సాక్షి, హైదరాబాద్ : కృష్ణా, గోదావరి పరీవాహకాల్లో భారీ వర్షాలు కురవడం, సాగునీటి ప్రాజెక్టుల్లోకి వరద కొనసాగుతుండటం, వీటి ద్వారా చెరువులు, కాల్వలకు సరిపడినంత నీటిని విడుదల చేయడంతో మునుపెన్నడూ లేనంతగా పాతాళ జలం పైకొచ్చింది. రాష్ట్రంలో అక్టోబర్‌లో కురవాల్సిన సగటు వర్షపాతం కన్నా 17శాతం అధికంగా వర్షపాతం నమోదు కావడంతో భూగర్భ జలం పైకి ఉప్పొంగుతోంది. గత ఏడాది అక్టోబర్ నెలతో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్ భూగర్భ మట్టం ఏకంగా 2.43మీటర్లు పైకి వచ్చింది. ఈ ఏడాది వర్షాలకు ముందు జూన్ నెల వరకు రాష్ట్ర సగటు భూగర్భ మట్టం 14.56మీటర్ల లోతున ఉంటే ప్రస్తుతం అది 6.64మీటర్లు పైకి ఎగబాకి 7.92 మీటర్లకు చేరింది. గణనీయంగా సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జూన్‌తో పోలిస్తే 11.42 మీటర్లు భూగర్భ మట్టం మెరుగవడం విశేషం.
సాగునీరు మెరుగైన చోటల్లా..
రాష్ట్రంలో సాధారణ వర్షపాతం అక్టోబర్ నెలలో 816 మిల్లీమీటర్లకు గానూ 953.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ఏకంగా 17శాతం వర్షపాతం అధికంగా కురి సింది. హైదరాబాద్, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, జనగాం, కామారెడ్డి, ములుగు, పెద్దపల్లి, వనపర్తి, సిరిసిల్ల, నిజామాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్, సిద్దిపేట జిల్లాలో సగటు కన్నా ఎక్కువ వర్షపాతం నమోదైంది. దీంతో భూగర్భ జల మట్టాలు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే ఈ ఏడాది గణనీయంగా పెరిగాయి. గత ఏడాది అక్టోబర్‌లో రాష్ట్ర సగటు భూగర్భమట్టం 10.35 మీటర్లు ఉండగా, ఈ ఏడాది 2.43 మీటర్ల మేర మెరుగై 7.92 మీటర్లకు చేరింది. ఈ ఏడాది జూన్‌లో వర్షాలకు ముందు వరకు రాష్ట్ర సగటు మట్టం 14.56 మీటర్లు ఉండగా, దాంతో పోలిస్తే ప్రస్తుతం ఏకంగా 6.64 మీటర్లు పెరిగింది.
ఇక గోదావరి బేసిన్‌లోని ప్రాజెక్టులనుంచి నీటి విడుదల జరిగిన కరీంనగర్, జనగాం, సిరిసిల్ల, నిజామాబాద్ జిల్లా ప్రాంతాల్లో మట్టాలు ఆశించినదానికన్నా మెరుగయ్యాయి. సిరిసిల్ల జిల్లాలో ఈ ఏడాది జూన్‌లో నీటి మట్టం 17.98 మీటర్లు ఉండగా, అది ప్రస్తుతం 4.59 మీటర్లు. ఇక నాగార్జునసాగర్ ప్రాజెక్టు ద్వారా నీటి విడుదల జరిగిన నల్లగొండ జిల్లాలో పరిస్థితి ఆశాజనకంగా ఉంది. ఇక్కడ జూన్‌లో 12.21 మీటర్లలో ఉన్న మట్టం ప్రస్తుతం 9.22 మీటర్లకు చేరింది. మొత్తంగా రాష్ట్ర భూభాగంలో 38 శాతం భూభాగంలో భూగర్భమట్టాలు 5 మీటర్లకు పైనే ఉండగా, 5 నుంచి 10 మీటర్ల పరిధిలో మరో 32 శాతం భూభాగం ఉందని భూగర్భ శాఖ నివేదికలు చెబుతున్నాయి. మరో 17శాతం భూభాగంలో మట్టాలు 10 నుంచి 15మీటర్ల మధ్య ఉన్నాయి. రాష్ట్రంలో రెండు నదీ బేసిన్‌ల పరిధిలో ఉన్న 43,759 చెరువుల్లో ప్రస్తుతం 3,692 చెరువులు అలుగు పారుతుండగా, మరో 13,705 చెరువులు వంద శాతం జలకళను సంతరించుకున్నాయి. మరో 4,700 చెరువులు 75శాతం నీటితో కళకళలాడుతున్నాయి. చెరువులన్నీ నిండటం, ప్రాజెక్టు కాల్వల నుంచి నీటి పారకంతో బోర్ల వినియోగం తగ్గడం వంటి కారణాలతో మట్టాలు మెరుగయ్యాయని భూగర్భ జల విభాగం డైరెక్టర్ డాక్టర్ పండిత్ మధునురే పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment