
నేటి నుంచి 22 వరకు తీరప్రాంత జిల్లాల్లో భారీ వర్షాలు
నైరుతి బంగాళాఖాతంలో స్థిరంగా ఉన్న అల్పపీడనం
రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం
విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం వెల్లడి
సాక్షి, విశాఖపట్నం/అమరావతి/వాకాడు: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి రెండు రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుపాను హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి.. అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశాలున్నాయని వెల్లడించారు.
దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకూ తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకూ రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు.
19న ఉత్తరాంద్ర, దక్షిణ కోస్తా జిల్లాల్లో ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. తీరం వెంబడి గంటకు 35 నుంచి 45 గరిష్టంగా 55 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని పేర్కొన్నారు. మత్స్యకారులెవరూ ఈ నెల 22 వరకూ వేటకు వెళ్లరాదని హెచ్చరించారు.

తీరంలో అలజడి
అల్పపీడనం కారణంగా మంగళవారం వాతావరణంలో అనూహ్య మార్పులు చోటుచేసుకున్నాయి. తిరుపతి జిల్లా సముద్ర తీరంలోని చిల్లకూరు, కోట, వాకాడు, తడ, సూళ్లూరుపేట మండలాల పరిధిలో సముద్రంలో భీకరమైన శబ్దాలతో అలలు ఎగసిపడుతున్నాయి.
వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు తలెత్తి మధ్యాహ్నం నుంచే చీకట్లు కమ్ముకుని తీవ్రమైన చలి గాలులు వీస్తున్నాయి. వాకాడు మండలం తూపిలిపాళెం సముద్ర తీరంలో భీకరమైన శబ్దాలతో అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. తీరప్రాంత ప్రజలు చలికి గజగజ వణుకుతున్నారు.
సాయంత్రం 4 గంటలకే రాత్రిని తలపిస్తూ బయట తిరగలేని పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికే వేటలో కొనసాగుతున్న మత్స్యకారులు తీవ్రమైన అలలు, చలి గాలులకి తట్టుకుని వేట చేయలేకున్నామని, తాము వేట ముగించుకుని, త్వరితగతిన ఒడ్డుకు వచ్చేస్తున్నామంటూ తోటి మత్స్యకారులకు ఫోన్ ద్వారా సమాచారం అందజేశారు.
Comments
Please login to add a commentAdd a comment