సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి నీటి ముప్పు ముంచుకోస్తోంది. వేసవి రాక ముందే భూగర్భ జలాలు పాతాళానికి చేరుతున్నాయి. గతేడాది వర్షపాతం లోటుతోపాటు ‘రబీ’ సాగుకు బోరుబావులపై ఆధారపడటంతో భూగర్భ జలాలు రోజురోజుకూ క్షీణిస్తున్నాయి. ఈ ఏడాది రాష్ట్ర సగటు నీటి మట్టం 11.91 మీటర్లు. గతేడాదితో పోలిస్తే ఇది 1.83 మీటర్ల మేర పతనం కావడం ఆందోళన కలిగిస్తోంది. అవసరానికి మించి బోర్ల ద్వారా నీటిని తోడేస్తుండటంతో నీటి వృథా జరుగుతోందని భూగర్భ జలశాఖ అంచనా వేస్తోంది.
భయపెడుతున్న నీటి మట్టాలు...
ఈ ఏడాది జనవరి నాటికి రాష్ట్రంలో 852 మిల్లిమీటర్ల వర్షపాతానికిగాను 721 మిల్లిమీటర్లే నమోదైంది. గతేడాదితో పోలిస్తే 15% తక్కువగా రికార్డయింది. 31 జిల్లాలకుగాను 15 జిల్లాల్లో సాధారణ వర్షపాతం నమోదవగా 16 జిల్లాల్లో లోటు వర్షపాతం నెలకొంది. 284 మండలాల్లో 20% నుంచి 59% వర్షపాతం తక్కువగా నమోదైంది. గతేడాది జనవరిలో 10.08 మీటర్ల రాష్ట్ర సరాసరి నీటిమట్టాలుండగా ఈ ఏడాది జనవరి చివరి నాటికి అది 11.91 మీటర్లకు చేరింది. భూగర్భ జలమట్టాల్లో 1.83 మీటర్ల తగ్గుదల నమోదైంది. ఇవే మట్టాలను 2017తో పోలిస్తే 2.55 మీటర్ల మేర పడిపోయాయి. కేవలం 11 జిల్లాల్లోనే 0.11 మీటర్ల నుంచి 1.56 మీటర్ల మేర పెరుగుదల కనిపించగా 20 జిల్లాల్లో 7.49 మీటర్ల నుంచి 0.17 మీటర్ల వరకు తగ్గాయి. ముఖ్యంగా సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో భూగర్భ నీటిమట్టాలు ఊహించని రీతిలో పడిపోయాయి. సంగారెడ్డిలో గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఏకంగా 7.49 మీటర్ల మేర నీటిమట్టాలు తగ్గాయి. అతిఎక్కువగా సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలో ఏకంగా 44.68 మీటర్లకు భూగర్భ నీటిమట్టం పడిపోవడం గమనార్హం. ఏకంగా 117 మండలాల్లో 20 మీటర్ల దిగువకు వెళ్తేగానే నీరు లభించట్లేదు.
ప్రాజెక్టుల్లోనూ క్షీణత.. రక్షణ చర్యలే కీలకం
ఇప్పటికే నీళ్లు లేక బోరుబావులు వట్టిపోయాయి. ఉన్న కొద్దిపాటి నీళ్లను ఉపయోగించి రైతులు పంటల సాగు చేస్తున్నారు. దీనికితోడు మంజీరా, సింగూరు, నిజాంసాగర్‌లలో ఇప్పటికే చుక్క నీటి లభ్యత లేకపోగా ఎస్సారెస్పీ, కడెం, లోయర్ మానేరులో నీటి నిల్వలు పడిపోతున్నాయి. ఇక హైదరాబాద్ తాగునీటి అవసరాలకు ఆధారపడ్డ శ్రీశైలంలో నిల్వలు కనీస నీటిమట్టాలకు దిగువకు చేరాయి. 885 అడుగుల మట్టానికిగాను కనీస నీటిమట్టం 834 అడుగులకన్నా తక్కువగా 831.40 అడుగులకు తగ్గిపోయింది. ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు తగ్గడంతో భూగర్భ జలాలు మున్ముందు మరింత క్షీణించే అవకాశం ఉంది. వేసవికి ముందే ఇలాంటి పరిస్థితులు ఉంటే నిండు వేసవిలో ఎలాంటి గడ్డు పరిస్థితులు ఎదురవుతాయన్నది ఆందోళన రేపుతోంది. నీటి రక్షణ చర్యలు చేపట్టకపోవడం వల్ల రోజురోజుకూ భూగర్భజలాలు పడిపోతున్నాయి. నీటిని భూమిలోకి ఇంకించడానికి అవసరమైన ప్రాంతాల్లో కాంటూరు కందకాలు, చెక్‌డ్యాంల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. నీరున్న చోట వాటి నిర్మాణాలకు డ్వామా అధికారులు ప్రాధాన్యం ఇస్తున్నా నీరు లేనిచోట నిర్మించడం లేదు. ఫలితంగా నీటి కోసం ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో నీటి సంరక్షణ చర్యలు అత్యంత మఖ్యమని భూగర్భ జలశాఖ హెచ్చరిస్తోంది. డ్రిప్, స్ప్రింక్లర్ల ద్వారా వ్యవసాయ సాగును ప్రోత్సహించాలని, ఐడీ పంటల వైపు రైతులను ప్రోత్సహించాలని సూచిస్తోంది.
భూగర్భాలు అత్యంత దారుణంగా పడిపోయిన మండలాలు
మండలం మట్టం (మీటర్లలో)
దౌల్తాబాద్ (సిధ్దిపేట) 44.68
బట్వారం (వికారాబాద్) 41.77
కొల్చారం (మెదక్) 40.10
ఫరూఖ్‌నగర్ (రంగారెడ్డి) 37.70
మిడ్జిల్ (మహబూబ్‌నగర్) 36.55
తెలంగాణలో జల ఘంటికలు
Published Mon, Feb 25 2019 3:52 AM | Last Updated on Mon, Feb 25 2019 9:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment