మందగమనానికి ఆనవాలు! | Indian economy system slowdown an export and imports | Sakshi
Sakshi News home page

మందగమనానికి ఆనవాలు!

Published Tue, Jul 16 2019 5:33 AM | Last Updated on Tue, Jul 16 2019 5:33 AM

Indian economy system slowdown an export and imports - Sakshi

న్యూఢిల్లీ: భారత్‌ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని  జూన్‌ ఎగుమతి, దిగుమతి గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ వృద్ధి లేకపోగా (2018 జూన్‌తో పోల్చి) క్షీణత నమోదయ్యింది. సోమవారం వెలువడిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే...

► ఎగుమతులు అసలు పెరక్కపోగా 9.71% క్షీణించాయి. 8 నెలల తర్వాత (2018 సెప్టెంబర్‌లో –2.15% క్షీణత) దిగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతులు 25.01 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  

► రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్‌ గూడ్స్, పెట్రోలియం ప్రొడక్టులు, ప్లాస్టిక్, హస్త కళల ఉత్పత్తులు, రెడీమేడ్‌ దుస్తులు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తులు, చమురు గింజలు ఇలా కీలక విభాగాల్లో ఎగుమతులు పడిపోయాయి.  

► వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం– నిర్వహణ అంశాల నేపథ్యంలో ఏప్రిల్‌ 17 నుంచి జూన్‌ 28 వరకూ ఓఎన్‌జీసీ మంగళూర్‌ పెట్రోకెమికల్‌ లిమిటెడ్‌ తాత్కాలికంగా తన ఉత్పత్తిని నిలిపివేసింది. ఇది పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. జామ్‌నగర్‌ రిఫైనరీ పరిస్థితి కూడా జూన్‌లో దాదాపు ప్రతికూలంగానే ఉంది. అంతర్జాతీయంగా స్పీట్‌ ధరల పతనం
ఇంజనీరింగ్‌ గూడ్స్‌పై ప్రభావం చూపింది.  

► ఇక దిగుమతులూ క్షీణతలోనే ఉన్నాయి. –9 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ రూపంలో 40.26 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.  

► దీనితో ఎగుమతి–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 15.28 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది జూన్‌లో వాణిజ్యలోటు 16.6 బిలియన్‌ డాలర్లు.

 

► పసిడి దిగుమతులు 13 శాతం పెరిగి 2.7 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.  

► చమురు దిగుమతులు 13.33% క్షీణించి 11 బి. డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతు లు 7.34% క్షీణించి 29.26 బి. డాలర్లకు పడ్డాయి.


బేస్‌ ఎఫెక్టే...
2018 జూన్‌లో ఎగుమతులు(27.7 బిలియన్‌ డాలర్లు) భారీగా పెరిగాయి. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఎగుమతులు తగ్గాయి. బేస్‌ ఎఫెక్ట్‌ వల్ల ఎగుమతులు భారీగా పడినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి కూడా దీనికి కారణం. 2019లో ప్రపంచ వాణిజ్యం (కేవలం 2.6 శాతం) బలహీనంగా ఉంటుందని గత నెల వెలువడిన గ్లోబల్‌ ఎకనమిక్‌ ప్రాస్పెక్ట్‌ నివేదిక కూడా పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం.  
– అనూప్‌ వర్థమాన్, వాణిజ్య కార్యదర్శి

పలు దేశాల్లోనూ ఇదే ధోరణి
ఇటీవలి నెలల్లో పలు దేశాల ఎగుమతులు కూడా పడిపోవడం గమనార్హం. ఏప్రిల్‌కు సంబంధించి అంతర్జాతీయ వాణిజ్య సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం జపాన్‌ (–5.88 శాతం), యూరోపియన్‌ యూనియన్‌ (–4.30 శాతం), చైనా (–2.75 శాతం), అమెరికా (–2.12 శాతం) ఎగుమతులు కూడా క్షీణతను నమోదుచేసుకున్నాయి.

ఏప్రిల్‌–జూన్‌ మధ్యా క్షీణతే..
ఏప్రిల్‌– జూన్‌ మధ్యా ఎగుమతులు 1.69 శాతం క్షీణించి 81 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 0.29 శాతం క్షీణించి 127 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 45 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యింది.

సేవల్లో 15.49 శాతం వృద్ధి
రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఈ ఏడాది మే నెలలో సేవల ఎగుమతులు 15.49 శాతం పెరిగాయి. విలువ 18.68 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా సేవల దిగుమతులు 22.37 శాతం పెరిగి 12.49 బిలియన్‌ డాలర్లుగా నమోదయ్యాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement