
టెక్నాలజీని బాధ్యతాయుతంగా వాడకుంటే భారీ విధ్వంసం: కేటీఆర్
బెంగళూరులో ఆంట్రప్రెన్యూర్ టెక్ ఇన్నోవేషన్ సదస్సు
సాక్షి, హైదరాబాద్: సాంకేతిక ప్రగతితోపాటు సైబర్ నేరాలు కూడా పెరుగుతున్నాయని, కేవలం ఫోన్ కాలర్ ట్యూన్లతో వాటిని నియంత్రించలేమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్ వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారని, వీటివల్ల చోటుచేసుకుంటున్న దుష్పరిణామాలు ఆపడం ప్రభుత్వాలకు పెద్ద సవాలుగా మారిందన్నారు. టెక్నాలజీ సామర్థ్యం అధికంగా ఉన్న యువత సైబర్ నేరాలకు ఎందుకు పాల్పడుతున్నదో ఆలోచించాలన్నారు. బెంగళూరులో గురువారం ప్రారంభమైన ‘2025 ఆంట్రప్రెన్యూర్ టెక్ ఇన్నోవేషన్ సదస్సులో కేటీఆర్ ప్రసంగించారు.
డిజిటల్ అక్షరాస్యతతో సమాన అవకాశాలు..: ‘సాంకేతికత వేగంగా అభివృద్ది చెందుతున్నా ప్రతీ సాంకేతిక ఆవిష్కరణ వెనుక మానవ అవసరాలు, నైతిక విలువలు నిలకడగా ఉండాలి. ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి సాంకేతిక పరిణామాలు ప్రపంచాన్ని సమూలంగా మార్చబోతున్నాయి. సాంకేతికతను బాధ్యతగా ఉపయోగించకపోతే అది ప్రమాదకరంగా తయారవుతుంది. సామాజిక ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని టెక్నాలజీ అభివృద్ధి జరగాలి.
టెక్నాలజీతో పర్యావరణంపై కలిగే ప్రభావం గురించి తగిన అధ్యయనం లేకుండా ముందుకెళ్తే భవిష్యత్తు ఇబ్బందికరంగా మారుతుంది. ప్రజలు తమ మాతృభాషల పట్ల జరుగుతున్న వివక్షపైనే కాకుండా సమాజంలో ఏర్పడుతున్న సరికొత్త విభజనపైనా దృష్టి సారించాలి. డిజిటల్ అంతరం పెరుగుతున్నకొద్దీ సమాజంలో మరింత విభజన వస్తుంది. డిజిటల్ అక్షరాస్యత ద్వారానే అందరికీ సమాన అవకాశాలు లభిస్తాయి’ అని కేటీఆర్ వివరించారు.