rws
-
నేడు ఆర్డబ్ల్యూఎస్ జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్
కర్నూలు (అర్బన్): గ్రామీణ నీటి సరఫరా విభాగం జోన్–4 ఇంజినీర్ల బదిలీల కౌన్సెలింగ్ ఈ నెల 27న ఉదయం 9.30 గంటల నుంచి కర్నూలులోని సర్కిల్ కార్యాలయంలో నిర్వహించనున్నట్లు పర్యవేక్షక ఇంజినీర్ బి.నాగేశ్వరరావు సోమవారం తెలిపారు. ఆర్డబ్ల్యూఎస్ చీఫ్ ఇంజనీర్ గాయత్రీదేవి పర్యవేక్షణలో ఈ కౌన్సెలింగ్ కొనసాగుతుందని చెప్పారు. జోన్–4 పరిధిలో ఉమ్మడి కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప, చిత్తూరు జిల్లాలకు చెందిన ఏఈఈ/ఏఈ, డీఈఈలు వస్తారని, ఏఈఈ/ఏఈలకు సంబంధించి 84 ఖాళీలు ఉండగా, 114 స్థానాలు ఖాళీ ఏర్పడబోతున్నాయని వివరించారు. డీఈఈలకు 11 స్థానాలు క్లియర్ వేకెన్సీ కాగా, మరో 11 స్థానాలు ఖాళీ కాబోతున్నాయన్నారు. బదిలీలకు అర్హులైన వారితో పాటు పలు కారణాలతో రిక్వెస్ట్ కోరుతూ మరికొందరు దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు. కౌన్సెలింగ్ నిర్వహించే సమయంలో కార్యాలయ ప్రాంగణంలోని నోటీస్ బోర్డులో ఖాళీలు, భర్తీ అయిన స్థానాల వివరాలను పొందుపరుస్తామని చెప్పారు. -
ప్రతి ఇంటికి సురక్షిత తాగునీరు
సాక్షి, అమరావతి: గ్రామాల్లోని ప్రతి ఇంటికి తాగునీటి కుళాయి అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని గ్రామీణ నీటి సరఫరా శాఖ (ఆర్డబ్ల్యూఎస్) ఇంజినీర్ ఇన్ చీఫ్ ఆర్.వి.కృష్ణారెడ్డి, తాగునీరు– పారిశుధ్యం ప్రాజెక్టు డైరెక్టర్ హరిరామ్ నాయక్ తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా అమలు చేస్తున్న జల్ జీవన్ మిషన్ ప్రాజెక్టుతో వంద శాతం ఇళ్లకు కుళాయి కనెక్షన్లు ఇస్తున్నామన్నారు. ఈ కార్యక్రమాన్ని సమర్థంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఎన్జీవోలతో కలిసి గ్రామాల్లో మంచినీరు, ఇంటింటికి నీటి కుళాయిల ప్రాధాన్యంపై ప్రచారం చేయనున్నట్టు వివరించారు. ఎంపిక చేసిన ఎన్జీవో ప్రతినిధులకు యునిసెఫ్ ఆధ్వర్యంలో మూడు రోజుల శిక్షణ తరగతులను బుధవారం విజయవాడలో ప్రారంభించారు. మాస్టర్ ట్రైనర్లుగా శిక్షణ పొందిన వీరు జిల్లాల వారీగా మరికొందరికి శిక్షణనిచ్చి గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించనున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. దాదాపు రూ.25 వేల కోట్ల ఖర్చుతో అన్ని గ్రామాల్లోను ఈ ప్రాజెక్టును అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 95 లక్షల కుళాయిలు ఇవ్వాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 40 లక్షల కుళాయి కనెక్షన్లు ఇచ్చినట్టు తెలిపారు. ఈ ప్రాజెక్టును 2024 నాటికి పూర్తి చేస్తామన్నారు. దీంతోపాటు మురుగు నీటి నిర్వహణ, నీటి సంరక్షణ, వర్షపు నీరు పునర్వినియోగంపై దృష్టి పెట్టినట్టు వివరించారు. ప్రజలకు అవగాహన కల్పించే విషయంలో ఎన్జీవోలకు అవసరమైన సాంకేతిక సహకారాన్ని యునిసెఫ్ అందిస్తున్నట్టు తెలిపారు. -
గ్రామగ్రామాన సు‘రక్షిత’ నీరు
సాక్షి, అమరావతి: గ్రామీణ ప్రాంతాల్లో అత్యంత సురక్షితమైన తాగు నీటిని ప్రజలకు అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పటిష్ట చర్యలు చేపడుతోంది. గ్రామాల్లో ప్రజలు తాగు నీటికి నిరంతరం పరీక్షలు నిర్వహిస్తోంది. ఎక్కడైనా కలుషితాలు ఉంటే, ఆ నీటి శుద్ధికి చర్యలు చేపడుతోంది. ఫ్లోరైడ్ తదితర కలుషితాల్లేవని నిర్ధారించుకున్నాక ప్రజలు వినియోగించుకోవడానికి అనుమతిస్తున్నారు. ఇప్పుడు గ్రామీణ మంచి నీటి సరఫరా కేంద్రాల నుంచి అందిస్తున్న తాగు నీటిలో 97.15 శాతం స్వచ్ఛమైనదని పరీక్షలు తేటతెల్లం చేస్తున్నాయి. 2021 ఆగస్టు నుంచి 2022 ఆగస్టు మధ్య ఏడాది కాలంలో మొత్తం 9,51,337 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించింది. గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖ ఆధ్వర్యంలో ప్రతి ఏటా వర్షాకాలం ప్రారంభమైన తర్వాత ఒక విడత అన్ని గ్రామాల్లో బోర్లు, బావులు, చెరువులు, మంచి నీటి సరఫరా పథకాల నీటికి ప్రభుత్వం పరీక్షలు చేస్తోంది. అవసరమైతే ఏడాదిలో రెండో సారి కూడా పరీక్షలు చేస్తున్నారు. పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాలు, సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్లలోని బోర్ల నీటికీ కూడా గత ఏడాది రెండు విడతలు కెమికల్, హానికర సూక్ష్మ క్రిముల పరీక్షలు చేసినట్లు ఎస్డబ్యూఎస్ఎం ప్రాజెక్టు డైరెక్టర్ హరే రామనాయక్, చీఫ్ కెమిస్ట్ కృష్ణమూర్తి ‘సాక్షి’కి తెలిపారు. గ్రామాలకే నీటి పరీక్ష కిట్లు సాధారణంగా గ్రామాల్లో తాగు నీటి శాంపిల్స్‌ను ఆర్‌డబ్ల్యూఎస్‌కు అనుబంధంగా పనిచేసే 107 ల్యాబ్‌లలో పరీక్షిస్తారు. గత మూడేళ్లుగా తాగే నీటి నాణ్యతపై అనుమానం కలిగినప్పుడు అక్కడికక్కడే పరీక్షించేందుకు ప్రభుత్వం అన్ని గ్రామాలకు ఎఫ్‌టీకే కిట్లను సరఫరా చేస్తోంది. వీటితో 8 రకాల ప్రమాదకర రసాయనాలను గుర్తించొచ్చు. ఒక్కొక్క కిట్‌తో వంద శాంపిల్స్‌ను పరీక్షించొచ్చు. ఈ ఏడాది ఈ కిట్లతో పాటు నీటిలో ప్రమాదకర బ్యాక్టీరియాను గుర్తించే హెచ్‌టూఎస్ కెమికల్ సీసాలను కూడా పంపిణీ చేశారు. మార్చిలోనే 7.50 లక్షల హెచ్‌టూఎస్ సీసీలు పంపిణీ చేసినట్టు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. నీటిని పరీక్షించే విధానంపై గ్రామ స్థాయి సిబ్బందికి శిక్షణ కూడా ఇచ్చారు. దేశంలో ఏపీనే ఫస్ట్ గడిచిన ఏడాది కాలంలో నీటి నాణ్యత పరీక్ష కేంద్రాల్లో (ల్యాబ్‌లలో) పరీక్షల నిర్వహణలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. గత ఏడాది ఆగస్టు 15 నుంచి ఈ ఏడాది ఆగస్టు 15 వరకు 6,12,458 శాంపిల్స్‌కు ల్యాబ్‌లలో కెమికల్, బ్యాకీరియా పరీక్షలు చేశారు. గ్రామాల్లోని ఎఫ్‌టీకే కిట్లతో మరో 3,38,879 పరీక్షలు జరిపారు. ఇలా పూర్తిస్థాయి శాస్త్రీయంగా ఉండే ల్యాబ్ పరీక్షల్లో ఏపీ తర్వాతి స్థానాల్లో తమిళనాడు (5.35 లక్షలు), పశ్చి మ బెంగాల్ (5.31 లక్షలు), మధ్య ప్రదేశ్ (5.28 లక్షలు) ఉన్నాయి. నాణ్యమైన నీరే రాష్ట్రంలోని గ్రామాల్లో తాగునీరు ఎంతో సురక్షితమైనదని అన్ని పరీక్షల్లోనూ నిర్ధారణ అయినట్టు అధికారులు వెల్లడించారు. ఏడాది మొత్తంలో చేసిన పరీక్షల్లో 97.15 శాతం నీరు సురక్షితమైనదని తేలింది. 2.85 శాతం శాంపిల్స్‌లో మాత్రమే కలుషిత కారకాలు గుర్తించారు. ల్యాబ్‌లో 6.12 లక్షల శాంపిల్స్‌కు పరీక్షలు చేయగా 25,140 నమూనాల్లో కలుషితాలను గుర్తించారు. 3.38 లక్షల ఎఫ్‌టీకే పరీక్షల్లో 3,077 నమూనాల్లో కలుషితాలు ఉన్నట్టు గుర్తించారు. కేరళ, గుజరాత్, కర్ణాటక, మహారాష్ట్ర, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాల్లోని గ్రామీణ నీటిలో అత్యధికంగా కలుషితాలు ఉన్నట్టు నిర్ధారణ అయింది. -
Andhra Pradesh: నీళ్లు.. ఫుల్లు
పల్నాడు జిల్లా ఈపూరు మండలం బొగ్గరం గ్రామ సమీపంలోని సమ్మర్ స్టోరేజి ట్యాంకు (మంచినీటి చెరువు) బొగ్గరం, చిన్న కొండాయపాలెం, పెద్ద కొండాయపాలెం, గుండేపల్లి గ్రామాల్లో ఉండే దాదాపు 1,200 కుటుంబాలకు మంచి నీరు అందిస్తుంది. పది రోజుల కిందట నాగార్జున సాగర్ ప్రాజెక్టు కుడి కాల్వకు సాగు నీటి విడుదల నిలిపివేసే సమయంలోనే ఉన్నతాధికారుల ఆదేశం మేరకు ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది ఈ ట్యాంకును నింపారు. ప్రస్తుతం చెరువు నీటిని మే, జూన్ నెలలు పూర్తిగా, జులై నెలలో దాదాపు సగం రోజులపైనే ఆ గ్రామాలకు సరఫరా చేయవచ్చని అధికారులు తెలిపారు. గుంటూరు జిల్లా తాడికొండ మండలం రావెల గ్రామంలో 1,480 కుటుంబాలు ఉంటాయి. ఆ గ్రామంలో నిరంతరం మంచినీటి సరఫరాకు ప్రత్యేకంగా సమ్మర్ స్టోరేజీ ట్యాంకు ఉంది. ఇది పూర్తిగా నిండుగా ఉంది. వచ్చే 120 రోజుల పాటు తాగునీటి సరఫరాకు ఎటువంటి ఇబ్బంది ఉండదని అధికారులు చెప్పారు. ఈ మండలంలో మొత్తం 8 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉండగా, అవన్నీ 90 శాతం నీటితో నిండి ఉన్నాయి. – సాక్షి, అమరావతి ఇవే కాదు.. రాష్ట్రంలోని అన్ని గ్రామీణ ప్రాంతాల్లో మంచినీటికి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం ముందస్తు ప్రణాళికతో అధిక శాతం చెరువులను నింపింది. రాష్ట్రవ్యాప్తంగా 1278 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులు ఉన్నాయి. వీటిలో 76 శాతానికి పైగా చెరువులు వేసవికి సరిపడా నీటితో నిండి ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు వెల్లడించారు. నాలుగో వంతు చెరువుల్లో మూడు నెలలకు సరిపడా నీరు ఉందని చెప్పారు. 60 శాతం చెరువుల్లో రెండు నెలలకు పైబడి నీరు ఉన్నట్టు తెలిపారు. 30 రోజులకు లోపు 57 చెరువుల్లోనే ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 31, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఆరు, ఉమ్మడి కృష్ణా జిల్లాలో మూడు, ప్రకాశం జిల్లాలో తొమ్మిది, కర్నూలు జిల్లాలో ఎనిమిది చెరువుల్లో నెల రోజుల లోపు అవసరమయ్యే నీరు ఉంది. ఆ ట్యాంకుల సామర్థ్యం తక్కువగా ఉన్నందువల్లే తక్కువ నీరు ఉన్నట్లు అధికారులు చెప్పారు. కేవలం 8 చెరువుల్లోనే వివిధ కారణాలతో నీరు లేదని తెలిపారు. ఈ ట్యాంకుల పరిధిలోని గ్రామాలకు వేసవిలో ట్యాంకర్ల ద్వారా లేదంటే బోర్ల ద్వారా నీటి సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు. రూ.42.53 కోట్లతో వేసవి తాగునీటి ప్రణాళిక వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అవకాశం ఉన్న గ్రామాల్లో ప్రత్యామ్నాయ మార్గాల్లో తాగునీరు సరఫరా చేసేందుకు ప్రభుత్వం రూ.42.53 కోట్లతో ముందస్తు ప్రణాళికను సిద్ధం చేసింది. ఆర్డబ్ల్యూఎస్ విభాగం గణాంకాల ప్రకారం గ్రామాలను 48 వేలకు పైబడి నివాసిత ప్రాంతాలుగా వర్గీకరించగా, అందులో ప్రస్తుతం ప్రకాశం జిల్లాలోని 105– 132 నివాసిత ప్రాంతాలకు మాత్రమే ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు కొనసాగుతుందని.. ఈ వేసవిలో అవసరమైతే గరిష్టంగా 1855 నివాసిత ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటి సరఫరాకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నట్టు అధికారులు తెలిపారు. ఎండలు మరింత పెరిగితే 242 నివాసిత ప్రాంతాల్లో పశువుల అవసరాలకు సైతం ఈ వేసవిలో ట్యాంకుల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం ఏర్పడొచ్చని ఆర్డబ్ల్యూఎస్ విభాగం ముందస్తు అంచనా వేసుకుంది. -
దేశంలోని అన్ని రాష్ట్రాల్లోకెల్లా ఏపీ తాగునీరే సేఫ్
సాక్షి, అమరావతి: దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోకెల్లా మన ఏపీలోని బోరు, బావుల్లోని తాగునీరే అత్యంత సురక్షితమని తేలింది. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి వరకు అన్ని రాష్ట్రాల గ్రామీణ ప్రాంతాల్లోని బోర్లు, బావుల నీటికి నిర్వహించిన నాణ్యతా పరీక్షల్లో వంద శాంపిల్స్కుగాను 14 నమూనాల్లో వివిధ రకాల కాలుష్య కారకాలను గుర్తించారు. కానీ, మన రాష్టంలో మాత్రం వందకు నాలుగు శాంపిల్స్‌లో మాత్రమే అవి ఉన్నట్లు తేలింది. ఈ పరీక్షల ఫలితాలను కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ తన అధికారిక వెబ్సైట్లో పొందుపర్చింది. అలాగే, ఏపీలో మూడు నాలుగేళ్ల కిందట నెలకొన్న తీవ్ర వర్షాభావ పరిస్థితులతో ఫ్లోరైడ్ ఆనవాళ్లు ఎక్కువగా కనిపించేవని.. అయితే, గత మూడేళ్లగా రాయలసీమ జిల్లాలతో సహా రాష్ట్రమంతటా సమృద్ధిగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాల్లో నీటి నాణ్యత చాలాబాగా మెరుగైనట్లు గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అధికారులు వెల్లడించారు. కాలుష్య కారకాలు.. వాటితో దుష్ఫలితాలు.. వైద్యులు పేర్కొంటున్న వివరాల ప్రకారం.. ► మెర్క్యూరీ ఉన్న నీటిని దీర్ఘకాలం తాగితే మనిషి నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ► క్లోరైడ్ కారకం ఉండే నీటిని తాగితే రక్తపోటు వ్యాధులకు గురవుతుంటారు. ► లెడ్ వంటివి చిన్న పిల్లల ఎదుగుదల మీద, పెద్దల్లో కిడ్నీలపై ప్రభావం చూపుతుంది. ► ఇక ఫ్లోరైడ్‌తో కీళ్ల వ్యాధులు రావడంతో చిన్న వయస్సులో పళ్లు దెబ్బతింటాయి. ఈ నేపథ్యంలో.. ప్రజల తాగునీటిలో కలుషిత కారకాలను గుర్తించడానికి ప్రభుత్వం ముందస్తుగానే ఎప్పటికప్పుడు నీటి నాణ్యత పరీక్షలు నిర్వహిస్తుంటుంది. మన రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఉండే 2.60 లక్షల బోర్లు, బావుల్లో నీటికి ఏటా ఒకసారి.. అలాగే, దాదాపు 50 వేలకు పైబడి రక్షిత మంచినీటి పథకాల ద్వారా సరఫరాచేసే నీటికి ఏటా రెండు విడతల చొప్పున ఆర్డబ్ల్యూఎస్ విభాగం, రాష్ట్ర ప్రభుత్వం ఈ పరీక్షలు చేపడుతుంది. ఇక ఆర్డబ్ల్యూఎస్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 107 నీటి నాణ్యత పరీక్షల ల్యాబ్‌లు ఉండగా, వాటిల్లో మొత్తం 21 రకాల కలుషిత కారకాలను గుర్తించే సౌలభ్యం ఉంది. పరీక్షల ఫలితాలను ఎప్పటికప్పుడు ఆ వెబ్సైట్లో పొందుపర్చాల్సి ఉంటుంది. పరీక్షల్లో మన రాష్ట్రమే ఫస్ట్ మార్చి నెలాఖరుతో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో దేశం మొత్తం మీద మన ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా నాణ్యత పరీక్షలు నిర్వహించారు. అన్ని రాష్ట్రాల్లో 47,03,476 నీటి శాంపిల్స్‌కు పరీక్షలు నిర్వహించగా.. అందులో మన రాష్ట్రం అత్యధికంగా 4,04,083 నమూనాలకు నిర్వహించింది. తర్వాత మధ్యప్రదేశ్ 4,01,022 శాంపిల్స్‌కు.. పశ్చిమ బెంగాల్లో 3,82,846 శాంపిల్స్‌కు పరీక్షలు జరిగాయి. మిగిలిన రాష్ట్రాల్లో ఎక్కడా 3 లక్షల మించి పరీక్షలు నిర్వహించలేదు. నీటి నాణ్యతలోనూ ఏపీ చాలా మెరుగు మరోవైపు.. గత ఏడాది ఏపీలో పరీక్షలు నిర్వహించిన 4,04,083 శాంపిల్స్‌లో కేవలం 16,801 నమూనాల్లోనే కాలుష్య కారక ఆనవాళ్లు గుర్తించారు. అంటే మొత్తం శాంపిల్స్‌లో ఇది 4.15 శాతం మాత్రమే. అదే సమయంలో దేశం మొత్తం మీద 47,03,476 నీటి శాంపిల్స్‌కు నిర్వహించిన పరీక్షల్లో 6,73,687 శాంపిల్స్‌లో కలుషిత కారకాలు బయటపడ్డాయి. అంటే ఇది 14.32 శాతం. పశ్చిమ బెంగాల్, కేరళ రాష్ట్రాల్లో అత్యధిక నీటి కాలుష్యం ఉన్నట్లు కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ గణాంకాలు పేర్కొన్నాయి. -
వేసవిలోనూ తాగునీరు పుష్కలం!
సాక్షి, అమరావతి: వచ్చే వేసవిలోనూ రాష్ట్రంలో తాగునీటి సమస్య పెద్దగా ఉండకపోవచ్చని గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అంచనా వేస్తోంది. భూగర్భ జలాలతోపాటు చెరువుల్లోనూ పుష్కలంగా నీరు ఉండటంతో ఈ వేసవిలో గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన అవసరం రాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు. సాధారణంగా ఏటా జనవరి లేదా ఫిబ్రవరి నెలల్లో వేసవి పరిస్థితిని ముందుగానే అంచనా వేసి కార్యాచరణ ప్రణాళికను ఆర్డబ్ల్యూఎస్ సిద్ధం చేస్తుంటుంది. ఈ ఏడాది జనవరి నెలలో కూడా సాధారణం కంటే ఎక్కువగా వర్షాలు కురవడంతో ఏటా నీటి ఎద్దడి తలెత్తే గ్రామాల్లోని చెరువుల్లో పుష్కలంగా నీళ్లు ఉన్నట్టు జిల్లాల నుంచి నివేదికలు అందాయి. సాధారణంగా చిత్తూరు, ప్రకాశం, అనంతపురం, గుంటూరు జిల్లాల్లోని పలు గ్రామాల్లో వేసవిలో నీటి ఎద్దడి ఎక్కువగా ఉంటుంది. ఏటా ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాల్సిన గ్రామాల్లో మూడొంతులు చిత్తూరు, ప్రకాశం జిల్లాలోని గ్రామాలే ఉంటాయి. అయితే, ఈ ఏడాది జనవరిలో రాష్ట్రవ్యాప్తంగా 16 శాతం అత్యధికంగా వర్షాలు కురిసినట్టు అధికారులు చెబుతున్నారు. ప్రత్యేకించి రాయలసీమలో జనవరి నెలలో సాధారణం కంటే 39.2 శాతం అధిక వర్షపాతం నమోదైంది. ఈ జిల్లాలో ఏటా నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లో సాధారణం కంటే 55.9 శాతం అధిక వర్షాలు నమోదైనట్లు చెబుతున్నారు. మరోవైపు బోరు బావులు ఎండిపోయినట్టు ఏ ప్రాంతం నుంచి సమాచారం లేదని అధికారులు పేర్కొంటున్నారు. ప్రకాశం జిల్లాలో కొన్ని గ్రామాల్లో.. కాగా, ప్రకాశం జిల్లాలోని మార్కాపురం డివిజన్ పరిధిలోని త్రిపురాంతకం, యర్రగొండపాలెం, పొదిలి, కనిగిరి వంటి ప్రాంతాల్లోని గ్రామాల్లో నడివేసవిలో మంచినీటి సమస్య ఉత్పన్నం అయ్యే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. జనవరిలో రాష్ట్రమంతటా అధిక వర్షాలు నమోదైనా.. ప్రకాశం జిల్లాలో మాత్రమే సాధారణం కంటే 4 శాతం తక్కువగా వర్షాలు నమోదైనట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ దృష్ట్యా ప్రకాశం జిల్లాలో నీటి ఎద్దడి ఎదుర్కొనే గ్రామాల్లోని పరిస్థితులపై అర్డబ్ల్యూఎస్ అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు రప్పించుకుంటున్నారు. ఎక్కడైనా సమస్య తలెత్తే అవకాశాలు ఉంటే యుద్ధప్రాతిపదికన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. మార్చి మధ్యలో మరోసారి అంచనా ఏటా వేసవిలో నీటి ఎద్దడి తలెత్తే అన్ని గ్రామాల్లో ఇప్పుడు పుష్కలంగా నీరు అందుబాటులో ఉందని సమాచారం అందడంతో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు జనవరి–ఫిబ్రవరిల్లో సిద్ధం చేయాల్సిన మంచినీటి సరఫరా కార్యాచరణ ప్రక్రియను తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. మార్చి మొదటి వారం తర్వాత జిల్లాల నుంచి మరోసారి సమాచారం రప్పించుకుని యాక్షన్ ప్లాన్‌పై తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించినట్లు ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారులు చెప్పారు. -
పురుగు మందుల అవశేషాలకు చెక్
సాక్షి, అమరావతి: తాగునీటిలో ఉండే పురుగు మందుల అవశేషాలను గుర్తించే అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబొరేటరీలు రాష్ట్రంలో అందుబాటులోకి రానున్నాయి. క్యాన్సర్ వంటి ప్రమాదకర వ్యాధులకు కారణమయ్యే లెడ్, మెర్క్యురీ, క్రోమియం వంటి లోహాలు తాగునీటిలో సూక్ష్మస్థాయిలో ఉన్నా ఈ అత్యాధునిక ల్యాబ్‌లు పసిగట్టేస్తాయి. గ్రామీణ ప్రజలు తాగునీటికి ఉపయోగించే బోరు బావులతోపాటు ప్రభుత్వ రక్షిత మంచినీటి పథకాల్లోని నీటి నమూనాలను గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో ఏటా రెండుసార్లు సేకరించి, నీటి నాణ్యతపై ఎప్పటికప్పుడు పరీక్షలు నిర్వహిస్తుంటారు. ఇందుకు గాను రాష్ట్ర, జిల్లా, డివిజన్ స్థాయిలో మొత్తం 112 నీటి పరీక్షా కేంద్రాలు పనిచేస్తున్నాయి. వీటిలో పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, పాలకొల్లుతోపాటు తూర్పు గోదావరి జిల్లా కాకినాడ, రాజమండ్రిలోని నీటి పరీక్షా కేంద్రాలను ఒక్కొక్కటీ రూ.6 కోట్లతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఆధునికీకరించింది. వీటిలో వినియోగించే అత్యాధునిక యంత్ర సామగ్రిని అమెరికా నుంచి దిగుమతి చేసుకుంది. ల్యాబ్‌ల నిర్వహణ సైతం అమెరికన్ సంస్థ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. 4 ల్యాబ్‌ల ఏర్పాటు పూర్తయి, ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తెలిపారు. మరో 4 ల్యాబ్‌ల ఆధునికీకరణకు ప్రతిపాదన జోన్ల వారీగా రాష్ట్రంలో మరో నాలుగు నీటి పరీక్షల ల్యాబ్‌లను కూడా ఈ తరహాలోనే ఆధునికీకరించేలా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలకు సంబంధించి విశాఖలో, రాయలసీమ నాలుగు జిల్లాలకు సంబంధించి కడపలో, విజయవాడలో ఒకటి, ప్రకాశం జిల్లాలో మరొకటి ఈ తరహా అత్యాధునిక ల్యాబ్‌ల ఏర్పాటుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఏలూరు ఘటన తర్వాత సీఎం ఆదేశాల మేరకు సుమారు ఏడాది క్రితం పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో అంతుచిక్కని సమస్యతో ఒకే రోజున పెద్ద సంఖ్యలో ప్రజలు అనారోగ్యం బారినపడ్డారు. పురుగు మందుల అవశేషాలతో కూడిన నీటిని తాగడం వల్లే ఆ సమస్య ఉత్పన్నమై ఉండొచ్చని నిపుణులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల కాలంలో వ్యవసాయ రంగంలో పురుగు మందుల వాడకం పెరగడం వల్ల నీటి కాలుష్యానికి ఎక్కువగా అవకాశం ఉందన్న అంశాన్ని అధికారులు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు. అయితే, తాగునీటిలో దాగి ఉండే పురుగుమందుల అవశేషాలను, మెర్క్యురీ వంటి ప్రమాదకర సూక్ష్మస్థాయి మెటల్స్ను గుర్తించడానికి నీటి పరీక్ష కేంద్రాలు ఇప్పటివరకు రాష్ట్రంలో అందుబాటులో లేవు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యాధునిక నీటి పరీక్షల ల్యాబ్‌ల ఏర్పాటుకు ఆదేశాలు జారీ చేశారు. దీంతో అధికారులు మొదటగా నాలుగు ల్యాబ్‌లను ఆధునికీకరించారు. -
లక్ష్యం మేరకు మంచినీటి కుళాయిలు
సాక్షి, అమరావతి: గ్రామాల్లో ప్రతి ఇంటికి మంచినీటి కుళాయి ఏర్పాటు ప్రక్రియ వేగవంతంగా చేపట్టాలని, లక్ష్యాలు నిర్దేశించుకుని గడువులోగా పనులు పూర్తి చేయాలని అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం అమలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ కార్యక్రమ అమలుకు సంబంధించి గ్రామీణ మంచినీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) అన్ని జిల్లాల ఎస్ఈలు, ఈఈ స్థాయి అధికారులతో సచివాలయంలో నిర్వహించిన వర్క్‌షాప్‌లో మంత్రి పెద్దిరెడ్డి పాల్గొని దిశానిర్దేశం చేశారు. కుళాయిల ఏర్పాటుకు సంబంధించి రెండ్రోజుల్లో టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టి వేగంగా పనులకు శ్రీకారం చుట్టాలని ఆదేశించారు. వారం తర్వాత మరోసారి పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తానన్నారు. బహిరంగ మల విసర్జన రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు ఆర్డబ్ల్యూఎస్, స్వచ్ఛాంధ్రప్రదేశ్ విభాగాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం వివిధ కార్యక్రమాలు అమలు చేస్తున్నట్టు వివరించారు. పనుల పురోగతిపై నిరంతర సమీక్ష డిసెంబర్ 31 నాటికి ఈ పనులు పూర్తి చేసేలా అధికారులు లక్ష్యం పెట్టుకోవాలని పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది అధికారులకు స్పష్టం చేశారు. పనుల పురోగతిపై నిరంతరం సమీక్షించాలని, టార్గెట్లు పెట్టుకోవాలని సూచించారు. అదే సమయంలో జాతీయ ఉపాధి హామీ పథకం, నాడు–నేడు పనులు కూడా సకాలంలో పూర్తి చేయాలన్నారు. వర్క్ షాపులో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సంపత్‌కుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పారుతున్నది కాలువ కాదు... సాగర్ నీరు
సాక్షి, తోకపల్లె (పెద్దారవీడు): మండలంలో తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి దేవాలయం పక్కనే ఉన్న సాగర్ ఎయిర్‌వాల్ లీకుతో నీరంతా వృథాగా పోతుంది. ఆర్డబ్ల్యూఎస్ మంచినీటి పథకం ద్వారా త్రిపురాంతకం మండలం దుపాడు చెరువు నుంచి తోకపల్లె, గొబ్బూరు, దేవరాజుగట్టు మీదుగా పెద్దసైజు నీటి పైపుల ద్వారా మార్కాపురం పట్టణానికి నీరు సరఫరా చేస్తున్నారు. అమరావతి– అనంతపురం జాతీయ రహదారిలోని తోకపల్లె గ్రామం ఆంజనేయస్వామి వద్ద పైపు ఎయిర్ వాల్ లీక్ కావడంతో పొలాల మీదుగా సాగర్ నీరంతా వృథాగా తీగలేరు కాలువలోకి వెళ్తున్నాయి. వేసవి కోసం పొదుపుగా నీటిని వాడుకోవాలని ప్రభుత్వం చెబుతున్నా అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎయిర్‌వాల్ లీకేజితో నీరంతా రోజూ కొన్ని వేల లీటర్ల నీరు నేలపావుతోంది. ఎయిర్‌వాల్ లీకేజి గురించి ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నీరు వదిలిన సమయంలో తీగలేరులోకి తాగునీరు వృథాగా పోతున్నా అధికారులు మాత్రం మరమ్మతులు చేయలేదని స్థానికులు విమర్శిస్తున్నారు. అసలే వేసవి కాలంలో ప్రజలు, పశువులు తాగునీటితో అల్లాడిపోతుంటే అధికారులు మాత్రం నిర్లక్ష్యంగా వ్యహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
డిప్యు‘టెన్షన్’!
– ఆర్డబ్ల్యూఎస్, పీఆర్లో నేతల పెత్తనం – అడుగులకు మడుగులొత్తే వారికే ప్రాధాన్యత – మానసిక ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్న ఉద్యోగులు – పంచాయతీరాజ్ శాఖలో ఒకే జేఈ మూడు చోట్ల విధులు – ఆదాయం తెచ్చి పెడితే కోరిన చోటుకు డిప్యూటేషన్ అనంతపురం సిటీ : గ్రామీణ రక్షిత మంచినీటి విభాగం (ఆర్డబ్ల్యూఎస్), పంచాయతీరాజ్ (పీఆర్) శాఖలో అధికార పార్టీ నేతల పెత్తనం పెరిగిపోయింది. తమకు కావలసిన వారిని కోరుకున్న చోటుకు డిప్యూటేషన్‌పై పంపాల్సిందే. మాట వినకుంటే ఉన్నతస్థాయి అధికారులకైనా ప్రత్యక్ష నరకం చూపుతున్నారు. తాజాగా ఈ శాఖలోని ఓ ఉన్నతాధికారి తనకు అనుకూలంగా పనులు చేసి పెట్టలేదన్న కారణంగా ఓ ప్రజాప్రతినిధి నేరుగా కార్యాలయానికి వచ్చి తీవ్రస్థాయిలో మందలించినట్లు తెలిసింది. మానసిక ఒత్తిడికి గురై కొందరు అధికారులు, ఉద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్న ఘటనలూ లేకపోలేదు. జిల్లా పరిషత్ సీఈఓ పర్యవేక్షణలో జరగాల్సిన డిప్యూటేషన్లను ఆయా శాఖల ఉన్నతాధికారులు తమ చేతుల్లోకి తీసుకుంటున్నారు. ఆదాయం తెచ్చిపెడితే కోరిన చోటుకు డిప్యూటేషన్ వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్యవసరమైతే తప్ప సీఈఓ స్థాయి అధికారి ఈ డిప్యూటేషన్లలో సిబ్బందిని విధులకు పంపరాదు. కానీ ఈ రెండు శాఖల్లో నిబంధనలు అమలు కావడం లేదు. ప్రధానంగా పంచాయతీరాజ్ శాఖలో లోపాయికారి ఒప్పందాలు చాలా ఎక్కువని ఉద్యోగులు వాపోతున్నారు. విధులక్కడ.. జీతమిక్కడ పంచాయతీరాజ్ శాఖలో ఐదేళ్లు పదవి కాలం పూర్తయిన వారికి తప్పని సరి బదిలీ ఉంటుంది. కాగా, ఉన్నతాధికారికి సన్నిహితంగా.. రాజకీయ నేతల అడుగులకు మడుగులు ఒత్తే వారికి కోరుకున్న చోటుకు పోస్టింగ్ ఇస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తాడిపత్రిలో డీఈ అసలు స్థానాన్ని వదిలేసి రాయదుర్గంలో విధులు నిర్వహిస్తున్నారు. జీతం తీసుకుంటోంది మాత్రం తాడిపత్రిలోనే... ఇందులో మరో విశేషం ఏమిటంటే అనంతపురం ఎస్ఈ ఆఫీసులో విధులు నిర్వహించే అధికారిని తాడిపత్రికి డిప్యూటేషన్‌పై పంపారు. జేఈ ఒకరే.. విధులు మూడు చోట్ల గుత్తిలో విధులు నిర్వహించాల్సిన జేఈ మడకశిరతో పాటు కదిరిలో కూడా జేఈగా కొనసాగుతున్నారు. జీతం గుత్తిలోనే తీసుకుంటున్నారు. ఇదెలా సాధ్యమని తోటి ఉద్యోగులు మండి పడుతున్నారు. ఎవరు చేతులు తడిపితే వారికి ఉన్నతాధికారులు జీ హుజూర్ అంటున్నారని విమర్శిస్తున్నారు. కణేకల్ జేఈగా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పుట్లూరులో జీతం తీసుకుంటున్నారు. ఇక ధర్మవరంలో విధులు నిర్వహించాల్సిన వ్యక్తి పెద్దవడుగూరులో డిప్యూటేషన్‌పై కొనసాగుతున్నారు. డిప్యూటేషన్ల విషయమై పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బారావును వివరణ కోరగా.. తాను కొత్తగా వచ్చానని, ఎవరెవరు ఎక్కడెక్కడ విధులు నిర్వహిస్తున్నారనే వివరాలు పూర్తిగా తెలియదని చెప్పారు. రెండ్రోజుల క్రితం యథాస్థానాలకు పంపాం - ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ, హరేరామ్‌నాయక్ రెండు రోజుల క్రితం 28 మంది డిప్యూటేషన్లను రద్దు చేసి యథాస్థానాలకు పంపాం. మొదటి నుంచి పోస్టింగ్ ఎక్కడకు వస్తే అక్కడికే అధికారులను పంపాం. వారికున్న ఇబ్బందుల రీత్యా విధులకు వెళ్లలేని స్థితిలో ఉంటే సర్కిల్ కార్యాలయంలోనే అవకాశం కల్పించాం. మా వద్ద డిప్యూటేషన్‌పై వెళ్లిన వారు లేరు. -
ప్రత్యామ్నాయమే శరణ్యం
- నీటి సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం కేఈ - గ్రామాల వారీగా ప్రతిపాదనలు పంపాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశం - తక్షణ పరిష్కారం కింద ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచన కర్నూలు(అగ్రికల్చర్): ‘జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఆర్డబ్ల్యూఎస్ ఆధికారులు అన్ని పంచాయతీలు, నివాసిత ప్రాంతాల్లో అధ్యయనం చేసి పక్కా ప్రణాళికలతో ప్రతిపాదనలు పంపితే తక్షణ చర్యలు తీసుకుంటాం.. అప్పటి వరకు సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయండి’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో నీటి సమస్య, పరిష్కారంపై ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్చార్జీలు, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా నీటి సమస్య తీవ్రత, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం కేఈ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుంకేసుల ద్యామ్లో నీరు అడుగంటిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులను అన్వేషించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమున్న గ్రామాల్లో నీటి వనరులు గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తే జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేస్తారని కేఈ ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు స్పష్టం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలకు జాప్యం లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశానికి నీటిపారుదల శాఖ సీఈ గైర్హాజరుకావడంపై కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు. గత ఏడాది బకాయిలు చెల్లించాలి... నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో గత ఏడాది ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రూ.1.32 కోట్ల బిల్లులను చెల్లిస్తే ఈ ఏడాది నీటి సరఫరాకు కంట్రాక్టర్లు ముందుకు వస్తారని పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. నంద్యాల మండలం కొత్తపల్లిలో సర్పంచ్ ప్రభుత్వ బోరు పైప్‌లైన్‌ను కట్ చేసి నీటి సరఫరాకు ఆటంకాలు కల్గిస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిద్ర పోతున్నారా అంటూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై విరుచుకు పడ్డారు. సోమవారం సాయంత్రానికి పైప్‌లైన్‌ను పునరుద్ధరించాలని, సర్వంచ్పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 8 గ్రామాలకు నీరు అందించే శ్రీరంగాపురం సీపీడబ్ల్యూ స్కీమ్‌ను పునరుద్ధరించాలని మంత్రి జిల్లా యంత్రాంగానికి సూచించారు. ఫైళ్లు తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు.. నీటి సమస్య పరిష్కారానికి సంబంధించిన ఫైళ్లను మీ దగ్గరకు తెచ్చేందుకు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు భయపడుతున్నారని డోన్ నియోజక టీడీపీ ఇన్చార్జీ కేఈ ప్రతాప్ పేర్కొనగా తప్పు చేసిన వారికే భయం ఉంటుందని, మిగతావారు ధైర్యంగా వస్తారని కలెక్టర్ బదులిచ్చారు. ప్రస్తుతం ఆన్లైన్ ఫైళ్లు కావడంతో ఆ సమస్య కూడా లేదన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సుంకేసుల డ్యామ్‌లో తుంగభద్ర నీటిని నిల్వ చేసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. అన్ని గ్రామాల్లో ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు. వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయండి నీటి సమస్య సమీక్షలో భాగంగా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆర్డబ్ల్యూఎస్ అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉన్న గ్రామాలకు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అయితే ఇందుకు వర్క్ ఆర్డర్ ఉండి తీరాలని తెలిపారు. సమస్య పరిష్కారానికి గ్రామ సభలతోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జీల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, ఎస్వీ మోహన్‌రెడ్డి, మణిగాంది, బుడ్డారాజశేఖర్‌రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ రవిబాబు తదితరులు పాల్గొన్నారు. -
నీరు ఉంటేనే అభివృద్ధి సాధ్యం
– ఆర్డబ్ల్యూఎస్ ఈఈ వెంకటరమణ కర్నూలు(అర్బన్): ఎక్కడ నీరు పుష్కలంగా ఉంటుందో అక్కడ అభివృద్ధి సాధ్యమవుతుందని గ్రామీణ నీటి సరఫరా విభాగం కర్నూలు ఈఈ వెంకటరమణ అన్నారు. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా బుధవారం సాయంత్రం జిల్లా పరిషత్‌లోని తన ఛాంబర్లో డివిజన్లోని డీఈఈ, ఏఈలతో నీటిని వృథా చేయరాదని ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఈఈ వెంకటరమణ మాట్లాడుతూ గ్రామాల్లో నీటిని పొదుపుగా వాడుకోవాలన్నారు. ఎక్కడైనా నీరు వృథా అవుతున్నట్లు సమాచారం వస్తే వెంటనే ఆర్డబ్ల్యూఎస్ సిబ్బంది చర్యలు చేపట్టాలన్నారు. మానవాళి మనుగడకు నీరు ఎంతో అవసరమన్నారు. ప్రస్తుత వేసవిలో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రజలకు అవసరాల మేరకు రక్షిత మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి విలువను ప్రజలకు తెలియజేసేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. సమావేశంలో కర్నూలు, డోన్, నందికొట్కూరు డీఈఈలు మురళీధర్‌రావు, సురేష్‌బాబు, ఏడుకొండలు, క్వాలీటి కంట్రోల్ డీఈఈ రషీద్‌ఖాన్‌తో పాటు డివిజన్లోని ఏఈలందరు హాజరయ్యారు. -
ఏసీబీకి పట్టుబడిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
-
ఏసీబీకి పట్టుబడిన ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు
రూ.6 లక్షలు తీసుకుంటూ పట్టుబడిన వైనం ఎస్ఈ, సూపరింటెండెంట్ ఆస్తులపై సోదాలు నల్లగొండ క్రైం: ఏసీబీ అధికారులు శుక్రవారం ఇద్దరు ఆర్డబ్ల్యూఎస్ అధికారు లను అరెస్టు చేశారు. నల్లగొండలో ఓ కాం ట్రాక్టర్ వద్ద రూ.6 లక్షలు లంచం తీసుకుం టుండగా గ్రామీణ తాగునీటి పథకం (ఆర్డబ్ల్యూఎస్) సూపరింటెండెంట్‌ను, ఇం దుకు ప్రోత్సహించిన ఎస్ఈని హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల నల్లగొండ విజిలెన్స్ విభాగంలో ఎస్పీ స్థాయి అధికారి భాస్కర్‌రావు లంచం తీసుకుంటుం డగా పట్టుబడిన విషయం మరువక ముందే మరో అవినీతి తిమింగలం ఏసీబీకీ చిక్కడం ఉద్యోగులను కలవరానికి గురి చేస్తోంది. ఇలా చిక్కారు.. హైదరాబాద్ ఎల్బీనగర్కు చెందిన శాస్త్రీ వివేకానందరెడ్డి పుష్కరాల సమయంలో నల్లగొండ జిల్లా పరిధిలోని ఆర్వో ప్లాంట్లు సహా మొత్తం 39 పనులను చేపట్టాడు. టెండర్ లేకుండా కాంట్రాక్టర్‌కు అప్ప గించడంతో పనులు పూర్తి చేశాడు. 30 పనులకు బిల్లులు చెల్లించగా, మిగిలిన తొమ్మిది పనులకు రూ.30 లక్షల బిల్లులు రావాల్సి వుంది. ఈ బిల్లుల కోసం కాం ట్రాక్టర్ మూడు రోజుల క్రితం సూపరిం టెండెంట్ లక్ష్మారెడ్డిని కలవగా రూ.6 లక్షల లంచం డిమాండ్ చేశారు. దీంతో వివేకా నందరెడ్డి ఏసీబీ నల్లగొండ డీఎస్పీ కోటేశ్వర్ రావుకు ఫిర్యాదు చేశాడు. మధ్యాహ్నం కాంట్రాక్టర్ నుంచి డబ్బులు తీసుకుంటుం డగా అక్కడే కాపుగాసిన ఏసీబీ అధికారులు లక్ష్మారెడ్డిని పట్టుకున్నారు. బిల్లుల రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఈని హైదరాబాద్‌లో.. లంచం విషయంలో లక్ష్మారెడ్డిని ప్రోత్సహిం చిన ఎస్ఈ రమణను ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకొని నల్లగొండకు తీసుకొచ్చారు. ఇద్దరి ఆస్తుల ను తనిఖీ చేస్తామని డీఎస్పీ చెప్పారు. -
కన్నీళ్లే!
– దాహార్తి తీర్చని జేసీ నాగిరెడ్డి పథకం – వృథాగా సంపులు, సబ్స్టేషన్లు – విలువైన పరికరాలకు భద్రత కరువు – నిర్వహణ బాధ్యత మరచిన ఆర్డబ్ల్యూఎస్ ––––––––––––––––––––––––––––––––– ఒకట్రెండు కాదు.. ఏకంగా 1,200 గ్రామాల దాహార్తి తీర్చేందుకు ఉద్దేశించిన పథకమది. వందలు, లక్షలు కాదు.. రూ.కోట్ల నిధులతో నిర్మాణం చేపట్టారు. తొలినాళ్లలో పనులు చకచకా సాగాయి. వాటిని చూసి ఇక తమ దాహార్తి తీరినట్లేనని ఆయా గ్రామాల ప్రజలు సంబరపడ్డారు. అయితే.. వారి ఆనందం ఎంతో కాలం నిలువ లేదు. పథకం నిరుపయోగంగా మారింది. సంపులు, సబ్స్టేషన్లు ఎందుకూ పనికి రాకుండా పోయాయి. విలువైన పరికరాలు కొన్ని మాయమయ్యాయి. మరికొన్ని తుప్పు పట్టిపోతున్నాయి. ఇదీ జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం తీరు. –––––––––––––––––––––––––––––––––––––– తాడిపత్రి : జిల్లాలోని ఐదు నియోజకవర్గాలకు రక్షిత నీటిని అందించాలన్న ఉద్దేశంతో జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకాన్ని చేపట్టారు. ఈ పథకం పరిధిలోకి తాడిపత్రి, శింగనమల, అనంతపురం, గుంతకల్లు, ధర్మవరం నియోజకవర్గాల్లోని 1,200 గ్రామాలు వస్తాయి. వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి 1.2 టీఎంసీల నీటిని శుద్ధి చేసి.. అనంతరం ఆయా గ్రామాలకు సరఫరా చేయాలన్న లక్ష్యంతో చేపట్టారు. ఇందుకోసం రూ.508 కోట్లు కేటాయించారు. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తయ్యాయి. ఐదింటికే నీరు ప్రస్తుతం ఈ పథకం ద్వారా రోజూ మూడు లక్షల లీటర్ల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అది కూడా తాడిపత్రి టౌన్, గన్నెవారిపల్లి, చల్లవారిపల్లి, జమ్ములపాడుకు సరఫరా చేస్తున్నారు. ఈ పథకం కింద ఒక్కో సంప్‌నకు రూ.60 లక్షల చొప్పున ఖర్చు పెట్టి మొత్తం 15 సంపులు నిర్మించారు. పంపింగ్ కేంద్రాలు, సబ్ స్టేషన్లు సైతం ఏర్పాటు చేశారు. ఇందులో రెండు మాత్రమే నడుస్తున్నాయి. మిగిలిన 13 సంపులు, పంపింగ్ కేంద్రాలు, సబ్స్టేషన్లు వథాగా మారాయి. పర్యవేక్షణ లేకపోవడంతో విలువైన పరికరాలకు భద్రత లేకుండా పోయింది. ఇప్పటికే కొన్ని పరికరాలను దుండగులు ఎత్తుకెళ్లారు. మరికొన్ని తుప్పుపట్టిపోతున్నాయి. సంపులు, సబ్స్టేషన్లు, పంపింగ్ హౌస్‌ల చుట్టూ కంపచెట్లు విపరీతంగా పెరిగిపోయాయి. అటువైపు వెళ్లేందుకు ఎవరూ సాహసించడం లేదు. రూ.కోట్ల విలువైన పథకం కళ్లెదుటే నిరుపయోగంగా మారినా ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పట్టించుకోవడం లేదు. పరికరాలను ఉపయోగించకపోయినా వాటిని సంరక్షించుకోవాల్సిన బాధ్యత ఉందన్న విషయాన్ని మరచిపోయారు. ప్రణాళిక రూపొందించాం – ఫయాజ్, డీఈ, జేసీ నాగిరెడ్డి పథకం సంపుల్లో రెండు మాత్రమే ఉపయోగిస్తున్నాం. మిగిలిన వాటిని పని చేసే స్థితికి తీసుకొచ్చేందుకు ప్రణాళిక తయారు చేశాం. దశల వారీగా చర్యలు తీసుకుంటాం. -
త్వరలోనే రక్షిత పథకాలు పూర్తి చేస్తాం
రణస్థలం : ఎచ్చెర్ల మండలం తమ్మినాయుడుపేట వద్ద ఉన్న భారీ రక్షిత మంచినీటి పథకంSద్వారా ఎచ్చెర్ల, లావేరు, రణస్థలం మండలాల్లోని 175 గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తామని ఆర్డబ్ల్యూఎస్ డీఈ పి.సూర్యనారాయణ తెలిపారు. ఇందుకోసం రూ.90 కోట్లతో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపామని చెప్పారు. రణస్థలం ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయానికి సోమవారం విచ్చేసిన ఆయన రికార్డులను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ రణస్థలం మండలంలోని పిషిణి, చిన్నపిషిణి, నెలివాడ గ్రామాల్లోని రక్షిత మంచినీటి పథకాలు త్వరలోనే పూర్తి చేస్తామని చెప్పారు. మోటార్లు, పైప్‌పులైన్ పనులకు ప్రభుత్వం 1.09 కోట్ల రూపాయలు మంజూరు చేసిందని వివరించారు. కొత్తముక్కాం, కొమరవానిపేట గ్రామాలకు రక్షిత పథకాలు ద్వారా తాగునీరు సరఫరా చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ జేఈ శివకుమార్ పాల్గొన్నారు. -
కీలక శాఖలు సీఎం చేతికి..
కేసీఆర్‌కు అదనంగా ఆర్డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల బాధ్యతలు మంత్రుల శాఖలు మార్చుతూ ఉత్తర్వులు జారీ కేటీఆర్‌కు మున్సిపల్, ఐటీలకుతోడు పరిశ్రమలు, గనులు, ఎన్నారై వ్యవహారాలు జూపల్లికి పంచాయతీరాజ్ శాఖతో సర్దుబాటు తలసానికి పశుసంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలు పోచారం శ్రీనివాసరెడ్డికి సహకారం.. హరీశ్ శాఖల్లో కోత సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కీలకమైన శాఖల బాధ్యతలు నేరుగా సీఎం కేసీఆర్ పరిధిలోకి వెళ్లిపోయాయి. ఎంతో ప్రధానమైన ఆర్డబ్ల్యూఎస్, వాణిజ్య పన్నుల శాఖలను కేసీఆర్ తన పరిధిలోకి తీసుకున్నారు. దీంతోపాటు మంత్రులు కె.తారకరామారావు, హరీశ్‌రావు, జూపల్లి కృష్ణారావు, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పోచారం శ్రీనివాసరెడ్డి, జగదీశ్‌రెడ్డిల శాఖల్లో మార్పులు చేశారు. ముఖ్యమంత్రి తుది ఆమోదం మేరకు సోమవారం అధికారికంగా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈ కేటాయింపులపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ నోటిఫికేషన్ జారీ చేశారు. దీని ప్రకారం ముఖ్యమంత్రి తన దగ్గరున్న శాఖలకు అదనంగా గ్రామీణ నీటి సరఫరా, వాణిజ్య పన్నుల శాఖల బాధ్యతలు తీసుకున్నారు. తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ను కీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతల నుంచి తప్పించి.. పశు సంవర్థకం, మత్స్య, డెయిరీ అభివృద్ధి శాఖలను కేటాయించారు. ఇవన్నీ ప్రస్తుతం మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి దగ్గరున్నాయి. వీటిని తొలగించడంతోమిగిలిన వ్యవసాయ శాఖకు అదనంగా సహకార శాఖను పోచారానికి అప్పగించారు. మంత్రి కె.తారకరామారావుకు మరిన్ని కీలక బాధ్యతలు కట్టబెట్టారు. మున్సిపల్, ఐటీ శాఖలకు తోడుగా పరిశ్రమలు-వాణిజ్యం, ప్రభుత్వ రంగ సంస్థలు, గనులు-భూగర్భ వనరులు, ఎన్నారై వ్యవహారాల శాఖలను అప్పగించారు. పరిశ్రమలు-వాణిజ్య శాఖకు ఇప్పటివరకు జూపల్లి కృష్ణారావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇప్పుడు ఆయనకు కేటీఆర్ పరిధిలోని పంచాయతీరాజ్ శాఖను అప్పగించి సర్దుబాటు చేశారు. హరీశ్‌రావు విజ్ఞప్తి మేరకే.. మంత్రి హరీశ్‌రావుకు మొదట కేటాయించిన శాఖల్లో మరోసారి కోత పడింది. ఇప్పటికే జరిగిన స్వల్ప మార్పుల్లో ఆయన దగ్గరున్న సహకార శాఖను తొలగించగా... ఇప్పుడు గనులు, భూగర్భ వనరుల శాఖ బాధ్యతల నుంచి తప్పించారు. వాస్తవానికి సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, మార్కెటింగ్, శాసనసభా వ్యవహారాల శాఖలతో తనపై పనిభారం పెరిగినందున... గనులు, భూగర్భ వనరుల శాఖను మరొకరికి అప్పగించాలని హరీశ్‌రావు స్వయంగా మూడు నెలల కింద సీఎంకు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది. కొత్తగా గ్రామీణ నీటి సరఫరా శాఖ ప్రభుత్వం కొత్తగా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) శాఖను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు ఈ విభాగం పంచాయతీరాజ్‌లో అంతర్భాగంగా ఉండేది. ఇంటింటికీ తాగునీటిని సరఫరా చేసేందుకు చేపట్టిన మిషన్ భగీరథ పథకాన్ని ఐదేళ్లలో పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న నేపథ్యంలో... ముఖ్యమంత్రి ఈ శాఖను ప్రతిష్టాత్మకంగా స్వీకరించినట్లు పార్టీ శ్రేణులు చెబుతున్నాయి. దీంతోపాటు రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకుకీలకమైన వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు చేపట్టడం గమనార్హం. -
‘స్వచ్ఛత’వైపు అడుగులేయండిలా..
రాయవరం : స్వచ్ఛభారత్ పథకంలో భాగంగా ప్రతి ఇంటికీ ఓ మరుగుదొడ్డి ఉండాలని ప్రభుత్వం చెబుతోంది. వాటి నిర్మాణం కోసం పేదలకు ఆర్థిక సాయం కూడా అందిస్తోంది. వ్యక్తిగత మరుగుదొడ్డి నిర్మాణానికి దరఖాస్తు చేసుకునే విధానం.. ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం వివరాలివీ.. ఎవరు అర్హులంటే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా గ్రామీణ నీటి సరఫరా (ఆర్డబ్ల్యూఎస్) విభాగం ఆధ్వర్యాన పేదలకు మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టాయి. తెలుపురంగు రేషన్‌కార్డు, ఆధార్ కార్డు కలిగిన వారు ప్రభుత్వ ఆర్థిక సాయంతో మరుగుదొడ్లు నిర్మించుకోవడానికి అర్హులు. మరుగుదొడ్డి నిర్మించుకోవాలనుకునేవారు ముందుగా దరఖాస్తు పూర్తి చేసి, రేషన్, ఆధార్‌కార్డులు, బ్యాంకు పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను జత చేసి పంచాయతీ కార్యదర్శికి అందజేయాలి. లబ్ధిదారులను ఇలా ఎంపిక చేస్తారు వచ్చిన దరఖాస్తులను పంచాయతీ కార్యదర్శి పరిశీలించి పంచాయతీ పాలకవర్గంలో తీర్మానం చేసి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. ఎంపికైనవారి జాబితాను ఎంపీడీవోకు పంపిస్తారు. ఆయన ఆ జాబితాను ఆర్డబ్ల్యూఎస్ పర్యవేక్షక ఇంజనీర్‌కు పంపిస్తారు. అక్కడ పరిశీలన అనంతరం ఆ దరఖాస్తులు జిల్లా కలెక్టర్‌కు చేరుతాయి. కలెక్టర్ ఆమోదంతో మరుగుదొడ్లు మంజూరవుతాయి. కొలతల ప్రకారం నిర్మాణం అధికారులు ఇచ్చిన కొలతల ప్రకారమే లబ్ధిదారులు మరుగుదొడ్డి నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇవి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి ఆరడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పు, రెండోది నాలుగు అడుగుల పొడవు, మూడడుగుల వెడల్పు. ఏ కొలత ప్రకారం నిర్మించుకున్నా పైకప్పుగా రేకు వేసుకోవాలి. ఆర్థిక సాయం ఎంతంటే.. లబ్ధిదారుడు నిర్మించుకున్న మరుగుదొడ్డి కొలతలనుబట్టి ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుంది. ఆరడుగుల పొడవు, నాలుగడుగుల వెడల్పున నిర్మించుకుంటే రూ.15 వేలు, నాలుగడుగుల పొడవు, మూడడుగుల వెడల్పున నిర్మించుకుంటే రూ.12 వేలు చొప్పున లబ్ధిదారునికి రెండు దశల్లో చెల్లిస్తారు. ఈ మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం 25 శాతం, కేంద్ర ప్రభుత్వం 75 శాతం సమకూరుస్తాయి. ఈ సాయాన్ని లబ్ధిదారుని బ్యాంకు ఖాతాకు నేరుగా జమ చేస్తారు. -
పని చేయని ‘పథకం’
గుర్ల: అసలే వర్షా కాలం..ఆపై తాగు నీరు స్తంభించిందంటే గ్రామీణ ప్రజల అవస్థలు చెప్పనక్కర్లేదు. ఇదే పరిస్థితిన ఎదుర్కొంటున్నారు మండలంలోని ఎస్ఎస్ఆర్పేట, మణ్యపురిపేట, రాగోలు తదితర గ్రామాల ప్రజలతో పాటు నెల్లిమర్ల మండలంలోని గుషిణి, జోగిరాజుపేట తదితర 52 గ్రామాల ప్రజలు. ఆయా గ్రామా లకు తాగు నీటిని అందించేందుకు ప్రభుత్వం రామతీర్థం రక్షిత మంచినీటి పథకాన్ని ఏర్పాటు చేసింది. పథకం ఆరంభించినప్పటి నుంచి నిర్వహణ లోపం వెంటాడుతోంది. అయితే ఇటీవల పథకం తీరు మరీ అధ్వానంగా తయారైంది. ఈ పథకానికి సంబంధించిన పంపుహౌస్, మోటార్లు ఎస్ఎస్ఆర్పేట సమీపంలో ఉన్న చంపావతి నదిలో ఉన్నాయి. పథకం ద్వారా శుద్ధి చేసిన తాగునీరు పైపులైన్ల ద్వారా 52 గ్రామాలకు సరఫరా అవ్వాలి. అయితే వారం రోజుల క్రితం పంపుహౌస్‌లో ఉన్న మోటార్లు పనిచేయకపోవడంతో గ్రామాలకు తాగు నీరు సరఫరా కావడం లేదు. ఆయా గ్రామాల నుంచి తాగు నీరు అందడం లేదని ప్రతిరోజూ ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో పాటు సంబంధిత నిర్వాహకులకు ఎన్ని ఫిర్యాదులిచ్చినా, ఫోన్లు చేసినా ప్రయోజనం లేకపోతోందని పలు గ్రామాల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తరుచూ లో, హై ఓల్టేజీతో మోటార్లు పాడవుతున్నప్పటికీ అధికారులు, కాంట్రాక్టర్లు పట్టించుకోకపోవడం సాధారణమైపోయిందని సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నీటి కోసం గ్రామ సమీపంలో ఉన్న బావులను ఆశ్రయిస్తున్నారు. మరి కొన్ని గ్రామాల్లో బావుల్లోని నీరు కలుషితం కావడంతో రోగాల బారిన పడుతున్నట్లు పలువురు వాపోతున్నారు. ప్రజాప్రతినిధులు, అధికారులు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
మలి దశలో పట్టణ వాటర్‌గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టు తొలి దశలో గ్రామీణ ప్రాంత పనులే జరపాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) ఆధ్వర్యంలో జరగనున్న పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే.. పట్టణ ప్రాంతాల్లో వాటర్‌గ్రిడ్ నిర్మాణ పనులను ప్రారంభించనుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఒకేసారి పనులు చేపడితే ప్రయోజనం ఉండదనే అభిప్రాయానికి ప్రభుత్వం వచ్చింది. పట్టణ శివార్ల వరకు ప్రాజెక్టు పనులన్నీ ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలోనే జరపాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. ఆర్డబ్ల్యూఎస్ పట్టణాల శివార్ల వరకు ప్రధాన పైప్లైన్లు వేస్తే, మునిసిపాలిటీలు అక్కడి నుంచి నీటిని తరలించుకుని పట్టణ ప్రజలకు సరఫరా చేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఈ నేపథ్యంలో దాదాపు రూ.35 వేల కోట్ల అంచనా వ్యయంతో ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంతాల్లో పనులను ప్రారంభించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ పనులను 26 ప్యాకేజీలుగా విభజించి 11 ప్యాకేజీల పనులకు టెండర్లను ఆహ్వానించారు. ఈ నెలాఖరులోగా మిగిలిన 15 ప్యాకేజీలకూ టెండర్లను ఆహ్వానించేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ పనులు కొలిక్కి వచ్చిన తర్వాతే పట్టణ ప్రాంతాల్లో పనులు ప్రారంభం కానున్నాయి. ఆర్డబ్ల్యూఎస్ ఆధ్వర్యంలో తాగునీటి వనరుల అనుసంధానం పూర్తయిన తర్వాతే పట్టణాల్లో సర్వీసు రిజర్వాయర్లు, క్లియర్ వాటర్ ఫీడర్ మెయిన్స్, డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్, ఇంటింటికి నల్లా కనెక్షన్ తదితర పనులను చేపట్టనున్నారు. 2035 అవసరాలకు తగ్గట్లు.. వాటర్‌గ్రిడ్ కింద పట్టణ ప్రాంతాల్లో చేపట్టాల్సిన పనులకు ప్రభుత్వం నుంచి పరిపాలనపర అనుమతులు రాలేదు. జీహెచ్ఎంసీ మినహా రాష్ట్రంలోని 67 మునిసిపాలిటీల్లో ఇంటింటికి నీటి సరఫరా కోసం రూ.3,038 కోట్లతో పనులు చేయాల్సి ఉందని పబ్లిక్ హెల్త్, మునిసిపల్ ఇంజనీరింగ్ విభాగం ప్రభుత్వానికి ప్రతిపాదనలు సమర్పించింది. 2035 సంవత్సరం నాటికి పట్టణ జనాభా అవసరాలకు తగ్గట్లు తాగునీటి సరఫరా వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు ఈ నిధులతో పనులను చేపట్టనుంది. ఈ ప్రతిపాదనలపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. మరోవైపు హడ్కో నుంచి రుణం అందిన తర్వాతే ఈ పనులకు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. -
వా(ట)ర్ గ్రిడ్
సాక్షి, హైదరాబాద్: నగర, పట్టణ ప్రాంతాల్లో సైతం డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ పథకం నిర్మాణ బాధ్యతలను గ్రామీణ నీటి సరఫరా విభాగానికే (ఆర్డబ్ల్యూఎస్) అప్పగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గ్రిడ్ నిర్మాణ బాధ్యతల నుంచి ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగాన్ని తప్పించాలని కొందరు ఉన్నతాధికారులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నట్లు సమాచారం. సొంత నియోజకవర్గ కేంద్రమైన ‘గజ్వేల్’ పట్టణంలో గ్రిడ్ నిర్మాణ పనులను ఆర్‌డబ్ల్యూఎస్‌కే అప్పగించాలని సీఎం కేసీఆర్ ఆదేశించడం చర్చకు దారితీసింది. వాటర్ గ్రిడ్ పనులపై ఆయన సోమవారం క్యాంపు కార్యాలయంలో మంత్రి కె.తారకరామారావు, ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, పురపాలక శాఖ డెరైక్టర్ బి.జనార్దన్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ ఈఎన్సీ సురేందర్ రెడ్డితో సమీక్షించారు. ఈ సందర్భంగా ఈ నిర్ణయం తీసుకోవడం ఈ చర్చకు బలాన్ని చేకూరుస్తోంది. ప్రపంచ బ్యాంక్ రుణం రూ.60 కోట్లతో గజ్వేల్‌లో పథకం పనులను ఆర్డబ్ల్యూఎస్ నిర్వహిస్తుండగా.. వాటర్ గ్రిడ్ పనుల్నీ అదే విభాగానికి అప్పగించాలని నిర్ణయించినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. భారీ ప్రాజెక్టుల నిర్మాణంలో ఆర్‌డబ్ల్యూఎస్‌తో పోల్చితే ప్రజారోగ్య ఇంజనీరింగ్ విభాగం ముందుంది. కానీ దాన్ని శివార్లలోని ఆర్డబ్ల్యూఎస్ పైప్లైన్ల నుంచి నీటిని తీసుకుని శుద్ధి చేసి ఇంటింటికి సరఫరా చేయడం వరకే పరిమితం చేశారు. తాజా సమాచారంతో పబ్లిక్ హెల్త్ ఇంజనీర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -
ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయంలో డ్రైవర్ ఆత్మహత్య
పశ్చిమగోదావరి: విధులు నిర్వర్తించేందుకు వచ్చిన వ్యక్తి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జిల్లాలోని తణుకు ఆర్డబ్ల్యూఎస్(తాగునీటి సరఫరా) కార్యాలయంలో చోటుచేసుకుంది. డ్రైవర్‌గా ఆర్డబ్య్లూఎస్లో విధులు నిర్వర్తిస్తున్న పెంటయ్య(52) ఈ రోజు(మంగళవారం) ఉదయం కార్యాలయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. కాగా.. ఆర్థీక ఇబ్బందుల వల్లె ఆత్మహత్యకకు పాల్పడి ఉంటాడని స్థానికులు భావిస్తున్నారు. -
జలదరింపే!
సీపీడబ్ల్యూఎస్ పథకాల నిర్వహణ నుంచి తప్పుకొన్న ఆర్డబ్ల్యూఎస్ ఈ పథకాల బాధ్యతంతా జలమండలి పరిధిలోకి.. నీటి చార్జీల వసూలు మొదలు కేటాయింపులపై వాటర్‌బోర్డుదే తుదినిర్ణయం సాక్షి, రంగారెడ్డి జిల్లా : జిల్లాలో సమగ్ర రక్షిత మంచినీటి పథకాల (సీపీడబ్ల్యూఎస్) అమలు బాధ్యత నుంచి గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్) తప్పుకుంది. ఈ పథకాల నిర్వహణను జలమండలి (హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బీ)కి అప్పగించింది. ఇకపై పథకాల నిర్వహణతోపాటు పర్యవేక్షణ బాధ్యతలన్నీ జలమండలే చూసుకోనుంది. నీటి కేటాయింపులు మొదలు.. చార్జీల వసూలులో వాటర్‌బోర్డు అధికారుల నిర్ణయమే కీలకం కానుంది. ప్రస్తుతం జిల్లాలో 11 సీపీడబ్ల్యూఎప్ పథకాలు కొనసాగుతున్నాయి. వీటి ద్వారా ఔటర్ రింగ్‌రోడ్డు లోపల, వెలుపల ఉన్న 161 గ్రామ పంచాయతీలు, హాబిటేషన్లలోని ప్రజలకు రక్షిత నీటిని అందిస్తోంది. బకాయిలపై బ్రహ్మాస్త్రమే..! ఇప్పటివరకు ఆర్డబ్ల్యూఎస్ విభాగం ఆధీనంలో ఉన్న సీపీడబ్ల్యూఎస్ పథకాలన్నీ తాజాగా జలమండలి పరిధిలోకి వచ్చాయి. జిల్లాలో నీటి బకాయిలపై గత కొన్నేళ్లుగా పేచీ పెడుతున్న వాటర్‌బోర్డు అధికారులు.. ప్రస్తుత బకాయిలపై కఠినంగా వ్యవహరించనున్నారు. గతేడాది ఏప్రిల్ వరకు జిల్లా యంత్రాంగం వాటర్‌బోర్డుకు రూ.86.50 కోట్లు బకాయిపడింది. బకాయిల చెల్లించాలంటూ రెండు, మూడు సార్లు నీటి సరఫరాను నిలిపివేసిన సందర్భాలున్నాయి. ఈ క్రమంలో తాజాగా సీపీడబ్ల్యూఎస్ పథకాల పగ్గాలు తీసుకున్న జలమండలి యంత్రాంగం.. బకాయిలపై సర్‌చార్జీలతో సహా వసూళ్ళుకు దిగనుందని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఆర్థికసంఘం నిధులకు మంగళం.. గ్రామీణ ప్రాంతాల్లో రక్షిత మంచినీటి సరఫరాకు ఫైనాన్స్ కమిషన్ ప్రత్యేకంగా నిధులిస్తోంది. గత 13వ ఆర్థిక సంఘం ద్వారా ఏటా రూ.13.25 కోట్లు జిల్లాకు విడుదలయ్యేవి. వీటిని నేరుగా తాగునీటి అవసరాల్లో భాగంగా జలమండలికి బిల్లుల రూపంలో నిధులు చెల్లించేవారు. ప్రస్తుతం సీపీడబ్ల్యూఎస్ పథకాలపై జిల్లా గ్రామీణ నీటిసరఫరా విభాగం తప్పుకోవడంతో ఆ నిధులు ఆర్డబ్ల్యూఎస్ ఖాతాకు వచ్చే అవకాశంలేదని ఆ శాఖ అధికారి ఒకరు ‘సాక్షి’తో పేర్కొన్నారు. కొత్త పథకాలు గగనమే.. ఇదిలాఉండగా కొత్త పథకాలపై జలమండలి ఆచితూచి స్పందించనుంది. ప్రస్తుత పథకాలకు సంబంధించి భారీ బకాయిలున్న నేపథ్యంలో కొత్త పథకాలు అంత త్వరగా కార్యరూపం దాల్చే అవకాశంలేదని తెలుస్తోంది. జిల్లాలో కొత్తగా ఆరు సీపీడబ్ల్యూఎస్ పథకాలు చేపట్టాలని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రణాళికలు రూపొందించింది. వీటికిగాను రూ. 36.16కోట్లు అవసరమని గుర్తిస్తూ ప్రభుత్వానికి నివేదికలిచ్చింది. తాజాగా సీపీడబ్ల్యూఎస్ పథకాలన్నీ జలమండలి ఖాతాలోకి వెల్లడంతో గత బకాయిలు వసూళ్ల ప్రక్రియ పూర్తయితే తప్ప కొత్తవి చేపట్టే అవకాశంలేదని తెలుస్తోంది. -
స్వచ్ఛ గోదావరి నిధులెక్కడ
ఏలూరు :పుష్కరాల నేపథ్యంలో గోదావరి నదికి సమీపంలోని 60 గ్రామాల్లో మరుగుదొడ్లు, డ్రెయిన్లు నిర్మించేం దుకు నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించింది. ‘స్వచ్ఛ గోదావరి’ పేరిట ఉభయ గోదావరి జిల్లాల్లో ఈ పనులు చేపడతామని కేంద్ర తాగునీటి, పారిశుధ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. తక్షణమే ప్రతిపాదనలు పంపించాలని గత ఏడాది నవంబర్‌లో ఆదేశాలిచ్చింది. ప్రతిపాదనలు రూపొందించిన జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్‌డబ్ల్యుఎస్) ఈ పనులకు రూ.45 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసింది. అయితే, నేటికీ కేంద్ర ప్రభుత్వం ఈ పనుల ఊసెత్తడం లేదు. కేంద్రం ఇస్తానన్న నిధులతో గోదావరి నదిని ఆనుకుని ఉన్న ఆచంట, యలమంచిలి, కొవ్వూ రు, నరసాపురం, నిడదవోలు, పెనుగొండ, పెరవలి, తాళ్లపూడి, పోల వరం, వేలేరుపాడు, కుకునూరు మండలాల్లోని 60 గ్రామాల్లో వివిధ పనులు చేపట్టాలని జిల్లా గ్రామీణ నీటి సరఫరా విభాగం తలపోసింది. స్వచ్ఛ గోదావరి కార్యక్రమం కింద 16వేల మరుగుదొడ్లు నిర్మించాలని, పుష్కరాలకు లక్షలాదిగా తరలివచ్చే యాత్రికుల కోసం ఆయా మండలాల్లో కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మించాల్సి ఉందని ప్రతిపాదించారు. 60 గ్రామాల్లో డ్రెరుునేజీ వ్యవస్థను వేగవంతంగా అభివృద్ధి చేయాలని భావిం చారు. ప్రతిపాదనలు పంపి మూడు నెలలు కావస్తున్నా కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు నిధుల ఊసెత్తడం లేదు. చివరి క్షణాల్లో నిధులిస్తే ప్రయోజనం లేదు పుష్కరాల పనులకు అన్ని శాఖలు టెండర్లు పిలుస్తున్నారుు. కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్న నిధులు ఊడిపడకపోవడంతో ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు ఏం చేయూలో తెలియక దిక్కులు చూస్తున్నారు. ఏప్రిల్ నెలలో నిధులు విడుదల చేస్తే పనులు చేపట్టలేక ఇబ్బం దులు పడతామన్న అభిప్రాయం ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల నుంచి వ్యక్తం అవుతోంది. ఈ నిధుల విషయమై తమకు ఎలాంటి సమాచారం లేదని జిల్లా పంచాయతీ అధికారి ఎల్.శ్రీధర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు చెబుతున్నారు. -
బకాయిలు కట్టాల్సిందే!
- ఆర్‌డబ్ల్యూఎస్‌పై హెచ్ఎండబ్ల్యూఎస్ ఒత్తిడి - రూ.20 కోట్లు పేరుకు పోయినట్లు నోటీసులు - తలలుపట్టుకుంటున్న గ్రామీణ నీటి సరఫరా అధికారులు - బిల్లులు కట్టాలని పంచాయతీలకు నోటీసులు యాచారం: నీటి బిల్లుల బకాయిల కథ మళ్లీ మొదటికొచ్చింది. వెంటనే బిల్లులు చెల్లించాలంటూ గ్రామీణ నీటి సరఫరా విభాగం (ఆర్డబ్ల్యూఎస్)పై హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లయ్ అండ్ సివరేజ్ బోర్డు (హెచ్ఎండబ్ల్యూఎస్) ఒత్తిడి తెస్తోంది. కొన్నేళ్లుగా కృష్ణా జలాలు వాడుకుంటున్నందుకు రూ.20 కోట్ల బకాయిల్ని తక్షణమే చెల్లించాలని నోటీసులు పంపించింది. లేకుంటే నీటి సరఫరా కష్టమని తేల్చిచెప్పింది. దీంతో వేసవిలో తాగునీరు ఎలా అందించాలో తెలియక ఆర్డబ్ల్యూఎస్ అధికారుల్లో ఆందోళన మొదలైంది. యాచారం మం డలం గునుగల్ కృష్ణా జలాల రిజర్వాయర్ నుంచి ఇబ్రహీంపట్నం డివిజన్ పరిధిలోని 4 మండలాలు, మహేశ్వరం మండలంలోని గ్రామాలకు తాగునీరు సరఫరా చేస్తున్నారు. హయత్‌నగర్ మండలంలోని ప్రజలు తాగునీటి బిల్లులు ప్రతి నెలా చెల్లిస్తుండడంతో ఆ మండలంలో ఇబ్బంది ఉండడం లేదు. కానీ ఇబ్రహీంపట్నం, యాచారం, మంచాల, కందుకూరు మండలాల్లో 134 గ్రామాలకు కృష్ణా జలాలు సరఫరా చేస్తున్నందుకు గాను పంచాయతీలు బిల్లులు చెల్లించడంలేదు. గునుగల్ రిజర్వాయర్ నుంచి నాలుగు మండలాలకు నిత్యం 70 లక్షల లీటర్ల నీటిని వాడుకుంటున్నారు. ప్రతి నెల రూ.20 లక్షలు చెల్లిస్తున్నా.. గునుగల్ రిజర్వాయర్లోంచి 2007 నుంచి డివిజన్లోని పలు గ్రామాలకు హెచ్ఎండబ్ల్యూఎస్ కృష్ణా జలాలను సరఫరా చేస్తోంది. ప్రారంభం నుంచే నీటి సరఫరా విషయంలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్‌డబ్ల్యూఎస్‌ల మధ్య నీటి సరఫరా విషయమై ఒప్పందం కుదరడంలేదు. నాలుగు మండలాల్లో దాదాపు 2 లక్షల జనాభా ఉంది. ప్రారంభంలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్‌డబ్ల్యూఎస్‌తో కేవలం 44 లక్షల లీటర్ల నీటికే ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం 1,000 లీటర్లకు ఆర్డబ్ల్యూఎస్ కేవలం రూ. 10 మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అదనంగా 30 నుంచి 40 లక్షల లీటర్ల నీరు వాడుకుంటున్నందువల్ల హెచ్ఎండబ్ల్యూఎస్ 1,000 లీటర్ల నీటికి రూ.40 లెక్కగడుతోంది. ఆర్డబ్ల్యూఎస్ ప్రతి నెల నీటి బకాయిల కింద హెచ్ఎండబ్ల్యూఎస్కు రూ.20 లక్షలకుపైగా చెల్లిస్తోంది. అయినా హెచ్ఎండబ్ల్యూఎస్ వడ్డీలు, చక్రవడ్డీలు లెక్కకట్టి ఇప్పటికి రూ.20 కోట్ల బకాయిలున్నట్లు నోటీసులు పంపించింది. నీటి ఎద్దడి తీర్చే విషయంలో సరఫరా శాతం పెంచాలని ఆర్డబ్ల్యూఎస్.. హెచ్‌ఎండబ్ల్యూఎస్‌ను అడిగిన ప్రతిసారీ.. ముందు బకాయిలు చెల్లించాలని అంటోంది. నీటి ఎద్దడి ఏర్పడిన ప్రతిసారి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి చొరవ తీసుకుని నీటి సరఫరాను పెంచేలా కృషి చేస్తున్నారు. నీటి ఒప్పందం విషయంలో శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తేనే భవిష్యత్తులో ఇబ్బంది ఉండదని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు అంటున్నారు. పంచాయతీలకు నోటీసులు కొద్ది రోజులుగా పట్నం డివిజన్లోని ఆయా మండలాల ప్రజలు నీటి బిల్లులు చెల్లిస్తున్నారు. ప్రస్తుతం నెల రోజుల వ్యవధిలోనే రూ.20 లక్షలకు పైగా బిల్లులు వసూలయ్యాయి. కానీ పంచాయతీలు మాత్రం ఆర్‌డబ్ల్యూఎస్‌కు పైసా బిల్లు చెల్లించడం లేదు. వసూలయ్యే బిల్లులను పంచాయతీలు నేరుగా ఎస్టీఓల్లో జమ చేసి వివిధ ఖర్చుల నిమిత్తం రెండు మూడ్రోజుల్లోనే వాటిని డ్రా చేస్తున్నారు. ఈ పరిస్థితుల దృష్ట్యా పంచాయతీలు నీటి బిల్లులు కచ్చితంగా చెల్లించాలని ఒత్తిడి తెచ్చేందుకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. ఇటీవల ఇబ్రహీంపట్నం డివిజన్ డీఈఈ వాటికి నోటీసులు పంపించాలని ఆదేశించారు. ముందు జాగ్రత్త దృష్ట్యా ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి త్వరలో హెచ్ఎండబ్ల్యూఎస్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు సమాచారం.