చేతిలో రెడ్‌మి స్మార్ట్‌ఫోన్... ఓపెన్ చేస్తే టిక్‌టాక్ వీడియో... చెవిలో షియోమి ఇయర్ ఫోన్... అలీ ఎక్స్‌ప్రెస్‌లో నచ్చిన వస్తువుకు ఆర్డర్... పేటీఎంలో ఫ్రెండ్‌కి క్షణాల్లో నగదు బదిలీ... ఇలా ఒకటేమిటి చేతికి తొడుక్కునే వాచీ నుంచి కాలికి వేసుకునే చెప్పుల వరకూ అన్నింటికీ ఒకటే లింకు.. అరే ఠక్కున భలే చెప్పేశారే! అదేమరి చైనా ‘చౌక’ మహిమ!! భారతీయులను తన చౌక ఉత్పత్తులతో బానిసలుగా మార్చేసిన డ్రాగన్... అదును చూసి మనపైనే బుసలు కొడుతోంది.
సరిహద్దుల్లో భారతీయ సైనికులను దొంగదెబ్బతీస్తూ... తన ఉత్పత్తులను మాత్రం రాజమార్గంలో ఎడాపెడా అమ్ముకుంటోంది. దేశంలో ఇప్పుడు ఇదే హాట్‌టాపిక్. చైనా వస్తువులను బహిష్కరించి డ్రాగన్‌తో వాణిజ్య యుద్ధం చేయాలంటూ సోషల్ మీడియాలో ఒకటే హల్‌చల్. మరి ఇది సాధ్యమయ్యే పనేనా? అసలు చైనాతో మనకున్న ఆర్థిక, వాణిజ్య బంధం ఏ స్థాయిలో ఉంది. దీన్ని తెంచుకుంటే మనకొచ్చే ఇబ్బందులేంటి? దిగుమతులు, ఎగుమతులు ఆగిపోతే మన కంపెనీలు పడే అవస్థలు ఎలా ఉంటాయి? వీటన్నింటినీ వివరించే ‘సాక్షి బిజినెస్ డెస్క్’ ప్రత్యేక కథనమిది...
చైనా–భారత్ మధ్య ఇప్పుడు పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. రెండుమూడేళ్లుగా ముదురుతూ వస్తున్న సరిహద్దు ఉద్రిక్తతలు... తాజాగా గల్వాన్ లోయలో 20 మంది భారతీయ సైనికుల ఊచకోతతో మరింత తీవ్రరూపం దాల్చాయి. గడిచిన 40 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇంత ఘోరమైన ఘర్షణ చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. దీనికితోడు ప్రపంచాన్ని అల్లకల్లోలం చేస్తున్న కరోనా వైరస్‌కు మూలం కూడా చైనాయే కావడంతో భారతీయులు ఆగ్రహావేశాలతో రగిలిపోతున్నారు.
చైనా ఉత్పత్తులు, కంపెనీలను బహిష్కరించాలంటూ నినాదాలు మిన్నంటుతున్నాయి. అయితే, ప్రపంచీకరణ నేపథ్యంలో దేశాల ఆర్థిక వ్యవస్థలన్నీ ఇప్పుడు ఒకదానితో మరొకటి పెనవేసుకుపోయాయి. మరీ ముఖ్యంగా చైనా లాంటి బాహుబలి ఎకానమీతో అంటీముట్టనట్టుగా ఉండటం మనకేకాదు అమెరికాలాంటి అగ్రదేశానికీ సాధ్యంకాని పరిస్థితి. 14.14 లక్షల కోట్ల డాలర్ల స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)తో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చైనా అంతకంతకూ విస్తరిస్తోంది.
భారత్ జీడీపీ 2.94 లక్షల కోట్లు మాత్రమే (ఆసియాలో నంబర్–3, ప్రపంచంలో నంబర్–5). పారిశ్రామిక యంత్రాలు, విడిభాగాలు, ముడి పదార్థాల సరఫరా నుంచి స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థల్లో పెట్టుబడుల వరకూ అమెరికా తర్వాత భారత్‌కు చైనా రెండో అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా కొనసాగుతోంది. చైనా ముడి పదార్థాలు, విడిభాగాలపై అత్యధికంగా ఆధారపడిన మన పరిశ్రమలకు అంత చౌకగా ప్రపంచంలో మరేదేశం కూడా సరఫరా చేయలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి తరుణంలో కేవలం సరిహద్దు ఘర్షణ, కరోనా కారణంగా చైనాతో వాణిజ్య, ఆర్థిక బంధాన్ని తెంచుకోవడం అంత సులువేమీ కాదనేది నిపుణుల అభిప్రాయం.
ద్వైపాక్షిక వాణిజ్యం @ రూ.7.3 లక్షల కోట్లు
2019–20 ఆర్థిక సంవత్సరంలో భారత్ ఎగుమతుల్లో 5.33 శాతం అంటే దాదాపు రూ.1.8 లక్షల కోట్ల విలువైన ఉత్పత్తులు చైనాకు వెళ్లాయి. అయితే, చైనా నుంచి భారత్ దిగుమతి చేసుకున్న ఉత్పత్తుల విలువ ఎంతో తెలుసా? రూ.5.5 లక్షల కోట్లు. అంటే మూడు రెట్లు ఎక్కువ. మన మొత్తం దిగుమతుల్లో ఇది ఏకంగా 14 శాతం. భారత్‌కు చైనాయే అతిపెద్ద దిగుమతిదారు కూడా. 2000 సంవత్సరం నుంచి 2018–19 నాటికి చూస్తే చైనా నుంచి బారత్‌కు దిగుమతులు 45 రెట్లు ఎగబాకి 70 బిలియన్ డాలర్లకు చేరడం గమనార్హం. డ్రాగన్ మన దేశంలోకి చౌక వస్తువులను ఎలా కుమ్మరిస్తోందో... అదేవిధంగా చైనా దిగుమతులపై మనం ఎంతగా ఆధారపడిపోయామో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం. దీంతో ఇరు దేశాల మధ్య వాణిజ్య లోటు అంతకంతకూ తీవ్రమవుతోంది.
మొబైల్స్, కన్సూమర్ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు, విద్యుత్ ఉపకరణాలు, పవర్ ప్లాంట్ పరికరాలు, ఎరువులు, వాహన విడిభాగాలు, ఫినిష్డ్ స్టీల్ ఉత్పత్తులు, టెలికం పరికరాలు, మెట్రో రైలు కోచ్‌లు ఇతరత్రా యంత్ర పరికరాలు, ఔషధ ముడిపదార్థాలు, రసాయనాలు మరియు ప్లాస్టిక్స్, ఇంజినీరింగ్ గూడ్స్... ఇలా చెప్పుకుంటూ పోతే చైనా నుంచి మనం దిగుమతి చేసుకునే ఉత్పత్తుల లిస్టు గ్రేట్ వాల్ ఆఫ్ చైనాలా వెళ్తూనే ఉంటుంది. చైనా ముడి వస్తువులపై ఆధారపడిన మన కంపెనీలు, పరిశ్రమలకు వాటి సరఫరా నిలిచిపోతే లక్షలాది మందికి ఉపాది కరువయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంటుంది. మరోపక్క, చైనాకు ఎగుమతులు నిలిచిపోతే వాటిపై ఆధారపడిన మన కంపెనీలకూ తీవ్ర నష్టమే. ప్రధానంగా భారత్‌నుంచి చైనాకు ఆర్గానిక్ రసాయనాలు, ముడి ఖనిజం, మినరల్ ఆయిల్స్, మినరల్ ఫ్యూయెల్స్ ఇతర పారిశ్రామిక ఉత్పత్తులు ఎగుమతి అవుతాయి.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల జోరు...
భారత్‌లోకి వస్తున్న విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో(ఎఫ్‌డీఐ) చైనా జోరు గడిచిన రెండుమూడేళ్లుగా పుంజుకుంది. ముఖ్యంగా లోహ సంబంధ పరిశ్రమలు, పునరుత్పాదక ఇంధనం (సోలార్ ప్యానెల్స్), విద్యుత్ పరికరాలు, వాహన రంగం మరియు రసాయన పరిశ్రమల్లోకి చైనా నుంచి ఎఫ్‌డీఐలు భారీగా వస్తున్నాయి. ఇప్పటిదాకా భారత్‌లోకి వచ్చిన, ప్రణాళికల్లో ఉన్న చైనా ఎఫ్‌డీఐల విలువ 2600 కోట్ల డాలర్లుగా (దాదాపు రూ.1.98 లక్షల కోట్లు) అంచనా. భారత్‌లో చైనాకు చెందిన 75 తయారీ ప్లాంట్లు ప్రస్తుతం కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఒప్పో, షావోమి, వివో, ఫోసున్, హేయర్, ఎస్‌ఏఐసీ, వంటివి భారత్‌లో ప్లాంట్లున్న అతిపెద్ద బ్రాండ్స్‌లో కొన్ని. ఇక చైనాలో కార్యకలాపాలున్న తయారీ సంస్థల్లో అదానీ గ్లోబల్, డాక్టర్ రెడ్డీస్, జిందాల్ స్టీల్ అండ్ పవర్, బీఈఎంఎల్, బీహెచ్‌ఈఎల్, గోద్రేజ్ అండ్ బాయ్స్, అరబిందో వంటివి ఉన్నాయి.
స్టార్టప్స్‌లోకి నిధుల వరద...
భారతీయ స్టార్టప్ సంస్థలకు నిధుల తోడ్పాటును అందించడంలో చైనా కంపెనీలు ముందువరుసలో నిలుస్తున్నాయి. ప్రధానంగా చైనా ఫండ్స్, కంపెనీలు తమ సింగపూర్, హాంకాంగ్, మారిషస్‌లోని సంస్థల ద్వారా భారత్‌లోని స్టార్టప్‌లకు నిధులను మళ్లిస్తున్నాయి. ఉదాహరణకు చైనాకు చెందిన ఈ–కామర్స్ దిగ్గజం అలీబాబా గ్రూప్ పేటీఎంలో పెట్టుబడిని అలీబాబా సింగపూర్ హోల్డింగ్స్ ద్వారా వెచ్చించింది. భారత ప్రభుత్వ లెక్కల ప్రకారం ఈ పెట్టుబడి నేరుగా చైనా నుంచి వచ్చినట్లు కాదు, సింగపూర్ ఖాతాలోకి వెళ్తుంది. ఇలా మారువేషంలో చైనా నుంచి భారత్‌లోకి వస్తున్న పెట్టుబడులు చాలానే ఉన్నాయని ‘గేట్‌వే హౌస్’ నివేదిక చెబుతోంది. మొత్తంమీద భారత్‌లోని 30 స్టార్టప్ యూనికార్స్న్(బిలియన్ డాలర్లకు మించి విలువ కలిగినవి)కు ఈ ఏడాది మార్చివరకూ చైనా టెక్ ఇన్వెస్టర్ల నుంచి లభించిన మొత్తం పెట్టుబడులు 4 బిలియన్ డాలర్లు (దాదాపు రూ. 30,000 కోట్లు) పైనే ఉంటుందని అంచనా.
బల్క్ డ్రగ్స్... చైనాయే ఆధారం!
పరిమాణం పరంగా భారత ఫార్మా పరిశ్రమ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. విలువ పరంగా చూస్తే 14 ర్యాంకు మాత్రమే. 2018–19లో భారత్ 1400 కోట్ల డాలర్లకు పైగా విలువైన ఔషధాలను ఎగుమతి చేసింది.
అదేసమయంలో ఔషధాల తయారీలో అత్యంత కీలకమైన యాక్టివ్ ఫార్మా ఇంగ్రేడియంట్స్(ముడి పదార్థాలు–ఏపీఐ) దిగుమతుల్లో మూడింట రెండు వంతులు చైనా నుంచే నమోదవడం గమనార్హం. ఇప్పుడు ఉన్నపళంగా చైనా దిగుమతులను తగ్గించుకుంటే... ఆమేరకు మనకు సరఫరా చేసేందుకు ఇతరదేశాలేవీ సిద్ధంగా లేవని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. చైనా గనుక సరఫరా తగ్గిస్తే మన ఔషధ రంగానికి చాలా నష్టం వాటిల్లుతుందనేది ఫార్మా సంస్థల ఆందోళన.
స్మార్ట్ ఫోన్స్‌లో ఆధిపత్యం..
భారత్‌లో అమ్ముడవుతున్న ప్రతి 100 స్మార్ట్‌ఫోన్స్‌లో 72 చైనావే అంటే నమ్ముతారా? అవును ఇది ముమ్మాటికీ నిజం! అంతగా మనం చైనా చౌక మొబైల్స్‌కు అలవాటుపడిపోయాం. షావోమీ, వివో, ఒప్పో, వన్‌ప్లస్ వంటి బ్రాండ్స్ మొత్తం కలిపి భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో 72% వాటాను కొల్లగొట్టాయని గేట్‌వే హౌస్ నివేదిక పేర్కొంది. చైనా మొబైల్స్ దెబ్బకి శాంసంగ్, యాపిల్ అట్టడుగుకు పడిపోయాయి.
టిక్ ‘టాప్’...: భారత్‌లో చైనా మొబైల్ యాప్ టిక్‌టాక్‌కు ఉన్న ప్రాచుర్యం గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. 2016 సెప్టెంబర్‌లో అందుబాటులోకి వచ్చిన టిక్‌టాక్‌కు ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 80 కోట్లకు పైగా యాక్టివ్ యూజర్లు(నెలవారీ) ఉన్నారు. దాదాపు 200 కోట్ల మేర డౌన్‌లోడ్స్ అయ్యాయి. ఇందులో సుమారు 50 కోట్ల డౌన్‌లోడ్స్ భారత్ నుంచే ఉండటం గమనార్హం. టిక్‌టాక్ వాడకంలో భారత్ ప్రపంచంలోనే అగ్రస్థానం(తర్వాత స్థానాల్లో చైనా–18 కోట్ల డౌన్‌లోడ్స్, అమెరికా–13 కోట్ల డౌన్‌లోడ్స్) ఉంది.
చైనా ప్రతీకారం..
న్యూఢిల్లీ: భారత్‌లో స్వదేశీ ఉద్యమం ఊపందుకుంటున్న నేపథ్యంలో చైనా ప్రతీకార చర్యలకు దిగుతోంది. తమ కన్‌సైన్‌మెంట్లను హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు నిలిపివేస్తున్నారంటూ ఎగుమతిదారులు తాజాగా ఆందోళన వ్యక్తం చేశారు. చెన్నై పోర్టులో చైనా నుంచి వచ్చిన దిగుమతులకు సంబంధించి భారత అధికారులు తీసుకున్న చర్యలకు ప్రతిగా ఆ దేశం ఇలాంటి చర్యలకు దిగుతోందని ఎగుమతిదారుల సమాఖ్య ఎఫ్‌ఐఈవో పేర్కొంది. ‘చైనా దిగుమతులన్నింటినీ కస్టమ్స్ శాఖ భౌతికంగా ఒక్కో దాన్నీ తనిఖీ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఫలితంగా దిగుమతుల వ్యయం పెరిగిపోతోంది. దీంతో హాంకాంగ్, చైనా కస్టమ్స్ అధికారులు కూడా భారత్ నుంచి వచ్చే కన్‌సైన్‌మెంట్ల పై ఇలాంటి వైఖరే చూపిస్తున్నారు‘ అని వాణిజ్య శాఖ కార్యదర్శి అనూప్ వాధ్వాన్‌కు రాసిన లేఖలో ఎఫ్‌ఐఈవో ప్రెసిడెంట్ ఎస్‌కె సరాఫ్ పేర్కొన్నారు.
కింకర్తవ్యం..?
చైనాతో సరిహద్దు వివాదం ముదిరింది కాబట్టి ఆ దేశంతో పూర్తిగా తెగదెంపులు చేసుకునే అవకాశం లేదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇలా చేస్తే చైనా కంటే భారత్‌కే అధిక నష్టం వాటిల్లే అవకాశం ఉందని చెబుతున్నాయి. ప్రధాని మోదీ పిలుపునిచ్చిన మేకిన్ ఇండియా, ఆత్మనిర్భర్ భారత్(స్వయం సమృద్ధి)తో దేశీయంగా తయారీకి ప్రోత్సాహం లభించినప్పటికీ.. చైనా కంపెనీలు, చైనా దిగుమతులను పూర్తిగా లేకుండా చేయలేమని విశ్లేషకులు చెబుతున్నారు. మేకిన్ ఇండియానే చూసుకుంటే... భారత్‌లో తయారీ ప్లాంట్‌లను పెట్టాలని మోదీ ఇచ్చిన పిలుపు మేరకు షావోమీ, వివో, ఒప్పో, హేయర్ తదితర అనేక చైనా కంపెనీలు సైతం భారత్‌లో ప్లాంట్లు నెలకొల్పాయి. భారీగా పెట్టుబడులు, ఉపాధిని కల్పిస్తున్నాయి.
ఇలాంటి తరుణంలో సరిహద్దు వివాదాలను సాకుగా చూపి వాటిని వెళ్లగొట్టగలమా? అలాచేస్తే అంతర్జాతీయ ఒప్పందాల ఉల్లంఘన కింద మనం భారీగా నష్టపరిహారాన్ని చెల్లించాల్సి రావడంతోపాటు ఇన్వెస్టర్లలో అభద్రతా భావం నెలకొనేందుకు దారితీస్తుంది. దిగుమతుల విషయంలో ఏకపక్షంగా వ్యవహరిస్తే ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ) నుంచి వ్యతిరేకత ఎదురవుతుంది. అయితే, చైనా నుంచి క్రమంగా దిగుమతులను తగ్గించుకోవచ్చని.. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్‌కు తైవాన్, మలేషియా, జపాన్, కొన్ని యూరప్ దేశాలను ప్రత్యామ్నాయంగా మార్చుకోవచ్చని కొందరు నిపుణులు పేర్కొంటున్నారు. మేకిన్ ఇండియాలో చైనాకు క్రమంగా ప్రాధాన్యం తగ్గించి ఇతర దేశాలను ప్రోత్సహించేలా దీర్ఘకాలిక ప్రణాళికతో ముందుకెళ్లడం మంచిదనేది వారి సూచన!!
సాక్షి బిజినెస్ విభాగం
Comments
Please login to add a commentAdd a comment