
తమిళనాడు సీఎం స్టాలిన్ ఆందోళనతో పూర్తిగాఏకీభవిస్తున్నా: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: జనాభా ప్రాతిపదికన నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో దక్షిణాది రాష్ట్రాలకు తీవ్ర అన్యాయం జరుగుతుందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ఈ అంశంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ సామాజిక మాధ్యమాల్లో వ్యక్తం చేసిన ఆందోళనలతో తాను పూర్తిగా ఏకీభవిస్తున్నట్టు బుధవారం విడుదల చేసిన ప్రకటనలో కేటీఆర్ పేర్కొన్నారు.
‘జనాభా నియంత్రణలో దక్షిణాది రాష్ట్రాల కృషిని పట్టించుకోకుండా జనాభా ఆధారంగా నియోజకవర్గాలను పునర్విభజించడం ప్రజాస్వామ్యానికి, సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధం. దక్షిణాది రాష్ట్రాలు దేశ నిర్మాణంలో అందించిన సహకారాన్ని ఎవరూ కాదనలేరు. 1951లో దక్షిణాది రాష్ట్రాల జనాభా వాటా 26.2 శాతం ఉండగా, 2022 నాటికి అది 19.8 శాతానికి పడిపోయింది. అదే సమయంలో ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్, రాజస్తాన్ వంటి ఉత్తర రాష్ట్రాల జనాభా వాటా 39.1 శాతం నుంచి 43.2 శాతానికి పెరిగింది.
ఈ పరిస్థితుల్లో జనాభా ఆధారంగా లోక్‌సభ సీట్లను నిర్ణయిస్తే, ఉత్తరప్రదేశ్, బిహార్‌కు 222 సీట్లు వస్తాయి. దక్షిణాది రాష్ట్రాలైన తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కర్ణాటక, కేరళకు మొత్తంగా కేవలం 165 సీట్లు మాత్రమే లభిస్తాయి. దక్షిణాది రాష్ట్రాలు ఆర్థిక వృద్ధి, మానవ అభివృద్ధి సూచికలు, జనాభా నియంత్రణ వంటి అన్ని రంగాల్లో ఉత్తర రాష్ట్రాల కంటే గణనీయంగా మెరుగైన పనితీరు కనబరిచాయి. అలాంటి రాష్ట్రాలను శిక్షించి, వెనుకబడిన రాష్ట్రాలను ప్రోత్సహించడం దేశ ప్రయోజనాలకు వ్యతిరేకం’అని కేటీఆర్ పేర్కొన్నారు.
అధికార యంత్రాంగంపై వేధింపులు సిగ్గుచేటు
‘తెలంగాణ స్టేట్ స్టాటిస్టికల్ అబ్ స్ట్రాక్ట్ (అట్లాస్) రిపోర్టుతో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత రాష్ట్ర ప్రజల ముందు బట్టబయలు కావడం సీఎంకు మింగుడు పడటం లేదు. వెబ్‌సైట్ నుంచి రిపోర్టులు తొలగించి, అధికారులపై వేటు వేసినంత మాత్రాన కేసీఆర్ కృషిని చెరిపివేయలేరు’అని కేటీఆర్ అన్నారు.
టెక్, ఇన్నోవేషన్ సమ్మిట్–2025కు కేటీఆర్
ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జరిగే టెక్, ఇన్నోవేషన్ సమ్మిట్ (టిస్)లో ముఖ్య అతిథిగా ప్రసంగించేందుకు కేటీఆర్ బుధవారం సాయంత్రం బెంగళూరుకు బయలుదేరివెళ్లారు. గురువారం జరిగే సదస్సులో ‘డ్రైవింగ్ డిజిటల్ ఇండియా– సాంకేతికంగా అభివృద్ధి చెందిన భవిష్యత్ కోసం ఆవిష్కరణలు, వ్యూహాలు’అనే అంశంపై కేటీఆర్ కీలకోపన్యాసం చేస్తారు.
Comments
Please login to add a commentAdd a comment