slowdown economy
-
భారత్ వృద్ధి రేటు అంచనాకు మూడీస్ రెండవ కోత
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి అంచనాలను వరుసగా రెండవసారి రేటింగ్ దిగ్గజం మూడీస్ తగ్గించింది. 2022 భారత్ వృద్ధి రేటును 7.7 శాతం నుంచి 7 శాతానికి తగ్గిస్తున్నట్లు తెలిపింది. ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు, అంతర్జాతీయ మందగమనం వంటి అంశాలు తాజా నిర్ణయానికి కారణమని పేర్కొంది. తొలుత ఈ ఏడాది మే నెల్లో 2022 వృద్ధి అంచనాలను మూడీస్ 8.8 శాతంగా అంచనావేసింది. అయితే సెప్టెంబర్‌లో 7.7 శాతానికి తగ్గించింది. రెండు నెలలు గడవకముందే మరోసారి ‘కోత’ నిర్ణయం తీసుకుంటున్నట్లు అంతర్జాతీయ స్థూల ఆర్థిక అంశాల అవుట్‌లుక్ 2023–24 నివేదికలో మూడీస్ పేర్కొంది. 2024లోనే వెలుగు రేఖలు... 2023లో మరింతగా 4.8 శాతానికి వృద్ధి రేటు తగ్గి, 2024లో 6.4 శాతానికి మెరుగుపడుతుందని అవుట్‌లుక్ పేర్కొంది. 2021 క్యాలెండర్ ఇయర్లో భారత్ వృద్ధి 8.5 శాతమని మూడీస్ పేర్కొంది. బలహీన రూపాయి, అధిక చమురు ధరలు ఎకానమీపై ప్రతికూల ప్రభావాన్ని కొనసాగిస్తాయని మూడీస్ అంచనావేసింది. 2023, 2024లో అంతర్జాతీయ వృద్ధి స్పీడ్ మందగిస్తుందని పేర్కొంటూ, 2023లో జీ–20 దేశాల జీడీపీ 1.3 శాతం క్షీణిస్తుందని తెలిపింది. క్రితం 2.1 శాతం క్షీణ అంచనాలు తగ్గడం కొంత ఊరట. తాజా ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సహా పలు దేశీయ, అంతర్జాతీయ బ్యాంకింగ్, ఆర్థి క, వాణిజ్య దిగ్గజ సంస్థలు 2022–23 భారత్ తొలి వృద్ధి అంచనాలకు కోత పెడుతున్న సంగతి తెలిసిందే. 6.5 శాతం నుంచి 7.3 శాతం శ్రేణిలో వృద్ధి న మోదవుతుందన్నది ఆయా అంచనాల సారాంశం. -
2022–23లో భారత్ వృద్ధి 6.9 శాతం
ముంబై: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) 6.9 శాతంగా నమోదవుతుందని యూబీఎస్ ఆర్థికవేత్తలు అంచనావేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2023–24) ఈ రేటు మరింతగా 5.5 శాతానికి పడిపోతుందని స్విస్ బ్రోకరేజ్ సంస్థ ఎకనమిస్టులు ఒక నివేదికలో విశ్లేషించారు. 2024–25లో 6 శాతం వృద్ధి అంచనా వేసిన సంస్థ, దీర్ఘకాలిక సగటు ఇదే స్థాయిలో కొనసాగుతుందని పేర్కొంది. ప్రపంచ వృద్ధి మందగమనం, కఠిన ద్రవ్య విధానాలు భారత్ వృద్ధి మందగమనానికి కారణమని నివేదిక పేర్కొంది. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ► ప్రపంచ ఆర్థిక పరిణామాల ప్రభావం తక్కువగా ఉండే దేశాల్లో భారత్ కూడా ఒకటైనప్పటికీ, ఈ ప్రతికూలతల నుంచి భారత్ ఎకానమీ తప్పించుకోలేదు. ► భారత్ వ్యవస్థీకృత వృద్ధి ధోరణి చెక్కుచెదరకుండా ఉంది. అయితే ద్రవ్యోల్బణం, ద్రవ్యలోటు, కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్) వంటి స్థూల ఆర్థిక అంశాల స్థిరత్వంపై సమీప కాలంలో భారత్ దృష్టి సారించాలి. లేదంటే తీవ్ర ప్రతికూల పరిస్థితులకు అవకాశం ఉంది. ► ద్రవ్యోల్బణం కట్టడి లక్ష్యంగా 4 శాతం కనిష్టం నుంచి 1.90 శాతం పెరిగి 5.9 శాతానికి ఎగసిన రెపో రేటు (బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు) మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది వృద్ధికి విఘాతం కలిగించే అంశం. ► కోవిడ్ ప్రభావం తగ్గిన వెంటనే వినియోగదారుల వ్యయంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. గృహాల కొనుగోలు శక్తి పెరిగింది. అయితే ఈ సానుకూల ప్రభావాలు వడ్డీరేట్ల పెంపు పరిణామాలతో ప్రభావితం అయ్యే అవకాశం ఉంది. పొదుపుల్లో క్షీణత నమోదుకావచ్చు. అలాగే అసంపూర్తిగా మిగిలిఉన్న లేబర్ మార్కెట్ పునరుద్ధరణ... గృహాల కొనుగోలు శక్తి, డిమాండ్‌పై ప్రభావం చూపుతుంది. ► ఈ పరిస్థితి కంపెనీలు తమ పెట్టుబడి ప్రణాళికల అమలును వాయిదే వేసే అవకాశం ఉంది. ► కొన్ని క్లిష్టతలు ఉన్నప్పటికీ ప్రభుత్వ పెట్టుబడులు పెరిగే అవకాశాలే ఉన్నాయి. ప్రతికూల ఫలితాల తగ్గింపు, ప్రైవేటు మూలధనానికి ప్రోత్సాహం వంటి అవకాశాలు దీనివల్ల ఒనగూరతాయి. ► ఇక ఎగుమతుల విషయానికి వస్తే, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి ప్రభావం ఉంటుంది. 450 బిలియన్ డాలర్ల ఎగుమతుల లక్ష్య సాధన కొంత క్లిష్టంగా మారవచ్చు. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకుల నిరోధానికి సెంట్రల్ బ్యాంక్– రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) తగిన చర్యలు తీసుకుంటోంది. ఇతర సెంట్రల్ బ్యాంకులతో సమన్వయాన్ని సాధిస్తోంది. ► 2024లో సాధారణ ఎన్నికలను ఎదుర్కొననున్న కేంద్ర ప్రభుత్వం, వృద్ధికి మద్దతుగా ద్రవ్య స్థిరీకరణ విధానాలను కొంత నెమ్మది చేయచ్చు. ఇది ద్రవ్యలోటు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపే వీలుంది. -
స్టార్టప్‌లకు నిధుల కొరత
న్యూఢిల్లీ: స్టార్టప్‌లకు నిధుల మద్దతు తగ్గింది. అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ మందగమనంతో దేశంలో స్టార్టప్‌లకు నిధుల సాయం సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో రెండేళ్ల కనిష్ట స్థాయి అయిన 2.7 బిలియన్ డాలర్లకు (రూ.21,870 కోట్లు) పరిమితమైంది. 205 డీల్స్ నమోదయ్యాయి. ఈ మేరకు పీడబ్ల్యూసీ ఓ నివేదికను విడుదల చేసింది. జూలై–సెప్టెంబర్ కాలంలో కేవలం రెండు స్టార్టప్‌లు యూనికార్న్ హోదా సాధించాయి. యూనికార్న్ హోదా పొందే విషయంలో అంతర్జాతీయంగా ఉన్న ధోరణే మన దగ్గరా కనిపించింది. అంతర్జాతీయంగా చూస్తే సెప్టెంబర్ క్వార్టర్లో 20 స్టార్టప్‌లు యూనికార్న్ హోదా పొందగా, ఇందులో 45 శాతం కంపెనీలు సాస్ విభాగం నుంచే ఉన్నాయి. ఇక డెకాకార్న్ స్థాయికి ఒక్కటీ చేరుకోలేదు. అన్ని విభాగాల్లోనూ క్షీణత.. ఆరంభ దశ, వృద్ధి దశ, తదుపరి దశ ఇలా అన్ని విభాగాల్లోని స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో నిధుల మద్దతు తగ్గింది. ఆరంభ స్థాయి డీల్స్ విలువ సెప్టెంబర్ త్రైమాసికంలో 21 శాతంగా ఉంది. అంతకుముందు మూడు నెలల కాలంలో ఆరంభ స్థాయి డీల్స్ విలువ 12 శాతంతో పోలిస్తే రెట్టింపైంది. ముఖ్యంగా స్టార్టప్‌లకు వెంచర్ క్యాపిటల్ సంస్థలు (వీసీలు) మద్దతుగా నిలుస్తున్నాయి. వృద్ధి దశ, తదుపరి దశ స్టార్టప్‌లకు సెప్టెంబర్ త్రైమాసికంలో 79 శాతం నిధులు వెళ్లాయి. ‘‘స్టార్టప్‌లకు నిధుల మార్కెట్లో మందగమనం ఎంత కాలం కొనసాగుతుందో తెలియదు. వ్యవస్థాపకులు, ఇన్వెస్టర్లు డీల్స్ విషయంతో జాగ్రత్త పాటిస్తున్నారు’’ అని పీడబ్ల్యూసీ ఇండియా డీల్స్ పార్ట్నర్ అమిత్ నవకా పేర్కొన్నారు. కాగా, ఇన్వెస్టర్లు గణనీయమైన నిధులు సమీకరించారని, ఈ నిధులు ఇండియన్ స్టార్టప్ ఎకోసిస్టమ్‌లోకి రానున్నాయని నివేదిక అంచనా వేసింది. ఒక్కో డీల్ 4-5 డాలర్లు.. సెప్టెంబర్ క్వార్టర్లో ఒక్కో డీల్ టికెట్ విలువ సగటున 4–5 మిలియన్ డాలర్లు (రూ.32.5-40.5 కోట్లు)గా ఉంంది. సెప్టెంబర్ క్వార్టర్లో 38 విలీనాలు, కొనుగోళ్ల (ఎంఅండ్ఏ) డీల్స్ నమోదయ్యాయి. ఇందులో 30 దేశీ డీల్స్ ఉన్నాయి. సాస్, ఎడ్యుటెక్ స్టార్టప్‌లలో ఎక్కువ ఎం అండ్ఏ లు నమోదయ్యాయి. ఎడ్యుటెక్ కంపెనీ ‘అప్‌గ్రాడ్’ నాలుగు కంపెనీలను సొంతం చేసుకుని మొదటి స్థానంలో నిలిచింది. -
ఎగుమతులు డౌన్
న్యూఢిల్లీ: అంతర్జాతీయంగా మందగమన ధోరణుల నేపథ్యంలో మార్చిలో ఎగుమతులు ఏకంగా 34.57 శాతం క్షీణించి 21.41 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. 2008–09 తర్వాత ఒక నెలలో ఇంత భారీగా ఎగుమతులు క్షీణించడం ఇదే ప్రథమం. 2009 మార్చిలో ఇవి 33.3 శాతం క్షీణించాయి. తాజాగా మార్చి గణాంకాలను కూడా కలిపి చూస్తే.. 2019–20 ఆర్థిక సంవత్సరం మొత్తానికి ఎగుమతులు 4.78 శాతం తగ్గి 314.31 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. లెదర్, వజ్రాభరణాలు, పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు గణనీయంగా పడిపోవడం ఇందుకు కారణం. ‘అంతర్జాతీయంగా నెలకొన్న మందగమన ధోరణులకు కరోనా వైరస్‌పరమైన కారణాలు మరింత ఆజ్యం పోశాయి. ప్రధానంగా ఈ కారణాలతో ఎగుమతులు క్షీణించాయి. కరోనా సంక్షోభం కారణంగా సరఫరా వ్యవస్థలు, డిమాండ్ తీవ్రంగా దెబ్బతినడంతో ఆర్డర్ల రద్దుకు దారితీసింది‘ అని కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. ఊహించినదే..: మార్చి ద్వితీయార్థంలో ఎగుమతిదారులు ఉత్పత్తులు పంపలేకపోవడం, ఆర్డర్ల రద్దు, ఎగుమతుల్లో జాప్యం వంటి సమస్యలు నెలకొన్న నేపథ్యంలో తాజా గణాంకాలు ఊహించినవేనని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ శరద్ కుమార్ సరాఫ్ వ్యాఖ్యానించారు. 2020–21 తొలి త్రైమాసికంలో కూడా ఇదే ధోరణి ఉండొచ్చన్నారు. అయితే, అంతర్జాతీయ మార్కెట్ల పరిస్థితులను బట్టి రెండో త్రైమాసికం నుంచి ఎగుమతులు ఓ మోస్తరుగా పెరిగే అవకాశాలు ఉన్నాయని సరాఫ్ తెలిపారు. పూర్తి ఆర్థిక సంవత్సరానికి చాలా రంగాలు నెగెటివ్ వృద్ధే నమోదు చేశాయి. వీటిలో పెట్రోలియం (8.10 శాతం), హస్తకళలు (2.36 శాతం), ఇంజనీరింగ్ (5.87 శాతం), వజ్రాభరణాలు (11 శాతం), లెదర్ (9.64 శాతం) మొదలైనవి ఉన్నాయి. తేయాకు, కాఫీ, బియ్యం, పొగాకు మొదలైనవి కూడా 2019–20లో ప్రతికూల వృద్ధి నమోదు చేశాయి. దిగుమతుల్లో కూడా తగ్గుదల .. గత నెలలో దిగుమతులు కూడా 28.72% క్షీణించి 31.16 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. వాణిజ్యలోటు 9.76 బిలియన్ డాలర్లకు తగ్గింది. ఇక పూర్తి ఆర్థిక సంవత్సరంలో చూస్తే 9.12% క్షీణతతో 467.19 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. 2019–20లో నెగెటివ్ వృద్ధి నమోదైన దిగుమతి విభాగాల్లో పసిడి, వెండి, ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, రవాణా పరికరాలు, ఉక్కు, బొగ్గు, పెట్రోలియం ఉన్నాయి. ఉత్పత్తులు, సేవల ఎగుమతులు కలిపి 2019–20 ఆర్థిక సంవత్సరంలో 528.45 బిలియన్ డాలర్లుగా ఉంటాయని అంచనా. అంతక్రితం ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 1.36% నెగటివ్ వృద్ధి ఉంటుందని అంచనా. -
భారత ఎకానమీకి కరోనా ముప్పు
న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ను మరింత కాలం కొనసాగించిన పక్షంలో భారత ఆర్థిక వ్యవస్థ పరిస్థితులు మరింత దిగజారే ముప్పు ఉందని ప్రముఖ ఆర్థికవేత్త జీన్ ద్రీజ్ అభిప్రాయపడ్డారు. లాక్‌డౌన్‌తో ఇప్పటికే దేశంలో పలు చోట్ల ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయని ఆయన చెప్పారు. లాక్డౌన్ విషయాన్ని పక్కన పెట్టినా అంతర్జాతీయ మాంద్య ప్రభావాలు సైతం భారత ఎకానమీపై ప్రతికూలంగా ఉండవచ్చని పేర్కొన్నారు. కరోనావైరస్ వ్యాప్తితో దేశీయంగా కొన్ని రంగాలు కుదేలైనప్పటికీ.. సంక్షోభ సమయంలో కూడా మెడికల్ కేర్ వంటి కొన్ని విభాగాలు వృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అయితే, కొన్ని రంగాలు సరిగ్గా లేకపోతే మిగతా రంగాలు మనలేవన్నారు. ‘సైకిల్ టైరుకు పంక్చర్ పడితే ఒక్క చక్రంతో ఎలాగైతే ముందుకు వెళ్లలేదు కదా. అలాగే, లాక్డౌన్ కారణంగా సంక్షోభం కొనసాగిన పక్షంలో అది బ్యాంకింగ్ వ్యవస్థ సహా ఎకానమీలోని మిగతా రంగాలన్నింటినీ దెబ్బతీస్తుంది‘ అని ద్రీజ్ చెప్పారు. లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులంతా స్వస్థలాలకు చేరుకునేందుకు ప్రయత్నిస్తారని, కొంత కాలం దాకా మళ్లీ వలస వెళ్లకపోవచ్చని అభిప్రాయపడ్డారు. స్వంతంగా పొలాలు ఉన్న వారికి తప్ప స్వస్థలాల్లో ఉపాధి దొరికే పరిస్థితి లేదని చెప్పారు. మరోవైపు, వలస కార్మికులు వెళ్లిపోవడంతో వారిపై ఎక్కువగా ఆధారపడిన రంగాల్లో కార్మికుల కొరత ఏర్పడుతుందన్నారు. -
సంక్షోభాన్ని అధిగమించేందుకు ఆర్థిక చేయూత కావాలి...
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థపై కరోనా వైరస్ ప్రభావాన్ని అధిగమించేందుకు ప్రభుత్వం చేయూతనివ్వాలని దేశీయ పరిశ్రమలు కేంద్రాన్ని కోరాయి. రుణ చెల్లింపులపై మారటోరియం విధించడం, పన్నుల తగ్గింపు, ప్రజలకు రూ.2లక్షల కోట్ల ఆర్థిక ఉద్దీపనలు అందించాలని సూచించాయి. మన దేశ ఆర్థిక వ్యవస్థ కరోనా వైరస్ రాకముందే మందగమనంలో ఉంది. గత డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్ట స్థాయి 4.7 శాతానికి పడిపోయింది. తాజాగా కరోనా వైరస్‌తో దేశవ్యాప్తంగా అన్నీ మూతేయాల్సి వస్తుండడంతో ఆర్థిక వృద్ధి మరింత పడిపోయే ప్రమాదం ఉంది. విధానపరమైన చర్యలను ప్రభుత్వం వెంటనే అమల్లోకి తీసుకురాకపోతే 2020–21 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు 5 శాతం లోపునకు పడిపోవచ్చంటూ దేశీయ పరిశ్రమలు ఆందోళన వ్యక్తం చేశాయి. ద్రవ్య, పరపతి పరమైన ఉద్దీపన చర్యలను తక్షణమే ప్రకటించాలని సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ కోరారు. దేశ జీడీపీలో ఒక శాతానికి సమానమైన రూ.2 లక్షల కోట్లను పేదలకు ఆధార్ ఆధారిత ప్రత్యక్ష నగదు బదిలీ రూపంలో అందించాలని సీఐఐ కోరింది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి లేఖ రాసింది. స్టాక్ మార్కెట్లలో అస్థిరతలను తగ్గించేందుకు దీర్ఘకాలిక మూలధన లాభాల పన్నును తొలగించడాన్ని పరిశీలించాలని.. అలాగే, డివిడెండ్ పంపిణీ పన్నును 25 శాతంగా నిర్ణయించాలని కోరింది. రెపో రేటును 50 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడంతోపాటు, వసూలు కాని రుణాలను ఎన్పీఏలుగా గుర్తించడానికి ప్రస్తుతమున్న 90 రోజుల గడువును తాత్కాలికంగా అయినా 180 రోజులకు పెంచాలని సీఐఐ సూచనలు చేసింది. ఏడాది చివరి వరకు విరామం.. కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తులకు రుణ చెల్లింపులపై ఈ ఏడాది చివరి వరకు మారటోరియం (విరామం) ప్రకటించాలని అసోచామ్ కోరింది. ఎల్ఐసీ ద్వారా వెంటనే ఎన్‌బీఎఫ్‌సీలకు నిధులను అందించాలని సూచించింది. మన దేశంపై కరోనా ప్రభావం ఎక్కువగా ఉంటుందన్న అసోచామ్.. దురదృష్టవశాత్తూ దేశ రుణ మార్కెట్ బలహీనంగా ఉన్న, ఆర్థిక వ్యవస్థ మందగమనం సమయంలో ఈ సంక్షోభం వచ్చిందని వ్యాఖ్యానించింది. -
‘కోవిడ్’పైనే దృష్టి..!
న్యూఢిల్లీ: ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు సవాలు విసురుతోన్న కోవిడ్–19 (కరోనా) వైరస్.. చైనా నుంచి మొదలుకుని అమెరికా స్టాక్ మార్కెట్ వరకు అన్ని దేశాల ప్రధాన సూచీలను కుప్పకూల్చేసింది. ఈ వైరస్ పేరు వింటేనే ప్రపంచ వ్యాప్తంగా బుల్స్ వణికిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే దేశీ స్టాక్ మార్కెట్ గతవారంలో భారీ నష్టాలను చవిచూసింది. గడిచిన వారంలో సెన్సెక్స్ 2,873 పాయింట్లు (6.9 శాతం), నిఫ్టీ 879 పాయింట్లు (7.2 శాతం) నష్టపోయాయి. శుక్రవారం ఒక్కరోజులోనే బీఎస్ఈ సెన్సెక్స్ 1,448 పాయింట్లు పతనమై 38,297 పాయింట్ల వద్ద ముగిసింది. ఇక ఎన్ఎస్ఈ నిఫ్టీ 432 పాయింట్లు నష్టపోయి 11,202 పాయింట్ల వద్దకు పడిపోయింది. సెన్సెక్స్ చరిత్రలోనే ఇది రెండో అత్యంత భారీ పతనంగా నమోదైంది. ఇంతటి పతనానికి కారణమైన కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ఈ వారంలో సూచీలు కోలుకునేనా..? కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఇంకేం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. తాజాగా అమెరికాలోని వాషింగ్టన్లో కోవిడ్–19 కారణంగా ఓ వ్యక్తి మృతి చెందినట్టు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. చైనాలోని వూహాన్లో ఉద్భవించిన ఈ వైరస్.. చివరకు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెద్దన్నగా ఉన్న అమెరికాకు సైతం సోకడం మరింత కలవర పెడుతోంది. ఈ ప్రాణాంతక వైరస్ కారణంగా పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు మార్కెట్ వర్గాల్లో పెరిగిపోతున్నాయి. ప్రభుత్వాలు ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడం పట్ల ఎంత మేర విజయం సాధిస్తాయనే అంశం ఆధారంగానే మార్కెట్ కోలుకోవడం అనే అంశం ముడిపడి ఉందని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిశోధనా విభాగం చీఫ్ వినోద్ నాయర్ విశ్లేషించారు. ఇక డిసెంబర్ త్రైమాసికంలో దేశ జీడీపీ వృద్ధి రేటు ఏడేళ్ల కనిష్టానికి తగ్గిపోయింది. శుక్రవారం వెల్లడైన గణాంకాల ప్రకారం.. జీడీపీ 4.7 శాతంగా నమోదైంది. ఏడేళ్ల కనిష్టానికి పడిపోయింది. దేశ ఆర్థిక వృద్ధి రేటు కొంతమేర ఆశాజనకంగానే ఉన్నా మార్కెట్ నిలదొక్కుకునేదని ఎమ్కే వెల్త్ మేనేజ్మెంట్ రీసెర్చ్ హెడ్ జోసెఫ్ థామస్ విశ్లేషించారు. అంతర్జాతీయ అంశాలు, కరోనా వైరస్ పరిణామాలే ఈ వారంలో దేశీ సూచీలను నడిపిస్తాయని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్మోడీ అన్నారు. గణాంకాల ప్రభావం... మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం వెల్లడికానుండగా.. సర్వీసెస్ పీఎంఐ గణాంకాలు బుధవారం వెలువడనున్నాయి. అమెరికా మార్కిట్ తయారీ పీఎంఐ సోమవారం విడుదలకానుంది. మరోవైపు శుక్రవారం వెల్లడైన జీడీపీ డేటా ప్రభావం సోమవారం తొలి ట్రేడింగ్ సెషన్‌పై ప్రభావం చూపనుందని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఇక ఆదివారం వెల్లడైన ఆటో రంగ ఫిబ్రవరి నెల అమ్మకాలు కూడా నిరాశాజనకంగానే ఉన్నాయి. దేశీ దిగ్గజ కార్ల తయారీ సంస్థ మారుతీ విక్రయాలు గత నెలలో 1.6% పడిపోయాయి. ఫిబ్రవరిలో రూ. 6,554 కోట్ల పెట్టుబడి... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) గతనెల్లో రూ. 6,554 కోట్ల పెట్టుబడి పెట్టినట్లు డిపాజిటరీల డేటా ద్వారా వెల్లడయింది. ఫిబ్రవరి 3–28 కాలంలో ఈక్విటీ మార్కెట్లో రూ. 1,820 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 4,734 కోట్లను వీరు కుమ్మరించారు. మార్కెట్ గతవారం భారీ నష్టాలను చవిచూసినప్పటికీ.. వీరి పెట్టుబడులు ఈ స్థాయిలో నమోదు కావడం విశేషం. -
అంతర్జాతీయ అంశాలే నడిపిస్తాయ్..
ముంబై: కోవిడ్–19(కరోనా వైరస్) తాజా పరిణామాలు, ఏజీఆర్ అంశం వంటి పలు కీలక అంశాలు ఈ వారంలో దేశీ మార్కెట్‌కు దిశా నిర్దేశం చేయనున్నాయని దలాల్ స్ట్రీట్ వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా కరోనా వైరస్ గురించి ఎప్పుడు ఏం వినాల్సి వస్తుందో అనే అంశంపైనే మార్కెట్ వర్గాలు దృష్టిసారించాయి. చైనాలోని వూహాన్లో ఉద్భవించిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తోన్న నేపథ్యంలో పరిశ్రమలు మూత పడి ఆర్థిక వ్యవస్థ మరింత మందగమనంలోకి జారిపోవచ్చనే భయాలు పెరిగిపోతున్నాయి. ఈ వైరస్ మరణాల సంఖ్య ఇప్పటికే 1,500 దాటిపోవడం, వూహాన్లో అసలు ఏం జరుగుతుందో ప్రపంచానికి అందించాలనుకున్న ఇద్దరు జర్నలిస్ట్‌ల ఆచూకీ తెలియకుండా పోవడం వంటి పరిణామాలు సోమవారం ట్రేడింగ్‌పై ఉండవచ్చని నిపుణులు భావిస్తున్నారు. ఇక అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌ను అడ్డుకోవడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) తేల్చి చెప్పిన కారణంగా మార్కెట్ గమనానికి ఇది అత్యంత కీలకంగా మారిపోయిందని ట్రేడింగ్ బెల్స్ సీనియర్ అనలిస్ట్ సంతోష్ మీనా అన్నారు. ఇప్పటికే 28 దేశాలకు వ్యాపించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న ఈ వైరస్ సూచీల ప్రయాణానికి అతి పెద్ద సవాలుగా మారిందని శామ్కో సెక్యూరిటీస్ సీఈఓ జిమిత్ మోడీ అన్నారు. క్రూడ్ ధర పెరిగింది ముడి చమురు ధరలు గడిచిన 5 ట్రేడింగ్ సెషన్లలో నాలుగు రోజులు లాభపడ్డాయి. వీక్ ఆన్ వీక్ ఆధారంగా న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్ఛంజ్‌లో బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ 5 శాతం మేర పెరిగింది. శుక్రవారం 1.76 శాతం లాభపడి 57.33 డాలర్లకు చేరుకుంది. కరోనా వైరస్ కారణంగా క్రూడ్ ధరల్లో పెరుగుదల నమోదైంది. ఇది ఇలానే కొనసాగితే మార్కెట్‌పై ప్రతికూల ప్రభావం చూపుతుందని దలాల్ స్ట్రీట్ పండితులు చెబుతున్నారు. ఇక డాలరుతో రూపాయి మారకం విలువ 71.36 వద్దకు చేరుకుంది. బడ్జెట్ తరువాత నుంచి 71.10–71.50 శ్రేణిలోనే కదలాడుతోంది. అవెన్యూ సూపర్‌మార్ట్ (డీమార్ట్) స్టేక్ సేల్‌లో ఎఫ్ఐఐ నిధులు ఉండనున్నందున ఈ వారంలో రూపాయి మారకం విలువకు మద్దతు లభించే అవకాశం ఉందని ఎమ్కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కరెన్సీ రీసెర్చ్ రాహుల్ గుప్తా విశ్లేషించారు. ఆర్థిక అంశాల ప్రభావం.. ఫెడ్ జనవరి పాలసీ సమావేశం మినిట్స్‌ను ఫెడరల్ ఓపెన్ మార్కెట్ కమిటీ (ఎఫ్ఓఎంసీ) ఈనెల 20న (గురువారం) ప్రకటించనుంది. ఇదే రోజున ఆర్బీఐ మినిట్స్ వెల్లడికానున్నాయి. అమెరికా తయారీ పీఎంఐ, సర్వీసెస్ పీఎంఐ 21న వెల్లడికానున్నాయి. ఫిబ్రవరిలో ఎఫ్‌పీఐ నిధులు రూ. 24,617 కోట్లు విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐ) ఈ నెలలో ఇప్పటి వరకు మన క్యాపిటల్ మార్కెట్లో రూ. 24,617 కోట్లను ఇన్వెస్ట్ చేశారు. ఫిబ్రవరి 1–14 కాలంలో వీరు స్టాక్ మార్కెట్లో రూ. 10,426 కోట్లు, డెట్ మార్కెట్లో రూ. 14,191 కోట్లు ఇన్వెస్ట్‌చేసినట్లు డిపాజిటరీల డేటా పేర్కొంది. ఈ వారంలో ట్రేడింగ్ 4 రోజులే.. మహా శివరాత్రి సందర్భంగా శుక్రవారం (21న) దేశీ స్టాక్ ఎక్సే్ఛంజీలు సెలవు ప్రకటించాయి. దీంతో ఈ వారంలో ట్రేడింగ్ నాలుగు రోజులకే పరిమితమైంది. -
ఆర్బిఐ ద్రవ్యపరపతి విధానసమీక్ష ప్రారంభం
-
ఆర్బీఐ వైపు అందరి చూపు..!
ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్య పరపతి విధాన సమీక్షా సమావేశం మంగళవారం నుంచి ప్రారంభం కానుంది. 6వ తేదీ వరకూ ఈ సమావేశం జరుగుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2019–2020) చివరి, ఆరవ ద్వైమాసిక ఆర్బీఐ పాలసీ సమావేశం ఇది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మందగమనం, ద్రవ్యోల్బణం కట్టుతప్పడం వంటి ప్రతికూలతల నేపథ్యంలో తాజా సమావేశం జరుగుతోంది. ధరలూ సామాన్యునిపై భారాన్ని మోపుతున్నాయి. మొత్తంగా గణాంకాలు దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తుండగా, నిత్యావసరాల ధరలు మాత్రం చుక్కలు చూపిస్తున్నాయి. కట్టుతప్పిన ద్రవ్యోల్బణం రిటైల్ ద్రవ్యోల్బణం 2 శాతం ఉండాలన్నది ఆర్బీఐకి కేంద్రం నిర్దేశం. అయితే, దీనికి ‘ప్లస్ 2’ లేదా ‘మైనస్ 2’ శాతాన్ని తగిన స్థాయిగా పరిగణనలోకి తీసుకుంటారు. కాగా ఉల్లి తదితర కూరగాయల రేట్లు ఆకాశాన్నంటడంతో డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా ఎగిసింది. ప్రభుత్వం, రిజర్వ్ బ్యాంక్ నిర్దేశించుకున్న స్థాయిని దాటేసి.. ఏకంగా 7.35 శాతంగా నమోదైంది. ఇది అయిదున్నరేళ్ల గరిష్ట స్థాయి. 2018 డిసెంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం 2.11 శాతంగా ఉండగా, 2019 నవంబర్‌లో 5.54 శాతంగాను, డిసెంబర్లో 7.35 శాతంగాను నమోదైంది. చివరిసారిగా 2014 జూలైలో తొలిసారిగా నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పాటైనప్పుడు.. రిటైల్ ద్రవ్యోల్బణం 7.39 శాతం. ఆ తర్వాత మళ్లీ ఆ స్థాయిని డిసెంబర్లో తాకడం ఇదే ప్రథమం. ఆర్బీఐ పాలసీ విధానానికి రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రాతిపదిక. ఇక దేశంలో మందగమన పరిస్థితులను ప్రతిబింబిస్తూ, డిసెంబర్లో టోకు ద్రవ్యోల్బణం 2.59 శాతంగా నమోదైంది. ఈ పరిస్థితుల్లో ఆర్బీఐ పాలసీ నిర్ణయం ఏమిటన్నది వేచిచూడాల్సి ఉంది. ఆరు సార్లలో ఐదు సార్లు తగ్గింపు... ఫిబ్రవరి 7వ తేదీతో మొదలుకొని డిసెంబర్ 5 మధ్య జరిగిన ఆరు ద్వైమాసిక ద్రవ్య పరపతి సమీక్షా సమావేశాల సందర్భంగా చివరిసారి మినహా అంతకుముందు వరుసగా ఐదుసార్లు బ్యాంకులకు తానిచ్చే వసూలు చేసే వడ్డీరేటు– రెపోను 135 బేసిస్ పాయింట్లమేర ఆర్బీఐ తగ్గించింది. దీనితో ఈ రేటు 5.15 శాతానికి దిగివచ్చింది. ధరల పెరుగుదల రేటు అదుపులో ఉండడంతో వృద్ధే లక్ష్యంగా రేటు కోత నిర్ణయాలు తీసుకోగలిగిన ఆర్బీఐ, ద్రవ్యోల్బణం భయాలతోనే చివరి సమావేశంలో ఈ దిశలో నిర్ణయం తీసుకోలేకపోయింది. -
రుణ వృద్ధిలేదు... వ్యాపారాలూ బాగోలేదు!
న్యూఢిల్లీ: భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు అంచనాలను అంతర్జాతీయ రేటింగ్ దిగ్గజ సంస్థ– ఫిచ్ కుదించింది. 2019 (ఏప్రిల్)–2020 (మార్చి) ఆర్థిక సంవత్సరంలో కేవలం 4.6 శాతం వృద్ధి రేటు మాత్రమే నమోదవుతుందని తాజాగా అంచనావేసింది. ఇంతక్రితం ఈ అంచనా 5.6 %. బ్యాంకింగ్ రుణ వృద్ధి మందగమనం, పుంజుకోని పారిశ్రామిక, వ్యాపార రంగాలు, వినియోగ విశ్వాసం దెబ్బతినడం వంటి కారణాలను ఫిచ్ తన నివేదికలో ఉటంకించింది. నివేదికలోని కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► భారత్ రేటింగ్‌ను స్టేబుల్ అవుట్‌లుక్‌తో ‘బీబీబీ–’గానే కొనసాగిస్తున్నాం. మధ్యకాలికంగా చూస్తే, వృద్ధి అవుట్‌లుక్ పటిష్టంగా ఉండడమే దీనికి కారణం. విదేశీ మారకపు నిల్వల స్థాయి పటిష్టంగా ఉండడం సానుకూల అంశం. ► ఆర్బీఐ (5 శాతం), మూడీస్ (4.9 శాతం), ఏడీబీ (5.1శాతం) కన్నా తాజాగా ఫిచ్ అంచనాలు తక్కువగా ఉండడం గమనార్హం. ► 2020–21లో జీడీపీ క్రమంగా పుంజుకునే అవకాశం ఉంది. ఈ రేటు 5.6 శాతంగా నమోదుకావచ్చు. 2021–22లో వృద్ధి రేటు మరింత పెరిగి 6.5 శాతానికి చేరే వీలుంది. ఆర్బీఐ తీసుకున్న ద్రవ్య పరపతి విధాన చర్యలు (వరుసగా ఐదు ద్వైమాసిక సమావేశంలో 135 శాతం రెపో కోత. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో ప్రస్తుతం 5.15 శాతం), పన్నురేటు తగ్గించడంసహా కేంద్రం చేపట్టిన ఆర్థిక సంస్కరణలు వృద్ధిరేటు పురోగతికి దోహదపడే వీలుంది. ► 2019–20 ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ ఆదాయాలు–వ్యయాలకు మధ్య నికర వ్యత్యాసం ద్రవ్యలోటు స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.3 శాతంగా ఉండాలన్నది లక్ష్యమయినా, ఇది కొంత అదుపు తప్పే అవకాశం ఉంది. 2019– 20లో మొత్తంలో ద్రవ్యలోటు పరిమాణం రూ.7.03 లక్షల కోట్లుగా ఉండాలన్నది (జీడీపీలో 3.3 శాతం) బడ్జెట్ లక్ష్యం. కానీ అక్టోబర్ ముగిసే నాటికే ఈ మొత్తం రూ.7,20,445 కోట్లకు చేరింది. అంటే బడ్జెట్ అంచనాల్లో 102.4 శాతానికి చేరిందన్నమాట. ► 2020లో ఆర్బీఐ మరో 65 బేసిస్ పాయింట్ల రేటు కోత నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇదే జరిగితే రెపో రేటు 4.5 శాతానికి వస్తుంది. ► నవంబర్‌లో ధరల పెరుగుదల రేటు 5.5 శాతంగా ఉంది. -
172% పెరిగిన ఉల్లిపాయల ధర
న్యూఢిల్లీ: టోకు ధరల సూచీ (డబ్ల్యూపీఐ) ఆధారిత ద్రవ్యోల్బణం నవంబర్ గణాంకాలు వ్యవస్థలో మందగమన స్థితికి అద్దం పట్టాయి. ధరల స్పీడ్ కేవలం 0.58 శాతంగా నమోదయ్యింది. అంటే 2018 నవంబర్‌లో టోకు ధరల బాస్కెట్‌తో పోల్చిచూస్తే, 2019 నవంబర్‌లో అదే బాస్కెట్ ధర కేవలం 0.58 శాతమే పెరిగిందన్నమాట. అయితే సామాన్యునికి సంబంధించి నిత్యావసర వస్తువుల ధరలు మాత్రం ఆందోళన కలిగిస్తున్నాయి. ఉల్లిపాయ ధరలు వార్షికంగా చూస్తే, ఏకంగా 172 శాతం పెరిగాయి. ఈ ధరలూ పెరగకపోతే, టోకు ద్రవ్యోల్బణం క్షీణతలోకి జారిపోయేదని అంచనా. 2019 అక్టోబర్‌లో ద్రవ్యోల్బణం 0.16 శాతం అయితే 2018 నవంబర్‌లో ఈ రేటు 4.47 శాతం. ప్రభుత్వం సోమవారం విడుదల చేసిన గణాంకాల్లో ముఖ్యాంశాలు చూస్తే... తయారీ: మొత్తం సూచీలో దాదాపు 60 శాతం వాటా ఉన్న తయారీ రంగంలో ధరల పెరుగుదల అసలు నమోదుకాలేదు. 2018 నవంబర్‌తో పోల్చితే 2019 నవంబర్‌లో ఈ బాస్కెట్ ధర –0.84 శాతం క్షీణించింది. 2018 నవంబర్‌లో ఈ రేటు 4.21 శాతం. ఇంధనం, విద్యుత్: సూచీలో దాదాపు 22 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో కూడా ద్రవ్యోల్బణం –7.32 శాతం క్షీణించింది. గత ఏడాది నవంబర్‌లో ఈ విభాగంలో ద్రవ్యోల్బణం 15.54 శాతం. ప్రైమరీ ఆర్టికల్స్: ఫుడ్, నాన్ ఫుడ్ ఆర్టికల్స్‌తో కూడిన ఈ విభాగంలో ద్రవ్యోల్బణం భారీగా 7.68 శాతం పెరిగింది. 2018 నవంబర్‌లో ఈ రేటు 0.59 శాతం మాత్రమే. ఇక ఇందులోనూ నాన్–ఫుడ్ ఆర్టికల్స్ విభాగాన్ని చూసుకుంటే ద్రవ్యోల్బణం 6.40 శాతం నుంచి 1.93 శాతానికి తగ్గింది. సామాన్యుడిపై భారం... ఫుడ్ ఆర్టికల్స్ చూస్తే... 2018 నవంబర్‌లో అసలు ఈ విభాగంలో పెరుగుదల నమోదుకాకపోగా, –3.24 శాతం క్షీణతలో ఉంది. అయితే తాజా సమీక్షా నెల నవంబర్‌లో ఈ బాస్కెట్ ధర ఏకంగా 11.08 శాతం ఎగసింది. గడచిన 71 నెలల్లో ఈ స్థాయిలో ఆహార ఉత్పత్తుల ధరలు పెరగడం ఇదే తొలిసారి. అక్టోబర్‌లో ఈ రేటు 9.80 శాతంగా ఉంది. ఉల్లిపాయల ధరలు 172 శాతం పెరిగితే, కూరగాయల విషయంలో ఈ ధర స్పీడ్ 45.32 శాతంగా ఉంది. పప్పు దినుసుల ధరలు టోకున 16.59 శాతం ఎగశాయి. -
ఇతర మెట్రోలతో పోలిస్తే హైదరాబాద్ బెస్ట్
ఢిల్లీ.. ఊపిరి కూడా పీల్చుకోలేని అత్యంత కాలుష్య నగరం. ముంబై, చెన్నైలలో వరదలు, సునామీ.. బెంగళూరులో రాజకీయ అస్థిరత. కోల్‌కతా, పుణే, అహ్మదాబాద్‌లో కొరవడిన స్థలాల లభ్యత, అధిక ధరలు. ఇక, మిగిలింది హైదరాబాదే! మెట్రో, ఓఆర్‌ఆర్‌లతో కనెక్టివిటీ, మెరుగైన మౌలిక వసతులు, అందుబాటు ధరలు, కట్టుదిట్టమైన భద్రత, కాస్మోపాలిటన్ కల్చర్.. అన్నింటికీ మించి స్థిరమైన ప్రభుత్వం.. ఇదీ సింపుల్‌గా హైదరాబాద్ అడ్వాంటేజెస్! సాక్షి, హైదరాబాద్: 2019 జనవరి నుంచి సెప్టెంబర్ మధ్య కాలంలో నగరంలో 40 లక్షల గ్రేడ్–ఏ ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఆఫీస్ అద్దెలు 9 శాతం మేర పెరిగాయి. సుమారు 13,361 గృహాలు విక్రయమయ్యాయి. 190 మిలియన్ డాలర్ల పీఈ పెట్టుబడులొచ్చాయి. ఏ నగరం అభివృద్ధికైనా సరే కావాల్సింది ఉద్యోగ అవకాశాలే. ఇప్పటివరకు కంపెనీలు, ఉద్యోగాలు, పెట్టుబడులు అన్నీ గచ్చిబౌలి, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వంటి పశ్చిమ ప్రాంతాల్లోనే కేంద్రీకృతమయ్యాయి. అందుకే గత కొంత కాలంగా ప్రభుత్వం నగరం నలువైపులా సమాంతర అభివృద్ధి చర్యలు చేపడుతుంది. శ్రీశైలం, వరంగల్, విజయవాడ జాతీయ రహదారులపై ప్రత్యేక దృష్టిసారించింది. ఐటీ, ఫార్మా, ఫుడ్ ప్రాసెసింగ్, టెక్స్టైల్స్, ఎయిరోస్పేస్, ఎలక్ట్రానిక్, ఆటోమోబైల్ రంగాల్లో ప్రత్యేక పార్క్‌ల ఏర్పాటుకు ప్రణాళికలు చేస్తుంది. ఆదిభట్లలో ఎయిరోస్పేస్, ముచ్చర్లలో ఫార్మా సిటీ, చౌటుప్పల్‌లోని దండుమల్కాపూర్‌లో ఎంఎస్ఎంఈ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్‌లను ప్రారంభించింది కూడా. ఈస్ట్ జోన్ అభివృద్ధికి త్వరలోనే లుక్ ఈస్ట్ పాలసీని తీసుకురానుంది. వినూత్న నిర్మాణాలతో స్వాగతం.. కాస్మోపాలిటన్ సిటీకి తగ్గట్టుగానే ఇక్కడి డెవలపర్లు కూడా వినూత్న ఆర్కిటెక్చర్లతో భవనాలను నిర్మిస్తున్నారు. బిల్డింగ్ సైజ్, స్ట్రక్చర్, ఆర్కిటెక్చర్ అన్నింట్లోనూ అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తున్నారని సుచిరిండియా సీఈఓ డాక్టర్ లయన్ కిరణ్ చెప్పారు. సరికొత్త టెక్నాలజీ వినియోగంతో ల్యాండ్ మార్క్ ప్రాజెక్ట్‌లతో సిటీకి అదనపు అందాన్ని తీసుకొస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం కూడా తమ వంతుగా మెట్రో కనెక్టివిటీని పెంచడంతో పాటూ ట్రామ్స్, డబుల్ డెక్కర్ ఫ్లై ఓవర్లు, హ్యాంగింగ్ బ్రిడ్జ్‌లతో మరింత ఆకట్టుకోవాలని సూచించారు. ఫార్మా సిటీ, ఐటీ హబ్‌లను సరిగ్గా వినియోగించుకుంటే 10–15 లక్షల అదనపు ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. రెండేళ్లలో బెంగళూరు బీట్.. ప్రస్తుతం ఆర్థిక మాంద్యం, బ్యాంకింగ్, ఆటో రంగాల్లో సంక్షోభం, ఐటీ ఉద్యోగుల తొలగింపులతో రియల్టీ మందగమనంలో ఉంది. అయితే ఇది తాత్కాలికమేనని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలతో మళ్లీ అభివృద్ధి పరుగులు పెడుతుంది. కొత్త జిల్లాల్లో పరిపాలన భవనాల ఏర్పాటు, మిషన్ భగీరథ వంటి వాటితో జిల్లాల్లో పొలాలకు, స్థలాలకు డిమాండ్ పెరిగిందని, గతేడాదితో పోలిస్తే 10–15 శాతం ధరలు పెరిగాయని ఏషియా పసిఫిక్ ఎండీ ఎస్ రాధాకృష్ణ తెలిపారు. మెట్రో విస్తరణతో పాటూ త్రిబుల్ ఆర్, ఫార్మా సిటీ, ఐటీఐఆర్‌లను పట్టాలెక్కించగలిగితే.. వచ్చే రెండేళ్లలో బెంగళూరును బీట్ చేయడం ఖాయమని పేర్కొన్నారు. -
దివాలా చర్యల్లో రూ.4.6 లక్షల కోట్ల గృహ ప్రాజెక్టులు: జేఎల్ఎల్
ముంబై: రియల్ ఎస్టేట్ మార్కెట్లో మందగమనం, నిధుల లభ్యత సమస్యలతో 66 బిలియన్ డాలర్ల విలువైన (రూ.4.6 లక్షల కోట్లు) నివాసిత గృహ ప్రాజెక్టులు దివాలా చర్యలను ఎదుర్కొనే పరిస్థితి వచ్చిందని స్థిరాస్థి కన్సల్టెన్సీ జేఎల్ఎల్ తెలిపింది. ఎన్నో కారణాలతో 4.52 లక్షల యూనిట్లు గడువు దాటిపోయినా పూర్తి కాకుండా కొనసాగుతున్నట్టు ఈ సంస్థ వెల్లడించింది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో నివాసిత రియల్ ఎస్టేట్ విభాగంలోనే సమస్యలను ఎదుర్కొంటున్న ఆస్తులు (స్ట్రెస్డ్ అసెట్స్) ఎక్కువగా ఉన్నాయి. ఆలస్యమైన, నిలిచిపోయిన ప్రాజెక్టుల్లో 4.54 లక్షల యూనిట్లు గడువు దాటినా కానీ పూర్తి కాకుండా ఉన్నాయి’’ అని జేఎల్ఎల్ తెలిపింది. వీటిల్లో కొన్ని ఇప్పటికే దివాలా చర్యల పరిధిలో ఉన్నాయని, వీటి విలువ 66 బిలియన్ డాలర్లుగా ఉంటుందని పేర్కొంది. -
ప్రైవేట్...‘సై’రన్
న్యూఢిల్లీ: ఆర్థిక వ్యవస్థలో మందగమనం నేపథ్యంలో ఆదాయాన్ని పెంచుకునే దిశగా కేంద్రం భారీ స్థాయిలో ప్రైవేటీకరణకు తెరతీసింది. పలు ప్రభుత్వ రంగ దిగ్గజాల్లో (పీఎస్‌యూ) డిజిన్వెస్ట్‌మెంట్ ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చమురు దిగ్గజం బీపీసీఎల్, షిప్పింగ్ సంస్థ ఎస్సీఐ, కార్గో సేవల సంస్థ కాన్‌కర్‌లో వాటాల విక్రయానికి కేంద్ర క్యాబినెట్ ఆమోదముద్ర వేసింది. దీంతో పాటు కొన్ని ప్రభుత్వ రంగ సంస్థల్లో వాటాలను 51 శాతం లోపునకు తగ్గించుకునే ప్రతిపాదనకు కూడా ఆమోదం తెలిపింది. ప్రధాని మోదీ సారథ్యంలో బుధవారం జరిగిన సమావేశంలో ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఈ మేరకు నిర్ణయాలు తీసుకుంది. దీని ప్రకారం, దేశీయంగా రెండో అతి పెద్ద రిఫైనర్ భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (బీపీసీఎల్)లో కేంద్రం తనకున్న మొత్తం 53.29% వాటాలను విక్రయించడంతో పాటు యాజమాన్య అధికారాలను కూడా బదలాయించనుంది. ఇందులో నుమాలిగఢ్ రిఫైనరీని మినహాయించనున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ప్రైవేటీకరణపై ఈశాన్య రాష్ట్రాల్లో ఆందోళన తలెత్తకుండా చూసేందుకు దీన్ని ప్రభుత్వ రంగ చమురు సంస్థ పరిధిలోకి చేర్చనున్నట్లు ఆమె వివరించారు. మరోవైపు, కార్పొరేట్ ట్యాక్స్‌ను 22 శాతానికి తగ్గిస్తూ ప్రవేశపెట్టిన ఆర్డినెన్స్ స్థానంలో ప్రత్యేక బిల్లును క్యాబినెట్ ఆమోదించింది. దీన్ని ఈ శీతాకాల సమావేశాల్లోనే పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. కార్పొరేట్ ట్యాక్స్ తగ్గింపు, ఇతర ఊరట చర్యల కారణంగా ప్రభుత్వానికి ఏటా రూ. 1.45 లక్షల కోట్ల మేర ఆదాయం తగ్గనుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో డిజిన్వెస్ట్‌మెంట్ ద్వారా రూ. 1.05 లక్షల కోట్లు సమీకరించాలని కేంద్రం నిర్దేశించుకుంది. క్యాబినెట్ నిర్ణయాల్లో ముఖ్యాంశాలు.. ► షిప్పింగ్ కార్పొరేషన్(ఎస్సీఐ)లో మొత్తం 63.75% వాటాలను.. అలాగే కంటెయినర్ కార్పొరేషన్(కాన్కర్)లో 30.9% వాటాలు ప్రభుత్వం విక్రయించనుంది. ప్రస్తుతం కాన్‌కర్‌లో కేంద్రానికి 54.80 శాతం వాటాలు ఉన్నాయి. ► టీహెచ్‌డీసీ ఇండియా, నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ (నీప్కో)లో మొత్తం వాటాలను ఎన్టీపీసీకి కేంద్రం విక్రయించనుంది. ► నియంత్రణ అధికారాలు తనకే ఉండే విధంగా.. ఇండియన్ ఆయిల్(ఐవోసీ)లో వాటాలను 51% లోపునకు తగ్గించుకోనుంది. ఇందులో ఇతర ప్రభుత్వ రంగ సంస్థలకున్న వాటాల కారణంగా నియంత్రణాధికారాలు కేంద్రానికే ఉంటాయి. ఐవోసీలో కేంద్రానికి ప్రస్తుతం 51.5% వాటా ఉండగా... 26.4% వాటాలను దాదాపు రూ. 33,000 కోట్లకు విక్రయించే అవకాశం ఉందని అంచనాలు ఉన్నాయి. ► కాంట్రాక్టర్లు, ప్రభుత్వ సంస్థలకు మధ్య నెలకొనే చెల్లింపుల వివాదాలపై కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భాల్లో ప్రభుత్వ సంస్థలు ఆర్బిట్రేషన్ ఉత్తర్వులను సవాల్ చేసినా.. చెల్లించాల్సి న మొత్తంలో 75%(బ్యాంకు పూచీకత్తుకు ప్రతి గా) కాంట్రాక్టరుకు చెల్లించేందుకు ఓకే చెప్పింది. టెల్కోలకు ఊరట.. ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్న టెలికం కంపెనీలకు ఊరటనిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. టెల్కోలు కట్టాల్సిన స్పెక్ట్రం చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మారటోరియం విధించింది. 2020–21, 2021–22 సంవత్సరాల్లో జరపాల్సిన చెల్లింపులకు ఇది వర్తిస్తుంది. దీంతో భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా, రిలయన్స్ జియో సంస్థలకు సుమారు రూ. 42,000 కోట్ల మేర ఊరట లభించనుంది. సవరించిన స్థూల ఆదాయం (ఏజీఆర్) వివాదంలో ప్రభుత్వానికి అనుకూలంగా సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన నేపథ్యంలో టెల్కోలు..దాదాపు 1.4 లక్షల కోట్ల మేర లైసెన్సు ఫీజులు, స్పెక్ట్రం యూసేజీ చార్జీలు కట్టాల్సి రానున్న సంగతి తెలిసిందే. -
ఆర్థిక రంగం ముందు సవాళ్లు: సీతారామన్
న్యూఢిల్లీ: భారత ఆర్థిక రంగం సవాళ్లను ఎదుర్కొంటోందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. ‘ది రైజ్ ఆఫ్ ఫైనాన్స్: కాజెస్, కన్సీక్వెన్సెస్, క్యూర్’ అనే పేరుతో అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థపై వి.అనంత నాగేశ్వరన్, గుల్జార్ నటరాజన్ సంయుక్తంగా రచించిన పుస్తకాన్ని మంత్రి ఆదివారం ఢిల్లీలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రపంచం, భారత ఆర్థిక రంగం ఎదుర్కొంటున్న సవాళ్లకు ఈ పుస్తకం పరిష్కారాలను సూచించినట్టు చెప్పారు. ఓ పుస్తకంగా ఇది ఎంతో ప్రాచుర్యం పొందగలదని, మరీ ముఖ్యంగా.. మనకు సందర్భోచితంగా ఉండటంతోపాటు సరైన సమయంలో విడుదల చేసినట్టు పేర్కొన్నారు. మందగమనంపై ప్రశ్నలు ఎదురవుతున్న తరుణంలో ఇది వచ్చినట్టు చెప్పారు. -
పరిశ్రమలు.. కకావికలం!
న్యూఢిల్లీ: పారిశ్రామిక ఉత్పత్తి ఆగస్టులో దారుణ పతనాన్ని నమోదు చేసుకుంది. పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ)లో అసలు వృద్ధిలేకపోగా –1.1 శాతం క్షీణత నమోదయ్యింది. ఉత్పత్తి క్షీణతలోకి జారడం రెండేళ్ల తరువాత ఇదేకాగా, అదీ ఇంత స్థాయిలో క్షీణత నమోదుకావడం ఏడేళ్ల తరువాత ఇదే తొలిసారి. 2012 నవంబర్‌లో ఐఐపీ –1.7 శాతాన్ని నమోదుచేసుకున్న తరువాత, ఇదే స్థాయి తీవ్ర ప్రతికూలత తాజా సమీక్షా నెల (2019 ఆగస్టు)లో చోటుచేసుకుంది. 2018 ఆగస్టులో ఐఐపీ వృద్ధిరేటు 4.8 శాతంగా నమోదయ్యింది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) శుక్రవారం విడుదల చేసిన గణాంకాలను రంగాల వారీగా చూస్తే... ► తయారీ: మొత్తం సూచీలో దాదాపు 77 శాతం వెయిటేజ్ ఉన్న ఈ విభాగంలో అసలు వృద్ధి నమోదుకాలేదు. –1.2 శాతం క్షీణత నెలకొంది. ఈ కీలక విభాగంలో ఇలాంటి ఫలితం చూడ్డం ఐదేళ్ల తరువాత (2014 అక్టోబర్‌లో –1.8 శాతం క్షీణత) తొలిసారి. 2018 ఆగస్టులో తయారీ విభాగంలో 5.2 శాతం వృద్ధి నమోదయ్యింది. తయారీ రంగంలోని మొత్తం 23 పారిశ్రామిక గ్రూపుల్లో 15 ప్రతికూల ఫలితాలను నమోదు చేసుకున్నాయి. ► విద్యుత్: ఈ రంగంలో కూడా అసలు వృద్ధిలేకపోగా –0.9 శాతం క్షీణత నమోదయ్యింది. 2018 ఆగస్టులో ఈ రంగం ఏకంగా 7.6 శాతం వృద్ధిని నమోదు చేసుకుంది. ► మైనింగ్: ఈ విభాగంలో వృద్ధి రేటు యథాతథంగా 0.1 శాతంగా ఉంది. ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్లను సూచించే ఈ విభాగం ఉత్పత్తిలో కూడా అసలు వృద్ధిలేకపోగా భారీగా –21 శాతం క్షీణత నమోదయ్యింది. గత ఏడాది ఆగస్టులో ఈ విభాగంలో ఉత్పత్తి వృద్ధిరేటు 10.3 శాతంగా ఉంది. ► కన్జూమర్ డ్యూరబుల్స్: రిఫ్రిజిరేటర్లు, ఏసీలు వంటి దీర్ఘకాలం మన్నే ఉత్పత్తులకు సంబంధించి ఈ విభాగం కూడా –9.1 శాతం క్షీణత నమోదుచేసుకుంది. 2018 ఇదే నెల్లో ఈ విభాగంలో వృద్ధిరేటు 5.5 శాతంగా ఉంది. ► ఇన్ఫ్రా/నిర్మాణం: పేలవ పనితనాన్ని ప్రదర్శించిన రంగాల్లో ఇది ఒకటి. ఈ విభాగంలో 8 శాతం వృద్ధి (2018 ఆగస్టు) రేటు –4.5 శాతం క్షీణత (2019 ఆగస్టు)లోకి జారింది. ► కన్జూమర్ నాన్–డ్యూరబుల్స్: సబ్బులు, సిగరెట్ల ఉత్పత్తి వంటి ఫాస్ట్ మూవింగ్ కన్జూమర్ గూడ్స్‌కు సంబంధించిన ఈ విభాగంలో మాత్రం వృద్ధి 4.1 శాతంగా ఉంది. అయితే 2018 ఆగస్టులో ఈ విభాగంలో వృద్ధిరేటు 6.5 శాతంగా ఉంది. ► ఐదు నెలల్లోనూ డౌన్: పారిశ్రామిక ఉత్పత్తి వృద్ధిరేటు ఏప్రిల్–ఆగస్టు మధ్య 2.4%గా ఉంది. 2018 ఇదే కాలంలో ఈ వృద్దిరేటు 5.3 శాతం. రెండవ త్రైమాసికంపై నీలినీడలు... ‘ఏప్రిల్–జూన్ క్వార్టర్లో వృద్ధిరేటు ఆరేళ్ల కనిష్టం 5%కి పyì ంది. రెండో క్వార్టర్లో వృద్ధి మెరుగుపడకపోవచ్చని తాజా గణాంకాలు సూచిస్తున్నాయి’ అని ఆర్థికవేత్త అదితి నయ్యర్ పేర్కొన్నారు. -
మార్కెట్‌కు ప్యాకేజీ జోష్..
మందగమనంలో ఉన్న వృద్ధికి జోష్‌నివ్వడానికి ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీ స్టాక్ మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య తాజాగా చర్చలు ప్రారంభం కానున్నాయన్న వార్తలు మధ్యాహ్నం తర్వాత వెలువడ్డాయి. దీంతో కొనుగోళ్లు మరింత జోరుగా సాగాయి. సెన్సెక్స్ 37,000 పాయింట్లు, నిఫ్టీ 11,000 పాయింట్లపైకి ఎగబాకాయి. లోహ షేర్లు మినహా మిగిలిన అన్ని రంగాల షేర్లు పెరిగాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 793 పాయింట్లు పెరిగి 37,494 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 229 పాయింట్లు పెరిగి 11,058 పాయింట్ల వద్ద ముగిశాయి. సెన్సెక్స్, నిఫ్టీలు ఒక్క రోజులో ఇన్నేసి పాయింట్లు పెరగడం గత మూడు నెలల్లో ఇదే మొదటిసారి. ఆసియాలోని ప్రధాన స్టాక్ మార్కెట్ సూచీలు 3 శాతం మేర పతనమైనా, మన స్టాక్ సూచీలు 2 శాతం మేర లాభపడటం విశేషం. భారీ లాభాలతో బోణి... మందగమనం నుంచి మరింత వృద్ధి దిశకు ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కించడానికి కొన్ని చర్యలను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత శుక్రవారం సాయంత్రం ప్రకటించారు. ఈ చర్యలే కాకుండా సరైన సమయంలో మరిన్ని చర్యలు కూడా తీసుకుంటామని ఆమె అభయం ఇచ్చారు. ఇక అమెరికా–చైనాలు పరస్పరం సుంకాలు విధించుకున్న నేపథ్యంలో సోమవారం ఆసియా మార్కెట్లు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నా, ప్యాకేజీ జోష్‌తో మన మార్కెట్ మాత్రం భారీ లాభాల్లో ఆరంభమైంది. సెన్సెక్స్ 663 పాయింట్లు, నిఫ్టీ 171 పాయింట్ల లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. వెంటనే సెన్సెక్స్ 843 పాయింట్లు, నిఫ్టీ 259 పాయింట్ల లాభాలను తాకాయి. కానీ ప్రపంచ మార్కెట్ల పతనం కారణంగా ఈ లాభాలన్నీ ఆవిరై సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోకి జారిపోయాయి. సెన్సెక్స్ ఇంట్రాడేలో 208 పాయింట్లు, నిఫ్టీ 72 పాయింట్ల మేర నష్టపోయాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం అమెరికా–చైనాల మధ్య మళ్లీ చర్చలు జరగనున్నాయన్న వార్తలతో స్టాక్ మార్కెట్ మళ్లీ లాభాల బాట పట్టింది. మొత్తం మీద రోజంతా సెన్సెక్స్1,051 పాయింట్ల రేంజ్లో కదలాడింది. ఆసియా మార్కెట్లు భారీగా నష్టపోగా, యూరప్ మార్కె ట్లు లాభాల్లో ముగిశాయి. మరిన్ని విశేషాలు.... ► యస్ బ్యాంక్ షేర్ 6.3 శాతం పెరిగి రూ.63 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పెరిగిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ లాభాల కారణంగా పదికి పైగా షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు చేరాయి. బాటా ఇండియా, ఫోర్స్ మోటార్స్, జీఎస్కే కన్సూమర్ ఈ జాబితాలో ఉన్నాయి. మరో వైపు అలోక్ ఇండస్ట్రీస్, అబన్ ఆఫ్‌షోర్, డీబీ రియల్టీ, సీజీ పవర్, ఈక్లర్క్స్ సర్వీసెస్, ఖదిమ్ ఇండియా వంటి 180కు పైగా షేర్లు ఏడాది కనిష్ట స్థాయిలకు పడిపోయాయి. బ్యాంక్, హెచ్ఎఫ్సీ షేర్ల జోరు మొండి బకాయిలతో కుదేలైన ప్రభుత్వ రంగ బ్యాంక్‌లను ఆదుకోవడానికి తాజాగా రూ.70,000 కోట్ల మూలధన నిధులందించగలమని కేంద్రం ఆభయం ఇవ్వడంతో బ్యాంక్ షేర్లు జోరుగా పెరిగాయి. ఈ నిధుల కారణంగా రూ.5 లక్షల కోట్ల మేర లిక్విడిటీ అందుబాటులోకి వస్తుందని అంచనా. ఫలితంగా మరిన్ని రుణాలు అందుబాటులోకి వచ్చి, వ్యవస్థలో లిక్విడిటీ సమస్య ఒకింత తీరగలదన్న అంచనాలతో బ్యాంక్ షేర్లలో జోరుగా కొనుగోళ్లు సాగాయి. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 10 శాతం, అలహాబాద్ బ్యాంక్ 8 శాతం, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 6 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 4 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 3.6 శాతం, ఎస్బీఐ 3 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 3..4 శాతం, కెనరా బ్యాంక్ 3.3 శాతం, బ్యాంక్ ఆఫ్ బరోడా 1.7 శాతం చొప్పున లాభపడ్డాయి. బ్యాంక్ షేర్లతో పాటు హౌసింగ్ ఫైనాన్స్ షేర్లు కూడా జోరుగా పెరిగాయి. హెచ్ఎఫ్సీలకు నేషనల్ హౌసింగ్ బ్యాంక్(ఎన్‌హెచ్‌బీ) రూ.20,000 కోట్ల మేర నిధులు అందజేయనున్నది. ఈ నిర్ణయం కారణంగా హెచ్ఎఫ్సీలు లాభపడ్డాయి. ఎమ్ అండ్ ఎమ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 5 శాతం, హెచ్డీఎఫ్సీ 4 శాతం, ఇండియాబుల్స్ హౌసింగ్ ఫైనాన్స్3 శాతం మేర ఎగిశాయి. లాభాలు ఎందుకంటే... ► ఎట్టకేలకు ఉద్దీపన ప్యాకేజీ... విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లపై విధించిన సూపర్ రిచ్ సర్‌చార్జీని రద్దు చేస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఉద్దీపన ప్యాకేజీలో భాగంగా ప్రకటించారు. అంతేకాకుండా వాహన రంగానికి ఊరటనిచ్చే నిర్ణయాలను, బ్యాంక్‌లకు రూ.70,000 కోట్ల మూలధన నిధుల అందించడం, తదితర నిర్ణయాల కారణంగా ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలపడింది. ► మళ్లీ అమెరికా–చైనాల చర్చలు.... అమెరికా–చైనాలు తాజాగా పరస్పరం సుంకాలు విధించుకున్నాయి. వాణిజ్య ఉద్రిక్తతల నివారణ నిమిత్తం మళ్లీ చర్చలు ఆరంభం కాగలవని అమెరికా అధ్యక్షుడు ట్వీట్ చేయడం మన మార్కెట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. ► చల్లబడ్డ చమురు ధరలు... చమురు ధరలు తగ్గాయి. బ్రెంట్, నైమెక్స్ ముడి చమురు ధరలు దాదాపు 1 శాతం మేర తగ్గాయి. ► ఆర్బీఐ బోర్డ్ సమావేశం... ఆర్బీఐ మిగులు నిధులపై అధ్యయనం చేసిన బిమల్ జలాన్ కమిటీ సమర్పించిన నివేదికపై చర్చించడానికి సోమవారం ఆర్బీఐ బోర్డ్ సమావేశమైంది. మార్కెట్ ముగిసే సమయానికి ఎలాంటి నిర్ణయం వెలువడకపోయినప్పటికీ, సానుకూల నిర్ణయం ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్‌కు కలసివచ్చాయి. ► పెరిగిన రేటింగ్ అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థ, నొముర.. భారత్ రేటింగ్‌ను ‘ఓవర్‌వెయిట్’కు అప్‌గ్రేడ్ చేసింది. ప్రపంపవ్యాప్తంగా అనిశ్చితి నెలకొన్నప్పటికీ, దేశీయంగా సానుకూల పరిణామాలు చోటు చేసుకుంటుండటంతో భారత్ రేటింగ్‌ను నొముర అప్‌గ్రేడ్ చేసింది. మరోవైపు ఈ ఏడాది డిసెంబర్ నాటికి సెన్సెక్స్ 40,500 పాయింట్లకు చేరగలదని మరో బ్రోకరేజ్ సంస్థ, బీఎన్పీ పారిబా వెల్లడించడం కూడా సెంటిమెంట్‌పై సానుకూల ప్రభావం చూపించింది. ► షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు... ఆగస్టు సిరీస్ డెరివేటివ్స్(ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్) కాంట్రాక్టులు ఈ వారంలోనే ముగియనున్న నేపథ్యంలో సానుకూల ప్యాకేజీ కారణంగా షార్ట్ కవరింగ్ కొనుగోళ్లు చోటు చేసుకున్నాయని నిపుణులంటున్నారు. ఆ మూడు షేర్ల వల్లే భారీ లాభాలు హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ బ్యాంక్ ఈ మూడు షేర్లు 4–5 శాతం రేంజ్లో లాభపడ్డాయి. సెన్సెక్స్ మొత్తం లాభంలో ఈ మూడు షేర్ల వాటాయే 61 శాతంగా ఉండటం విశేషం. మొత్తం 793 పాయింట్ల సెన్సెక్స్ లాభంలో హెచ్డీఎఫ్సీ వాటా 195 పాయింట్లు, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ వాటా 180 పాయింట్లు, ఐసీఐసీఐ బ్యాంక్ వాటా 102 పాయింట్లుగా ఉన్నాయి. వెరసి ఈ 3 షేర్ల వాటా 477 పాయింట్లుగా ఉంది. ఇన్వెస్టర్ల సంపద 2.41 లక్షల కోట్లు అప్ స్టాక్ మార్కెట్ భారీ లాభాల కారణంగా ఇన్వెస్టర్ల సంపద రూ.2.41 లక్షల కోట్లు పెరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా పరిగణించే బీఎస్ఈలో లిస్టైన మొత్తం కంపెనీల మార్కెట్ విలువ రూ.2.41 లక్షల కోట్లు పెరిగి రూ.1,40,33,462 కోట్లకు పెరిగింది. -
మందగమనానికి ఆనవాలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని జూన్ ఎగుమతి, దిగుమతి గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ వృద్ధి లేకపోగా (2018 జూన్‌తో పోల్చి) క్షీణత నమోదయ్యింది. సోమవారం వెలువడిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఎగుమతులు అసలు పెరక్కపోగా 9.71% క్షీణించాయి. 8 నెలల తర్వాత (2018 సెప్టెంబర్‌లో –2.15% క్షీణత) దిగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతులు 25.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోలియం ప్రొడక్టులు, ప్లాస్టిక్, హస్త కళల ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తులు, చమురు గింజలు ఇలా కీలక విభాగాల్లో ఎగుమతులు పడిపోయాయి. ► వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం– నిర్వహణ అంశాల నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జూన్ 28 వరకూ ఓఎన్జీసీ మంగళూర్ పెట్రోకెమికల్ లిమిటెడ్ తాత్కాలికంగా తన ఉత్పత్తిని నిలిపివేసింది. ఇది పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. జామ్‌నగర్ రిఫైనరీ పరిస్థితి కూడా జూన్‌లో దాదాపు ప్రతికూలంగానే ఉంది. అంతర్జాతీయంగా స్పీట్ ధరల పతనం ఇంజనీరింగ్ గూడ్స్‌పై ప్రభావం చూపింది. ► ఇక దిగుమతులూ క్షీణతలోనే ఉన్నాయి. –9 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ రూపంలో 40.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► దీనితో ఎగుమతి–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 15.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది జూన్‌లో వాణిజ్యలోటు 16.6 బిలియన్ డాలర్లు. ► పసిడి దిగుమతులు 13 శాతం పెరిగి 2.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చమురు దిగుమతులు 13.33% క్షీణించి 11 బి. డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతు లు 7.34% క్షీణించి 29.26 బి. డాలర్లకు పడ్డాయి. బేస్ ఎఫెక్టే... 2018 జూన్‌లో ఎగుమతులు(27.7 బిలియన్ డాలర్లు) భారీగా పెరిగాయి. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఎగుమతులు తగ్గాయి. బేస్ ఎఫెక్ట్ వల్ల ఎగుమతులు భారీగా పడినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి కూడా దీనికి కారణం. 2019లో ప్రపంచ వాణిజ్యం (కేవలం 2.6 శాతం) బలహీనంగా ఉంటుందని గత నెల వెలువడిన గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్ నివేదిక కూడా పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. – అనూప్ వర్థమాన్, వాణిజ్య కార్యదర్శి పలు దేశాల్లోనూ ఇదే ధోరణి ఇటీవలి నెలల్లో పలు దేశాల ఎగుమతులు కూడా పడిపోవడం గమనార్హం. ఏప్రిల్‌కు సంబంధించి అంతర్జాతీయ వాణిజ్య సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం జపాన్ (–5.88 శాతం), యూరోపియన్ యూనియన్ (–4.30 శాతం), చైనా (–2.75 శాతం), అమెరికా (–2.12 శాతం) ఎగుమతులు కూడా క్షీణతను నమోదుచేసుకున్నాయి. ఏప్రిల్–జూన్ మధ్యా క్షీణతే.. ఏప్రిల్– జూన్ మధ్యా ఎగుమతులు 1.69 శాతం క్షీణించి 81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 0.29 శాతం క్షీణించి 127 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సేవల్లో 15.49 శాతం వృద్ధి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఈ ఏడాది మే నెలలో సేవల ఎగుమతులు 15.49 శాతం పెరిగాయి. విలువ 18.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా సేవల దిగుమతులు 22.37 శాతం పెరిగి 12.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
కొత్త సర్కారుకు.. సవాళ్ల స్వాగతం
న్యూఢిల్లీ: నరేంద్ర మోదీ సారథ్యంలో ఏర్పాటయ్యే కొత్త ప్రభుత్వానికి పలు సవాళ్లు స్వాగతం పలకనున్నాయని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. మందగమనానికి అడ్డుకట్ట వేయడం, ఉద్యోగాల కల్పన, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు చర్యలు తీసుకోవడం, మొండిబాకీల సమస్యల నుంచి బ్యాంకులను గట్టెక్కించడం మొదలైన వాటిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని వివరించారు. అలాగే కంపెనీల కోసం స్థల సమీకరణ నిబంధనలను సరళతరం చేయడం, కార్మిక సంస్కరణలు చేపట్టడంతో పాటు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగం ఎదుర్కొంటున్న నిధుల సమస్యలను తీర్చడమూ కీలకమని పేర్కొన్నారు. అటు కరెంటు అకౌంటు లోటు (సీఏడీ)ని కట్టడి చేయడంతో పాటు ఉద్యోగార్థుల నైపుణ్యాలను మెరుగుపర్చడంపైనా దృష్టి సారించాలని ఆర్థికవేత్తలు అభిప్రాయపడ్డారు. ఇప్పటికే అమలు చేస్తున్న వస్తు, సేవల పన్నులు, దివాలా చట్టం వంటి సంస్కరణల నుంచి ప్రజలకు తక్షణ ప్రయోజనాలు అందించేందుకు కేంద్రం ప్రయత్నించాల్సి ఉంటుందని ఎస్అండ్పీ గ్లోబల్ రేటింగ్స్ ఆసియా–పసిఫిక్ విభాగం చీఫ్ ఎకానమిస్ట్ షాన్ రోష్ చెప్పారు. ఇక ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో అసెట్ క్వాలిటీ సమస్యలను పరిష్కరించడం, నిర్వహణ సామర్థ్యాలను మెరుగుపర్చడం, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ రంగంలో నెలకొన్న ఒత్తిళ్లను తొలగించడంపైనా కసరత్తు చేయాలని పేర్కొన్నారు. ‘ప్రైవేట్ రంగానికి నిధులను అందుబాటులోకి తెచ్చేందుకు, వృద్ధికి ఊతమిచ్చేలా ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఇలాంటివి దోహదపడతాయి‘ అని రోష్ తెలిపారు. వృద్ధి రేటు మందగించడానికి అడ్డుకట్ట వేయాలని, ద్రవ్యోల్బణాన్ని ఎగదోయకుండా దీర్ఘకాలిక వృద్ధి వ్యూహాలు రూపొందించాలని ఇండియా రేటింగ్స్ అండ్ రీసెర్చ్ సంస్థ చీఫ్ ఎకానమిస్ట్ దేవేంద్ర పంత్ తెలిపారు. ఆర్థిక స్థిరత్వా న్ని దెబ్బ తీయకుండా ప్రభుత్వ పెట్టుబడుల వ్యూ హాలు ఉండాలని, వ్యవసాయ రంగంలో ఒత్తిడిని తొలగించేందుకు, ఉద్యోగాల కల్పనకు చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆయన పేర్కొన్నారు. క్యాడ్ కట్టడి కీలకం.. వాణిజ్య యుద్ధభయాలు, అంతర్జాతీయంగా వృద్ధి మందగమన పరిస్థితుల కారణంగా ముడిచమురు ధరలు పెరుగుతుండటం, ఎగుమతులు మందగిస్తుండటం వంటి అంశాల కారణంగా కరెంటు ఖాతా లోటు (క్యాడ్)పై ప్రతికూల ప్రభావం పడుతోందని పీడబ్ల్యూసీ ఇండియా లీడర్ (పబ్లిక్ ఫైనాన్స్ అండ్ ఎకనామిక్స్ విభాగం) రాణెన్ బెనర్జీ చెప్పారు. దీన్ని కట్టడి చేయడం కొత్త ప్రభుత్వానికి పెద్ద సవాలుగా ఉంటుందని వివరించారు. దేశంలోకి విదేశీ మారకం రాక, పోక మధ్య వ్యత్యాసాన్ని క్యాడ్‌గా వ్యవహరిస్తారు. గత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇది స్థూల దేశీయోత్పత్తిలో (జీడీపీ) 2.5 శాతానికి (దాదాపు 16.9 బిలియన్ డాలర్లు) పెరిగింది. అంతక్రితం ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో ఇది జీడీపీలో 2.1 శాతంగా (13.7 బిలియన్ డాలర్లు)గా ఉంది. వాణిజ్య యుద్ధాల నుంచి ప్రయోజనం పొందాలి... అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధ భయాలు నెలకొన్న పరిస్థితులను భారత్ తనకు అనుకూలంగా మల్చుకోవడంపై దృష్టి పెట్టాలని రోష్ అభిప్రాయపడ్డారు. పెట్టుబడులను ఆకర్షించేందుకు, ఇతర దేశాలతో దీటుగా పోటీపడేం దుకు పటిష్టమైన సంస్కరణల ఎజెండా అమలు చేయాల్సి ఉంటుందని వివరించారు. ఇక ప్రభుత్వ వ్యయాల్లో భాగంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్పై పెట్టుబడులను కొనసాగించాల్సి ఉంటుందని బెనర్జీ చెప్పారు. ఆదాయాలు అంచనాలను అందుకోకపోవడం, కొత్తగా ప్రకటించిన మరిన్ని సంక్షేమ పథకాలు మొదలైన వాటి కారణంగా ద్రవ్య లోటుపరమైన ఒత్తిళ్లు పెరగవచ్చని తెలిపారు. మరోవైపు ఎకానమీలో డిమాండ్‌కు ఊతమివ్వడం, పెట్టుబడుల సెంటిమెంట్‌ను మెరుగుపర్చడమనేవి కొత్త ప్రభుత్వం ముందున్న తక్షణ కర్తవ్యాలని ఈవై ఇండియా చీఫ్ పాలసీ సలహాదారు డీకే శ్రీవాస్తవ తెలిపారు. స్వల్పకాలికంగా చూస్తే ఇటు వినియోగం, అటు పెట్టుబడుల డిమాండ్ .. రెండింటికీ ఊతమిచ్చే చర్యలు అవసరమని చెప్పారు. రెపో రేటును మరో 25 బేసిస్ పాయింట్ల మేర తగ్గించడం, ప్రభుత్వ వ్యయాలకు అవసరమైన నిధులను ముందస్తుగా సమీకరించుకోవడం, పూర్తి ఏడాది బడ్జెట్ తేదీలను ముందుకు జరపడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సి ఉంటుందని శ్రీవాస్తవ తెలిపారు. -
1,300 డాలర్ల వద్ద తీవ్ర నిరోధం!
అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– నైమెక్స్‌లో పసిడి ఔన్స్ (31.1గ్రా) ధర 4వ తేదీ శుక్రవారంతో ముగిసిన వారంలో కీలక నిరోధ స్థాయి 1,300 డాలర్లను తాకింది. ఆర్థిక అనిశ్చితి వార్తల నేపథ్యంలో వారం మొత్తంలో నైమెక్స్‌లో పెరుగుతూ వచ్చిన పసిడి, ఆఖరిరోజు శుక్రవారం ట్రేడింగ్ ప్రారంభంలో ఆరు నెలల గరిష్టస్థాయి 1,300.35 డాలర్లను తాకింది. అయితే అటు తర్వాత ఇంట్రాడే ట్రేడింగ్‌లో దాదాపు 21 డాలర్లు పతనమై, చివరకు కొంత కోలుకుని 1,286 డాలర్ల వద్ద ముగిసింది. దీనితో మొత్తంగా వారంలో పసిడి దాదాపు ఆరు డాలర్లు పెరిగినట్లయ్యింది. 1,300 డాలర్ల స్థాయిని తాకిన తర్వాత వెలువడిన అమెరికా డిసెంబర్ ఉపాధి అవకాశాల గణాంకాలు సానుకూలంగా ఉండడం, ఆర్థిక వ్యవస్థపై చిగురించిన ఆశలు పసిడి ఆరు నెలల గరిష్ట స్థాయి నుంచి కిందకు జారడానికి కారణమని నిపుణుల విశ్లేషణ. ఇక టెక్నికల్‌గా చూస్తే, 1,300 కీలక నిరోధ స్థాయి కావడాన్నీ పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుందన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ఈ వారం కీలక పరిణామాలు... అమెరికా ఫెడ్ ఫండ్ రేటు పెంపు (ప్రస్తుతం 2.25–2.5 శాతం శ్రేణి) తుది దశకు చేరుకుందనీ, రేటు పెంపు స్పీడ్ ఇకపై ఉండబోదని వాదనలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. డాలర్ ఇండెక్స్ బలహీనతకూ దారితీస్తోంది. ఆయా అంశాల నేపథ్యంలో బుధవారం ఫెడ్ మినిట్స్ (డిసెంబర్లో జరిగిన ద్రవ్య పరపతి విధాన సమావేశాల వివరాలు) వెల్లడికానున్నాయి. ఆమరుసటి రోజు ఫెడ్ చైర్మన్ పావెల్ కీలక ప్రకటన వెలువడనుంది. శుక్రవారం అమెరికా ద్రవ్యోల్బణం గణాంకాలు వెల్లడవుతాయి. ఆర్థిక వ్యవస్థ పురోగతికి సంబంధించి ఈ సందర్భంగా వెల్లడికానున్న అంశాల ఆధారంగా పసిడి ధర తదుపరి కదలికలు ఉంటాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. దేశీయంగా రూపాయి కదలికలు ఆధారం... ఇక దేశీయంగా పసిడి కదలికలు డాలర్ మారకంలో రూపాయి విలువ మార్పులకు అనుగుణంగా ఉంటుందని విశ్లేషణ. అక్టోబర్ 9వ తేదీన డాలర్ మారకంలో చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసిన రూపాయి ప్రస్తుతం 69పైకి (శుక్రవారం 69.72) కోలుకుంది. ఈ పరిణామం అంతర్జాతీయంగా పసిడి ధరలు భారీగా పెరిగినా దేశీయంగా ఈ మెటల్ ధరల కట్టడికి దోహదపడింది. ముంబై మార్కెట్లో శుక్రవారం 24, 22 క్యారెట్లు 10 గ్రాముల పసిడి ధరలు వరుసగా రూ.32,840, రూ.31,280 వద్ద ముగిశాయి. వెండి కేజీ ధర రూ. 42,600గా ఉంది. ఇక దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్–ఎంసీఎక్స్‌లో పసిడి ధర శుక్రవారం 31,456 వద్ద ముగిసింది. -
చైనాతో ముప్పు ఉంది.. జర జాగ్రత్త!
ముంబై : చైనా చూపిస్తున్న నెమ్మదస్తు ఆర్థికవ్యవస్థ గణాంకాలపై ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ఆరోపణలు చేశారు. గ్లోబల్ ఎకనామీకి ఇది ముప్పువాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. భారత్ లాంటి ఇతర ఆర్థిక వ్యవస్థలు ఈ ముప్పు నుంచి తట్టుకోవడానికి అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. చైనా పక్కన ఉన్న దేశాలకు మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ సిస్టమ్(గ్లోబల్ ఫైనాన్సియల్ సిస్టమ్ లో రుణాన్ని కల్పించడం) నుంచి తీవ్ర ప్రభావం ఉంటుందన్నారు.. దక్షిణ ప్రాంతీయ సహకార ఆసియా అసోసియేషన్ గ్రూపింగ్(సార్క్) సెంట్రల్ బ్యాంకు గవర్నర్ల సదస్సులో రాజన్ ప్రసంగించారు. భారత ఆర్థిక క్యాపిటల్ ను ఉద్దేశిస్తూ ప్రసంగిస్తూ.. ఆయన చైనా ఆర్థికవ్యవస్థ చూపించే గణాంకాల ప్రభావం ఇతర ఆర్థికవ్యవస్థలపై ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశారు. ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్ లో మొండిబకాయిల బెడద పెరగడం, మధ్యవర్తిత్వ బ్యాంకింగ్ సిస్టమ్ లో తీవ్రమైన బలహీనతలు సార్క్ ఆర్థికవ్యవస్థల్లో మందగమనం నెలకొనేలా చేస్తాయన్నారు. చైనా ఆర్థికాభివృద్ధి కేవలం పాలసీల మీదే ఆధారపడి లేదని, ప్రపంచ వృద్ధిపైనా కూడా ఆధారపడి ఉందని పేర్కొన్నారు.