కైకలూరు ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న భార్యాభర్తలు, కుమార్తె
కైకలూరు : సరిహద్దు వివాదంలో మనస్తాపం చెందిన భార్యాభర్తలు.. కూతురుతో సహా ఆత్మహతాయత్నానికి ఒడిగట్టారు. కైకలూరులో ఈ ఘటన ఆదివారం జరిగింది. సేకరించిన వివరాల ప్రకారం సంత మార్కెట్ సమీపంలోని అబ్బాస్ వీధిలో కారుమూరి రాజేంద్రప్రసాద్, కొనిజేటి నారాయణ..లవి సరిహద్దు దారులు. ఇరువురు మధ్య మూడేళ్లుగా గోడ విషయంలో వివాదం సాగుతోంది. ఇరువురు ఒకే సామాజికవర్గం కావడంతో పెద్దల పంచాయతీలో వివాదాన్ని పరిష్కరించడానికి ప్రయత్నించినా సఫలం కాలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 4న కొనిజేటి నారాయణ కుమారుడు వెంకటేష్ తమపై దౌర్జన్యం చేశారని రాజేంద్రప్రసాద్ భార్య లక్ష్మీకుమారి టౌన్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేశారు.
అయినప్పటికి సమస్య పరిష్కారం జరగడం లేదని భావించి రాజేంద్రప్రసాద్, ఆయన భార్య లక్ష్మీకుమారి అదే రోజున ఆత్మహత్య చేసుకుంటామని లేఖ రాసి విజయవాడ వెళ్లిపోయారు. పోలీసులు అన్ని చోట్ల గాలించారు. 5వ తేదీ దంపతులు గ్రామానికి తిరిగి వచ్చారు. చివరకు నియోజకవర్గస్థాయిలో టీడీపీ నాయకుడి వద్ద సెటిల్‌మెంట్‌కు పెట్టారు. లిఖితపూర్వకంగా అగ్రిమెంట్ రాసుకుని గోడ నిర్మాణం చేయాలని సరిహద్దుదారుడితో ఒప్పించారు. కొద్ది రోజులుగా అగ్రిమెంట్ రాయడానికి సదరు సరిహద్దుదారుడు రాకపోవడంతో మనస్తాపం చెందిన రాజేంద్రప్రసాద్ (43), భార్య లక్ష్మీకుమారి (41), మూడో తరగతి చదువుతున్న కూతురు సుస్మిత (8) గుళికల మందు తిని ఆత్మహత్యకు యత్నించారు. బంధువులు విషయం తెలుసుకుని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో ముగ్గురూ చికిత్స పొందుతున్నారు. ప్రాణాపాయం లేదని వైద్యులు చెప్పారు. కైకలూరు పోలీసులు బాధితుల నుంచి వివరాలు సేకరించారు.
Comments
Please login to add a commentAdd a comment