సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య పెద్దగా ఉండకపోవచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యూఎస్) అంచనా వేస్తోంది. భూగర్భ జలాలతోపాటు చెరువుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో ఈ వేసవిలో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వేసవి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికను ఆర్‌డబ్ల్యూఎస్ సిద్ధం చేస్తుంటుంది.
ఈ ఏడాది జనవరి నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో ఏటా నీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లోని చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నట్టు జిల్లాల నుంచి నివేదికలు అందాయి. సాధారణంగా చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఏటా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన గ్రామాల్లో మూడొంతులు చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని గ్రామాలే ఉంటాయి. అయితే, ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం అత్యధికంగా వర్షాలు కురిసినట్టు అధికారులు చెబుతున్నారు.
ప్రత్యేకించి రాయలసీమలో జనవరి నెలలో సాధారణం కంటే 39.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో ఏటా నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో సాధారణం కంటే 55.9 శాతం అధిక వర్షాలు నమోదైనట్లు చెబుతున్నారు. మరోవైపు బోరు బావులు ఎండిపోయినట్టు ఏ ప్రాంతం నుంచి సమాచారం లేదని అధికారులు పేర్కొంటున్నారు.
ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాల్లో..
కాగా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్ పరిధిలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి వంటి ప్రాంతాల్లోని గ్రామాల్లో నడివేసవిలో మంచినీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జనవరిలో రాష్ట్రమంతటా అధిక వర్షాలు నమోదైనా.. ప్రకాశం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 4 శాతం తక్కువగా వర్షాలు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లోని పరిస్థితులపై అర్‌డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు రప్పించుకుంటున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు.
మార్చి మధ్యలో మరోసారి అంచనా
ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అన్ని గ్రామాల్లో ఇప్పుడు పుష్కలంగా నీరు అందుబాటులో ఉందని సమాచారం అందడంతో ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు జనవరి–ఫిబ్రవరిల్లో సిద్ధం చేయాల్సిన మంచినీటి సరఫరా కార్యాచరణ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మార్చి మొదటి వారం తర్వాత జిల్లాల నుంచి మరోసారి సమాచారం రప్పించుకుని యాక్షన్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్‌డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment