
నిఘా నీడన ఇంధన వ్యాపారం
పరిమాణం, నాణ్యతకు పెద్దపీట
ఆయిల్ కంపెనీల కఠిన విధానాలు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వాహనంలో ఇంధనం కావాల్సి వస్తే సమీపంలోని ఫిల్లింగ్ స్టేషన్‌కు వెళతాం. పెట్రోల్ లేదా డీజిల్ కావాల్సినంత కొట్టించి డబ్బులు కట్టి బయటకు వస్తాం. ఇందులో కొత్తేమి ఉంది అనే కదా మీ సందేహం. అక్కడికే వస్తున్నాం.. ఎక్కడో తయారైన ఇంధనం వేలాది కిలోమీటర్లు ప్రయాణం చేసి మనదాకా వస్తోంది. ఈ ప్రయాణంలో నాణ్యత, పరిమాణంలో ఎటువంటి రాజీ లేకుండా కస్టమర్‌కు కల్తీ లేని ఇంధనం చేరేందుకు చమురు కంపెనీలు, డీలర్లు నిరంతరం తీసుకుంటున్న చర్యల గురించి ఎప్పుడైనా ఆలోచించారా? రిఫైనరీ నుంచి టెర్మినల్.. అక్కడి నుంచి ఫిల్లింగ్ స్టేషన్ (Filling Station). ఇలా వినియోగదారుడి వాహనంలోకి ఇంధనం చేరే వరకు కంపెనీల నిఘా కళ్లు వెంటాడుతూనే ఉంటాయన్న సంగతి చాలా మందికి తెలియదు.
తేడా వస్తే రద్దు చేస్తారు..
చక్రం తిరిగితేనే వ్యవస్థ పరుగెడుతుంది. ఇంధన అమ్మకాలు పెరిగాయంటే ఆర్థిక వ్యవస్థ బాగున్నట్టు. అందుకే ఆయిల్ కంపెనీలు బాధ్యతగా వ్యవహరిస్తున్నాయి. సాంకేతికతను ఆసరాగా చేసుకుని దేశంలోని మారుమూలన ఉన్న పల్లెకూ నాణ్యమైన ఇంధనాన్ని చేర్చాలన్న సంకల్పంతో పనిచేస్తున్నాయి. పరిమాణంలో తేడా రాకుండా న్యాయబద్ధంగా కస్టమర్ చెల్లించిన డబ్బులకు తగ్గట్టుగా ఇంధనం అందిస్తున్నాయి. పైగా ప్రభుత్వ నియంత్రణలోనే చమురు వ్యాపారాలు సాగుతుంటాయి.
దీంతో రెవెన్యూ, పోలీసు, తూనికలు కొలతల శాఖకు చెందిన అధికారులు సైతం తనిఖీలు చేపడుతుంటారు. ఈ క్రమంలో ఏమాత్రం తప్పు జరిగినా ఆయిల్ కంపెనీలు కఠిన చర్యలకు దిగుతున్నాయి. ఫిల్లింగ్ స్టేషన్‌లో స్టాక్‌లో కొద్ది తేడా వచ్చినా భారీ జరిమానా లేదా డీలర్‌షిప్ రద్దుకు వెనుకాడడం లేదు. ఇంధనం రవాణా చేసే ఏజెన్సీలు చేతివాటం ప్రదర్శిస్తే బ్లాక్ లిస్టులో పెడతాయి. దేశవ్యాప్తంగా ఉన్న 88 వేల బంకుల్లో ఎక్క డో ఒక దగ్గర జరిగిన తప్పును మొత్తం పరిశ్రమకు ఆపాదించకూడదన్నది కంపెనీలు, డీలర్ల వాదన.
ఫిల్లింగ్ స్టేషన్లలో ఇవి తప్పనిసరి
→ మంచి నీరు
→ వాష్ రూమ్స్
→ ఫిర్యాదుల పుస్తకం
→ ఫస్ట్ ఎయిడ్
→ ఫ్రీ ఎయిర్ కోసం టైర్ ఇన్‌ఫ్లేటర్
→ సీసీ కెమెరాలు
→ ఫైర్ ఎక్స్‌టింగ్విషర్, ఇసుక
టెర్మినల్ నుంచి బంక్ దాకా..
అయిల్ కంపెనీకి చెందిన టెర్మినల్స్ నుంచి వివిధ ప్రాంతాల్లోని బంకులకు ఇంధనం సరఫరా అవుతుంది. ఇంధనం కేటాయించగానే సంబంధిత ఫిల్లింగ్ స్టేషన్ (బంక్) యజమానికి ఆయిల్ టెర్మినల్ నుంచి సందేశం వెళుతుంది. అలాగే ట్యాంకర్ బయలుదేరగానే, బంక్‌కు చేరిన వెంటనే మెసేజ్ వస్తుంది. టెర్మినల్ నుంచి బంక్ వరకు ట్యాంకర్ ప్రయాణాన్ని జీపీఎస్ (GPS) ఆధారంగా ట్రాక్ చేస్తారు. ఇచ్చిన రూట్ మ్యాప్‌లోనే ట్యాంకర్ వెళ్లాలి.
మరో రూట్‌లో వెళ్లినట్టయితే తదుపరి లోడ్‌కు అవకాశం లేకుండా ఆ వాహన ఏజెన్సీని బ్లాక్ చేస్తారు. నిర్ధేశించిన ప్రాంతంలోనే డ్రైవర్లు భోజనం చేయాల్సి ఉంటుంది. మార్గ మధ్యలో వాహనం ఆపినా కారణం చెప్పాల్సిందే. ఇక బంక్ వద్దకు ట్యాంకర్ చేరగానే నిర్ధేశించిన స్థలంలో కాకుండా మరెక్కడైనా పార్క్ చేసినా ఫిల్లింగ్ స్టేషన్‌పై చర్యలుంటాయి. బంక్ యజమాని ఓటీపీ ఇస్తేనే ట్యాంకర్ తెరుచుకుంటుంది. అన్‌లోడ్ అయ్యాక ట్యాంకర్‌లో నిల్ స్టాక్ అని కంపెనీకి సమాచారం ఇవ్వాలి.
ఫిల్లింగ్ స్టేషన్‌లో ఇలా..
బంకులోని ట్యాంకులో ఎంత ఇంధనం మిగిలి ఉంది, లోడ్ ఎంత వచ్చింది, అమ్మకాలు.. అంతా పారదర్శకం. గణాంకాలు అన్నీ ఎప్పటికప్పుడు కంపెనీ, డీలర్ వద్ద ఆన్‌లైన్‌లో దర్శనమిస్తాయి. ట్యాంకర్ తీసుకొచ్చిన స్టాక్‌లో తేడా ఉంటే ఇన్వాయిస్‌పైన వివరాలు పొందుపరిచి కంపెనీకి సమాచారం ఇవ్వాలి. ఇలా ప్రతీ చుక్కకూ లెక్క ఉంటుంది. మీటర్ తిరిగిన దానికి తగ్గట్టుగా బంకు ట్యాంకులో ఖాళీ కావాలి. స్టాక్‌లో తేడా 2 శాతం మించకూడదు. మించితే జవాబు చెప్పాల్సిందే. అంతేకాదు రూ.3 లక్షల వరకు పెనాల్టీ భారం తప్పదు. తరచుగా కంపెనీకి చెందిన సేల్స్ ఆఫీసర్ తనిఖీ చేస్తుంటారు. థర్డ్ పార్టీ నుంచి, అలాగే ఇతర ఆయిల్ కంపెనీల నుంచి కూడా తరచూ తనిఖీలు ఉంటాయి.
ఆ మూడు
సంస్థలదే.. దేశంలో మొత్తం ఇంధన రిటైల్ పరిశ్రమలో ప్రభుత్వ రంగ ఆయిల్ కంపెనీలైన బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ వాటా ఏకంగా 90% ఉంది. కంపెనీల వెబ్‌సైట్స్ ప్రకారం ఐవోసీఎల్‌కు 37,500లకుపైగా, బీపీసీఎల్‌కు 22,000ల పైచిలుకు, హెచ్‌పీసీఎల్‌కు 17,000 లకుపైగా ఫ్యూయల్ స్టేషన్స్ ఉన్నాయి. ప్రైవేటు సంస్థలు జియో–బీపీ, నయారా, షెల్ సైతం ఈ రంగంలో పోటీపడుతున్నాయి.
చదవండి: రోడ్డుపై, నీటిపై నడిచే వెహికల్
దేశవ్యాప్తంగా నిర్వహణ మాత్రమే బంకుల యజమానులది. మౌలిక వసతుల ఏర్పాటు, మెషినరీ, ఇంధనంపై సర్వ హక్కులూ పెట్రోలియం కంపెనీలదేనని వ్యాపారులు చెబుతున్నారు. నిర్వహణకుగాను ప్రతి నెల డీలర్‌కు వేతనం కింద కంపెనీలు రూ.27,500 చెల్లిస్తున్నాయి. డీలర్లకు లీటరు పెట్రోల్ అమ్మకంపై రూ.3.99, డీజిల్‌పై రూ.2.51 కమిషన్ ఉంటుంది.
వేగానికీ పరిమితులు..
ట్యాంకర్ గంటకు 60 కిలోమీటర్ల వేగాన్ని మించకూడదు. ఒక్క వాహనం నిబంధనలు అతిక్రమించినా ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీనే రద్దు చేస్తారు. టెర్మినల్ నుంచి సుదూర ప్రాంతంలో ఫిల్లింగ్ స్టేషన్ ఉన్నట్టయితే.. డ్రైవర్లకు భోజనానికి 45 నిముషాలు, టీ తాగడానికి 15 నిముషాలు సమయం ఇస్తారు. నిర్ధేశిత సమయం మించితే కంపెనీ నుంచి ట్రాన్స్‌పోర్ట్ ఏజెన్సీ యజమానికి మెయిల్, ఎస్‌ఎంఎస్ వెళుతుంది. ఆలస్యానికి కారణం తెలపాల్సిందే. రాత్రి 12 నుంచి ఉదయం 5 మధ్య రవాణా నిషేధం.

వయబిలిటీ స్టడీలో లోపాలు..
మోసాలకు తావు లేకుండా కస్టమర్లకు నాణ్యమైన ఇంధనం అందుతోందనడంలో ఎటువంటి సందేహం లేదు. అయితే పెట్రోల్ బంక్ ఏర్పాటు కోసం ఇచ్చే ప్రకటనలో సంబంధిత ప్రాంతంలో ఇంత మొత్తంలో విక్రయాలు జరుగుతాయని కంపెనీ ఇచ్చే అంకెలకు, వాస్తవ అమ్మకాలకు భారీ వ్యత్యాసం ఉంటోంది. వయబిలిటీ స్టడీ సక్రమంగా జరగడం లేదు. ప్రకటన ఆధారంగా ముందుకొచ్చి బంక్ ఏర్పాటు చేసి నష్టాలు మూటగట్టుకుంటున్న యజమానులు ఎందరో.
– మర్రి అమరేందర్ రెడ్డి, తెలంగాణ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్.
బంకు యజమానులే బాధ్యులా?
డ్రైవర్లు ఏమాత్రం ఏమరుపాటుగా ఉన్నా వర్షాకాలంలో ట్యాంకర్ లోపలికి నీరు చేరే అవకాశం ఉంది. ఇథనాల్ మిశ్రమంలో తేడాలున్నా సమస్యకు దారి తీస్తుంది. బంకుల్లోని ట్యాంకులు స్టీలుతో తయారయ్యాయి. తుప్పు పడితే ట్యాంకులో చెమ్మ చేరుతుంది. ఇదే జరిగితే ఆ నీరు కాస్తా బంకులోని ట్యాంకర్‌కు, అక్కడి నుంచి కస్టమర్ వాహనంలోకి వెళ్లడం ఖాయం. ఈ సమస్యకు పరిష్కారంగా హెచ్‌డీపీఈతో చేసిన ట్యాంకులను బంకుల్లో ఏర్పాటు చేయాల్సిందిగా విన్నవిస్తున్నా కంపెనీల నుంచి స్పందన లేదు. రవాణా ఏజెన్సీ తప్పిదం, మౌలిక వసతుల లోపం వల్ల సమస్య తలెత్తినా బంకు యజమానిని బాధ్యులను చేస్తున్నారు.
– రాజీవ్ అమరం, జాయింట్ సెక్రటరీ, కన్సార్షియం ఆఫ్ ఇండియన్ పెట్రోలియం డీలర్స్.
Comments
Please login to add a commentAdd a comment