export and imports
-
కెనడా, మెక్సికోలపై సుంకాలు.. ప్రభావితమయ్యే వస్తువులు
అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ రెండోసారి ప్రమాణ స్వీకారం చేశారు. అధ్యక్ష నియామక పత్రాలపై సంతకాలు చేసిన తర్వాత కెనడా, మెక్సికోలపై భారీ సుంకాలు విధిస్తున్నట్లు ప్రకటించారు. ఫిబ్రవరి 1 నుంచి కెనడా, మెక్సికో దిగుమతులపై 25 శాతం సుంకం విధిస్తామని తెలిపారు. ఈ నిర్ణయంతో ఇరుదేశాల ఎగుమతులపై తీవ్ర ప్రభావం పడునుంది. అక్రమ వలసలు, మాదకద్రవ్యాల అక్రమ రవాణాను కట్టడి చేసేందుకు ట్రంప్ విస్తృత వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే కెనడా, మెక్సికో దేశాలు అమెరికా సరఫరా చేస్తున్న ప్రధాన ఉత్పత్తులు కింది విధంగా ఉన్నాయి.కెనడా అత్యధికంగా ఎగుమతి చేస్తున్న ఉత్పత్తులుఖనిజ ఇంధనాలు, నూనెలు: 128.51 బిలియన్ డాలర్లురైల్వే మినహా ఇతర వాహనాలు: 58.21 బిలియన్ డాలర్లుయంత్రాలు, అణు రియాక్టర్లు, బాయిలర్లు: 33.75 బిలియన్ డాలర్లుప్లాస్టిక్స్: 14.05 బిలియన్ డాలర్లుముత్యాలు, విలువైన రాళ్లు, లోహాలు, నాణేలు: 12.43 బిలియన్ డాలర్లుఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు: 11.87 బిలియన్ డాలర్లుకలప, చెక్క వస్తువులు: 11.53 బిలియన్ డాలర్లుఅల్యూమినియం: 11.36 బిలియన్ డాలర్లుఇనుము, ఉక్కు: 8.51 బిలియన్ డాలర్లుఎయిర్ క్రాఫ్ట్, స్పేస్ క్రాఫ్ట్ పరికరాలు: 7.58 బిలియన్ డాలర్లుమెక్సికో చేసే టాప్ ఎగుమతులువాహనాలు: 130.03 బిలియన్ డాలర్లువిద్యుత్ యంత్రాలు: 85.55 బిలియన్ డాలర్లున్యూక్లియర్ రియాక్టర్లు: 81.61 బిలియన్ డాలర్లుఖనిజ ఇంధనాలు, నూనెలు: 25.02 బిలియన్ డాలర్లుఆప్టికల్, వైద్య, శస్త్రచికిత్స పరికరాలు: 22.33 బిలియన్ డాలర్లుఫర్నిచర్, పరుపులు: 13.35 బిలియన్ డాలర్లుపానీయాలు, స్పిరిట్స్, వెనిగర్: 11.75 బిలియన్ డాలర్లుప్లాస్టిక్స్: 10.26 బిలియన్ డాలర్లుకూరగాయలు, దుంపలు: 8.82 బిలియన్ డాలర్లుఇదీ చదవండి: ‘బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకం విధిస్తాం’అమెరికా ఇరుదేశాలపై విధించిన 25 శాతం అధిక సుంకం వల్ల పైన పేర్కొన్న వస్తువులను సరఫరా చేస్తున్న ఇతర మిత్ర దేశాలకు లబ్ధి చేకూరుతుందనే అభిప్రాయాలున్నాయి. అయితే కెనడా, మెక్సికోలు ట్రంప్‌తో చర్చలకు సిద్ధమని ఇప్పటికే ప్రకటించాయి. కానీ, ఇందుకు ట్రంప్ అనుమతిస్తారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. -
పెరగనున్న వస్తు ఎగుమతులు.. ఎంతంటే..
భారత్ వస్తు ఎగుమతులు 2024-25 ఏడాదికిగాను 500 బిలియన్ డాలర్లకు(సుమారు రూ.41.5 లక్షల కోట్లు) చేరవచ్చని ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎక్స్పోర్ట్ ఆర్గనైజేషన్స్ (ఫియో) అంచనా వేసింది. సుమారు 400 బిలియన్ డాలర్ల విలువచేసే సేవల ఎగుమతులుతోడైతే మొత్తంగా ఎక్స్‌పోర్ట్స్ 900 బిలియన్ డాలర్లకు చేరుతుందని ఫియో ప్రెసిడెంట్ అశ్వనీ కుమార్ తెలిపారు. 2023-24లో దేశం మొత్తం ఎగుమతులు 778 బిలియన్ డాలర్లుగా ఉన్నాయన్నారు. అంతకుముందు ఏడాది కంటే 2023-24లో వస్తు ఎగుమతులు 3% తగ్గి 437 బి.డాలర్లు (సుమారు రూ.36.27 లక్షల కోట్లు)గా నమోదైనట్లు అశ్వనీ చెప్పారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..‘సేవల ఎగుమతుల్లో ఇంజినీరింగ్, అడ్వర్టైజింగ్ రంగాలు కీలకపాత్ర పోషిస్తున్నాయి, గ్లోబల్ కెపబిలిటీ సెంటర్ విస్తరణ వల్ల వ్యాపార ఎగుమతులు మరింత పెరుగుతాయి. భారత్ నుంచి యూఎస్, యూరప్‌కు అధికంగా ఎగుమతులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, మెషినరీ, హై అండ్ మీడియం టెక్నాలజీ, ఫార్మాస్యూటికల్స్, మెడికల్, డయాగ్నొస్టిక్ పరికరాలకు డిమాండ్ ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: స్టాక్మార్కెట్లో కొత్త ఇన్వెస్టర్లు తెలుసుకోవాల్సినవి..ఫియో వైస్ ప్రెసిడెంట్ ఇస్రార్ అహ్మద్ మాట్లాడుతూ..‘ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్(పీఎల్ఐ) పథకం ద్వారా లబ్ధిపొందిన చాలా కంపెనీలు తమ ఉత్పత్తిని పెంచుతున్నాయి. 2023-24లో రెండంకెల క్షీణతను చూసిన దుస్తులు, పాదరక్షలు, డైమండ్లు, ఆభరణాల వంటి లేబర్ ఇంటెన్సివ్ రంగాలు ఈసారి మెరుగైన ఫలితాలు నమోదు చేయబోతున్నాయి. ఈసారి ఆశించిన విధంగానే రుతుపవనాలు వస్తాయి. ప్రభుత్వం తృణధాన్యాల ఎగుమతులపై ఉన్న కొన్ని పరిమితులను తొలగించవచ్చు’ అని చెప్పారు. -
కేంద్ర మంత్రి జైశంకర్ దౌత్యం.. చమురు దిగుమతుల్లో భారత్ సరికొత్త రికార్డులు!
గత డిసెంబర్ నెలలో రష్యా నుంచి భారత్ చమరు దిగుమతులు సరికొత్త రికార్డులు నమోదు చేశాయి. అంతేకాదు వరుసగా భారత్‌కు చమురు దిగుమతి చేస్తున్న ప్రధాన తొలి దేశంగా రష్యా నిలిచింది. దేశాల మధ్య జరిగే ఎగుమతులు- దిగుమతుల్ని ట్రాక్ చేసే సంస్థ వోర్టెక్సా ఓ నివేదికను విడుదల చేసింది. ఆ రిపోర్ట్ ప్రకారం.. తొలిసారి గతేడాది డిసెంబర్ నెలలో రోజుకు 1 మిలియన్ బ్యారెల్స్ రష్యా భారత్‌కు సరఫరా చేయగా.. ఆ మొత్తం 1.19 మిలియన్ బీపీడీ (బ్యారెల్స్ పర్ డే)కి చేరినట్లు తెలుస్తోంది. పెరిగిపోతున్న దిగుమతి రష్యా నుంచి భారత్‌కు క్రూడాయిల్ దిగుమతులు నెలనెలా పెరిగిపోతున్నట్లు వోర్టెక్సా హైలెట్ చేసింది. అక్టోబర్ నెల మొత్తంలో మాస్కో (రష్యా రాజధాని) నుంచి 935,556 క్రూడాయిల్ బ్యారెల్స్ దిగుమతి చేయగా..నవంబర్ నెలలో 909,403 క్రూడాయిల్ బ్యారెల్స్ ఉన్నాయి. కాగా, గతంలో భారత్‌కు రష్యా 2022 జూన్ నెలలో అత్యధికంగా 942,694 బీపీడీలు దిగుమతి చేసింది. టాప్‌లో రష్యా ఇతర దేశాల నుంచి భారత్ సముద్ర మార్గానా ఆయిల్ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంటుంది. అయితే రవాణాపై ఈయూ, అమెరికా దేశాలు పరిమితులు విధించాయి. దీంతో భారత్ రష్యా నుంచి భారీ ఎత్తున ఆయిల్ బ్యారెల్స్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ఆయిల్ దిగుమతుల్లో మూడో స్థానం పెట్రోల్, డీజిల్ వినియోగంలో భారత్ ప్రపంచంలోనే 3వ స్థానంలో ఉంది. అవసరాల దృష్ట్యా భారత్ 85 శాతం ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటుంది. ఆ క్రూడాయిల్‌ను శుద్ది చేసి పెట్రోల్, డీజిల్‌గా మార్చి అమ్మకాలు జరుపుతుంది. ఇతర దేశాల నుంచి బ్యారెల్స్ దిగుమతులు ఇక రష్యాతో పాటు ఇతర దేశాల నుంచి క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకుంటున్నట్లు వోర్టెక్సా పేర్కొంది. గత డిసెంబర్ నెలలో ఇరాక్ నుంచి 803,228 బ్యారెల్స్, సౌదీ అరేబియా నుంచి 718,357 బ్యారెల్స్‌ను దిగుమతి చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (uae) అమెరికాను అధిగమించి భారత్‌కు క్రూడాయిల్‌ను సరఫరా చేసే నాల్గవ అతిపెద్ద దేశంగా అవతరించింది. డిసెంబర్లో 323,811 బ్యారెల్ చమురును భారత్‌కు విక్రయించింది. కానీ యూఎస్ నుంచి భారత్‌కు సరఫరా అయ్యే క్రూడాయిల్ తగ్గుతుంది. నవంబర్‌లో 405,525 బ్యారెల్స్ ఉండగా డిసెంబర్లో 322,015 బ్యారెల్స్‌కు చేరింది. ఉక్రెయిన్‌పై రష్యా దాడితో ఉక్రెయిన్‌పై రష్యా దాడిని పశ్చిమ దేశాలు వ్యతిరేకించాయి. మాస్కోతో వ్యాపార వ్యవహారాలకు దూరంగా ఉన్నాయి. భారత్ మాత్రం రష్యాతో సన్నిహితంగా ఉంటూ.. క్రూడాయిల్ దిగుమతుల్లో రికార్డులు నమోదు చేస్తోంది. ఉక్రెయిన్ దాడికి ముందు రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముందు భారత్ మిడిల్ ఈస్ట్రన్ కంట్రీస్ నుంచి 60శాతం కంటే ఎక్కువగా క్రూడాయిల్‌ను దిగుమతి చేసుకోవగా, ఉత్తర అమెరికా నుంచి 14శాతం, పశ్చిమ ఆఫ్రికా నుంచి 12శాతం, లాటిన్ అమెరికా నుంచి 5శాతం, రష్యా నుంచి కేవలం 2శాతం మాత్రమే దిగుమతి చేసుకుంది.ఇప్పుడు రష్యా నుంచి దిగుమతులు చేసుకునే క్రూడాయిల్ బ్యారెళ్ల సంఖ్య రికార్డులు దాటుతున్నాయి. 60 డాలర్లు మాత్రమే జలమార్గాన సరఫరా అవుతున్న రష్యా చమురు ధరపై ఐరోపా సమాఖ్య పరిమితి విధించిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కో బ్యారెల్ ధర ఇప్పుడు భారత్‌కు 60 డాలర్ల కంటే తక్కువకే దొరుకుతోంది. ఈ నేపథ్యంలోనే రష్యా నుంచి భారత్ దిగుమతుల్ని మరింత పెంచిందని పరిశ్రమ వర్గాలు తెలిపాయి. జైశంకర్ దౌత్యం రష్యాకు భారత్ మద్దతు ఇచ్చే విషయంలో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ దౌత్యాన్ని ప్రదర్శిస్తున్నారు. ముఖ్యంగా ఆ దేశంతో వ్యాపారం చేసేందుకు ఇతర దేశాలు వ్యతిరేకిస్తుంటే.. భారత్ మాత్రం గట్టిగా సమర్ధిస్తోంది. చమురు ఎక్కడ తక్కువ ధరకు లభిస్తుందో అక్కడ నుంచి సరఫరా చేసుకోవాలని నిర్ణయించుకుంది. రష్యా నుంచి చమురు దిగుమతుల వస్తున్న విమర్శల్ని జై శంకర్ తిప్పికొట్టారు. రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ.. ‘దయచేసి అర్థం చేసుకోండి. ఇది మనం ఒక దేశం నుండి చమురును కొనుగోలు చేయడం మాత్రమే కాదు. ఇతర దేశాల నుంచి చమురు కొనుగోలు చేస్తాం. కానీ భారతీయ ప్రజల ప్రయోజనాల దృష్ట్యా మనకు అనువైన దేశాలతో ఒప్పందం చేసుకోవడం సరైన విధానం. ఇప్పుడు మనం అదే చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. -
2023లో ఎగుమతులకు కష్టకాలమే!
న్యూఢిల్లీ: బలహీనమైన గ్లోబల్ డిమాండ్, పెద్ద ఆర్థిక వ్యవస్థలలో మాంద్యం కారణంగా 2023లో భారత ఆర్థిక వ్యవస్థ అలాగే ఎగుమతులు మధ్యస్తంగా ప్రభావితమవుతాయని ఎకానమీ విశ్లేషణా సంస్థ– గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) అంచనావేసింది. ఆయా అంశాల నేపథ్యంలో దేశం కరెంట్ ఖాతాను మెరుగుపరుచుకోవడం, ఇంధన దిగుమతి బిల్లును తగ్గించుకోవడం లక్ష్యంగా పెట్టుకోవాలని కూడా సూచించింది. జీటీఆర్ఐ నివేదికలో మరికొన్ని అంశాలను పరిశీలిస్తే.. ►2022లో భారత్ ముడి చమురు, బొగ్గు దిగుమతుల బిల్లు 270 బిలియన్ డాలర్లుగా ఉంది. మొత్తం వస్తు దిగుమతుల బిల్లులో ఇది 40 శాతం. ►ప్రస్తుత పరిస్థితుల్లో దేశం స్థానిక చమురు క్షేత్రాల అన్వేషణను తిరిగి శక్తివంతం చేయాలి. అలాగే బొగ్గు గనుల ద్వారా ఉత్పత్తిని పెంచాలి. ఆయా అంశాల్లో పురోగతి ఇంధన దిగుమతి బిల్లును గణనీయంగా తగ్గిస్తుంది. దీనితోపాటు కరెంట్ ఖాతాను మెరుగుపరుస్తుంది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. ►చైనాను మినహాయించి ప్రత్యామ్నాయ సరఫరా గొలుసులను సృష్టించే అమెరికా ప్రయత్నం క్రమంగా ప్రపంచ సరఫరా గొలుసుల పునర్నిర్మాణానికి దారితీస్తోంది. కొన్ని పెద్ద ఉత్పాదక సంస్థల స్థాన మార్పిడికీ దారితీస్తోంది. ఆయా పరిణామాలు, ధోరణి నుండి ప్రయోజనం పొందేందుకు భారతదేశం తగిన మంచి స్థితిలో ఉందని పరిస్థితులు సూచిస్తున్నాయి. ►భారత్ వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిపై రాజీ పడకుండా స్వయం సంమృద్ధికి కృషి చేయాలి. వివిధ దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలకు(ఎఫ్‌టీఏ) సంబంధించి దేశీయ విధానాలపై కొత్త నిబంధనల ప్రభావాన్ని జాగ్రత్తగా భారత్ అంచనావేసి, ముందడుగు వేయాలి. ►అమెరికా, యూరోపియన్ యూనియన్ (ఈయూ)సహా అభివృద్ధి చెందిన దేశాలు భాగస్వామ్య దేశాల నుండి ఎగుమతుల విషయంలో టారిఫ్యేతర అడ్డంకులను సృష్టించేందుకు కొన్ని నిబంధనలను ప్రయోగించే అవకాశం ఉన్న విషయం ఇక్కడ ప్రస్తావించాలి. ఆయా అంశాల్లో అప్రమత్తత అవసరం. ►వాణిజ్య గణాంకాలను పరిశీలిస్తే, 2021లో భారత్ వస్తు ఎగుమతుల విలువ 395 బిలియన్ డాలర్లు. ప్రపంచం అనిశ్చితి ఉన్నప్పటికీ 2022లో దేశ ఎగుమతులు 440–450 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చని అంచనా. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల్లో ఈ స్థాయి ఎగుమతులు భారత్ విజయంగానే చెప్పుకోవచ్చు. ►వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం, 2022 జనవరి నుంచి నవంబర్ మధ్య భారత్ వస్తు ఎగుమతుల విలువ 405 బిలియన్ డాలర్లు. ఇక దిగుమతులు 2021లో 573 బిలియన్ డాలర్లు ఉంటే, 2022లో 725 బిలియన్ డాలర్లకు చేరుకోవచ్చు. ►ఇక సేవల రంగానికి వస్తే ఈ విభాగం నుంచి 2021లో ఎగుమతులు 254 బిలియన్ డాలర్లు ఉంటే, 2022లో 300 డాలర్ల వరకూ పెరుగుతాయని భావిస్తున్నాం. ►మాజీ ఇండియన్ ట్రేడ్ సర్వీస్ అధికారి అజయ్ శ్రీవాస్తవ జీటీఆర్ఐ సహ వ్యవస్థాపకులు. ఆయన 2022 తన బాధ్యతల నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వాణిజ్య విధాన రూపకల్పన, ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ) , స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ) అంశాలకు సంబంధించి శ్రీ వాస్తవకు విశేష అనుభవం ఉంది. -
కేంద్రం కీలక నిర్ణయం, హర్షం వ్యక్తం చేసిన టాటా స్టీల్
న్యూఢిల్లీ: ప్రభుత్వం స్టీల్‌పై ఎగుమతుల సుంకాన్ని ఎత్తివేయడంతో టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ హర్షం వ్యక్తం చేశారు. దేశీ వినియోగంతోపాటు, విదేశీ అవసరాలకు సైతం స్టీల్‌ను తయారు చేయడంలో భారతకంపెనీలకు భారీ అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్రొడక్టులు, ముడిఇనుము ఎగుమతులపై ప్రభుత్వం సుంకాన్ని తొలగించడాన్ని నరేంద్రన్ స్వాగతించారు. ద్రవ్యోల్బణ అదుపునకు ప్రభుత్వం సుంకాలను విధించిన విషయాన్ని గ్రహించినట్లు తెలియజేశారు. దేశంలో భారీగా ముడిఇనుము నిక్షేపాలున్నాయని, తద్వారా దేశ, విదేశాలకు స్టీల్‌ను తయారు చేయడంలో అవకాశాలకు కొదవ ఉండబోదని వ్యాఖ్యానించారు. ముడిఇనుము అవసరాలకు చైనా, జపాన్, దక్షిణ కొరియా గరిష్ట స్థాయిలో దిగుమతులపై ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ దేశాలు ఉమ్మడిగా ఏడాదికి 15 కోట్ల టన్నుల స్టీల్‌ను ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మే 21న స్టీల్ ఐటమ్స్, ముడిఇనుముపై ఎగుమతి సుంకాలు విధించిన ప్రభుత్వం ఆరు నెలల తదుపరి అంటే ఈ నెల 19నుంచి వీటిని రద్దు చేసింది. -
భారత్‌కు వాణిజ్యలోటు గుబులు
న్యూఢిల్లీ: భారత్ ఎగుమతులు మేనెల్లో 15.46 శాతం పెరిగి 37.29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ఇక ఇదే నెల్లో దిగుమతులు విలువ 56.14 శాతం ఎగసి 60.62 బిలియన్ డాలర్లకు చేరింది. వెరసి ఎగుమతులు–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం వాణిజ్యలోటు 23.33 బిలియన్ డాలర్లగా నమోదయ్యింది. 2021 ఇదే నెల్లో ఈ విలువ కేవలం 6.53 బిలియన్ డాలర్లుగా ఉంది. వాణిజ్య మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలను పరిశీలిస్తే.. ఎగుమతులు ఇలా... ► ఎగుమతులకు సంబంధించి పెట్రోలియం ఉత్పత్తులు, ఎలక్ట్రానిక్ గూడ్స్, రసాయనాల వంటి రంగాల పనితీరు ప్రోత్సాహకరంగా ఉంది. ►ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 7.84 శాతం పెరిగి 9.3 బిలియన్ డాలర్లకు ఎగశాయి. పెట్రోలియం ప్రొడక్ట్‌లు విషయంలో ఈ రేటు 52.71 శాతం పెరిగి 8.11 బిలియన్ డాలర్లకు చేరింది. ► రత్నాలు, ఆభరణాల ఎగుమతులు గత ఏడాది మేలో 2.96 బిలియన్ డాలర్లు ఉంటే, తాజా సమీక్షా నెల్లో 3.1 బిలియన్ డాలర్లకు చేరాయి. ► రసాయనాల ఎగుమతులు 12 శాతం పెరిగి విలువలో 2.5 బిలియన్ డాలర్లకు చేరింది. ► ఫార్మా ఎగుమతులు 5.78 శాతం ఎగసి 1.98 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► రెడీమేడ్ దుస్తుల ఎగుమతులు 23% పురోగ తితో 1.36 బిలియన్ డాలర్లకు చేరాయి. దిగుమతుల తీరిది... ► పెట్రోలియం, క్రూడ్ ఉత్పత్తుల దిగుమతులు మే నెల్లో 91.6 శాతం పెరిగి 18.14 బిలియన్ డాలర్లకు చేరాయి. ► బొగ్గు, కోక్, బ్రికెట్ల దిగుమతులు మే 2 బిలియన్ డాలర్ల (2021 మేలో) నుండి 5.33 బిలియన్ డాలర్లకు ఎగశాయి. ► బంగారం దిగుమతులు 677 మిలియన్ డాలర్ల నుంచి భారీగా 5.82 బిలియన్ డాలర్లకు ఎగశాయి. తొలి రెండు నెలల్లో... ఏప్రిల్‌తో ప్రారంభమైన 2022–23 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో (ఏప్రిల్, మే) ఎగుమతులు 22.26 శాతం పెరిగి 77.08 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. దిగుమతులు ఇదే కాలంలో 42.35 శాతం ఎగసి 120.81 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వెరసి వాణిజ్యలోటు గత ఆర్థిక సంవత్సరం ఇదే నెలలతో పోల్చితే 21.82 బిలియన్ డాలర్ల నుంచి 43.73 బిలియన్ డాలర్లకు ఎగసింది. గత ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 400 బిలియన్ డాలర్లు. భారత్ వద్ద ఉన్న మొత్తం విదేశీ మారకద్రవ్య నిల్వలు (దాదాపు 600 బిలియన్ డాలర్లు) దాదాపు 12 నెలల దిగుమతులుకు సరిపోతాయన్నది అంచనా. అయితే వాణిజ్యలోటు పెరుగుదల కొంత ఇబ్బందికరమైన పరిణామం. కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్– దేశంలోకి వచ్చీ–పోయే మొత్తం విదేశీ మారకద్రవ్యం మధ్య నికర వ్యత్యాసం) భారానికీ ఇది దారితీస్తుంది. 2022–23లో క్యాడ్ 2 శాతం దాటుతుందని ఇప్పటికే అంచనాలు వెలువడుతున్నాయి. 2021–22ను అధిగమిస్తాం ఎగుమతుల రికార్డు ఎకానమీకి పూర్తి సానుకూల అంశం. ఆస్ట్రేలియా, యునైటెడ్ అరబ్ ఎమిరైట్స్ (యూఏఈ)సహా పలు దేశాలతో భారత్ స్వేచ్చా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ), పీఎల్ఐ స్కీమ్ వంటి అంశాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఎగుమతులు గత ఆర్థిక సంవత్సరంలో నమోదయిన విలువ మొత్తాన్ని (400 బిలియన్ డాలర్లకుపైగా) అధిగమిస్తాయన్న భరోసాను కల్పిస్తున్నాయి. – ఏ శక్తివేల్, ఎఫ్ఐఈఓ ప్రెసిడెంట్ -
టాప్ 20లో రెండు జిల్లాలు.. ఎగుమతుల్లో మరో మెట్టు ఎక్కిన ఏపీ
జిల్లా కేంద్రంగా ఎగుమతులను ప్రోత్సహించేందుకు ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ సత్ఫలితాలిస్తున్నాయి. డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా అత్యధికంగా ఎగుమతులు చేసిన టాప్–20లో విశాఖ, తూర్పుగోదావరి జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. సాక్షి, అమరావతి: జిల్లా కేంద్రంగా ఎగుమతులను ప్రోత్సహించే విధంగా ఏర్పాటు చేసిన డిస్ట్రిక్ట్ ఎక్స్పోర్ట్ హబ్స్ సత్ఫలితాలిస్తున్నాయి. గత ఆర్థిక సంవత్సరం ఎగుమతుల్లో భారీ వృద్ధి నమోదు చేయడం ద్వారా ఏడో స్థానం నుంచి నాలుగో స్థానానికి చేరుకుని రికార్డు సృష్టించిన ఆంధ్రప్రదేశ్ ఈ ఏడాది టాప్–20 జిల్లాల జాబితాలో రెండు స్థానాలను కైవసం చేసుకుంది. తాజాగా డైరక్టర్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి ఆరునెలల్లో (ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు) అత్యధికంగా ఎగుమతులు చేసిన 20 జిల్లాల జాబితాలో విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాలు చోటు దక్కించుకున్నాయి. విశాఖ జిల్లా రూ.20,662.5 కోట్ల (275.50 కోట్ల డాలర్ల) విలువైన వాణిజ్య ఎగుమతులతో 14వ స్థానంలో నిలిచింది. తూర్పుగోదావరి జిల్లా రూ.18,204.15 కోట్ల (242.72 కోట్ల డాలర్ల) విలువైన ఎగుమతులతో 18వ స్థానంలో నిలిచింది. విశాఖ జిల్లా నుంచి జరిగిన ఎగుమతుల్లో ఇంజనీరింగ్ గూడ్స్ (92.06 కోట్ల డాలర్లు), రసాయనాలు (57.21 కోట్ల డాలర్లు), ఫార్మాస్యూటికల్స్ (18.81 కోట్ల డాలర్లు), ప్లాస్టిక్ అండ్ లినోలియం (16.41 కోట్ల డాలర్లు), మాంసం– పాలు– గుడ్లు (15.34 కోట్ల డాలర్లు) మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా నుంచి ఎగుమతి జరిగిన వాటిలో ఇంజనీరింగ్ గూడ్స్ (149.51 కోట్ల డాలర్లు), సముద్ర ఉత్పత్తులు (34.28 కోట్ల డాలర్లు), బియ్యం (30.57 కోట్ల డాలర్లు), ఎలక్ట్రానిక్ గూడ్స్ (4.01 కోట్ల డాలర్లు), మాంసం– పాలు– గుడ్లు (1.30 కోట్ల డాలర్లు) మొదటి ఐదు స్థానాల్లో నిలిచాయి. జిల్లాల వారీగా ఉత్పత్తుల గుర్తింపు గత సంవత్సరం రాష్ట్రం నుంచి రూ.1,22,640 కోట్ల విలువైన ఎగుమతులు జరిగాయి. 2030 నాటికి రూ.2,46,010 కోట్ల విలువైన ఎగుమతులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకుంది. ఇందుకోసం ఇటీవల జరిగిన వాణిజ్య ఉత్సవ్ సందర్భంగా జిల్లాల వారీ కీలక ఉత్పత్తులను గుర్తించి వాటి ఎగుమతులను ప్రోత్సహించే విధంగా కార్యాచరణ ప్రణాళికను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విడుదల చేసిన సంగతి తెలిసిందే. జిల్లాను ఒక ఎక్స్పోర్ట్ హబ్‌గా చేసి అక్కడి నుంచే ఎగుమతులకు సంబంధించిన అన్ని సేవలందించే విధంగా ప్రతి జిల్లాలో ఎక్స్పోర్ట్ ప్రమోషన్ సెల్ ఏర్పాటు చేసినట్లు పరిశ్రమలశాఖ జాయింట్ డైరెక్టర్ జి.ఎస్.రావు రావు తెలిపారు. ప్రతి జిల్లా నుంచి ఎగుమతి అవకాశాలున్న ఐదు, ఆరురకాల ఉత్పత్తులను ఎంపికచేసి వాటిని ప్రోత్సహిస్తున్నట్లు చెప్పారు. ఏపీ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ద్వారా ఎగుమతులకు సంబంధించిన సమాచారంతో మ్యాగ్జైన్లు, కొనుగోళ్లు–అమ్మకందారులతో ఎప్పటికప్పుడు నిర్వహిస్తున్న సమావేశాలు సత్ఫలితాలిస్తున్నాయని తెలిపారు. -
అమెరికాకు మామిడి ఎగుమతులు
న్యూఢిల్లీ: ఇరు దేశాల మధ్య ఎగుమతి, దిగుమతుల పరిధిలోకి మరిన్ని ఉత్పత్తులను చేర్చడంపై భారత్, అమెరికా దృష్టి సారించాయి. ఈ ప్రయత్నాలు ఫలవంతమైతే భారత్ నుంచి అమెరికాకు మామిడి, దానిమ్మ ఎగుమతి చేయడానికి, అక్కడి నుంచి చెర్రీ పళ్లను దిగుమతి చేసుకోవడానికి వీలు కానుంది. ఇందుకు సంబంధించిన విధి విధానాలపై కసరత్తు చేయాలని మంగళవారం జరిగిన భేటీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, అమెరికా ట్రేడ్ రిప్రెజెంటేటివ్ (యూఎస్టీఆర్) కేథరిన్ టై అంగీకరించారు. అలాగే ఇతరత్రా వాణిజ్యాంశాలను కూడా వారు చర్చించారు. నాలుగేళ్లలో తొలిసారిగా జరిగిన భారత్–అమెరికా ట్రేడ్ పాలసీ ఫోరం (టీపీఎఫ్) 12వ మంత్రుల స్థాయి సమావేశానికి వారు సహ–సారథ్యం వహించారు. మామిడి, దానిమ్మ పళ్ల ఎగుమతులకు తోడ్పడేందుకు అవసరమైన చర్యలను అమెరికా తీసుకోనున్నట్లు, అలాగే అక్కడి నుంచి చెర్రీలు, పశువుల ఆహారం ఆల్ఫాఆల్ఫా ఎండుగడ్డిని దిగుమతి చేసుకునేందుకు కావాల్సిన సర్టిఫికేషన్ ప్రక్రియను భారత్ ఖరారు చేయనున్నట్లు ఇరు వర్గాలు సంయుక్త ప్రకటనలో తెలిపాయి. 2007 నుంచి అమెరికాకు భారత మామిడి ఎగుమతులు పుంజుకోగా.. కరోనాతో రెండేళ్లుగా నిల్చిపోయాయి. ఈసారి 100 బిలియన్ డాలర్ల వాణిజ్యం.. ఈ ఏడాది రెండు దేశాల మధ్య వర్తక వాణిజ్యం 100 బిలియన్ డాలర్లకు చేరగలదని గోయల్, కేథరిన్ అభిప్రాయపడ్డారు. వాణిజ్యపరంగా అడ్డంకులను తొలగించేందుకు మరిన్ని అంశాలపై కలిసి పనిచేయాలని తీర్మానించారు. అటు, దేశీ ఎగుమతిదారులకు ప్రాధాన్య హోదా (జీఎస్పీ) ప్రయోజనాలను పునరుద్ధరించాలని సమావేశం సందర్భంగా అమెరికాను భారత్ కోరింది. దీన్ని పరిశీలిస్తామంటూ అమెరికా హామీ ఇచ్చింది. అలాగే వివిధ ఉత్పత్తులపై టారిఫ్‌ల తగ్గింపు అవకాశాలపై ఇరు పక్షాలు చర్చించాయి. -
‘కార్గో’లో గంగవరం పోర్టు మరో మైలురాయి
సాక్షి, విశాఖపట్నం: దేశంలోనే అత్యంత లోతైన, అధునాతన పోర్టుల్లో ఒకటైన గంగవరం పోర్టు సరుకుల ఎగుమతి దిగుమతుల్లో ఎప్పటికప్పడు రికార్డులు సృష్టిస్తోంది. అత్యాధునిక మౌలిక వసతుల కారణంగా మంగళవారం మరో మైలురాయిని అధిగమించింది. 24 గంటల్లోనే కార్గో హ్యాండ్లింగ్ చేస్తూ రికార్డు నమోదు చేసింది. మొబైల్ హార్బర్ క్రేన్స్ (ఎంహెచ్సీ) వినియోగిస్తూ 24 గంటల్లో ఏకంగా 26,885 మెట్రిక్ టన్నుల ఎరువును షిప్ నుంచి దిగుమతి చేసింది. గతంలో ఇదే పోర్టులో 24 గంటల్లో 16,690 మెట్రిక్ టన్నుల ఎరువులను డిశ్చార్జ్ చేసిన రికార్డుని అధిగమించింది. ఎంవీకే మ్యాక్స్ ఎంపరర్ నౌక తీసుకొచ్చిన 64,575 మెట్రిక్ టన్నుల యూరియాని అత్యంత వేగంగా దిగుమతి చేసింది. స్టీల్‌ప్లాంట్‌కు బొగ్గు అందించడంలోనూ గత నిర్వహణని అధిగమించింది. ఈ ఏడాది ఏప్రిల్‌లో మొత్తం 5,67,888 మెట్రిక్ టన్నులను కన్వేయర్ల ద్వారా ఆర్ఐఎన్ఎల్ ప్లాంట్‌కు బదిలీ చేయగా.. ఆగస్టులో ఏకంగా 6,08,706 మెట్రిక్ టన్నులు బొగ్గును అందించింది. ఒక నెలలో ఇంత పెద్ద మొత్తాన్ని అందించిన గంగవరం పోర్టు అధికారులు, సిబ్బందికి స్టీల్‌ప్లాంట్ అధికారులు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా గంగవరం పోర్టు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ జీజే రావు మాట్లాడుతూ అత్యున్నత మౌలిక వసతులు, నిర్వహణ సామర్థ్యాలను అందిపుచ్చుకోవడం వల్లే అనేక మైలురాళ్లని అధిగమిస్తున్నామన్నారు. పోర్టులో డీప్ వాటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రయోజనాలు వాణిజ్య సంస్థలకు అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపారు. -
సూయజ్‌కు ఎందుకంత ప్రాధాన్యం, మీకీ విషయాలు తెలుసా?
సూయజ్ కెనాల్లో ఒక్క భారీ నౌక చిక్కుకుపోతే ప్రపంచమంతటా సంచలనంగా మారింది. ఇది జరిగి ఆరేడు రోజులే.. ఒకప్పుడైతే కొన్ని నౌకలు ఏకంగా ఎనిమిదేళ్లపాటు అక్కడ చిక్కుకుపోయాయి.. ఆ విషయం మీకు తెలుసా? 1967 జూన్‌లో 14 కార్గో నౌకలు సూయజ్ కాల్వలో ప్రయాణిస్తున్న సమయంలో ఒక్కసారిగా పొరుగు దేశాలైన ఇజ్రాయెల్, ఈజిప్టు మధ్య యుద్ధం మొదలైంది. యుద్ధం జరిగింది కొన్ని రోజులే.. కానీ కాల్వ మూసేయడంతో నౌకలు మాత్రం ఎనిమిదేళ్లు అక్కడే చిక్కుకుపోయాయి. ఇంతకీ జగడమెందుకు? సూయజ్ కెనాల్.. కేవలం సరుకు రవాణాకే కాదు.. సుమారు శతాబ్దం పాటు ప్రపంచ రాజకీయాల్లో ఆధిపత్యానికీ కేంద్రంగా నిలిచింది. ఇంగ్లాండ్, ఫ్రాన్స్, డచ్ వంటి యూరప్ దేశాలు వ్యాపారం పేరిట ఆసియా దేశాలను ఆక్రమించినప్పటి సమయం అది. ఆ దేశాల వారు ఆఫ్రికా ఖండం చుట్టూ తిరిగి దక్షిణాసియా దేశాలకు చేరాల్సి వచ్చేది. ఈ ప్రయాణానికి చాలా సమయం పట్టేది. ఖర్చు ఎక్కువగా అయ్యేది. ఆ క్రమంలోనే మధ్యధరా సముద్రం నుంచి హిందూ మహా సముద్రానికి మార్గం కలిపేందుకు.. 1859లో ఈజిప్ట్ మీదుగా 193 కిలోమీటర్ల పొడవునా భారీ కాల్వ తవ్వడం మొదలుపెట్టారు. దీనికోసం ఫ్రాన్స్ ఎక్కువగా ఖర్చుపెట్టింది, బ్రిటన్ కూడా జత కలిసింది. 1869 నుంచి నౌకలు వెళ్లడం మొదలైంది. అప్పటి నుంచీ సూయజ్ కాల్వ మీద ఫ్రాన్స్, బ్రిటన్ల పెత్తనం కొనసాగింది. 1956లో ఈజిప్ట్ అధ్యక్షుడు నాజర్ సూయజ్ కాల్వను పూర్తిగా తమ అధీనంలోకి తీసుకున్నారు. ఆ టైంలోనే ఈజిప్ట్‌పై ఆంక్షలు, పొరుగు దేశాలతో యుద్ధాలు వంటివి జరిగాయి. (చదవండి: సూయజ్ కెనాల్లో అడ్డం తిరిగిన భారీ నౌక.. గంటకు 3వేల కోట్ల నష్టం) కాల్వలో పడవలు ముంచి.. యుద్ధం తర్వాతి ఉద్రిక్తతలు ఎఫెక్ట్ సూయజ్ కెనాల్‌పై పడింది. కాల్వను మూసేయాలని ఈజిప్ట్ నిర్ణయించింది. కొన్ని పడవలను ముంచేసి, మట్టి, ఇసుక వంటివి వేసి అక్కడక్కడా కాల్వలో అడ్డంకులు కల్పించారు. దాంతో అప్పటికే ప్రయాణిస్తున్న నౌకలన్నీ కాల్వ మధ్యలో చిక్కుకుపోయాయి. గాలుల వల్ల పక్కనే ఉన్న ఎడారి నుంచి వచ్చిన ఇసుక, దుమ్ముతో నౌకలు నిండిపోయాయి. దీనినే ‘ది యెల్లో ఫ్లీట్ (పసుపు దళం)’గా పిలుస్తారు. మళ్లీ యుద్ధంతోనే తెరుచుకుని.. యుద్ధంతో మూతపడిన సూయజ్ కాల్వ తిరిగి తెరుచుకోవడానికి కూడా మరో యుద్ధమే కారణమైంది. 1973లో ఈజిప్ట్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధం జరిగి.. రెండు దేశాలు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో పడిపోయాయి. ఆ దెబ్బతో కాల్పుల విరమణ ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ పరిస్థితే 1975లో కెనాల్‌ను తిరిగి ఓపెన్ చేయడానికి మార్గం సుగమం చేసింది. ఏడు వేల కిలోమీటర్లు తిరిగిపోవాలి ప్రపంచంలో 70 శాతానికిపైగా జనాభా ఉన్న యూరప్, ఆసియా దేశాల మధ్య వాణిజ్యానికి సూయజ్ కాల్వ ఎంతో కీలకం. మొత్తం ప్రపంచ వాణిజ్యంలో 15 శాతం వరకు ఈ కాల్వ మీదుగానే జరుగుతుంది. ఈ కాల్వ లేకుంటే ఆసియా, యూరప్ ఖండాల మధ్య ప్రయాణించే నౌకలు.. మొత్తంగా ఆఫ్రికా ఖండం చుట్టూ వేల కిలోమీటర్లు అదనంగా తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. ఆ మార్గాన్ని ‘కేప్ ఆఫ్ గుడ్ హోప్’ రూట్ అంటారు. మన ముంబై నుంచి లండన్‌కు సూయజ్ కాల్వ మీదుగా వెళితే 11,600 కిలోమీటర్ల దూరం వస్తుంది. వాతావరణం, ఇతర అంశాల పరంగా ఇది భద్రమైన మార్గం. అదే కేప్ ఆఫ్ గుడ్ హోప్ మీదుగా వెళితే ఏకంగా 19,800 కిలోమీటర్లకుపైగా ప్రయాణించాల్సి ఉంటుంది. అంతేకాదు ఆ మార్గంలో తుపానులు, ఇతర సమస్యలు ఎన్నో ఉంటాయి. నౌకలకు ప్రమాదకరం కూడా. అందుకే సూయజ్ కాల్వకు ఇంత ప్రాధాన్యత. – సాక్షి సెంట్రల్ డెస్క్ -
మన పోర్టులపై సూయజ్ ప్రభావం అంతంతే
సాక్షి, అమరావతి: సూయజ్ కాలువలో తలెత్తిన సమస్య ప్రభావం రాష్ట్ర పోర్టులపై పెద్దగా లేదని.. ఇతర దేశాలకు మన రాష్ట్రం నుంచి నౌకల రాకపోకలు యథావిధిగా కొనసాగుతున్నాయని ఏపీ మారిటైమ్ బోర్డు ప్రకటించింది. విశాఖ, కృష్ణపట్నం కంటైనర్ పోర్టులపై సూయజ్ ప్రభావం స్వల్పంగా ఉంటుందని అంచనా వేస్తున్నట్టు ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో మురళీధరన్ ‘సాక్షి’కి తెలిపారు. ఏపీ నుంచి ఆఫ్రికా, చైనా, ఇండోనేషియా వంటి దేశాలకు నౌకా వాణిజ్యం ఎక్కువని, యూరప్ దేశాలతో లావాదేవీలు తక్కువగా ఉండటంతో ‘సూయజ్’ సమస్య అంతగా ప్రభావం చూపదని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. మధ్యధరా, హిందూ మహా సముద్రాలను కలుపుతూ ఈజిప్టు వద్ద నిర్మించిన సూయజ్ కాలువలో జపాన్‌కు చెందిన అతిపెద్ద కార్గో నౌక ‘ఎవర్ గివెన్’ పెనుగాలులకు అడ్డం తిరిగి నిలిచిపోవడంతో ప్రపంచ సముద్ర వాణిజ్యం ఒక్కసారిగా నిలిచిపోయింది. ఈ కాలువ ద్వారా ఆసియా దేశాల నుంచి యూరప్ అమెరికా దేశాలకు నిత్యం 35కు పైగా నౌకలు ప్రయాణిస్తాయి. ఎవర్ గివెన్ నౌక అడ్డంగా నిలిచిపోవడంతో ఇప్పటివరకు 300 నౌకలు వరకు నిలిచిపోయాయి. దీని ప్రభావం భారత సముద్ర వాణిజ్యంపై తీవ్రంగానే ఉంది. సూయజ్ కాలువ ద్వారా మన దేశం నుంచి అమెరికా, యూరప్ దేశాలకు రూ.14,80,000 కోట్ల వాణిజ్య లావాదేవీలు జరుగుతున్నట్టు కేంద్ర నౌకాయాన శాఖ అంచనా వేసింది. తాజా సమస్య చమురు ఉత్పత్తులు, రసాయనాలు, ఆటోమొబైల్, ఉక్కు, టెక్స్టైల్స్ వంటి ఉత్పత్తుల రవాణాపై తీవ్ర ప్రభావం చూపనుంది. అత్యవసర సరకు రవాణాకు ప్రత్యామ్నాయ మార్గాల్ని చూసుకోవాలని కేంద్రం అన్ని రాష్ట్రాలకూ సూచించింది. దీంతో రాష్ట్ర మారిటైమ్ బోర్డు ఇక్కడి పోర్టుల్లో పరిస్థితిని సమీక్షించింది. విశాఖ మేజర్ పోర్టుతో పాటు 4 రాష్ట్ర పోర్టుల ద్వారా ఏటా సుమారు 200 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతోంది. ఒక్క విశాఖ పోర్టు ద్వారానే 100 మిలియన్ టన్నుల సరకు రవాణా అవుతుండగా, గంగవరం, కాకినాడ డీప్ వాటర్ పోర్టు, కాకినాడ యాంకరేజ్ పోర్టు, కృష్ణపట్నం ద్వారా 100 మిలియన్ టన్నులకు పైగా సరకు రవాణా అవుతోంది. వీటిలో బియ్యం, జొన్నలతోపాటు గ్రానైట్, బొగ్గు, ముడి ఇనుము, బెరైటిస్ వంటి ఖనిజాలే ఎక్కువ. ఈ పోర్టుల నుంచి యూరప్‌కు వెళ్లే నౌకలు లేకపోవడంతో సూయజ్ ప్రభావం ఏపీ మారిటైమ్‌పై పెద్దగా ఉండదని అధికారులు అంచనాకు వచ్చారు. -
డ్రాగన్‌తో కటీఫ్ సాధ్యమేనా
చేతిలో రెడ్మి స్మార్ట్‌ఫోన్... ఓపెన్ చేస్తే టిక్‌టాక్ వీడియో... చెవిలో షియోమి ఇయర్ ఫోన్... అలీ ఎక్స్‌ప్రెస్‌లో నచ్చిన వస్తువుకు ఆర్డర్... పేటీఎంలో ఫ్రెండ్‌కి క్షణాల్లో నగదు బదిలీ... ఇలా ఒకటేమిటి చేతికి తొడుక్కునే వాచీ నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకూ అన్నింటికీ ఒకటే లింకు.. అరే ఠక్కున భలే చెప్పేశారే! అదేమరి చైనా ‘చౌక’ మహిమ!! భారతీయులను తన చౌక ఉత్పత్తులతో బానిసలుగా మార్చేసిన డ్రాగన్... అదును చూసి మనపైనే బుసలు కొడుతోంది. సరిహద్దుల్లో భారతీయ సైనికులను దొంగదెబ్బతీస్తూ... తన ఉత్పత్తులను మాత్రం రాజమార్గంలో ఎడాపెడా అమ్ముకుంటోంది. దేశంలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. చైనా వస్తువులను బహిష్కరించి డ్రాగన్‌తో వాణిజ్య యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒకటే హల్చల్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు చైనాతో మనకున్న ఆర్థిక, వాణిజ్య బంధం ఏ స్థాయిలో ఉంది. దీన్ని తెంచుకుంటే మనకొచ్చే ఇబ్బందులేంటి? దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే మన కంపెనీలు పడే అవస్థలు ఎలా ఉంటాయి? వీటన్నింటినీ వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనమిది... చైనా–భారత్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుమూడేళ్లుగా ముదురుతూ వస్తున్న సరిహద్దు ఉద్రిక్తతలు... తాజాగా గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల ఊచకోతతో మరింత తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 40 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇంత ఘోరమైన ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికితోడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌కు మూలం కూడా చైనాయే కావడంతో భారతీయులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు. చైనా ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. మరీ ముఖ్యంగా చైనా లాంటి బాహుబలి ఎకానమీతో అంటీముట్టనట్టుగా ఉండటం మనకేకాదు అమెరికాలాంటి అగ్రదేశానికీ సాధ్యంకాని పరిస్థితి. 14.14 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అంతకంతకూ విస్తరిస్తోంది. భారత్ జీడీపీ 2.94 లక్షల కోట్లు మాత్రమే (ఆసియాలో నంబర్–3, ప్రపంచంలో నంబర్–5). పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలు, ముడి పదార్థాల సరఫరా నుంచి స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడుల వరకూ అమెరికా తర్వాత భారత్‌కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. చైనా ముడి పదార్థాలు, విడిభాగాలపై అత్యధికంగా ఆధారపడిన మన పరిశ్రమలకు అంత చౌకగా ప్రపంచంలో మరేదేశం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేవలం సరిహద్దు ఘర్షణ, కరోనా కారణంగా చైనాతో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం. ద్వైపాక్షిక వాణిజ్యం @ రూ.7.3 లక్షల కోట్లు 2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5.33 శాతం అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చైనాకు వెళ్లాయి. అయితే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువ ఎంతో తెలుసా? రూ.5.5 లక్షల కోట్లు. అంటే మూడు రెట్లు ఎక్కువ. మన మొత్తం దిగుమతుల్లో ఇది ఏకంగా 14 శాతం. భారత్‌కు చైనాయే అతిపెద్ద దిగుమతిదారు కూడా. 2000 సంవత్సరం నుంచి 2018–19 నాటికి చూస్తే చైనా నుంచి బారత్‌కు దిగుమతులు 45 రెట్లు ఎగబాకి 70 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. డ్రాగన్ మన దేశంలోకి చౌక వస్తువులను ఎలా కుమ్మరిస్తోందో... అదేవిధంగా చైనా దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడిపోయామో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు అంతకంతకూ తీవ్రమవుతోంది. మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, పవర్ ప్లాంట్ పరికరాలు, ఎరువులు, వాహన విడిభాగాలు, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, టెలికం పరికరాలు, మెట్రో రైలు కోచ్‌లు ఇతరత్రా యంత్ర పరికరాలు, ఔషధ ముడిపదార్థాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల లిస్టు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలా వెళ్తూనే ఉంటుంది. చైనా ముడి వస్తువులపై ఆధారపడిన మన కంపెనీలు, పరిశ్రమలకు వాటి సరఫరా నిలిచిపోతే లక్షలాది మందికి ఉపాది కరువయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మరోపక్క, చైనాకు ఎగుమతులు నిలిచిపోతే వాటిపై ఆధారపడిన మన కంపెనీలకూ తీవ్ర నష్టమే. ప్రధానంగా భారత్‌నుంచి చైనాకు ఆర్గానిక్ రసాయనాలు, ముడి ఖనిజం, మినరల్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయెల్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు... భారత్‌లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) చైనా జోరు గడిచిన రెండుమూడేళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం (సోలార్ ప్యానెల్స్), విద్యుత్ పరికరాలు, వాహన రంగం మరియు రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్‌డీఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్‌లోకి వచ్చిన, ప్రణాళికల్లో ఉన్న చైనా ఎఫ్‌డీఐల విలువ 2600 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) అంచనా. భారత్‌లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమి, వివో, ఫోసున్, హేయర్, ఎస్ఏఐసీ, వంటివి భారత్‌లో ప్లాంట్లున్న అతిపెద్ద బ్రాండ్స్‌లో కొన్ని. ఇక చైనాలో కార్యకలాపాలున్న తయారీ సంస్థల్లో అదానీ గ్లోబల్, డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, బీహెచ్ఈఎల్, గోద్రేజ్ అండ్ బాయ్స్, అరబిందో వంటివి ఉన్నాయి. స్టార్టప్స్‌లోకి నిధుల వరద... భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్, కంపెనీలు తమ సింగపూర్, హాంకాంగ్, మారిషస్‌లోని సంస్థల ద్వారా భారత్‌లోని స్టార్టప్‌లకు నిధులను మళ్లిస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని అలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా వెచ్చించింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి వచ్చినట్లు కాదు, సింగపూర్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా మారువేషంలో చైనా నుంచి భారత్‌లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని ‘గేట్‌వే హౌస్’ నివేదిక చెబుతోంది. మొత్తంమీద భారత్‌లోని 30 స్టార్టప్ యూనికార్స్న్(బిలియన్ డాలర్లకు మించి విలువ కలిగినవి)కు ఈ ఏడాది మార్చివరకూ చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 30,000 కోట్లు) పైనే ఉంటుందని అంచనా. బల్క్ డ్రగ్స్... చైనాయే ఆధారం! పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 14 ర్యాంకు మాత్రమే. 2018–19లో భారత్ 1400 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది. అదేసమయంలో ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్(ముడి పదార్థాలు–ఏపీఐ) దిగుమతుల్లో మూడింట రెండు వంతులు చైనా నుంచే నమోదవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నపళంగా చైనా దిగుమతులను తగ్గించుకుంటే... ఆమేరకు మనకు సరఫరా చేసేందుకు ఇతరదేశాలేవీ సిద్ధంగా లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా గనుక సరఫరా తగ్గిస్తే మన ఔషధ రంగానికి చాలా నష్టం వాటిల్లుతుందనేది ఫార్మా సంస్థల ఆందోళన. స్మార్ట్ ఫోన్స్‌లో ఆధిపత్యం.. భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్‌ఫోన్స్‌లో 72 చైనావే అంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం! అంతగా మనం చైనా చౌక మొబైల్స్‌కు అలవాటుపడిపోయాం. షావోమీ, వివో, ఒప్పో, వన్‌ప్లస్ వంటి బ్రాండ్స్ మొత్తం కలిపి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 72% వాటాను కొల్లగొట్టాయని గేట్‌వే హౌస్ నివేదిక పేర్కొంది. చైనా మొబైల్స్ దెబ్బకి శాంసంగ్, యాపిల్ అట్టడుగుకు పడిపోయాయి. టిక్ ‘టాప్’...: భారత్‌లో చైనా మొబైల్ యాప్ టిక్‌టాక్‌కు ఉన్న ప్రాచుర్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చిన టిక్‌టాక్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు(నెలవారీ) ఉన్నారు. దాదాపు 200 కోట్ల మేర డౌన్లోడ్స్ అయ్యాయి. ఇందులో సుమారు 50 కోట్ల డౌన్లోడ్స్ భారత్ నుంచే ఉండటం గమనార్హం. టిక్‌టాక్ వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(తర్వాత స్థానాల్లో చైనా–18 కోట్ల డౌన్లోడ్స్, అమెరికా–13 కోట్ల డౌన్లోడ్స్) ఉంది. చైనా ప్రతీకారం.. న్యూఢిల్లీ: భారత్‌లో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తమ కన్సైన్మెంట్లను హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు నిలిపివేస్తున్నారంటూ ఎగుమతిదారులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై పోర్టులో చైనా నుంచి వచ్చిన దిగుమతులకు సంబంధించి భారత అధికారులు తీసుకున్న చర్యలకు ప్రతిగా ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్ఐఈవో పేర్కొంది. ‘చైనా దిగుమతులన్నింటినీ కస్టమ్స్ శాఖ భౌతికంగా ఒక్కో దాన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు కూడా భారత్ నుంచి వచ్చే కన్సైన్మెంట్ల పై ఇలాంటి వైఖరే చూపిస్తున్నారు‘ అని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్‌కు రాసిన లేఖలో ఎఫ్ఐఈవో ప్రెసిడెంట్ ఎస్కె సరాఫ్ పేర్కొన్నారు. కింకర్తవ్యం..? చైనాతో సరిహద్దు వివాదం ముదిరింది కాబట్టి ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే చైనా కంటే భారత్‌కే అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్(స్వయం సమృద్ధి)తో దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభించినప్పటికీ.. చైనా కంపెనీలు, చైనా దిగుమతులను పూర్తిగా లేకుండా చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మేకిన్ ఇండియానే చూసుకుంటే... భారత్‌లో తయారీ ప్లాంట్లను పెట్టాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు షావోమీ, వివో, ఒప్పో, హేయర్ తదితర అనేక చైనా కంపెనీలు సైతం భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధిని కల్పిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో సరిహద్దు వివాదాలను సాకుగా చూపి వాటిని వెళ్లగొట్టగలమా? అలాచేస్తే అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కింద మనం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి రావడంతోపాటు ఇన్వెస్టర్లలో అభద్రతా భావం నెలకొనేందుకు దారితీస్తుంది. దిగుమతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, చైనా నుంచి క్రమంగా దిగుమతులను తగ్గించుకోవచ్చని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌కు తైవాన్, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియాలో చైనాకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి ఇతర దేశాలను ప్రోత్సహించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిదనేది వారి సూచన!! సాక్షి బిజినెస్ విభాగం -
ఎగుమతి, దిగుమతులపై డేగ కన్ను!
సాక్షి, సిటీబ్యూరో: కోవిడ్–19 విజృంభిస్తుండటంతో ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులకు అనుగుణంగా కస్టమ్స్ విభాగం తన పని తీరును మార్చుకుంటోంది. సంప్రదాయ విధానాలకు భిన్నంగా తాజా పరిగణామాలను బట్టి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్(సీబీఐటీసీ) ఆదేశాలు, సూచనల్ని పరిగణలోకి తీసుకుని విధులు నిర్వర్తిస్తోంది. గతానికి భిన్నంగా నిర్విరామంగా విధులు నిర్వర్తించడానికి కస్టమ్స్ విభాగం ప్రణాళికలు సిద్ధం చేసింది. కరోనా ప్రభావంతో భారత ప్రభుత్వం కొన్ని రకాల ఎగుమతుల్ని నిషేధించింది. ఓ పక్క దీనిని అమలు చేస్తూ నే మరోపక్క డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఆదేశాల మేరకు దేశంలో ఎక్కడా సప్లై చైన్ ఆగకూడదనే అంశానికి ప్రాధాన్యమిస్తున్న కస్టమ్స్ అధికారులు విధులు నిర్వర్తిస్తున్నారని ఓ ఉన్నతాధికారి తెలిపారు. నగరానికి సంబంధించిన ఎగుమతి, దిగుమతుల్లో కస్టమ్స్ విభాగమే కీలకపాత్ర వహిస్తోంది. దీనికి సంబంధించి శంషాబాద్ విమానాశ్రయంలోని ఎయిర్ కార్గొ యూని ట్, సనత్‌నగర్‌లోని ఇన్‌ల్యాండ్ కంటైనర్ డిపో(ఐసీడీ) అధికారులు ఎప్పటిప్పుడు వ్యూహా త్మకంగా వ్యవహరిస్తున్నారు. కరోనా ఎఫెక్ట్ తర్వాత నగరానికి వెంటిలేటర్ల దిగుమతి జరుగుతోందని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. వీటి అవసరం భారీ సంఖ్యలో ఉండగా ప్రస్తుతం అమెరికా నుంచి రోజుకు 100 నుంచి 150 వరకు మాత్రమే వస్తున్నాయని, ఈ సంఖ్య పెంచడానికి కేంద్రం కృషి చేస్తోందని ఆయన వ్యాఖ్యానించారు. నగరానికి దిగుమతి అయ్యే వస్తువుల్లో అత్యధికం చైనా నుంచే వస్తున్నాయి. ఇప్పటి వరకు అక్కడ అమలులో ఉన్న లాక్‌డౌన్‌తో దిగుమతులు తగ్గాయి. లాక్డౌన్ అమలులో ఉండటంతో నగరంలో ఐసీడీకి వచ్చిన 900 కంటైనర్లు క్లియర్ కాకుండా ఆగిపోయాయని ఆయన వివరించారు. చైనాలో లాక్డౌన్ ముగియడంతో అక్కడ ఉత్పత్తి ప్రారంభమైందని, మరో పది రోజుల్లో భారీగా కంటైనర్లు వచ్చే ఆస్కారం ఉండటంతో ప్రస్తుతం ఉన్న వాటికి క్లియర్ చేసుకునేలా వర్తకుల్ని ప్రోత్సహిస్తున్నారు. ఈ సరుకు రవాణాను అడ్డుకోకుండా పోలీసు విభాగం సైతం ఆదేశాలు ఇచ్చిందని, వ్యాపారుల కు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు ఉన్నత స్థాయి సమన్వయ కమిటీ ఏర్పడింది. ఉమ్మడి కంట్రోల్ రూమ్ కేంద్రంగా పని చేస్తున్న ఈ టీమ్ సయన్వయం కోసం పని చేస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకుని నకిలీ వస్తువుల, మందుల తయారీ మాఫియా విజృంభించే ప్రమాదముందని ప్రపంచ కస్టమ్స్ ఆర్గనైజేషన్ అలెర్ట్ జారీ చేసింది. కరోనా మందులు, పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్యూప్మెంట్ పేరుతో నకిలీ వస్తువుల్ని మార్కెట్లోని విరజిమ్మే ఆస్కా రం ఉందని స్పష్టం చేసింది. దీనిని దృష్టిలో పెట్టుకున్న కస్టమ్స్ విభాగం తమ విధి నిర్వహణలో మార్పుచేర్పులు చేసుకుంటోంది. అలాగే తాజా పరిణామాల దృష్ట్యా కొన్ని రకాలైన మందులు తయారు చేయడానికి ఉపకరించే రసాయనాలు, ఔషధాల ఎగుమతుల్ని కేంద్రం నిషేధించింది. ఈ మేరకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ కొన్ని రోజుల క్రితం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రాథమికంగా 26 రకాల ఔషధాలు, రసాయనాల ఎగుమతులపై ఆంక్షలు అమలులోకి వచ్చాయి. తదుపరి ఉత్తర్వులు ఇచ్చే వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని కేంద్రం స్పష్టం చేసింది. ప్రధానంగా పారాసిటమాల్, టినిడజోల్, మెట్రోనిడజోల్, విటమిన్–బి, ఎరిత్రోమైసిన్, నియోమైసిన్, ఒరినిడజోల్ తదితరాలపై ఆంక్షలు విధించింది. దీనికి సంబంధించి విదేశీ వాణిజ్య శాఖ డైరెక్టర్ జనరల్ నుంచి కస్టమ్స్ విభాగానికి సూచనలు అందాయి. వీటిని పక్కాగా అమలు చేయడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం ఉన్న సరుకులు క్లియరెన్స్ చేయడానికి, రానున్న డిమాండ్‌ను తట్టుకోవడానికి అనువుగా 24 గంటలు క్లియరెన్స్ విధులు నిర్వర్తించడానికి అటు ఎయిర్ కార్గొ, ఇటు ఐసీడీల్లోని కస్టమ్స్ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. మరోపక్క విదేశాల నుంచి వచ్చే ప్రతి కంటైనర్, పార్సల్ తదితరాలను పూర్తి స్థాయిలో శానిటైజ్ చేసిన తర్వాతే బయటకు అనుమతిస్తున్నామని కస్టమ్స్ అధికారులు చెప్తున్నారు. -
మందగమనానికి ఆనవాలు!
న్యూఢిల్లీ: భారత్ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉందని జూన్ ఎగుమతి, దిగుమతి గణాంకాలు పేర్కొంటున్నాయి. ఈ రెండు విభాగాల్లోనూ వృద్ధి లేకపోగా (2018 జూన్‌తో పోల్చి) క్షీణత నమోదయ్యింది. సోమవారం వెలువడిన గణాంకాల్లో కొన్ని ముఖ్యాంశాలు చూస్తే... ► ఎగుమతులు అసలు పెరక్కపోగా 9.71% క్షీణించాయి. 8 నెలల తర్వాత (2018 సెప్టెంబర్‌లో –2.15% క్షీణత) దిగుమతులు క్షీణతను నమోదుచేసుకున్నాయి. విలువ రూపంలో ఎగుమతులు 25.01 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► రత్నాలు, ఆభరణాలు, ఇంజనీరింగ్ గూడ్స్, పెట్రోలియం ప్రొడక్టులు, ప్లాస్టిక్, హస్త కళల ఉత్పత్తులు, రెడీమేడ్ దుస్తులు, రసాయనాలు, తోలు, సముద్ర ఉత్పత్తులు, చమురు గింజలు ఇలా కీలక విభాగాల్లో ఎగుమతులు పడిపోయాయి. ► వాణిజ్య మంత్రిత్వశాఖ విడుదల చేసిన ఒక ప్రకటన ప్రకారం– నిర్వహణ అంశాల నేపథ్యంలో ఏప్రిల్ 17 నుంచి జూన్ 28 వరకూ ఓఎన్జీసీ మంగళూర్ పెట్రోకెమికల్ లిమిటెడ్ తాత్కాలికంగా తన ఉత్పత్తిని నిలిపివేసింది. ఇది పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులపై ప్రతికూల ప్రభావం చూపింది. జామ్‌నగర్ రిఫైనరీ పరిస్థితి కూడా జూన్‌లో దాదాపు ప్రతికూలంగానే ఉంది. అంతర్జాతీయంగా స్పీట్ ధరల పతనం ఇంజనీరింగ్ గూడ్స్‌పై ప్రభావం చూపింది. ► ఇక దిగుమతులూ క్షీణతలోనే ఉన్నాయి. –9 శాతం క్షీణత నమోదయ్యింది. విలువ రూపంలో 40.26 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. ► దీనితో ఎగుమతి–దిగుమతుల మధ్య నికర వ్యత్యాసం– వాణిజ్యలోటు 15.28 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. గత ఏడాది జూన్‌లో వాణిజ్యలోటు 16.6 బిలియన్ డాలర్లు. ► పసిడి దిగుమతులు 13 శాతం పెరిగి 2.7 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. ► చమురు దిగుమతులు 13.33% క్షీణించి 11 బి. డాలర్లుగా నమోదయ్యాయి. చమురేతర దిగుమతు లు 7.34% క్షీణించి 29.26 బి. డాలర్లకు పడ్డాయి. బేస్ ఎఫెక్టే... 2018 జూన్‌లో ఎగుమతులు(27.7 బిలియన్ డాలర్లు) భారీగా పెరిగాయి. అప్పటితో పోల్చితే ఇప్పుడు ఎగుమతులు తగ్గాయి. బేస్ ఎఫెక్ట్ వల్ల ఎగుమతులు భారీగా పడినట్లు కనిపిస్తోంది. అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి కూడా దీనికి కారణం. 2019లో ప్రపంచ వాణిజ్యం (కేవలం 2.6 శాతం) బలహీనంగా ఉంటుందని గత నెల వెలువడిన గ్లోబల్ ఎకనమిక్ ప్రాస్పెక్ట్ నివేదిక కూడా పేర్కొన్న విషయం ఇక్కడ గమనార్హం. – అనూప్ వర్థమాన్, వాణిజ్య కార్యదర్శి పలు దేశాల్లోనూ ఇదే ధోరణి ఇటీవలి నెలల్లో పలు దేశాల ఎగుమతులు కూడా పడిపోవడం గమనార్హం. ఏప్రిల్‌కు సంబంధించి అంతర్జాతీయ వాణిజ్య సంస్థ వెలువరించిన గణాంకాల ప్రకారం జపాన్ (–5.88 శాతం), యూరోపియన్ యూనియన్ (–4.30 శాతం), చైనా (–2.75 శాతం), అమెరికా (–2.12 శాతం) ఎగుమతులు కూడా క్షీణతను నమోదుచేసుకున్నాయి. ఏప్రిల్–జూన్ మధ్యా క్షీణతే.. ఏప్రిల్– జూన్ మధ్యా ఎగుమతులు 1.69 శాతం క్షీణించి 81 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. దిగుమతులు 0.29 శాతం క్షీణించి 127 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. వెరిసి వాణిజ్యలోటు 45 బిలియన్ డాలర్లుగా నమోదయ్యింది. సేవల్లో 15.49 శాతం వృద్ధి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) విడుదల చేసిన గణాంకాల ప్రకారం... ఈ ఏడాది మే నెలలో సేవల ఎగుమతులు 15.49 శాతం పెరిగాయి. విలువ 18.68 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. కాగా సేవల దిగుమతులు 22.37 శాతం పెరిగి 12.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. -
14వ నెల 14% డౌన్!
♦ జనవరిలోనూ ఎగుమతులు నిరాశే ♦ అంతర్జాతీయ మందగమనం ఎఫెక్ట్ ♦ వాణిజ్యలోటు 8 బిలియన్ డాలర్లు న్యూఢిల్లీ: ఎగుమతుల రంగం నిరాశలోనే కొనసాగుతోంది. 2015 జనవరితో పోల్చిచూస్తే... 2016 జనవరిలో ఎగుమతుల విలువలో అసలు వృద్ధి లేకపోగా 14 శాతం క్షీణత నమోదయ్యింది. విలువలో ఇది 21 బిలియన్ డాలర్లు. ఎగుమతుల క్షీణ ధోరణి ఇది వరుసగా 14వ నెల. దిగుమతుల విషయానికి వస్తే... దిగుమతులు కూడా క్షీణతలోనే పయనిస్తున్నాయి. జనవరిలో 11 శాతం క్షీణించి 29 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దీనితో ఎగుమతి- దిగుమతుల మధ్య వ్యత్యాసం వాణిజ్యలోటు 8 బిలియన్ డాలర్లుగా ఉంది. 11 నెలల్లో ఇంత దిగువ స్థాయి వాణిజ్యలోటు ఇదే తొలిసారి. కాగా నెలలో చమురు దిగుమతులు 39 శాతం తగ్గి 5 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. చమురు యేతర దిగుమతులు 1.5 శాతం పడిపోయి 24 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. క్షీణతకు కారణం... అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి నేపథ్యంలో అమెరికా, యూరప్ దేశాల్లో డిమాండ్ తగ్గడం, పెట్రో ఉత్పత్తుల ధరలు దిగువ స్థాయిలో ఉండడం వల్ల, భారత్ ఎగుమతుల విషయంలో సంబంధిత ప్రొడక్టుల నుంచి భారీ విలువలు లేని పరిస్థితులు, ఇంజనీరింగ్ ఉత్పత్తుల డిమాండ్ సన్నగిల్లడం వంటి అంశాలు భారత్ ఎగుమతులపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవల చైనా మారకపు రేటు తగ్గింపూ ఎగుమతుల పోటీతత్వాన్ని తగ్గిస్తోంది. జనవరిలో పెట్రోలియం ప్రొడక్టుల ఎగుమతులు 35 శాతం క్షీణించి 1.95 బిలియన్ డాలర్లకు పడిపోయాయి. ఇంజనీరింగ్ గూడ్స్ ఎగుమతులు 28 శాతం పడిపోయి కేవలం 5 మిలియన్ డాలర్లకు చేరాయి. పసిడి దిగుమతులు భారీ జంప్... జనవరిలో పసిడి దిగుమతులు మాత్రం భారీగా 85 శాతం ఎగశాయి. విలువలో ఇది 3 బిలియన్ డాలర్లు. ఈ కమోడిటీ దిగుమతి ఇంతగా పెరక్కుంటే... వాణిజ్యలోటు మరింత తగ్గి ఉండేది. 10 నెలల్లో... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జనవరి వరకూ ముగిసిన 10 నెలల కాలంలో ఎగుమతులు 18% పడిపోయి 218 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. దిగుమతులు 16% పడిపోయి 325 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. వాణిజ్య లోటు 107 బిలియన్ డాలర్లు. భారత్ ఎగుమతుల విలువ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2015-16) 265 బిలియన్ డాలర్ల నుంచి 270 బిలియన్ డాలర్ల శ్రేణిలోనే ఉండే అవకాశం ఉందని ఎఫ్ఐఈఓ (భారత ఎగుమతి సంఘాల సమాఖ్య) డెరైక్టర్ జనరల్ అజయ్ సహాయ్ అంచనావేశారు. 2014-15 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల విలువ 311 బిలియన్ డాలర్లు. సహాయ్ అంచనాలే నిజమైతే దేశ ఎగుమతులు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దాదాపు 40 బిలియన్ డాలర్ల మేర పడిపోయినట్లే.