నిజాంపేట మండలం నగరం తండాలో గిరిజనుల నీటి పాట్లు
సాక్షి, మెదక్: వేసవి ప్రారంభంలోనే జిల్లాలో తాగునీటి కష్టాలు మొదలయ్యాయి. జలాశయాలు, చెరువుల్లో నీరు వేగంగా ఇంకిపోతుంది. దీనికి తోడు భూగర్భ జల మట్టాలు అడుగంటుతున్నాయి. పర్యవసానంగా గ్రామాలు, తండాల్లోని ప్రజలకు నీటి కష్టాలు తప్పడం లేదు. నిజాంపేట మండలం చల్మెడలో తాగు నీటి కష్టాలు తీర్చాలంటూ మూడు రోజుల క్రితం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళనకు దిగారు. ఈ పరిస్థితి చూస్తే అర్థం చేసుకోవచ్చు ఎలా ఉందో? మెదక్, నిజాంపేట, రామాయంపేట, చిన్నశంకరంపేట, పాపన్నపేట, చిలప్‌చెడ్ తదితర మండలాల్లో ఇప్పటికే నీటి సమస్యలు మొదలయ్యాయి. ముఖ్యంగా గిరిజన తండాల్లో నీటి సమస్య తీవ్రంగా కనిపిస్తోంది. దీంతో గిరిజనులు కిలోమీటర్ల మేర నడుచకుంటూ వెళ్లి వ్యవసాయ భూముల వద్ద ఉన్న బోరుబావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నారు. ఇప్పుడే నీటి కోసం ఇబ్బందులు పడాల్సివస్తే వేసవిలో పరిస్థితి ఏమిటని ప్రజలు ఆందోళనకు గురువుతున్నా రు. మరోవైపు మిషన్‌భగీరథ పనులు నత్తనడక న సాగుతున్నాయి. ఏప్రిల్‌లోగా మొదటి దశలో గ్రామాలకు తాగునీరు సరఫరా చేయటం సాధ్యం కాకపోవచ్చని ప్రజలు ఆలోచిస్తున్నారు.
వేగంగా పడిపోతున్నాయి..
జిల్లాలో భూగర్భ జలమట్టాలు వేగంగా పడిపోతున్నాయి. ప్రస్తుతం భూగర్భ జలాలు 16.07 మీటర్ల లోతులో ఉన్నాయి. గత ఏడాది ఫిబ్రవరి నెలలో భూగర్భ జలాలు 13.07 మీటర్లు ఉండటం గమనార్హం. 24 గంటల విద్యుత్ అందుబాటులో ఉండటంతో వ్యవసాయం కోసం రైతులు ఎడాపెడా బోరుబావుల్లో నుంచి నీటిని తోడేస్తున్నారు. దీంతో భూగర్భ జల మట్టాలు వేగంగా పడిపోతున్నట్లు అధికారులు చెబుతున్నారు. తూప్రాన్ మండలంలో అత్యధికంగా భూగర్భ జలాలు 32.26 మీటర్ల లోతుకు పడిపోగా, రేగోడ్‌లో 9.56 మీటర్ల లోతునే ఉన్నాయి. రాబోయే రోజుల్లో ఈ జలాలు మరింత లోతుకు పడిపోయే అవకాశం ఉందని సంబంధిత అధికారులు అంచనా వేస్తున్నారు.
గిరిజన తండాల్లో నీటి సమస్య అధికం
జిల్లాలోని పలు గ్రామాలతోపాటు గిరిజన తండాల్లో నీటి సమస్య మొదలైంది. రామాయంపేట పట్టణంలోని టీచర్స్‌కాలనీ, రెడ్డికాలనీలో నీటి సమస్య ఉండటంతో కాలనీవాసుల ట్యాంకర్‌ద్వారా తాగునీటిని తెప్పించుకుంటున్నారు. మండలంలోని టి.నంబర్‌తండా, దంతేపల్లితండాల్లో నీటి సమస్య ప్రారంభమైంది. నిజాంపేట మండలంలోని చల్మెడ, నగరంతండా నీటి సమస్య ప్రారంభంకావటంత ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.చిల్పిచె మండలంలోని ఎర్రమట్టి తండా, పానాదితండా, ఎల్లుగుట్టతండా, చిట్కుల్ ఎస్సీ కాలనీలో నీటి సమస్య ఉంది.చిన్నశంకరంపేట మండలంలోని ఎస్.కొండాపూర్, పాటగడ్డ, రంగువాన్‌పల్లి, జప్తిశివనూరుతండా, శేరిపల్లి గ్రామంలో నీటి సమస్య ఉంది. పాపన్నపేట మండలం సోమ్లా, బ్యాక్యా, మెదక్ మండలం మక్తభూపతిపూర్, శివాయిపల్లి, హవేళిఘనపూర్ మండలంలోని బూర్గుపల్లిలో తాగునీటి సమస్యలు మొదలయ్యాయి. చేగుంటపట్టణంలోని పలు కాలనీలతోపాటు వెల్థుర్తి మండలంలోని బస్వాపూర్, అచ్చంపేటలో నీటి సమస్య ప్రారంభమైంది. ఇదిలా ఉంటే గిరిజన తండాల్లో తాగునీటి కోసం ఉపయోగించే చేతిపంపుల మరమ్మతుకు వచ్చినా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు స్పందించటంలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగునీటి సమస్య ఉన్న గ్రామాలను గుర్తించి వెంటనే ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని ప్రజలు, ప్రజాప్రతినిధులు కోరుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment