినేషన్ హౌజ్, రా వాటర్ ఛానల్‌లు పూర్తిస్థాయిలో వాడకంలోకి తేవాల్సి ఉంది. వీటన్నింటిని చేసేందుకు అధికారులు కాంట్రాక్టు సంస్థలను తొందరపెడుతున్నా... ఆశించిన మేరకు వేగం అందుకోవడం లేదు. ఈ నేపథ్యంలో జనవరి 5 నాటికి అన్ని ఇండ్లకు నల్లానీరు సాధ్యమవుతుందా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
వేగవంతంగా పూర్తి చేయాలి – స్మితా సభర్వాల్
మిషన్ భగీరథ పనులు వేగవంతంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి కార్యాలయ కార్యదర్శి స్మితా సభర్వాల్ అన్నారు. శుక్రవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎల్లంపల్లి, వరదకాలువ పనుల భూసేకరణ, మిషన్ భగీరథ తదితర అంశాలపై సమీక్షించారు. మిషన్ భగీరథ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని, 2019 జనవరి 5వ తేదీ నాటికి ప్రతి ఇంటికి తాగునీరు అందించే ప్రయత్నం చేయాలని సూచించారు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టుల పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాల్లో మిషన్ భగీరథ పనులపై కలెక్టర్లు దృష్టి సారించాలని అన్నారు. మిషన్ భగీరథ పైపులైన్ల లీకేజీలు ఉంటే మరమ్మతులు చేయాలని సూచించారు.
ఇరిగేషన్ పనులకు భూసేకరణ పూర్తి చేయాలని అన్నారు. కరీంనగర్ మానేరు డ్యాం వద్ద ఉన్న ఫిల్టర్ బెడ్ పనులు నిలిచిపోవడం వల్ల మున్సిపల్‌కు నీరందంచిలేక పోతున్నారని, ఫిల్టర్ బెడ్ పనులు వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్‌కు సూచించారు. కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ మాట్లాడుతూ ఫిల్టర్ బెడ్ పనులు వేగవంతంగా పూర్తి చేస్తామని అన్నారు. జిల్లాలో ఇరిగేషన్, వరద కాలువ పనులపై దృష్టిసారించి పనులు త్వరగా పూర్తి అయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ జీవీ.శ్యాంప్రసాద్‌లాల్, జిల్లా రెవెన్యూ అధికారి భిక్షనాయక్, ఎస్సారెస్పీ సీఈ శంకర్, ఎస్‌ఈ శ్రీకాంత్‌రావు, మిషన్ భగీరథ ఎస్‌ఈ అమరేందర్, వరదకాలువ సీఈ అనిల్‌కుమార్, ఇరిగేషన్ శాఖల ఇంజనీర్లు, జిల్లా పరిషత్ సీఈవో వెంకటమాధవరావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment