న్యూఢిల్లీ: ప్రభుత్వం స్టీల్‌పై ఎగుమతుల సుంకాన్ని ఎత్తివేయడంతో టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ హర్షం వ్యక్తం చేశారు. దేశీ వినియోగంతోపాటు, విదేశీ అవసరాలకు సైతం స్టీల్‌ను తయారు చేయడంలో భారతకంపెనీలకు భారీ అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్రొడక్టులు, ముడిఇనుము ఎగుమతులపై ప్రభుత్వం సుంకాన్ని తొలగించడాన్ని నరేంద్రన్ స్వాగతించారు. ద్రవ్యోల్బణ అదుపునకు ప్రభుత్వం సుంకాలను విధించిన విషయాన్ని గ్రహించినట్లు తెలియజేశారు.
దేశంలో భారీగా ముడిఇనుము నిక్షేపాలున్నాయని, తద్వారా దేశ, విదేశాలకు స్టీల్‌ను తయారు చేయడంలో అవకాశాలకు కొదవ ఉండబోదని వ్యాఖ్యానించారు. ముడిఇనుము అవసరాలకు చైనా, జపాన్, దక్షిణ కొరియా గరిష్ట స్థాయిలో దిగుమతులపై ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు.
అయినప్పటికీ ఈ దేశాలు ఉమ్మడిగా ఏడాదికి 15 కోట్ల టన్నుల స్టీల్‌ను ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మే 21న స్టీల్ ఐటమ్స్, ముడిఇనుముపై ఎగుమతి సుంకాలు విధించిన ప్రభుత్వం ఆరు నెలల తదుపరి అంటే ఈ నెల 19నుంచి వీటిని రద్దు చేసింది.
Comments
Please login to add a commentAdd a comment