
వైఎస్సార్ జిల్లా తాతిరెడ్డిపల్లెలో ఈదురుగాలులతో కూడిన వర్షానికి పడిపోయిన అరటి పంట
కొతకొచ్చిన పంట అకాల వర్షానికి నేలపాలవడంతో మనస్తాపం
అధికారులు సరైన రీతిలో స్పందించలేదని ఆవేదన
యల్లనూరు/పులివెందుల రూరల్: వారం రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న అరటి పంట అకాల వర్షానికి దెబ్బతినడంతో చేసిన అప్పులు ఎలా తీర్చాలో అర్థంకాక ఇద్దరు రైతులు పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నంచిన ఘటన అనంతపురం జిల్లా యల్లనూరు మండలం నీర్జాంపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది.
బాధిత కుటుంబాల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చిన్న వెంగప్ప 9 ఎకరాలు, లక్ష్మీనారాయణ మరో 10.5 ఎకరాల్లో అరటి తోటలు సాగు చేశారు. అప్పులు తెచ్చి ఒక్కొక్కరూ రూ.15 లక్షల వరకు పెట్టుబడి పెట్టారు. వారం రోజుల్లో పంట కోత కోయాల్సి ఉంది. ఒక్కో రైతుకు కనీసం రూ.20 లక్షల వరకు వస్తుందని ఆశపడ్డారు. కానీ.. శనివారం రాత్రి ఈదురుగాలులతో కూడిన అకాల వర్షానికి పంట దెబ్బతింది.
వడగళ్లు అరటి గెలలపై పడటంతో కాయలకు మచ్చలు వస్తాయని, దీనివల్ల పంటను ఎవరూ కొనరని బాధిత రైతులు ఆవేదన చెందారు. పంట నష్టాన్ని పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఆదివారం ఉదయం ఉద్యాన శాఖ అధికారులను ఫోన్‌లో కోరారు. సెలవు రోజు కావడంతో అధికారులు సరైన రీతిలో స్పందించలేదు. దీంతో రైతులిద్దరూ తాము తీవ్రంగా నష్టపోవడం ఖాయమనే నిర్ణయానికి వచ్చారు. అప్పులు తీర్చే దారిలేక... చివరకు ఆత్మహత్యలే గతి అని భావించి తోటలోనే పురుగు మందు తాగారు.
చిన్నవెంగప్ప భార్య రాజమ్మ ఈ విషయాన్ని గమనించి గ్రామస్తులకు చెప్పగా.. ఇద్దరినీ పులివెందుల ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం అనంతపురం సర్వజనాస్పత్రికి రెఫర్ చేశారు. పంట నష్టం జరిగిన తోటలను ఆదివారం మధ్యాహ్నం అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ, ఉద్యాన అధికారి ఉమాదేవి, తహసీల్దార్ రాజా పరిశీలించారు. కాగా.. రైతులు ఫోన్ చేసినా తాము స్పందించలేదనడంలో వాస్తవం లేదని, వెంటనే పొలాల వద్దకు వెళ్లి బాధిత రైతులను ఆస్పత్రికి తరలించడంలో సహాయపడ్డామని ఉద్యాన అధికారి ఉమాదేవి చెప్పారు.
ఎవరూ పట్టించుకోవడం లేదు
మొత్తం పదిన్నర ఎకరాల్లో అరటి పంట వేశాను. 15 వేల మొక్కలు నాటాను. ప్రస్తుతం ఐదు వేల చెట్లలో పంట కోతకు వచ్చింది. రెండు, మూడు రోజుల్లో కోసి విక్రయించేవాళ్లం. మా ఖర్మ ఏమైందో గానీ వడగళ్ల వాన వచ్చింది. పంట మొత్తం దెబ్బతింది. మా బాధ ఎవరితో చెప్పుకోవాలి?. ఒక్క అధికారి కానీ, ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. – లక్ష్మీనారాయణ, ఆత్మహత్యాయత్నం చేసిన రైతు
తీవ్రంగా నష్టపోయాం
తొమ్మిది ఎకరాల్లో అరటి పంట వేశా. రూ.లక్షలు అప్పు చేసి పంట పెట్టా. 11 నెలలు పడ్డ కష్టానికి రెండు రోజుల్లో ఫలితమిచ్చేది. గెలలు విక్రయించడం ద్వారా వచ్చే డబ్బుతో కాస్తయినా అప్పులు తీర్చుకునేవాళ్లం. ఇప్పుడు ఏం చేయాలో తెలియట్లేదు. మా ఆశలపై నీళ్లు పడ్డాయి. ప్రభుత్వం ఆదుకోవాలి. లేకుంటే ఆత్మహత్యే శరణ్యం. – చిన్నవెంగప్ప, ఆత్మహత్యాయత్నం చేసిన రైతు