పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ | Underground Drainage System Will Be Set Up In The Towns Says KTR | Sakshi
Sakshi News home page

పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ

Published Wed, Sep 18 2019 3:20 AM | Last Updated on Wed, Sep 18 2019 3:20 AM

Underground Drainage System Will Be Set Up In The Towns Says KTR - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మిషన్‌ భగీరథ ప్రాజెక్టు పూర్తయ్యాక రాష్ట్రవ్యాప్తంగా అన్ని పట్టణాల్లో భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయనున్నామని పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. దశలవారీగా తొలుత నగరపాలక సంస్థల్లో, ఆ తర్వాత పురపాలక సంఘాల్లో దీన్ని ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వెల్లడించారు. మంగళవారం శాసనసభలో పద్దులపై చర్చ అనంతరం సమాధానంలో భాగంగా కేటీఆర్‌ ఈ విషయం ప్రకటించారు. హైదరాబాద్‌లో పోగవుతున్న చెత్త నుంచి 48 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుదుత్పత్తి చేసే ప్రాజెక్టు కూడా ఏర్పాటవుతుందని చెప్పారు. గత ప్రభుత్వం భారీ చెత్త డంపింగ్‌ను తమకు అప్పగించి వెళ్లిందన్నారు.

రూ. 359 కోట్ల వ్యయంతో దానికి క్యాపింగ్‌ చేసే పని పూర్తి దశకు చేరుకుందని వివరించారు. తెలంగాణలో శరవేగంగా పట్టణీకరణ జరుగుతు న్న నేపథ్యంలో మౌలికవసతుల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామని కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం 42.6 శాతం మంది ప్రజలు పట్టణాల్లోనే ఉంటున్నారని, మరో ఐదు నుంచి ఏడేళ్ల వ్యవధిలో అది 50 శాతానికి చేరుకుంటుందన్నారు. ఇది ప్రభుత్వానికి పెద్ద సవాలేనని, దాన్ని ఎదుర్కొనేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నామన్నారు.కొత్త మున్సిపల్‌ చట్టం ద్వారా జవాబుదారీతనం, పారదర్శక పాలన సాధ్యమవుతుందన్నారు. పురపాలక సంఘాల్లో ఇప్పటికే 3.47 లక్షల ఎల్‌ఈడీ లైట్లు అమర్చడం ద్వారా రూ. 35 కోట్ల విద్యుత్‌ బిల్లులను ఆదా చేశామని, హైదరాబాద్‌లో 4 లక్షల ఎల్‌ఈడీ లైట్ల ఏర్పాటుతో రూ. 35 కోట్ల విద్యుత్‌ బిల్లుల భారం తగ్గిందని తెలిపారు.

స్వచ్ఛ సర్వేక్షణ్‌కు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని, సిద్దిపేట, సిరిసిల్ల, బోడుప్పల్, పీర్జాదిగూడ మున్సిపాలిటీల్లో తమ పనితీరును అభినందించి కేంద్రం జాతీయ పురస్కారాలను ప్రకటించిందన్నారు. భవన నిర్మాణ వ్యర్థాలను రీ సైక్లింగ్‌ చేసుకునేందుకు జీడిమెట్ల, ఫతుల్లాగూడల్లో రెండు ప్లాంట్లను ఏర్పాటు చేశామని, వాటిని విస్తరించే చర్యలు తీసుకుంటామన్నారు. ప్రస్తుతం జీహెచ్‌ఎంసీ పరిధిలో ఏర్పాటైన 106 బస్తీ దవాఖానాల సంఖ్య పెంచనున్నట్లు కేటీఆర్‌ చెప్పారు.

హైదరాబాద్‌ రోడ్లకు రూ. 2,819 కోట్లు
హైదరాబాద్‌లో రోడ్ల అభివృద్ధికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ. 2,819 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. గతేడాది ఈ పద్దు కోసం రూ. 1,542 కోట్లు ఖర్చు చేశామని, ఈసారి ఆ మొత్తానికి రూ. 1,300 కోట్ల మేర జత చేసినట్లు తెలిపారు. పారిశుద్ధ్య పనులకు గతేడాది రూ. 807 కోట్లు ఖర్చు చేయగా ఈసారి రూ. 892 కోట్లు వ్యయం చేస్తున్నట్లు వివరించారు. హైదరాబాద్‌ నుంచి మూసీలోకి 1,800 ఎంఎల్‌డీ నీళ్లు ప్రవహిస్తున్నప్పటికీ 700 ఎంఎల్‌డీని మాత్రమే శుద్ధి చేయగలుగుతుండటంతో మిగతా మురుగునీరు నల్లగొండ జిల్లాలోకి చేరుతోందన్నారు. పీపీపీ పద్ధతిలో కొత్తగా ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసి మొత్తం మురుగునీటిని శుద్ధి చేసి విడుదల చేస్తామన్నారు. భాగ్యనగర మంచినీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు కాళేశ్వరం నీటిని తరలిస్తున్నామని, కేశవాపూర్‌ రిజర్వాయర్‌తో సిటీ ని అనుసంధానిస్తున్నామన్నారు.

కృష్ణా నీటి సరఫరాలో ఇబ్బం ది ఉన్నా, రింగ్‌ మెయిన్‌ ద్వారా సిటీ అంతటికీ గోదావరి జలాలను సరఫరా చేసే వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రస్తుతం మెట్రో రైళ్లలో నిత్యం 3 లక్షల మంది ప్రయాణిస్తున్నారని, ఎయిర్‌పోర్టుతో మెట్రోను అనుసంధానించబోతున్నామన్నారు. నగరంలో పాడయిన రోడ్లను త్వరలో బాగు చేస్తామని, ఎన్‌ఆర్‌సీఎం, గోట్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ సాయంతో జియాగూడ స్లాటర్‌ హౌస్‌ను వినియోగంలోకి తెస్తామని వెల్లడించారు. డ్రైనేజీలను శుభ్రపరిచే పనిని పూర్తిగా యాంత్రీకరించామని, దీనికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారని గుర్తుచేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement