ప్రత్యామ్నాయమే శరణ్యం
ప్రత్యామ్నాయమే శరణ్యం
Published Mon, Apr 17 2017 12:38 AM | Last Updated on Tue, Sep 5 2017 8:56 AM
- నీటి సమస్య పరిష్కారంపై డిప్యూటీ సీఎం కేఈ
- గ్రామాల వారీగా ప్రతిపాదనలు పంపాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు ఆదేశం
- తక్షణ పరిష్కారం కింద ట్యాంకర్లతో సరఫరా చేయాలని సూచన
కర్నూలు(అగ్రికల్చర్): ‘జిల్లా వ్యాప్తంగా తాగునీటి సమస్య తీవ్రంగా ఉన్నట్లు తెలుస్తోంది.. ఆర్‌డబ్ల్యూఎస్ ఆధికారులు అన్ని పంచాయతీలు, నివాసిత ప్రాంతాల్లో అధ్యయనం చేసి పక్కా ప్రణాళికలతో ప్రతిపాదనలు పంపితే తక్షణ చర్యలు తీసుకుంటాం.. అప్పటి వరకు సమస్య తీవ్రంగా ఉన్న ప్రాంతాలకు ట్యాంకర్లతో నీటిని సరఫరా చేయండి’ అని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి ఆదేశించారు. డిప్యూటీ సీఎం ఆధ్వర్యంలో నీటి సమస్య, పరిష్కారంపై ఆదివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో ఉన్నతస్థాయి సమీక్ష జరిగింది. పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ, జెడ్పీ చైర్మన్ మల్లెల రాజశేఖర్, టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్‌చార్జీలు, జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ పాల్గొన్నారు. నియోజకవర్గాల వారీగా నీటి సమస్య తీవ్రత, పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై డిప్యూటీ సీఎం కేఈ సలహాలు, సూచనలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుంకేసుల ద్యామ్‌లో నీరు అడుగంటిపోయిన నేపథ్యంలో ప్రత్యామ్నాయ నీటి వనరులను అన్వేషించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.అవసరమున్న గ్రామాల్లో నీటి వనరులు గుర్తించి ప్రతిపాదనలు సమర్పిస్తే జిల్లా కలెక్టర్ నిధులు మంజూరు చేస్తారని కేఈ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులకు స్పష్టం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్న గ్రామాలకు జాప్యం లేకుండా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. సమావేశానికి నీటిపారుదల శాఖ సీఈ గైర్హాజరుకావడంపై కేఈ అసంతృప్తి వ్యక్తం చేశారు.
గత ఏడాది బకాయిలు చెల్లించాలి...
నంద్యాల, ఆళ్లగడ్డ ప్రాంతాల్లో గత ఏడాది ట్యాంకర్లతో నీటి సరఫరాకు సంబంధించిన పెండింగ్‌లో ఉన్న రూ.1.32 కోట్ల బిల్లులను చెల్లిస్తే ఈ ఏడాది నీటి సరఫరాకు కంట్రాక్టర్లు ముందుకు వస్తారని పర్యాటక మంత్రి భూమా అఖిల ప్రియ తెలిపారు. నంద్యాల మండలం కొత్తపల్లిలో సర్పంచ్ ప్రభుత్వ బోరు పైప్‌లైన్‌ను కట్ చేసి నీటి సరఫరాకు ఆటంకాలు కల్గిస్తున్నారన్నారు. దీనిపై కలెక్టర్ స్పందిస్తూ నిద్ర పోతున్నారా అంటూ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై విరుచుకు పడ్డారు. సోమవారం సాయంత్రానికి పైప్‌లైన్‌ను పునరుద్ధరించాలని, సర్వంచ్‌పై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. 8 గ్రామాలకు నీరు అందించే శ్రీరంగాపురం సీపీడబ్ల్యూ స్కీమ్‌ను పునరుద్ధరించాలని మంత్రి జిల్లా యంత్రాంగానికి సూచించారు.
ఫైళ్లు తీసుకొచ్చేందుకు భయపడుతున్నారు..
నీటి సమస్య పరిష్కారానికి సంబంధించిన ఫైళ్లను మీ దగ్గరకు తెచ్చేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు భయపడుతున్నారని డోన్ నియోజక టీడీపీ ఇన్‌చార్జీ కేఈ ప్రతాప్ పేర్కొనగా తప్పు చేసిన వారికే భయం ఉంటుందని, మిగతావారు ధైర్యంగా వస్తారని కలెక్టర్ బదులిచ్చారు. ప్రస్తుతం ఆన్‌లైన్ ఫైళ్లు కావడంతో ఆ సమస్య కూడా లేదన్నారు. తాగునీటి సమస్య శాశ్వత పరిష్కారానికి సుంకేసుల డ్యామ్‌లో తుంగభద్ర నీటిని నిల్వ చేసుకునేందుకు తగిన ప్రణాళికలు సిద్ధం చేయాలని రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ అన్నారు. అన్ని గ్రామాల్లో ఓహెచ్‌ఎస్‌ఆర్ ట్యాంకులు నిర్మించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్ కోరారు.
వెంటనే ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయండి
నీటి సమస్య సమీక్షలో భాగంగా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులపై తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. సమస్య ఉన్న గ్రామాలకు వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలని, అయితే ఇందుకు వర్క్ ఆర్డర్ ఉండి తీరాలని తెలిపారు. సమస్య పరిష్కారానికి గ్రామ సభలతోపాటు ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్‌చార్జీల సూచనలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. సమావేశంలో ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు జయనాగేశ్వరరెడ్డి, ఎస్‌వీ మోహన్‌రెడ్డి, మణిగాంది, బుడ్డారాజశేఖర్‌రెడ్డి, ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ రవిబాబు తదితరులు పాల్గొన్నారు.
Advertisement