BPCL
-
పెట్రోల్, డీజిల్‌కు అధిక డిమాండ్
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ వినియోగం డిసెంబర్ నెలలో గణనీయంగా పెరిగింది. క్రితం ఏడాది ఇదే నెలలోని వినియోగంతో పోల్చి చూస్తే, పెట్రోల్ అమ్మకాలు (ప్రభుత్వరంగ సంస్థల) 10 శాతం పెరిగి 2.99 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలు బీపీసీఎల్, ఐవోసీఎల్, హెచ్‌పీసీఎల్ ద్వారా 90 శాతం ఇంధన విక్రయాలు నడుస్తుంటాయి. క్రితం ఏడాది డిసెంబర్ నెలలో పెట్రోల్ అమ్మకాలు 2.72 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. డీజిల్ అమ్మకాలు సైతం 4.9 శాతం పెరిగి 7.07 మిలియన్ టన్నులకు చేరాయి. నవంబర్ నెలలోనూ పెట్రోల్, డీజిల్ వినియోగం క్రితం ఏడాది ఇదే నెల గణాంకాలతో పోల్చి చూసినప్పుడు 8.3 శాతం, 5.9 శాతం చొప్పున పెరగడం గమనార్హం. వరుసగా రెండో నెలలోనూ వృద్ధి నమోదైంది. డిసెంబర్లో క్రిస్మస్ సెలవుల సందర్భంగా పర్యటనలు పెరగడం, ఖరీఫ్ సాగు సందర్భంగా యంత్రాలకు ఇంధన వినియోగం పెరగడం వినియోగంలో వృద్ధికి దారితీసింది. ఇక ఈ ఏడాది నవంబర్ నెల విక్రయాలతో పోల్చి చూస్తే డిసెంబర్లో పెట్రోల్ అమ్మకాలు 3.6 శాతం, డీజిల్ అమ్మకాలు 1.7 శాతం చొప్పున తక్కువగా ఉండడం గమనార్హం. దేశ ఇంధన మార్కెట్లో 40 శాతం డీజిల్ రూపంలోనే వినియోగం అవుతుంటుంది. ముఖ్యంగా 70 శాతం డీజిల్‌ను రవాణా రంగం వినియోగిస్తుంటుంది. ఆ తర్వాత వ్యవసాయ రంగంలో డీజిల్ వినియోగం ఎక్కువగా ఉంటుంది. ఇక విమానయాన ఇంధనం (ఏటీఎఫ్) అమ్మకాలు డిసెంబర్ నెలలో క్రితం ఏడాది ఇదే నెలతో పోల్చితే 6.8 శాతం పెరిగి 6,96,400 టన్నులుగా ఉన్నాయి. వంటగ్యాస్ (ఎల్పీజీ) వినియోగం 5 శాతానికి పైగా పెరిగి 2.87 మిలియన్ టన్నులకు చేరింది. -
బీపీసీఎల్, ఐఓసీకి రూ.3కోట్లు ఫైన్!
కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు(సీపీసీబీ)..భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు రూ.2కోట్లు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐఓసీ)కు రూ.1కోటి మేర జరిమానా విధించింది. తమ పెట్రోల్ పంపుల వద్ద కాలుష్య నియంత్రణ పరికరాలను ఏర్పాటు చేయనందుకు జరిమానా విధించినట్లు బోర్డు తెలిపింది. ఈ మేరకు రెండు సంస్థలు వేర్వేరు స్టాక్ ఎక్స్ఛేంజ్ ఫైలింగ్‌లో ఈ విషయాన్ని వెల్లడించాయి. నేషనల్ క్యాపిటల్ రీజియన్ (ఎన్సీఆర్)లోని రిటైల్ అవుట్లెట్లలో వేపర్ రికవరీ సిస్టమ్స్ (వీఆర్ఎస్) ఇన్స్టాల్ చేయనందుకు రూ.1 కోటి నష్టపరిహారం చెల్లించాలని సీపీసీబీ నుంచి ఆదేశాలు అందినట్లు ఐఓసీ తెలిపింది. అయితే, సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోపు పెట్రోల్ స్టేషన్లలో వీఆర్ఎస్లను ఏర్పాటు చేయనందుకు ఈ ఫైన్ విధించలేదని స్పష్టం చేసింది. వాహనాల్లో ఇంధనం నింపేటప్పుడు పెట్రోల్ ఆవిరై వాతావరణంలోకి వెళుతుంది. ఈ ఆవిరిలో బెంజీన్, టోలీన్, క్సైలీన్ వంటి క్యాన్సర్ కారక పదార్థాలు ఉంటాయి. పెట్రోల్ ఆవిరి బయటకు రాకుండా ఇంధన స్టేషన్లలో వీర్‌ఎస్‌ని అమర్చాలని 2016లో పెట్రోల్ పంపులకు ఆదేశాలు జారీ అయ్యాయి. సుప్రీంకోర్టు, సీపీసీబీ నిర్దేశించిన సమయంలో వీఆర్ఎస్ను ఇన్స్టాల్ చేయనందుకు రూ.2 కోట్లు పరిహారం చెల్లించాలని నోటీసు అందుకున్నట్లు బీపీసీఎల్ ప్రకటన విడుదల చేసింది. -
‘గతిశక్తి’ కార్యకలాపాలు ప్రారంభం
రైల్వేస్టేషన్(విజయవాడ పశ్చిమ): దక్షిణ మధ్య రైల్వే విజయవాడ డివిజన్లోని కృష్ణపట్నంలో నూతనంగా ఏర్పాటు చేసిన భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గతిశక్తి మల్టిమోడల్ కార్గో టెర్మినల్ నుంచి మొదటి సారిగా పీఓఎల్ (పెట్రోలియం ఆయిల్ లూబ్రికెంట్స్) రేక్‌ను ప్రారంభించారు. 50 ట్యాంక్ వ్యాగన్లలో 2,693 టన్నుల పీఓఎల్‌ను రవాణా చేయడం ద్వారా డివిజన్ రూ.35.36 లక్షల ఆదాయం ఆర్జించింది. ఏప్రిల్ 26న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) గతిశక్తి మల్టీమోడల్ కార్గో టెర్మినల్‌ను ప్రారంభించగా సోమవారం తెల్లవారుజామున మొదటి రేక్‌ను చర్లపల్లిలోని బీపీసీఎల్‌కు పంపించారు. ఈ సందర్భంగా డీఆర్ఎం షివేంద్రమోహన్ మాట్లాడుతూ సాంప్రదాయ సరుకు రవాణాతో పాటు వినూత్న ఆలోచనలతో సరుకు రవాణాను పెంచేందుకు గతిశక్తి మల్టిమోడల్ కార్గో టెర్మినల్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇది విజయవాడ డివిజన్‌కే మరో మణిహారం అని కొనియాడారు. గతిశక్తి టెర్మినల్ నిర్వహణను ప్రారంభించడంలో కృషి చేసిన సీనియర్ డీసీఎం వావిలపల్లి రాంబాబు, డీఓఎమ్ డి.నరేంద్రవర్మను అభినందించారు. -
బీపీసీఎల్ చైర్మన్‌గా కృష్ణకుమార్ బాధ్యతలు
న్యూఢిల్లీ: బీపీసీఎల్ నూతన చైర్మన్, ఎండీగా జి.కృష్ణకుమార్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇంతకుముందు వరకు సంస్థలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేశారు. 2025 ఏప్రిల్ వరకు బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా బాధ్యతలు నిర్వహించనున్నారు. గత డిసెంబర్లో ప్రభుత్వరంగ సంస్థల నియామక మండలి కృష్ణకుమార్‌ను ఈ పదవికి ఎంపిక చేయడం గమనార్హం. బీపీసీఎల్ చైర్మన్, ఎండీగా అరుణ్‌కుమార్ సింగ్ గతేడాది అక్టోబర్‌తో పదవీ విరమణ చేశారు. అప్పటి నుంచి సంస్థ చైర్మన్ బాధ్యతలను ఫైనాన్స్ డైరెక్టర్ వెస్టా రామకృష్ణ గుప్తా చూశారు. ఎన్ఐటీ తిరుచ్చిరాపల్లి నుంచి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, జమ్నాలాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ను కృష్ణకుమార్ పూర్తి చేశారు. -
ఆయిల్ కంపెనీలకు ఉపశమనం.. రూ.30,000 కోట్లు కేటాయింపు
ప్రభుత్వరంగ చమురు విక్రయ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ఉపశమనం కల్పించింది. 10 నెలలుగా పెట్రోల్, డీజిల్ విక్రయ ధరలను సవరించకుండా నష్టపోయిన బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్, ఐవోసీ కోసం రూ.30,000 కోట్లను ఆర్థిక మంత్రి కేటాయించారు. అంతర్జాతీయంగా ధరలు గణనీయంగా పెరిగినప్పటికీ, 2021 ఏప్రిల్ 6 నుంచి ఈ సంస్థలు ధరలను సవరించకుండా విక్రయిస్తున్నాయి. బ్యారెల్ చమురు ధర 116 డాలర్లకు వెళ్లిన సమయంలో వాటికి ఎక్కువ నష్టం వచ్చింది. ఆ తర్వాత చమురు ధరలు తగ్గడంతో పెట్రోల్‌పై లాభం వస్తుండగా, డీజిల్‌పై ఇప్పటికీ నష్టపోతున్నాయి. 2022–23లో ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు ఉమ్మడిగా రూ.21,200 కోట్ల నష్టాలను ప్రకటించడం గమనార్హం. పైగా వీటికి రెండేళ్లుగా ఎల్పీజీ సబ్సిడీ చెల్లింపులు కూడా చేయలేదు. దీంతో రూ.50,000 కోట్లను ఇవ్వాలని అవి కోరగా, ప్రభుత్వం రూ.30,000 కోట్లను కేటాయించింది. చదవండి: ఆ కార్ల కొనుగోలుదారులకు షాక్.. పెరగనున్న ధరలు! -
పెట్రోల్‌పై లాభం.. డీజిల్‌పై నష్టం
న్యూఢిల్లీ: చమురు మార్కెటింగ్ కంపెనీలు ఒక్కో లీటర్ పెట్రోల్ విక్రయంపై రూ.10 చొప్పున లాభాన్ని చూస్తున్నాయి. మరోవైపు లీటర్ డీజిల్ విక్రయంతో అవి రూ.6.5 నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లాభం వస్తున్నా కానీ అవి విక్రయ రేట్లను తగ్గించడం లేదు. ఎందుకంటే అంతకుమందు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు భారీగా పెరిగిపోయిన సమయంలో అవి రేట్లను ఒక దశ వరకు పెంచి, ఆ తర్వాత నుంచి నష్టాలను సర్దుబాటు చేసుకున్నాయి. పైగా ఇప్పుడు డీజిల్‌పైనా నష్టపోతున్నాయి. దీంతో పెట్రోల్ రేటు దిగి రావడం లేదు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) గత 15 నెలల నుంచి రేట్లను సవరించడం లేదు. ‘‘2022 జూన్ 24తో ముగిసిన వారంలో లీటర్ పెట్రోల్‌పై 17.4 నష్టపోగా, లీటర్ డీజిల్‌పై రూ.27.70 చొప్పున నష్టాన్ని ఎదుర్కొన్నాయి. అక్టోబర్–డిసెంబర్ కాలానికి వచ్చే సరికి అవి లీటర్ పెట్రోల్‌పై రూ.10 లాభం, లీటర్ డీజిల్‌పై నష్టం రూ.6.5కు తగ్గింది’’అని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తన నివేదికలో తెలిపింది. 2022 ఏప్రిల్ 6 నుంచి ఈ మూడు ప్రభుత్వరంగ ఆయిల్ విక్రయ సంస్థలు రేట్లను సవరించడం నిలిపివేశాయి. చమురు బ్యారెల్ ధర 103 డాలర్ల నుంచి 116 డాలర్లకు పెరిగినప్పటికీ అవి రేట్లను యథాతథంగా కొనసాగించాయి. ఫలితంగా ఏప్రిల్–సెప్టెంబర్ కాలానికి ఈ మూడు సంస్థలు కలసి ఉమ్మడిగా రూ.21,201 కోట్ల నష్టాన్ని నమోదు చేశాయి. కానీ, ఈ నెల చమురు ధర 78 డాలర్లకు తగ్గిపోయింది. దీంతో అవి ఇక మీదట డీజిల్‌పైనా లాభాలను ఆర్జించనున్నట్టు తెలుస్తోంది. ఆపరేటింగ్ లాభాలు స్థూల రిఫైనింగ్ మార్జిన్లు బ్యారెల్‌కు 10.5–12.4 డాలర్లుగా ఉండడంతో మూడు కంపెనీలు తిరిగి ఆపరేటింగ్ లాభాల్లోకి ప్రవేశిస్తాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అంచనా వేస్తోంది. అక్టోబర్–డిసెంబర్ క్వార్టర్‌కు ఐవోసీ రూ.2,400 కోట్ల ఎబిట్డా (వడ్డీ, పన్నులు, తరుగుదలకు ముందు), బీపీసీఎల్‌కు రూ.1,800 కోట్లు, హెచ్‌పీసీఎల్‌కు రూ.800 కోట్ల ఎబిట్డా నమోదు చేస్తాయని పేర్కొంది. కాకపోతే నికరంగా నష్టాలను నమోదు చేస్తాయని అంచనా వేసింది. ఐవోసీ రూ.1,300 కోట్లు, హెచ్‌పీసీఎల్ రూ.600 కోట్లు చొప్పున నష్టాలను నమోదు చేయవచ్చని అంచనా వేసింది. అంతర్జాతీయంగా చమురు ధరలు కరోనా ఆరంభంలో 2020లో మైనస్‌కు పడిపోవడం గమనార్హం. అక్కడి నుంచి రెండేళ్లలోనే 2022 మార్చి నాటికి బ్యారెల్ ధర 140 డాలర్లకు చేరి, 14 ఏళ్ల గరిష్టాన్ని నమోదు చేశాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి దిగడం చమురు ధరలకు ఆజ్యం పోసిందని చెప్పుకోవాలి. అమెరికా, యూరప్‌లో మాంద్యం, చైనాలో వృద్ధి మందగమనం పరిస్థితులతో డిమాండ్ తగ్గి తిరిగి ధరలు దిగొస్తున్నాయి. ఈ మూడు ప్రభుత్వరంగ సంస్థలు కలిపి పెట్రోల్ డీజిల్ విక్రయాల్లో 90 శాతం మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. ఇవి ఇంతకాలం పాటు రేట్లను సవరించకుండా ఉండడం గత రెండు దశాబ్దాల్లో ఇదే మొదటిసారి కావడం గమనార్హం. -
చరిత్రలో తొలిసారి ప్రభుత్వ చమురు కంపెనీలకు వేల కోట్ల నష్టం
న్యూఢిల్లీ: ఇంధన రంగ ప్రభుత్వ దిగ్గజాలు ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) రెండో త్రైమాసికం(జులై–సెప్టెంబర్)లో ఉమ్మడిగా రూ. 2,749 కోట్ల నికర నష్టాలు ప్రకటించాయి. అయితే తొలి అర్ధభాగం(ఏప్రిల్–సెప్టెంబర్)లో ఇవి మరింత అధికమై రూ. 21,201 కోట్లకు చేరాయి. ఇందుకు పెట్రోల్, డీజిల్ తదితర ప్రొడక్టులను తయారీ వ్యయాలకంటే తక్కువ ధరలో విక్రయించడం ప్రభావం చూపింది. అయితే క్యూ2లో ప్రభుత్వం ఎల్పీజీ విక్రయాలపై వీటికి ఉమ్మడిగా రూ. 22,000 కోట్ల నష్టపరిహారాన్ని చెల్లించింది. దీంతో క్యూ1(ఏప్రిల్–జూన్)తో పోలిస్తే క్యూ2లో చమురు పీఎస్‌యూల నష్టాలు పరిమితమయ్యాయి. వెరసి చమురు పీఎస్‌యూల చరిత్రలో తొలిసారి వరుసగా రెండు త్రైమాసికాలలో నికర నష్టాలు ప్రకటించిన రికార్డు నమోదైంది. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు(జీఆర్ఎం) మెరుగుపడినప్పటికీ 7 నెలలుగా ధరలను సవరించకపోవడంతో నష్టాలు వాటిల్లినట్లు ప్రభుత్వ దిగ్గజాలు పేర్కొన్నాయి. కాగా.. క్యూ1లో కంపెనీ చరిత్రలోనే అత్యధికంగా రూ. 10,197 కోట్ల నికర నష్టాన్ని హెచ్‌పీసీఎల్ ప్రకటించింది. ఈ బాటలో బీపీసీఎల్ రూ. 6,263 కోట్లు, ఐవోసీ రూ. 1,995 కోట్లు చొప్పున నష్టాలు నమోదు చేయడం గమనార్హం! ఎల్పీజీ సబ్సిడీ ఇలా ప్రభుత్వం ప్రకటించిన ఎల్పీజీ విక్రయాల సబ్సిడీని చమురు పీఎస్‌యూలు క్యూ2 ఫలితాలలో పరిగణనలోకి తీసుకున్నాయి. ఐవోసీ అత్యధికంగా రూ. 10,800 కోట్లు అందుకోగా.. హెచ్‌పీసీఎల్‌కు రూ. 5,617 కోట్లు, బీపీసీఎల్‌కు రూ. 5,582 కోట్లు చొప్పున లభించాయి. రష్యా–ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో ద్రవ్యోల్బణానికి చెక్ పెట్టేందుకు వీలుగా పెట్రోల్, డీజిల్ ధరల సవరణను చేపట్టలేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పేర్కొన్నారు. దీంతో ఇంధన రంగ పీఎస్‌యూలకు సబ్సిడీ చెల్లింపుల ద్వారా ఆర్థిక శాఖ నుంచి మద్దతును కోరినట్లు తెలియజేశారు. -
బీపీసీఎల్.. ఈవీ రూట్
బెంగళూరు: ఇంధన రంగంలో ఉన్న ప్రభుత్వ సంస్థ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) ఈవీ బాట పట్టింది. దేశవ్యాప్తంగా 7,000 రిటైల్ ఔట్లెట్లలో ఎలక్ట్రిక్ వాహనాలకు అవసరమైన చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. బెంగళూరు–చెన్నై, బెంగళూరు–మైసూరు–కూర్గ్ హైవే మార్గాల్లో ఈవీ ఫాస్ట్ చార్జింగ్ స్టేషన్లను తాజాగా ప్రారంభించింది. వ్యూహాత్మక ప్రదేశాల్లో వీటిని ఏర్పాటు చేసినట్టు సంస్థ ప్రకటించింది. దేశంలోని ప్రధాన నగరాలు, ఆర్థిక కేంద్రాలను కలుపుతూ అన్ని ముఖ్య జాతీయ రహదారులపై నిర్ధేశిత దూరంలో రిటైల్ కేంద్రాల వద్ద ఈవీ చార్జింగ్ స్టేషన్లను నెలకొల్పాలన్నది బీపీసీఎల్ ఆలోచన. -
బీపీసీఎల్ అమ్మకం ఇప్పుడే కాదు: హర్దీప్ సింగ్ పురి
ముంబై: ఇంధన రంగ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్ ప్రతిపాదనేదీ ప్రస్తుతం తమ వద్ద లేదని చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి తాజాగా పేర్కొన్నారు. తద్వారా ఇప్పటికే ఎంతో ఆలస్యమైన కంపెనీ విక్రయం సమీప భవిష్యత్‌లో జరగకపోవచ్చని సంకేతాలిచ్చారు. ఆస్తుల మానిటైజేషన్ ప్రణాళికలో భాగంగా ప్రభుత్వం 2019 నవంబర్‌లో బీపీసీఎల్‌లో పూర్తి వాటాను విక్రయించేందుకు నిర్ణయించిన సంగతి తెలిసిందే. కంపెనీలో ప్రభుత్వానికున్న 52.98 శాతం వాటాను అమ్మివేయనున్నట్లు ప్రకటించింది. కంపెనీ కొనుగోలుకి మూడు సూచనప్రాయ బిడ్స్ సైతం లభించాయి. అయితే వేదాంతా గ్రూప్ నుంచి మాత్రమే ఫైనాన్షియల్ బిడ్ దాఖలైంది. దీంతో 2022 మే నెలలో విక్రయ ప్రణాళికను రద్దు చేసిన ప్రభుత్వం పూర్తిస్థాయి సమీక్షకు ప్రతిపాదించింది. పోటీ బిడ్డింగ్‌కు తెరతీసినప్పటికీ రేసులో ఒకే సంస్థ నిలిస్తే విక్రయ ప్రక్రియ ముందుకెలా సాగుతుందంటూ మంత్రి ప్రశ్నించారు. చమురు శాఖ ఇక్కడ నిర్వహించిన 25వ ఇంధన సాంకేతిక సదస్సును ప్రారంభించిన మంత్రి ఈ సందర్భంగా విలేకరులకు బీపీసీఎల్ విక్రయ అంశాలను వివరించారు. -
బీపీసీఎల్ ‘నెట్ జీరో’ 2040
న్యూఢిల్లీ: ప్రభుత్వరంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ బీపీసీఎల్.. పునరుత్పాదక ఇంధనాల తయారీపై భారీ ప్రణాళికలతో ఉంది. 2040 నాటికి 10 గిగావాట్ల పోర్ట్‌ఫోలియోను సమకూర్చుకోవాలని, సున్నా కర్బన ఉద్గారాల స్థాయికి (నెట్ జీరో) చేరుకోవాలని అనుకుంటున్నట్టు సంస్థ చైర్మన్ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. కంపెనీ వాటాదారుల వార్షిక సమావేశాన్ని ఉద్దేశించిన ఆయన మాట్లాడారు. బీపీసీఎల్ ఇతర వ్యాపారాల్లోకి విస్తరిస్తున్నట్టు చెప్పారు. ఇది చమురు, గ్యాస్ వ్యాపారంలో ఆదాయ క్షీణతకు హెడ్జింగ్‌గా, అదనపు ఆదాయానికి మార్గం కల్పిస్తుందన్నారు. ‘‘ఆరు వ్యూహాత్మక విభాగాలను గుర్తించాం. పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, నూతన వ్యాపారాలు (కన్జ్యూమర్ రిటైలింగ్, ఈ మొబిలిటీ) భవిష్యత్తు వృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తాయి. వాటాదారులకు స్థిరమైన విలువను తీసుకొస్తాయి. ప్రధాన వ్యాపారమైన ఆయిల్ రిఫైనింగ్, పెట్రోలియం ఉత్పత్తుల మార్కెటింగ్ ఎప్పటి మాదిరే స్థిరంగా కొనసాగుతుంది’’అని సింగ్ వివరించారు. భిన్న వ్యాపారాలు.. పునరుత్పాదక ఇంధనంలో ప్రస్తుతం గిగావాట్ కంటే తక్కువ ఉత్పాదక సామర్థ్యం ఉందని.. దీన్ని 2040 నాటికి 10 గిగావాట్లకు తీసుకెళ్లనున్నట్టు అరుణ్ కుమార్ సింగ్ వెల్లడించారు. దేశవ్యాప్తంగా సంస్థకు ఉన్న 20వేల ఫ్యుయల్ స్టేషన్లు, 6,200 ఎల్పీజీ పంపిణీదారుల నెట్వర్క్ అండతో కన్జ్యూమబుల్స్, డ్యురబుల్స్ విక్రయాలు చేపట్టే ఆలోచనతో ఉన్నట్టు తెలిపారు. జాతీయ రహదారుల వెంట చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటును కూడా ప్రస్తావించారు. ప్రయోగాత్మక విధానంలో చెన్నై–తిరుచ్చి–మధురై హైవే 900 కిలోమీటర్లను తాము దత్తత తీసుకున్నామని, ప్రతి 100 కిలోమీటర్లకు చార్జింగ్ సదుపాయాన్ని ఏర్పాటు చేసినట్టు వివరించారు. బినా, కోచి రిఫైనరీల వద్ద పెట్‌కెమ్ ప్రాజెక్టులు చేపట్టామని, ఇవి కార్యకలాపాలు ప్రారంభిస్తే.. ప్రస్తుతం ఒక శాతంగా ఉన్న మార్కెట్ వాటా 8 శాతానికి చేరుకుంటుందన్నారు. కొత్తగా 8 భౌగోళిక ప్రాంతాల్లో గ్యాస్ పంపిణీ లైసెన్స్‌లను సొంతం చేసుకున్నట్టు చెప్పారు. -
ఆదాయమే మార్గంగా..బీపీసీఎల్ రూ.1.4 లక్షల కోట్ల పెట్టుబడులు!
న్యూఢిల్లీ: పెట్రోకెమికల్స్, సిటీ గ్యాస్, పర్యావరణ అనుకూల ఇంధనాల వ్యాపార విభాగాల విస్తరణపై ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్) మరింతగా దృష్టి పెడుతోంది. వచ్చే అయిదేళ్లలో రూ. 1.4 లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టనుంది. వార్షిక నివేదికలో బీపీసీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ ఈ విషయాలు తెలిపారు. రిస్కులను తగ్గించుకుంటూ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు వ్యూహాలను సరి చేసుకుంటున్నామన్నారు. ద్రవ శిలాజ ఇంధనాల వ్యాపారం భవిష్యత్తులో క్షీణిస్తే హెడ్జింగ్ కోసం అదనంగా ఆదాయాన్ని తెచ్చిపెట్టే మార్గాలను తీర్చిదిద్దుకుంటున్నామని, వివిధ విభాగాల్లో వ్యాపారాలను విస్తరించేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నామని సింగ్ వివరించారు. ఇందుకోసం ఆరు ప్రధాన విభాగాలను (పెట్రోకెమికల్స్, గ్యాస్, పునరుత్పాదక ఇంధనాలు, వినియోగ వస్తువుల రిటైలింగ్, ఈ–మొబిలిటీ మొదలైనవి) ఎంపిక చేసుకున్నట్లు ఆయన చెప్పారు. -
సవరించని అమ్మకాల ధరలు, ఆయిల్ కంపెనీలకు భారీ షాక్!
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నా.. వాటి విక్రయ ధరలను సవరించకుండా నిలిపివేయడం వల్ల ప్రభుత్వరంగ ఆయిల్ కంపెనీలైన ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ లాభాలపై ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభావం పడుతుందని ఫిచ్ రేటింగ్స్ పేర్కొంది. ద్రవ్యోల్బణం లక్ష్యిత స్థాయికు మించి పరుగులు తీస్తుండడంతో కేంద్ర ప్రభుత్వ పరోక్ష ఆదేశాల మేరకు.. నాలుగు నెలలుగా ఆయిల్ కంపెనీలు పెట్రోల్, డీజిల్ ధరలను సవరించడం లేదు. కానీ, ఇదే కాలంలో అంతర్జాతీయ మార్కెట్లో వాటి ధరలు పెరిగినందున లాభాలపై ప్రభావం పడుతుందని ఫిచ్ తెలిపింది. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీల క్రెడిట్ మెట్రిక్స్ బలహీనపడతాయని పేర్కొంది. చదవండి👉పెట్రో లాభాలపై పన్ను పిడుగు! కేంద్ర ఖజానాకు లక్షకోట్లు! అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గే అవకాశాల నేపథ్యంలో 2023–24 నుంచి మెరుగుపడొచ్చని అంచనా వేసింది. సమీప కాలంలోచమురు ధరలు అన్నవి.. ప్రభుత్వ ద్రవ్య అవసరాలు, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లపై ఆధారపడి ఉంటాయని పేర్కొంది. పెట్రోల్, డీజిల్ ధరలపై ప్రభుత్వ జోక్యం మరింత కాలంపాటు కొనసాగి, చమురు మార్కెటింగ్ కంపెనీల నష్టాలకు దారితీస్తే వాటి రేటింగ్‌పై ప్రభావం పడొచ్చని తెలిపింది. -
బీపీసీఎల్ 'ఫర్ సేల్' ..కేంద్ర మంత్రి కీలక వ్యాఖ్యలు!
నిర్ణీత సమయంలో పరిస్థితిని సమీక్షించిన తర్వాత భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్) వాటా విక్రయ ప్రక్రియను తిరిగి ప్రారంభించడంపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోనుంది. ఆర్థిక శాఖ సహాయమంత్రి భగవత్ కిషన్రావ్ కరాద్ లోక్‌సభలో ఈ విషయాన్ని వెల్లడించారు. కోవిడ్ మహమ్మారి, ఇంధన ధరల అనిశ్చితి, భౌగోళిక–రాజకీయ పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా అనేక పరిశ్రమలను ప్రభావితం చేశాయని మంత్రి పేర్కొంటూ, ఇందులో చమురు, గ్యాస్ పరిశ్రమ ప్రధానమైనదని తెలిపారు. ఆ పరిస్థితుల ప్రభావంతోనే బీపీసీఎల్ వ్యూహాత్మక పెట్టుబడుల ఉపసంహరణ (మెజారిటీ వాటా) కోసం ప్రస్తుత ఈఓఐ (ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రస్ట్) ప్రక్రియను నిలిపివేయాలని భారత ప్రభుత్వం నిర్ణయించిందని వివరించారు. బీపీసీఎల్‌లో 52.98 శాతం వాటాలను విక్రయించడానికి సంబంధించిన ఆఫర్‌ను ప్రభుత్వం మేలో ఉపసంహరించింది. బీపీసీఎల్ వ్యూహాత్మక వాటా విక్రయానికి 2020లో బిడ్డర్ల నుంచి ఈఓఐలను ఆహ్వానించడం జరిగింది. 2020 నవంబర్ నాటికి మూడు బిడ్స్ దాఖలయ్యాయి. ఇంధన ధరలపై అస్పష్టత తత్సంబంధ అంశాల నేపథ్యంలో తదనంతరం ఇరువురు బిడ్స్ ఉపసంహరించుకున్నారు. దీనితో మొత్తం బిడ్డింగ్ పక్రియను కేంద్రం వెనక్కు తీసుకుంది. అప్పట్లో బిడ్స్ వేసిన సంస్థల్లో మైనింగ్ దిగ్గజం అనిల్ అగర్వాల్‌కు చెందిన వేదాంత గ్రూప్, యుఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వైజర్స్ ఉన్నాయి. -
బ్రెజిల్లో బీపీసీఎల్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: బ్రెజిలియన్ ఆయిల్ బ్లాక్‌లో అదనంగా 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టేందుకు ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ (బీపీసీఎల్)కు కేంద్ర మంత్రివర్గం బుధవారం ఆమోద ముద్ర వేసింది. ప్రధాని నేతృత్వంలోని క్యాబినెట్ కమిటీ నిర్ణయం ప్రకారం, బీపీసీఎల్ అనుబంధ సంస్థ భారత్ పెట్రోరిసోర్సెస్ లిమిటెడ్ (పీపీఆర్ఎల్) బ్రెజిల్‌లోని బీఎం–సీల్–11 కన్సెషన్ ప్రాజెక్ట్‌లో మరో 1.6 బిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ బ్లాక్‌లో 2026–27లో ఉత్పత్తి ప్రారంభం అవుతుంది. ఈ బ్లాక్‌లో బీపీఆర్ఎల్కు 40 శాతం వాటా ఉంది. బ్రెజిల్ జాతీయ చమురు కంపెనీ పెట్రోబ్రాస్ 60 శాతం వాటాతో ఆపరేటర్‌గా ఉంది. చదవండి: New Delhi: దేశంలో ఆఫీస్ స్పేస్.. ఆ నగరం చాలా కాస్ట్లీ గురూ! -
చమురు కంపెనీలకు భారీ నష్టాలు!
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ చమురు మార్కెటింగ్ దిగ్గజాలు (ఓఎంసీ) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారీ నష్టాలు నమోదు చేసే అవకాశముంది. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ), భారత్ పెట్రోలియం (బీపీసీఎల్), హిందుస్తాన్ పెట్రోలియం (హెచ్‌పీసీఎల్) కలిపి రూ.10,700 కోట్ల మేర నష్టాలు ప్రకటించవచ్చని బ్రోకరేజీ సంస్థ ఐసీఐసీఐ సెక్యూరిటీస్ ఒక నివేదికలో అంచనా వేసింది. తయారీ వ్యయం కన్నా పెట్రోల్, డీజిల్‌ను తక్కువ రేటుకు విక్రయించాల్సి రావడమే ఇందుకు కారణమని తెలిపింది. దేశీయంగా పెట్రోల్, డీజిల్ మార్కెట్లో ఈ మూడు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు 90 శాతం దాకా వాటా ఉంది. ముడిచమురును ఇంధనాలుగా మార్చే రిఫైనరీలు కూడా వీటికి ఉన్నాయి. ఏప్రిల్–జూన్ త్రైమాసికంలో క్రూడాయిల్ రేట్లు భారీగా ఎగియడంతో ఈ సంస్థల రిఫైనింగ్ మార్జిన్లు కూడా మెరుగుపడ్డాయి. అయితే, పెట్రోల్, డీజిల్ రేట్లలో పెద్దగా మార్పులు లేకపోవడంతో ఆయా సంస్థల మార్కెటింగ్ విభాగాలు మాత్రం నష్టాలు మూటగట్టుకున్నాయి. పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ. 12–14 మేర నష్టపోతున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. దీంతో రిఫైనింగ్ మార్జిన్లపరంగా వచ్చిన ప్రయోజనం దక్కకుండా పోతోందని వివరించింది. పటిష్టంగా జీఆర్ఎం.. స్థూల రిఫైనింగ్ మార్జిన్లు (జీఆర్ఎం) పటిష్టంగా బ్యారెల్‌కు 17–18 డాలర్ల స్థాయిలోనే కొనసాగవచ్చని అంచనా వేస్తున్నట్లు ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. అలాగే రికవరీ, తక్కువ బేస్ ఎఫెక్ట్ కారణంగా అమ్మకాల పరిమాణం కూడా 17–20 శాతం పెరగవచ్చని తెలిపింది. కానీ పెట్రోల్, డీజిల్పరమైన రిటైల్ నష్టాల వల్ల ఓఎంసీలు క్యూ1లో రూ. 10,700 కోట్ల మేర నికర నష్టం నమోదు చేసే అవకాశం ఉన్నట్లు వివరించింది. గత 2–3 రోజులుగా క్రూడాయిల్ రేట్లు తగ్గుముఖం పట్టడంతో మార్జిన్లు దిగిరావచ్చని, అలాగే రాబోయే రోజుల్లో మార్కెటింగ్పరమైన నష్టాలు కూడా కాస్త తగ్గొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ తెలిపింది. మరోవైపు, క్యూ1లో ప్రైవేట్ రంగ రిలయన్స్ ఇండస్ట్రీస్ పటిష్టమైన ఆర్థిక ఫలితాలు నమోదు చేయొచ్చని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అత్యధికంగా రూ. 24,400 కోట్ల మేర నికర లాభం (77 శాతం వృద్ధి) ప్రకటించవచ్చని వివరించింది. అయితే, ఇంధనాల ఎగుమతులపై జూలై 1 నుంచి అధిక సుంకాల విధింపుతో మిగతా తొమ్మిది నెలల కాలంలో కంపెనీ పనితీరుపై ప్రతికూల ప్రభావం పడొచ్చని తెలిపింది. -
భారత్ పెట్రోలియం అమ్మకానికి బ్రేక్!
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్‌ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా నిలిపివేసింది. డిజిన్వెస్ట్‌మెంట్ కోసం తీసుకున్న అన్ని చర్యలకూ ప్రభుత్వం మంగళంపాడినట్లు బీపీసీఎల్ తాజాగా వెల్లడించింది. కంపెనీలోగల 53 శాతం వాటా విక్రయానికి చేపట్టిన ప్రస్తుత టెండర్‌ను ఈ నెల 3న ప్రభుత్వం రద్దు చేసినట్లు స్టాక్ ఎక్సే్ంజీలకు తెలియజేసింది. దీంతో డేటా రూమ్ వివరాలుసహా డిజిన్వెస్ట్‌మెంట్ సంబంధ అన్ని సన్నాహాలనూ నిలిపివేసిందని వివరించింది. కారణం ప్రధానంగా కంపెనీ కొనుగోలుకి ఆసక్తి వ్యక్తం(ఈవోఐ) చేసిన మూడు బిడ్డర్లలో రెండు సంస్థలు వెనక్కి తగ్గడం ప్రభావం చూపింది. అర్హత సాధించిన సంస్థల కోసం గతేడాది ఏప్రిల్‌లో కంపెనీకి సంబంధించిన ఆర్థిక సమాచార వేదిక వర్చువల్ డేటా రూమ్‌కు బీపీసీఎల్ తెరతీసిన విషయం విదితమే. సాధ్యాసాధ్యాల పరిశీలన తదుపరి వాటా కొనుగోలు ఒప్పందానికి సంసిద్ధతను వ్యక్తం చేయవలసి ఉంటుంది. ఆపై ప్రభుత్వం ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానిస్తుంది. అయితే ఈ దశవరకూ ప్రక్రియ వెళ్లకపోవడంతో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను విరమించుకుంది. చదవండి: వినియోగదారులకు షాక్:హెచ్డీఎఫ్సీ రెండో ‘వడ్డింపు’ -
బీపీసీఎల్ ప్రెవేటైజేషన్‌కు బ్రేక్: ఎందుకంటే?
న్యూఢిల్లీ: ఇంధన రంగ పీఎస్‌యూ దిగ్గజం భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రైవేటైజేషన్ ప్రతిపాదనకు బ్రేక్ పడింది. దాదాపు 53 శాతం వాటాను విక్రయించే ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం విరమించుకుంది. ఇంధన ధరలపై స్పష్టత లేకపోవడం వంటి సమస్యలపై ఇద్దరు బిడ్డర్లు వాకౌట్ చేయడంతో కేవలం ఒక బిడ్డర్ మాత్రమే పోటీలో ఉన్నారు. దీంతో ప్రైవేటీకరణకు బ్రేక్ పడింది. అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో నెలకొన్న పరిస్థితులరీత్యా ప్రస్తుతం ప్రయివేటైజేషన్ ప్రక్రియలో పాల్గొనలేమంటూ అత్యధిక శాతం బిడ్డర్లు అశక్తతను వ్యక్తం చేసినట్లు దీపమ్ పేర్కొంది. కంపెనీలో ప్రభుత్వానికిగల మొత్తం 52.98% వాటాను విక్రయించేందుకు తొలుత ప్రభుత్వం ప్రణాళికలు వేసింది. ఇందుకు వీలుగా 2020 మార్చిలోనే ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్‌కు ఆహ్వానం పలికింది. అదే ఏడాది నవంబర్‌కల్లా కనీసం మూడు సంస్థలు బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఇంధన ధరల విషయంలో స్పష్టత లేకపోవడంతో రెండు సంస్థలు రేసు నుంచి వైదొలగాయి. దీంతో ఒక కంపెనీ మాత్రమే బరిలో నిలిచింది. ఫలితంగా డిజిన్వెస్ట్‌మెంట్‌పై ఏర్పాటైన మంత్రివర్గ కమిటీ ప్రైవేటైజేషన్ ప్రక్రియ రద్దుకు నిర్ణయించినట్లు దీపమ్ వెల్లడించింది. పరిస్థితుల ఆధారంగా ఈ అంశంపై భవిష్యత్‌లో నిర్ణయం తీసుకోనున్నట్లు తెలియజేసింది. బీపీసీఎల్‌లో ప్రభుత్వ వాటా కొనుగోలుకి వేదాంతా గ్రూప్, యూఎస్ వెంచర్ ఫండ్స్ అపోలో గ్లోబల్ మేనేజ్మెంట్ ఇంక్, ఐ స్క్వేర్డ్ క్యాపిటల్ అడ్వయిజర్స్ ఈవోఐలను దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ వార్తల నేపథ్యంలో బీపీసీఎల్ షేరు 0.5% నీరసించి రూ. 325 వద్ద ముగిసింది. శుక్రవారం స్వల్ప లాభంతో అక్కడే కదలాడుతోంది. -
బీపీసీఎల్ ప్రయివేటైజేషన్, కొత్త దారిలో అమ్మకానికి సన్నాహాలు!
న్యూఢిల్లీ: భారత్ పెట్రోలియం కార్పొరేషన్(బీపీసీఎల్) ప్రయివేటైజేషన్‌ను సరికొత్త రీతిలో చేపట్టవలసి ఉన్నట్లు ప్రభుత్వ అధికారి ఒకరు పేర్కొన్నారు. వాటా అమ్మక నిబంధనల సవరణ తదితర చర్యలు అవసరమని అభిప్రాయపడ్డారు. వెరసి బీపీసీఎల్ ప్రయివేటైజేషన్ ప్రక్రియ అంశంలో తిరిగి డ్రాయింగ్ బోర్డుకు వెళ్లవలసి ఉన్నట్లు వ్యాఖ్యానించారు. కన్సార్షియం ఏర్పాటు, భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, ఇంధన మార్పులు తదితర సవాళ్లున్నట్లు తెలియజేశారు. కంపెనీలో ప్రభుత్వం 52.98 శాతం వాటా విక్రయానికి సన్నాహాలు ప్రారంభించిన సంగతి తెలిసిందే. వేదాంతా గ్రూప్‌సహా మూడు కంపెనీలు ఆసక్తి వ్యక్తీకరణ(ఈవోఐ) బిడ్స్ దాఖలు చేశాయి. అయితే ఫైనాన్షియల్ బిడ్స్‌ను ఆహ్వానించవలసి ఉంది. పర్యావరణ అనుకూల, పునరుత్పాదక ఇంధనాలవైపు ప్రపంచం దృష్టిసారించిన నేపథ్యంలో బీపీసీఎల్ ప్రస్తుత ప్రయివేటైజేషన్ ప్రక్రియకు సవాళ్లు ఎదురుకానున్నట్లు ప్రభుత్వ అధికారి వివరించారు. -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్, వందల కోట్లతో కేంద్రం మాస్టర్ ప్లాన్!
ముంబై: ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ దేశవ్యాప్తంగా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్స్ చార్జింగ్ కారిడార్లను నెలకొల్పనున్నట్టు ప్రకటించింది. ఇందుకోసం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.200 కోట్లు ఖర్చు చేయనున్నట్టు వెల్లడించింది. రద్దీగా ఉండే 100 జాతీయ రహదార్లలో 2023 మార్చి నాటికి 100 కారిడార్లను ఏర్పాటు చేయడం ద్వారా 2,000 స్టేషన్స్‌ను అందుబాటులోకి తేనున్నట్టు తెలిపింది. 2024–25 నాటికి ఫాస్ట్ ఈవీ చార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను 7,000కు చేర్చాలన్నది లక్ష్యమని బీపీసీఎల్ రిటైల్ ఈడీ బి.ఎస్.రవి తెలిపారు. అంచనాలను మించి ఈవీ వ్యవస్థ వృద్ధి చెందుతుంది. కనీస మౌలిక వసతుల ఏర్పాటులో కీలకంగా వ్యవహరిస్తాం. తొలినాళ్లలో కస్టమర్ల రాక తక్కువగా ఉండడంతో వాణిజ్య పరంగా చార్జింగ్ స్టేషన్స్ లాభదాయకత కాదు. కాబట్టి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ప్రోత్సాహకాలను కోరతాం’ అని వివరించారు. -
బీపీసీఎల్‌తో హీరో మోటోకార్ప్ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల (ఈవీ) కోసం చార్జింగ్ మౌలిక సదుపాయాలను కలి్పంచే దిశగా ప్రభుత్వ రంగ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్), టూ వీలర్ దిగ్గజం హీరో మోటోకార్ప్ జట్టు కట్టాయి. ‘మొదటి దశలో ఢిల్లీ, బెంగళూరుతో మొదలుపెట్టి తొమ్మిది నగరాల్లో చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత చార్జింగ్ స్టేషన్లను విస్తృత స్థాయిలో అందుబాటులోకి తెచ్చే దిశగా నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా విస్తరిస్తాం‘ అని ఇరు సంస్థలు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపాయి. ప్రణాళిక ప్రకారం రెండు సంస్థలు.. ముందుగా బీపీసీఎల్‌కు ప్రస్తుతం ఉన్న పెట్రోల్ బంకుల్లో చార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేయనున్నాయి. ఆ తర్వాత ఎలక్ట్రిక్ వాహనాల వ్యవస్థకు సంబంధించి మిగతా అంశాల్లోనూ కలిసి పనిచేయనున్నాయి. మధ్యకాలికం నుంచి దీర్ఘకాలికంగా .. విద్యుత్ వాహనాలకు చార్జింగ్ సదుపాయం కలి్పంచడం సహా వివిధ రకాల ఇంధనాలను విక్రయించే ఇంధన కేంద్రాలుగా దాదాపు 7,000 పైచిలుకు సాంప్రదాయ పెట్రోల్ బంకులను మార్చనున్నట్లు బీపీసీఎల్ గతేడాది సెపె్టంబర్లో వెల్లడించింది. నగదురహితంగా ప్రక్రియ..: హీరో మోటోకార్ప్ త్వరలోనే రెండు నగరాల్లో ఎలక్ట్రిక్ వాహనాల చార్జింగ్ సదుపాయాల కల్పన ప్రారంభించనుంది. ఒక్కో చార్జింగ్ స్టేషన్లో డీసీ, ఏసీ చార్జర్లు సహా పలు చార్జింగ్ పాయింట్లు ఉంటాయి. అన్ని రకాల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలకు ఉపయోగపడతాయి. చార్జింగ్ ప్రక్రియను హీరో మోటోకార్ప్ మొబైల్ యాప్ ద్వారా నగదురహితంగా పూర్తి చేయవచ్చు. తమ భారీ నెట్‌వర్క్‌తో ఈవీ చార్జింగ్ సదుపాయాలను గణనీయంగా విస్తరించవచ్చని బీపీసీఎల్ సీఎండీ అరుణ్ కుమార్ సింగ్ తెలిపారు. వాహన రంగంలో కొంగొత్త ధోరణులను అందిపుచ్చుకోవడంలో తమ సంస్థ ఎప్పుడూ ముందుంటుందని హీరో మోటో చైర్మన్ పవన్ ముంజల్ పేర్కొన్నారు. -
వచ్చే ఏడాదిలో మరింత స్పీడ్
న్యూఢిల్లీ: వచ్చే ఆర్థిక సంవత్సరం(2022–23)లో కేంద్ర ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్‌ను మరింత వేగవంతం చేయనుంది. పీఎస్‌యూ దిగ్గజాలు బీపీసీఎల్, బీఈఎంఎల్, షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ)లలో వ్యూహాత్మక వాటాల విక్రయాన్ని చేపట్టనున్నట్లు దీపమ్ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. తాజా బడ్జెట్లో ప్రభుత్వం డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 65,000 కోట్లు సమకూర్చుకోవాలని ప్రతిపాదించింది. నిజానికి ఈ ఆర్థిక సంవత్సరం(2021–22)లో తొలుత పెట్టుకున్న లక్ష్యం రూ. 1.75 లక్షల కోట్లతో పోలిస్తే తాజా టార్గెట్‌లో భారీగా కోత పడింది. సవరించిన తాజా అంచనాల ప్రకారం మార్చితో ముగియనున్న ఈ ఏడాది రూ. 78,000 కోట్లు సమీకరించగలమని ఆర్థిక శాఖ అభిప్రాయపడింది. కాగా.. వచ్చే ఏడాది ఈసీజీసీసహా మూడు పీఎస్‌యూల పబ్లిక్ ఇష్యూలు చేపట్టనున్నట్లు పాండే తెలియజేశారు. మైనారిటీ వాటాలు వచ్చే ఏడాది లక్ష్యాలను చేరేందుకు కొన్ని సీపీఎస్ఈలలో మైనారిటీ వాటాలను సైతం విక్రయించనున్నట్లు పాండే వెల్లడించారు. పవన్ హంస్ కొనుగోలుకి పలు ఫైనాన్షియల్ బిడ్స్ దాఖలైనట్లు పేర్కొన్నారు. ఇక ఎస్సీఐ, బీపీసీఎల్, బీఈఎంఎల్.. ఫైనాన్షియల్ బిడ్స్ దశకు చేరినట్లు తెలియజేశారు. -
ఎల్ఐసీ, బీపీసీఎల్ ప్రైవేటీకరణపై కేంద్రం కీలక నిర్ణయం!
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కేంద్ర సర్కారు పెట్టుకున్న పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యం నెరవేరేలా కనిపించడం లేదు. ప్రధానంగా రెండు లావాదేవీలు ప్రభుత్వ లక్ష్యానికి కీలకం కానున్నాయి. అందులో బీపీసీఎల్‌లో ప్రభుత్వానికి ఉన్న వాటాను పూర్తిగా ప్రైవేటు సంస్థకు విక్రయించడం. ఈ రూపంలోనే కేంద్రానికి రూ.50వేల కోట్లకు పైగా ఆదాయం సమకూరనుంది. ఎల్ఐసీలో కొంత వాటాను ఐపీవో రూపంలో విక్రయించాలన్నది మరో ముఖ్యమైన లక్ష్యం. ఈ రెండు లావాదేవీల రూపంలోనే కేంద్ర సర్కారుకు రమారమి రూ.1.5 లక్షల కోట్లు సమకూరుతుంది. కానీ, చూస్తుంటే బీపీసీఎల్ ప్రైవేటీకరణ అనుకున్నంత వేగంగా ముందుకు సాగడం లేదు. 2021–22 ఆర్థిక సంవత్సరానికి రూ.1.75 లక్షల కోట్లను పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా సమకూర్చుకోవాలన్నది కేంద్ర సర్కారు బడ్జెట్ లక్ష్యం. ఎల్ఐసీ ఐపీవో మార్చిలోపు పూర్తి చేయగలమన్న విశ్వాసంతో కేంద్రం ఉంది. ఒకవేళ ఎల్ఐసీ ఐపీవోను పట్టాలెక్కించినా, బీపీసీఎల్ లావాదేవీ పూర్తికాకపోతే రూ.1.75 లక్షల కోట్ల లక్ష్యాన్ని ప్రభుత్వం దిగువకు సవరించుకోవాల్సి వస్తుంది. కేంద్ర సర్కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటి వరకూ వాటాల విక్రయం రూపంలో సమకూర్చుకున్న మొత్తం రూ.9,330 కోట్లుగానే ఉంది. ఎన్ఎండీసీ, హడ్కోలో మైనారిటీ వాటాలను విక్రయించడం రూపంలో ఈ మొత్తం లభించింది. అనుకున్నట్టుగానే ఎల్ఐసీ ఐపీవో.. దేశంలోనే అతిపెద్ద ఐపీవో (సుమారు రూ.లక్ష కోట్లు)గా భావిస్తున్న ఎల్ఐసీ వాటాల విక్రయం ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం మార్చిలోపు పూర్తవుతుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు వెల్లడించాయి. బీపీసీఎల్ వాటాల విక్రయం తదుపరి ఆర్థిక సంవత్సరానికి వాయిదా పడొచ్చన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశాయి. 2022–23 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టే సందర్భంలో 2021–22 ఆర్థిక సంవత్సరం వాటాల విక్రయ లక్ష్యాన్ని రూ.50,000కోట్లు తక్కువకు సవరించొచ్చని ఆ వర్గాలు తెలిపాయి. ‘‘ఎల్ఐసీ ఐపీవో ఈ ఏడాది పూర్తవుతుందన్న విశ్వాసం మాకుంది. చాలా వరకు పని (విలువ మదింపు) వేగంగా పూర్తయింది. పెట్టుబడులు, ప్రజా ఆస్తుల నిర్వహణ విభాగానికి (దీపమ్) ప్రభుత్వరంగ సంస్థలను ప్రైవేటీకరించే విషయంలో చక్కని ట్రాక్ రికార్డు ఉంది’’ అని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ‘‘ప్రైవేటీకరణ అన్నది చాలా సంక్లిష్టమైన ప్రక్రియ. ఎయిర్ ఇండియా ప్రక్రియ ముగిసిందని..ఇతర పెద్ద ప్రైవేటీకరణ ప్రణాళికలు కూడా అంతే వేగంగా పూర్తవుతాయని అనుకోవద్దు’’ అంటూ సదరు అధికారి పేర్కొన్నారు. ఎల్ఐసీ, బీపీసీఎల్ లావాదేవీల్లో జాప్యం నెలకొనడంతో వాస్తవ లక్ష్యంలో ఇప్పటి వరకు సమకూర్చుకున్నది చాలా స్వల్ప మొత్తంగానే కనిపిస్తోంది. ఒక్క ఎయిర్ ఇండియాను ప్రభుత్వం పూర్తి చేసుకోగలిగింది. ఇంకా షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నీలాచల్ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్, పవన్ హన్స్ తదితర కంపెనీల్లో వాటాల విక్రయం కూడా ముగియాల్సి ఉంది. నత్తనడకనే.. బీపీసీఎల్‌లో వాటాల విక్రయానికి సంబంధించి పెద్దగా పురోగతి లేదని అధికార వర్గాలు అంటున్నాయి.చాలా వరకు బిడ్డర్లు ఈ డీల్‌కు సరిపడా నిధులను సమకూర్చుకునేందుకు తగిన భాగస్వాములను ఎంపిక చేసుకోలేకపోయినట్టు చెబుతున్నాయి. కరోనా మహమ్మారి కారణంగా అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చిత వాతావరణానికి తోడు.. ఇంధన మార్కెట్లలోని ఆటుపోట్లను కారణంగా పేర్కొంటున్నాయి. పైగా విక్రయానికి సంబంధించి ఎన్నో అంశాలపై సందేహాల నివృత్తికి సమయం పట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఆసక్తి కలిగిన బిడ్డర్లు బీపీసీఎల్‌కు సంబంధించి ఆర్థిక డేటాను గతేడాది ఏప్రిల్‌లనే పొందినట్టు వెల్లడించాయి. కానీ, కరోనా మహమ్మారి వల్ల ఆయా అంశాలపై చర్చలకు చాలా సమయం పట్టినట్టు వివరించాయి. కరోనా రాక ముందు వరకు అంటే 2020 ఫిబ్రవరి నాటికి బీపీసీఎల్‌ను ఎయిర్ ఇండియా కంటే ముందే విక్రయించగలమన్న నమ్మకంతో ప్రభుత్వం ఉంది. ఎయిర్ఇండియా తీవ్ర నష్టాల్లో నడుస్తుంటే.. బీపీసీఎల్ లాభాల వర్షం కురిపిస్తున్న కంపెనీ కావడం గమనార్హం. దీంతో అంతర్జాతీయగా దిగ్గజ ఇంధనరంగ కంపెనీలకు అదిపెద్ద మార్కెట్లలో ఒకటైన భారత్‌లోకి ప్రవేశించేందుకు అనుకూల మార్గం అవుతుందని అభిప్రాయపడింది. కానీ కరోనా రాకతో అవన్నీ తారుమారయ్యాయి. అధిక వ్యయాలకు ప్రభుత్వం కట్టుబడి ఉన్నందున.. ఒకవైపు పన్నుల రూపంలో ఆదాయం పెరిగినా కానీ, పెట్టుబడుల ఉపంసంహరణ రూపంలో ఆదాయానికి తొర్ర పడితే జీడీపీలో ద్రవ్యలోటు కట్టడి లక్ష్యం 6.8 శాతాన్ని ఎలా అధిగమించగలదో చూడాల్సి ఉంది. చదవండి: ఎల్ఐసీకి భారీ షాక్, తగ్గుతున్న ఆదాయం -
ఎలక్ట్రిక్ వాహనదారులకు గుడ్‌న్యూస్! ఈ పెట్రోల్ బంకుల్లో ఛార్జింగ్ ఫ్రీ
ప్రపంచమంతా ఎలక్ట్రిక్ వెహికల్స ట్రెండ్ నడుస్తోంది. క్రమంగా పెట్రోలు, డీజిల్ నుంచి ఎలక్ట్రిక్ వైపు ప్రజలు మళ్లుతున్నారు. అయితే ఈ చేంజింగ్ ట్రెండ్‌కి ఛార్జింగ్ పాయింట్ల షార్టేజీ పెద్ద సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు ఈవీ తయారీ సంస్థలు రకరకాల ఎత్తుగడలు వేస్తున్నాయి. ఈ క్రమంలో ఓలా మరో అడుగు ముందుకు వేసింది. పెట్రోలు బంకుల్లో పెట్రోల్ బంకుల తరహాలోనే ఎలక్ట్రిక్ వెహికల్ యూజర్లకు ఛార్జింగ్ సౌకర్యం అందించే లక్ష్యంతో భారత్ పెట్రోలియం కార్పోరేషన్ లిమిటెడ్‌తో ఓలా ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా నాలుగు వేలకు పైగా ఉన్న భారత్ పెట్రోల్ బంకుల్లో ఓలా సంస్థ హైపర్ ఎలక్ట్రిక్ ఛార్జర్లను ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఓలా స్కూటర్స్ సీఈవో భవీశ్ అగర్వాల్ ట్విట్టర్లో స్వయంగా ప్రకటించారు. రెండు నెలల్లో భారత్ పెట్రోలు బంకుల్లో హపర్ ఛార్జింగ్ పాయింట్లు 6 నుంచి 8 వారాల్లోగా అందుబాటులోకి వస్తాయంటూ భవీశ్ తెలిపారు. పెట్రోలు బంకులతో పాటు ఇళ్ల సముదాయల దగ్గర కూడా హైపర్ ఛార్జింగ్ పాయింట్లు తెస్తామంటూ శుభవార్త తెలిపారు. ఛార్జింగ్ ఫ్రీ ఇక పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లు అందుబాటులోకి తెస్తున్న సందర్భంగా భవీశ్ అగర్వాల్ బంపర్ ఆఫర్ ప్రకటించారు. భారత్ పెట్రోలు బంకులు, రెసిడెన్షియల్ కాంప్లెక్సుల దగ్గర ఓలా సంస్థ నెలకొల్పే హైపర్ ఛార్జింగ్ పాయింట్ల దగ్గర ఉచితంగా ఛార్జింగ్ చేసుకోవచ్చని తెలిపింది. 2022 జూన్ 30 వరకు ఈ ఆఫర్‌ని అందిస్తున్నారు. ఈవీ ఛార్జింగ్ పాయింట్లకు సంబంధించి ఒక యూనిట్ కరెంట్‌కి రూ. 12 నుంచి రూ.15 వరకు విద్యుత్ సంస్థలు ఛార్జ్ చేస్తున్నాయి. Hypercharger roll out has begun across cities. At key BPCL pumps as well as residential complexes. 4000+ points up through next year. We’re installing across India and will make them operational in 6-8 weeks. Will be free for use till end June 22 for all customers. pic.twitter.com/WKEzok4E98 — Bhavish Aggarwal (@bhash) December 28, 2021 అథర్కి పోటీగా ఓలా కంటే ముందే ఈవీ మార్కెట్లో ఉన్న అథర్ సంస్థ సైతం పబ్లిక్ ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. ఇక్కడ ఫ్రీ ఛార్జింగ్ పెసిలిటీని కల్పించింది. 2021 డిసెంబరు 31తో ఈ గడువు ముగియగా తాజాగా 2022 జూన్ 30 వరకు పొడిగిస్తున్నట్టు తెలిపింది. ఆ వెంటనే ఓలా నుంచి పబ్లిక్ హైపర్ ఛార్జింగ్ పాయింట్ల ఏర్పాటు ప్రకటన వచ్చింది. చదవండి:విశాఖలో ఓలా స్కూటర్ల డెలివరీ.. గెట్ రెడీ అంటున్న భవీశ్ అగర్వాల్ -
ఇక దేశమంతటా పెట్రోల్ బంకుల్లో ఈవీ చార్జింగ్ స్టేషన్లు!
ఎలక్ట్రిక్ వాహనాలకు గిరాకీ పెరుగుతుండటంతో ఈవీ ఇన్ఫ్రా సెక్టార్లో అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్ కంపెనీలు పోటీ పడుతున్నాయి. దేశమంతటా ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) చార్జింగ్ స్టేషన్ల నిర్మాణాలను మొదలుపెట్టాయి. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్(ఐఓసీఎల్), మరో రెండు ప్రభుత్వ రంగ చమురు సంస్థలు రాబోయే 3-5 ఏళ్లలో 22,000 ఎలక్ట్రిక్ వేహికల్(ఈవి) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నాయి. ప్రభుత్వ రంగ ఐఓసీఎ రాబోయే మూడేళ్లలో 10,000 ఇంధన అవుట్ లెట్లలో ఈవీ ఛార్జింగ్ సదుపాయాలను ఏర్పాటు చేస్తుందని చైర్మన్ శ్రీకాంత్ మాధవ్ వైద్య తెలిపారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) రాబోయే ఐదేళ్లలో 7,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని తెలిపింది. ఇక హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) కూడా 5,000 స్టేషన్ల కోసం ప్రణాళికలు రచిస్తున్నట్లు పేర్కొంది. 2021 సీఓపీ26 వాతావరణ మార్పు సదస్సులో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ భారతదేశం 2070 నాటికి ఉద్గారాలను సున్నాకు తగ్గించనున్నట్లు వివరించారు. అలాగే, భారతదేశం తన తక్కువ కార్బన్ శక్తి సామర్థ్యాన్ని 2030 నాటికి 500 గిగావాట్లకు(జిడబ్ల్యు) పెంచాలని, 2030 నాటికి తన మొత్తం శక్తి అవసరాలలో 50 శాతం తీర్చాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. (చదవండి: 5జీ స్మార్ట్‌ఫోన్ ఇంత తక్కువ ధరకా!) -
ఐఓసీఎల్ బాటలోనే బీపీసీఎల్.. బంకుల్లో ఛార్జింగ్ స్టేషన్లు!
ముంబై: భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్) భారతదేశంలో ఈవీ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ బాటలోనే నడిచేందుకు సిద్దం అయ్యింది. దేశవ్యాప్తంగా 19,000 పెట్రోల్ పంపులను కలిగి ఉన్న చమురు సంస్థ ఇప్పుడు ఈవి ఛార్జింగ్ పాయింట్లను ఏర్పాటు కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తుంది. రాబోయే కొన్ని సంవత్సరాల్లో పెట్రోల్ బంకుల వద్ద సుమారు 7,000 ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రణాళికను రూపొందించింది. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల అమ్మకాలు పుంజుకోవడంతో ఆ రంగంలో కూడా అడుగుపెట్టాలని బీపీసీఎల్ చూస్తుంది. దేశంలో ఈవీ మౌలిక సదుపాయాలను బలోపేతం చేయడం ద్వారా భవిష్యత్తులో కొత్త వ్యాపారంలో తన మార్క్ చూపాలని చూస్తుంది. భారత్ పెట్రోలియం ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ అరుణ్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. "రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఈవీ పరిశ్రమకు డిమాండ్ పెరగుతున్న నేపథ్యంలో పరిశ్రమకు మద్దతు ఇవ్వడానికి 7,000 స్టేషన్ల ఏర్పాటు చేయలని మేము లక్ష్యంగా పెట్టుకున్నాము. ఈ స్టేషన్లను 'ఎనర్జీ స్టేషన్లు' అని పిలుస్తారు" అని ఆయన అన్నారు. (చదవండి: ఆన్లైన్ సేల్స్ అదరహో..! అదరగొడుతున్న ఇళ్ల అమ్మకాలు..!) రాబోయే మూడేళ్లలో భారతదేశం అంతటా తన పెట్రోల్ బంకుల వద్ద 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేస్తామని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్) ప్రకటించిన నేపథ్యంలో బీపీసీఎల్ ఈ ప్రకటన చేసింది. 2024 నాటికి 10,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల లక్ష్యాన్ని సాధించడానికి రాబోయే 12 నెలల్లో 2,000 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను, ఆ తర్వాత రెండేళ్లలో మరో 8,000 స్టేషన్లను ఏర్పాటు చేస్తామని అక్టోబర్ 3న చమురు కంపెనీ ప్రకటించింది.