Tata Steel Group
-
కేంద్రం కీలక నిర్ణయం, హర్షం వ్యక్తం చేసిన టాటా స్టీల్
న్యూఢిల్లీ: ప్రభుత్వం స్టీల్‌పై ఎగుమతుల సుంకాన్ని ఎత్తివేయడంతో టాటా స్టీల్ సీఈవో టీవీ నరేంద్రన్ హర్షం వ్యక్తం చేశారు. దేశీ వినియోగంతోపాటు, విదేశీ అవసరాలకు సైతం స్టీల్‌ను తయారు చేయడంలో భారతకంపెనీలకు భారీ అవకాశాలున్నట్లు అభిప్రాయపడ్డారు. స్టీల్ ప్రొడక్టులు, ముడిఇనుము ఎగుమతులపై ప్రభుత్వం సుంకాన్ని తొలగించడాన్ని నరేంద్రన్ స్వాగతించారు. ద్రవ్యోల్బణ అదుపునకు ప్రభుత్వం సుంకాలను విధించిన విషయాన్ని గ్రహించినట్లు తెలియజేశారు. దేశంలో భారీగా ముడిఇనుము నిక్షేపాలున్నాయని, తద్వారా దేశ, విదేశాలకు స్టీల్‌ను తయారు చేయడంలో అవకాశాలకు కొదవ ఉండబోదని వ్యాఖ్యానించారు. ముడిఇనుము అవసరాలకు చైనా, జపాన్, దక్షిణ కొరియా గరిష్ట స్థాయిలో దిగుమతులపై ఆధారపడుతున్నట్లు పేర్కొన్నారు. అయినప్పటికీ ఈ దేశాలు ఉమ్మడిగా ఏడాదికి 15 కోట్ల టన్నుల స్టీల్‌ను ఎగుమతి చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ ఏడాది మే 21న స్టీల్ ఐటమ్స్, ముడిఇనుముపై ఎగుమతి సుంకాలు విధించిన ప్రభుత్వం ఆరు నెలల తదుపరి అంటే ఈ నెల 19నుంచి వీటిని రద్దు చేసింది. -
క్యూ3 ఫలితాల్లో టాటా స్టీల్ దూకుడు
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రయివేట్ రంగ మెటల్ దిగ్గజం టాటా స్టీల్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం రెట్టింపునకుపైగా ఎగసి రూ. 9,598 కోట్లను అధిగమించింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో ఆర్జించిన రూ. 4,011 కోట్లతో పోలిస్తే ఇది 139 శాతం వృద్ధి. ఈ కాలంలో మొత్తం ఆదాయం సైతం 45 శాతం జంప్ చేసి రూ.60,843 కోట్లకు చేరింది. గతేడాది క్యూ3లో కేవలం రూ. 42,153 కోట్ల టర్నోవర్ సాధించింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 36,495 కోట్ల నుంచి రూ. 48,666 కోట్లకు పెరిగాయి. క్యాష్‌ఫ్లో తీరిలా: తాజా సమీక్షా కాలంలో రూ. 2,045 కోట్లమేర వర్కింగ్ క్యాపిటల్ అవసరాలు పెరిగినప్పటికీ టాటా స్టీల్ ఫ్రీ క్యాష్ ఫ్లో రూ. 6,338 కోట్లకు చేరింది. కోవిడ్–19 మూడో వేవ్ తగ్గుముఖం పట్టడంతో ఆర్థిక రికవరీ కొనసాగనున్నట్లు కంపెనీ సీఈవో, ఎండీ టీవీ నరేంద్రన్ అభిప్రాయపడ్డారు. దీంతో స్టీల్‌కు డిమాండ్ పెరగనున్నట్లు అంచనా వేశారు. ఫలితాల నేపథ్యంలో టాటా స్టీల్ షేరు ఎన్ఎస్ఈలో స్వల్పంగా 0.7 శాతం బలపడి రూ. 1,174 వద్ద ముగిసింది. -
టాటా స్టీల్ నష్టాలు 1,096 కోట్లు
న్యూఢిల్లీ: ఉక్కు రంగ దిగ్గజ కంపెనీ, టాటా స్టీల్‌కు గత ఆర్థిక సంవత్సరం(2019–20) నాలుగో త్రైమాసిక కాలంలో రూ.1,096 కోట్ల నికర నష్టాలు వచ్చాయి. గత ఆర్థిక సంవత్సరం (2018–19) ఇదే క్వార్టర్లో రూ.2,431 కోట్ల నికర లాభం ఆర్జించామని టాటా స్టీల్ తెలిపింది. మొత్తం ఆదాయం మాత్రం రూ.42,914 కోట్ల నుంచి రూ.35,086 కోట్లకు తగ్గిందని పేర్కొంది. ఒక్కో ఈక్విటీ షేర్‌కు రూ.10 డివిడెండ్‌ను ప్రకటించింది. ► అంతకు ముందటి ఆర్థిక సంవత్సరం క్యూ4లో రూ.38,729 కోట్లుగా ఉన్న మొత్తం వ్యయాలు గత క్యూ4లో రూ.33,272 కోట్లకు తగ్గాయి. ►ఉక్కు ఉత్పత్తి(కన్సాలిడేటెడ్) సీక్వెన్షియల్‌గా 7 శాతం ఎగసి 7.37 మిలియన్ టన్నులకు చేరింది. భారత్‌లో ఉక్కు ఉత్పత్తి 6 శాతం వృద్ధితో 4.73 మిలియన్ టన్నులకు చేరింది. ►కరోనా వైరస్ కల్లోలం కారణంగా భారత్‌తో పాటు యూరప్, ఆగ్నేయాసియా, కెనడా ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలతో పాటు అమ్మకాలు కూడా ప్రభావితమయ్యాయి. ►గత క్యూ4లో యూరప్ విభాగం నిర్వహణ లాభం రూ.65 కోట్లుగా ఉంది. అంతక్రితం క్యూ4 లో రూ.956 కోట్ల నిర్వహణ నష్టాలు వచ్చాయి. ►పూర్తి ఆర్థిక సంవత్సరం పరంగా చూస్తే, 2019–20లో నికర లాభం 74 శాతం తగ్గి రూ.2,720 కోట్లకు, ఆదాయం 11 శాతం తగ్గి రూ.1,39,817 కోట్లకు చేరాయి. ►భారత విభాగం ఉక్కు ఉత్పత్తి 8% పెరిగింది. ►ఈ ఏడాది మార్చి నాటికి నగదు, నగదు సమానమైన నిల్వలు రూ.17,745 కోట్ల మేర ఉన్నాయి. ►ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా స్టీల్ షేర్ 1 శాతం నష్టంతో రూ.321 వద్ద ముగిసింది. -
టాటా స్టీల్ నికర లాభం 22 శాతం వృద్ధి..
న్యూఢిల్లీ: టాటా స్టీల్ కంపెనీ ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో రూ.1,529 కోట్ల నికర లాభం (కన్సాలిడేటెడ్) ఆర్జించింది. గతేడాది ఇదే క్వార్టర్లో సాధించిన నికర లాభం(రూ.1,254 కోట్లు)తో పోల్చితే 22% వృద్ధి సాధించామని టాటా స్టీల్ తెలిపింది. వాహన, వ్యాల్యూయాడెడ్ ఉత్పత్తుల విభాగాలు మంచి అమ్మకాలను సాధించడం, ఇన్వెస్ట్మెంట్ల విక్రయం వల్ల నికర లాభం పెరిగిందని టాటా స్టీల్ ఎండీ(భారత్, ఆగ్నేయ ఆసియా) టి. వి. నరేంద్రన్ చెప్పారు. గత క్యూ2లో రూ.35,777 కోట్లుగా ఉన్న మొత్తం ఆదాయం (కన్సాలిడేటెడ్) 18% క్షీణించి రూ.29,305 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఉత్పత్తి, డెలివరీలకు సంబంధించి భారత విభాగం కార్యకలాపాలు మంచి వృద్ధిని సాధిం చాయని, యూరోప్ కార్యకలాపాలు ముఖ్యంగా ఇంగ్లండ్‌లో మాత్రం అధ్వానంగా ఉన్నాయన్నారు. -
69 శాతం తగ్గిన టాటా స్టీల్ నికర లాభం
క్యూ3లో రూ.157 కోట్లే... న్యూఢిల్లీ: ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ నికర లాభం భారీగా పడిపోయింది. యూరప్‌లో మంచి పనితీరు కనబరిచినప్పటికీ, భారత్‌లో వ్యాపారం మందకొడిగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ క్వార్టర్‌కు నికర లాభం 69 శాతం క్షీణించిందని టాటా స్టీల్ పేర్కొంది. గత ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.503 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ ఆర్థిక సంవత్సరం క్యూ3లో రూ.157 కోట్లకు దిగిపోయిందని టాటా స్టీల్ గ్రూప్ ఈడీ (ఫైనాన్స్ అండ్ కార్పొరేట్) కౌశిక్ చటర్జీ వివరించారు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడం, ధరలు తగ్గడం, డిమాండ్ కనిష్ట స్థాయిలో ఉండడం, చైనా నుంచి దిగుమతులు పెరగడం, ఉక్కు తయారీకి అవసరమైన ముడి పదార్ధాల సమీకరణకు సంబంధించి భారత ప్రభుత్వ నిబంధనలు... ప్రభావం చూపాయని పేర్కొన్నారు. భారత కార్యకలాపాలకు సంబంధించి నికర లాభం రూ.1,519 కోట్ల నుంచి రూ.881 కోట్లకు తగ్గిందని, అలాగే టర్నోవర్ కూడా రూ.10,143 కోట్ల నుంచి రూ.9,897 కోట్లకు పడిపోయిందని వివరించారు. దేశీయంగా ఉక్కు ధరలు తగ్గడం వల్ల టర్నోవర్ తగ్గిందని పేర్కొన్నారు. యూరప్ కార్యకలాపాల టర్నోవర్ రూ.20,709 కోట్ల నుంచి రూ.19,399 కోట్లకు తగ్గిందని పేర్కొన్నారు. గత ఏడాది ఉన్నట్లే ఈ ఏడాది కూడా యూరప్‌లో ఉక్కుకు డిమాండ్ ఉండగలదని, అయితే చైనా, రష్యా, తదితర దేశాల నుంచి దిగుమతులు పెరుగుతుండటంతో మార్జిన్లపై ఒత్తిడి ఉంటుందని తెలిపారు.