Border dispute
-
బెదిరింపులు.. దౌర్జన్యం.. గుణదల సీఐ ఓవర్‌యాక్షన్
సాక్షి, విజయవాడ: సరిహద్దు తగాదాలో ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఓ సీఐ అత్యుత్సాహం ప్రదర్శించారు. సరిహద్దు విషయమై కొద్దికాలంగా ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్, కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమానుల మధ్య కోర్టులో వివాదం నడుస్తోంది. అయితే, గుణదల సీఐ శ్రీనివాస్ రియల్టర్ల మధ్య వివాదంలో తలదూర్చారు. ఎస్ఎల్వి రియల్ ఎస్టేట్ యజమానికి కొమ్ముకాసిన సిఐ.. కోర్టులో వివాదం ఉండగానే ఎస్ఎల్వి యజమాని ఫిర్యాదు మేరకు దేవినేని శ్రీహరిపై కేసు నమోదు చేశారు.కైలాష్ హైట్స్ రియల్ ఎస్టేట్ యజమాని దేవినేని శ్రీహరి ఇంటికెళ్లి సీఐ శ్రీనివాస్ దౌర్జన్యం చేశారు. రౌడీ షీట్ తెరుస్తానంటూ బెదిరింపులకు దిగారు. శ్రీహరి భార్య పట్ల కూడా సీఐ అసభ్యకరంగా వ్యవహరించారు. సీఐ శ్రీనివాస్ వ్యవహారశైలిపై స్పెషల్ బ్రాంచి పోలీసులు ఆరా తీస్తున్నారు. మొత్తం ఘటనపై సీపీకి నివేదిక ఇవ్వనున్నారు. -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. స్పందించిన రష్యా
మాస్కో: వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్ఏసీ) వెంట సైనికులను ఉపసంహరణపై భారత్, చైనాల మధ్య జరిగిన అవగాహనను రష్యా స్వాగతించింది. సరిహద్దు వివాదాన్ని సామరస్యంగా పరిష్కరించుకోవడానికి ఇరు దేశాల నుంచి సంకల్పం, విశ్వాసం అవసరమని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ సోమవారం అన్నారు.‘‘ ఐదేళ్ల విరామం తర్వాత కజాన్‌లో చైనా, భారత్‌ల నేతల మధ్య తొలి సమావేశం జరగడాన్ని మేం (రష్యా) స్వాగతిస్తున్నాం. ఆనందం వ్యక్తం చేస్తున్నాం. భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక సంబంధాలలో ఇది.. చాలా సానుకూల పరిణామం. భారత్-చైనా సరిహద్దు వివాదం చాలా సంక్లిష్టమైన సమస్య.దీనికి సుదీర్ఘమైన చర్చల ప్రక్రియ అవసరం. భారత్, చైనా తమ మధ్య ఉన్న సరిహద్దు సమస్యలపై చివరికి విజయం సాధిస్తాయనే విషయంలో నాకు ఎలాంటి సందేహం లేదు.దానికి సంకల్పం, సహృదయం, నమ్మకం అవసరం. సామరస్యానికి ఇవి చాలా అవసరం’’ అని అలిపోవ్ తెలిపారు.అక్టోబరు 23న రష్యాలోని కజాన్ నగరంలో జరిగే బ్రిక్స్ సమ్మిట్‌లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జి జిన్‌పింగ్‌ల భేటీకి రెండు రోజుల ముందే ఎల్ఏసీ వెంట పెట్రోలింగ్ ఏర్పాట్లపై చైనాతో భారత్ ఒప్పందాన్ని ప్రకటించింది. సరిహద్దు వివాదాన్ని పరిష్కరించడం ద్వారా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను సాధారణ స్థితికి వచ్చాయి. చదవండి: 2100 నాటికి ఉష్ణోగ్రతలో... 3.1 డిగ్రీల పెరుగుదల! -
చైనాతో వాణిజ్య బంధం తెంచుకోవాలనడం సరికాదు
న్యూఢిల్లీ: సరిహద్దులో అతిక్రమనలకు ప్రతీకారంగా చైనాతో భారత్ వాణిజ్య సంబంధాలు తెగతెంపులు చేసుకోవలన్న డిమాండ్ సరికాదని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ పనగారియా స్పష్టం చేశారు. అలాచేయడం వల్ల భారత్ ఆర్థిక వృద్ధి వేగమూ మందగిస్తుందని హెచ్చరించారు. అందుకు బదులుగా ముందు భారతదేశం తన వాణిజ్యాన్ని విస్తరించడానికి బ్రిటన్, యూరోపియన్ యూనియన్ (ఈయూ) వంటి దేశాలతో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు (ఎఫ్‌టీఏ)కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని కొలంబియా విశ్వవిద్యాలయంలో ఎకనమిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న ఆయన సూచించారు. ‘‘ రెండు దేశాలు వాణిజ్య ఆంక్షలు విధించుకోవచ్చు. అయితే 17 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ (చైనా)కు మూడు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ (భారతదేశం)ని దెబ్బతీసే సామర్థ్యమే అధికంగా ఉంటుంది’’ అని ఆయన విశ్లేషించారు. ‘‘మనం చైనాను శిక్షించాలని ప్రయత్నిస్తే, అది వెనక్కి తగ్గదు. అమెరికా ఆంక్షల విషయంలో చైనా ఎలా ప్రతిస్పందించిందన్న విషయాన్ని, ఇందుకు సంబంధించి అమెరికాలో పరిణామాలను మనం ఈ సందర్భంగా ప్రస్తావించుకోవాలి’’ అని ఆయన అన్నారు. ఆంక్షల విధింపు వల్ల లాభంకన్నా నష్టాలే ఎక్కువనే అన్నారు. రష్యాపై ఆంక్షల విధింపు ద్వారా అమెరికా, యూరోపియన్ యూనియన్లు ఎలాంటి ప్రతికూల పర్యవసానాలను ఎదుర్కొంటున్నాయో కూడా మనం గమనించాలని అన్నారు. చౌక కాబట్టే కొంటున్నాం... భారతదేశం దిగుమతి చేసుకునే అనేక ఉత్పత్తులకు చైనా చౌకైన సరఫరాదారు కాబట్టే భారత్ బీజింగ్ నుండి కొనుగోలు చేస్తోందని పనగారియా చెప్పారు. భారతదేశం ఎగుమతి చేయాలనుకుంటున్న వస్తువులకు చైనా మంచి ధరను అందించబోదని అన్నారు. ఇక్కడే మనం అమెరికా వంటి వాణిజ్య భాగస్వాములకు మన వస్తువులను భారీగా అమ్మడంపై దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. దీని ఫలితంగా చైనాతో వాణిజ్య లోటు– అమెరికాతో వాణిజ్య మిగులుతో భర్తీ అవుతుందని అన్నారు. వెరసి చైనాతో వాణిజ్యలోటు తీవ్రత వల్ల ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదన్నారు. ఏటేటా భారీ వాణిజ్యలోటు భారత్– చైనాల మధ్య వాణిజ్య లోటు (ఎగుమతులు–దిగుమతుల మధ్య వ్యత్యాసం) ఈ ఆర్థిక సంవత్సరం ఏప్రిల్–అక్టోబర్ మధ్య కాలంలో 51.5 బిలియన్ల డాలర్లకు చేరుకుంది. 2021–22లో ఈ లోటు 73.31 బిలియన్ డాలర్లు. 2020–21లో 44.03 బిలియన్లతో పోల్చితే వాణిజ్యలోటు భారీగా పెరగడం గమనార్హం. తాజా ప్రభుత్వ గణాంకాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్–అక్టోబర్ మధ్య చైనా దిగుమతులు 60.27 బిలియన్ డాలర్లు. ఎగుమతులు 8.77 బిలియన్ డాలర్లు. క్యాడ్‌పై ఇప్పటికి ఓకే... ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022–23) భారత్ కరెంట్ ఖాతా లోటు (క్యాడ్) 2 నుండి 3 శాతం (జీడీపీ విలువతో పోల్చి) మధ్య ఉండవచ్చని అన్నారు. ఇది భారత్ తట్టుకునే పరిమితిలో ఉందని పేర్కొన్నారు. ఈ స్థాయి క్యాడ్‌తో స్థూల ఆర్థిక స్థిరత్వానికి ఎటువంటి ముప్పు ఉండబోదని స్పష్టం చేశారు. 2020–21లో భారతదేశం జీడీపీలో 0.9 శాతం కరెంట్–ఖాతా మిగులు నమోదయ్యింది. 2021–22లో 1.2 శాతం కరెంట్–ఖాతా లోటు ఏర్పడింది. ఒక నిర్దిష్ట కాలంలో ఒక దేశంలోకి వచ్చీ–దేశంలో నుంచి బయటకు వెళ్లే విదేశీ మారకద్రవ్య విలువ మధ్య నికర వ్యత్యాసాన్ని ‘కరెంట్ అకౌంట్’ ప్రతిబింబిస్తుంది. దేశానికి సంబంధిత సమీక్షా కాలంలో విదేశీ నిధుల నిల్వలు అధికంగా వస్తే, దానికి కరెంట్ అకౌంట్ ‘మిగులు’గా, లేదా దేశం చెల్లించాల్సిన మొత్తం అధికంగా ఉంటే ఈ పరిస్థితిని కరెంట్ అకౌంట్ ‘లోటుగా’ పరిగణిస్తారు. దీనిని సంబంధిత సమీక్షా కాలం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) విలువతో పోల్చి శాతాల్లో పేర్కొంటారు. -
కర్ణాటక, మహారాష్ట్ర సరిహద్దు వివాదం.. రంగంలోకి కేంద్రం
బెంగళూరు: మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు వివాద పరిష్కారానికి కేంద్రం రంగంలోకి దిగింది. ఇరు రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోం మంత్రి అమిత్ షా వచ్చే వారం భేటీ కానున్నారు. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై శనివారం మీడియాకు ఈ విషయం చెప్పారు. ‘‘వివాదంపై తమ ప్రభుత్వ వైఖరి, వాస్తవాలను షాకు ఫోన్లో వివరించా. దీనిపై అఖిలపక్షం కూడా నిర్వహిస్తాం’’ అన్నారు. మహారాష్ట్రలో విపక్ష కూటమి మహావికాస్ అగాడీ ఎంపీలు అమిత్ షాను కలవడం తెలిసిందే. ‘‘కర్నాటక బీజేపీ ఎంపీలు సోమవారం అమిత్ షాను కలవనున్నారు. నేనూ ఆయనతో మాట్లాడా. ఇరువురు సీఎంలతో సమావేశం నిర్వహిస్తానని షా చెప్పారు. డిసెంబర్ 14, లేదా 15 తేదీల్లో భేటీ ఉంటుంది’’ అని బొమ్మై వివరించారు. ఇదీ చదవండి: మోదీని ఎదుర్కొనే నేత కేజ్రీవాలా? రాహులా? -
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దులో ఉద్రిక్తత.. భారీగా బలగాల మోహరింపు
బెంగళూరు: కర్ణాటక, మహారాష్ట్రల మధ్య సరిహద్దు వివాదం మరింత ముదిరింది. సరిహద్దు ప్రాంతం బెళగావిలో ఉద్రిక్త పరస్థితులు నెలకొన్నాయి, ‘కర్ణాటక రక్షణ వేదిక’ ఆధ్వర్వంలో బెళగావిలో ఆందోళనలు చేపట్టారు. ఈ క్రమంలో మహారాష్ట్ర నంబర్ ప్లేట్స్ ఉన్న వాహనాలే లక్ష్యంగా దాడులు చేపట్టారు ఆందోళనకారులు. ఓ లారీ అద్దలు పగలగొట్టిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది. పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. కర్ణాటక రక్షణ వేదిక్కు చెందిన ఆందోళనకారులు సుమారు 400 మంది కర్ణాటక జెండాలు పట్టుకుని ధార్వాడ్ జిల్లా నుంచి బెళగావికి వెళ్లి నిరసనలు చేపట్టారు. ఈ క్రమంలోనే మహారాష్ట్ర వాహనలపై రాళ్లు రువ్వారు. పుణె నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ లారీ విండ్‌షీల్డ్, అద్దం ధ్వంసమైంది. ఈ క్రమంలో భారీగా బలగాలను మోహరించింది ప్రభుత్వం. అయినప్పటికీ పోలీసుల మాట పట్టించుకోకుండా రోడ్లపై బైఠాయించారు. మహారాష్ట్ర, కర్ణాటక మధ్య 21 చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. సరిహద్దు గ్రామల వద్ద వెయ్యి మందికిపైగా పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు.. 1960లో భాష ఆధారంగా రాష్ట్రాల పునర్ వ్యవస్థీకరణలో భాగంగా మరాఠీ మెజారిటీ ప్రాంతాన్ని కర్ణాటకకు తప్పుగా ఇచ్చారని మహారాష్ట్ర వాదిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టుకు వెళ్లింది మహారాష్ట్ర. ప్రస్తుతం రెండు రాష్ట్రాల మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో తమకు చెందిన కొన్ని గ్రామాలు ఉన్నాయని కర్ణాటక ఇటీవల పేర్కొంది. దీంతో వివాదం మరింత ముదిరింది. మహారాష్ట్రకు చెందిన మంత్రులు చంద్రకాంత్ పాటిల్, శంభురాజ్ దేశాయ్‌లు బెళగావిలో మంగళవారం పర్యటించేందుకు సిద్ధమయ్యారు. అయితే, వారి పర్యటన శాంతిభద్రతల సమస్య తలెత్తేలా చేస్తుందని కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై సోమవారం హెచ్చరించటంతో తమ పర్యటనను రద్దు చేసుకున్నారు. సరిహద్దు వివాదంపై ఈ ఇరువురు మంత్రులను కోఆర్డినేటర్లుగా నియమించింది మహారాష్ట్ర. వారం క్రితం సైతం బెళగావిలో ఓ కళాశాల ఉత్సవాల్లోనూ సరిహద్దు వివాదం తెరపైకి వచ్చింది. ఓ విద్యార్థి కర్ణాటక జెండాను ప్రదర్శించటంతో మరాఠీ విద్యార్థులు అతడిపై దాడి చేశారు. #Maharashtra-#Karnataka border row simmers as protests erupt at the #Belagavi border; security tightened @NehaHebbs reports | #BREAKING_NEWS pic.twitter.com/ohpUguWcif — Mirror Now (@MirrorNow) December 6, 2022 ಸಾವಿರಾರು ಕನ್ನಡಿಗರನ್ನಾ ಪೊಲೀಸರು ವಶಕ್ಕೆ ಪಡೆದುಕೊಂಡಿದ್ದಾರೆ ~ Police have detained 1000's of Pro Kannada Activists#Belagavi #belagavimarvellous pic.twitter.com/BEK2oTf5H8 — Belagavi_marvellous (@Belagavi_BM) December 6, 2022 ఇదీ చదవండి: Bengaluru: బెంగళూరులో దారుణం..ఇటుక రాయితో తల పగలగొట్టి చంపేశారు -
భారత్ విషయంలో జోక్యం వద్దు.. అమెరికాకు వార్నింగ్ ఇచ్చిన చైనా!
వాషింగ్టన్: అమెరికా రక్షణ విభాగం పెంటగాన్ షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. భారత్‌తో సంబంధాల విషయంలో జోక్యం చేసుకోవద్దని అగ్రరాజ్యం అధికారులను చైనా హెచ్చరించిందని యూఎస్ కాంగ్రెస్‌కు నివేదిక సమర్పించింది. ఈ రెండు దేశాల మధ్య సరిహద్దు వివాదం సమయంలో ఇది జరిగినట్లు పేర్కొంది. వాస్తవాధీన రేఖ విషయంలో భారత్‌తో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడినప్పుడు సరిహద్దు గొడవల ప్రభావం ఇతర ద్వైపాక్షిక సంబంధాలపై ఏమాత్రం పడకుండా చైనా జాగ్రత్తపడిందని పెంటగాన్ నివేదిక స్పష్టం చేసింది. అలాగే ఆ సమయంలో భారత్‌కు అమెరికా మరింత దగ్గర కాకుండా చేయాలనుకున్నట్లు పేర్కొంది. అందుకే అగ్రరాజ్యం అధికారులకు చైనా వార్నింగ్ కూడా ఇచ్చిందని నివేదిక స్పష్టం చేసింది. సరిహద్దు వివాద సమయంలో 2021 మొత్తం చైనా బలగాలను మోహరిస్తూనే ఉందని, మౌలిక సుదుపాయాల కోసం భారీఎత్తున నిర్మాణాలు చేపట్టిందని నివేదిక వెల్లడించింది. ఇరు దేశాలు వెనక్కి తగ్గకపోవడంతో ఎన్నిసార్లు చర్చలు జరిగినా ఎలాంటి పురోగతి లేదని తెలిపింది. తమ సరిహద్దులో భారత్ నిర్మాణాలు చేపడుతోందని చైనా, తమ భూభాగంలోకి చైనా వస్తోందని భారత్ పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయని పెంటగాన్ నివేదిక పేర్కొంది. 2020 జూన్ 15న గల్వాన్ లోయలో భారత్-చైనా సైనికుల మధ్య భీకర ఘర్షణ చెలరేగింది. గత 46 ఏళ్లలో ఇరు దేశాల మధ్య ఇదే అతిపెద్ద హింసాత్మక ఘటన. ఈ గొడవలో రెండు దేశాలకు చెందిన సైనికులు చనిపోయారు. ఆ తర్వాత ఉద్రిక్తతలు తీవ్ర స్థాయికి చేరాయి. చదవండి: పెళ్లైన కొద్ది గంటలకే చనిపోయిన సింగర్.. షాక్‌లో ఫ్యాన్స్.. -
భారత్-చైనా సరిహద్దు వివాదం.. రష్యా కీలక వ్యాఖ్యలు
సాక్షి,న్యూఢిల్లీ: భారత్, చైనా సరిహద్దు వివాదంపై రష్యా కీలక వ్యాఖ్యలు చేసింది. ఎట్టిపరిస్థితుల్లోనూ తాము ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని స్పష్టం చేసింది. ఇది రెండు దేశాలకు సంబంధించిన ద్వైపాక్షిక సమస్య అని.. భారత్, చైనానే చర్చల ద్వారా సామరస్యపూర్వకంగా సమస్యను పరిష్కరించుకోవాలని సూచించింది. ఈమేరకు భారత్‌కు రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ శుక్రవారం తెలిపారు. కొన్ని దేశాలు చైనా పట్ల, మరికొన్ని దేశాలు భారత్ పట్ల అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయని డెనిస్ అన్నారు. కానీ తాము అలా కాదని చెప్పారు. వీలైనంత త్వరగా రెండు దేశాలు పరస్పర అంగీకారంతో ఓ తీర్మానానికి రావాలని తాము కోరుకుంటున్నామన్నారు. ఈ చర్చల్లో ఇతర దేశాల పాత్ర అవసరం లేదని తాము అభిప్రాయపడుతున్నట్లు వివరించారు. అలాగే ఒప్పందం ప్రకారం భారత్‌కు తాము అందించాల్సిన ఎస్-400 వాయు క్షిపణి వ్యవస్థ షెడ్యూల్ ప్రకారమే జరుగుతుందని స్పష్టం చేశారు. 5 బిలియన్ డాలర్లు విలువ చేసే ఈ ఒప్పందం భారత్-రష్యా మధ్య 2018 అక్టోబర్‌లో కుదిరింది. దీని ప్రకారం ఐదు యూనిట్ల వాయు క్షిపణి వ్యవస్థలను రష్యా భారత్‌కు అందించాల్సి ఉంది. 2020లో గల్వాన్ లోయలో భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణలు తలెత్తినప్పటినుంచి ఇరుదేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపిన అనంతరం సెప్టెంబర్ 12న గోగ్రా హాట్‌స్ప్రింగ్స్ పెట్రోలింగ్ పాయింట్ 15నుంచి తమ బలగాలను ఉపసంహరించుకున్నాయి. చదవండి: 'పేసీఎం' పోస్టర్‌పై ఫోటో.. కాంగ్రెస్‌కు వార్నింగ్ ఇచ్చిన నటుడు -
భారత్-చైనా సరిహద్దు వివాదంలో కీలక పురోగతి
సాక్షి, న్యూఢిల్లీ: భారత్-చైనా సరిహద్దు వివాదంలో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు తగ్గించేలా కీలక ముందడుగు పడింది. తూర్పు లద్దాక్ పెట్రోలింగ్ పాయింట్ 15 సమీపంలోని గోగ్రా హైట్స్ హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో ఇరుదేశాలు తమ బలగాలను పూర్తిగా ఉపసంహరించుకున్నాయి. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రక్రియ మంగళవారం పూర్తయినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఈ ప్రాంతంలో మౌలిక సదుపాయాల కోసం ఏర్పాటు చేసుకున్న తాత్కాలిక నిర్మాణాలను కూడా ఇరు దేశాల సైన్యాలు తొలగించాయి. దీంతో 2020 మే తర్వాత ఈ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం నెలకొంది. గోగ్రా హాట్‌స్ప్రింగ్స్‌లో బలగాల ఉపసంహరణ ప్రక్రియ సెప్టెంబర్ 12న పూర్తవుతుందని భారత విదేశీ వ్యవహారాల శాఖ గతవారమే చెప్పింది. భారత ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే కూడా మంగళవారంతో ఈ ప్రక్రియ పూర్తవుతుందని సోమవారం వెల్లడించారు. శనివారం ఈ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన తూర్పు లద్దాక్‌లో పరిస్థితిపై సమగ్ర సమీక్ష నిర్వహించారు. 2020 మే 5న భారత్, చైనా సైనికుల మధ్య ఘర్షణ తలెత్తినప్పటినుంచి తూర్పు లద్దాక్ సరిహద్దులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ తర్వాత సరిహద్దులోని ఇతర ప్రాంతాలకు ఈ వివాదం విస్తరించింది. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఇరు దేశాల సైనికాధికారులు రెండేళ్లుగా ప్రయత్నిస్తున్నారు. మొత్తం 16 సార్లు కార్ప్స్ కమాండర్ స్థాయి చర్చలు జరిపారు. పరస్పర ఒప్పందం ప్రకారం ఎట్టకేలకు బలగాల ఉపసంహరణ ప్రక్రియను పూర్తి చేశారు. చదవండి: అందరూ దొంగలే.. అవినీతిపై మంత్రి సంచలన వ్యాఖ్యలు.. -
చైనాకు చెక్ పెట్టడంలో ‘భారత్’ కీలక పాత్ర: అమెరికా
వాషింగ్టన్: ఆసియా పసిఫిక్ ప్రాంతంలో తన ఆధిపత్యాన్ని ప్రదర్శించేందుకు ప్రయత్నిస్తున్న చైనాను ఎదుర్కోవటంలో భారత్ కీలక పాత్ర పోషిస్తుందని పేర్కొంది అమెరికా. రానున్న భవిష్యత్తులో అమెరికాకు భారత్ కీలకమైన భాగస్వామిగా మారనుందని పేర్కొన్నారు ఆ దేశ నౌకాదళ అడ్మిరల్ మైక్ గిల్డే. ఈ వ్యాఖ్యలు.. చైనా-భారత్‌ల మధ్య సరిహద్దు వివాదంతో బీజింగ్‌పై ఒత్తిడి పెంచేందుకు వీలు కలుగనుందనే అమెరికా వ్యూహకర్తల ఆలోచన నేపథ్యంలో చేయటం ప్రాధాన్యం సంతరించుకుందని అంతర్జాతీయ మీడియా పేర్కొంది. వాషింగ్టన్లో నిర్వహించిన ఓ సెమినార్లో ఈ మేరకు అమెరికా-భారత్ సంబంధాలపై మాట్లాడారు నేవి ఆపరేషనల్ అడ్మిరల్ మైక్ గిల్డే. ఇతర దేశాలతో పోలిస్తే భారత్‌లోనే తాను ఎక్కువ సమయం పర్యటించినట్లు చెప్పారు. అప్పుడే.. సమీప భవిష్యత్తులో అమెరికాకు భారత్ వ్యూహాత్మక భాగస్వామిగా మారనుందని భావించినట్లు తెలిపారు గిల్డే. గత ఏడాది ఐదురోజుల పాటు ఢిల్లీ పర్యటనను గుర్తు చేసుకున్నారు. ‘హిందూ మహాసముద్రం అమెరికాకు చాలా కీలకమైన అంశంగా మారుతోంది. ప్రస్తుతం చైనా-భారత్‌లు సరిహద్దు వివాదంలో ఉన్నాయి. అది వ్యూహాత్మకంగా చాలా కీలకం. చైనాను తూర్పు, దక్షిణ చైనా సముద్రం, తైవాన్ జలసంధి వైపు చూడాలని బలవంతం చేయొచ్చు. కానీ, భారత్ వైపు చూడాల్సి ఉంది.’ అని పేర్కొన్నారు గిల్డే. ఇండో-యూఎస్ సైనిక విన్యాసాలు.. భారత్-అమెరికాలు సంయుక్తంగా హిమాలయ పర్వతాల్లో నిర్వహించే వార్షిక సైనిక విన్యాసాలు అక్టోబర్‌లో జరగనున్నాయి. ఈ సైనిక ప్రదర్శనపై చైనా ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఏర్పడనుందని నిక్కీ ఆసియా పేర్కొంది. యుద్ధ అభ్యాస్ పేరుతో నిర్వహించే ఈ విన్యాసాలు అక్టోబర్ 18 నుంచి 31వ తేదీ వరకు ఉత్తరాఖండ్‌లో జరగనున్నాయి. ఇదీ చదవండి: తైవాన్ జలసంధి గుండా అమెరికా యుద్ధ నౌకలు -
‘ఈశాన్యం’లో సామరస్యం
సరిహద్దుల విషయంలో తరచు సంఘర్షించుకుంటున్న ఈశాన్య రాష్ట్రాలన్నిటికీ ఆదర్శంగా అస్సాం, మేఘాలయ మంగళవారం ఒక ఒప్పందానికొచ్చాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంతా బిశ్వా శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కొన్రాడ్ సంగ్మా మంగళవారం ఈ ఒప్పందంపై సంతకాలు చేయడం ద్వారా అర్ధ శతాబ్దిగా ఇరు రాష్ట్రాల మధ్యా సాగుతున్న సుదీర్ఘ వివాదానికి తెరదించారు. రాష్ట్రాల మధ్య సరిహద్దులపై వివాదా లుండటం ఈశాన్య రాష్ట్రాలకే పరిమితమైన సమస్య కాదు. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో అవి తరచు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీస్తున్నాయి. ఏళ్ల తరబడి సహాయ శిబిరాల్లో సాధారణ పౌరులు తలదాచు కోవడం అక్కడ కనబడుతుంది. అస్సాం–నాగాలాండ్ మధ్య 2014 ఆగస్టులో దాదాపు పక్షం రోజులపాటు ఘర్షణలు చెలరేగి 14 మంది చనిపోగా, అనేకమంది ఆచూకీ లేకుండా పోయారు. గృహదహనాలు సైతం చోటుచేసుకున్నాయి. 1985లో అయితే ఆ రెండు రాష్ట్రాల పోలీసులూ పరస్పరం కాల్పులు జరుపుకోవడంతో వందమంది వరకూ మరణించారు. ఉద్రిక్తతలున్నప్పుడు సంబంధిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు సంప్రదింపులు జరుపుకోవడం, పరిస్థితులు అదుపు తప్ప కుండా చూడటంలాంటివి చేయకపోవడం వల్ల సమస్యలు మరింత జటిలమవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో అస్సాం, మేఘాలయ ఒక అవగాహనకు రావడం హర్షించదగ్గ పరిణామం. అస్సాం నుంచి కొన్ని ఇతర రాష్ట్రాల మాదిరే మేఘాలయ కూడా 1972లో విడివడి కొత్త రాష్ట్రంగా ఆవిర్భవించింది. రెండింటిమధ్యా 885 కిలోమీటర్ల సరిహద్దు ఉంది. అయితే అప్పర్ తారాబరి, గజంగ్ రిజర్వ్ ఫారెస్టు, బోక్లాపారా, లాంగ్‌పీ, నాంగ్వా తదితర 12 ప్రాంతాల్లో నిర్ణ యించిన సరిహద్దులు వివాదాస్పదమయ్యాయి. తమకు న్యాయబద్ధంగా చెందాల్సిన ప్రాంతాలను అస్సాంలోనే ఉంచారన్నది మేఘాలయ ఆరోపణ. ఈ కారణంగానే అది అస్సాం పునర్విభజన చట్టం 1972ని సవాల్ చేస్తూ న్యాయస్థానానికి ఎక్కింది. అటు అస్సాం సైతం మేఘాలయ కోరు తున్న స్థానాలు బ్రిటిష్ కాలంనుంచే తమ ప్రాంత అధీనంలో ఉండేవని వాదిస్తూ వస్తోంది. అస్సాంకు కేవలం మేఘాలయతో మాత్రమే కాదు... నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం లతో కూడా సరిహద్దు వివాదాలున్నాయి. ఆ వివాదాలు అనేకసార్లు హింసకు దారితీశాయి. ఇంత క్రితం ఈశాన్య రాష్ట్రాలను ఏలే ముఖ్యమంత్రుల్లో చాలామంది కాంగ్రెస్ వారే అయినా, కేంద్రంలో ఆ పార్టీ నేతృత్వంలోనే చాన్నాళ్లు కేంద్ర ప్రభుత్వాలు కొనసాగినా వివాదాల పరిష్కారానికి అవి ఏమాత్రం తోడ్పడలేదు. పరిస్థితులు అదుపు తప్పినప్పుడు ఉద్రిక్త ప్రాంతాల్లో సీఆర్పీఎఫ్ బలగా లను దించడం, ఉద్యమించే పౌరులపై అణచివేత చర్యలు ప్రయోగించడం మినహా చేసిందేమీ లేదు. అందువల్లే గత యాభైయ్యేళ్లుగా సరిహద్దు సమస్యలు సజీవంగా ఉంటున్నాయి. చొరవ, పట్టుదల, చిత్తశుద్ధి, ఓపిక ఉండాలేగానీ పరిష్కారం కాని సమస్యలంటూ ఉండవు. ఎక్కడో ఒకచోట ప్రారంభిస్తే వివాదాలపై అన్ని పక్షాలకూ అవగాహన ఏర్పడుతుంది. ఇచ్చిపుచ్చు కునే విశాల దృక్ప థాన్ని ప్రదర్శిస్తే, స్వరాష్ట్రంలో ఆందోళన చెందుతున్నవారిని ఒప్పించగలిగితే సమస్యలు పటాపంచ లవుతాయి. కానీ ఆ చొరవేది? ఈశాన్య రాష్ట్రాలు భౌగోళికంగా చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ వంటి దేశాలతో సరిహద్దులను పంచుకుంటాయి. మిలిటెంట్ సంస్థలు ఆ దేశాల సరిహద్దుల వద్ద ఆశ్రయం పొందుతూ ఈశాన్య రాష్ట్రాల్లో తరచూ దాడులకు దిగడం రివాజు. ప్రభుత్వాలు తమ సమ యాన్నంతా శాంతిభద్రతలకే వెచ్చించే పరిస్థితులుండటం మంచిది కాదు. అందుకే ఆలస్యంగానైనా అస్సాం, మేఘాలయ రాష్ట్రాల మధ్య ఒక ఒప్పందం కుదరడం సంతోషించదగ్గది. అయితే ఇప్పుడు కుదిరిన ఒప్పందంతోనే అస్సాం, మేఘాలయ మధ్య ఉన్న వివాదాలన్నీ సమసిపోతాయని భావించలేం. మొత్తం 12 అంశాలకు సంబంధించి వివాదాలుంటే ఇప్పుడు ఆరింటి విషయంలో ఒప్పందం కుదిరింది. రాజీ కుదిరిన ప్రాంతాలు మొత్తం సరిహద్దులో 70 శాతం. మిగిలిన 30 శాతంలో 36 చదరపు కిలోమీటర్ల ప్రాంతం ఉంది. అయితే ఈ విషయమై అస్సాంలో అఖిలపక్ష సమావేశం నిర్వహించినప్పుడు దాదాపు అన్ని పార్టీలూ ప్రభుత్వ ముసా యిదాపై వ్యతిరేకత వ్యక్తం చేశాయి. ‘ఇచ్చిపుచ్చుకునే’ పేరుతో మేఘాలయకు ఉదారంగా ఇస్తున్నదే ఎక్కువనీ, ఆ రాష్ట్రం మాత్రం బెట్టు చేస్తున్నదనీ ఆ పార్టీలు విమర్శించాయి. అయితే అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లోని రాజకీయ పక్షాలు ఒకటి గుర్తుంచుకోవాలి. సమస్యను నాన్చుతూ పోవడం వల్ల అవి మరింత జటిలమవుతాయి. ఏళ్లు గడిచేకొద్దీ కొరకరాని కొయ్యలుగా మారతాయి. ఒకపక్క బ్రహ్మపుత్ర నది ఏటా ఉగ్రరూపం దాలుస్తూ జనావాసాలను ముంచెత్తుతుంటుంది. ఈశాన్య రాష్ట్రాల్లో ఈనాటికీ మౌలిక సదుపాయాలు అంతంతమాత్రమే. అక్కడ తగినన్ని పరిశ్రమలు లేవు. యువకులకు ఉపాధి అవకాశాలు కూడా తక్కువ. ఆ ప్రాంత అభివృద్ధికంటూ చేసే వ్యయంలో సామాన్యులకు దక్కేది స్వల్పమే. ఈ పరిస్థితులు ఎల్లకాలం ఇలాగే ఉండటం మంచిది కాదు. ఇప్పుడు కుదిరిన ఒప్పందం ఎలాంటి అడ్డంకులూ లేకుండా సవ్యంగా సాగిపోవాలనీ, ఇతర అంశాలపై కూడా సాధ్యమైనంత త్వరగా రెండు రాష్ట్రాలూ అంగీకారానికి రావాలనీ ఆశించాలి. నాగాలాండ్, అరుణాచల్‌ప్రదేశ్, మిజోరం సైతం సరిహద్దు వివాదాల పరిష్కారానికి ఇదే మార్గంలో కృషి చేస్తే ఈశాన్యం ప్రశాంతంగా మనుగడ సాగించగలదు. -
50 ఏళ్ల వివాదానికి చరమగీతం
న్యూఢిల్లీ: సుదీర్ఘ కాలంగా అపరిష్కరితంగా ఉన్న సరిహద్దు వివాదానికి అసోం, మేఘాలయ రాష్ట్రాలు చరమ గీతం పాడాయి. 50 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న తమ సరిహద్దు వివాదాల పరిష్కారానికి సంబంధించిన చారిత్రక ఒప్పందంపై రెండు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. అసోం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా మంగళవారం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సమక్షంలో ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర హోంశాఖతో పాటు రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారం ఈ సందర్భంగా అమిత్ షా మాట్లాడుతూ.. ఒప్పందంపై ఇరువురు ముఖ్యమంత్రులు సంతకాలు చేయడాన్ని ‘చరిత్రాత్మక రోజు’గా వర్ణించారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు రాష్ట్రాల మధ్య 70 శాతం సరిహద్దు వివాదం పరిష్కారమైందని వెల్లడించారు. ఈశాన్య ప్రాంతంలో శాంతి, సంస్కృతి పరిరక్షణ, అభివృద్ధిపై దృష్టి సారించిన ఘనత ప్రధాని నరేంద్ర మోదీకి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. సామరస్య పరిష్కారం ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న 884.9 కిలోమీటర్ల సరిహద్దులో ఆరు చోట్ల సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వివాదాన్ని ఈ ఒప్పందం పరిష్కరించనుంది. ఈ ఆరు ప్రాంతాల్లో 36 గ్రామాలు ఉండగా.. 36.79 చదరపు కిలోమీటర్ల వివాదానికి సంబంధించి ఒప్పందం కుదిరింది. దీని ప్రకారం అసోం 18.51 చదరపు కి.మీ. ప్రాంతాన్ని తమ అధీనంలో ఉంచుకుని మిగిలిన 18.28 చదరపు కి.మీ. ప్రాంతాన్ని మేఘాలయకు ఇస్తుంది. (క్లిక్: గూర్ఖాల్యాండ్ డిమాండ్‌ను వదిలిన మోర్చా) 50 ఏళ్ల వివాదం 1972లో అస్సాం నుంచి మేఘాలయను విభజించినప్పటి నుంచి రెండు రాష్ట్రాల మధ్య ఈ వివాదం కొనసాగుతోంది. తాజాగా కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ముందుకు రావడంతో సమస్య పరిష్కారమైంది. కాగా, అసోం సీఎంతో పాటు ప్రధాని మోదీ, అమిత్ షాలకు మేఘాలయ ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. (క్లిక్: యోగి ఆదిత్యనాథ్ వద్దే హోంశాఖ) -
పాక్‌లో బలపడుతున్న ఉగ్రమూకలు
పాకిస్తాన్ ఉగ్రవాదులకు అడ్డా అనేది కొత్త విషయం కాదు. దశాబ్దాలుగా భారత్‌కు వ్యతిరేకంగా సీమాంతర ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోంది. తీవ్రవాదులకు పాక్ సురక్షిత స్థావరంగా మారిందని అమెరికా సహా చాలాదేశాలు ఎంతోకాలంగా చెబుతూనే ఉన్నాయి. ఈ ఏడాది ఆగస్టులో అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లు అధికారాన్ని హస్తగతం చేసుకోవడం... ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదులకు నూతనోత్తేజాన్ని ఇచ్చింది. ఆఫ్గానిస్తాన్‌ను తీవ్రవాదలకు సురక్షిత స్థావరం కానివ్వకూడదని, వారికెలాంటి ఆర్థిక సహాయం అందకూడదని... తాలిబన్లతో కుదిరిన ఒప్పందంలో అమెరికా, నాటోదళాలు స్పష్టం చేశాయి. భారత్‌తో పాటు మిగతా దేశాలూ ఇదే కోరుతున్నాయి. అయితే అఫ్గాన్‌తో పాటు పొరుగున్న పాక్‌లో చోటు చేసుకుంటున్న పరిణామాలు... భారత్‌కు ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. అతివాద ఇస్లామిక్ ఉద్యమాన్ని నడుపుతున్న తెహ్రీక్– ఇ– లబ్బాయిక్ పాకిస్తాన్ (టీఎల్పీ) ముందు ఈ నవంబరులో పాక్‌లోని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వం పూర్తిగా లొంగిపోయింది. మహ్మద్ ప్రవక్త గౌరవానికి ఎట్టి పరిస్థితుల్లో భంగం కలగనివ్వకూడదు, దైవదూషణకు పాల్పడే వారికి మరణశిక్ష విధిస్తున్న పాక్ చట్టాలను గట్టిగా బలపరచడం... ఈ రెండు టీఎల్పీ సిద్ధాంతాల్లో ముఖ్యమైనవి. 2015లో ఏర్పాటైంది. పంజాబ్ ఫ్రావిన్సులో దీనికి గట్టి పునాదులు, జనాదరణ ఉన్నాయి. దీన్ని రాజకీయ లబ్ధికి ఇమ్రాన్ ఖాన్, మిలటరీ ఉపయోగించుకున్నాయి. ఇమ్రాన్‌తో చేతులు కలిపిన అతివాదశక్తులు 2018 సార్వత్రిక ఎన్నికల్లో ఉదారవాద భావాలున్న నవాజ్ షరీఫ్‌ను గద్దెదింపడంలో సఫలమయ్యాయి. ప్రధాని పదవి చేపట్టిన ఇమ్రాన్... తర్వాత టీఎల్పీ నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో టీఎల్పీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించారు. అయితే అక్టోబరులో ఈ సంస్థ వేలాది మందితో ఇస్లామాబాద్ ముట్టడికి బయలుదేరడంతో తీవ్ర ఉద్రిక్తతలు తలెత్తాయి. 20 మంది పోలీసులు చనిపోయారు. సైన్యాన్ని దింపుతామని హెచ్చరికలు జారీచేసినా... తర్వాత తెరవెనుక ఏ శక్తులు పనిచేశాయో టీఎల్పీతో పాక్ ప్రభుత్వం రాజీ కుదుర్చుకుంది. ఉగ్రవాద సంస్థల జాబితా నుంచి టీఎల్పీని తొలగించింది. టీఎల్పీ చీఫ్ హఫీజ్ మొహమ్మద్ సాద్‌ను జైలు నుంచి విడుదల చేసింది. కేసులను ఎత్తివేయడానికి అంగీకరించింది. స్తంభింపజేసిన బ్యాంకు అకౌంట్లను పునరుద్ధరించింది. అతివాద భావాలున్న ఈ సంస్థ శ్రేణుల నుంచి జైషే మొహమ్మద్ (జేఈఎం), లష్కరే తోయిబా (ఎల్ఈటీ) లాంటి ఉగ్రసంస్థలు రిక్రూట్మెంట్లు చేసుకునే ప్రమాదం పొంచివుంది. పాక్‌లో అతివాద శక్తులు బలపడటం... భారత్‌కు ఆందోళన కలిగించే విషయమే. భావజాల వ్యాప్తితో ప్రమాదం తాలిబన్లు.. ప్రపంచం ఒత్తిడి మేరకు ఆఫ్గాన్కే పరిమితమైనా... వారి ప్రభుత్వంలో భాగమైన హక్కానీ నెట్వర్క్ అలా కాదు. భారత్‌లో సీమాంతర ఉగ్రవాదానికి పాల్పడుతున్న సంస్థలకు దీనినుంచి మద్దతు తప్పకుండా లభిస్తుంది. అలాగే మరో ఉగ్రసంస్థ ఐసిస్–కె కూడా కశ్మీర్‌ను విముక్తం చేయాలని ఆగస్టులో ప్రకటన చేసింది. ఇకపై ఉగ్రసంస్థలు కశ్మీర్‌పై దృష్టి సారిస్తాయి. తదుపరి లక్ష్యంగా చేసుకుంటాయి. తాలిబన్ల విజయంతో ఈ ఉగ్రసంస్థలు ద్విగుణీకృత ఉత్సాహంతో చొరబాటు యత్నాలు మొదలుపెట్టాయని రక్షణశాఖలోని విశ్వసనీయవర్గాల సమాచారం. భారత్‌లో అతివాద భావాజాలన్ని వ్యాప్తిచేయడానికి ఇవి ప్రయత్నిస్తాయి. పాక్ గూడఛార సంస్థ (ఐఎస్ఐ) అండతో పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర కార్ఖానాలను నడుపుతున్న లష్కరే తోయిబా, జైషే మొహమ్మద్లతో పాటు ఐసిస్ కూడా రిక్రూట్మెంట్ల మీద దృష్టి సారిస్తాయి. గతంతో పోలిస్తే ఇంటర్నెట్ ఇప్పుడు బాగా విస్తృతమైంది. సోషల్ మీడియాలో పోస్టుల ఆధారంగా అతివాద భావాలున్న యువతను గుర్తించి .. వారితో టచ్‌లోకి వస్తాయి. ‘జిహాద్’ పవిత్ర కార్యమంటూ నూరిపోసి ఉగ్రవాదం వైపు మళ్లిస్తాయి. ఎన్ఐఏ ఇప్పటికే కశ్మీర్‌తో పాటు కేరళ తదితర ప్రాంతాల్లో రిక్రూట్మెంట్లపై ప్రత్యేక నిఘా పెట్టింది. గతంలో తాలిబన్లు అధికారంలో (1996–2021) ఉన్న ఐదేళ్లలో కశ్మీర్లో ఉగ్రదాడుల్లో 5,715 సాధారణ పౌరులు మరణించగా... తర్వాత 20 ఏళ్లలో (2001– 2021 అక్టోబరు వరకు) 3,194 మంది చనిపోయారు. తాలిబన్లు అధికారంలో ఉంటే కశ్మీర్ మిలిటెన్సీ పెరిగినట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. ఎడమ వైపు గ్రాఫ్‌లో ఆ వివరాలను చూడొచ్చు. కశ్మీర్లో అలజడికి యత్నాలు తాలిబన్లు అధికారం చేపట్టగానే.. ఉగ్రవాద సంస్థల నైతిక స్థైర్యం పెరిగిపోయింది. దీని ప్రభావం కశ్మీర్లో అక్టోబరు, నవంబరు నెలల్లో స్పష్టంగా కనిపించింది. సాధారణ ప్రజలను అకారణంగా పొట్టనబెట్టుకొని... భయోత్పాత వాతావరణాన్ని సృష్టించడానికి తీవ్రవాద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి. స్కూలు టీచర్లు, శ్రీనగర్‌లో ప్రముఖ మెడికల్ షాపును నిర్వహించే కశ్మీర్ పండిట్‌ను, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన కూలీలను... ఇలా పలువురిని ఉగ్రమూకలు కాల్పిచంపాయి. ఈ ఏడాదిలో నవంబరు 15 నాటికి కశ్మీర్లో 40 మంది సాధరణ పౌరులు ఉగ్రదాడులకు బలయ్యారని కేంద్ర ప్రభుత్వం గతనెల 30న రాజ్యసభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో తెలిపింది. ఇందులో ఎక్కువగా అక్టోబరు– నవంబరులోనే జరిగాయి. అప్రమత్తమైన కేంద్ర ప్రభుత్వం... నవంబరులో 5,500 మంది సాయుధ బలగాల(సీఆర్పీఎఫ్–3,000, బీఎస్ఎఫ్–2,500)ను అదనంగా జమ్మూ కశ్మీర్‌కు పంపింది. శీతాకాలంలో దట్టంగా మంచు కురుస్తుంది.. దూరాన ఉన్నవి ఏవీ కనపడని వాతావరణం ఉంటుంది కాబట్టి పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి చొరబాటు యత్నాలూ పెరిగాయి. దీన్ని అడ్డుకోవడానికి నెలరోజుల పాటు భారత ఆర్మీ స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. పలువురు చొరబాటుదారులను కాల్చి చంపింది. అలాగే ఉగ్రవాద సానుభూతిపరులు, మస్తిష్కాలను కలుషితం చేస్తూ కాలేజీల్లో యువతను ఉగ్రవాదం వైపు మళ్లించే వారినీ గుర్తించేందుకు జమ్మూ కశ్మీర్ పోలీసు యంత్రాంగ ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఆర్థిక మూలాలను దిగ్భందం చేస్తోంది. కన్సల్టెన్సీల పేరిట పాక్‌లో వైద్య కళాశాలల్లోని సీట్లను కశ్మీర్ విద్యార్థులకు వేర్పాటువాద సంస్థ హురియత్ కాన్ఫరెన్స్ నాయకులు అమ్ముతూ... వచ్చే నిధులను ఉగ్ర కార్యకలాపాలకు మళ్లిస్తున్నారని గుర్తించారు. ఆగస్టులో నలుగురు హురియత్ నేతలను అరెస్టు కూడా చేశారు. మొత్తానికి కశ్మీర్లో ఉగ్రవాదుల యాక్టివిటీ పెరిగింది. – నేషనల్ డెస్క్, సాక్షి -
సరి‘హద్దు’లు సామరస్యమేనా?
అస్సాం, మిజోరం మధ్య సరిహద్దు సమస్య చిలికిచిలికి గాలి వానలా మారింది. ఏకంగా కాల్పుల వరకు వెళ్లి అస్సాం పోలీసులు, సామాన్యులను బలితీసుకుంది. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఎప్పటి నుంచో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. వివాదాలను పరిష్కరించాల్సిన కేంద్రం చోద్యం చూస్తుండడంపై విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏడేళ్ల క్రితం ఏర్పడ్డ తెలంగాణకూ సరిహద్దున ఉన్న పలు రాష్ట్రాల నుంచి వివాదాలు ఉన్నాయి. తెలంగాణ, కర్ణాటక సరిహద్దు ప్రాంతంలో పలుమార్లు వివాదాలు జరిగాయి. వికారాబాద్‌లో అంతర్రాష్ట్ర సరిహద్దు గ్రామాలైన బషీరాబాద్ మండలం క్యాద్గిరా, కర్ణాటకలోని సేడం తాలూకా పోతంగల్ మధ్య కాగ్నా నది ప్రవహిస్తోంది. నదీ తీరంలో ఇసుక తవ్వకాల విషయమై ఇరు రాష్ట్రాల మధ్య పలుమార్లు వివాదాలు చోటుచేసుకున్నాయి. ఈ నేపథ్యంలో 2018లో ఇరు రాష్ట్రాలకు చెందిన సరిహద్దు జిల్లాల కలెక్టర్లు సర్వే నిర్వహించి హద్దులు నిర్ణయించారు. తెలంగాణ–మహారాష్ట్ర సరిహద్దుల్లోనైతే విచిత్ర పరిస్థి తులు నెలకొని ఉన్నాయి. కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలానికి చెందిన 14 గ్రామాలను ఇప్పటికీ రెండు రాష్ట్రాల ప్రభుత్వం తమ పరిధిలోనివే నని చెబుతూ ఉంటాయి. 1983 ఫిబ్రవరిలో రెండు రాష్ట్రాల అధికారులు ఈ గ్రామాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు చెందినవని నిర్ణయం తీసుకొని, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చేర్చారు. ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా రాజుర ఎమ్మెల్యే వామనరావు చాటప్ మహారాష్ట్ర శాసనసభలో ఈ అంశంపై మాట్లాడారు. ఈ గ్రామాలపై నిర్ణయం తీసుకునే హక్కు కేంద్రానికి మాత్రమే ఉంటుందని, మరాఠి మాట్లాడేవారు ఎక్కువగా ఉన్నందున మహారాష్ట్రలోనే ఉంచాలని డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఈ గ్రామాలను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కి ఇస్తూ జారీ చేసిన కేబినెట్ ఉత్తర్వులను రద్దు చేస్తూ, 1996లో బీజేపీ –శివసేన ప్రభుత్వం కొత్త ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. మహారాష్ట్ర ప్రభుత్వానికి ఈ గ్రామాలపై హక్కు లేదంటూ న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. దీంతో మహా రాష్ట్ర సుప్రీంకోర్టుకు వెళ్లింది. సరిహద్దు సంగతి తేల్చేవరకూ రెండు రాష్ట్రాలూ ఈ గ్రామాల ప్రజల బాగోగులు చూసుకోవాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. అస్సాం–మిజోరం విషయంలో కేంద్ర ప్రభుత్వం సమస్యను ఆయా రాష్ట్రాలే పరిష్కరించుకోవాలని, కేవలం తాము సహాయకారిగా మాత్రమే పనిచేస్తామని లోక్‌సభలో ప్రకటించింది. ఇది సరైంది కాదు. తెలంగాణ ప్రభుత్వం సరిహద్దున ఉన్న రాష్ట్రాలతో సరిహద్దు సమస్యల పరిష్కారానికి అధికారులతో ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. అన్ని సమస్యలకూ పూర్తిస్థాయి పరిష్కారం దొరకక పోవచ్చు. ప్రయత్నలోపం జరగకుండా చూసుకోవాలి. - ఫిరోజ్ ఖాన్ వ్యాసకర్త, సీనియర్ జర్నలిస్ట్ -
Assam-Mizoram: సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్
డిస్పూర్: అసోం–మిజోరం సరిహద్దు వివాదానికి సంబంధించి చెలరేగిన హింసలో ఐదుగురు పోలీసులు మృతి చెందిన సంగతి తెలిసిందే. తాజాగా ఇరు రాష్ట్రాల సరిహద్దు వివాదంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మపై మిజోరాంలో హత్యాయత్నం కేసు నమోదయ్యింది. సీఎంతో పాటు మరో నలుగురు పోలీసు ఉన్నతాధికారులపై కూడా ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఐజీపీ) అనురాగ్ అగర్వాల్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ (డీఐజీ) కచార్ దేవోజ్యోతి ముఖర్జీ, కచార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ చంద్రకాంత్ నింబాల్కర్, ధోలై పోలీస్ స్టేషన్ ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఉద్దీన్, నీహ్లయా మీద ఎఫ్ఐఆర్ నమోదయ్యింది. ఈ సందర్భంగా ఓ ఉన్నతాధికారి మాట్లాడుతూ.. ‘‘సరిహద్దు పట్టణానికి సమీపంలో మిజోరాం, అసోం పోలీసు బలగాల మధ్య జరిగిన ఎదురుకాల్పుల తరువాత సోమవారం సాయంత్రం రాష్ట్ర పోలీసులు వైరంగ్టే పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ దాఖలు చేశారు. కచార్ డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లి, కచార్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ సన్నీడియో చౌదరిపై కూడా అదే అభియోగాల కింద కేసులు నమోదు చేశాం’’ అని తెలిపారు. వీరితో పాటు మరో 200 మంది అసోం పోలీసు సిబ్బందిపై కూడా కేసులు నమోదు చేసినట్లు సదరు అధికారి పేర్కొన్నారు. మిజోరాం సరిహద్దులోని అసోం జిల్లాలు కచర్, హైలకండీలో అక్టోబర్ 2020 నుంచి ఉద్రిక్తతలు క్రమంగా పెరుగుతున్నాయి. ఈ ప్రాంతంలో తరచుగా ఇళ్లు తగలబెట్టడం, భూమిని ఆక్రమించుకోవడం వంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. రెండు ఈశాన్య రాష్ట్రాలు 164.6 కిలోమీటర్ల సరిహద్దును పంచుకుంటున్నాయి. అసోంలోని కచార్, హైలకండీ, కరీంగంజ్ జిల్లాలు.. మిజోరంలోని కొలాసిబ్, మమిత్, ఐజ్వాల్ సరిహద్దును పంచుకుంటున్నాయి. ప్రాదేశిక సరిహద్దుకు సంబంధించి రెండు రాష్ట్రాలు భిన్నమైన వివరణలు వెల్లడిస్తున్నాయి . 1875 లో గిరిజనులను బాహ్య ప్రభావం నుంచి కాపాడటానికి రూపొందించిన ఒక అంతర్గత రేఖ వెంబడి తమ సరిహద్దు ఉందని మిజోరాం విశ్వసిస్తుండగా.. అస్సాం 1930 లలో చేసిన జిల్లా సరిహద్దు ద్వారా వెళుతుంది. -
శత్రుత్వం కన్నా మిత్రత్వం మిన్న..
శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజకీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారిత్రక సత్యాలు ఎంతో విలువైనవి. చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. చరిత్ర, హిమాలయన్ అనుసంధానం రీత్యా భారత్, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు నేడు తిరస్కరణకు గురవుతున్నాయి. పైగా, భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటివాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సి ఉంది. అతిపెద్ద పొరుగుదేశాల్లోని దాదాపు 300 కోట్ల మంది ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నేతలకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం ప్రశ్నించాల్సిన విషయమే. చైనా ప్రెసిడెంట్ షి జిన్‌పింగ్ ఇటీవల టిబెట్ లోని నింగ్చి మెయిన్లింగ్ విమానాశ్రయంలో దిగి, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలోని లాసాకు బుల్లెట్ ట్రెయిన్లో ప్రయాణించడం రెండు అంశాలపై ఆసక్తి కలిగించింది. ఒకటి, పాక్షికంగా పూర్తిచేసిన ప్రమాదకరమైన 1,629 కిలోమీటర్ల రైల్ ప్రాజెక్టు. ఇది చైనాలో అతిపెద్ద ఇన్నర్ సిటీ అయిన చెంగ్డును పశ్చిమాన ఉన్న లాసాతో అనుసంధానిస్తుంది. ఈ మార్గంలోని చాలా భాగం అతిపెళుసైన, ఎల్తైన, భూకంపాలు చెలరేగే, పర్యావరణపరంగా ప్రమాదకరమైన భూభాగంనుంచి వెళుతుంది. ఈ ప్రాజెక్టులో తొలి భాగమైన చెంగ్డు నుంచి యాన్ మార్గం దాదాపుగా పూర్తయింది. నింగ్చి నుంచి లాసా మార్గం కూడా పూర్తయింది. అయితే యాన్ నుంచి నింగ్చి మార్గంలోనే అత్యంత పొడవైన మధ్య భాగం నిర్మాణం పూర్తి కావడానికి మరొక పదేళ్ల సమయం పట్టవచ్చు. రెండోది, దక్షిణ టిబెట్‌కి షీ జిన్‌పింగ్ యాత్ర... భారత్‌తో సరి హద్దు ఘర్షణకు చైనా జాతీయ ఎజెండాలో ఆయన అత్యంత కీలక స్థానం ఇస్తున్నట్లు సూచించింది. టిబెట్ పరిణామాలను అధ్యయనం చేస్తున్న బ్రిటిష్ స్కాలర్ రాబర్ట్ బర్నెట్ దీన్నే నొక్కి చెబుతున్నారు. చైనా ప్రభుత్వ మీడియా ఇప్పుడు భారత్‌కు ప్రాధాన్యమివ్వడం ద్వారా బర్నెట్ అంచనా మరోసారి నిజమైంది. 1980లలో రాజీవ్‌గాంధీ నుంచి 2014లో నరేంద్ర మోదీ వరకు భారత ప్రధానుల హయాంలో భారత్ సైనిక సామగ్రి పరంగా సాధించిన విజయాలను విస్తృతంగా గుర్తిస్తూ చైనా మీడియా ఇప్పుడు స్పందిస్తోంది. భారత్, చైనా మధ్య శత్రుత్వం కొనసాగే అవకాశముందని, ఘర్షణలకు సన్నద్ధమయ్యే ఆవశ్యకత కూడా ఉంటుందని వాస్తవికవాదులు తప్పక గుర్తించాల్సి ఉంది. అదేసమయంలో పవిత్రమైన హిమాలయాలను ఒక భారీ శ్మశాన వాటికగా మార్చిన ఆ విషాద ఉన్మాదాన్ని, యుద్ధం అనే ప్రమాదకరమైన ప్రయోగం ద్వారా హిమాలయా పర్వతాలకు, నదులకు నష్టం కలిగించే పర్యవసానాలను కూడా వీరు మనసులో ఉంచుకోవాల్సి ఉంది. శత్రుత్వాన్ని శాశ్వతీకరించడం చాలా సులభం. సరిహద్దుకు ఇరువైపులా ఉన్న పక్షాలకు యుద్ధాలు రాజ కీయ ప్రయోజనాలను తీసుకురావచ్చు కానీ ఆర్థిక, భౌగోళిక, చారి త్రక సత్యాలను లెక్కించడం కూడా విలువైనదేనని చెప్పాలి. చైనా జనరల్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ కస్టమ్స్ (జీఏసీ) అంచనా ప్రకారం లద్దాఖ్ ఘర్షణలు చెలరేగిన 2020 సంవత్సరం నాటికి భారత్, చైనా మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 87.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది. గత సంవత్సరంలో ఇది 5.6 శాతానికి పడిపోయింది. చైనా నుంచి భారత్‌కు దిగుమతులు 66.7 శాతంగా నమోదయ్యాయి. 2016 నుంచి చూస్తే ఇది అతితక్కువ శాతం అన్నమాట. దాదాపు 10.8 శాతం పతనమైందన్నమాట. కానీ చైనాకు భారత్ ఎగుమతులు 2020లో 16 శాతం పెరిగి 20.86 బిలియన్ డాలర్లకు వృద్ధి చెందాయి. వీటిలో ఇనుప ఖనిజం ఎగుమతులు అత్యధికంగా పెరిగాయి. భారత వాణిజ్య లోటు అయిదేళ్ల స్వల్పానికి అంటే 45.8 శాతానికి పడిపోయింది. కానీ ఈ సంవత్సరం ఇరుదేశాల మధ్య వాణిజ్యంలో మళ్లీ పెరుగుదల కనిపించింది. చైనా ప్రభుత్వ పత్రిక ‘గ్లోబల్ టైమ్స్ చైనా’ జీఏసీ నివేదికనుంచి పేర్కొన్నట్లుగా గత సంవత్సరంలో డాలర్ల రూపంలో పోలిస్తే, భారత్‌తో చైనా వాణిజ్యం 2021 జనవరి నుంచి జూన్ నెలలో 62.7 శాతానికి పెరిగింది. అంటే చైనా–భారత్ వాణిజ్యం వృద్ధి మొత్తం చైనా వాణిజ్యంలో రెండో స్థానం ఆక్రమించింది. దక్షిణా ఫ్రికా తొలి స్థానంలో ఉంది. కోవిడ్–19 మహమ్మారిని ఎదుర్కొనేం దుకు అవసరమైన చైనా సరఫరాలు భారత్‌కు దిగుమతి కావడం బాగా పెరగడం దీంట్లో భాగమేనని చెప్పాలి. మరీ ముఖ్యంగా 2020 సంవత్సరంలో చైనా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో 23 వేలమంది భారతీయ విద్యార్థులు విభిన్న కోర్సులలో చేరి అధ్యయనం సాగించారు. వీరిలో 21 వేలమంది డాక్టర్లు అయ్యేందుకు తమ పేర్లు నమోదు చేసుకోవడం విశేషం. 2021లో కూడా ఈ సంఖ్య మారలేదు. పైగా, చైనాలోని భారత్ లేక బహుళ జాతి సంస్థల్లో ఉద్యోగాలు చేస్తున్న బారతీయుల సంఖ్య కూడా తక్కువగా లేదు. చైనాలో మొత్తం 36 వేలమందికి పైగా భారతీయులు పనిచేస్తున్నారని అంచనా. ఈ సంఖ్య తక్కువేమీ కాదు. ఎర్రచైనా పెట్టుబడిదారీ విధానాన్ని పరిధికి మించి అధికంగా అనుమతించినట్లయితే, మతపరమైన, తాత్వికపరమైన విశ్వాసాలకు సంబంధించిన వాస్తవాలను కూడా అది ఆమోదిస్తున్నట్లు కనిపిస్తోంది. కన్ఫ్యూసియనిజంను గౌరవించి, చైనా ప్రభుత్వం స్వీకరించగా, మావో కాలంలో బౌద్ధమతం పట్ల సర్వసాధారణంగా అవలంబించిన సైద్ధాంతిక అవహేళనను నేటి చైనాలో అనుసరిస్తున్న సూచనలు లేవు. ఇప్పుడు టిబెట్‌లోనే కాకుండా చైనాలో ప్రతి చోటా బుద్ధిజం చొచ్చుకుపోయిందని పలువురు భారతీయులు గుర్తించడంలేదు. సంఖ్యలకు ప్రాధాన్యం ఉందంటే, చైనాలో పెరుగుతున్న లక్షలాది బౌద్ధమతానుయాయులు భారత్‌లో కంటే ఎక్కువ సంఖ్యలో ఉండి ప్రభావం చూపగలరన్నది వాస్తవం. బౌద్ధమత గ్రంథాలను పొందడం కోసం శతాబ్దాల క్రితం అత్యంత కష్టభూయిష్టమైన ప్రయాణాలు సాగించి భారత్‌కు చేరుకున్న చైనా పండితులు... అదృశ్యమయ్యే అవకాశమున్న భారతీయ చరిత్రను తమ రచనల్లో నమోదు చేశారు. ఇలాంటి పండితుల్లో సుప్రసిద్ధుడైన హుయాన్‌త్సాంగ్ భారతదేశంలో అత్యంత గౌరవం పొందాడు. చైనాలో అత్యంత జనాదరణ పొందిన 16వ శతాబ్దం నాటి చారిత్రక గాథ ‘గ్జియుజి లేదా పశ్చిమానికి పయనం’ అనే కథ... హుయాన్‌త్సాంగ్ 7వ శతాబ్దిలో భారత్‌కి సాగించిన తీర్థయాత్రను అత్యంత ఉత్కంఠతో, సరదాతో కూడిన సాహస యాత్రకు కాల్పనిక రూపమిచ్చిందని బహుశా చాలామంది భారతీయులకు తెలీకపోవచ్చు. 2015లో మరణించిన ఆంథోనీ సి. యు అనే అమెరికన్ పండితుడు ‘ఎ జర్నీ టు ది వెస్ట్’ అనే ఈ పుస్తకానికి చేసిన నాలుగు సంపుటాల అనువాదం ఇంగ్లిష్ అనువాదాల్లో అత్యుత్తమ రచనగా నిలిచిపోయింది. బుద్ధుడికి, జర్నీ టు ది వెస్ట్ గ్రంథానికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఎందుకంటే చైనా జాతి చైతన్యంలో శతాబ్దాలుగా భారత్ ఒక భాగమై ఉంటూ వస్తోంది. ఈ చరిత్ర రీత్యా, హిమాలయన్ వారధి రీత్యా భారత ప్రజలు, చైనా ప్రజల మధ్య శత్రుత్వం శాశ్వతంగా ఉంటుందన్న అభిప్రాయాలు ఇప్పుడు తిరస్కరణకు గురవుతున్నాయి. మరోవైపున భౌగోళిక రాజకీయాలు, పాలకుల పేరాశలు, సరిహద్దు వివాదాలు వంటి వాటిని కఠిన వాస్తవాల ప్రాతిపదికన నిశితంగా విశ్లేషించాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ కాలమిస్టులకు అందుబాటులో ఉండవు. కాబట్టి వీటి నుంచి విశాల దృష్టితో కొన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఒకటి, అతిపెద్ద పొరుగు దేశాల్లోని దాదాపు 300 కోట్ల ప్రజల మధ్య సంబంధాలను కొద్దిమంది నాయకులకు, వారి సలహాదార్లకు విడిచిపెట్టడం అన్నది ఆలోచించదగిన కీలక విషయం. రెండు.. అమెరికా, భారత్, జపాన్, ఆస్ట్రేలియాతో కూడిన క్వాడ్ కూటమిలో కొన్ని ఉపయోగకరమైన అంశాలు కూడా ఉండవచ్చు. ఎందుకంటే, ఒకటి అమెరికా నేతృత్వంలో, మరొకటి చైనా నేతృత్వంలో ఉండే రెండు శిబిరాల మధ్య ఆసియా, ప్రపంచ ప్రజలను విడదీసే ప్రయత్నాలు చెడు ఫలితాలను ఇవ్వవచ్చు. కాబూల్ ప్రభుత్వం తెలుసుకున్నట్లుగా అగ్రరాజ్యాలు శాశ్వతమైన రక్షణ ఛత్రాలను అందించవు. అందుకే, క్వాడ్ కూటమి కంటే ఎక్కువగా, భారతీయ స్వతంత్ర పౌరుల స్వేచ్ఛ, రాజకీయ నేతలను ఓటు వేసి సాగనంపే భారత పౌరుల సామర్థ్యం అనేవి చైనా ప్రజలకు అత్యంత ప్రభావం కలిగించే సందేశాన్ని ఇస్తాయి. చైనా ప్రజలు ఈర‡్ష్య పడేవిధంగా, భారత్‌లో ఉన్న మనం మన నేతలను పరిహాసం చేయవచ్చు, అవహేళన చేయవచ్చు లేదా ఇంటికి సాగనంపవచ్చు కూడా. మనం ఈ ప్రయోజనాన్ని కూడా కోల్పోయామంటే ఇక ఆట ముగిసినట్లే. -రాజ్‌మోహన్ గాంధీ వ్యాసకర్త ప్రస్తుతం ఇలినాయ్ యూనివర్సిటీలో బోధకుడుగా ఉన్నారు -
Assam- Mizoram: 150 ఏళ్ల వివాదం
దేశాల మధ్య సరిహద్దు వివాదాలు సహజం కానీ రాష్ట్రాల మధ్య సరిహద్దులు భగ్గుమనడమేంటి ? భూభాగం గురించి సీఎం మధ్య మాటల యుద్ధం ఎందుకు? దాని వెనుకనున్న అసలు కారణాలు తెలుసుకోవాలంటే 150 ఏళ్ల కిందట నాటి చరిత్ర మూలాల్లోకి వెళ్లాలి. ఈశాన్య రాష్ట్రాలంటే పచ్చని కొండలు, సుందరమైన మైదాన ప్రాంతాలు, దట్టమైన అటవీ ప్రాంతాలు, నదీనదాలు.. ఇలా ప్రకృతి అందాలే మన కళ్ల ముందు కదులుతాయి. అవే అటవీ ప్రాంతాలు అస్సాం, మిజోరం మధ్య అగ్గిరాజేశాయి. బ్రిటీష్ పాలకులు తమ దేశం వెళుతూ వెళుతూ కశ్మీర్‌ను రావణ కాష్టం చేయడమే కాకుండా ఈశాన్య రాష్ట్రాల సరిహద్దుల్ని కూడా వివాదాస్పదం చేశారు. దేశానికి 1947లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత అతి పెద్ద భూభాగమైన అస్సాం నుంచి మిగిలిన ప్రాంతాలను వేరు చేస్తూ మణిపూర్, త్రిపుర, నాగాలాండ్, మేఘాలయ, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాలు 1963–1987 మధ్య కాలంలో ఏర్పాటు అయ్యాయి. ఆ ప్రాంత ప్రజల సంస్కృతి, అలవాట్లు, చరిత్రను ఆధారంగా చేసుకొని ఆనాటి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. మిజోరం ప్రాంతాన్ని 1972లో కేంద్ర పాలిత ప్రాంతం చేయగా, 1987లో పూర్తిస్థాయి రాష్ట్ర హోదా కట్టబెట్టారు. అస్సాంలోని మూడు జిల్లాలైన కచర్, హైలకండి, కరీంగంజ్లు, మిజోరంలోని మూడు జిల్లాలైన అయిజ్వాల్, కొలాసిబ్, మమిత్‌లు 165 కిలోమీటర్ల పొడవునా సరిహద్దుల్ని పంచుకుంటున్నాయి. బ్రిటీష్ ప్రభుత్వం ఏం చేసింది ? అసోం–మిజోరం మధ్య ఉన్న 165 కి.మీ. సరిహద్దు ప్రాంతం వివాదాస్పదం కావడానికి బ్రిటీష్ పాలకులు ఇచ్చిన రెండు వేర్వేరు నోటిఫికేషన్లే కారణం. లుషాయి కొండలు (అవే ఇప్పటి మిజోరం), కచర్ మైదాన ప్రాంతాల (అస్సాం భూభాగం) మధ్య సరిహద్దుల్ని నిర్ణయిస్తూ 1875లో తెల్లదొరలు ఒక నోటిఫికేషన్ విడుదల చేశారు. 1873 నాటి బెంగాల్ తూర్పు సరిహద్దు నియంత్రణ చట్టం ప్రకారం ఇన్నర్ లైన్ పర్మిట్ (ఐఎల్పీ) పద్ధతి ప్రకారం సరిహద్దుల్ని గుర్తించారు. అప్పట్లో మిజోరం ప్రాంతంలో నేతల్ని కూడా సంప్రదించి ఈ నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ 1933లో మణిపూర్ లుషాయి కొండల సరిహద్దుల్ని నిర్ణయిస్తూ మరో నోటిఫికేషన్ జారీ చేశారు. దీంతో లుషాయి కొండలు అంటే ప్రస్తుత మిజోరంలో కొంత భాగం అస్సాం, మణిపూర్లలో కలిసింది. అయితే 1933 నోటిఫికేషన్‌ను తమని సంప్రదించకుండా చేశారన్న కారణంతో మిజో నేతలెవరూ దానిని అంగీకరించలేదు. 1875లో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారం 1,318 చదరపు కిలో మీటర్ల భూభాగం తమదేనని మిజోరం వాదిస్తోంది. ఆ ప్రాంతంలో ఇప్పటికీ మిజో ప్రజలు వ్యవసాయం చేస్తున్నారు. మరోవైపు అస్సాం ప్రభుత్వం మిజోరం తమ భూభాగాన్ని దురాక్రమణ చేస్తోందని ఆరోపిస్తోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ ఘర్షణలు ఇలా.. ►అస్సాం, మిజోరం మధ్య ఘర్షణలు ఇప్పుడు కొత్తేం కాదు. 1994లో ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. మిజోరం తమ భూభాగంలోకి చొరబడుతోందంటూ అస్సాం ప్రభుత్వం గగ్గోలు పెట్టింది. అప్పట్నుంచి కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు ఇరు రాష్ట్రాల మధ్య సయోధ్యకు ప్రయత్నించినా ఫలించలేదు. ►2018లో మిజోరంకు చెందిన విద్యార్థి సంఘాలు వివాదాస్పద భూభాగంలో రైతులు విశ్రాంతి తీసుకోవడానికి కొన్ని చెక్క భవనాలు నిర్మించడంతో మళ్లీ వివాదం రాజుకుంది. అస్సాం పోలీసులు వాటిని ధ్వంసం చేశారు. ►2020 అక్టోబర్‌లో ఇరపక్షాల మధ్య జరిగిన ఘర్షణలతో ఎందరో గాయపడ్డారు. మిజోరంకు గుండెకాయ వంటిదైన జాతీయ రహదారి 306 ఏకంగా 12 రోజులు మూత పడింది. ►జూన్‌లో మిజోరం ప్రజలు ఆ భూభాగంలో వ్యవసాయం చేస్తూ ఉండడంతో మళ్లీ ఇరు రాష్ట్రాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. ßోంమంత్రి అమిత్ షా పర్యటన జరిగిన మర్నాడే ఘర్షణల్లో ఐదుగురు అస్సాం పోలీసులు, ఒక పౌరుడు మరణించడంతో విభేదాలు తారస్థాయికి చేరుకున్నాయి. సరిహద్దు వివాదం పరిష్కా రానికి ఇప్పుడు అస్సాం ప్రభుత్వం సుప్రీం జోక్యాన్ని కోరుతోంది. -
చట్టం చెబితే భూమినీ వదిలేస్తాం
న్యూఢిల్లీ/సల్చార్/గువాహటి: అస్సాం, మిజోరం రాష్ట్రాల సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. పార్లమెంట్ చట్టం చేస్తే రాష్ట్రానికి చెందిన భూమిని సైతం వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నామని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తెలిపారు. సరిహద్దుల్లోని రక్షిత అటవీ ప్రాంతాన్ని ఆక్రమణల నుంచి, విధ్వంసం నుంచి రక్షించుకునేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు చెప్పారు. రెండు రాష్ట్రాల సరిహద్దుల్లోని లైలాపూర్ వద్ద సోమవారం జరిగిన కాల్పుల్లో అస్సాంకు చెందిన ఐదుగురు పోలీసులు, ఒక పౌరుడు మృతి చెందగా మరో 60 మంది గాయపడిన విషయం తెలిసిందే. సరిహద్దుల్లో రిజర్వు ఫారెస్టులో రోడ్ల నిర్మాణం, పోడు వ్యవసాయం కోసం అడవుల నరికివేతను కొనసాగనీయమన్నారు. అటవీ ప్రాంతంలో నివాసాలు లేవు. ఒక వేళ ఉన్నాయని మిజోరం ఆధారాలు చూపితే, వాటిని వెంటనే తొలగిస్తాం’ అని స్పష్టం చేశారు. పార్లమెంట్ చట్టం చేస్తే అస్సాంకు చెందిన ప్రాంతాన్ని వదులుకునేందుకు సిద్ధంగా ఉన్నాం. అప్పటి వరకు ఒక్క అంగుళం భూమిని కూడా ఆక్రమణకు గురికానివ్వం’ అని ఆయన అన్నారు. నేడు హోం శాఖ కార్యదర్శి సమావేశం అస్సాం, మిజోరం సరిహద్దుల్లో హింసాత్మక ఘటనలపై చర్చించేందుకు రెండు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో బుధవారం కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చర్చలు జరపనున్నారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ సమావేశంలో ఒక రాజీ ఫార్ములా కుదిరే చాన్సుంది. ఘటనకు నిరసనగా సరిహద్దుల్లోని అస్సాంలోని చచార్ జిల్లా ప్రజలు మిజోరం వైపు వాహనాలను రాష్ట్రంలోకి రాకుండా అడ్డుకున్నారు. హింసాత్మక ఘటనలకు హోం మంత్రి అమిత్ షా వైఫల్యమే కారణమని కాంగ్రెస్ నేత రాహుల్ ధ్వజమెత్తారు. -
హద్దులు దాటిన వ్యవహారం
ఒక రాష్ట్ర పోలీసులు, మరో రాష్ట్ర పోలీసులపై కాల్పులు... ట్విట్టర్లో పొరుగు రాష్ట్రాల సీఎంల పరస్పర ఆరోపణలు... ఇది అంతర్ రాష్ట్ర వివాదమా? అంతర్జాతీయ యుద్ధమా? ఈశాన్య భారతావనిలో అస్సామ్, మిజోరమ్‌ల సరిహద్దులో సోమవారం రేగిన ఘర్షణలు... మిజోరమ్ కాల్పుల్లో అయిదుగురు అస్సామీ పోలీసులు అమరులవడం... 60 మంది గాయపడడం... ఇవన్నీ చూశాక ఎవరైనా అనే మాట – అనూహ్యం... అసాధారణం. రాష్ట్రాల హద్దులపై దశాబ్దాలుగా సాగుతున్న వివాదం చివరకు ఈ స్థాయిలో ఇరువైపులా భద్రతాదళాలకూ, పౌరులకూ మధ్య హింసాకాండగా మారడం మునుపెన్నడూ ఎరుగని విషయం. కేంద్ర హోమ్ మంత్రి రంగంలోకి దిగి, ఇరు రాష్ట్రాల సీఎంలకూ ఫోన్ చేసి, హితవు పలకాల్సి వచ్చిందంటే, పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈశాన్య రాష్ట్రాల సరిహద్దు వివాదాలు ఈనాటివి కావు. కాకపోతే, ఈసారి ఇలా అంతర్జాతీయ సరిహద్దు యుద్ధాల లాగా పోలీసుల పరస్పర కాల్పులకు విస్తరించడమే విషాదం. ఈశాన్య ప్రాంత సీఎంలతో కేంద్ర హోమ్ మంత్రి షిల్లాంగ్‌లో సమావేశమై, హద్దుల వివాదాలపై చర్చించి వెళ్ళిన రెండు రోజులకే ఇలా జరగడం మరీ విచిత్రం. మిజోరమ్ భూభాగాన్ని అస్సామ్ ఆక్రమించిందని ఆ ప్రభుత్వం ఆరోపిస్తోంది. రిజర్వు అటవీ భూమిని మిజోరమ్ గ్రామీణులు కబ్జా చేస్తున్నారని అస్సామ్ ప్రత్యారోపణ చేస్తోంది. అస్సామ్ గడ్డపై మిజోలు తరతరాలుగా స్థిరపడి, సాగు చేస్తున్నంత మాత్రాన ఆ ప్రాంతం మిజోలది అయిపోదన్నది అస్సామీల వాదన. తాజా ఘటనలో అస్సామ్ పోలీసులే అత్యుత్సాహంతో సరిహద్దు గస్తీ కేంద్రాన్ని ఆక్రమించి, సామాన్యులపై జులుం చేశారని మిజోరమ్ నేరారోపణ. ఇది ఇంతటితో ఆగేలా లేదు. అటవీ భూమిలో అంగుళం కూడా ఆక్రమించుకోనివ్వకుండా సుప్రీమ్ కోర్టులో పిటిషన్ వేస్తామని అస్సామ్ సీఎం గర్జిస్తున్నారు. అగ్నికి ఆజ్యం పోస్తూ, 4 వేల మంది కమెండోలను హద్దుల్లో మోహరిస్తామని విస్మయకర ప్రకటన చేశారు. గమ్మత్తేమిటంటే, మూడున్నర కోట్ల పైగా జనాభా ఉన్న అస్సామ్ను పాలిస్తున్న ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ, కేవలం 11 లక్షల పైచిలుకు జనసంఖ్య ఉన్న మిజోరమ్ ముఖ్యమంత్రి జొరామ్థాంగా – ఇద్దరూ కేంద్రంలోని పాలక బీజేపీ తానుగుడ్డలే! అస్సామ్ సాక్షాత్తూ బీజేపీ ఏలుబడిలో ఉంటే, మిజోరమ్‌లోని పాలక ‘మిజో నేషనల్ ఫ్రంట్’ (ఎంఎన్ఎఫ్) సైతం కేంద్రంలో బీజేపీ సారథ్యంలోని ఎన్డీఏలో భాగం. చరిత్రలోకి వెళితే – 1972 వరకు మిజోరమ్ సైతం అస్సామ్‌లో భాగమే. ఆదిలో కేంద్రపాలిత ప్రాంతంగా ప్రత్యేక గుర్తింపు పొందిన మిజోరమ్, 1987లో రాష్ట్ర హోదా పొందింది. మిజోరమ్‌తో దాదాపు 164 కిలోమీటర్ల సరిహద్దున్న అస్సామ్ పెద్దన్న పాత్ర పోషిస్తుండడం మిజోరమ్‌కు మొదటి నుంచి ఇబ్బందిగా మారింది. 1875లో తమ నేతలను సంప్రతించి, బ్రిటీషు కాలంలో చేసిన హద్దులనే అనుసరించాలని మిజోలు కోరుతున్నారు. కానీ, ఆ తరువాత 1933లో చేసిన హద్దులదే తుది మాట అని అస్సామ్ వాదన. ఇదీ ఎంతకీ తెగని పీటముడిగా మారింది. దీనికి సమర్థమైన రాజకీయ పరిష్కారం అవసరం. కానీ, సాయుధ పోలీసు పరిష్కారం కనుక్కోవాలని తాజాగా ప్రయత్నించి స్థానిక పాలకులు ఘోర తప్పిదానికి పాల్పడ్డారు. నిజానికి, సహజసిద్ధమైన వనరులతో, అడవులు, పర్వతాలు, లోయలతో సంక్లిష్టమైన భౌగోళిక ప్రాంతం ఈశాన్య భారతం. ఫలితంగా అక్కడి 7 రాష్ట్రాల మధ్య కచ్చితమైన సరిహద్దుల నిర్ణయం మరింత క్లిష్టమైనది. అందుకే అక్కడి భూములు, హద్దులపై ఇన్ని వివాదాలు! దేశానికి స్వాతంత్య్రం రాక ముందు నుంచీ, వచ్చిన తరువాతా అక్కడ వివిధ జాతుల మధ్య సంఘర్షణలు తలెత్తుతూనే ఉన్నాయి. కానీ, తాజా కాల్పుల లాంటివి మాత్రం అరుదు. ఒకే దేశంలో అంతర్భాగమైన రెండు రాష్ట్రాలు కాల్పులు జరుపుకొనే పరిస్థితికి రావడం ఇన్నేళ్ళుగా సమస్యలను మురగబెట్టి, ద్వేషాన్ని పెంచిపోషించిన స్థానిక, కేంద్ర పాలకుల వైఫల్యమే! అందుకే ఇప్పుడు ఆమోదయోగ్యమైన హద్దుల నిర్ణయంతో ఘర్షణలకు ముగింపు పలకడంపై పాలకులు దృష్టి పెట్టక తప్పని పరిస్థితి వచ్చింది. సున్నితమైన అంతర్జాతీయ సరిహద్దులకు దగ్గరలో ఉన్న ఈశాన్య రాష్ట్రాలలో అంతర్ రాష్ట్ర సంఘర్షణ ఎలా చూసినా అవాంఛనీయం. ఆందోళనకరం. 1995 నుంచి అస్సామ్, మిజోరమ్‌ల చర్చల్లో కేంద్రం పాలుపంచుకున్నా, ఫలితం రాలేదు. అయితే, వచ్చే 2024 కల్లా ఈశాన్యంలో హద్దుల వివాదాలకు ఫుల్స్టాప్ పెడతామని పాలకుల మాట. అది నిజం చేయాలంటే, కేవలం స్థానిక ఓటుబ్యాంకు రాజకీయాలతో కాక, సువిశాలమైన దేశప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని, దౌత్యనైపుణ్యం చూపే నేతలు ఇప్పుడు అవసరం. వారికి కావాల్సిందల్లా సమస్యల సమగ్ర అవగాహన, చిత్తశుద్ధి! ఆ యా ప్రాంతీయుల్ని భాగస్వాములను చేసి, స్థానిక సెంటిమెంట్లనూ, ఆలోచనలనూ పరిగణనలోకి తీసుకొంటే దీర్ఘకాలిక పరిష్కారం, ప్రజల మధ్య శాశ్వత సామరస్యం సాధించడం అసాధ్యమేమీ కాదు. రాష్ట్ర పాలకులతో అది సాధ్యం కాకపోతే, కేంద్రమే పెద్దమనిషి పాత్ర పోషించాలి. అయితే అంతకన్నా ముందుగా తమను పరాయివారిగా చూస్తున్నారని భావిస్తున్న ఈశాన్యంలోని స్థానిక జాతులకూ, అభివృద్ధికి నోచుకోని సుదూర ప్రాంతాలకూ వారూ ఈ దేశంలో అంతర్భాగమనే నమ్మకం కలిగించాలి. పరస్పర సోదరభావం పెంపొందించాలి. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా, పడమటి చివరి నుంచి ఈశాన్యం కొస వరకు దేశాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకోవాలని కోరుకొనే పాలకుల నుంచి ఆ మాత్రం ఆశిస్తే అది తప్పు కాదేమో! -
మాటకి కట్టుబడి వెనుదిరిగిన చైనా సైన్యం
న్యూఢిల్లీ: శిబిరాలు తీసేస్తున్నారు. జెట్టీలు ధ్వంసం చేస్తున్నారు. హెలిప్యాడ్లను తొలగిస్తున్నారు. యుద్ధ ట్యాంకుల్ని వెనక్కి మళ్లిస్తున్నారు. భారత్, చైనా మధ్య వాస్తవాధీన రేఖ వెంబడి గత 10 నెలలుగా నెలకొన్న ఉద్రిక్తతల నివారణకు కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చైనా అందరినీ ఆశ్చర్య పరిచేలా వాయువేగంతో ఉపసంహరణ పూర్తి చేస్తోంది. పాంగాంగ్ సరస్సుకి తూర్పుగా ఫింగర్ 8వైపు చైనా దళాలు మళ్లుతూ ఉంటే, భారత్‌కు చెందిన దళాలు ఫింగర్ 3లోని శాశ్వత శిబిరంలో ఇకపై ఉంటారు. ఈ మధ్య ప్రాంతాన్ని నో మ్యాన్ ల్యాండ్ కింద ప్రకటించారు. అంటే ఆ ప్రాంతంలో ఏ దేశ సైనికులు కూడా పెట్రోలింగ్ నిర్వహించకూడదు. అనుకున్న మాటకి కట్టుబడి చైనా సైన్యం వెనక్కి మళ్లుతుండడానికి సంబంధించిన పలు వీడియోలను భారత ఆర్మీ మంగళవారం విడుదల చేసింది. చైనా వాయువేగంగా ఈ కార్యక్రమాన్ని పూర్తి చేస్తోంది. ఉపసంహరణ కార్యక్రమం ఇదే స్థాయిలో కొనసాగితే పాంగాంగ్ సరస్సు వెంబడి ఉన్న సైనిక ఉపసంహరణ మరొక్క రోజులోనే ప్రక్రియ పూర్తయ్యే అవకాశాలున్నాయి. గత ఏడాది ఏప్రిల్ నుంచే ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మొదలయ్యాయి. చైనా జవాన్లు జూన్‌లో భారత్ సైనికులపై దాడికి దిగడంతో సంక్షోభం మరింత ముదిరింది. చర్చల ద్వారా ఈ సమస్యని పరిష్కరించుకోవాలని భారత్ భావించినా చైనా మొదట్లో సహకరించలేదు. ఎట్టకేలకు గత నెల 24న తొమ్మిదో రౌండు కమాండర్ స్థాయి చర్చల్లో బలగాలను ఉపసంహరించాలన్న నిర్ణయానికి వచ్చారు. గత వారంలోనే ఈ ఉపసంహరణ కార్యక్రమం మొదలైనప్పటికీ డ్రాగన్ దేశం ఇప్పుడు మరింత ముమ్మరం చేసింది. క్రేన్ల సాయంతో అన్నీ ధ్వంసం చైనా తమ దేశానికి చెందిన 200 యుద్ధ ట్యాంకుల్ని కేవలం ఎనిమిది గంటల వ్యవధిలో 100 కి.మీ. మళ్లించారు. తూర్పు లద్దాఖ్‌లోని పాంగాంగ్ సదస్సు ఉత్తర, దక్షిణ తీరాల వెంబడి ఉన్న బలగాలు వెనక్కి మళ్లుతున్నాయి. గత పది నెలలుగా ఎదురెదురుగా ఉన్న ఇరు దేశాలకు చెందిన సైన్యం తాత్కాలికంగా ఏర్పాటు చేసిన శిబిరాలను ఎత్తేస్తున్నారు. యుద్ధ ట్యాంకులను వెనక్కి మళ్లిస్తున్నారు. భారత ఆర్మీ విడుదల చేసిన వీడియోల్లో చైనా సైనికులు జెట్టీలు, బంకర్లను ధ్వంసం చేసి బరువైన ఆయుధాలను మోసుకుంటూ పర్వతాల వెంబడి నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు ఉన్నాయి. ఇక శిబిరాలను తొలగించడానికి భారీ క్రేన్లను వాడుతున్నారు. ఏప్రిల్ 2020 తర్వాత నిర్మించిన కట్టడాలన్నీ ధ్వంసం చేస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని భారతీయ ఆర్మీ నిరంతరం పర్యవేక్షిస్తోంది. మానవరహిత ఏరియల్ వెహికల్స్, ఉపగ్రహ ఛాయా చిత్రాల ద్వారా ఈ మొత్తం ప్రక్రియను రికార్డు చేస్తోంది. తొలి విడత బలగాల ఉపసంహరణ పూర్తి కావడానికి మరో రెండు వారాలు పట్టే అవకాశం ఉందని ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ప్రసుతం ఇరువైపులకి చెందిన యుద్ధట్యాంకులు 100 వరకు మోహరించి ఉన్నాయి. చైనా వాయువేగంతో ఉపసంహరణ పూర్తి చేస్తున్నప్పటికీ ఆ దేశాన్ని పూర్తిగా నమ్మే పరిస్థితి అయితే లేదు. ‘‘చైనా వెనక్కి తగ్గింది. కానీ ఆ దేశం పట్ల ఉన్న అపనమ్మకం ఇంకా అలాగే ఉంది’’అని రాజకీయ విశ్లేషకుడు పథిక్రిత్ పైనే అన్నారు. -
మోదీ వద్దకు సరిహద్దు వివాదం
సాక్షి, ముంబై: రోజురోజుకు ముదురుతున్న మహారాష్ట్ర–కర్నాటక సరిహద్దు వివాదంపై చర్చించేందుకు శివసేన త్వరలో ప్రధాని నరేంద్రమోదీ నుంచి అపాయింట్మెంట్ తీసుకోవాలని భావిస్తోంది. అదేవిధంగా ఎన్సీపీ చీఫ్ శరద్ పవార్ సాయంతో నరేంద్రమోదీతో భేటీ అయ్యేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు శివసేన ఎంపీ వినాయక్ రావుతే స్పష్టంచేశారు. స్వాతంత్య్రం, ఆ తరువాత ప్రత్యేక మహారాష్ట్ర ఏర్పడిన తరువాత మొదలైన మహారాష్ట్ర–కర్నాటక సరిహద్దు వివాదం రోజురోజుకు తీవ్రరూపం దాల్చసాగింది. ఇటీవల కాలంలో ఈ వివాదం మరింత రాజుకుంది. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు పరస్పరంగా ఘాటు వ్యాఖ్యలు చేసుకునే వరకు దారితీసింది. మూడు రోజుల కిందట కర్నాటకకు చెందిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు మరింత రెచ్చగొట్టే విధంగా ఉన్నాయి. దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరం తమదేనని, కర్నాటకలో భాగమని చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టే విధంగా మారాయి. దీంతో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేతోపాటు మహా వికాస్ ఆఘాడీ ప్రభుత్వంలోని మంత్రులు, ఎమ్మెల్యేలు ఆగ్రహానికి గురయ్యారు. ప్రస్తుతం ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంట్ సమావేశాలు పూర్తికాగానే ఫిబ్రవరి మొదటి వారంలో ప్రధాని మోదీతో శివసేన ఎంపీలు భేటీ కానున్నారు. వీరితోపాటు శరద్ పవార్ కూడా భేటీ అవుతారు. అంతకుముందు సరిహద్దు వివాదం అంశాలపై సమగ్రంగా చర్చించేందుకు శివసేన ఎంపీలందరూ శరద్ పవార్‌తో భేటీ అవుతారు. ఈ భేటీలోనే ప్ర«ధాని మోదీతో భేటీ అయ్యేందుకు శరద్ పవార్ మధ్యవర్తిగా వ్యవహరించాలని శివసేన ఎంపీలు విజ్ఞప్తి చేయనున్నారు. ఒకవేళ ప్రధాని కార్యాలయం నుంచి అపాయింట్మెంట్ లభిస్తే శరద్ పవార్‌తో కలిసి శివసేన ఎంపీలందరు మోదీతో చర్చించనున్నట్లు రావుతే తెలిపారు. -
అస్సాం, మిజోరాంల సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితులు
గువాహటి: అస్సాం, మిజోరాం మధ్య ఉద్రిక్తత పెరుగుతోంది. చెట్లు నరికేసే విషయంలో రెండు రాష్ట్రాల్లోని సరిహద్దు గ్రామాల్లో ఇటీవల ఘర్షణ చోటుచేసుకుంది. తాజాగా తమ భూభాగంలో మిజోరాం పోలీసులు బంకర్ల లాంటి నిర్మాణాలు చేపట్టారని అస్సాం ప్రభుత్వం ఆరోపించింది. ఈ మేరకు అస్సాంలోని చాచర్ జిల్లా డిప్యూటీ కమిషనర్ కీర్తి జల్లీ అస్సాంలోని కొలాషిబ్ జిల్లా అధికారులకు లేఖ రాశారు. కులిచెరా ప్రాంతంలో ఇలాంటి నిర్మాణాల వల్ల స్థానికంగా శాంతి భద్రతలు దెబ్బతింటాయని ఆందోళన వ్యక్తంచేశారు. వాటిని వెంటనే తొలగించాలని కోరారు. జాతీయ రహదారి 306 పక్కన జేసీబీలతో బంకర్లు నిర్మించారని అస్సాం సర్కారు చెబుతోంది. -
మళ్లీ చైనా కాల్పులు
న్యూఢిల్లీ/జమ్మూ: భారత సైనికులను బెదిరించే ఉద్దేశంతో ప్యాంగాంగ్ సరస్సు ఉత్తర తీరం వద్ద చైనా సైనికులు గతవారం మరోసారి గాలిలో కాల్పులు జరిపారు. భారత్, చైనా దేశాల విదేశాంగ మంత్రులు జైశంకర్, వాంగ్ యిల మధ్య రష్యా రాజధాని మాస్కోలో చర్చలు జరగడానికి ముందు ఫింగర్ 4 రిడ్జ్‌లైన్ వద్ద ఈ ఘటన చోటుచేసుకున్నట్లు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. వ్యూహాత్మకంగా కీలకమైన ఆ ప్రాంతంలో ఉన్న భారత జవాన్ల వైపు భారీ సంఖ్యలో చైనా సైనికులు దూకుడుగా వచ్చారని, అయితే, భారత జవాన్లు దీటుగా ఎదుర్కోవడంతో వెనక్కు వెళ్లారని వివరించాయి. వెనక్కు వెళ్తూ.. భారత సైనికులను బెదిరించేందుకు గాలిలో 100 నుంచి 200 రౌండ్లు కాల్పులు జరిపారని వెల్లడించాయి. 45 ఏళ్ల తరువాత తొలిసారి సెప్టెంబర్ 7న తూర్పు లద్దాఖ్‌లోని చైనా సరిహద్దుల్లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ప్యాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని రెజాంగ్ లా రిడ్జ్‌లైన్ వద్ద ఉన్న భారత జవాన్లను బెదిరించే లక్ష్యంతో చైనా సైనికులు గాలిలో పలు రౌండ్లు కాల్పులు జరిపారు. మనవాళ్లే మెరుగు తూర్పు లద్దాఖ్‌లో ప్రతికూల వాతావరణం ఉండే చలి కాలంలో కూడా.. చైనాతో పూర్తి స్థాయి యుద్ధానికి భారత సైన్యం సిద్ధంగా ఉందని ఆర్మీ రిటైర్డ్ ఉన్నతాధికారి ఒకరు స్పష్టం చేశారు. యుద్ధం తప్పని పరిస్థితులనే చైనా కల్పిస్తే.. సుశిక్షితులైన, సంసిద్ధంగా ఉన్న, మానసికంగా ధృఢంగా ఉన్న భారత బలగాలను వారు ఎదుర్కోవాల్సి ఉంటుందని బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ హెచ్చరించారు. మానసికంగా, శారీరకంగా చైనా సైనికుల కన్నా.. భారత జవాన్లు దృఢమైనవారన్నారు. చైనా సైనికులు ప్రధానంగా పట్టణ ప్రాంతాల నుంచి వచ్చిన సున్నితమైన వారని, విధుల్లో భాగంగా సంక్లిష్ట క్షేత్ర పరిస్థితుల్లో ఎక్కువకాలం ఉన్నవారు కాదని వివరించారు. మొదట బుధవారం ఉదయం ఈ ప్రకటన భారత సైన్యం నార్తర్న్ కమాండ్ ప్రజా సంబంధాల అధికారి(పీఆర్ఓ) నుంచి మీడియాకు వచ్చింది. కానీ, ఆ తరువాత ఆ ప్రకటనలోని అంశాలు నార్తర్న్ కమాండ్ లేదా ఇండియన్ ఆర్మీ అభిప్రాయాలు కావని ఆ పీఆర్ఓ వివరణ ఇచ్చారు. ఈ వివరాలన్నీ పదవీ విరమణ చేసిన బ్రిగేడియర్ హేమంత్ మహాజన్‌వని వివరించారు. శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నాం భారత్ సరిహద్దుల్లో శాంతి, సుస్థిరతకు కట్టుబడి ఉన్నామని చైనా ప్రకటించింది. భారత్‌తో కుదిరిన ద్వైపాక్షిక ఒప్పందాలను గౌరవిస్తున్నట్లు తెలిపింది. అదే సమయంలో తమ దేశ సార్వభౌమత్వానికి, ప్రాదేశిక సమగ్రతకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేసింది. భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ లోక్‌సభలో చేసిన ప్రకటనపై స్పందించాలన్న మీడియా ప్రశ్నకు.. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వాంగ్ వెన్బిన్ బుధవారం పై విధంగా స్పందించారు. సరిహద్దుల్లో ఉద్రిక్తతలకు తాము కారణంకాదని చైనా తెలిపింది. దీర్ఘకాల మోహరింపునకు సిద్ధం బ్రిగేడియర్(రిటైర్డ్) హేమంత్ మహాజన్ వాదన ప్రకారం.. సరిహద్దుల్లో దీర్ఘకాలం మోహరించేందుకు భారత దళాలు సిద్ధమై ఉన్నాయి. లద్దాఖ్ అత్యంత ఎత్తైన పర్వత శిఖరాలున్న ప్రాంతం. ఇక్కడ నవంబర్ తరువాత 40 అడుగుల వరకు మంచు పేరుకుపోయే పరిస్థితి ఉంటుంది. మైనస్ 30 నుంచి మైనస్ 40 డిగ్రీల ఉష్ణోగ్రత ఇక్కడ సర్వసాధారణం. దానికి తోడు చలిగాలులు పరిస్థితిని మరింత దిగజారుస్తాయి. రోడ్లను మంచు కమ్మేస్తుంది. ఇన్ని ప్రతికూల పరిస్థితుల్లోనూ.. భారత్‌కు ఉన్న సానుకూల అంశం సుశిక్షితులైన మన సైనికులే. చలి కాలంలో యుద్ధం సాగించేందుకు అవసరమైన అనుభవం మన సైనికులకు ఉంది. స్వల్ప వ్యవధిలోనే రంగంలోకి దిగగల మనోస్థైర్యం కూడా మనవారికి ఉంది. చైనా సరిహద్దుల కన్నా దారుణమైన వాతావరణ పరిస్థితులు ఉండే సియాచిన్‌లో నెలల తరబడి ఉన్న అనుభవం మన సైనికులకు ఉంది. లద్దాఖ్‌కు చేరుకునేందుకు ఇప్పటివరకు రెండు మార్గాలు ఉన్నాయి. తాజాగా ‘దార్చా టు లేహ్’ మార్గం అందుబాటులోకి రావడంతో యుద్ధ, సహాయక సామగ్రి తరలింపు మరింత సులభమైంది.పెద్ద సంఖ్యలో ఎయిర్‌బేస్‌లు ఉండటం భారత్‌కు కలసివచ్చే అంశం. -
దురాక్రమణ దుస్సాహసం
మాస్కో: పరస్పర విశ్వాసపూరిత వాతావరణం, దురాక్రమణ రహిత విధానం, అంతర్జాతీయ నిబంధనల అమలు, శాంతియుతంగా విభేదాల పరిష్కారం.. తదితర విధానాలను అవలంబించడం ద్వారానే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) ప్రాంతంలో శాంతి, సుస్థిరత సాధ్యమవుతాయని భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. చైనా రక్షణ మంత్రి జనరల్ వీ ఫెన్‌ఘీ సమక్షంలోనే రాజ్‌నాథ్ పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. తూర్పు లద్దాఖ్‌లోని భారత్ సరిహద్దుల్లో తరచుగా దురాక్రమణ దుస్సాహసానికి పాల్పడుతున్న చైనాకు పరోక్ష సందేశంగా దీనిని భావిస్తున్నారు. రష్యా రాజధాని మాస్కోలో శుక్రవారం జరిగిన ఎస్సీఓ రక్షణ మంత్రుల సమావేశంలో రాజ్‌నాథ్ పాల్గొన్నారు. రెండో ప్రపంచ యుద్ధానికి కారణమైన దురాక్రమణ విధాన దుష్ఫలితాలను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ఎస్సీఓ సభ్య దేశాలకు గుర్తు చేశారు. ఎస్సీఓలో భారత్, చైనా, రష్యా, కజకిస్తాన్, కిర్గిస్తాన్, పాకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ సభ్యదేశాలుగా ఉన్నాయి. ఈ దేశాల మొత్తం జనాభా ప్రపంచ జనాభాలో సుమారు 40% ఉంటుంది. సుమారు గత నాలుగు నెలలుగా తూర్పు లద్దాఖ్‌లో దురాక్రమణలకు ప్రయత్నిస్తూ చైనా భారత్‌ను కవ్విస్తున్న విషయం తెలిసిందే. ఐదు రోజుల క్రితం పాంగాంగ్ సరస్సు దక్షిణ తీరంలోని భారత భూభాగాన్ని ఆక్రమించేందుకు చైనా విఫల యత్నం చేసింది. ‘రెండో ప్రపంచ యుద్ధం ముగిసి, ఐక్యరాజ్య సమితి ఏర్పడి ఈ సంవత్సరంతో 75 ఏళ్లు అవుతుంది. శాంతియుత ప్రపంచం లక్ష్యంగా ఐరాస ఏర్పడింది. ఏకపక్ష దురాక్రమణలకు వ్యతిరేకంగా, దేశాల సార్వభౌమత్వాన్ని, అంతర్జాతీయ నిబంధనలను గౌరవించాలని స్పష్టం చేస్తూ ఐరాస రూపుదిద్దుకుంది’అని రాజ్‌నాథ్ ఎస్సీఓ సమావేశంలో పేర్కొన్నారు. అన్ని రకాలైన ఉగ్రవాదాన్ని, ఉగ్రవాద సహాయక చర్యలను భారత్ విస్పష్టంగా ఖండిస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా, ముఖ్యంగా సైబర్ టెర్రరిజానికి వ్యతిరేకంగా ఎస్సీఓ ‘రీజనల్ యాంటీ టెర్రరిజం స్ట్రక్చర్ (ర్యాట్స్)’చేపట్టిన చర్యలను భారత్ ప్రశంసిస్తోందన్నారు. అతివాద, ఉగ్రవాద ప్రచారాన్ని తిప్పికొట్టే దిశగా ఎస్సీఓ తీసుకున్న నిర్ణయాలను భారత్ స్వాగతిస్తోందన్నారు. అంతర్జాతీయంగా స్వేచ్ఛాయుత, పారదర్శక, సమ్మిళిత రక్షణ వ్యవస్థ ఏర్పాటుకు భారత్ కట్టుబడి ఉందని ఈ సందర్భంగా రాజ్‌నాథ్ స్పష్టం చేశారు. పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో నెలకొన్న పరిస్థితులపై భారత్ ఆందోళన వ్యక్తం చేస్తోందన్నారు. ఆ ప్రాంతంలోని అన్ని దేశాలతో భారత్‌కు సత్సంబంధాలున్నాయన్నారు. శాంతియుతంగా విభేదాలను పరిష్కరించుకోవాలని ఆయా దేశాలను విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ‘పీస్ మిషన్’పేరుతో ఉగ్రవాద వ్యతిరేక వార్షిక సదస్సును చేపట్టడంపై రష్యాకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కరోనా విపత్తును ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలన్నీ విభేదాలను విస్మరించి ఒక్కటి కావాలని రాజ్‌నాథ్ పిలుపునిచ్చారు. అఫ్గానిస్తాన్ పరిస్థితిపై ఆందోళన అఫ్గానిస్తాన్‌లో అంతర్గత భద్రత పరిస్థితి ఆందోళనకరంగానే ఉందని రాజ్‌నాథ్ పేర్కొన్నారు. ‘అఫ్గాన్ నియంత్రణలో, అఫ్గాన్ నేతృత్వంలో సాగే సమ్మిళిత శాంతి ప్రక్రియకు భారత్ సహకారం అందించడం కొనసాగిస్తుంది. అఫ్గానిస్తాన్ ప్రజలు, ఆ దేశ ప్రభుత్వం ఈ దిశగా చేస్తున్న కృషికి మద్దతునిస్తుంది’అని స్పష్టం చేశారు. ఈ ప్రాంతంలో శాంతి, సుస్థిరత నెలకొనాల్సిన అవసరం ఉందన్నారు. ఫిబ్రవరిలో అఫ్గాన్ తాలిబన్లతో అమెరికా కుదుర్చుకున్న శాంతి ఒప్పందం అనంతరం అఫ్గానిస్తాన్‌లో నెలకొన్న రాజకీయ పరిస్థితులను భారత్ నిశితంగా పరిశీలిస్తోంది. భారత్, చైనా రక్షణ మంత్రుల భేటీ సరిహద్దుల్లో ఉద్రిక్తతల నేపథ్యంలో ముందడుగు మాస్కో: సరిహద్దుల్లో ఉద్రిక్తతలు తీవ్రమైన నేపథ్యంలో మాస్కోలో భారత, చైనా రక్షణ మంత్రుల మధ్య కీలక భేటీ జరిగింది. మాస్కోలోని ప్రముఖ హోటల్లో శుక్రవారం రాత్రి 9.30 గంటల సమయంలో భారత రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చైనా రక్షణ మంత్రి వీ ఫెన్‌ఘీ సమావేశమయ్యారు. చర్చల్లో పాల్గొన్న భారత ప్రతినిధి బృందంలో రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్, రష్యాలో భారత రాయబారి వెంకటేశ్ వర్మ కూడా ఉన్నారు. ఈ సమావేశాన్ని సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తొలగించే దిశగా చోటు చేసుకున్న కీలక ముందడుగుగా భావిస్తున్నారు. తూర్పు లద్దాఖ్‌లోని సరిహద్దుల్లో ఈ సంవత్సరం మేలో తీవ్రస్థాయి ఉద్రిక్తతలు ప్రారంభమైన తరువాత ఇరు దేశాల మధ్య కీలక మంత్రిత్వ స్థాయి ముఖాముఖి చర్చలు జరగడం ఇదే ప్రథమం. గతంలో విదేశాంగ మంత్రి జై శంకర్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యితో ఫోన్లో చర్చించారు. కానీ, వారిద్దరి మధ్య ముఖాముఖీ భేటీ జరగలేదు. షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్(ఎస్సీఓ) రక్షణ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు రాజ్‌నాథ్, వీ ఫెన్‌ఘీ రష్యాకు వెళ్లిన విషయం తెలిసిందే. చైనా అభ్యర్థన మేరకే రెండు దేశాల రక్షణ మంత్రుల సమావేశం జరిగిందని భారత ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. -
డ్రాగన్ డ్రామాలకు చెక్!
సాక్షి, న్యూఢిల్లీ : సరిహద్దుల్లో చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించే వరకు భారత సేనలు తూర్పు లడఖ్‌లోని 1,597 కిలోమీటర్ల వాస్తవ నియంత్రణ రేఖ వెంబడే ఉంటాయని డ్రాగన్‌కు భారత్ తేల్చిచెప్పింది. చైనాతో ద్వైపాక్షిక సంబంధాలకు తూర్పు లడఖ్‌లోని వివాదాస్పద ప్రాంతాల్లో ఏప్రిల్ 20కి ముందున్న పరిస్థితులు నెలకొనాలని భారత్ షరతు విధించింది. పలుమార్లు డ్రాగన్‌కు ఇదే విషయం స్పష్టం చేసినా సంప్రదింపుల పేరుతో చైనా సరికొత్త ప్రయత్నాలతో ముందుకొస్తూనే ఉంది. సరిహద్దు వివాదం ద్వైపాక్షిక సంబంధాలపై ప్రతికూల ప్రభావం చూపుతుందని చైనా గ్రహించేలా తాము చర్యలు చేపడుతున్నామని ప్రతిష్టంభనపై ప్రభుత్వంతో చర్చిస్తున్న అధికారి ఒకరు వెల్లడించారని ఓ జాతీయ వెబ్సైట్ పేర్కొంది. చైనా దూకుడుకు బ్రేక్ వేసేందుకు భారత్ ఇప్పటికే 100కు పైగా చైనా యాప్‌లను నిషేధించగా, ప్రభుత్వ కాంట్రాక్టులు బీజింగ్‌కు దక్కకుండా నిబంధనలను మార్చింది. ఇక భారత యూనివర్సిటీలతో భాగస్వామ్యంతో ముందుకొచ్చిన చైనా వర్సిటీలు నిబంధనలను పాటిస్తున్నాయా అనే అంశంపై తాజాగా ప్రభుత్వం దృష్టిసారించింది. చైనాపై భారత్ పలు రకాలుగా ఒత్తిడి పెంచుతున్నా డ్రాగన్ దారికి రాకపోగా సరికొత్త ఎత్తుగడలతో ముందుకొస్తోంది. ఇండో-చైనా ప్రతిష్టంభన సమసిపోయిందని, లడఖ్‌లో సేనల ఉపసంహరణ పూర్తయిందని ప్రపంచాన్ని నమ్మబలుకుతోంది. అయితే డ్రాగన్ తీరు మార్చుకుని సరిహద్దుల్లో చేపట్టిన సానుకూల చర్యలపై మాట్లాడాలని భారత్ కోరుతోంది. చైనా ఇప్పటికీ పెట్రోలింగ్ పాయింట్ 17, 17 ఏ (గోగ్రా)ల వద్ద, ప్యాంగాంగ్ సరస్సు వద్ద తన సేనలను మోహరించిందని భారత సైన్యం ప్రభుత్వానికి క్షేత్రస్ధాయి పరిస్ధితులను నివేదించింది. చదవండి : చైనాకు మరో దెబ్బ : 2500 ఛానళ్లు తొలగింపు -
డ్రాగన్‌పై పెద్దన్న ఫైర్
వాషింగ్టన్ : డ్రాగన్‌పై వీలుచిక్కినప్పుడల్లా విరుచుకుపడుతున్న అమెరికా మరోసారి చైనా తీరుపై మండిపడింది. భూటాన్ భూభాగంపై చైనా తెరపైకి తెచ్చిన వాదన, భారత్ భూభాగంలోకి ఇటీవల చొచ్చుకురావడం చూస్తే డ్రాగన్ ఉద్దేశాలు వెల్లడవుతున్నాయని అగ్రరాజ్యం ఘాటు వ్యాఖ్యలు చేసింది. చైనా దుందుడుకు వైఖరిని ప్రస్తావిస్తూ అమెరికా విదేశాంగ మంత్రి మైక్ పాంపియో ఈ వ్యాఖ్యలు చేశారు. మరోవైపు భారత్-చైనా సరిహద్దు వివాదానికి కేంద్ర బిందువైన తూర్పు లడఖ్‌లో సేనల ఉపసంహరణ దాదాపు పూర్తయిందని, సరిహద్దుల్లో పరిస్ధితులు సాధారణ స్థితికి చేరుకున్నాయని చైనా పేర్కొనడం పట్ల భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఉద్రిక్తతలు సమసిపోయి క్షేత్రస్ధాయిలో పరిస్థితి చక్కబడిందని, సరిహద్దుల్లో సేనల ఉపసంహరణ పూర్తయినట్టేనని భారత్‌లో చైనా రాయబారి సన్ వెడాంగ్ వెల్లడించారు. అయితే చైనా వాదనతో భారత్ విభేదించింది. సరిహద్దుల్లో సేనల ఉపసంహరణపై కొంత పురోగతి కనిపించినా ఈ ప్రక్రియ ఇంకా పూర్తికాలేదని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి అనురాగ్ శ్రీవాస్తవ స్పష్టం చేశారు. ఈ దిశగా తదుపరి చర్యలు చేపట్టేందుకు ఇరు దేశాల సీనియర్ కమాండర్లు త్వరలో సమావేశమవుతారని చెప్పారు. చదవండి : అక్కడ బలగాల ఉపసంహరణకు చైనా నిరాకరణ