
ఆర్మీ చీఫ్ ఎంఎం నరవణే మంగళవారం కశ్మీర్, లేహ్ ప్రాంతాల్లో పర్యటిస్తారు
సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు ఉద్రికత్తలు తీవ్రమవడంతో క్షేత్రస్ధాయి పరిస్థితులను సమీక్షించేందుకు ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణె మంగళవారం లేహ్, కశ్మీర్‌లను సందర్శిస్తారని సమాచారం. బలగాల సన్నద్ధతతో పాటు చైనా, పాకిస్తాన్ సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖల వెంబడి దళాల మోహరింపును ఆర్మీ చీఫ్ సమీక్షిస్తారు. తూర్పు లడఖ్‌లోని గల్వాన్ లోయలో గత వారం భారత్-చైనా సైనికుల ఘర్షణలతో ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో జనరల్ నరవణే లేహ్ పర్యటన ప్రాధాన్యత సంతరించుకుంది.
కాగా నరవణే సోమవారం ఢిల్లీలో ఉన్నత సైనికాధికారులతో భద్రత పరిస్థితిపై చర్చించారు. కమాండర్ల సదస్సు సందర్భంగా సైనికాధికారులు, కమాండర్లు దేశ రాజధానిలో అందుబాటులో ఉన్నారు. మరోవైపు సరిహద్దు వివాద పరిష్కారానికి, తూర్పు లడఖ్‌లో ఉద్రిక్తతలను తగ్గించేందుకు చైనా భూభాగంలోని మోల్దో-చుసుల్ లోయలో ఇరు దేశాల కార్ప్స్ కమాండర్ల చర్చలు కొనసాగుతున్నాయి.