ప్రైవేట్‌...‘సై’రన్‌ | Cabinet nod to reduce government stake in BPCL, Concor, SCI | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌...‘సై’రన్‌

Published Thu, Nov 21 2019 5:25 AM | Last Updated on Thu, Nov 21 2019 5:28 AM

Cabinet nod to reduce government stake in BPCL, Concor, SCI - Sakshi

న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. పలు ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్‌ ప్రతిపాదనలకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్‌ సంస్థ ఎస్‌సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్‌ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది.

ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్‌ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనర్‌ భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌ (బీపీసీఎల్‌)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29% వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. ఇందులో నుమాలిగఢ్‌ రిఫైనరీని మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ తెలిపారు.

ప్రైవేటీకరణపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళన తలెత్తకుండా చూసేందుకు దీన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థ పరిధిలోకి చేర్చనున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు, కార్పొరేట్‌ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్‌ స్థానంలో ప్రత్యేక బిల్లును క్యాబినెట్‌ ఆమోదించింది. దీన్ని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్పొరేట్‌ ట్యాక్స్‌ తగ్గింపు, ఇతర ఊరట చర్యల కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్‌ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది.  

క్యాబినెట్‌ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు..
► షిప్పింగ్‌ కార్పొరేషన్‌(ఎస్‌సీఐ)లో మొత్తం 63.75% వాటాలను.. అలాగే కంటెయినర్‌ కార్పొరేషన్‌(కాన్‌కర్‌)లో 30.9% వాటాలు ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్‌కర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి.  
► టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్‌ ఈస్టర్న్‌ ఎలక్ట్రిక్‌ పవర్‌ కార్పొరేషన్‌ (నీప్‌కో)లో మొత్తం వాటాలను  ఎన్‌టీపీసీకి కేంద్రం విక్రయించనుంది.
► నియంత్రణ అధికారాలు తనకే ఉండే విధంగా.. ఇండియన్‌ ఆయిల్‌(ఐవోసీ)లో వాటాలను 51% లోపునకు తగ్గించుకోనుంది. ఇందులో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకున్న వాటాల కారణంగా నియంత్రణాధికారాలు కేంద్రానికే ఉంటాయి. ఐవోసీలో కేంద్రానికి ప్రస్తుతం 51.5% వాటా ఉండగా...  26.4% వాటాలను దాదాపు రూ. 33,000 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి.
► కాంట్రాక్టర్లు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నెలకొనే చెల్లింపుల వివాదాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు ఆర్బిట్రేషన్‌ ఉత్తర్వులను సవాల్‌ చేసినా.. చెల్లించాల్సి న మొత్తంలో 75%(బ్యాంకు పూచీకత్తుకు ప్రతి గా) కాంట్రాక్టరుకు చెల్లించేందుకు ఓకే చెప్పింది.

 

టెల్కోలకు ఊరట..
ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్‌టెల్, వొడాఫోన్‌ ఐడియా, రిలయన్స్‌ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్‌) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement